Andhra Pradesh Election 2019
-
అంత దూకుడెందుకు బాబూ?
మే 23న రాష్ట్రమంతటా ఎన్నికలు జరిగాయి. ఫలితాలు రాష్ట్ర ప్రజలందరూ కలగన్నట్లే వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. వాడని అస్త్రాలూ లేవు. జనసేన పార్టీ కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తెలుగుదేశం విజయానికి కృషి చేయడం అందరికీ తెలిసిందే. మోదీ గారిని ఎంత ఎక్కువ తిడితే అంత పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో వస్తాయని కూడా చంద్రబాబు కలలు కని కుదేలుపడ్డాడు. మే 30న ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత సాదాసీదాగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ చిరుదరహాసంతో, మొక్కవోని విశ్వాసంతో, నవరత్నాలకు జీవం పోస్తూ జగన్ ప్రయాణం సాగిపోతూనే ఉంది. సెప్టెంబర్ 6వ తారీఖు నాటికి ఆయన పాలన 100 రోజులు పూర్తి చేసుకుంటున్నది. ఆయనకు అభినందనలు తెల్పుతూ ఆశీస్సులు, చేయూత అందిద్దాం. ఇక ఈ మూడు నెలల కాలంలో చంద్రబాబు తన విజ్ఞతను పూర్తిగా కోల్పోయారు. ఎన్నికల ముందు జగన్ గూర్చి ఎన్నెన్ని మాటలన్నాడో. అవినీతిపరుడని ఎంతగా గొంతు చించుకొన్నాడో. చివరికి పులివెందుల పేరును కూడా దూషించాడు. తన మాటలు, అబద్ధాలతో, అస హ్యం వేసే ప్రవర్తనతో రాష్ట్రంలోని ప్రజలందర్నీ జగన్‌వైపు తిరిగేలా చేయగలిగాడు. జగన్ విజయం చంద్రబాబు కలలో కూడా ఊహించనిది. ఏం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు ఎవరైనా తలవంచక తప్పదు. చంద్రబాబులో ఆవేశం, అసహనం, ఆగ్రహం ఎక్కువయ్యాయి. తానేం చేస్తున్నాడో తనకైనా అర్థమౌతున్నదో లేదో. అదేంటో చంద్రబాబు తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ప్రజలెందుకు చీదరించుకొన్నారో ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశోధన చేసుకోకుండా అప్పుడే తిరిగి ఎన్నికలొచ్చేస్తున్నట్లు జగన్‌పై దూకుడుగా వెళ్తున్నాడు. బాబుకు ఇంత దూకుడు అవసరం లేదని ఆ పార్టీ పెద్దలే మాట్లాడుకొంటున్నారు. చంద్రబాబు అభద్రతా భావంతో, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నాడు. ఆనాడు శృతిమించి మోదీని విమర్శించడం. ఆయనేమో అత్యధిక మెజారిటీతో గద్దెనెక్కడం. తననేం చేస్తాడో ఏమో అన్న భయం ఒకవైపు. అందుకే తన ఆంతరంగికులైన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని మోదీ ఇంటికి పంపించేశాడు. ఇది జగమెరిగిన సత్యం. మరోవైపు బీజేపీతో దోస్తీకైనా సిద్ధమే కానీ తన ఎమ్మెల్యేల్ని పోగొట్టుకోవడం మాత్రం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. ఎందుకంటే తన సంఖ్య కుదించుకుపోయి పదికి పడిపోతే తనకున్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి వస్తుంది. 2014లో చంద్రబాబు అధికారానికొచ్చినా జగన్ మీలాగా విమర్శలు చేశారా? చివరికి 23 మంది వైసీపీ శాసనసభ్యుల్ని కొంటే జగన్ పల్లెత్తుమాట అన్నాడా? జగన్ పాదయాత్ర సమయంలో ఆ 23 మంది నియోజక వర్గాలకెళ్లినప్పుడు కూడా వాళ్లను పేరుపెట్టి విమర్శించలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి హుందాగా వెళ్లక, దానిని కూడా మీరు రాజకీయం చేశారు. మీ పలుకులు పయ్యావుల కేశవ్ నోటవిని ప్రజలు నవ్వుకొన్నారు. అదే విధంగా శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ప్రమాణ స్వీకారానికి కూడా తోడుగా వెళ్లక దానిని కూడా రాజకీయం చేసి నవ్వులపాలైంది మీరు కాదా? 14న గవర్నర్ ప్రసంగం నుండి అసెంబ్లీ ముగిసేవరకు చంద్రబాబు తీరు ఆక్షేపణీయం. ప్రతిరోజూ తన శాసససభ్యులతో కలిసి వైసీపీ గిల్లికజ్జాలు పెట్టుకోవడం బాధాకరం. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్నిసార్లు మాట మార్చారు? 20వ తారీఖు నుండి టీడీపీ కార్యకర్తలపై దాడులంటూ అవాస్తవాల కొత్తరాగం అందుకొన్నారు. మళ్లీ పచ్చమీడియా మీతో గొంతుకలిపింది. చంద్రబాబు తన మకాం హైదరాబాద్ నుండి ఉన్నఫళంగా విజయవాడకు మార్చడానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. కానీ ఆయనకు విజయవాడలోని కృష్ణానది కరకట్టపై లింగమనేని అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్ అప్పనంగా దొరికింది. కాస్త పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా అలా అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌లో దిగరు. ఎన్నికల ముందు దేవినేని ఉమ అది అక్రమ కట్టడమని, అధికారానికి వచ్చిన వెంటనే దానిని కూలదోస్తామని ఆర్భాటం చేసి గెలుపొందారు. ఏం చేద్దాం. ఆ అక్రమ కట్టడమే తమ నాయకుడికి నెలవవుతుందని ఊహించే ఉండడు పాపం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిఉండి ఆ అక్రమ నివాసంలో ఉంటూ, తన పార్టీ కార్యకర్తల్ని, అధికారుల్ని కలిసేందుకు దానికి అనుగుణంగా ‘ప్రజావేదిక’ అంటూ మరో హాల్‌ను 7 కోట్ల రూపాయలతో నిర్మించుకోవడం మరో విడ్డూరం. జూన్ 26న ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై రివ్యూచేసి రూ. 2,636 కోట్లు అదనంగా చెల్లించడం జరిగిందని తేలిస్తే మీరెందుకు అంతగా బాధపడ్డారు. చంద్రబాబు వందిమాగదులైతే ఇక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాదని ఎంతగా గొంతులు చించుకొన్నారు. ఏదో కొంత ప్రభుత్వ ఖజానాకు తిరిగి రాబట్టాలని జగన్‌గారు ప్రయత్నిస్తే మీరు చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించ లేదు. ఆ సంస్థలతో మీకున్న అనుబంధాన్ని అజ్ఞానంతో మీరే బయటపెట్టుకున్నారు. మీరున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు ప్రభుత్వం అక్రమ కట్టడం అని నోటీసులిస్తే మీరెందుకు అంతగా అంగలార్చారు. కన్నీళ్లు పెట్టుకొన్నారు. మాలాంటి వారికి ఇప్పటికీ అర్థం కానిది ఒక్కటే. అది నిజంగా మీ సొంతమైందా? లేక ప్రభుత్వానిదా. ఎవరికైనా సందేహం ఎందుకొస్తున్నదంటే అద్దెకున్న మీరే ప్రతిసారీ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు. జూలై 1 నుండి మీ పచ్చ పత్రికలు మరింత నగ్నంగా మారి టీడీపీ కార్యకర్తలపై హత్యలు అంటూ బ్యానర్ ఐటమ్స్ వండి వడ్డించసాగారు. ట్విట్టర్‌ను వేదికగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తండ్రీకొడుకులు విజృం భించారు. చంద్రబాబుకైతే ట్విట్టర్ రుచి బాగా వంటబట్టింది. జూలై 11 నుండి దాదాపు 20 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడివేడిగా జరిగాయి. మంద తక్కువైనా, అరుపుల్లో చంద్రబాబు కనుసైగల మేర టీడీపీ శాసనసభ్యులంతా బాగానే నటించారు. 12వ తారీఖు నాటి సమావేశంలో అయితే జగన్ కూడా ఒక నిమిషం గాడితప్పేలా రెచ్చగొట్టారు. సున్నా శాతం వడ్డీ రుణాల గూర్చి మీకే పూర్తిగా అవగాహన లేనట్లు ప్రవర్తించారు. 17వ తారీఖున కరకట్టపై జరిగిన అక్రమ కట్టడాల చర్చపై మీరు అసత్యాలు మాట్లాడినారు. ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తి ఓ అద్దింటి ఓనర్‌ను కాపాడుతూ మాట్లాడటం చాలా విడ్డూరం అనిపించింది. అదే విధంగా ప్రైవేటు విద్యుత్ సంస్థల వ్యవహారంలో కూడా 25 సంవత్సరాల పాటు అగ్రిమెంటు చేసుకోవడం మీ పార్టీ ప్రతిష్టకు భంగం కల్గించింది. అధికారం కోల్పోయిన మీకెందుకు అంతటి కుతి. కొత్త ప్రభుత్వం ఏం చేసుకొంటే మీకెందుకు? అయినా ప్రజల పక్షాన నిలవాల్సిన మీరు లింగమనేనిపట్ల, ప్రైవేటు విద్యుత్ కొనుగోలుదారులకు, నవయుగ సంస్థకు అండగా నిలబడటం ఎంతవరకు సబబు. ఆలోచిస్తే మీకైనా ఇవి ఛీ అనిపించే క్షణాలు. చంద్రబాబూ... కాస్త దూకుడు తగ్గించి జగన్‌ను కొంతకాలం ప్రశాంతంగా పాలించనీయండి. ఈలోగా సైకిల్‌కు రిపేర్లు చేసుకోండి. -డాక్టర్ విజయ కుమార్, మాజీ సీపీఆర్వో -
‘చినరాజప్పను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుంది’
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్‌లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్‌లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
కరణం బలరాం భార్య, కుమార్తె వివరాలు దాచిపెట్టారు..
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకపోతే ఎన్నికను రద్దు చేయొచ్చు ‘కరణం బలరాం సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదు. చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించకపోయినప్పటికీ ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కరణం బలరాం తన నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టారు. భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారు. నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో, ఆధార్ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్ తన పిటిషన్లో వివరించారు. -
అంత తప్పు నేనేం చేశా: చంద్రబాబు
కుప్పం : ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే బాధగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తున్నా అసలు కారణాలను మాత్రం గుర్తించలేకపోతున్నామన్నారు. ప్రజలను సంక్షేమ పథకాలతో మెప్పించలేకనే ఓటమి పాలైనట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశానే తప్ప తానెన్నడూ తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం గుడుపల్లె, కుప్పంలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ‘నేను చేసిన పనులు బహిరంగంగా కనిపిస్తున్నా ఎన్నికల్లో ప్రజలు ఎందుకిలా తీర్పు ఇచ్చారు..? నేను చేయరాని తప్పు ఏం చేశా..?’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలను నివారించేందుకు అమరావతిలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నించానన్నారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద రైతులిచ్చిన భూములను కొన్ని సంస్థలకు అప్పగిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతోపాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచవచ్చని భావించినట్లు చెప్పారు. ప్రభుత్వ డబ్బు పైసా లేకుండా రాజధానిని నిర్మించాలని ప్రయత్నం చేశానని, ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల అంతా విఫలమైందని వ్యాఖ్యానించారు. కుప్పానికి నీళ్లివ్వండి...: శ్రీశైలం నుంచి నీళ్లు కుప్పం తరలించేందుకు చేసిన ప్రయత్నం చిన్న చిన్న పనుల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీళ్లు ఇవ్వాలని కోరారు. కరువు జిల్లా అనంతపురంలో కియా కార్ల తయారీ కంపెనీని ఏర్పాటు చేయిస్తే చివరకు ఆ అసెంబ్లీ స్థానం కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా, 20 ఏళ్లు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు ఇలాంటి ఫలితాలు ఎదురవటాన్ని కార్యకర్తలు, మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని, ఓటమికి కుంగిపోయి వారిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. -
అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తన రాజీనామాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాననన్నారు. తన రాజీనామా లేఖను మే 19వ తేదీనే కాంగ్రెస్ అధిష్టానానికి పంపించినట్లు చెప్పారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూనే ఉన్నానని, అయితే ఇంతవరకూ రాజీనామాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కాగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. -
బొండా ఉమకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను సరిగా లెక్కించలేదంటూ ఉమ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మంగళవారం తన వాదనలు వినిపించింది. టీడీపీ అభ్యర్థి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించింది. కాగా, పదిహేను రోజులక్రితం దాఖలైన బొండా ఉమ రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. -
వాషింగ్టన్లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
