BS Yedyurappa
-
కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. యడియూరప్ప కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. దీనిపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. బి.ఎస్.యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. సీఎం ఎంపికకు పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలను నియమించింది. ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెంగళూరుకు చేరుకోగా, కిషన్ రెడ్డి కూడా బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. అయితే, సీఎం రేసులో ప్రహ్లద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్‌లు తదితరులు ఉన్నారు. అయితే, కేంద్ర మంత్రులిద్దరు కలిసి సాయంత్రం 5 గంటలకు కర్ణాటక కొత్త సీఎంను ఖరారు చేయనున్నారు. -
నాపై ఎవరి ఒత్తిడి లేదు: యడియూరప్ప
సాక్షి, బెంగళూరు : సీఎం పదవికి రాజీనామా చేయటంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని, మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశానని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని మోదీ, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. 75 ఏళ్ల తర్వాత కూడా నాకు అవకాశం ఇచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కర్ణాటక ప్రజలకు రుణపడి ఉంటా. గవర్నర్‌కు రాజీనామా ఇచ్చి ఆమోదించాలని కోరా. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తాం. నేను ఎవరి పేరును సిఫార్సు చేయలేదు. అధిష్టానం ఎవరి పేరు సూచించినా సహకరిస్తా. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా’’నని అన్నారు. కాగా, కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కర్ణాటక నూతన సీఎం ఎంపిక పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్ ఉన్నారు. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. కర్ణాటక నూతన సీఎం పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. -
యడియూరప్ప రాజీనామా.. పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్!
బెంగళూరు: కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్సెన్స్‌కు బి.ఎస్.యడియూరప్ప (78) తెరదించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ గహ్లోత్‌కు సమర్పించారు. స్వచ్ఛందంగానే పదవి నుంచి దిగిపోతున్నానని పేర్కొన్నారు. యడియురప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ మొదలయ్యింది. బీజేపీ అధిష్టానం కొత్త సీఎంపై ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం గమనార్హం. యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. యడియూరప్ప మంత్రివర్గాన్ని గవర్నర్ రద్దు చేశారని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదాకా ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారని పేర్కొంది. గవర్నర్‌కు రాజీనామాను సమర్పించిన అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, నాయకులకు, సహకరించిన అధికారులకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీనామా విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని, స్వచ్ఛందంగానే తప్పుకున్నానని, సీఎంగా ప్రజలకు సేవ చేసేందుకు ఇతరులకు మార్గం సుగమం చేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. యడియూరప్ప ఏం చెప్పారంటే.. ‘ఎవరిని సీఎంగా ఎంపిక చేసినా పూర్తిగా సహకరిస్తా. రాజీయాల్లో కొనసాగుతా. పార్టీ అండతోనే పైకి ఎదిగా. నాకు దక్కినన్ని అవకాశాలు బహుశా మరో నాయకుడికి లభించి ఉండకపోవచ్చు. పదవులు ఇచ్చినా స్వీకరించను గవర్నర్ పదవి స్వీకరించాలన్న ఉద్దేశం లేదు. వాజ్‌పేయి నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నారు. వద్దని చెప్పా. కర్ణాటకలో బీజేపీ పటిష్టత కోసం పనిచేస్తా’అని యడియూరప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) నుంచి ఫిరాయించి, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేల(ప్రస్తుత మంత్రులు) భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించగా.. తమతోనే కలిసి ఉంటారని స్పష్టం చేశారు. విధాన సౌధాలో భావోద్వేగంతో కంటతడి తన ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం విధాన సౌధాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యడియూరప్ప ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గద్గద స్వరంతో ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, రాజీనామాను సమర్పించబోతున్నట్లు తెలిపారు. బాధతో కాదు, సంతోషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, జనసంఘ్ సభ్యుడిగా పనిచేసినప్పటి తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తనకు 75 ఏళ్లు దాటినప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్! యడియూరప్ప రాజీనామాతో ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవురు అవుతారన్న దానిపై పడింది. 2023లో జరగబోయే శానసభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలుపు తీరానికి చేర్చే నాయకుడు ఎవరన్న చర్చ మొదలయ్యింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ పార్లమెంటరీ బోర్డుకు, పార్టీ శాసనసభా పక్షానికి కట్టబెట్టినట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్ వెల్లడించారు. శాసనసభా పక్షం భేటీ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. యడియూరప్ప రాజీనామాకు గల కారణాలను ఆయనే వివరిస్తారని స్పష్టం చేశారు. కొత్త సీఎం ఎంపిక కోసం నిర్వహించే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
సస్పెన్స్‌కు నేడు తెర
బెంగళూరు/బెళగావి: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్ నెలకొంది. సీఎం యడియూరప్పను(78) పదవిలో కొనసాగిస్తారా? లేదా అనేది సోమవారం తేలిపోనుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పదవి ఉన్నా లేకున్నా మరో 10–15 ఏళ్ల పాటు బీజేపీ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పని చేస్తానని, ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. యడియూరప్ప ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఇంకా ఎలాంటి సందేశం రాలేదని తెలిపారు. ఆదివారం రాత్రిలోగా లేదా సోమవారం ఉదయంలోగా సందేశం అందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యానని గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పదవి నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే దిగిపోతా, కొనసాగాలని సూచిస్తే కొనసాగుతా అని పునరుద్ఘాటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో రెండేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతానని, ఆ తరువాత జరిగే పరిణామాలు మీరే తెలుసుకుంటారని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ బీజేపీ నాయకత్వం నుంచి సందేశం రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అప్పటి నిర్ణయం అప్పుడే తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు తదుపరి సీఎం ఎవరనే విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం ధార్వాడ్ నుంచి బెంగళూరుకు చేరుకోవడం, ఢిల్లీకి వెళ్లేందుకు బుక్ చేసుకున్న విమాన టికెట్‌ను రద్దు చేసుకోవడం గమనార్హం. అలాగే సీఎం పదవి రేసులో ఉన్న గనుల మంత్రి మురుగేష్ నిరానీ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేల పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి. పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. పార్టీ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ మీరబోనని యడియూరప్ప చెప్పారు. ఆదివారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ‘‘పార్టీలో నాకు ఎన్నో పెద్ద పదవులు దక్కాయి. కర్ణాటక బీజేపీలో ఈ స్థాయిలో పదవులు పొందినవారు ఎవరూ లేరు. నాకు అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు’’అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. నడ్డా ప్రశంసలు మరోవైపు బీజేపీ నాయకత్వం మిశ్రమ సంకేతాలను ఇచ్చింది. యడియూరప్పపై జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం గోవాలోని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కర్టాటక సర్కారు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉందని తాను భావించడం లేదన్నారు. యడ్డిని కొనసాగించాల్సిందే పదవి నుంచి దిగిపోయేందుకు మానసికంగా సిద్ధమైన యడియూరప్పకు సొంత సామాజికవర్గం వీరశైవ లింగాయత్‌ల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. యడ్డిని సీఎంగా కొనసాగించాల్సిందేనని 500 మందికిపైగా వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు డిమాండ్ చేశారు. బాలెహోసూరు మఠాధిపతి దింగలేశ్వర స్వామి, తిప్తూరు మఠాధిపతి రుద్రముని స్వామి, చిత్రదుర్గ మఠాధిపతి బసవకుమార్ స్వామి పిలుపు మేరకు బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి పెద్ద సంఖ్యలో వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు హాజరయ్యారు. యడియూరప్పను సీఎం పదవిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తొలగించడం సరి కాదని వారన్నారు. -
యడ్డి వారసుడెవరో? బీజేపీ చేతిలో ఆ 8 మంది పేర్లు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప స్థానంలో బలమైన మరోనేతను నియమించడం బీజేపీకి సవాలుగా మారింది. కన్నడనాట బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడియూరప్ప (78)ను తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని గత కొంతకాలంగా జోరుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సోమవారంతో యడ్డి సీఎం పదవిని చేపట్టి రెండేళ్లు అవుతుంది. యడ్డి స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన, ప్రజాదరణ కలిగిన నేతను వెతికిపట్టుకోవడం ఇప్పుడు బీజేపీకి కత్తిమీద సాములా మారింది. దక్షిణాదిలో తమకు అత్యంత కీలకమైన కర్ణాటకలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది. కొత్త సీఎంగా మొత్తం ఎనిమిది మంది పేర్లను బీజేపీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యడ్డి వారసుడిగా లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలనేదే అధిష్టానం ఉద్దేశంగా కనపడుతోంది. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 16 శాతానికి పైగానే ఉంటారు. ఎప్పటినుంచో కమలదళానికి గట్టి మద్దతుదారులు. ఢిల్లీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో పంచమశీల లింగాయత్‌లు నలుగురు ఉన్నారు. విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్, ధార్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్, గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మయ్‌లు ఈ నలుగురు. బసన్నగౌడ పాటిల్ ఆర్ఎస్ఎస్లో బలమైన మూలాలున్న వ్యక్తి. ఉత్తర కర్ణాటకలో పేరున్న నాయకుడు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు అదనపు అర్హత అవుతుందని భావిస్తున్నారు. పంచమశీల లింగాయత్‌లను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. అరవింద్ బెల్లాద్ ఇంజనీరింగ్ చదివారు. వ్యాపారవేత్త కూడా. క్లీన్ఇమేజ్ ఉంది. బాగల్కోట్ జిల్లాలోని బిల్గి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగేష్ నిరానీకి చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. హోంమంత్రి అమిత్‌కు సన్నిహితుడిగా చెబుతారు. యడ్డీ తన వారసుడిగా హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్ పేరును సిఫారసు చేసే చాన్సుంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే (బ్రాహ్మణ సామాజికవర్గం), సి.టి.రవి (ఒక్కళిగ)లు రేసులో ఉన్న ఇతర ప్రముఖులు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కతీల్‌కు చెందిన లీకైన ఆడియో సంభాషణను బట్టి చూస్తే ప్రహ్లాద్ జోషి రేసులో అందరికంటే ముందున్నట్లు కనపడుతోంది. నన్నెవరూ సంప్రదించలేదు: ప్రహ్లాద్ హుబ్బళి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపడతారనే వార్తలపై ఆయన శనివారం స్పందించారు. ‘ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయంపై నాతో ఏమీ మాట్లాడలేదు. అయినా, సీఎంగా యడియూరప్ప రాజీనామా చేస్తారనే అంశాలను ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం ప్రసారమాధ్యమాలు(మీడియా) మాత్రమే ఈ అంశాన్ని చర్చిస్తున్నాయి. కొత్త సీఎంగా నన్ను ఎంపికచేస్తారనే విషయాన్ని ఎవరూ నాతో ఇంతవరకూ ప్రస్తావించలేదు’ అని మీడియాతో అన్నారు. అత్యంత ముఖ్యాంశాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలదే తుది నిర్ణయమని చెప్పారు. -
నా భర్తకు బెడ్ ఇప్పించండయ్యా... అంతలోనే..
శివాజీనగర/యశవంతపుర: ‘అయ్యా నా భర్తను కాపాడండి.. కరోనాతో చనిపోయేలా ఉన్నాడు.. ఏదైనా ఆస్పత్రిలో బెడ్ ఇప్పించండి..’ అంటూ ఒక మహిళ ఏకంగా సీఎం యడియూరప్ప ఇంటి ముందు విలపిస్తూ బైఠాయించింది. కరోనా బాధితులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో బెంగళూరులో బెడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఒక మహిళ భర్త (50)కు కరోనా సోకగా పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా చేర్చుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె భర్తను తీసుకొచ్చి సీఎం యడియూరప్ప బంగ్లా ‘కావేరి’ ముందు బైఠాయించింది. ‘కోవిడ్ హెల్ప్‌లైన్ బిజీ అని వస్తోంది, ఏ ఆస్పత్రికి వెళ్లినా బెడ్ లేదంటున్నారు, దయచేసి బెడ్ ఇప్పించండి’ అని విలపించసాగింది. లేదంటే తన భర్తను అక్కడే చనిపోనివ్వండంటూ స్పష్టం చేసింది. ఆమె గోడు చూడలేని సీఎంఓ ఉద్యోగులు చివరికి ఓ ప్రైవేటు ఆస్పత్రి వారితో మాట్లాడి అంబులెన్స్‌లో అక్కడికి పంపించారు. కానీ, విధి వక్రించి కరోనా బాధితుడు మార్గమధ్యలోనే కన్నుమూశాడు. కరోనా బాధిత బాలిక ఆత్మహత్య హోం క్వారంటైన్లో ఉన్న 12 ఏళ్లు చిన్నారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఉడుపి జిల్లా బైందూరు తాలూకాలో జరిగింది. కొడేరికి చెందిన తన్విత (12) కుటుంబంలో అందరికీ పాజిటివ్ వచ్చింది. దీనితో అధికారులు వారిని హోం క్వారంటైన్లో ఉంచారు. ఎవరూ బయటకు అడుగు పెట్టరాదని చెప్పారు. ఈ పరిణామాలతో ఆందోళనకు గురైన తన్విత మేడపైకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. -
ఖండాంతరాలకు భారత్ ఖ్యాతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని యలహంకలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు రోజులుగా కొనసాగుతున్న 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. చివరి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరై, వైమానిక ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనతో భారత ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందని అన్నారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ వైమానిక ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ప్రశంసించారు. సుమారు 530 కంపెనీలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నట్లు చెప్పారు. హైబ్రిడ్ ఫార్మాట్లో తొలిరోజు ఏరో షో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్తో రూ.48 వేల కోట్ల ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అబ్బురపరిచిన విన్యాసాలు అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో భాగంగా స్వదేశీ నిర్మిత తేజస్, భారత వాయుసేనకు చెందిన సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ హెలికాప్టర్ల విన్యాసాలు అలరించాయి. ఈసారి వైమానిక ప్రదర్శనలో అమెరికాకు చెందిన బీఐఓ బాంబర్ విమానం మినహా విదేశీ విమానాలన్నీ పాల్గొన్నాయి. కాగా, కోవిడ్–19 కారణంగా బ్రిటన్, ఐరోపా దేశాలు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశాయి. కానీ, ఆయా దేశాల రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన బోయింగ్, ఎయిర్‌బస్, లుఫ్తాన్సా, లాక్టిన్‌హెడ్ తదితర కంపెనీలు భారత కంపెనీలతో ఒప్పందం చేసుకుని రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వివరించారు. -
బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్
సాక్షి, బెంగళూరు : బాణాసంచా నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీపావళి సందర్భంగా బాణాసంచాను కొనొద్దు, కాల్చొద్దు అంటూ ముఖ్యమంత్రి యడియూరప్ప పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాణాసంచా కాల్చకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తామని ఆయన నిన్న పేర్కొన్నారు. టపాసులు అధికంగా కాల్చడం వల్ల కాలుష్య ప్రమాణం పెరిగి కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో టపాసులను ఈ ఏడాది దీపావళికి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ తీర్మానం వల్ల ప్రజలెవరూ టపాసులు కొనడం కానీ, అమ్మడం కానీ చేసి నష్టపోవద్దని సూచించారు. ఈ ఏడాది బాణాసంచా లేకుండానే దీపావళి పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం) అయితే తాజాగా బాణాసంచా నిషేధం నిర్ణయంపై యడియూరప్ప సర్కార్ పునరాలోచన చేసింది. వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్‌ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శనివారం తెలిపారు. దీపావళి పండుగని పురస్కరించుకొని కర్ణాటకలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే తయారు చేసి, అమ్మాలని అన్నారు. ప్రజలు నిబంధనలకు లోబడి, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇక కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. (‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’) -
కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం
సాక్షి, బెంగళూరు : దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక కూడా చేరింది. కరోనా మహమ్మారితో పాటు వాయు కాలుష్యం కూడా వైరస్ వ్యాప్తికి కారణం నేపథ్యంలో పటాకుల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా టపాసులు అమ్మకాల నిషేధంతో పాటు ఒకవేళ అమ్మినా లేక కాల్చినా లక్ష వరకూ జరిమానా చెల్లించాల్సిందిగా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాజస్థాన్, ఒడిశా కూడా టపాసులపై బ్యాన్ విధించింది. -
లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: సీఎం
బెంగళూరు : ‘‘లవ్ జిహాద్ అనేది ఓ సామాజిక భూతం. దీనిని రూపుమాపేందుకు నిపుణులను సంప్రదించి చట్టం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు, ప్రేమ పేరిట యవతులకు వల వేసే చర్యలను సహించబోమన్నారు. ‘‘లవ్ జిహాద్ కారణంగా ఇటీవల తరచుగా మతమార్పిడులు జరుగుతున్న విషయాల గురించి వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అధికారులతో కూడా దీని గురించి చర్చించా. ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనేది తెలియదు. కానీ కర్ణాటకలో దీన్ని ఆపాలనుకుంటున్నాం. డబు, ప్రేమ పేరుతో మతం మార్చడమనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం’’ అని ఆయన అన్నారు. కాగా ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా లవ్ జిహాదీ అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేవలం వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ తారస్థాయికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో లవ్ జిహాద్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయనే వార్తలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రి కంటే ముందు మీడియాతో మాట్లాడిన హోం మంత్రి బసవరాజ్ బొమ్మాయ్.. లవ్ జిహాద్ అనేది ఓ దుష్టశక్తి అని.. ఇందుకు విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.(చదవండి: లవ్ జిహాద్: హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు) అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి? ముస్లిం వర్గానికి చెందిన అబ్బాయి, హిందూ యువతిని ప్రేమించడం, పెళ్లి చేసుకున్న సందర్భాలను లవ్ జిహాద్‌గా పేర్కొంటూ రైట్ వింగ్ గ్రూపులు వాడుకలోకి తెచ్చాయి. అయితే లవ్ జిహాద్ అనే పదానికి కేంద్ర ఇంతవరకు ఎలాంటి నిర్వచనం చెప్పలేదు. ఈ మేరకు ఫిబ్రవరిలో కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటులో మాట్లాడుతూ.. లవ్ జిహాద్ అనే పదానికి ఎలాంటి చట్ట పరమైన నిర్వచనం లేదన్నారు. ఇప్పటి వరకు దీనిపై కేంద్ర నిఘా సంస్థలు ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రజల మధ్య విభేదాలు లేకుండా స్వేచ్ఛగా ఏ మతానైనా స్వీకరించడానికి వీలుకల్పిస్తుంది. కానీ లవ్ జిహాద్ గురించి ఎక్కడా లేదని లోక్‌సభలో అన్నారు. -
