చింతమనేనిపై సైలెంట్... నానీలపై వయొలెంట్
- అతీగతీ లేని ప్రభాకర్ కేసు
- చకచకా కొడాలి, పేర్ని అరెస్టు
- ఏకపక్షంగా ప్రజా ఉద్యమాల అణచివేత
- పాలక పక్షం రూటే సెపరేటు
సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల మాట చెల్లుబాటవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ సర్కారు పాలనలో ఆ స్థాయి పెచ్చుమీరుతోంది. ప్రజల పక్షాన నిలిచి ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసు కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తద్వారా ఉద్యమకారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే పన్నాగం పన్నుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి ప్రజా ఉద్యమాలపై నీళ్లు చల్లుతున్నారు.
కైకలూరు : వాళ్లిద్దరూ శాసనసభ్యులే.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే.. పార్టీలే వేరు.. చట్టం ఇద్దరికీ సమానమే.. కానీ అధికారపక్ష నేతలకొక తీరు, ప్రతిపక్షానికి మరో తీరులా ఉంది పోలీసుల వ్యవహారశైలి. టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పది రోజుల కిందట కొల్లేరు అభయారణ్య పరిధిలో దగ్గరుండి మరీ అక్రమంగా రోడ్డు వేయించారు.
పోలీసులకు ఫిర్యాదు వెళ్లినా వారు అక్కడికి రాలేదు. అటవీ శాఖ అధికారులు కేసు పెట్టినా ఇంతవరకు విచారణకే నోచుకోలేదు. సీన్ కట్ చేస్తే.. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విషయంలో పోలీసులు ఓవరేక్షన్ చేశారు. భారీ సంఖ్యలో మోహరించి నిమిషాల్లో ఆయన్ని అరెస్టు చేశారు.
అక్కడ లేటు.. ఇక్కడ వేటు
కొల్లేరు అభయారణ్యంలో ఎలాంటి రోడ్డు నిర్మాణాలూ చేపట్టకూడదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు విధించింది. ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్న చింతమనేని ప్రభాకర్ ఈ నెల ఆరో తేదీ అర్ధరాత్రి కోమటిలంక రోడ్డును దగ్గరుండి వేయించారు. అడ్డువచ్చిన అటవీ సిబ్బందిని ఈడ్చిపడేయించారు. అదే రోజు రాత్రి డెప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసరు జి.ఈశ్వరరావు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో తమ విధులను ఆటంకపరిచారని చింతమనేని, మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశారు.
పది రోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఎప్పుడడిగినా విచారణ చేస్తున్నామని మభ్యపెడుతున్నారు. ఇదిలావుంటే గుడివాడ పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చెందిన సివిల్ వివాదంలో పోలీసులు తలదూర్చి ఎమ్మెల్యే కొడాలి నానిని ఆగమేఘాల మీద అరెస్టు చేశారు. అలాగే బందరులో పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా రైతులంతా పోరాడుతుంటే వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) వారికి వెన్నుదన్నుగా నిలిచారు.
దీంతో రైతులు ఎక్కడికక్కడ జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎం.పి. కొనకళ్ల నారాయణలను అడ్డుకోవడం మొదలుపెట్టారు. ఈ నిరసనోద్యమం పతాకస్థాయికి చేరడంతో టీడీపీ నేతలు కొత్త కుట్రకు తెర తీశారు. బందరులోని మద్యం దుకాణాల్లో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నానితోపాటు మరికొంతమంది పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారు. తాజాగా మంగళవారం మరో రెండు కేసుల్లో నిందితుడిగా చూపుతూ నెలాఖరు వరకు రిమాండ్ విధించారు. వైఎస్సార్ సీపీ నేతలపై ఇది కచ్చితంగా కక్షసాధింపు చర్యేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు తమ్ముళ్ల పెత్తనం..
జిల్లాలో పోలీసు స్టేషన్లపై తెలుగు తమ్ముళ్ల పెత్తనం నానాటికీ పెరుగుతోంది. నిక్కచ్చిగా, నిజాయతీగా పనిచేసే అధికారులు మాట వినకపోతే వేధింపుల పర్వం మొదలుపెడుతున్నారు. అప్పటికీ దారికి రాకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేయిస్తున్నారు. ఇక పేకాట, కోడిపందేల్లో పట్టుబడితే రాజకీయ సిఫార్సులు తప్పడం లేదు.
ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికార పార్టీ నాయకులు హల్‌చల్ చేస్తున్నారు. తమ మాట చెల్లుబాటు కాకపోతే ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయిస్తున్నారు. గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రజాసమస్యలపై పోరాడుతుంటే కేసుల్లో ఇరికిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.