జోరుగా మొబైల్ బీమా | Mobile Insurance on a hike | Sakshi
Sakshi News home page

జోరుగా మొబైల్ బీమా

Published Wed, Nov 6 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

జోరుగా మొబైల్ బీమా

జోరుగా మొబైల్ బీమా

ముంబై: పెరుగుతున్న హై ఎండ్ మొబైల్ ఫోన్ల విక్రయాలు బీమా కంపెనీలకు కొత్త అవకాశాలనందిస్తున్నాయి. సెల్‌ఫోన్ పోవడం,నీళ్లలో పడి పాడైపోవడం, తదితర నష్టాలను భర్తీ చేసేందుకు హ్యాండ్‌సెట్‌లు తయారు చేసే కంపెనీలు, ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు జరిపే సంస్థలు, రిటైల్ అవుట్‌లెట్‌లు బీమాను అందిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ వివిధ తరహా బీమా సదుపాయాలతో మొబైల్ బీమా ఆఫర్ చేస్తున్నాయి. ఈ సంస్థలన్నీ పెద్ద బీమా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో బీమా కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశం లభించినట్లవుతోంది. దాదాపు 60కి పైగా కంపెనీలు మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లు ముఖ్యంగా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు బాగా పెరిగిపోతుండటంతో మొబైల్ ఫోన్లకు బీమా కూడా జోరందుకుంటోంది.
 
 ఇప్పుడు మొబైల్ బీమాకు మరింతగా డిమాండ్ పెరుగుతోందని  స్పైస్ గ్రూప్ ఆన్‌లైన్ గాడ్జెట్ రిటైల్ వెంచర్, సహోలిక్ డాట్‌కామ్ సీఈవో రజనీష్ అరోరా చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తప్పనిసరిగా బీమా కోసం అడుగుతున్నారని పేర్కొన్నారు. బీమా కంపెనీలు ప్రత్యక్షంగా ఎలాంటి బీమా పాలసీలను అందించకపోవడంతో ఆ లోటును తాము భర్తీ చేస్తున్నామని వివరించారు. కార్బన్ నుంచి శామ్‌సంగ్ కంపెనీల మొబైళ్లకు సహోలిక్ వెబ్‌సైట్ బీమాను అందిస్తోంది. ఇక నోకియా కంపెనీ కూడా తన అన్ని మొబైళ్లకు -చౌక ధరల నుంచి ఖరీదైన మొబైళ్లకు బీమానందిస్తోంది. సాధారణంగా మొబైల్ ఖరీదులో 1.5 శాతాన్ని ప్రీమియంగా వసూలు చేస్తారు.
 
 మంచి ఫలితాలు
 మొబైల్ బీమా వ్యాపారంలో న్యూ ఇండియా ఎష్యూరెన్స్ సంస్థ మంచి లాభాలు కళ్ల జూసిందని అంచనా. ఈ మొబైల్ బీమా వ్యాపారం మంచి ఫలితాలనే ఇస్తోందని ఆ సంస్థ సీఎండీ జి. శ్రీనివాసన్ చెప్పారు. నోకియా, సహోలిక్‌డాట్‌కామ్‌లతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నామని, మరిన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
 
 భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు
 ఐసీఐసీఐ లాంబార్డ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మొబైల్ బీమాను అందిస్తున్నాయి. కార్పొరేట్ క్లయింట్స్‌కు అందించే ఆల్-రిస్క్ కవర్‌లోనే ఇవి మొబైల్ బీమాను అందిస్తున్నాయి. అయితే వ్యక్తిగత వినియోగదారులకు మాత్రం మొబైల్ బీమాను అందించడం లేదు. అయితే మొబైల్ బీమా మరింత వృద్ధి చెందితే మరిన్ని కంపెనీలు కూడా ఈ రంగంలోకి వచ్చే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు.
 
 పరిస్థితులు మారాయి
 గతంలో 2007-08లో సోనీ వంటి కంపెనీలు మొబైల్ బీమాను ఆఫర్ చేసేవి. కానీ వినియోగదారుల క్లెయిమ్స్ సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి స్కీమ్‌లను ఆయా కంపెనీలు ఉపసంహరించుకున్నాయి. టెక్నాలజీ బాగా అభివృద్ధి కావడంతో ఈ సమస్య ప్రస్తుతం కొంతవరకూ తీరింది. గతంలో మోసపూరిత క్లెయిమ్‌లను పట్టుకోవడం కష్టంగా ఉండేదని, దీంతో తమకు భారీగా నష్టాలొచ్చేవని ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు మారాయని, దీంతో మళ్లీ ఈ రంగంలోకి రావాలని యోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి హ్యాండ్‌సెట్ ఐఎంఈఏ నంబర్‌ను ట్రాక్ చేయవచ్చని, దీంతో ఏది మోసపూరిత క్లెయిమో తెలుసుకోవచ్చని,  సహోలిక్ డాట్‌కామ్ సీఈవో రజనీష్ అరోరా చెప్పారు. అనుమానాస్పదంగా ఉంటే, క్లెయిమ్ సెటిల్ చేసినప్పటికీ, ట్రాకింగ్‌ను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement