abdominal pain
-
కడుపు నొప్పితో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
మైదుకూరు : కడుపు నొప్పి తాళలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైదుకూరులో జరిగింది. మృతురాలి తండ్రి యుగంధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం నంద్యాలంపేట –2లో మైదుకూరుకు చెందిన ధనపాల ప్రియాంక (27) అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల కిందట విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. జిల్లా వ్యవసాయాఽధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రసన్న ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె తండ్రి యుగంధర్‌ను పరామర్శించారు. -
Health Tips: 8 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.. గర్భసంచి తీసేయించాలా?!
మేడం.. మా సిస్టర్కిప్పుడు తొమ్మిదవ నెల. హెచ్బి (హిమోగ్లోబిన్) 6 గ్రాములే ఉంది. వాంతుల వల్ల అసలు ఏమీ తినలేకపోయింది. బ్లడ్ ఎక్కించాలంటున్నారు డాక్టర్స్. మాకేమో బయట నుంచి బ్లడ్ తీసుకోవడం ఇష్టం లేదు. బ్లడ్ ఎక్కించడం నిజంగా అవసరమా? – సీహెచ్‌వీ ప్రజ్వల, కందుకూరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో బ్లడ్‌తోపాటు బ్లడ్ కాంపొనెంట్స్నూ ఎక్కిస్తారు. దీన్ని అత్యవసర పరిస్థితుల్లోనే చేస్తారు. మీ సిస్టర్‌కు రక్తహీనత సివియర్‌గా ఉంది. బ్లడ్‌లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. శరీరానికి కావల్సిన హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో, ఆక్సిజన్, పోషకాలను సమకూర్చడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో వీటిదే ప్రధాన పాత్ర. అంతేకాదు రక్తం గడ్డకట్టడానికీ పనిచేస్తాయి. హిమోగ్లోబిన్ 8 కన్నా తగ్గితే అదే రక్తహీనత. దీనివల్ల అలసట, ఆయాసం, నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, గుండెకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవచ్చు. తల్లికి రక్తహీనత ఉంటే దాని ప్రభావం పొట్టలోని బిడ్డ ఎదుగుదల మీదా పడుతుంది. ప్రసవమప్పుడు కూడా రక్తస్రావం వల్ల ఇబ్బందులు ఎదురై ప్రాణానికే ప్రమాదం కావచ్చు. తొమ్మిదవ నెలలో రక్తాన్ని పెంచడానికి ఎక్కువ సమయం, అవకాశం ఉండదు. వాంతులు, ఎసిడిటీ వల్ల చాలా మంది మాత్రలు, ఐరన్ ఇంజెక్షన్లను తట్టుకోలేరు. సుఖ ప్రసవమైనా, సిజేరియన్ అయినా కొంచెం రక్తస్రావం ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి రక్తహీనతతో బాధపడుతున్న తల్లులకు ఉండదు. అందుకే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ త్వరగా పెరగడానికి రక్తం ఎక్కించక తప్పదు. తలసీమియా, సికిల్ సెల్ అనీమియా వంటి అరుదైన కండిషన్స్ ఉన్న వారికి కొన్నిసార్లు మాత్రలు, ఇంజెక్షన్స్ పనిచేయవు. వాళ్లకు 8 కన్నా హిమోగ్లోబిన్ తగ్గితే తప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్‌ను క్రాస్ మ్యాచ్ చేస్తారు. రక్తం ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్స్ వగైరాను చెక్ చేస్తారు. దీన్ని చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు.. పర్యవేక్షిస్తారు. బ్లడ్ ఎక్కించే పరిస్థితి ఉంటే.. ఆసుపత్రిలో చేర్చుకుని.. రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా.. సోకుండా చూసుకుంటూ.. చాలా స్లోగా బ్లడ్ ఎక్కిస్తారు. 24 గంటలు అబ్జర్వేషన్లో పెడతారు. ప్రసూతి వైద్య నిపుణులు, మత్తు డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. బ్లడ్ ఎక్కించాక ఐరన్ మాత్రలు, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అసలు ఈ సమస్య అంటే హిమోగ్లోబిన్ తగ్గకుండా గర్భధారణ తొలి నుంచే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని .. అంటే ఆకు కూరలు, మాంసం, గుడ్లు, పళ్లు వంటివి తీసుకుంటే మంచిది. వాంతులను కంట్రోల్ చేయడానికి మందులు వాడాలి. నారింజ, నిమ్మ రసాలతో ఐరన్ మాత్రలు వేసుకుంటే శరీరానికి ఐరన్ త్వరగా పడుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. హెచ్బి శాతం తక్కువుందని తేలిన వెంటనే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది గర్భిణీలకు 7వ నెలలోపు హిమోగ్లోబిన్ తగ్గితే.. ఐవీ ఐరన్ ఇన్ఫ్యూజన్తో హిమోగ్లోబిన్ పెంచొచ్చు. 9వ నెలలో అనీమియా రిస్క్ ఎక్కువ. అందుకే హిమోగ్లోబిన్ 6 శాతం ఉంటే ముందుగానే రక్తం ఎక్కించే ఆప్షన్‌ను సూచిస్తారు డాక్టర్లు. బ్లడ్ డొనేషన్‌ను సామాజిక బాధ్యతగా గుర్తించాలి అందరూ. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, పిల్లలకు ఫ్రెష్ బ్లడ్ అవసరమవుతుంది. దగ్గర్లోని బ్లడ్ బ్యాంక్స్‌లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో పాల్గొనేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. ఆరోగ్యంగా ఉన్న యువత బ్లడ్ డొనేషన్లో పాల్గొంటే ఎంతో మంది జీవితాలను కాపాడిన వాళ్లవుతారు. నాకు 35 ఏళ్లు. ఎనిమిది నెలలుగా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి. ఇప్పుడు ఆ నొప్పితోపాటు లూజ్ మోషన్స్ కూడా అవుతున్నాయి. డాక్టర్‌కు చూపించుకుంటూ గర్భసంచి తీసేయాలని అంటున్నారు. దయచేసి నా సమస్య తగ్గే మార్గం చెప్పండి.. – డి. వసుధ, నిర్మల్ ఆరునెలల కన్నా ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి కొనసాగుతుంటే దాన్ని క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు. దీనికి గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన లక్షణాలున్న వాళ్లను క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఆపరేషన్ వల్ల ఏ ఉపయోగం ఉండదు. డాక్టర్‌ను సంప్రదించి.. పొత్తి కడుపులో నొప్పి ఎక్కడ.. ఎప్పుడు వస్తుంది.. ఏ పని వల్ల పెరుగుతుంది.. అని పెయిన్ మ్యాపింగ్ చేస్తారు. ఇప్పటి వరకు ఏ మందులు వాడారు, ఈ నొప్పితో యూరిన్, మోషన్లో ఎలాంటి మార్పులు వచ్చాయి.. మానసిక ప్రభావం వంటివన్నీ కనుక్కుంటారు. మీ రోజూవారీ జీవనశైలి,ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చెక్ చేస్తారు. పొట్ట, వెజైనా, యూరినరీ ఏరియా, నర్వ్స్ చెక్ చేస్తారు. అబ్డామిన్, పెల్విస్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. వెజైనల్ స్వాబ్, యూరినరీ స్వాబ్ తీస్తారు. కొంతమందికి అప్పర్/ లోయర్ జీటీ రేడియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటారు. ఈ నొప్పి వల్ల పీరియడ్స్ టైమ్‌లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో కరెక్ట్‌గా చెప్పాలి. పొట్టకు సంబంధించి ఇంతకు ముందు ఏవైనా ఆపరేషన్స్ అయినట్టయితే నర్వ్ ఎన్‌ట్రాప్‌మెంట్ అనే కండిషన్ వల్ల నొప్పి వస్తుంది. దానికి సరైన చికిత్స తీసుకుంటే పొత్తి కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. పీరియడ్స్‌లో కూడా చేంజ్ వచ్చినట్టయితే మాత్రలను సూచిస్తారు. 3–6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత మీకు నొప్పి ఎలా ఉంది? ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయిందో లేదో.. మళ్లీ కన్సల్టేషన్‌లో చెక్ చేస్తారు. పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఇస్తారు. ఏవీ ఫలితాన్నివ్వకపోతే డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ చేస్తారు. ఈ విధానంలో పొట్ట మీద రంధ్రంలాంటి చిన్న కోత పెట్టి టెలిస్కోపిక్ కెమెరా ద్వారా ఆర్గాన్స్ అన్నిటినీ చెక్ చేస్తారు. దీనివల్ల ఎండోమెట్రియాసిస్, పెల్విస్ ఇన్ఫెక్షన్ వంటివి కనిపెట్టవచ్చు. వాటికి సరైన చికిత్స అందించవచ్చు. కొన్నిసార్లు నొప్పికి ఎలాంటి కారణం ఉండకపోవచ్చు. అదీ మంచిదే. అయితే నొప్పి తగ్గడానికి పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్‌కి రిఫర్ చేస్తారు. ఐబీఎస్(ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ )అనే కండిషన్లో డైట్ మార్పులతో పొట్ట నొప్పి తగ్గించవచ్చు. ఇన్ఫెక్షన్ను యాంటీబయాటిక్స్‌తో ట్రీట్ చేస్తారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా? -