వాషింగ్టన్ డిసి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా అమెరికాలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వర్జీనియా రాష్ట్రములోని చంటిలీ సిటీలో ఈస్ట్ గేట్ పార్క్‌లో తొలకరి జల్లుల మధ్యన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఎంతో ఉత్సహంగా పెద్దఎత్తున హాజరయ్యారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, విజయ సారధి వైఎస్ జగన్‌కిశుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర వలన ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, ఆయన చూపించిన పరిష్కార మార్గాలు, ప్రజలలో విశ్వాసం కలిగించిందని వైఎస్సార్ కంటే ఒక అడుగు ముందుకేసి పరిపాలిస్తారని ఎన్ఆర్ఐలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషానిచ్చిందని వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్ సభ్యులు అన్నారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ప్రజావిజయమని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌కు పట్టంకట్టినందుకు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించాలని ఆకాక్షించారు. (ఏపీలో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం) మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడానికి, పది సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారని పలువురు వక్తలు ముక్త కంఠంతో అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో హోరెత్తించారు. వాషింగ్టన్ డిసి మెట్రో వైఎస్సార్సీపీ కోర్ కమిటీ మెంబెర్స్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అతిథులందరికీ రుచకరమైనా ఆహారాన్ని అందించిన తత్వా రెస్టారెంట్ సుజీత్, వినీత్, బాబీ వారి బృందానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు
-
పవన్‌పై రాంగోపాల్ వర్మ సెటైర్
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని వర్మ ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని, ఆయనను నిజంగా గెలిపించాలనుకునే ఓటర్లు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పవన్‌కే ఓటు వేసేవారంటూ వర్మ సెటైర్ వేశారు. కాగా తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా ప్రత్యర్థులు కుట్ర పన్నారంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: (నన్ను అసెంబ్లీకి అడుగుపెట్టనీకుండా కుట్ర...) -
అంతా మీ వల్లే
సాక్షి, తిరుపతి : కుప్పంలో మెజారిటీ తగ్గటానికి స్థానిక టీడీపీ నేతలే కారణమని చంద్రబాబు అ సంతృప్తి వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందటానికి ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్థులు, జన్మభూమి కమిటీ సభ్యులే కారణమని తేల్చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నా యకులు ఇటీవల వరుసగా అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిసి వస్తున్నారు. మొన్న కుప్పం, తిరుపతి నియోజక వర్గానికి చెందిన నాయకులు చంద్రబాబును కలిశారు. అంతకు ముందు పలమనేరు, పీలేరు, మదనపల్లె, శ్రీకాళహస్తికి చెందిన మరి కొందరు నాయకులు కలిసినట్లు సమాచా రం. చంద్రబాబును కలిసిన నాయకులతో రెండు మూడు మాటలు మాట్లాడి పంపేస్తున్నట్లు తెలి సింది. అది కూడా ఎందుకు ఓటమి పాలయ్యా ము? అందుకు కారణాలు? అనే విషయాలు అడుగుతున్నారు. నియోజక వర్గంలో ఓటమికి ప్రధాన కారణాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా కుప్పం నాయకులపై మా త్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచా రం. కుప్పంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారీగా మెజారిటీ తగ్గిందని, అందుకు ‘మీరే కా రణం’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఓ నాయకుడు వెల్లడించారు. స్థానికంగా ఉన్న భూములను ఆక్రమించుకోవటం, టెండర్లు దక్కించుకుని పనులు నాసిరకంగా చేయడం తదితర పనులు కొంప ముంచాయని గుర్తు చేసినట్లు తెలిసింది. టెలీ కాన్ఫరెన్స్‌లో అంతా బాగుందని చెబుతూ... మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం, చంద్రగిరి విషయంలో స్థానిక నాయకులు టీడీపీ గెలుపు ఖాయమని పలుమార్లు చెప్పారని, తీరా చంద్రగిరిలో ఘోరంగా పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అవినీతి అక్రమాలు కొంప ముంచాయి నీరు–చెట్టు, హౌసింగ్, ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణ తదితర అవినీతి అక్రమాలే కొంప ముంచాయని సన్నిహితులు వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి తోడు జన్మభూమి కమిటీల ఆగడాలు అధికమయ్యాయని, లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లు చేసి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని గుర్తుచేసినట్లు తెలిసింది. ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకోవటం, అధికారులను బెదిరించడం తదితర కారణాలు దెబ్బతీసినట్లు చర్చకు వచ్చాయి. అవినీతి అక్రమాలకు పాల్పడినా... ఓటర్లను కొనుగోలు చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయడం మరిచి, స్వార్థం చూసుకున్నామని, అయితే ఇవేమీ జనం పట్టించుకోరని భావించానని, అన్నింటినీ జనం గుర్తుపెట్టుకున్న విషయం గురించి ప్రధానంగా చర్చించనట్లు తెలిసింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తప్పు చేశామని పలమనేరు నాయకులు చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి జనంలో ఉండడం, వారి సమస్యల గురించి తెలుసుకోవడం, వాటిపై పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవేమీ తనకు తెలియకుండా అంతా బాగుందని చెప్పి, ఓటమికి కారణమయ్యారని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని జిల్లాకు వచ్చి నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని స్థానిక నాయకులకు చెప్పి పంపటం గమనార్హం. -
స్వయంకృత పరాభవం
2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు ఎన్నికల వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పేర్కొన్నప్పటికీ చాలామంది ఇంత అనూహ్యమైన విజయం వైఎస్సార్సీపీకి, తెలుగుదేశానికి పరాజయం ఊహించలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఒక సంస్థ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎన్నికలలో బాబు గారు ఊహించలేనంత పరాజయాన్ని చవిచూడబోతున్నారు అని నిర్ధారించింది. ఆ సంస్థ అధిపతి ఎన్నికల ముందే నాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 30 సీట్లకు మించి రాకపోవచ్చని, బాబు గారు ఊహించనంత పరాజ యాన్ని చవిచూడబోతున్నాడు అని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలకు దరిదాపులలో వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు, తెలుగుదేశానికి 23 స్థానాలు, జనసేనకు ఒక స్థానం వచ్చాయి. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశానికి 23 స్థానాలు వచ్చాయి కానీ అదే జరగకుండా ఉంటే పది స్థానాలు మించి ఉండేవి కావు. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రథమ కారణం గత ఐదు సంవత్సరాల్లోని ప్రభుత్వ అవినీతి పాలన. బాబు గారు 2009, 2014 ఎన్నికలను అధికారంలో లేకుండా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎన్నికల ఖర్చులకు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. 2014లో అధికారానికి వచ్చినప్పటినుంచి పాలన 2019 ఎన్నికలను ధనబలంతో ఎలా గెలవాలనే ఆలోచనతోనే సాగింది. దీనితో అవినీతి విశృంఖలంగా అయింది. ఏదో ఒక స్థాయిలో కాక వివిధ స్థాయిల్లో అవినీతి పెరిగిపోయింది. ఇసుక నుంచి మట్టి దాకా కాదేది అవినీతికి అనర్హం అన్న స్థాయిలో పరిపాలన నడిచింది. ఇదే ఈనాటి తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. మొదటినుంచీ బాబు గారికి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కమ్యూనిస్టుల సంస్థాగత విధానం అంటే చాలా అభిమానం. కార్యకర్తల సహాయంతో వారు రాష్ట్రాన్ని అప్రతిహతంగా 30 సంవత్సరాలు పాలించారు అనేది ఆయన మనసులో బాగా నాటుకున్నది. అదే విధమైన క్యాడర్‌ను తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేయాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన మరిచిన ఒక ముఖ్య విషయం ఏందంటే మౌలిక సిద్ధాంతాలు లేని ఏ కేడర్ అయినా లాభం కన్నా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కార్యకర్తలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక ఈ కమిటీల చేతుల్లో పెట్టారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీలు చేసిన నష్టం ఇంతా అంతా కాదు. అర్హత లేని వాళ్లకు లబ్ధి కల్పించడం ద్వారా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పెంపొందించటంలో ఈ కమిటీలు ప్రధాన పాత్ర వహించాయి. బాబుగారి గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక వర్గానికి పెద్దపీట వేశారనేది సొంత పార్టీలోనే ఒక ప్రధాన చర్చకు దారితీసింది. ఇక సాధారణ ప్రజల విషయంలో చెప్పనవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజల వలన ప్రజల చేత కొందరి కొరకు అన్న ధోరణిలో పాలన సాగించింది. ఈ సంకుచిత ఎజెండా ప్రజలకు నచ్చలేదు. పైపెచ్చు ఈ వర్గంలో కొందరు ప్రదర్శించిన అహంభావ ధోరణులు తీవ్ర ప్రజా వ్యతి రేకతకు కారణాలయ్యాయి. 2004 ఓటమికి ప్రధాన కారణం బాబు గారి దృష్టిలో ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత. దీనిని రూపుమాపటం కోసం 2014 నుంచి ప్రయత్నం ప్రారంభించారు. కానీ ఆయన ఎన్నుకున్న విధానం లోపభూయిష్టం. ఉద్యోగ సంఘాల నేతలను వశపరచుకోవడం ద్వారా ఉద్యోగస్తులను తన వైపు తిప్పుకోవచ్చని భావించారు. సంఘ నేతలు స్థాయికి మించిన ప్రాధాన్యాన్ని ప్రభుత్వంలో పొంది తమ సొంత ఎజెండాను ముందుకు తీసుకొనిపోయినారు కానీ వారి వల్ల ఉద్యోగస్తులు ఏవిధంగానూ ప్రభావితం కాలేదు. కేవలం అభివృద్ధిని ఒక ప్రాంతాల్లో కేంద్రీకరించడం ద్వారా ఇతర ప్రాంతాలలో వ్యతిరేక భావం ప్రబలింది. రాయలసీమ మొత్తానికి రెండే రెండు సీట్లు బాబు గారికి, బాలకృష్ణ గారికి రావటమే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో పనులకు.. చేసిన ప్రచారానికి ఎక్కడా పొంతన లేదు. దీని ప్రభావం కూడా ఎన్నికల సమయంలో ఉన్నది. విభజన అంశాలను ప్రధాన ఎజెండాగా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి మోదీ గారిని, జగన్ గారిని రాష్ట్ర వ్యతిరేకులుగా చూపెట్టడానికి బాబు గారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అన్నిటికీ మించి తాను ప్రత్యేకంగా ఏరికోరి ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం పరిపాలన అంశాలలో ఆయనకు మద్దతుగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలలో అదే విధంగా ఏర్పాటు చేసు కున్న పార్టీ కార్యదర్శి, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ సహాయం చేయటానికి ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఓటమి చెందటానికి అంతగా బయట శత్రువుల అవసరం లేకపోవచ్చు. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
వైఎస్ జగన్ సీఎం కావడంతో అభిమాని పాదయాత్ర
కొత్తకోట రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడంతోపాటు ముఖ్యమంత్రి కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు ఓ యువకుడు ఇడుపులపాయకు పాదయాత్రగా బయల్దేరాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమాని అయిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మండలం నల్లవెళ్లి గ్రామానికి చెందిన శివలింగం గత నెల 29న ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టాడు. ఈపాదయాత్ర శనివారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంది. పాదయాత్ర చేస్తున్న శివలింగాన్ని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినయ్యానని, అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా మారనన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తానని తమ ఇంటి దైవమైన మేడాలమ్మ దేవాలయంలో మొక్కుకున్నానని, అనుకున్నట్లే వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తున్నట్టు శివలింగం తెలిపాడు. చెప్పులు లేకుండా రోజుకు దాదాపు 40కిలోమీటర్లు నడుస్తున్నట్టు ఈనెల 9న ఇడుపులపాయకు చేరుకోనున్నట్టు ఆయన తెలిపారు. శివలింగం పాదయాత్ర చేస్తుండగా ఆయనకు సహాయంగా గ్రామానికి చెందిన ఇద్దరు వైఎస్ఆర్ అభిమానులు మాజీ ఎంపీటీసీ సభ్యులు కిష్టగౌడ్, బి.వెంకటేష్ బైక్‌పై వస్తూ అవసరాలను తీర్చుతున్నారు. -
విదురుడిలా! వికర్ణుడిలా!
