కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసాన్ని సివిల్ సర్వీస్ అభ్యర్థులు చేపట్టిన ముట్టడి కార్యక్రమం గురువారం రెండవ రోజుకు చేరుకుంది. దేశ రాజధాని 12 తుగ్లక్ రోడ్డులోని ఆయన నివాసాన్ని సివిల్స్ అభ్యర్థులు చుట్టుముట్టారు. సివిల్స్ పరీక్షలో గత ఏడాది చేసిన మార్పులను తొలగించాలని వారు రాహుల్ను డిమాండ్ చేశారు. అలాగే సివిల్స్ అభ్యర్థులకు మరో మూడు సార్లు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సివిల్స్ సర్వీసెస్ పరీక్షలలో నూతన విధానాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది అమలులోకి తీసుకువచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా సివిల్స్ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సివిల్స్ పరీక్షలలో నూతన విధానాన్ని వ్యతిరేకిస్తు బుధవారం ఉదయం రాహుల్ గాంధీ నివాసాన్ని సివిల్స్ అభ్యర్థులు చుట్టుముట్టారు. దాంతో రాహుల్ నివాస భద్రత సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన రాహుల్ నివాసానికి చేరుకుని ఆందోళనకు దిగిన సివిల్స్ అభ్యర్థులను గత రాత్రి అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. గత అర్థరాత్రి దాటిన తర్వాత ఆందోళనకారులను పోలీసులు విడిచి పెట్టారు.