1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..
కొన్నిసార్లు అత్యుత్సాహంతో చేసే పనులు తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయి. ఓ వ్యక్తి ఎండవేడిని తట్టుకోలేక ఒకేసారి ఒకటిన్నర లీటర్ల కూల్‌డ్రింక్ తాగాడు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అసలేంజరిగిందంటే.. చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. ఐతే తదుపరి 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు తలెత్తడంతో బీజింగ్‌లోని చావోయాంగ్ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. చికిత్స సమయంలో రక్తపోటు గణనీయంగా పడిపోయిందని, గుండె వేగంగా కొట్టుకుందని, ఊపిరి వేగం కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు చికిత్స ప్రారంభించారట. క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే న్యుమాటోసిస్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కడుపులో అధిక మోతాదులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. చికిత్స సమయంలో యువకుడి ఛాతీకి ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో హెపాటిక్ ఇస్కీమియాకు గురయ్యాడు (అంటే లివర్ షాక్‌కు గురవ్వడం). ఫలితంగా అతనికి మరణం సంభవించిందని వైద్యులు తెలిపారు. ఐతే గ్యాస్ నుండి ఉపశమనం పొందటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ 18 గంటల చికిత్స తర్వాత మరణించాడని నివేదిక తెల్పింది. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
అబార్షన్: మందులు వాడినా ఫలితం లేదు
నా వయసు 29 సంవత్సరాలు. కొంతకాలంగా నెలసరి సమయంలో నాకు చాలా తక్కువగా రక్తస్రావం జరుగుతోంది. ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటోంది. ఏడాది కిందట నాకు అబార్షన్ జరిగింది. ఆ తర్వాత నుంచే ఈ సమస్య మొదలైంది. నేను ప్రభుత్వాసుపత్రిలో చూపించుకుంటే, మందులు ఇచ్చారు. మందులు వాడినా ఫలితం పెద్దగా లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉందా? – అవంతి, మెంటాడ (విజయనగరం జిల్లా) మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో హార్మోన్లలో అసమతుల్యత పెరిగి ఉన్నట్లుండి బరువు పెరగడం వల్ల, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో అండాశయాలలో నీటిబుడగలు, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి వంటి వాటివల్ల కూడా రక్తస్రావం కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల గర్భాశయ కండరాలు కుంచించుకున్నట్లయ్యి పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిన్ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి విపరీతంగా ఉండవచ్చు. కొందరిలో చాలా అరుదుగా అబార్షన్ కోసం డి అండ్ సి ద్వారా గర్భాశయం శుభ్రం చేసినప్పుడు, ఎక్కువగా చెయ్యడం వల్ల గర్భాశయ పొర దెబ్బతినడం వల్ల బ్లీడింగ్ తక్కువగా అవ్వవచ్చు. అలానే ఎక్కువసార్లు అబార్షన్లు చెయ్యించుకోవడం వల్ల కొందరిలో అడినోమయోసిన్ అనే సమస్య ఏర్పడి కూడా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సిబిపి, ఈఎస్ఆర్, ఎస్ఆర్–టిఎస్హెచ్, ఎస్.ఆర్.ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని పెల్విక్ స్కానింగ్ చేయించుకుని సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే ఆహారనియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలు చెయ్యడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి నీ సమస్య తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
మంత్రి ‘కొప్పుల’కు మేయర్ శస్త్రచికిత్స
సాక్షి, కరీనంగర్/గోదావరిఖని: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ మంగళవారం శస్త్రచికిత్స చేశారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈశ్వర్ కడుపు ఎడమవైపు పైభాగంలో కణతి ఏర్పడింది. శస్త్రచికిత్స చేసి దానిని తొలగించాలని వైద్యులు ఇదివరకే సూచించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఈశ్వర్ పాల్గొని తిరిగి వస్తుండగా కడుపులో నొప్పి ఎక్కువైంది. మార్గమధ్యంలో గోదావరిఖని మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్‌ను ఆశ్రయించగా విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేస్తున్నంత సేపు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆపరేషన్ చేసిన అరగంట తర్వాత ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జి అయ్యారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో ఆయన యథావిధిగా పాల్గొన్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ములాయంకు తీవ్ర అస్వస్థత; ముంబైకి తరలింపు
ముంబయి : సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ములాయంను ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయంను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా తర్వాతే ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది సాయంత్రంలోగా వెల్లడిస్తామని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎయిమ్స్‌కు చిదంబరం
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి∙చిదంబరానికి కడుపునొప్పి రావడంతో ఎయిమ్స్‌కు సోమవారం తరలించారు. చికిత్స ముగిశాక తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఈడీ పర్యవేక్షణలో ఐఎన్ఎక్స్ కేసుకు సంబంధించి తీహార్ జైల్లో ఉన్నారు. మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం సమయంలో ఎయిమ్స్‌కు పంపించి, అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు గంటలప్పుడు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ఆయనకున్న సమస్యను డాక్టర్లు వెల్లడించడంలేదు. -
బాబుకు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో ఎరుపు
మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్ నార్మల్ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. పదిరోజుల కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు చేశారు. అవి కూడా నార్మలే. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, రక్తం ఎందుకు పడుతోంది? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచన. పిల్లల యూరిన్‌లో రక్తం కనబడానికి గల కొన్ని కారణాలు: మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్‌తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. రోజుల పాప... తలలో తెల్ల వెంట్రుకలు మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్‌కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. పాపకు తలలో ర్యాష్... పరిష్కారం చెప్పండి మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా డాక్టర్గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్. పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనకభాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
బాబుది ఏడీహెచ్‌డీ కావచ్చు..?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఏడేళ్లు. ఇతర పిల్లలో కలవడం చాలా తక్కువ. మేం ఏమి చెప్పినా వినిపించుకోడు. మాటలు కూడా కొంత ఆలస్యంగానే వచ్చాయి. కొన్నిసార్లు బాగానే ఆడుకుంటాడు గానీ ఒక్కోసారి దేనిమీదా దృష్టికేంద్రీకరించి కుదురుగా ఉండడు. పదే పదే కనురెప్పలు కొడుతుంటాడు. చూసినవాళ్లు... ‘ఇది చిన్నవయసు కదా. ఎదిగేకొద్దీ సర్దుకుంటాడు’ అని అంటున్నారు. అతడి సమస్య ఏమిటి? సరైన సలహా ఇవ్వగలరు. – ఆర్. మహేశ్వరి, నిజామాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి సమస్య ఇదే అని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ మీ లేఖలోని అంశాలను విశ్లేషిస్తే ఇది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏ విషయంపైనా చాలాసేపు దృష్టి కేంద్రీకరించలేకపోవడం అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్‌తో పాటు హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివ్ బిహేవియర్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అటెన్షన్ డెఫిసిట్‌తో పాటుగా కొన్నిసార్లు కొద్దిమందిలో హైపర్ యాక్టివ్ లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)’ అంటారు. అటెన్షన్ డెఫిసిట్ ఉన్న పిల్లల్లో అకడమిక్‌గా వెనకబడటం, స్నేహితులతో పెద్దగా కలివిడిగా ఉండలేకపోవడం, నిర్లక్ష్యంగా తప్పులు చేస్తూ ఉండటం, ఒక అంశంపైనా లేదా ఒక ఆటపైనా చాలాసేపు ఏకాగ్రత చూపలేకపోవడం, చెప్పినమాట వినకపోవడం, స్కూల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ వంటి టాస్క్‌లు గడువులోపల పూర్తి చేయకపోవడం, నిర్వహణశక్తిలోపం, పదే పదే వస్తువులను పోగొట్టుకోవడం, ఏదైనా అంశం నుంచి త్వరగా దారిమళ్లడం, ఎప్పుడూ విషయాలను మరచిపోవడం వంటివన్నీ నిత్యం చేస్తుండటం అన్నవి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ లక్షణాలు. అలాగే హైపర్ యాక్టివిటీకి సంబంధించి... బాగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఒకేచోట కుదురుగా కొంతసేపు కూడా కూర్చులేకపోవడం, ఎప్పుడూ గెంతుతూ, ఏదో ఎక్కుతూ ఉండటం, నెమ్మదిగా ఆడుకోలేకపోవడం, ప్రశ్నపూర్తిగా అడగకముందే జవాబిచ్చేలా స్పందించడం వంటివి అన్నీ హైపర్ యాక్టివ్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ ‘ఏడీహెచ్‌డీ’ సమస్య ఉన్నవారిలో నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యాంగై్జటీ, డిప్రెషన్, కనురెప్పలు అదేపనిగా కొట్టుకోవడం (టిక్ డిజార్డర్), మలమూత్రాల మీద నియంత్రణ లేకపోవడం, నిద్రసంబంధ సమస్యలు వంటివి ఉండవచ్చు. ఇలాంటి పిల్లల్లో సమస్యను సరిగ్గా నిర్ధారణ చేయడం వల్లనే చికిత్స సరిగా జరిగినట్లవుతుంది. ఈ పిల్లలకు పూర్తిస్థాయి చికిత్స రెండు రకాలుగా జరగాలి. ఒకటి... ప్రవర్తనాపరమైన చికిత్స (బిహేవియరల్ థెరపీ), రెండోది మందులతో చేసే చికిత్స. సమాజం ఆమోదించేలాంటి ప్రవర్తనను తీసుకురావడమే థెరపీ లక్ష్యం. బిహేవియరల్ థెరపీలో చాలా చిన్న చిన్న జాగ్రత్తలు, అంశాలదే కీలక భూమిక. సమస్యపై కుటుంబానికి అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యుల చేయూత, క్రమబద్ధమైన జీవితం, నిర్ణీత వేళకు నిద్రలేవడం, పడుకోవడం, వేళకు తినడం వంటి మార్పులతో పాటు స్కూల్లోనూ కొద్దిపాటి మార్పులు, పిల్లలపై టైమ్, పరీక్షల ఒత్తిడి లేకుండా చూడటం వంటి వాటితో సత్ఫలితాలు కనిపిస్తాయి. దాంతోపాటు స్టిమ్యులెంట్ మెడిసిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బిహేవియర్ థెరపీపై అవగాహన కోసం ఇలాంటి పిల్లల పేరెంట్స్ అందరూ గ్రూప్‌గా ఏర్పడి నిర్వహించుకునే తరగతులతో ప్రయోజనం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే అతడికి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్‌తో పాటు టిక్స్ డిజార్డర్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి మీరు పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి. ఇక ఇది కొద్దిపాటి దీర్ఘకాలిక సమస్య కాబట్టి తల్లిదండ్రులూ ఓపిగ్గా ఉండాలి. ఈ మానసిక రుగ్మత విషయంలో మంచి సంగతి ఏమిటంటే... ఈ సమస్య ఉన్న పిల్లల శక్తియుక్తులను సరిగ్గా గాడిలో పెట్టగలిగితే వాళ్లు గొప్ప విజయాలు సాధించడానికి అవకాశాలున్నాయి. బాబు అదేపనిగా ఏడుస్తున్నాడు మా బాబు వయసు రెండు నెలలు మాత్రమే. వాడెప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాడు. . డాక్టర్‌కు చూపించినా ఏమీ లాభం లేదు. అసలు వాడి సమస్య ఏమిటో తెలుసుకోవడం ఎలా? మాకు తగిన సలహా చెప్పండి. – ఎల్. పవన్‌కుమార్, ఒంగోలు ఇంత చిన్న పిల్లలు తమ బాధలనైనా కేవలం ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్ చేసే ఒక విధనం ఏడుపు మాత్రమే. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ∙ఆకలి వేసినప్పుడు ∙భయపడినప్పుడు ∙దాహం వేసినప్పుడు ∙బోర్ ఫీల్ అయినప్పుడు ∙పక్క తడిగా అయినప్పుడు ∙వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు ∙పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు ∙కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా ∙నొప్పులు ఉన్నప్పుడు ∙పళ్ళు వస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షను వచ్చినప్పుడు ∙కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) ∙జ్వరం ∙జలుబు ∙చెవినొప్పి ∙మెదడువాపు జ్వరం ∙గుండె సమస్యలు ∙కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు. 1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు. ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్... చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ టైమ్‌లో పిల్లలు కొద్ది సేపు మొదలుకొని చాలా ఎక్కువసేపు ఏడుస్తుంటారు. ∙ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్‌కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్‌కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే..