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది పది రోజుల క్రితం వరకు రాష్ట్రమంతా ఉత్కంఠ! ముఖ్యంగా పాత్రికేయుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న! ఎన్నికలు జరగడానికి నెలముందు హైదరాబాదు నుంచి టంకశాల అశోక్ గారు ఫోన్‌చేసి ‘అంధ్రప్రదేశ్‌లో ఎట్లుంది?’ అని అడిగారు. ‘కాస్త జగన్ వేవ్ కనిపిస్తోందండీ’ అన్నాను. హైదరాబాద్‌లో ఉంటున్న మరో సీనియర్ జర్నలిస్ట్ (పీకాక్ క్లాసిక్స్) గాంధీ గారు ఫోన్ చేసి ‘ఏపీలో ఎలా ఉందండి’ అన్నారు. ‘కాస్త జగన్ వేవ్ ఉందండి’ అన్నా. ‘బీజేపీపై వ్యతిరేకత జగన్‌పైన ఏమైనా పడుతుందా?’ అని అడిగారు. ‘బీజేపీపైన వ్యతిరేకత ఉంటే అది ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీపైనే ఉంటుంది కానీ జగన్‌పైన ఎలా ఉంటుంది’ అన్నాను. హైదరాబాదులోని మరో సీనియర్ జర్నలిస్ట్(80 ఏళ్లు) ఫోన్ చేసి ‘శర్మాజీ రాయలసీమలో ఎట్లా ఉంది?’ అని అడిగారు. ‘సీమ ప్రజలు టీడీపీ అంటే చాలా కోపంగా ఉన్నారు’ అన్నా. ‘ఎందుకు’ అని అడిగారు. ‘వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నీళ్ళు రాయలసీమకు రావడానికి ముఖద్వారంలాంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచితే, దేవినేని ఉమ ప్రకాశం బ్యారేజిని దిగ్బంధం చేశారు. దాని వెనుక బాబు ఉన్నారు. గాలేరునగరి, హంద్రీనీవాలను పూర్తి చేయకుండా పట్టిసీమను పూర్తి చేశారు. టీడీపీకి అనంతపురం జిల్లాలో కొన్ని సీట్లు రావచ్చునేమో కానీ, మిగతా సీమలో రావు’ అని కరాఖండిగా చెప్పాను. ‘హంద్రీనీవాకు నీళ్లొది లారు కదా! చిత్తూరు జిల్లాలో పీలేరు వరకు నీళ్ళొచ్చాయట గదా’ అని అడిగారు. ‘నిజమే సార్.. ఎన్నికల ముందు కాలువల్లోకి కాసిని నీళ్లొదిలితే, ఆ నీళ్లను చూసి వెంటనే పంటలేసి, వేసిన పంటలన్నీ నెలరోజుల్లో పండిపోయి, ఆ వెంటనే దారిద్య్రమంతా తీరి పోయి రైతులు ఆనంద తాండవమాడతారా!?’ అని ప్రశ్నించాను. ‘సిద్దేశ్వరం అలుగు కోసం ఆందోళన చేసిన వేలాది మంది రైతులను అరెస్టులు చేస్తే అంతా మర్చిపోయి టీడీపీకి ఓట్లు గుద్దేస్తారా!? ’ అని అడిగేశాను. ‘లేదు శర్మాజీ... మహిళలంతా టీడీపీ పక్కే ఉన్నారు. డ్వాక్రా మహిళలకు డబ్బులు వేస్తున్నారు కదా!’ అని దింపుడు కళ్లం ఆశ వ్యక్తం చేశారు. ‘డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని, ఐదేళ్లూ కాలయాపన చేసి, ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో డబ్బులిస్తే ఓట్లేస్తారా సార్?’ అని ప్రశ్నించా. చివరగా ఆయన ఒక తీర్పు చెప్పారు ‘మీరన్నట్టు టీడీపీ ఓడితే అది జగన్ కోసం ఈవీఎంలను మోడీ ట్యాంపరింగ్ చేయించారని రుజువైనట్టే. ఒకవేళ టీడీపీ గెలిస్తే ట్యాంపరింగ్ జరగనట్టు భావించాలి’ అన్నారు. సామాన్యులా..సెఫాలజిస్టులా..! ఏపీలో జగన్ వేవ్ ఉందని ముగ్గురు సీనియర్ జర్నలిస్టులతో ఇంత గట్టిగా నేనెలా చెప్పగలిగాను!? నేనేమీ సెఫాలజి స్టును కాను! క్షౌరశాలలో కూర్చున్నప్పుడు ‘రంజిత్.. ఎట్లా ఉంది రాజకీయం’ అని అడిగాను. ‘అంతా జగనే అంటాండారు’ అన్నాడు. ‘ఎవరికి ఓటేస్తున్నావు రెడ్డెమ్మా’ అని మా పనిమనిషిని అడిగాను. ‘జగన్‌కేస్తాండాం’ అంది. ‘ఎందుకు?’ అని అడిగా. ‘ఏమో నాకు తెల్దు. మా వోళ్లంతా జగన్‌కే వెయ్యాలా అంటాండారు’ అన్నది. ‘ఎట్లా ఉంది రాజకీయం నారాయణా’ అని చెట్టుకింద ఉన్న స్కూటర్ మెకానిక్‌ను అడిగాను. ‘ఏం చెపుతాం సార్. ఎండలు మండిపోతాండాయి. టౌన్లో కెళ్లి స్పేర్‌పార్ట్స్ తెద్దామంటే వెళ్లలేకపోతున్నా. ఇంత ఎండల్లో జగన్ ఇన్ని నెలలు, ఇన్ని మైళ్లు ఎట్ల నడిచినాడో? టౌన్లో కెళ్లకపోతే నాకైతే గడవదు కానీ, నడవకపోతే ఆయనకేం గడవదా!’ అన్నాడు. ఎన్నికల ఫలితాలకు ముందు పాలకొల్లు వెళ్లాను. నాపక్కన కూర్చున భీమవరానికి చెందిన ఒక రైతు (కాపు)ను ‘ఎవరు గెలుస్తారు?’ అని అడిగాను. ‘మా వాళ్లంతా జగనే రావచ్చంటున్నారండి’ అన్నాడు. తిరుగు ప్రయాణంలో నాపక్కన కూర్చున్న విద్యార్థులనడిగాను. ‘జగన్‌కు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారండి’ అని చెప్పారు. జగన్ వేవ్ అప్పటివరకు రాయలసీమలో మాత్రమే అనుకున్నా. వీళ్ళతో మాట్లాడాక టీడీపీ కంచుకోటలు కూడా బద్దలవుతున్నాయని గ్రహించా. అయినా ఫలి తాల వరకు ఎదురుచూడక తప్పదు. మే నెల 23న మండిపోయే ఎండల్లో తెలుగు నాట కనీవినీ ఎరుగని ఒక టోర్నడో వచ్చింది. ఆ టోర్నడోలో చాలామంది టీడీపీ నేతలు కొట్టుకుపోయారు. సీమలోని 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాల్లో ఆపార్టీ ఓడిపోయింది. మూడే స్థానాలు దక్కించుకుంది. తొలి రౌండ్లో ఆ పార్టీ నేత బాబు కూడా వెనుకబడిపోయారు. ఎన్నికల గురించి నాతో మాట్లాడిన ఈ సామాన్యులే అసలు సిసలైన సెఫాలజిస్టులన్న విషయం అప్పుడే బోధపడింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక టంకశాల అశోక్, గాంధీగార్లతో ఫోన్లో మాట్లాడుతూ ‘జగన్ వేవ్ ఉందని పసిగట్టాను కానీ, ఇంత బలంగా ఉంటుందని ఊహించలేకపోయా’ అన్నాను. జగన్ వేవ్ ఉందని మరికొంతమంది కూడా చెప్పారని వారు నిర్ధారించారు. ‘ప్రజలు జగన్‌ని ప్రతిపక్ష నేతగా కూడా తిరస్కరి స్తార’ని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. కొందరు నాయకులు టీవీ కెమెరాల ముందుకొచ్చి మీసాలు మెలేశారు. మరి కొందరు తొడలు కొట్టారు. ఫలితాలతో తొడలు విరిగిన దుర్యోధనుడిలా పడిపోయారు. చాలా పత్రికలు, చానళ్లు ఫలితాలను పసిగట్టలేకపోయాయి. ఒక వేళ పసిగట్టినా, యాజమాన్యం మెప్పుకోసం చావుకోసం పాడిన జోలపాటలా విశ్లేషణలను వినిపించాయి. లగడపాటి చెప్పిన జోస్యాన్ని రాత్రీపగలు అనకుండా ప్రసారం చేశాయి. కొన్ని పత్రికలు అబద్ధాల ప్రయోగశాలలయ్యాయి. మహాభారతంలో విదురుడు, వికర్ణుడి పాత్రలు విశిష్టమైనవి. ద్రౌపదిని కౌరవ సభకు తీసుకురమ్మని ధుర్యోధనుడు ఆదేశిస్తే విదురుడు తిరస్కరిస్తాడు. ‘సభలో ద్రౌపది వేసిన ప్రశ్నలకు బుద్ధిమంతులంతా సమాధానం చెప్పాలి. ధర్మసందేహం తీర్చని రోజు సభలోని సజ్జనులందరికీ ఆ పాపం అంటుకుం టుంది’ అని హెచ్చరిస్తాడు. ద్రౌపదిని కురుసభకు తీసుకొచ్చినప్పుడు ‘భీష్ముడు, ద్రోణుడు, ధృత రాష్ట్రుడు, కృపుడువంటి పెద్దలు మౌనంగా ఉన్నారు. మిగిలిన ధర్మజ్ఞులైనా రాగద్వేషాలు మాని ఆలోచించి చెప్పండి’ అంటాడు వికర్ణుడు. కురుక్షేత్రంలో విదురుడు ఏ పక్షమూ వహించడు. సమాజంలో దారుణాలు జరుగుతున్నప్పుడు పత్రికలు, వార్తా చానళ్లు విదురుడి లాగా, వికర్ణుడిలా ప్రశ్నించాలి. రాజధాని నిర్మాణం పేరుతో పచ్చని పంటపొలాలను నాశనం చేసి, భూ కుంభకోణాలకు పాల్పడినప్పుడు, కాల్‌మనీ సెక్స్ రాకెట్ బైటపడినప్పుడు, మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఇసుకలో పొర్లించి కొట్టినప్పుడు ఏ పత్రికలు, చానళ్లు ఎలా వ్యవహరించాయో అవి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటనలపై పాత్రికేయులు నిజాల నిప్పులపైన కాల్చి నిగ్గుతేల్చాలి. మీడియా విదురుడు, వికర్ణుడి పాత్రను పోషించి ఉంటే నాటి పాలకులకు క్షేత్రస్థాయి వాస్తవాలు ఏమిటో కనీసం అర్థమయ్యేవి. రాఘవ శర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, తిరుపతి మొబైల్ : 94932 26180 -
పెడధోరణికి సమాధి–ప్రగతికి పునాది
‘వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్.’ సవ్యంగా, సలక్షణంగా ప్రారంభమైన పని సగం పూర్తయినట్టే అంటారు. గురువారంనాడు అమరావతిలో, ఢిల్లీలో పదవీ ప్రమాణ స్వీకారోత్సవాలు అద్భుతంగా జరిగాయి. ఎన్నికలలో ప్రజలు తమ నిర్ణయం నిర్ద్వంద్వంగా, ప్రస్ఫుటంగా ప్రకటించారు. ప్రజల తీర్పును అను సరించి అమరావతిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఢిల్లీలో నరేంద్రమోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జగన్ ఒంటరిగా ప్రమాణం చేయగా, మోదీ మరి 53 మంది సహచరులతో కొలువుదీరారు. వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రుల నియామకం జరుగుతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ప్రజలు అధికా రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని తిరస్కరించి ప్రతిప„ý మైన వైఎస్ ఆర్సీపీకి పట్టం కట్టారు. దేశ ప్రజలు అధికారంలో ఉన్న మోదీ సారథ్యాన్ని ఆమోదించి మరో ఐదేళ్ళు సమధికోత్సాహంతో పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజలు ఒకే విధమైన తీర్పు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌కు అఖండ విజయం ప్రసా దించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 90 కోట్లమంది ఓటర్లూ దాదాపుగా ఒకే తరహాలో తీర్మానించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభావం అంతగా లేకపోయినా కర్ణాటకలో అధికంగానూ, తెలంగాణలో గణనీ యంగానూ మోదీ హవా పని చేసింది. దేశం మొత్తం మీద బీజేపీది గొప్ప విజ యం. బీజేపీ ప్రచారం చేసిన ‘మోదీ హై తో ముమ్కిన్ హై’(మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే) నినాదాన్ని ఓటర్లలో అధిక సంఖ్యాకులు విశ్వసించారు. ‘ఆయేగా తో మోదీ హీ’ (మోదీయే వస్తాడు) నినాదం ముమ్మాటికీ నిజమై కూర్చున్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత 2004లో జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి వేలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మీదట తొలిసంతకం వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఫైల్ పైన చేశారు. ఆయన కుమారుడు తండ్రి కంటే ఎక్కువకాలం, ఎక్కువ దూరం పాదయాత్ర చేసి, ఎన్నికలలో తండ్రికంటే ఘన మైన విజయం సాధించి తండ్రిని మించిన తనయుడని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని రూ. 2,250లకు పెంచే ఫైలుపైన తొలిసంతకం చేసి అవ్వాతాతలకు మోదం కలి గించారు. ప్రజాసంక్షేమం విషయంలో వైఎస్ ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానన్న హామీని నిలబెట్టుకుంటూ త్రికరణశుద్ధిగా ప్రస్థా నం ప్రారంభించారు. అధ్వానంగా ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉన్నది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు తోడు జగన్ ఎన్నికల ప్రచారానికి ముందే ప్రకటించిన నవరత్నాలలో భాగంగా చేపట్టవలసిన పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వేతనాలు ఉదారంగా పెంచుతుందనే ఆశతో ఉన్నారు. రాజధాని నగర నిర్మాణం భారీ ఖర్చుతో కూడిన పని. కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడం, ఇచ్చిన హామీలను అమలు జరపడం ప్రభుత్వం ఎదుట ఉన్న పెనుసవాళ్లు. టీడీపీ ప్రభుత్వం దాదాపు రెండు ల„ý ల కోట్ల రూపాయలు అప్పు చేసి చిరు ఆస్తి కూడా నిర్మిం చకుండా ఖజానాను ఖాళీ చేసింది. కేంద్రం బకాయిలు చెల్లించడంతో సరిపుచ్చు కోకుండా అదనపు ఆర్థిక సహాయం చేయాలి. ప్రత్యేక హోదా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలూ, వ్యాపార సంస్థలూ వెలసి ఆర్థిక వనరులు పెంపొందుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) జగన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి వచ్చి ‘కావలసింది ఖడ్గ చాలనం కాదు, కరచాలనం’ అని హితవాక్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పరస్పరం సహకరించుకుంటూ ప్రగతి పథంలో ప్రయాణం చేయాలని అనడం ఆప్తవాక్యం. నదీజలాల విషయంలో కేసీఆర్ ఇచ్చిన భరోసా స్వాగతించదగినది. తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందదాయకం. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా పరుగులెత్తిస్తూ నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని జగన్ ఎంత వేగంగా, ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా నడిపిస్తారోనని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలూ, దేశంలోని ఇతర ప్రాంతాల నేతలూ, ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన తీరు జగన్ ఎటువంటి సవాళ్ళనైనా జయప్రదంగా ఎదుర్కోగలరనే విశ్వాసం కలిగిస్తుంది. 2014లో ఓడిపోకుండా స్వల్ప మెజారిటీతో ఆ పార్టీ గెలుపొంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు జగన్‌కు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించే అవకాశం ఉండేది కాదు. పాదయాత్రలో సుమారు కోటిమందిని కలుసుకొని వారి వెతలు ఆలకించి మనస్సులో నమోదు చేసుకునే సందర్భం ఉండేది కాదు. పాదయాత్ర ఫలితంగానూ, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాల కారణంగానూ, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థమైన పాత్ర పోషించడం వల్లనూ ప్రజల గురించీ, వారి సమస్యల గురించీ సంపూర్ణమైన అవగాహన ఏర్పడింది. క్షేత్రజ్ఞానం విశేషంగా పెరిగింది. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉండటం వల్ల మేలు జరిగింది. అప్పుడే గెలిచి ఉంటే అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చారనీ, విశేష అనుభవం కలిగిన చంద్రబాబుకి అధికారం అప్పగిస్తే అద్భుతాలు చేసేవారనీ ప్రచారం చేయడానికి వీలుండేది. చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఆయనను ముఖ్య మంత్రిని చేసినందుకు చింతించి, వగచిన ప్రజలు కసితో టీడీపీని చిత్తుగా ఓడిం చారు. వైఎస్ఆర్సీపీ అఖండ విజయానికి రెండు కారణాలు–ఒకటి, జగన్ మాట తప్పని, మడమ తిప్పని మనిషనీ, హామీలు తు.