టీ షాపు నుంచి సీఎం దాకా..
టీ షాపు నుంచి సీఎం దాకా..
Published Tue, Dec 6 2016 11:50 AM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM
చెన్నై: తెలతెలవారుతుండగా చల్లని గాలులు మెల్లగా వీస్తుంటే మంద్రస్వరంతో తమిళపాటలు వీనులు విందుగా వినిపిస్తుంటే వెచ్చని ఛాయ్ కమ్మకమ్మగా తాగుతుంటే... ఆహా ! ఆ మధుర స్మృతులే వేరయా! అనుకోక తప్పదు. ఈ అనుభవం కావాలంటే ఇప్పుడైనా తమిళనాడులోని థేని జిల్లా, పెరియాకులంలోని రోజీ క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. ఛాయ్ మాత్రం పది రూపాయలకు కప్పు. చిక్కదనం, రుచి కారణంగానే పదిరూపాయలు వసూలు చేస్తున్నారని, అందులో తప్పేమిటని కస్టమర్లు కితాబిస్తారు. పార్సిల్ కావాలంటే 18 రూపాయలు చెల్లించాల్సిందే.
ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ టీ దుకాణాన్ని పీవీ క్యాంటీన్ అని పిలుస్తారు. పీ... అంటే పన్నీర్ సెల్వమ్, వీ... అంటే విజయన్. వీరిద్దరు చిన్నప్పటి నుంచి కలసి పెరిగిన బాల్యమిత్రులు. వీరిద్దరు కలసి 1970లో ఈ రోజీ క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. అందుకే ఇద్దరి పేర్లతో ముద్దుగా పీవీ క్యాంటీన్ అని పిలుస్తారు. తాను 40 ఏళ్ల నుంచి ఇక్కడ టీ తాగుతున్నానని, అప్పుట్లో 15 పైసలకు కప్పు టీ ఇచ్చేవారని, ఇప్పుడు పది రూపాయలకు కప్పు టీ సరఫరా చేస్తున్నా, ఇక్కడే తాగుతున్నానని శేఖర్ అనే ఓ యాభై ఏళ్ల డ్రైవర్ తెలిపారు.
పన్నీర్‌సెల్వం అంటే....
పన్నీర్ సెల్వం అంటే నేడు తమళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఓ పన్నీర్‌సెల్వమే. ఆయన ఈ క్యాంటీన్‌ను 1980 దశకంలో తన సోదరుడు ఓ రాజాకు అప్పగించారు. ఆయన మిత్రుడు విజయన్ మాత్రం మరో చోటుకు వెళ్లి వేరే చాయ్, స్నాక్స్ దుకాణం పెట్టుకున్నారు. పన్నీర్ సెల్వం సోదరుడు రాజా పదేళ్ల కుమార్తే రోజీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మరణించింది. ఆమె పేరుతో రాజా పీవీ క్యాంటీన్ పేరును రోజీ క్యాంటీన్‌గా మార్చారు. అందుకనే క్యాంటీన్‌లో ఓ పక్క రోజీ ఫొటో, మరో పక్క గోడపై మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్, జయలలిత ఫొటోలు కనిపిస్తాయి.
రాజకీయాల్లోకి....
ఓ పన్నీర్‌సెల్వం రాజకీయాల్లో ప్రవేశించి అఖిలభారత అన్నాడీఎంకే నాయకుడిగా ఎదిగారు. జయలలిత వీర విధేయుడిగా ఉంటూ ఒక్కసారి కాదు, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి వరకు ఎదిగారు. 2001లో జయలలిత జైలుకెళ్లినప్పుడు మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కాకుండా పక్క కుర్చీలో కూర్చోవడం ద్వారా విస్తృత ప్రచారాన్ని పొందారు. ఆర్థిక, ప్రజాపనులు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ లాంటి కీలక శాఖలను నిర్వహించారు.
మరోసారి ముఖ్యమంత్రిగా....
2014లో ముఖ్యమంత్రి మరోసారి జైలుకు వెళ్లాల్సి రావడంతో పన్నీర్‌సెల్వం మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన తన కన్నీళ్లకు ఆపుకోలేకపోయారు. అప్పుడు ఆయన్ని కన్నీర్‌సెల్వం అని పిలుస్తూ వచ్చారు. దక్షిణ తమిళనాడులో ప్రాబల్యకులమైన దేవర్లు ఉపకులమైన మరవార్ కులంలో ఆయన పుట్టారు. ఆయనకు పుట్టినప్పుడు పెచ్చియమ్మన్ దేవత పేరు వచ్చేలా పెచ్చిముత్తూ అని పేరు పెట్టారు. వారి పెద్దనాన్న పేరు కూడా పెచ్చిముత్తూ అవడంతో పెద్దవారి పేరును ఉచ్ఛరించకూడదనే పట్టింపు కారణంగా ఆయన తన పేరును పన్నీర్‌సెల్వంగా మార్చుకున్నారు.
ఎంజీఆర్‌పై అభిమానంతో...
పీవీ క్యాంటీన్‌తోపాటు పన్నీర్‌సెల్వం డెయిరీ ఫామ్‌ను కూడా నడిపేవారు. ఆయన తండ్రి కుటుంబంలో మొదటి సంతానం ఆయన. ఆస్తి పంపకాల్లో డెయిరీ ఫారమ్ ఒకరికి, క్యాంటీన్ ఒకరికి వెళ్లాయి. పన్నీర్‌సెల్వం ఎంజీఆర్ మీదున్న అభిమానంతో ఆయన పార్టీలో చేరారు. 1987లో ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆయన జానకి రామచంద్రన్ పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత జయలలితే వారసురాలవుతుందని తెలిసి ఆమె వర్గంలో చేరిపోయారు. అప్పటి నుంచి ఆమెకే వీరవిధేయుడిగా ఉండిపోయారు.
Advertisement