ఖమ్మంక్రైం : ఐదు రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువకుడు.. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని 15వ డివిజన్ పార్శీ బంధం ప్రాంతానికి చెందిన సిరిగిరి మోగలాల్–గురువమ్మ దంపతుల మూడవ కుమారుడు బాజి అలియాస్ బాలాజీ(23) జాతకాలు చెబుతుండేవాడు. ఇతడు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నాడు. ఇటీవల కడుపు నొప్పి తగ్గటంతో తల్లిదండ్రులు పెళ్లి కుదర్చారు. ఈ నెల 31న అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరగాల్సుంది. అందరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆదివారం ఉదయం అతని కుటుంబీ కులు లేచేసరికి, ఇంట్లోని దూలానికి ఉరికి వేలాడుతూ బాలాజీ కనిపించాడు. కుటుంబీకులు ఒక్కసారిగా గుండె లు పగిలేలా రోదించారు. బాలాజీ తండ్రి మోగలాల్ ఫిర్యాదుతో కేసును వన్ టౌన్ సీఐ రమేష్ ఆ«ధ్వర్యంలో ఎస్ఐ ప్రభాకర్ దర్యాప్తు చేస్తున్నారు. -
నవవధువు ఆత్మహత్య
తాండూరు: కడుపు నొప్పి భరించలేక ఓ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రతాపలింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన జెల్ల మాణెమ్మ కూతూరు రాజేశ్వరి(19) ఇంటర్మీడియేట్ పూర్తిచేసింది. ఈమెకు నాలుగు నెలల క్రితం దౌల్తాబాద్ మండలం గుమ్మడిపల్లికి చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. గత బుధవారం రాజేశ్వరి తన పుట్టింటికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం కడుపు నొప్పి వస్తోందని చెప్పి.. తల్లిని వెంటబెట్టుకుని వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. అయితే ఇంటికి చేరిన తర్వాత రాత్రి వేళలో భరించలేని నొప్పి రావడంతో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు. -
మూఢ నమ్మకాలకు గర్భిణి బలి
ఏడు నెలల గర్భిణి.. ఇంకో రెండు నెలలైతే మాతృత్వాన్ని వరంగా పొందుతానని సంబరపడింది. ఆ సమయంలో కడుపులో తీవ్రమైన నొప్పి.. కుటుంబీకులకు చెబితే గాలి దూలి అంటూ మూఢనమ్మకాలతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంటికే పరిమితం చేశారు. ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆలోపే ఆమె నొప్పి భరించలేక పరలోకానికి వెళ్లిపోయింది. మూఢనమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భీమిని(నెన్నెల) : నెన్నెల మండలం మైలారం గిరిజన వాడకు చెందిన జంబి పోసక్క(25) కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. పోసక్క ఏడు నెలల గర్భవతి. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తే నొప్పి తగ్గిపోతుందని కుటుంబీకులు పోసక్కను ఇంట్లోనే ఉంచి సమయం వృథా చేశారు. ప్రాణాల మీదకు వచ్చాక ఆటోలో నెన్నెల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీరాణి పోసక్కను పరీక్షించి అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. నొప్పి వచ్చిన వెంటనే ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణానికి ఎలాంటి హాని ఉండేది కాదని తెలిపారు. పోసక్క భర్త వ్యవసాయ కూలీ. పోసక్కకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
కడుపునొప్పిగా ఉందంటూ పర్సు చోరీ
టెక్కలి రూరల్ శ్రీకాకుళం : కడుపు నొప్పిగా ఉందని మాయమాటలు చెప్పి పర్సు చోరీ చేసిన ఘటన బుధవారం అక్కవరం జంక్షన్లో చోటుచేసుకుంది. లింగాలవలసకు చెందిన రోణంకి శ్రీరామ్మూర్తి దండుగోపాలపురంలో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. బుధవారం తన విధులు ముగించుకుని బైకుపై తిరిగి వస్తుండగా అక్కవరం జంక్షన్ సమీపంలో ఓ వ్యక్తి బండి ఆపాడు. ‘సార్.. మీరు డాక్టర్ కదా.. నాకు కడుపులో నొప్పిగా ఉంది.. కొంచెం ట్రీట్మెంట్ చేయండి..’ అని అడిగాడు. అందుకు శ్రీరామ్మూర్తి స్పందిస్తూ తాను పశువైద్యాధికారినని.. టెక్కలి వెళ్లి మంచి వైద్యునికి చూపించు అని సలహాఇచ్చారు. సదరు వ్యక్తి ‘అలాగే సార్.. అని చెబుతూ శ్రీరామ్మూర్తి వద్దకు వెళ్లి తనకు ఎక్కడ నొప్పి వస్తుందో చేతితో తాకుతూ చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. శ్రీరామ్మూర్తి ఇంటికి వచ్చి చూసేసరికి పర్సు పోయిందని గ్రహించి, కొద్దిసేపటి కింద తనను కలిసిన వ్యక్తిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్సులో రూ.3800 నగదుతో పాటు రూ.2లక్షల 16వేల చెక్, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కడుపునొప్పితో వెళ్తే.. కంటిచూపు పోగొట్టారు
వేములవాడ : తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. వచ్చీరాని వైద్యంతో ఓ వ్యక్తి కంటిచూపు పోగొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన నేరెళ్ల సాయిలుకు భార్య జలజ, కూతుళ్లు అక్షయ, అర్షిత ఉన్నారు. ఏప్రిల్ 21న జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ వైద్యంకోసం వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు రక్తకణాలు తగ్గాయని అడ్మిట్ చేసుకున్నారు. ఐదురోజులు వైద్యం చేసి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన సాయిలుకు కంటిచూపు పోయింది. వెంటనే అదే ఆస్పత్రిలోని డాక్టర్ దిలీప్‌ను సంప్రదించారు. ఆయన సూచనతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సంప్రదించాడు. వైద్యం తీసుకున్నా.. కుడి కన్ను చూపు పోయింది. నోటికి తిమ్మిర్లు వచ్చాయి. నాలుక రుచి గుర్తించడంలేదు. ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన సాయిలు సోమవారం మనోహర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. తనకు మెరుగైన వైద్యం చేయించి ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడే ఉంటానని కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రివద్దకు చేరుకుని బందోబస్తు చేపట్టారు. కాగా బాధితుడి బంధువులు, కుటుంబసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు వైద్యులతో సంప్రదింపులు జరిపారు. వైద్యం చేయడంలో తమ తప్పిదమేమీ లేదని వైద్యులు చెప్పారని ఎంపీపీ వెంకటేశ్‌గౌడ్ తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ్నుంచి బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డాక్టర్ మనోహర్, డాక్టర్ దిలీప్‌పై ఫిర్యాదుచేశారు. ఈమేరకు ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేశారు. నేరెళ్ల సాయిలును వైద్యపరీక్షల కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు టౌన్ సీఐ వెంకటస్వామి తెలిపారు. ఈవిషయంపై డాక్టర్ మనోహర్‌ను వివరణ కోరగా, సాయిలుకు ప్లేట్లేట్స్ సంఖ్య 8 వేలకు పడిపోయిందని, ఆ తర్వాతే ఆస్పత్రికి వచ్చాడన్నారు. ప్లేట్లెట్స్ పెంపుకోసం వైద్యం చేశామే తప్ప కంటిచూపునకు సంబంధించి వైద్యం తాము చేయలేదని వివరించారు. -