చ. తప్పకుండా అమలు చేస్తా రనీ, ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడనీ, సమర్థంగా పరిపాలిస్తారనీ బల మైన విశ్వాసం. రెండు, చంద్రబాబుపట్ల పెరిగిన అవిశ్వాసం, అసహనం, ఆగ్రహం. ఫలితంగా చంద్రబాబుకి అవకాశం ఇవ్వకుండా తప్పు చేశామని ఓటర్లు అనుకునే అవకాశం లేదు. జీవితంలో సంభవించే పరిణామాలను ప్రశ్నిం చకుండా స్వీకరించాలని తత్త్వవేత్తలు చెప్పిన హితవు జగన్‌కు అక్షరాలా వర్తి స్తుంది. ‘ఫెయిల్యూర్ ఈజ్ హైరోడ్ టు సక్సెస్’ (పరాజయం విజయానికి రహ దారి) అనే నానుడిని సత్యమని నిరూపిస్తూ అద్భుత విజయం సాధించిన జగన్ ఉత్తమ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడానికి అనువైన వాతావరణం ఈ రోజు ఆంధ్రావనిలో నెలకొన్నది. పెరిగిన మోదీ ఆత్మవిశ్వాసం రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్రమోదీ తనతో పాటు పాతిక మంది కేబినెట్ మంత్రులనూ, అంతకంటే ఎక్కువ మంది సహాయ మంత్రు లనూ ఒకే విడత నియమించడం పెరిగిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కొత్త మంత్రిమండలిలో విధిగా చెప్పుకోవలసిన విశేషాలు ముచ్చటగా మూడు ఉన్నాయి. ఒకటి, బీజేపీ అధ్యక్షుడుగా అనేక విజయాలు అందించిన అమిత్‌షాని మంత్రిమండలిలోకి తీసుకోవడం. అమిత్‌షా తన వారసుడని మోదీ చెప్పకనే చెప్పారు. తన కంటే 14 ఏళ్ళు చిన్నవాడైన అమిత్‌షాను తన తర్వాత స్థానంలో దేశీయాంగమంత్రిగా నిలపడం మోదీ చేసిన సరికొత్త ప్రయోగం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు సహాయమంత్రి హోదాలోనే అమిత్‌షా హోంశాఖను నిర్వహించేవారు. షా పట్ల మోదీకి ఉన్న అచంచలమైన విశ్వాసానికి తాజా నిర్ణయం నిదర్శనం. కశ్మీర్లో శాంతి స్థాపనకు ఆయన ఎటువంటి చొరవ ప్రదర్శిస్తారో చూడాలి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు కశ్మీర్లో 370వ అధిక రణను రద్దు చేస్తారా? మందిర నిర్మాణానికి ముందడుగు వేస్తారా? గోరక్షకుల పేరిట అన్యమతస్తులపై జరుగుతున్న దాడులను అరికడతారా? ఏం జరుగు తుందో చూడాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలకూ, నిఘా సంస్థలకూ ఎటువంటి స్వేచ్ఛ ఇస్తారో గమనించాలి. మంత్రిమండలిలో అగ్రస్థానం అమిత్‌షాకు ఒక రకంగా అగ్నిపరీక్ష. రెండు, నిర్మలా సీతారామన్‌ను ఆర్థికమంత్రిగా నియమిం చడం మరో సాహసోపేతమైన ప్రయోగం. ఆమెకు రక్షణశాఖ అప్పగించినప్పుడే మోదీ చరిత్ర సృష్టించారు. అంతవరకూ ఆ శాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన మహిళా మంత్రి ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆర్థికశాఖా అంతే. దీన్ని స్వతంత్రంగా నిర్వహించే బాధ్యత ఒక మహిళకు అప్పగించడం ఇదే ప్రథమం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూ రక్షణ, ఆర్థిక శాఖలను కొంతకాలం పర్యవేక్షించారు. అంతే. పార్టీ ప్రవక్త(ప్రతినిధి)గా తన ప్రతిభాపాటవాలతో అగ్రనాయకులను మెప్పించి, మంత్రిమండలిలో సహాయ మంత్రిగా ప్రవేశించి, రాజ్యసభలో సభ్యత్వం సంపా దించిన నిర్మల అధికార సోపానంలో వేగంగా అడుగులు వేస్తూ ఎదిగారు. తమిళనాట పుట్టి, తెలుగునాట మెట్టి, కన్నడసీమ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విద్యాధికురాలు ఆమె. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేసి, ఇండో–యూరోపియన్ వాణిజ్యంపైన పీహెచ్డీ చేశారు. ప్రైస్‌వాటర్ కూపర్స్ అనే బహుళజాతి సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పని చేశారు. నిర్మల రక్షణమంత్రిగా రాణించినట్టే ఆర్థికమంత్రిగా సైతం మోదీ నమ్మ కాన్ని వమ్ము చేయరని చెప్పవచ్చు. విదేశాంగమంత్రిగా మాజీ దౌత్యాధికారి మూడు, విదేశాంగమంత్రిగా నియుక్తుడైన జైశంకర్. ఆయనా జెఎన్యూలో పీహెచ్డీ చేశారు. ఇండో–అమెరికన్ అణు ఒప్పందంపైన 2005 నుంచి 2007లో మన్మోహన్సింగ్, జార్జి బుష్‌ల సంతకాలు జరిగే వరకూ జరిగిన చర్చలలో క్రియాశీలక పాత్ర పోషించిన దౌత్యవేత్త. 2017లో డోక్లాం వివాదం కారణంగా చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌తో కయ్యం నిత్యకృత్యమై సంబంధాలు నానాటికీ తీసికట్టుగా దిగజారుతున్నాయి. వీటితో సంబంధాలు పెంపొందిం^è గలిగితే జైశంకర్ జన్మ ధన్యమైనట్టు భావించాలి. ఆయన తండ్రి కె. సుబ్రహ్మణ్యం రక్షణ వ్యవహారాలలో అగ్రశ్రేణి విశ్లేషకుడు. చాలా మంది ప్రధానులు ఆయన సలహాలు సగౌరవంగా స్వీకరించేవారు. ఆరోగ్యం సహ కరించకపోయినా మనసున్న విదేశాంగమంత్రిగా మంచిపేరు తెచ్చుకున్న సుష్మాస్వరాజ్ స్థానంలో నియుక్తుడైన జైశంకర్ కేబినెట్ మంత్రి పదవి పొందిన ప్రథమ భారత దౌత్యాధికారి. మేనకాగాంధీకీ, కల్నల్ రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్కీ, మరికొందరు ముఖ్యులకూ ఎందుకు ఉద్వాసన చెప్పారో తెలియదు. ఎప్పటిలాగానే కేంద్ర మంత్రిమండలిలో దక్షిణాదికి తగిన ప్రాతినిధ్యం లేదు. ఉత్తరభారతం, పశ్చిమభారతం ఎన్డీఏ ప్రభుత్వంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ స్థానం ఆక్రమించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాబల్యం, పరిచయాలూ కలిగిన కిషన్‌రెడ్డిని హోంశాఖ సహాయమంత్రిగా తీసు కోవడం విశేషం. యువమోర్చా కార్యనిర్వాహకుడిగా, బీజేపీకి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేశారు. ప్రధానితో సాన్నిహిత్యం ఉంది. కిషన్‌రెడ్డికి మంత్రిపదవి రావడం సముచితమేనంటూ అందరూ హర్షం ప్రక టిస్తున్నారు. అమిత్‌షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశంపైన ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర పరిశీలకుడిగా పని చేసిన జగత్ ప్రసాద్ నడ్డా లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ పర్యవేక్షకుడిగా అనూహ్యమైన విజయాలు సాధించిన నేపథ్యంలో ఆయనను పార్టీ పదవి వరించవచ్చునని సంకేతాలు వెలువ డుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేరు కూడా వినిపిస్తున్నది. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంపూర్ణ మెజారిటీలు సాధిం చిన పాలకపక్షాలు ఉండటం, ప్రధానికీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు లకూ మధ్య స్పర్థలు లేకపోవడం సంతోషించదగిన పరిణామం. ఇది ప్రగతికీ, సుస్థిరతకూ దారితీసే సానుకూల వాతావరణం. అయిదేళ్ళపాటు కుటిల రాజకీ యాలకూ, స్వార్థప్రయోజనాలకూ, ఎత్తులకూ, జిత్తులకూ, అవినీతికీ తావు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వాలు అంకిత భావంతో, ఏకాగ్రదృష్టితో కృషి చేస్తే ఇటీవలి ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన వివేక వంతమైన తీర్పు సార్థకం అవుతుంది. ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ వంటి పార్టీలు సాగించిన పెడధోరణులకు తెరపడుతుంది. సకారాత్మక, నిర్మాణాత్మక రాజకీయాలకు పాలకులందరూ శ్రీకారం చుట్టవలసిన శుభసందర్భం ఇది. కె. రామచంద్రమూర్తి -
ఎంత వ్యత్యాసం!
నవ్యాంధ్రలో తొలిపొద్దు పొడిచింది.. సంక్షేమ పాలనలో నవ శకం ఆరంభమైంది.. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారం కానుంది.. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పింఛన్ల పెంపుపై చేసిన మొదటి సంతకంతో ప్రజాపాలనలో తొలి అడుగు వేసింది.. ఈ అద్భుత ఘట్టానికి విజయవాడ నగరం సాక్షీభూతంగా నిలిచింది.. రాజకీయ విభేదాలు, కుల మతాల పట్టింపులు లేని, అవినీతి రహిత పాలనే తన అభిమతమని.. ఇందుకు శ్రద్ధతో.. అంతఃకరణ శుద్ధితో పాలన సాగిస్తానంటూ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి జగమంతా జేజేలు పలికింది.. శతమానం భవతి అంటూ మనసారా దీవించింది. సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పక్షాన ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే.. అధికారులకు ప్రాణసంకటంగా మారేది. ముఖ్యంగా రాజధాని విజయవాడలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత అధికారులపైనే ఉండేది. దీనికి సంబంధించిన ఖర్చు కూడా వారే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ తర్వాత బిల్లులు మంజూరు చేయకపోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించేది. దీంతో అధికారులు ఇబ్బందులు పడేవారు. ‘దీక్ష’ ఏదైనా... చంద్రబాబు ప్రభుత్వం ధర్మపోరాట దీక్ష, ఏటా జూన్ 2 నవ నిర్మాణదీక్షలను నిర్వహించింది. అలాగే రేషన్ డీలర్లతో, ఆశా వర్కర్లు, పోలీస్‌హోమ్ గార్డులతో సమావేశాలు నిర్వహించింది. ఆయా కార్యక్రమాలకు సంబంధించి జనసమీకరణ అధికారులు తలకు మించిన భారమయ్యేది. ఆర్టీసీ నుంచి బస్సులు అద్దెకు తీసుకుని డ్వాక్రా గ్రూపులు, పార్టీ కార్యకర్తల్ని తరలించాల్సి వచ్చేది. అలాగే పోలవరం సందర్శన పేరుతో ఆర్టీసీ నుంచి ఉచిత బస్సులు నడిపారు. ఇవన్ని కలిసి సుమారు రూ.10 కోట్లు వరకు ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడింది. ఇక సభలకు వచ్చే నాయకులకు, అధికారులకు కావాల్సిన కార్లు, డీజిల్, పెట్రోల్ తదితర ఏర్పాట్లు రవాణాశాఖ అధికారులు పై పడేది. దీనికి సంబంధించి బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కార్లు అద్దెకు ఇవ్వడానికి ట్రాన్స్పోర్టర్లు ఇష్టపడేవారు కాదు. దీంతో తనిఖీల్లో పట్టుకున్న కార్లు, వ్యాన్లను బలవంతంగా సమావేశాలకు వినియోగించేవారు. ఇక సభాస్థలి ఏర్పాట్ల బాధ్యతంతా రెవెన్యూశాఖ పై ఉండేది. రెవెన్యూశాఖ అధికారులు ఇప్పటికే షామియానా సప్లయిర్స్‌కు లక్షల రూపాయల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇక బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, మధ్యాహ్నం భోజనం, వాటర్ సప్లయి బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉండేది. గత ఏడాది జూన్‌లో జరిగిన నవనిర్మాణ దీక్ష డబ్బులు కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఇలా జిల్లాలో సుమారు రూ.100 కోట్లు వరకు ఈ తరహా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడం, మరోవైపు సప్లయిర్స్ నుంచి ఒత్తిడి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు తమ చేతి నుంచి కొంత సొమ్ము చెల్లించిన సందర్భాలు ఉన్నాయని వారు వాపోతున్నారు. ఒక్క రూపాయి భారం లేదు.. గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం అధికారులపై ఒక్క రూపాయి భారం పడలేదు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో అధికారులు సాధ్యమైనంత పొదుపుగా కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలను పార్టీ నాయకులే తమ సొంత వాహనాల్లో తీసుకొచ్చా రు. అయితే ఆయా శాఖల అధికారులు మాత్రం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. వచ్చిన అతిథులకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండానే చూశారు తప్ప తమ జేబుల్లోంచి పెట్టే అవసరం రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పవన్ ఓదార్పు కోసం ఎదురు చూపులు
పశ్చిమగోదావరి ,భీమవరం : ‘పవన్ అభిమానులు కోకొల్లలు.. సినిమా చర్మిషాతో విజయం సాధిస్తాం.. 1983లో ఎన్టీ రామారావుకు ఉన్న ఫాలోయింగ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కూ ఉంది. గ్రామస్థాయిలో జనసేన పార్టీకి బలం లేకపోయినా, కమిటీలు లేకపోయినా పార్టీకి సభ్యత్వాలు లేకపోయినా జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు నల్లేరుపై నడకే’.. ఇది ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు జనసైనికుల ధీమా. అయితే ఈనెల 23న ఫలితాలు వచ్చాక జనసేనాని పవన్‌కల్యాణ్ బొక్కబోర్లాపడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఘోరపరాజయం పాలుకావడంతో జిల్లాలోని జనసైనికులు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. పవన్ నుంచి ఓదార్పుకోసం ఎదురుచూస్తున్నారు. అగమ్యగోచరంగా జనసేన భవిష్యత్ ప్రధానంగా భీమవరం నియోజకవర్గంలోని పార్టీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జనసేన పార్టీ తరఫున పోటీచేయడానికి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త డాక్టర్ యిర్రింకి సూర్యారావు, వేగేశ్న సూర్యనారాయణరాజు (కనకరాజుసూరి) బొమ్మదేవర శ్రీధర్ (బన్ను) బిల్డర్ మల్లినీడి తిరుమలరావు(బాబి), న్యాయవాది ఉండపల్లి రమేష్‌నాయుడు వంటివారు ఆశించారు. దీనికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఎన్నికలు సమీపించిన తరుణంలో అప్పటికప్పుడు జనసేనాని పవన్‌కల్యాణ్ భీమవరంలో పోటీకి సిద్ధపడ్డారు. భీమవరం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున కాపు ఓట్లతో పాటు పపన్ అభిమానులు పవన్‌ను గెలిపిస్తారనే నమ్మకంతో పోటీ చేయించారు. అయితే ఎన్నికల ప్రచారంలో పవన్ మొక్కుబడి ప్రచారం చేయడమేగాక పోలింగ్ రోజు నియోజకవర్గం ఓటర్లకు కనుచూపుమేరలో కన్పించలేదు. అయినప్పటికీ పవన్ చరిష్మాతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అనేకమంది కోట్లాది రూపాయలు పందాలు కాశారు. సామాన్యప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు సైతం అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పందాలు వేశారు. అధినేత ఓటమిపై కార్యకర్తల్లో కలత ఓట్ల లెక్కింపులో టీడీపీ మెజార్టీతో ప్రారంభం కాగా తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఆధిక్యత కనబర్చగా మధ్యలో కొన్ని రౌండ్లు జనసేన ఆధిక్యత కనబర్చింది. దీంతో పవన్‌కల్యాణ్ విజయం ఖాయమంటూ పార్టీ శ్రేణులు అప్పటికే సంబరాలు ప్రారంభించారు. చివరకు ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ప్రధానంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భీమవరంలో తన విజయం కోసం కృషి చేసిన వారి గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడంతో వారితో అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ కోసం, పవన్ విజయం కోసం అహర్నిశలు శ్రమించాం. తీరా ఓటమి పాలవడంతో రానున్న రోజుల్లో మాకు ఎవరు అండగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. జనసేనను నమ్ముకుని తెలుగుదేశం పార్టీని, మునిసిపల్ చైర్మన్ పదవిని వదులుకున్న కొటికలపూడి గోవిందరావు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయిన పవన్ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎలా పోరాటం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పవన్‌ను నమ్ముకున్నవారికి జిల్లాలో పెద్దదిక్కుగా ఉండే నాథుడే కరువయ్యాడని, ప్రధానంగా భీమవరంలో మా అలనాపాలనా చూసే నాథుడు లేనందున మా పరిస్థితి ఏమిటని జనసేన నాయకులు అంతర్మథనంలో ఉన్నారు. మొత్తం మీద జనసైనికులంతా తలోదిక్కుకూ వెళ్లే ఆలోచనలో ఉన్నా తమను ఆదరించేవారెవరనే సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. -
