కేంద్రం నిర్ణయం వెనుక ఫైళ్లు ఇప్పించండి
కృష్ణా జలాల అంశంపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి
తిరస్కరించిన ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వాటానే రెండు కొత్త రాష్ట్రాల మధ్య పంచాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఆధారమైన ఫైళ్లను తమకు ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. నదీ జలాల వివాదంపై గురువారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా కేంద్ర నిర్ణయానికి సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా నుంచే తెలంగాణ, ఏపీలకు పంచాలని... కర్ణాటక, మహారాష్ట్రల వాటాల్లో మార్పులు చేయవద్దని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీంతో ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు, సంబంధిత సమావేశాల మినిట్స్‌ను కేంద్రం నుంచి ఇప్పించాలని సుప్రీంకోర్టును తెలంగాణ అభ్యర్థించింది.
అయితే ధర్మాసనం తాము ఆ పాత్ర పోషించలేమని వ్యాఖ్యానించింది. దీంతో తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ఆ అభ్యర్థనను ఉప సంహరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే కేంద్రం తాజా నిర్ణయంతో తమ వద్ద ఉన్న మార్గాంతరాలను అన్వేషించుకునేందుకు కొంత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్, అంధ్యార్జున అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలయాపనకే ఈ వాయిదా కోరడం తప్ప మార్గాంతరాలేవీ లేవన్నారు. అయితే వైద్యనాథన్ విజ్ఞప్తి మేరకు విచారణను జనవరి 13కు వాయిదా వేస్తూ... ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.