సోనియాకు అస్వస్థత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ(70) శుక్రవారం అస్వస్థతకు లోనయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కడుపు నొప్పి రావడంతో ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డా.డీఎస్ రానా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా సాయంత్రం 5 గంటల సమయంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో స్పందిస్తూ.. సోనియా పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ‘సిమ్లాలో అమ్మ(సోనియా)కు కడుపు నొప్పి రావడంతో వెంటనే ఢిల్లీకి తీసుకొచ్చాం. భయపడాల్సిందేమీ లేదు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మీ అద్భుతమైన ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. -
వెలగబెట్టండి
వెలగపండు... పేరుకి పండే. కానీ ఒలిచి తిందామంటే... ఉహూ! కుదరనే కుదరదు. పగలగొట్టాలి... గుజ్జు తీయాలి. ఆ తర్వాత... పచ్చడి, జ్యూస్, జామ్, రైస్... ఎలా వండుతామన్నా వద్దనదు. కిమ్మనకుండా వంటింట్లో ఒదిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం... వన్.. టూ.. త్రీ.. బ్రేక్!!! వెలగ పండు జ్యూస్ కావలసినవి : లగ పండు – 1; బెల్లం తురుము – 4 టేబుల్ స్పూన్లు; నిమ్మ రసం – అర టీ స్పూను; నల్ల మిరియాల పొడి – పావు టీ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారి : వెలగ పండును పగులగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి (గింజలు వేరుచేయనక్కరలేదు) ∙గుజ్జు అంతా మునిగేవరకు రెండు గ్లాసుల చల్లటి నీరు పోసి బాగా కలిపి, ఒక వస్త్రం పైన వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి ∙బెల్లం తురుమును కప్పుడు చల్లటి నీళ్లలో వేసి బాగా కలపాలి ∙వాడుకోవడానికి ఐదు నిమిషాల ముందు వెలగ పండు గుజ్జును బయటకు తీసి బాగా మెత్తగా చేయాలి. గుజ్జంతా నీళ్లలో కలిసే వరకు కలపాలి ∙పల్చటి వస్త్రంలో వడకట్టి, బెల్లం కరిగిన నీటిలో వేసి బాగా కలపాలి ∙మిక్సీలో వేసి బ్లెండ్ చేసి, ఒక బౌల్ లోకి తీసుకోవాలి నిమ్మరసం, నల్లమిరియాల పొడి వేసి కలపాలి. వెంటనే తాగొచ్చు లేదా రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసుకోవచ్చు. వెలగ రైస్ కావలసినవి : వెలగ పండు గుజ్జు – కప్పు; బియ్యం – 3 కప్పులు; పచ్చి సెనగపప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; వేయించిన పల్లీలు –2 టేబుల్ స్పూన్లు; పసుపు – కొద్దిగా; పచ్చిమిర్చి – 4; ఎండు మిర్చి – 2; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు తయారి : ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, తగినంత నీరు జత చేసి ఉడికించాలి ∙బాణలిలో నూనె కాగాక మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వరసగా వేసి వేయించాలి ∙వెలగ పండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి ∙చల్లార్చిన అన్నంలో ఈ మిశ్రమం వేసి బాగా కలపాలి (పులిహోరలా ఉంటుంది). వెలగ పండు కాల్చిన పచ్చడి కావలసినవి : వెలగ పండు – 1; నువ్వుల పొడి – టేబుల్ స్పూను; బెల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – టేబుల్ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – కొద్దిగా; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పచ్చి సెనగపప్పు – టీస్పూను; మినప్పప్పు – టీ స్పూను; పచ్చి మిర్చి – 3; ఎండు మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు తయారి : వెలగపండును స్టౌ మీద సన్నని మంట మీద కాల్చాలి ∙చల్లారిన తరవాత పండును పగులగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, చేతితో బాగా మెత్తగా అయ్యేవరకు మెదపాలి ∙బెల్లం తురుము, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగిన తరవాత పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి తీసి చల్లార్చాలి ∙మిక్సీలో ముందుగా పోపు సామాను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙వెలగపండు గుజ్జు, కొత్తిమీర వేసి మరోమారు తిప్పాలి ∙బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా తిప్పి తీసేయాలి ∙నువ్వుల పొడి, నూనెలో వేయించిన కరివేపాకు పైన చల్లాలి ∙వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వెలగపండు బీరపొట్టు పచ్చడి కావలసినవి : వెలగ పండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు; బీర పొట్టు – పావు కప్పు; కొబ్బరి తురుము – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 4; మినప్పప్పు – 2 టీస్పూన్లు; అల్లం తురుము – కొద్దిగా; ఉప్పు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – కొద్దిగా తయారి : ∙బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ఎండు మిర్చి ఇంగువ వేసి వేయించి తీసేయాలి ∙మినప్పప్పు వేసి వేయించాలి ∙అల్లం తురుము జత చేసి మరోమారు వేయించి తీసేయాలి ∙బీర పొట్టు వేసి బాగా వేయించాలి. అవసరమనుకుంటే మరి కాస్త నూనె జత చేయాలి ∙మెత్తగా అయ్యేవరకు ఉంచి దించేయాలి ∙మిక్సీలో ముందుగా ఎండుమిర్చి, మినప్పప్పు వేసి మెత్తగా చేయాలి ∙బీరపొట్టు జత చేసి మెత్తగా చేయాలి ∙కొబ్బరి తురుము, వెలగపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా చేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి. వెలగ పండు జామ్ కావలసినవి : వెలగపండు – 1 బెల్లం తురుము – 4 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి – అర టీ స్పూను తయారి : బాగా పండిన వెలగపండులోని గుజ్జును ఒక బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. చల్లగా సర్వ్ చేయాలి. వెలగ పండు పెరుగు పచ్చడి కావలసినవి : పచ్చి వెలక్కాయ – ఒకటి; టొమాటో తరుగు – అర కప్పు; పెరుగు – కప్పు; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా కట్ చేయాలి); కొత్తిమీర – చిన్న కట్ట; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; కరివేపాకు – ఒక రెమ్మ; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీ స్పూను ఎండు మిర్చి – 4 తయారి : ముందుగా వెలక్కాయను పగలగొట్టి, గుజ్జును పాత్రలోకి తీసి, చేతితో మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వరసగా వేసి వేయించాలి ∙టొమాటో తరుగు జత చేసి బాగా కలిపి, ఉప్పు, పసుపు వేసి మరోమారు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ∙ఒక పాత్రలో పెరుగు వేసి గిలకొట్టి, కొద్దిగా నీరు జతచేయాలి ∙వెలగపండు గుజ్జు వేసి కలపాలి ∙మగ్గించి ఉంచుకున్న టొమాటో మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కరివేపాకు, కొత్తిమీద తరుగుతో అలంకరించాలి ∙(ఇష్టపడేవారు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు) వెలగ ఉపయోగాలు వెలగ ఆకుల రసాన్ని వడగట్టి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. చిన్న పిల్లలకు అజీర్తిగా ఉంటే, వెలగ చిగుళ్లు కాని లేత వెలగ ఆకులను కాని రసం తీసి, ఆ రసంలో పాలు, చక్కెర కలిపి తాగించాలి. వెలగపండు గుజ్జులో తేనె కలిపి తింటే అధిక దాహం తగ్గుతుంది. – సేకరణ: డా. వైజయంతి -