కలసి నడుద్దాం
‘రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.కృష్ణా జలాలను ఒద్దికగా, పొదుపుగా వినియోగించుకుంటూ సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో రెండు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ అభిలషించారు. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా చేపట్టిన పెద్ద బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగే శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నాయని, అది గత తొమ్మిదేళ్లుగా ప్రస్ఫుటంగా నిరూపణైందని కొనియాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. సాక్షి, అమరావతి/గన్నవరం: ‘నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు, ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదో ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రేమతో అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. వయసుచిన్నదైనా ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. మీ కార్యనిర్వహణలో, మీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తున్నాను.రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయవలసింది ఖడ్గ చాలనం కాదు కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి. జగన్మోహన్రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. 100 శాతం జరిగి తీరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని విశ్వసిస్తున్నాను.కృష్ణా నదీ జలాల విషయంలో సమస్యలు ఉన్నాయి. అక్కడ నదిలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా ఒద్దికగా ఓపికగా ఉభయ రాష్ట్రాలు వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ కార్యనిర్వహణలో అవసరమైనటువంటి అన్ని విధాల అండదండలు, సహాయసహకారాలు తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను. అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన పాలన అందించి నాన్నగారి పేరు నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయేలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని.. ఒక టెర్మ్ కాదు కనీసం మూడు నాలుగు టెర్మ్‌ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తున్నాను.’ అంటూ ముగించారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు: స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో విజయవంతం కావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆకాంక్షించారు. తన తండ్రి ఘన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్ మంచి పరిపాలన అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా స్టాలిన్ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడారు. ఎయిర్‌పోర్టులో కేసీఆర్, స్టాలిన్‌కు ఘనస్వాగతం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, డీఎంకే అధినేత స్టాలిన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. తొలుత చెన్నై నుంచి 10.25 గంటలకు స్టాలిన్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమం పూర్తయ్యా సాయంత్రం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరివెళ్లారు. కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, పలువురు మంత్రులు విచ్చేశారు. సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్ అదే విమానంలో హైదరాబాద్ వెళ్లారు. -
వైఎస్ జగన్ అనే నేను
సాక్షి, అమరావతి: అశేష జనవాహిని కేరింతలు.. హర్షధ్వానాలు.. దిక్కులు పిక్కటిల్లే నినాదాల నడుమ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ నడిబొడ్డున గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహం, ఉద్విగ్నభరిత వాతావరణంలో మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటల ముహూర్తానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, వైఎస్ జగన్‌తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని కూడా ప్రమాణం చేయించారు. జగన్ ప్రమాణం చేస్తున్నప్పుడు వేదికకు ఎడమవైపున ఆశీనురాలైన ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ చలించారు.. కంటతడిపెట్టారు. ప్రమాణ స్వీకార సమయానికి ముందుగా అక్కడకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తొలుత జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన నియామక పత్రాన్ని చదవి వినిపిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆ వెంటనే గవర్నర్ లేచి లాంఛనంగా ‘..అనే నేను’ అంటూ తొలి పలుకు చెప్పగానే ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. వెను వెంటనే మళ్లీ గవర్నర్ ‘..అనే నేను’ అనగానే.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏవిషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికీ లేదా.. వ్యక్తులకు తెలియ పరచనని లేదావెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే.. వేదికపై కాస్త ఎడంగా కూర్చున్న గవర్నర్‌సతీమణి విమలా నరసింహన్ ఒక పుష్పగుచ్ఛాన్ని జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డికి ఇచ్చి మనసారా అభినందనలు తెలియజేశారు. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం.. 2019 మే 30.. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. ఉదయం నుంచే ఇందిరా గాంధీ స్టేడియం వద్ద సందడి నెలకొంది. స్టేడియం యావత్తు వైఎస్ జగన్ నినాదాలతో మార్మోగింది. గంటగంటకూ జనం పెరిగిపోవడంతో ఉదయం 10 గంటల తర్వాత అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. స్టేడియం బయట 14 ఎల్ఈడీ తెరల ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 11.50 గంటల సమయంలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సభాస్థలికి చేరుకున్నప్పుడు ప్రజలు జేజేలు పలికారు. సభాస్థలి వద్ద పార్టీ నేతలు హెలికాప్టర్ నుంచి పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న తీరు అపురూపం. వేదిక వద్దకు రాబోయే ముందు ఓపెన్ టాప్ జీప్‌లో వైఎస్ జగన్ జనానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణమంతా కలియతిరిగారు. అప్పటికే వేదికపైకి వచ్చిన తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, తెలంగాణ మంత్రులు, పుదుచ్ఛేరీ మాజీ మంత్రి మాల్లాడి కృష్ణారావులకు వినమ్రంగా నమస్కరిస్తూ వేదికపైకి వచ్చిన జగన్.. ప్రజలకు అభివాదం చేసినప్పుడు కొన్ని నిమిషాల పాటు ప్రాంగణమంతా హర్షధ్వానాలతో హోరెత్తింది. వైఎస్ జగన్ ఎదురేగి గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రమణ్యం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 12.23 గంటలకు వైఎస్ జగన్‌తో నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ దంపతులకు జగన్ స్వయంగా కిందకు వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం స్టాలిన్, కేసీఆర్‌లు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతూ నాన్నగారి (డాక్టర్ వైఎస్సార్) పేరు నిలబెట్టి కనీసం మూడు నాలుగు టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని దీవిస్తున్నానని అన్నప్పుడు సభా ప్రాంగణం జగన్ నినాదంతో మార్మోగింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుదైన రికార్డు తెలుగు రాష్ట్రాల చరిత్రలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఓ అరుదైన రికార్డుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు దివంగత సీఎం వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అచ్చంగా తండ్రి బాటలోనే ఆయన తన తొలి సంతకానికి ఒక పవిత్రతను చేకూరుస్తూ అవ్వా తాతల పింఛన్ పెంపు ఫైలుపై సంతకం చేశారు. నాడు వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై తొలి సంతకం చేశారు. అది నేటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్రతిహతంగా అమలవుతోంది.జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఆయన సతీమణి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆ పార్టీ మరో నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజి, టీడీపీ నేతలు నన్నపనేని రాజకుమారి, కేఆర్ పుష్పరాజ్, సీనియర్ ఐఏఎస్, ఐపీస్ అధికారులు, సినీ ప్రముఖులు రాంగోపాల్‌వర్మ, దిల్ రాజు, మహివి రాఘవతో పాటు పలువురు హాజరయ్యారు. వీరితో పాటు జగన్ సతీమణి వైఎస్ భారతి, ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తదితరులు మాతృమూర్తి విజయమ్మతో కలిసి వేదికపై ఆశీనులయ్యారు. పెద్ద సంఖ్యలో వైఎస్ కుటుంబ సభ్యులు వేదికకు కింది వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఆశీనులయ్యారు. ఆకట్టుకున్న ప్రసంగం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ’నేను మీ కష్టాలు చూశాను, మీ బాధలను విన్నాను, నేను ఉన్నాను’ అని జగన్ చెప్పినప్పుడు వివిధ గ్యాలరీలలో ఉన్న వారు తమ సీట్లలో నుంచి లేచి మరీ హర్షధ్వానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఆగస్టు 15లోగా సుమారు 4 లక్షల వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించినప్పుడు యువకుల కేరింతలు మిన్నంటాయి. సభ ముగిసిన అనంతరం కూడా ఉద్యోగాల భర్తీపై యువతీ యువకులు పెద్దఎత్తున చర్చించుకోవడం గమనార్హం. అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని.. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడం అని జగన్ చేసిన ప్రకటనతో ’నాయకుడంటే ఇతనే.. తండ్రిని మించిన తనయుడు’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రణాళిక విలువను జగన్ చాటిచెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి గుర్తుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడిచి అవ్వాతాతల పెన్షన్‌ను రూ.2250కి పెంచి జగన్ చరితార్ధుడయ్యారు. పండుటాకులకు ఆసరా ఇచ్చిన ఈ పథకం ఉన్నంత కాలం జగన్‌ను మరచిపోవడం సాధ్యం కాదు’ అని ఓ వామపక్ష పార్టీ నాయకుడు రవీంద్ర అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రాష్ట్రంలో నూతన అధ్యయనానికి నవ యువకుడు నడుం కట్టారని మేధావులు అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారోత్సవం ఇలా.. ►11.50 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన జగన్ ►12.04 గంటలకు స్టేడియంలోకి ప్రవేశం ►12.10 గంటలకు వేదికపైకి ►12.18 గంటలకు గవర్నర్ ప్రసంగం ►12.23 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం ►12.29 గంటలకు ప్రమాణ స్వీకారం ముంగింపు ►12.30 గంటలకు గవర్నర్‌కు జగన్ వీడ్కోలు ►12.41 గంటలకు జగన్ ప్రసంగం ►1.05 గంటలకు అవ్వాతాతల పెన్షన్ పెంపు ఫైలుపై జగన్ తొలి సంతకం -
ఇక స్వచ్ఛమైన పాలన
