ఫోన్ నంబరుతో మనీ ట్రాన్స్‌ఫర్..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ యాప్ ‘ఛిల్లర్’
హైదరాబాద్: మొబైల్ ఫోన్‌లో కాంటాక్టు నంబర్ల ద్వారా తక్షణ నగదు బదిలీ చేసే వీలు కల్పిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్తగా ‘ఛిల్లర్’ పేరిట మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. కోచికి చెందిన టెక్నాలజీ సంస్థ మాబ్‌మీతో కలిసి దీన్ని రూపొందించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. దీని పనితీరు విషయానికొస్తే.. ఖాతాదారు తమ మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక, రిజిస్టర్ చేసుకోవాలి. అది కస్టమరు బ్యాంకు ఖాతాకు అనుసంధానమవుతుంది. ఇక ఆ తర్వాత ఎవరికైతే నగదు పంపించదల్చుకున్నారో వారి నంబరును ఛిల్లర్ కాంటాక్టు లిస్టులో నుంచి ఎంపిక చేసుకోవాలి. బదిలీ చేసే మొత్తాన్ని, గ్రహీతకు పంపాల్సిన సందేశాన్ని టైప్ చేయాలి.
కస్టమరుకు మాత్రమే తెలిసి ఉండే ఎం-పిన్‌ను ఎంటర్ చేసి, పే బటన్‌ను నొక్కితే చాలు నగదు తక్షణం బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఒక లావాదేవీలో గరిష్టంగా రూ. 5,000 పంపొచ్చు. ఆ విధంగా ఒక్క రోజులో 10 లావాదేవీలు చేయొచ్చు. ప్రతి లావాదేవీపై సర్వీస్ ట్యాక్స్‌తో పాటు రూ. 3.50 మేర బ్యాంకు చార్జీలు వసూలు చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల ఆధారిత ఫోన్లలో ఈ యాప్ పనిచేస్తుంది. త్వరలో విండోస్ ఫోన్‌లకూ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చే వారికి, విద్యార్థులు, యువ ప్రౌఫెషనల్స్ తదితరులకు ఈ యాప్ ఉపయుక్తంగా ఉండగలదని వివరించారు.