బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో కొత్త వేరియంట్
గుర్గావ్: జర్మనీ లగ్జరీ కార్ కంపెనీ, బీఎం డబ్ల్యూ గురువారం 5-సిరీస్‌లో అప్‌డేటేడ్ వేరి యంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధరను రూ.46.90 లక్షలు-రూ.57.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ప్ వాన్ చెప్పారు. చెన్నై ప్లాంట్‌లో తయారయ్యే ఈ బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ను నాలుగు డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని వివరించారు. మూడున్నరేళ్ల క్రితం ఈ 5 సిరీస్ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేశామని, ఇప్పటివరకూ పది లక్షల కార్లను విక్రయించామని పేర్కొన్నారు. భారత వాహన మార్కెట్లో ప్రస్తుతమున్న మందగమనం తమ అమ్మకాలపై కూడా ప్రభావం చూపిందని ఆయన అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా వినియోగదారుల్లో కొత్త కార్లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి తగ్గిందని చెప్పారు. అమ్మకాలు పెంచుకోవడానికి డిస్కౌంట్లు ఇచ్చే యోచనేదీ లేదని పేర్కొన్నారు.