వైఎస్ జగన్ అనే నేను.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూముఖ్యమంత్రి పదవినిస్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లుఈ నేల మీద నడిచినందుకు,పదేళ్లుగా మీలో ఒకడిగానిలిచినందుకు ఆకాశమంతవిజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు,ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి,ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరున హృదయపూర్వకకృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాక్షి, అమరావతి : అవినీతి రహిత పాలన అందిస్తామని నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను 72 గంటల్లోనే ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను ప్రజల ముందుకు తెస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టులను రద్దు చేసి, దోచుకున్నదెంతో ప్రజల ఎదుట ఉంచుతామన్నారు. నవరత్నాల అమలులో భాగంగా అవ్వాతాతల పెన్షన్‌ను పెంచుతూ తొలి సంతకం చేశారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో 5.60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని యువతకు తీపి కబురు చెప్పారు. పాలనలో తీరు తెన్నులపై స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కబురందించేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అశేష జనవాహిని ఆనందోత్సాహాల మధ్య ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతితో పాటు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నే విన్నాను.. నేనున్నాను.. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో పేదలు పడ్డ కష్టాలుచూశాను. మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు విన్నాను. వారి కష్టాలు చూసిన, విన్న నేను.. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేనీ రోజు మాటిస్తున్నాను. మీ కష్టాలను నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఇవాళ మీ అందరికీ చెబుతున్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టో తీసుకువచ్చాం. మేనిఫెస్టోను కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కన్పించే విధంగా తీసుకొచ్చాం. గత పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు.. బుక్కులు తీసుకురాలేదు. ఇందులో ప్రతి కులానికో పేజీ పెట్టి ఎలా మోసం చెయ్యాలన్న ఆలోచనతో తీసుకురాలేదు. ఎన్నికలయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకు రాలేదు. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఇది వైఎస్సార్ పెన్షన్ కానుక నవరత్నాల్లో మీ అందరికీ మాటిచ్చినట్టుగానే, మేనిఫెస్టోలోని ఒక అంశం గురించి మీ అందరికీ చెబుతాను. ఈ రోజు ఆ అవ్వా తాతల ఆశీస్సులు తీసుకునేందుకు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం చెబుతున్నా. నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆ అవ్వా తాతలను పెన్షన్ ఎంత అని అడిగితే రూ.వెయ్యి అని చెప్పారు. కొంతమంది అవ్వలైతే అది కూడా రావడం లేదని చేతులూపుతూ చెబుతుండేవాళ్లు. ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే గడువున్నప్పుడు పింఛన్‌ను పెంచారు. అందుకే ఈ పరిస్థితి పూర్తిగా మార్చబోతున్నాను. నవరత్నాలలో ప్రతి అవ్వ, తాత, ప్రతి వితంతువుకు ఇచ్చిన మాట ప్రకారం వారి పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళతాను. ఆ అవ్వా తాతల పెన్షన్‌ను జూన్ నెల నుంచి అక్షరాల రూ.2,250 నుంచి మొదలు పెట్టబోతున్నాను వైఎస్సార్ పెన్షన్ కానుకగా. దీనికి సంబంధించిన ఫైల్‌పై నేనీ రోజు మొట్ట మొదటి సంతకం పెడుతున్నాను. (సంతకం పెట్టారు.) ఈ సంవత్సరం రూ.2,250తో మొదలు పెడుతున్నాం. రేపు సంవత్సరం రూ.2,500కు తీసుకెళ్తాం. ఆ తర్వాత సంవత్సరం రూ.2,750కు.. ఆ తర్వాత ఏడాది రూ.3 వేలకు తీసుకెళ్తాం. అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామని చెబుతూ.. ఆశీస్సులు ఇవ్వమని పేరుపేరునా ప్రతి అవ్వా తాతను మీ మనవడిగా రెండు చేతులు జోడించి కోరుతున్నా. ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశమూ ప్రతి పేదవాడికీ అందాలి. ఇందులో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఇది జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగా ఆగస్టు 15 నాటికి, అంటే ఇవాల్టి నుంచి కేవలం రెండున్నర నెలల కాలంలో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా, లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తున్నాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, సేవ చెయ్యాలనే ఆరాటం ఉన్న పిల్లలకు రూ.5 వేలు జీతమిస్తూ గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటాం. రూ.5 వేలు ఎందుకిస్తున్నామో తెలుసా? ఈ వ్యవస్థలోకి లంచాలు రాకుండా చెయ్యాలని. ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి, పక్షపాతం, లంచాలు ఉండకూడదని. సేవా దృక్పథం గల పిల్లలకు వేరే చోట మెరుగైన ఉద్యోగం దొరికే వరకు గ్రామ వాలంటీర్లుగా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నాలుగు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వస్తాయి. సర్కారీ సేవ అందకపోతే ఫోన్ కొట్టండి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటున లంచాలు కన్పించినా ఊరుకోం. అదే ఆగస్టు 15వ తేదీన ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే అనుసంధానమై ఉంటుంది. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష కన్పించినా, ఏ ఒక్కచోట లంచాలు కన్పించినా, ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా వక్రీకరణ వార్తలు రాసే మీడియాను కోర్టుకీడుస్తాం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కన్పిస్తాడు. మిగిలిన వాళ్లను ఎప్పుడెప్పుడు దించాలా అని ఆలోచన చేస్తారు. వాళ్ల రాతలు అలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇది మన ఖర్మ. వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నా. పారదర్శకంగా, జ్యుడీషియల్ కమిషన్ ద్వారా కాంట్రాక్టులను ఖరారు చేసిన తర్వాత కూడా వక్రీకరిస్తూ, దురుద్దేశంతో వార్తలు రాస్తే ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరకు వెళ్లి, శిక్షించమని గట్టిగా అడుగుతాం. అమ్మానాన్నకు పాదాభివందనం... చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు పేరుపేరున ఇక్కడకు వచ్చిన, ఇక్కడికి రాలేకపోయిన, ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి మరోసారి పేరుపేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ, మీ గ్రామంలో అక్షరాల పది మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తున్నామని అందరికీ హామీ ఇస్తున్నా. అక్టోబర్ 2, గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమం చేపట్టి, మరో 1.60 లక్షల ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి తెస్తాం. మీ పిల్లలే పది మంది మీ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తారు. మీకు పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నవరత్నాల్లోని ఏ పథకమైనా, ఏది కావాలన్నా.. మీరు చెయ్యాల్సిందల్లా గ్రామ సెక్రటేరియట్‌కు వెళ్లి అప్లికేషన్ పెట్టండి. దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే మీకు మంజూరయ్యేలా చేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా లంచాలుండవు. ఇప్పటి వరకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా మరేది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచమనేదే లేకుండా, రికమండేషన్‌కు తావు లేకుండా ఏ ఒక్కరికైనా ఏ అవసరం ఉన్నా, 72 గంటల్లో మంజూరయ్యేలా చేస్తామని సీఎంగా హామీ ఇస్తున్నాను. గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై పని చేస్తారు. నవరత్నాలతో పాటు, ప్రతి ప్రభుత్వ పథకం లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా నేరుగా మీ ఇంటికొచ్చేలా డోర్ డెలివరీ చేస్తారు. ఇదొక్కటే కాదు.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటీ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను. కాంట్రాక్టుల్లో అవినీతి నిగ్గు తేలుస్తాం ఈ రాష్ట్రంలో అవినీతి, వివక్ష లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. ఇందులో భాగంగా ఏయే కాంట్రాక్టుల్లో, ఏయే పనుల్లో అవినీతి జరిగిందో వాటిని పూర్తిగా రద్దుచేస్తాం. గతంలో చేసిన ట్రైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండీషన్స్‌ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేలా అవకాశమిస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొస్తాం. అంతేకాదు.. ఇంకో ఉదాహరణ. కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, మీ ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యడంతోనే ఆగకుండా పారదర్శకతను తీసుకొస్తాం. ఇందులో భాగంగా రేపో మర్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి, ఓ హైకోర్టు జడ్జిని ఇవ్వమని కోరతాం. ఆయన ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్‌గా జ్యుడీషియల్ కమిషన్‌ను నియమిస్తాం. టెండర్లకు పోకముందు, ప్రతి కాంట్రాక్టును జ్యుడీషియల్ కమిషన్‌కు పంపి, ఆ హైకోర్టు జడ్జి చేసే ఏ సూచనలు, మార్పుల మేరకు కాంట్రాక్టులకు పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా టెండర్లు పిలుస్తాం. -
శుభారంభం
అనవసర ఆడంబరాలు, ఆర్భాటాలు లేవు... గర్వాతిశయాల జాడ లేదు. వాటి స్థానంలో తొణకని ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది. సత్సంకల్పంతో, సత్యనిష్టతో 14 నెలలపాటు తాను సాగించిన ‘ప్రజాసంకల్ప యాత్ర’లో తారసపడిన జన జీవితాల జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆ జీవితా లను మెరుగుపరిచి తీరాలన్న దృఢ సంకల్పం గుండె నిండా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుని గురువారంనాడు వేలాదిమంది సమక్షంలో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యంతమూ ఆయన పరిపాలన ఎలా ఉండబోతున్నదో రేఖామాత్రంగా ఆవిష్కరిం చింది. సంక్షిప్తంగా సాగిన ఆ ప్రసంగంలో అతిశయోక్తులు, స్వోత్కర్షలు లేవు. ఎక్కడా తడబాటు లేదు. చెప్పదల్చుకున్న అంశాలను సూటిగా, స్పష్టంగా, అందరికీ అవగాహన కలిగే రీతిలో చెప్పడం ఈ ప్రసంగమంతా కనబడుతుంది. అంతేకాదు... పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విధంగానే నవరత్నాల్లో ఒకటైన అవ్వాతాతల పింఛన్ పెంచుతూ తొలి సంతకం చేశారు. 341 రోజులపాటు 3,684 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని లక్షలాదిమంది ప్రజలు నిత్యం నిశితంగా గమనించారు. తమ మధ్యే నివాసం ఉంటూ, తమతోనే సహవాసం చేస్తూ, తమ వెతలను వింటూ ‘నేనున్నా’నంటూ ఆయన ఇచ్చిన భరోసాను గుండెల్లో దాచు కున్నారు. తమను కష్టాలపాలు చేస్తున్న తెలుగుదేశం పాలన ఎప్పుడు ముగిసిపోతుందా అని నిరీక్షించారు. ఆ ముహూర్తం ఆగమించిన వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం కోట్లాదిమంది ఆశ లకూ, ఆకాంక్షలకూ అద్దం పట్టింది. వారి నమ్మకాన్ని వందల రెట్లు పెంచింది. రాష్ట్రం ఎదుర్కొం టున్న సమస్యలపై ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నదని, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహం, దాని అమలుకు అవసరమైన పట్టుదల ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం మాత్రమే కాదు... ఖండాంతరాల్లో ఉంటూ భిన్న మాధ్యమాల ద్వారా ఆయన ప్రసంగాన్ని విన్న తెలుగువాళ్లంతా అవగాహన చేసుకున్నారు. అధికార చేలాంచలాలు అందుకున్న మరుక్షణం చేసిన వాగ్దానాలేమిటో మరిచిన పాలకుణ్ణి ప్రత్యక్షంగా చూసినవారికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కానీ చెప్పినవి మాత్రమే కాదు... చెప్పనివీ చేసి చూపించిన అపర భగీరథుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వార సుడాయన. కనుకనే వైఎస్సార్ కాంగ్రెస్ వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రమా ణస్వీకార సభా వేదికపై చూపుతూ... దీన్ని తాను ఖురాన్‌లా, బైబిల్లా, భగవద్గీతలా భావించి, అందులోని వాగ్దానాలన్నిటినీ నెరవేర్చడానికి త్రికరణశుద్ధిగా పనిచేస్తానని జగన్ చెప్పగలిగారు. అంతేకాదు, అయిదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేమిటో స్థూలంగా తెలియజేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ప్రవేశపెడతామని, అక్రమాలకూ, అవినీతికీ ఆస్కారం లేనివిధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తుందో సుస్పష్టమే. ఇది అమలైతే ఖజానాకు గండికొట్టే అక్రమార్కుల ఆటలిక సాగవు. తెలుగుదేశం పాలనలో అస్మదీయ కాంట్రాక్టర్లు ఓ వెలుగు వెలిగారు. కోటరీగా ఏర్పడి అన్యు లెవరూ టెండర్ల దరిదాపుల్లోకి రాకుండా చూశారు. ఎవరైనా సాహసించి టెండర్లలో పాల్గొంటే వారిని ‘బ్లాక్ లిస్టు’లో చేర్చారు. కొన్ని సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిన పనుల్ని సైతం ‘అయినవాళ్ల’ కోసం నిరవధికంగా ఆపారు. ముఖ్యంగా నిర్మాణ పనులకు సంబం ధించిన ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయలు కైంకర్యం చేయడం ఒక సంస్కృతిగా మారింది. నేతలకు ముడుపులు చెల్లిస్తే తప్ప పనులు ప్రారంభించడం దుర్లభమయ్యేలా చేశారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు కాంట్రాక్టర్లు పరారైన సందర్భాలూ ఉన్నాయి. అసలు టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడం, కమీషన్లు దండుకోవడం ఒక కళగా అభివృద్ధి చేశారు. ఏపీలో అధికార పార్టీ కన్నుపడని, వారికి కాసులు రాల్చని కాంట్రాక్టు పనులంటూ లేవు. ఈ అవినీతి మహమ్మారిని రూపుమాపుతానని హామీ ఇవ్వడం సాధారణ విషయం కాదు. నిండైన ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడికే, సాహసోపేతంగా అడుగేయగల నాయ కుడికే అది సాధ్యం. ‘సాహసమున పనులు సమకూరు ధరలోన...’ అని వేమన ఎప్పుడో చెప్పాడు. ప్రభుత్వ పథకాలు నేరుగా జనం ముంగిట్లోకి తీసుకెళ్లేందుకు గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలం టీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4లక్షలమంది వాలంటీర్లను నియమిస్తామని చెప్పడం పేద జనానికి ఊరటనిచ్చే అంశం. తమకు రావాల్సినవాటి కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వక తప్పని దుస్థితిలో పడుతున్న లక్షలాదిమంది నిరుపేదలకు ఇదొక వరం. అలాగే ప్రభుత్వ పథకాలు, సేవలు సరిగా అందని పక్షంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించాలని, గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించడం హర్షించదగ్గ నిర్ణయాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇరు రాష్ట్రాలూ కలిసిమెలిసి ముందుకు సాగుదామని, పరస్పరం సహకరించుకుందామని పిలుపునివ్వడం శుభసూచికం. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆయనా, డీఎంకే అధినేత స్టాలిన్ ఆకాంక్షించడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా రాబోయే రోజుల్లో సమర్థవంతమైన, నిష్కళంకమైన పాలన అందు తుందన్న భరోసాను జగన్మోహన్రెడ్డి ప్రసంగం కల్పించింది. -
