అగర్తలా: త్రిపుర రాష్ట్ర జనాభాలో 30శాతం ఉన్న గిరిజనులు ఆకలితో అలమటిస్తున్నారు. పొట్ట నింపుకోవడానికి గుక్కెడు గంజి కూడా లేక ఆకలి బాధను తట్టుకోలేక పుట్టిన బిడ్డలను అమ్ముకునే దీన స్ధితికి చేరుకున్నారు. త్రిపురకు చెందిన ఓ పత్రిక రాసిన కథనంలో ఎన్నో రోజులుగా ఆ రాష్ట్ర గిరిజనుల పెడుతున్న ఆకలి కేకలు వినిపించాయి.
ధలాయ్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబానికి పండటి ఆడ శిశువు జన్మించింది. అమ్మాయి పుడితే లక్ష్మీ దేవిగా భావిస్తారు. ఆ లక్ష్మే తమ గృహంలో లేకపోవడంతో ఆ బిడ్డను వారు రూ.650కు అమ్ముకున్నారు. దారిద్యరేఖకు దిగువన ఆ కుటుంబం ఉన్నట్లు పత్రిక ప్రచురించింది. ఈ పరిస్ధితి ఒక్క ధలాయ్ జిల్లాలో మాత్రమే కాదు త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు క్షణక్షణం అనుభవిస్తున్న క్షోభ ఇది.కన్న బిడ్డకు ముల్లు గుచ్చుకుంటేనే అల్లాడిపోయే తల్లి హృదయం బిడ్డనే అమ్ముకునే స్ధాయికి దిగజారిందంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
గిరిజనుల పరిస్ధితిపై మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మాన్.. మారుమూల గ్రామాల్లో నివసించే గిరిజనుల వైపు సర్కారు చూడటం లేదని అన్నారు. బిడ్డను రూ.650కి అమ్ముకున్న ఘటనపై మాట్లాడిన ఆయన.. ఈ ఘటనకు ముందు గండాచెర్ర ప్రాంతంలో కూడా డబ్బు కోసం బిడ్డను అమ్ముకున్నారని చెప్పారు. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా కలిగిన ప్రాంతాల్లో డబ్బుకోసం బిడ్డలను అమ్ముకునే ఘటనలు సాధారణమయ్యాయని తెలిపారు. డబ్బు సంపాదించడానికి ఏ గత్యంతరం లేని వారు ఆకలితో మరణిస్తున్నారని వివరించారు.
‘బిడ్డను రూ.650కు అమ్ముకున్నారు’
Published Mon, Sep 26 2016 5:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement
Advertisement