వివాహిత ఆత్మహత్య
కడుపునొప్పి తాళలేక అఘాయిత్యం టెక్కలి రూరల్: చాకిపల్లి కొత్తూరు గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(19)కి చాకిపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన ఏదూరి గణపతితో గత ఏడాది మార్చి 25వ తేదీన వివాహం జరిగింది. గణపతి స్థానికంగా తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగానే శనివారం రాత్రి భార్యాభర్తలు తమ ఇంట్లో నిద్రించారు. ఆదివారం ఉదయం లేచి చూసే సరికి తన ఇంటి దూలానికి ధనలక్ష్మి వేలాడుతూ కనిపించడంతో భర్త అతాశుడయ్యాడు. వెంటనే మృతురాలి తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించాడు. జర్జంగి గ్రామం నుంచి మృతురాలి తల్లిదండ్రులు వచ్చి కుమార్తె మృతదేహంపై పడి బోరున విలపించారు. గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి జీరు పున్నయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గత కొద్ది కాలంగా ధనలక్ష్మి కడుపునొప్పితో బాధపడుతుండేదని, నాటువైద్యం చేయించిన ఫలితం లేకపోవడంతో బాధను భరించలేక తన కుమార్తె ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆ ఫిర్యాదులో పేరొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కడుపునొప్పి తాళలేక... కవిటి: శావసానపుట్టుగకు చెందిన అవివాహిత నర్తు కృష్ణ(25), అలియాస్ కృష్ణమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కవిటి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గత కొన్నేళ్లుగా కడుపునొప్పి సమస్యతో కృష్ణ వైద్యం చేయించుకొంటుంది. మందులు వాడుతున్నప్పటికీ నయంకాలేదు. శనివారం సాయంత్రం మళ్లీ కడుపునొప్పి అధికంగా రావడంతో గ్రామంలోనే గుళికలు మింగేసింది.ఇంటిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. శనివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. మృతురాలి సోదరి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ఫెక్షన్లకు ఎదుర్కొనే వాము
గుడ్ ఫుడ్ కడుపునొప్పి వస్తోందంటూ చిన్న పిల్లలు తల్లితో చెప్పగానే తల్లులు తినిపించే ఇంటి ఔషధం వాము. అప్పట్నుంచి మొదలుకొని చాలా వంటకాల్లో వాము పంటి కిందికి రాగానే దాన్ని నమిలి ఆస్వాదించడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. కడుపునొప్పిని తగ్గించడం మాత్రమే కాదు... వాము మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అందులో కొన్ని... ∙మంచి జీర్ణప్రక్రియకు వాము తోడ్పడుతుంది. వామును నమిలినప్పుడు ఇంపుగా ఉండే ఒక సుగంధపదార్థపు రుచి మనకు తెలుస్తుంది. వాములో ఉండే థైమ్ అనే ఔషధగుణాలున్న నూనె వంటి పదార్థమే ఇందుకు కారణం. వామును నమిలినప్పుడు స్రవించే ఈ రసం కడుపులోకి వెళ్లగానే జీర్ణక్రియను ప్రేరేపించే అనేక ఎంజైములను స్రవించేలా చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది ∙వాములో పీచు పదార్థాలు కూడా ఎక్కువే. అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడి మల బద్ధకాన్ని నివారిస్తుంది. ∙వాములోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి ∙వాములో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. అందుకే వాము తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి స్వాభావిక రక్షణ ఉంటుంది ∙వాము తినేవారిలో ఆస్తమా నియంత్రణలో ఉంటుంది ∙గర్భవతుల్లో ఉండే వికారం, వాంతుల ఫీలింగ్ (మార్నింగ్ సిక్నెస్) తగ్గించడానికి కూడా వామును ఉపయోగిస్తారు ∙వాములో మూడ్స్‌ను చక్కబరిచే గుణాలు ఉన్నాయి. -
మహిళ ఆత్మహత్య
గోస్పాడు: మండల పరిధిలోని జూలేపల్లె గ్రామానికి చెందిన ఉమాదేవి(35) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఉమాదేవి పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వలస కూలీ ఆత్మహత్యాయత్నం
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం ఉదయం కాలెమ్మ(32) అనే వలస కూలీ విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్యం చేసింది. బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి పదేళ్ల కిందట వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు కాలెమ్మ తల్లి సరోజ తెలిపింది. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో తమ కుమార్తె బాధపడుతోందన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ నొప్పి రావడంతో తట్టుకోలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. వెంటనే ఆమెను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలి ంచామన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. -
వలస కూలీ ఆత్మహత్యాయత్నం
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం ఉదయం కాలెమ్మ(32) అనే వలస కూలీ విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్యం చేసింది. బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి పదేళ్ల కిందట వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు కాలెమ్మ తల్లి సరోజ తెలిపింది. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో తమ కుమార్తె బాధపడుతోందన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ నొప్పి రావడంతో తట్టుకోలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. వెంటనే ఆమెను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలి ంచామన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. -