మన కాలం వీరుడు వైఎస్ జగన్
ఎవరికైనా 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతి కలిగించి ఉంటే, వాళ్ళు క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నారని నికార్సుగా చెప్పవచ్చు. ఏపీ ఎన్నికల ఫలితాలు అర్థం కావాలంటే, వాటిని 2011 నాటి కడప పార్లమెంట్ ఉపఎన్నిక నుంచి చూడాల్సి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా రాజీనామా చేసి, స్వంత పార్టీ పెట్టి పోటీ చేసి గెలిచిన ఎన్నిక అది. అప్పుడు వైఎస్సార్సీపీకి 67.5 శాతం ఓట్లు పోలైతే, కాంగ్రెస్‌కు 14.22 శాతం, టీడీపీకి 12.57 శాతం పోలైనాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 44.47 శాతం ఓట్లు రాగా, టీడీపీ, బీజేపీ, జనసేన మూడుపార్టీలు కలిపి 46.3 శాతం పొందాయి. రెండింటి మధ్య తేడా కేవలం 2.6 శాతం. అయితే అప్పటి నుంచి ఒకే తీరుగా నిలకడగా ఉన్ననాయకుడు జగన్ అయితే, పలు రాజకీయ విన్యాసాలతో ఉనికిని నిలబెట్టుకున్నది చంద్రబాబు. ఇద్దరూ తలపడిన ఈ ‘ఎరీనా’ మీద వీళ్ళ గత ‘ట్రాక్ రికార్డ్’ గాని, గడచిన ఐదేళ్ళ పరిపాలనగాని చూసాక, ఈ ఫలితాలు ఇలా కాకుండా ఇంకెలా వుంటాయి? ప్రయాణం, ముందుకెళ్ళాలి కానీ ముందు ఉన్నదేంటో తెలియని మంచులో ప్రయాణం. గడచిన ఐదేళ్ళలో టీడీపీలో అందరినీ అటువంటి కళ్ళకు గంతలు కట్టుకున్న స్థితిలో ఉంచడం, ఆపార్టీ అధినేత అసాధారణ ‘మేనేజ్మెంట్’ నైపుణ్య విజయం! ఇది– ‘స్మోక్ స్క్రీన్’ స్ట్రాటజీ. ఇందులో ముందుగా వాస్తవ పరిస్థితుల్ని బయటకు కనిపించకుండా వాటిని వెనక్కి నెట్టి, దాని ముందు పై నుంచి కిందికి నాలుగు వైపులా కృత్రిమంగా ఒక దట్టమైన ‘పొగ తెర’ను దించి, దాని వెనుకున్న నిజస్థితిని దాచేస్తారు. ఇక రెండవ దశలో ఆ ‘పొగ తెర’ ముందు క్షణం తీరిక లేనట్టుగా, 24/7 ఎప్పుడూ ఏదో ఒక ‘యాక్టివిటీ’ లైవ్‌లో నడిపిస్తారు. అది దోమలపై యుద్ధం, రెయిన్ గన్స్‌తో పంటలు కాపాడ్డం, తుఫానుకు ఎదురెళ్ళడం, భాగస్వామ్య సదస్సులు, అమరావతి మీద ఎయిర్ షో లేదా నది మీద ‘రెగట్టా’ పోటీలు, ఇలా ఏదైనా కావొచ్చు... ఏదీ లేదూ జనాన్ని పొలోమని పోలవరం పంపడం, ఏడాది పొడుగునా ఇలా ‘పొగ’ను మాత్రం దట్టంగా ఉంచాలి. ఈ వరసలో చివరిగా ఎన్నికల నోటిఫికేషన్ ముందు, ఈ ‘పొగతెర’ మీద దించిన మరో మాయా జలతారు ‘పసుపు–కుంకుమ’! గ్రామీణ మహిళల చేతుల్లో పచ్చనోట్లు పడితే చాలు, వాళ్ల అంతరంగాల్లో ఏముందీ మనకక్కరలేదు, ఇదీ బాబు లెక్క. ఇంత గజిబిజిని ఇక్కడ ముందునుంచి ఇంత చిక్కగా అల్లి మరీ ఉంచారు కనుకనే, నిజంగానే ఇది ‘టఫ్ ఫైట్’ అనిపించింది. అందుకే 40 రోజులు పైగా ‘విశ్లేషకులు’ ఏపీ గురించి ఇంతగా ఇక్కడ బుర్రలు బద్దలు చేసుకుంది. ఈ పొగతెరను చీల్చుకుని దాని వెనక్కి వాస్తవం వద్దకు ఒక్కొక్క పొర తొలగించుకుంటూ వెళ్లి, అస్సలు అక్కడున్నది ఏమిటో చూడ్డానికి చేసిన ప్రయత్నమే ఈ సర్వే నివేదికలు! ఇంతకీ అక్కడేముంది? అక్కడ వైఎస్సార్ ఉన్నారు! ఆయన ఆర్థిక సంస్కరణల సీఈవో చంద్రబాబు వేగానికి, ‘ఇందిరమ్మ రాజ్యం’ నినాదంతో 2004లో ‘బ్రేకులు’ వేసిన యోధుడు. ఏపీలో 2004లో జరిగిన ఈ మార్పును మరో ఎన్నికగా మాత్రమే చూస్తే, దేశ రాజకీయాల్లో ‘వైఎస్ ఫ్యాక్టర్’ అర్థం కాదు. బాబు ‘వేగం’ ఒక విపత్తుగా పరిణమించి, వ్యవస్థ మొత్తం కూలబడనున్న కాలమది. సాగుబడి, వైద్యం, విద్య వంటి కీలక రంగాలు కునారిల్లి, పేద దిగువ మధ్యతరగతి జనం మార్పు కోరుతున్న రోజులు. అటువంటి సంధి కాలానికి అవసరమైన ‘హృదయాన్ని’ పరిపాలనకు జోడించి; దానికి ‘ఇందిర’ పేరు పెట్టి, వై.ఎస్ ముందుకు తీసుకువెళ్ళాడు. సీఎం అయిన వెంటనే రైతు వెతల మీద సమగ్ర అధ్యయనానికి డిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొ. జయతీ ఘోష్ కమిటీని వేసిన దార్శనికుడు వై.ఎస్. ఇలా దేశానికి ఈ సంధి కాలంలో జరగాల్సిన కాయకల్ప చికిత్సను నాడి పట్టి మరీ గుర్తించిన నాయకుడు వైఎస్! అందుకే అప్పట్లో సోనియాగాంధీ, మన్మోహన్, తమ సభల్లో తరచూ, ‘ఏ.పి. మోడల్’ అంటూ వుండేవారు. ప్రధాని అధికారిక ప్రసంగాలలో ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ, అప్పట్లో వైఎస్సార్ ఏపీని కాంగ్రెస్ తరుపున దేశానికి ఒక ‘షో కేస్’ గా చూపించుకునేవారు! సహజంగా అటువంటి కుటుంబ అంశం ఉన్న జగన్మోహన్రెడ్డికి తన తండ్రి పేరున్న పార్టీ ద్వారా ఈరోజు చంద్రబాబు వంటి ఒక ‘పొలిటికల్ మేనేజర్’ని ఏకపక్షంగా ఓడించటం అనేది మరీ విశేషం కాకపోవచ్చు. నిజానికి ప్రస్తుతం జగన్ సాధించిన గెలుపు వైఎస్సార్ ఆధ్వర్యంలో జరిగిన 2004, 2009 ఎన్నికలకు మరో మెరుగైన పొడిగింపు మాత్రమే. అయితే, కొత్తగా ఇప్పుడు కలుపుకోవల్సినది జగన్ పాదయాత్రలో తనకోసం కట్టుకున్న– మమతల కోట! ఈ కోణంలో చూస్తే జగన్మోహన్రెడ్డి కాలం సృష్టించిన నాయకుడు. వ్యాసకర్త : జాన్సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక విశ్లేషకులు -
మానవీయతకు మహావిజయం
అపూర్వ విజయం అంటే నిర్వచనం ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలలో కీ.శే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని గెలిపించుకున్న తీరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకబిగిన సంవత్సరం పైగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, లక్షలాదిమంది వివిధ వర్గాల, సామాజిక నేపథ్యాల ప్రజానీకాన్ని, మైనారిటీలను, మహిళలను, అణగారిన ప్రజానీకాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే వైవిధ్యభరితమైన ఆంధ్రప్రదేశ్ సర్వస్వాన్ని ఆకళింపు చేసుకున్న నేతగానే కాదు వారిలో ఒకరిగా తాము విశ్వసింపదగిన తమ ఆత్మీయుడిగా వైఎస్ జగన్ ఎదిగిన తీరు ప్రశంసనీయం. కీ.శే. వైఎస్సార్ తమ పాదయాత్ర అనంతరం – ‘నాలో కోప నరం లేదు తెగిపోయింది’ అనిచెప్పిట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఈ పాదయాత్ర అనంతరం ఒక ఉత్తమ మానవుడిగా పరిణతి చెందడం అందరూ గమనించే ఉంటారు. ఈ విజయంలో ఆయన హీరో అయినా హీరో ఒక్కడే సర్వం సాధించలేడు. అతడు దిశా నిర్దేశం చేసి ఈ ప్రజాభ్యున్నతి మహా యజ్ఞంలో తొలి రుత్వికుడుగా నిలవగలడు. జగన్ అది చేశారు కానీ ఈ మేటి విజయంలో వైఎస్సార్ సహధర్మచారిణి శ్రీమతి విజయలక్ష్మి స్ఫూర్తిదాయకమైన పాత్ర అనిర్వచనీయం. ఒక వంక తన ప్రియతముడైన భర్త, తన మనిషి లేని లోటుతో కన్నీరు చిప్పిల్లుతుం డగా, మరో కంట తన కొడుకు తన భర్త అడుగుజాడల్లో ఆ రీతిగానే ప్రజారాధన చూరగొనే విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ధీశాలి అవుతున్నందుకు ఆనంద భాష్పాలతో ఉప్పొంగుతుండగా ఆమె అందించిన ఆశీర్వాదాలు సాటిలేనివి. కనిపాలిచ్చి పెంచి ఇంతటి వాడిని చేసిన, తన ఆశాజ్యోతి జగన్‌పై హత్యా ప్రయత్నం ఆమెనెంతగా కలిచివేసిందో! అయినా తనను తాను నిభాయించుకుని తెలుగుజాతి వీరవనితల సాటిగా, స్వయంగా ఎన్నికల రణప్రవేశం చేసి ప్రజల మధ్యకు వచ్చి ఆమె చేసిన ప్రసంగం ఎంతమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిందో! అలాగే ప్రజాక్షేత్రంలో తన అన్నకు తోబుట్టువుగా, తనకంటూ నెలకొల్పుకున్న ప్రత్యేక వ్యక్తిత్వంతో తన అన్న జగన్‌కి అండగా నిలిచిన సోదరి షర్మిల కృషి, పట్టుదలను అభినందించడానికి సాధారణ పదాలు సరిపోవు. ఆమె ‘బై బై బాబు’ అంటూ బాబుకు వీడ్కోలు నిచ్చినట్లు చేసిన నినాదం జనన్నినాదమయింది. అలాగే జగన్ సతీమణి శ్రీమతి భారతి ఎంతో బాధ్యతగల వ్యక్తి. నిండుకుండలా తెరచాటుగా ఉంటూనే సూత్రధారిగా ప్రదర్శించిన హుందాతనాన్ని కూడా మరవలేం. ఈ మొత్తం క్రమంలో సమాజంలో కుటుంబ వ్యవస్థకు కూడా వైఎస్ కుటుంబం మచ్చుతునకలా నిలిచింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలే హత్యాప్రయత్నం చేయించి ఉంటారన్నట్లు మాట్లాడి తమ అల్పత్వాన్ని ప్రదర్శించిన తెలుగుదేశం నేతలను తల్చుకోవడం కూడా ప్రస్తుత సందర్భంలో తగని పని అయినా, వాళ్ల వ్యాఖ్యల్లోని కుసంస్కారానికి క్షోభించిన వారిలో ఒకరిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నందుకు క్షమార్హుడను. కానీ ఒక ఔన్నత్యాన్ని కొనియాడవలసినప్పుడు తద్భిన్నమైన అధోగతిని సరిపోల్చడం ముఖ్యమే అవుతుంది. అందుకే మానవత్వం మూర్తీభవించిన కుటుంబ బాంధవ్య ప్రస్తావనలో ఈ రకమైన సరిపోల్చడాలు తప్పవు. పైగా టీడీపీ నేతలకు తమ అధినేత తన తోబుట్టువుల పట్ల వ్యవహరించిన తీరు గురించి తెలిసే ఉంటుంది.!! జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశం. తెలుగు ప్రజలపట్ల ముఖ్యంగా అణగారిన పేదల గుండెల్లో స్థిరనివాసం ఏర్పర్చుకున్న తన కన్నతండ్రి వారిపట్ల చూపిన ఆలన, పాలన! అది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మరోవంక, ఎలా అమానవీయంగా రాజకీయం చేయరాదో, ఎలా ప్రజలను దిగజార్చేలా పాలన చేయరాదో, చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో జగన్ చాలా స్పష్టంగా చూశారు. ఆవిధంగా తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టే నాటికి ప్రజానేతగా ఉంటూ వారిలో ఒకరిగా నిలుస్తూ, ‘జగన్ తమవాడు, తమకు ప్రీతిపాత్రమైన నాయకుడు, తమ కష్టసుఖాలనెరిగి తమకు వెన్నుదన్నుగా నిలిచే తమ ప్రాణస్నేహితుడు’ అనుకునే రీతిలో తనను తాను రోజురోజుకు మరింత చేరువగా మలుచుకోగల ఆదర్శమూ ఉంది. అలాగే కేవలం అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా అందుకు ఎన్ని అసత్య వాగ్దానాలు చేసినా ఎంతటి అహంకారంతో వ్యవహరించినా, ఎంత అవినీతి అక్రమాలకు ఒడిగట్టినా తప్పులేదు అన్నట్లు వ్యవహరిస్తే అది తాత్కాలిక భోగమే కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించలేని అమాయకులు కాదు. తీవ్రమైన తప్పిదాలకు తీవ్రమైన శిక్ష విధించే తీరుతారు అన్నది 2019 ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమిరూపంలో సాకార ఉదాహరణగా ఉంది. జగన్‌కు నిరంతర విద్యార్థి లాంటి అసక్తి, ప్రజానుకూలంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరించగల శక్తీ ఉన్నాయని తాను ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్న పథకాలు ఒక్క ‘మెతుకు’లా కనబడుతుంది. కనుక ఇక 2014 నుంచి సాగిన చంద్రబాబు పీడకలవంటి పాలన తిరిగి మన ప్రజలు ఇకపై ఎన్నడూ అనుభవింపకుండా పాలనా వ్యవస్థ భ్రష్టత్వాన్ని మార్చవలసిన బాధ్యత కూడా వైఎస్ జగన్‌పై ఉంది. ఒక పార్టీ అధినేత ప్రవర్తనే సహజంగా తరతమ స్థాయిల్లో ఆ పార్టీ వివిధ స్థాయిల్లోని నేతల్లో ప్రతిబింబిస్తుంది. తమ దుర్భర జీవితాలను గూర్చి విన్నవించుకునేందుకు వచ్చిన వారిని వారు నిరుపేద మత్స్యకార్మికులా, మహిళలా అని కూడా చూడకుండా చూపుడు వేలు చూపించి ‘ఏం తమాషాగా ఉందా? అంతు చూస్తాను ఏమనుకుంటున్నారో’ అని బెదిరించే పాలకుడికి ‘అసలు వీళ్లను ఇక్కడి దాకా రానిచ్చిందెవరు?’ అని తన కింది స్థాయి అధికార బృందాన్ని ఆదేశించే పాలకుడికి అలాంటి అధికార అహంకారత్వం మూర్తీభవించిన అనుచరగణమే ఉంటుంది! అందుకే ఈ అయిదేళ్లలో మన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అలాంటి పాలకపక్ష నేతలను చూశాం! అసలు శాసన సభాపతిగా ఉండిన కోడెల శివప్రసాద్ ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్లోకి మందీ మార్బలంతో వెళ్లి పోలింగ్ బూత్‌ను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ ప్రయత్నిస్తే, జనం తిరగబడేసరికి తన చొక్కా తానే చింపుకుని తన వైద్యవిద్య ద్వారా నేర్చుకున్న స్పృహ కోల్పోయిన రోగిలా నటించిన కోడెల తెలుగుదేశం పార్టీ వరిష్ట నేతల్లో ఒకరే! అక్రమ ఇసుక రవాణాను తన విద్యుక్త ధర్మంగా అడ్డుకో ప్రయత్నించిన ఒక మహిళా తహసీల్దారును జుట్టుపట్టుకుని బిరబిరా ఈడ్చేసి ఆమె విలపిస్తూ ఉంటే వికటాట్టహాసం చేసిన మహానుభావుడూ తెలుగుదేశం పార్టీ నేతే! కీచక ప్రవృత్తితో వ్యవహరించిన అధికార పార్టీ అనుయాయులు, అప్పులిచ్చి అవసరానికి అప్పు తీసుకున్న కుటుంబాలకు కుటుంబాలనే అధోగతి పాల్జేసిన సెక్స్ మనీ రాకెట్ కుంభకోణాలలో చిక్కి కూడా ప్రభుత్వ అండతో తప్పించుకుతిరిగినవారూ చంద్రబాబు టీడీపీ స్థానిక నాయకులే.. ఇలా ఎన్నని చెప్పుకోగలం? వీరందరి ప్రవర్తనతో విసిగి వేసారి, అధికార దర్పం ముందు నోరెత్తలేని అమాయకులెందరో ఉన్నారు. అలాంటి దుర్మార్గాలకు పాల్పడే తన పార్టీవారిని అదుపులో ఉంచదలచని, ఉంచలేని నాయకత్వానికి చిహ్నంగా బాబు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఇకపై ఎలా ప్రవర్తించకూడదు అన్నదానికి ఇలాంటివి ప్రత్యక్ష రూపాలు! కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక మంచిమనిషి నాతో ఇలా అన్నాడు. ‘‘మా కులాన్ని ప్రజానీకాన్నుంచి వేరు చేసి మాకు అప్రతిష్ట తెచ్చింది మా చంద్రబాబేనండీ, నిజానికి అవకాశాన్ని అందుకుని నూతనత్వాన్ని స్వీకరించి, నిరంతరం కృషిచేసే వాళ్లు ఎందరో మాలో ఉన్నారు. కానీ తాను చేరదీసిన కొందరు మావాళ్ల ప్రవర్తనను అదుపులో పెట్టకపోగా అండగానిలిచి ప్రజలలో మా పట్ల వ్యతిరేకత తెచ్చింది ఈ చంద్రబాబేనండీ!’’ అని కళ్లొత్తుకుంటూ చెప్పాడాయన. అలాగే తనకు మందీమార్బలం కావాలనీ, నీరు–చెట్టు, జన్మభూమి కమిటీల వంటివాటితో చంద్రబాబు మూటగట్టుకున్న ముల్లె ఏమో కానీ, సంపాదించుకున్న అప్రతిష్ట ఎంత? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయిని అంటూనే పోలవరాన్ని తమ పార్టీకి, తనకు, తమ నేతలకు అక్షయపాత్రలుగా అవినీతి ధనరాసులు చేకూర్చే ‘వరం’గా మార్చిందీ చంద్రబాబే. దీనికోసమే ఆయన కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం తన అధీనంలోకి ఒప్పించి, మన రైతులను నొప్పించి, తన అధీనంలోకి తెచ్చుకున్నాడన్న విషయం ఆయన అనుయాయులైన అమాత్యులు, కాంట్రాక్టర్ నేతల వల్లనే బయటపడింది. రాజధాని నిర్మాణం గురించి చెప్పటం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లే! అడుగడుగునా అవినీతే, అసమర్థతే! మూడు పంటలు పండే ఆ ప్రాంతంలో భూమాతను చెరబట్టి ఆ పేరుతో వేలాది ఎకరాలు, నాడు హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి చంకన పెట్టుకున్నట్లే తాను, తన అనుయాయులు, వ్యవహరించిన తీరు, ఆ ప్రాంత ప్రజలకు గుర్తున్నది. అందుకే సింగపూర్‌లా మారనుందని భ్రమింపజేసిన ఆ ప్రాంత ప్రజలే మంగళగిరిలో బాబు సుపుత్రుడు లోకేశ్‌ని ఓడించారు. చంద్రబాబు ఏమాత్రం అర్హత, ప్రజా ఉద్యమానుభవం లేని లోకేశ్‌ని మంత్రివర్గమేదో తన తాతముత్తాతల జాగీరు అన్నట్లు, దొడ్డిదారిన ఎంఎల్సీని చేసి అంతటితో ఆగకుండా, అతడికి మంత్రివర్గంలో స్థానం కూడా ఇచ్చారు. లోకేశ్ అప్రకటిత, తదుపరి ముఖ్యమంత్రి అన్నట్లుగా ఆ తండ్రీ కొడుకులు ప్రవర్తించారు. ఫలితం అందరం చూశాం. అప్రదిష్ట ఇద్దరూ మూటగట్టుకున్నారు. కోట్లు ఖర్చుపెట్టినా కొడుకు లోకేశ్ మంగళగిరిలో గెలవలేదు! ఈ సందర్భంగా నేను మా కమ్యూనిస్టు పార్టీలకు, వారి కార్యకర్తలకు ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు మించిన మార్గం లేదు. ప్రజాసేవ అంటే కష్టాలలో ఉన్న ప్రజలను వస్తురీత్యా ఆదుకోవడం మాత్రమే కాదు. సర్వ సృష్టి నిర్మాతలు, భవితవ్య నిర్ణేతలు రెక్కాడినా డొక్కాడని ఈ ప్రజలే! దళితులూ, మహిళలూ, మైనారిటీలూ తదితరులకు ఎక్కడ ఏ రూపంలో అన్యా యం జరిగినా అక్కడ కమ్యూనిస్టులు వారికి అండగా నిలవాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటే వాటికి అండగా ఉండటం, ప్రజావ్యతిరేక అంశాలు పాలనలో దొర్లితే ప్రజా ఉద్యమాలతో అవి ప్రభుత్వం దృష్టికి వచ్చేలా చేయాలి. ఇలాంటి ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టు పార్టీలకు ఊపిరి. అంతే తప్ప పాలనను మార్చే పేరుతో చంద్రబాబు, పవన్ వంటి నిబద్ధత లేని వారితో ‘ఐక్యవేదిక’లు, ‘ఐక్య సంఘటన’లు వంటి అడ్డదారులు తొక్కడం వంటివి కమ్యూనిస్టులను గమ్యాన్ని చేర్చలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీ అణగారిన ప్రజలందరి పార్టీ. అదే రీతిలో పునరంకితమై, ప్రాథమిక స్థాయి నుంచి ఆరంభించడం అత్యవసరం. ఏ విధమైన న్యూనతా భావానికి గురికాకుండా సృజనాత్మకతతో, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆశిద్దాం. వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్ , మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’ అంటూ తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారాయన. ప్రస్తుతానికి వైఎస్ జగన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునే ముందు వైఎస్ జగన్ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 11.54 నిమిషాలకు తాడేపల్లిలోని తన స్వగృహంనుంచి విజయవాడకు బయలుదేరివచ్చారు. ఆయన వెంట వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, అనిల్ సభా ప్రాంగణానికి వచ్చారు. 12.14 నిమిషాలకు పూలతో సుందరంగా అలంకరించిన ఓ ప్రత్యేక వాహనంలో వైఎస్ జగన్ అక్కడి జనాలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. అనంతరం ఆయన స్టేజిమీదకు చేరుకుని మరోసారి ప్రజలకు అభివాదం చేయగా.. ఒక్కసారిగా ప్రజలు చేసిన కరతాళధ్వనులతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది. ప్రమాణం స్వీకారానికి కొద్ది క్షణాల ముందు జాతీయ గీతాలాపన జరిగింది. ప్రమాణ స్వీకార సమయంలో ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’ అని ఆయన అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. నూతన ముఖ్యమంత్రికి మతపెద్దలు ఆశీర్వచనాలు ఇచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై వైఎస్ జగన్ మొదటి సంతకం వైఎస్ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం వైఎస్ జగన్ సీఎం కావాలని పదేళ్లుగా.. -
ఇంతై.. ఇంతింతై.. వటుడింతై
వైఎస్ జగన్.. తెలుగు నాట ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ఇది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి యావత్ భారతదేశం దృష్టినీ ఒక్కసారిగా తన వైపునకు తిప్పుకున్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా తొలి నుంచీ సామాన్యుడిగానే మెలిగిన ఈ 46 ఏళ్ల నవయువకుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించి పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుని ఎన్నికల పోరాటంలో మట్టికరిపించి విజేతగా నిలిచిన జగన్ పడినన్ని కష్టాలు రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే మరెవరూ పడి ఉండరు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు అణగదొక్కాలని చూసిన ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్ మరణంతో తీవ్ర ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నా.. ‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా రోజు రోజుకూ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత బలీయమైన శక్తిగా అవతరించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయగా, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇలా తండ్రీకొడుకులు తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రజలకు ఎలాంటి వివక్షా లేని సుపరిపాలన అందించే దిశగా జగన్ తన ప్రస్థానం మొదలుపెట్టబోతున్నారు. ప్రజాసంక్షేమ పాలనను అందించి అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయుడినని నిరూపించుకోవాలనే తపనతో అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానున్న వైఎస్ జగన్ జీవిత విశేషాలివి.. – సాక్షి, అమరావతి మే 17, 2009 రాజకీయ అరంగేట్రంలోనే కాంగ్రెస్ తరఫున కడప లోక్‌సభా స్థానం నుంచి 1,78,846 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. (అంతకు ముందే 2004 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలు, కాంగ్రెస్ తరఫున తండ్రి వైఎస్‌కు చేదోడువాదోడుగా ప్రచారం) ఆగస్టు 31, 2009 ఫైనాన్స్ కమిటీలో సభ్యుడు జూలై 13, 2011 కడప లోక్ సభ ఉప ఎన్నికలో 5,43,053 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయదుందుభి. వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీతో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఘనవిజయం. మే 16, 2014 పులివెందుల నుంచి 75,243 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపు మే 23, 2019 పులివెందుల నియోజకవర్గం నుంచి 90,110 ఓట్ల ఆధిక్యతతో గెలుపు ముఖ్య ఘట్టాలు ♦ సెప్టెంబర్ 2, 2009 : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూత ♦ సెప్టెంబర్ 25, 2009 : తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను త్వరలోనే కలుస్తానని ప్రకటించిన జగన్ ♦ డిసెంబర్ 15, 2009 : రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లోక్‌సభలో ప్లకార్డు చేతబట్టి సమైక్యాంధ్రకు మద్దతు ♦ ఏప్రిల్ 9, 2010 : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి తొలి విడత ఓదార్పు యాత్ర ప్రారంభం ♦ జూన్ 7, 2010 : తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అనుమతినివ్వాలని కోరిన జగన్. తిరస్కరించిన సోనియా ♦ జూలై 8, 2010 : కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్రను పునఃప్రారంభం ♦ నవంబర్ 29, 2010 : తన తల్లి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్. తాను కడప ఎంపీ పదవికి తాను, పులివెందుల ఎమ్మెల్యే పదవికి విజయమ్మ రాజీనామాలు ♦ మార్చి 11, 2011 : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్‌గా ప్రకటించిన జగన్ ♦ మార్చి 12, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్ ♦ జూలై 8, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలు ♦ ఆగస్టు 10, 2011 : జగన్ ఆస్తులు, సాక్షి పెట్టుబడులపై సీబీఐతో విచారణకు ఆదేశించిన హైకోర్టు ♦ ఆగస్టు 18, 2011 : జగన్ ఆస్తులు, సాక్షి కార్యాలయాలపై సీబీఐ దాడులు, అనేక చోట్ల సోదాలు ♦ మార్చి 31, 2012 : జగన్ ఆస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్ ♦ మే 8, 2012 : సాక్షి పత్రిక, సాక్షి టీవీల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన సీబీఐ ♦ మే 27, 2012 : ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జగన్‌ను విచారించిన సీబీఐ అధికారులు రాత్రి 7.20 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు. ♦ జూన్ 15, 2012 : ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 15 అసెంబ్లీ, 1 లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించింది. ♦ సెప్టెంబర్ 23, 2013 : జగన్‌కు షరతులతో కూడిన బెయిలు మంజూరు ♦ సెప్టెంబర్ 24, 2013 : జైలు విడుదల ♦ అక్టోబర్ 5, 2013 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లోటస్‌పాండ్‌లో తన నివాసం వద్ద ఆమరణ దీక్ష ♦ మే 16, 2014 : శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పరాజయం. కేవలం 1.67 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన టీడీపీ ♦ జూన్ 20, 2014 : శాసనసభలో ప్రతిపక్ష నేతగా జగన్‌ను గుర్తిస్తూ స్పీకర్ ప్రకటన ♦ జనవరి 31, ఫిబ్రవరి 1, 2015 : హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా తణుకులో రెండు రోజులపాటు జగన్ రైతు దీక్ష ♦ జూన్ 3, 2015 : మంగళగిరిలో రెండు రోజులు జగన్ సమర దీక్ష. ఏడాది పాలనలో చంద్రబాబు మోసాలపై, హోదా సాధించనందుకు ప్రభుత్వ వైఖరిపై నిరసన ♦ ఆగస్టు 10, 2015 : ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేసిన జగన్ ♦ ఏప్రిల్ 23, 26, 2016 : ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై రాష్ట్ర గవర్నర్, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్కు ఫిర్యాదు. ♦ మే 16, 2016 : కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ఏకపక్షంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ 16, 17, 18 తేదీల్లో కర్నూలులో జగన్ దీక్ష ♦ జనవరి 26, 2017 : ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన జగన్‌ను చంద్రబాబు ఆదేశాల మేరకు విమానాశ్రయంలోనే అడ్డుకున్న పోలీసులు ♦ మార్చి 1, 2017 : కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ఘోర బస్సు ప్రమాదం. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌పై దురుసుగా ప్రవర్తించిన అప్పటి కలెక్టర్ అహ్మద్‌బాబు. జగన్‌పై అక్రమ కేసులు ♦ మే 1, 2, 2017 : మద్దతు ధరలు కోరుతూ గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష ♦ జూలై 8, 2017 : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా కాలినడకన పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటానని ప్రకటించిన జగన్. ♦ నవంబర్ 6, 2017 : ఇడుపులపాయ నుండి పాదయాత్ర ప్రారంభం ♦ అక్టోబర్ 25, 2018 : వైజాగ్ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం. ♦ జనవరి 9, 2019 : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు. ♦ మే 23, 2019 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సొంతం. -
నేడే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం