'మమ్మల్ని తిట్టిన.. కేసీఆర్ను ఇప్పుడేమనాలి'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర కేబినెట్లో కవితకు స్థానం కోసమే మోదీ సర్కార్పై టీఆర్ఎస్ మెతక వైఖరి అవలంభిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు రావాల్సిన ఉక్కు, రైల్వే ఫ్యాక్టరీలను సాధించడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలం అయ్యారని పొన్నం సోమవారమిక్కడ విమర్శించారు. రాష్ట్ర విభజన హామీల గురించి కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి తీసుకు రావాలని ఆయన సూచించారు.
మోదీ ప్రభుత్వ అవినీతిపై టీఆర్ఎస్ గోడమీద పిల్లిలా వ్యహరిస్తోందని పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించటం లేదని తమను చవటలు, దద్దమ్మలన్న కేసీఆర్ను ఇప్పుడేమనాలని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో టెలిఫోన్ ట్యాపింగ్, ఓటుకు కోట్లు వ్యవహారాలను టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తాలని పొన్నం డిమాండ్ చేశారు. కాగా మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.