అమీబియాసిస్ అంటే...?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా మనవడి వయసు తొమ్మిదేళ్లు. తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే అమీబియాసిస్ అన్నారు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరుడు, ఒంగోలు జిల్లా మీ మనవడికి అమీబియాసిస్ అని చెబుతున్నారు. సాధారణంగా తరచూ ప్రయాణాలు చేసేవారు తమ ప్రయాణాల్లో పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోలేకపోవడం, కలుషితమైనవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని బాధపడుతుంటారు. దాంతో కడుపు ఉబ్బడం, బంకవిరేచనాలు, నెత్తుటి విరేచనాలు వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలుకు కారణం అమీబియాసిస్ అనే వ్యాధి. అమీబియాసిస్ అంటే... ప్రోటోజోవా అనే విభాగానికి చెందిన ఏకకణజీవివల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనికి కారణమయ్యే ఆ ఏకకణజీవి పేరు ‘ఎంటమీబా హిస్టోలిటికా’. ఈ జీవి లేదా దాని గుడ్లు ఏదైనా ఆహారపదార్థాల మీద లేదా నీళ్లలో కలవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఒక్కోసారి చేతులు మురికి అయి, వాటిని నోట్లోకి తీసుకున్నప్పుడు కూడా వ్యాధి సోకవచ్చు. ఆరుబయట మల విసర్జన చేశాక, అది నీళ్లలో కలవడం అన్నది ఈ వ్యాధికి ప్రధాన కారణమవుతుంది. మన దేశంలోని పల్లెల్లో ఇంకా సరైన శానిటేషన్ సౌకర్యాలు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల దీని వ్యాప్తి సర్వసాధారణం. ఇలా నోటి ద్వారా శరీరంలోకి చేరే ఈ జీవి జీర్ణవ్యవస్థలోని పెద్దపేగు వరకు వెళ్లి సమస్యలు సృష్టిస్తుంది. జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే ఈ జీవులు పేగుల లోపలి పొర (ఇంటస్టినల్ లైనింగ్)ను దెబ్బతీస్తాయి. దీన్నే అమీబిక్ కొలైటిస్ అంటారు. ఒక్కోసారి ఇవి రక్తప్రవాహంలోకి చేరి కొన్ని సందర్భాల్లో కాలేయంలోకి వ్యాపించవచ్చు. ఫలితంగా వచ్చే సమస్యను అమీబిక్ లివర్ యాబ్సెసెస్ అంటారు. కొన్నిసార్లు ఈ అమీబిక్ లివర్ యాబ్సెసెస్ అనే సమస్య నీళ్ల విరేచనాల వంటి లక్షణాలేమీ కనిపించకుండానే రావచ్చు. ఈ సందర్భంలో మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నీళ్ల విరేచనాలు అమీబియాసిస్‌కు ఒక లక్షణమే అయినా... నీళ్ల విరేచనాలు అయిన ప్రతి సందర్భంలోనూ దానికి అమీబియాసిస్ మాత్రమే కారణం కాకపోవచ్చు. సాధారణంగా ప్రయాణాల్లో వచ్చే నీళ్ల విరేచనాల సమస్య ‘ట్రావెలర్స్ డయేరియా’ను అమీబియాసిస్‌గా పొరబడే అవకాశం ఉంటుంది. అమీబియాసిస్ లక్షణాలు: తీవ్రమైన కడుపునొప్పి వికారం (నాసియా), ఒక్కోసారి వాంతులు జ్వరం నిస్సత్తువ, నీరసం (కొంతమందికి కడుపులో ఈ ఏకకణజీవి చేరినా ఎలాంటి లక్షణాలూ కనిపించవకపోవచ్చు). అమీబియాసిస్‌కు కారణాలు: సరైన శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం (అంటే మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం ఆహారాన్ని సరిగా ఉడికించక పోవడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి జరగవచ్చు. నిర్ధారణ: మల పరీక్షల ద్వారా. చికిత్స: రోగి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించాల్సి ఉంటుంది. ట్రావెలర్స్ డయారియా వంటి అంశాలను మినహాయించి చికిత్స అందించాల్సి ఉంటుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ బైపాస్ తర్వాత జాగ్రత్తలు... కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - రఘునాథ్, కందుకూరు అన్ని కండరాలకు అందినట్టే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెలో అడ్డంకులు పెరిగి గుండెకు తగినంత రక్తం అందే పరిస్థితి లేనప్పుడు, గుండెకండరం చచ్చుపడే ప్రమాదాన్ని నివారిస్తారు. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని ముందుగా తీసుకుంటారు. దీనిద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి. డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవదు నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి భారమైన పనులు చేయకండి డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి. శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత: దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ర్పభాలను నివారించడానికి కూడా ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి... కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు మద్యంకూడా గుండెకు హానిచేసేదే ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ఒకే చోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్. తలనొప్పి తగ్గేదెలా? న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. దీని నుంచి విముక్తి పొందడానికి తగిన మార్గాలు చెప్పండి. - రాజేశ్వరరావు, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి. ఎక్కువ శబ్దం, కాంతి లేని చోట విశ్రాంతి తీసుకోండి. విపరీతమైన శబ్దం, శక్తిమంతమైన వెలుగు వంటి అంశాలు తలనొప్పిని మరింత ప్రేరేపిస్తాయి. ఘాటైన వాసనలకు దూరంగా ఉండండి. సరిపడని పర్ఫ్యూమ్ల వల్ల తలనొప్పి ఎక్కువ కావచ్చు. తలనొప్పి తగ్గుతుందనే అపోహతో టీ, కాఫీలను పరిమితికి మంచి తాగడం మంచిది కాదు. చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మానేయాలి. కెఫిన్ ఉండే శీతలపానీయాల నుంచి దూరంగా ఉండాలి. నిమ్మజాతి పండ్ల వల్ల కూడా రావచ్చు. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. నీళ్లు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. అల్లం, ఎర్రకాప్సికమ్, వండిన ఆకుకూరలు, పండిన పసుపుపచ్చ కూరగాయలు మైగ్రేన్ నివారించడానికి సహాయపడతాయి. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయాల్సి వచ్చినప్పుడు యాంటీగ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి కనీసం ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. కనురెప్ప కొట్టకుండా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడటం సరికాదు. కంటికి ఒత్తిడి కలిగించే పనులు చేయకూడదు. కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు మధ్య మధ్య కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. తలనొప్పితో పాటు వాంతులు, తలతిరగడం వంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, ధ్యానం, ప్రాణాయామం కూడా మైగ్రేన్‌ను నిరోధించడానికి సహాయపడతాయి. నెలకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు వస్తుంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్సతో నివారణా చికిత్స (ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్)తో దాదాపు 80 శాతం వరకు దీన్ని సమర్థంగా అదుపు చేయవచ్చు. డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ప్రైవేటు వైద్యం..ప్రాణాలు కష్టం!
