'మోదీ ప్రభుత్వ ఓటమి ప్రతి ఒక్కరికి ఓ హెచ్చరిక'
వాషింగ్టన్: హస్తిన అసెంబ్లీ ఎన్నికలు మోదీ ప్రభుత్వ ఓటమి అని ప్రముఖ భారతీయ నవలా రచయిత, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు కృష్ణ ప్రతాప్ సింగ్ అభివర్ణించారు. మోదీ ఓటమి ప్రతి ఒక్కరికి ఓ హెచ్చరిక లాంటిందని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వ హనిమూన్ యాత్రకు భారతీయ ఓటర్లు మంగళవారం చరమగీతం పాడారని చెప్పారు. రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజల పట్ల వ్యవహారించాయో... ఫలితాలు ఆ విధంగా వచ్చాయని పేర్కొన్నారు.
శనివారం న్యూఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కృష్ణ ప్రతాప్ సింగ్ రాసిన ఓ కథనం న్యూయార్క్ టైమ్స్లో ప్రచురితమైంది. ఇటీవల ఆవిర్భవించిన పార్టీ ఇంతటి ఘన విజయం నమోదు చేసుకోవడం శుభ పరిణామన్నారు. ఈ విజయం పార్టీ మొత్తానికి చెందుతుందన్నారు. జేపీ బిగ్ మనీ, బిగ్ ర్యాలీల కంటే ఆప్ చేపట్టిన గల్లీ గల్లీ ప్రచారం, గడప గడపకు ప్రచారం మంచి ఫలితం ఇచ్చిందన్నారు. భారత్ లో ఆప్ ఘన విజయం దేశ రాజకీయాల్లో సరికొత్త కీలక మలుపు అని పేర్కొన్నారు.
దేశ రాజధాని ప్రజల వైఖరి ఎలా ఉంటుందో... ఆ జాతి వైఖరి కూడా అలా ఉంటుందని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. కానీ ప్రజలు బాగా తెలివైన వాళ్లు... ఎవరు సరైన రాజకీయ నాయకులో... ఎవరు కాదో ఇట్టే పసిగట్టేస్తారన్నారు. నేడు ప్రతి ఒక్కరి వద్ద సమాచారం వారి జేబుల్లోని సెల్ ఫోన్లలో సంక్షిప్తమై ఉంటాయని చెప్పారు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన హామీలను అమలు పరచాలని ఆప్ నేతలకు కృష్ణ ప్రతాప్ సింగ్ హితవు పలికారు.