► పేరుకే మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ► అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు ► వైద్యం వికటించి మృతి చెందుతున్న రోగులు ► డబ్బిచ్చి సర్దుబాటు చేసుకుంటున్న ఆస్పత్రుల నిర్వాహకులు ► పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ ఇటీవల ఓ యువకుడు కడుపునొప్పితో అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆపరేషన్ చేయగా.. అది వికటించింది. కచ్చితంగా చనిపోతారని గ్రహించి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లగా అడ్మిషన్‌కు తిరస్కరించారు. తిరిగి అనంతపురం ఆస్పత్రికే వెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని రోగి బంధువులు ఇక్కడి ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశారు. ఎలాగూ చనిపోయే వ్యక్తి.. ఆస్పత్రిలోనే మృతిచెందితే గొడవకు దిగుతారని గ్రహించి దారిలోనే ఇంజక్షన్ వేసి చంపేందుకు పథకం పన్నారు. అలా చేయాలని ఓ టెక్నికల్ అసిస్టెంటుకు చెప్పగా.. అతను నిరాకరించాడు. దీంతో ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుణ్ని పంపి పథకాన్ని అమలు చేశారు. ఈ విషయం తెలిసి బంధువులు వాగ్వాదానికి దిగడంతో రూ.లక్ష చేతిలో పెట్టి పంపించారు. సీఎం రిలీఫ్‌పండ్ నుంచి కూడా సాయం చేయిస్తామని నమ్మబలికారు. నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి ఇటీవల ఓ మహిళ వెళ్లింది. పిత్తాశయంలో రాళ్లు ఉండటంతో ఆపరేషన్ చేశారు. అది ఫెయిలైంది. పేగుకు రంధ్రం పడింది. దీన్ని గ్రహించిన డాక్టర్ బెంగళూరులోని ఓ ఆస్పత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. డిశ్చార్జి రిపోర్ట్ ఇవ్వకుండా పంపారు. బెంగళూరులో ఆ మహిళకు చికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమించి చనిపోయింది. దీంతో రోగి బంధువులు అనంతపురంలోని ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పై ఇద్దరు కూడా పాతికేళ్లలోపు వారే. ఇద్దరి ఆరోగ్య సమస్యలు మరీ ప్రాణాంతకమైనవి కావు. అయినా ప్రాణాలు కోల్పోయారంటే అనుభవం లేని డాక్టర్లు... బాధ్యతారహితమైన చికిత్సే కారణం. (సాక్షిప్రతినిధి, అనంతపురం) :- జిల్లాలో గర్భస్త లింగ నిర్ధారణ చట్టం(పీసీపీఎన్డీ) యాక్టు ప్రకారం 147 రిజిష్టర్డ్ ఆస్పత్రులు ఉన్నాయి. చాలా ఆస్పత్రుల్లో పర్మినెంట్ డాక్టర్లు లేరు. అనుభవం లేని డాక్టర్లతో వైద్యసేవలు అందిస్తున్నారు. ఒక ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ మరో ఆస్పత్రిలోనూ కన్సల్టెంట్‌గా ఉంటున్నారు. కొన్ని ఆస్పత్రులలో ప్రభుత్వ డాక్టర్లు కూడా చికిత్స చేస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉంటే వారు ఆపరేషన్ చేస్తున్నారు. ఒకవేళ లేకపోయినా రోగులను వెనక్కి పంపడం లేదు. అనుభవ ం లేని డాక్టర్లతోనే పని కానిచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పొరపాట్లు జరిగి రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోయినా ఎమర్జెన్సీ కేసులను సైతం అడ్మిట్ చేసుకుంటున్నారు. వేలకు వేలు ఫీజులు గుంజి వారం, పదిరోజుల తర్వాత చేతులెత్తేస్తున్నారు. తమ వల్ల కాదంటూ బెంగళూరు, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లోనే అధికశాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇటీవల గుండె ఆపరేషన్ ఫెయిలై.. రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు సర్దిచెప్పి పంపారు. ఇలాంటి సందర్భాల్లో రోగికి బీపీ పెరిగిందనో, ఎక్కువగా భయపడటంతో ప్రాణాలు పోయాయనే చెబుతూ తప్పించుకుంటున్నారు. పర్యవేక్షణ ఏదీ? ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యుల అర్హతలు, అనుభవం అన్నీ పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తూ డీఎంఅండ్‌హెచ్‌ఓ సర్టిఫికెట్ ఇస్తారు. ఐదేళ్లపాటు అనుమతి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. అయితే..జిల్లాలో వైద్యాధికారులు ఆస్పత్రిని తనిఖీ చేయకుండానే అనుమతి ఇచ్చేస్తున్నారు. తర్వాత కూడా వాటివైపు కన్నెత్తి చూడడంలేదు. కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులకు రాజకీయ అండ ఉండటంతో భయపడి వైద్యాధికారులు తనిఖీలకు వెళ్లడం లేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు - డాక్టర్ వెంకటరమణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యంపై ఎవరైనా లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. మాకు 100 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటి నిర్వహణే భారంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేసే సమయం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి. ఫిర్యాదు లేకుండా తనిఖీలకు వెళితే మమ్మల్ని మరోరకంగా భావించే అవకాశముంది. -
ఉసురు తీసిన పేదరికం
► కాలేయ వ్యాధితో చిన్నారి శరణ్య మృతి ధర్మపురి : పేద కుటుంబంలో జన్మించడమే ఆ చిన్నారి చేసిన పాపం. అనారోగ్యానికి కటిక పేదరికం తోడై నరకయాతన అనుభవించిన చిన్నారిని మృత్యువు కబళించింది.దర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన కరాజుల రవి, లక్ష్మి దంపతులకు కూతురు శరణ్య (7)తో పాటు ఒక కుమారుడున్నారు. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి వారిది. ఉపాధి కోసం రవి దుబాయికి వలస వెళ్లాడు. లక్ష్మి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నాలుగు నెలల క్రితం కడుపు నొప్పితో బాధ పడుతున్న శరణ్యను తల్లి చేతిలో ఉన్న డబ్బుతో కరీంనగర్ ఆస్పత్రికి తీసికెల్లి తల్లి వైద్యం చేయించింది. శరణ్య పొట్ట రోజురోజుకూ పెరిగిపోతూ శ్వాస కూడా కష్టంగా మారింది. వారానికోసారి కరీంనగర్ వెళ్లి కడుపులోంచి నీడిల్‌తో నీటిని బయటకు తీసేవారు. రెండు నెలల క్రితం కరీంనగర్లో మరో ఆస్పత్రిలో చూపించగా పాప కాలేయం చెడిపోయిందని వైద్యులు తెలిపారు. తమిళనాడు ఆస్పత్రికి తరలింపు: పాప కాలేయం చెడిపోయిందని, తమిళనాడులోని వేలూరు ఆస్పత్రికి తీసికెల్లాలని, రూ. 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లి దిక్కుతోచని స్థితిలో పడింది. ఆమె దీన స్థితిని ధర్మపురికి చెందిన రేణికుంట రమేశ్ ఫేస్బుక్ ద్వారా తెలపడంతో బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ముందుకొచ్చి వైద్య ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఆస్పత్రిలో రూ. 80 వేలు ముందస్తుగా చెల్లించారు. ఇరవై రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో చెన్నై తరలించాలని, కాలేయం మార్పిడికి రూ. 20 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు మరో పిడుగులాంటి వార్త చెప్పారు. చేసేదేం లేక ప్రాణాపాయ స్థితిలోని శరణ్యను తీసుకుని తల్లి ఇంటికి చేరుకుంది. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌కు సమాచారం అందించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలందే ఏర్పాట్లు చేశారు. 15 రోజులు వైద్యం అందాక పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకొచ్చింది. నరకయాతన అనుభవించిన చిన్నారి శరణ్య నొప్పితో బాధపడుతూ శుక్రవారం మరణించింది. తమ పేదరికమే కూతుర్ని బలితీసుకుందంటూ తల్లి రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. -
విద్యార్థిని ఆత్మహత్య
కడుపునొప్పికి తాళలేక ఓ విద్యార్థిని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామానికి చెందిన తాడి లావణ్య(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. లావణ్య మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.