అసెంబ్లీలో అవిశ్వాస రణం
సాక్షి, బెంగళూరు: అవిశ్వాస తీర్మానాన్ని అమలు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, కరోనా వైరస్ వల్ల సాధ్యపడదని అధికార బీజేపీ ఎమ్మెల్యేల పట్టుతో శనివారం విధానసభ వేడెక్కింది. యడియూరప్ప ప్రభుత్వం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఆయన మంత్రివర్గం.. సభలో విశ్వాసం నిరూపించుకోవాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య నోటీసులు ఇచ్చారు. సభాపతి విశ్వేశ్వరహెగడేకాగేరి మాట్లాడుతూ చాలామంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి సభకు రాని కారణంగా ఓటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. (సీనియర్ల అసంతృప్తి.. సీఎంను తప్పించండి) కరోనా సోకిన సభ్యులు పీపీఈ కిట్లు ధరించి వచ్చినా అనుమతి కష్టమే అన్నారు.రాజకీయం, అధికారం కంటే మానవీయ కోణంలో ఆలోచించాలని అన్నారు. ఈ నేపథ్యంలో మూజువాణి ద్వారా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం యడియూరప్ప చర్చను చూస్తూ ఉండిపోయారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ సామాజిక బాధ్యత తమకూ ఉందని.. మూజువాణి ఓటుకు అంగీకరిస్తున్నామన్నారు. అనంతరం సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి విశ్వేశ్వర హెగడే కాగేరి ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన రైతుసంఘాలు జరిపే బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సిద్ధు తెలిపారు. ఎస్పీ బాలుకు నివాళి దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఉభయ సభల్లో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ బాలుకు కర్ణాటకతో ఉన్న అనుబంధం గురించి సభ్యులు కొనియాడారు. -
యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు : కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం రాజకీయ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురిపై నమోదైన 63 కేసులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో జరిగిన కేబినెట్ మీటింగ్‌లోనే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు సంఘ్ పరివార్, రైతులపై నమోదైన 63 కేసులను ఎత్తివేయాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ అందజేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం 63 కేసులును ఉపసంహరించుకుంది.వీరిలో న్యాయశాఖ మంత్రి జెసి మధుస్వామి, పర్యాటక శాఖ మంత్రి సిటీ రవి, అటవీ శాఖ మంత్రి ఆనంద్ సింగ్, వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్, సీఎం రాజకీయ ముఖ్య కార్యదర్శి, ఎంపీ రేణుకాచార్య, మైసూరు-కొడుగు ఎంపీ ప్రతాప్ సింహా, హవేరి ఎమ్మల్యే నెహ్రూ ఓలేకర్ ఇంకా తదితరులు ఉన్నారు. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జె.సి. మధుస్వామి స్పందిస్తూ.. 'హోంమంత్రి బసవరాజ్ కమిటీ ఇచ్చిన ఆధారాలతోనే కేసులు ఉపసంహారించారు.. ఇందులో కేవలం బీజేపీ నేతలవే కాకుండా ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీయులకు చెందిన నేతలకు సంబంధించిన కేసులను కూడా ఉపసంహరించుకుంది. బసవరాజ్ నేతృత్వంలోని సబ్ కమిటీ నివేదికతో కోర్టులకు బారం తగ్గింది' అంటూ అభిప్రాయపడ్డారు. అయితే ఈ 63 కేసుల్లో ఒకటి జె.సి మధుస్వామి పేరిట ఉండడం కొసమెరుపు. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్ అహ్మద్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తప్పుబట్టారు. కేవలం తమ పార్టీకి చెందిన నేతలపై ఉన్న కేసులను కప్పిపుచ్చుకోవడానికి కేసులు ఉపసంహరణ చేసిందంటూ విమర్శించారు. ఈ నిర్ణయంతో బీజేపీ అంతరంగిక ఎజెండా ఏంటన్నది తేటతెల్లం అయిందంటూ దుయ్యబట్టారు. -
కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక సీఎం
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మణిపాల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ద్వారా వెలువరించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే సీఎం యెడియూరప్ప తను కోలుకోవాలని కోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘నా కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. నేను ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. అలాగే ప్రస్తుతం ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉంటాను. మీ అందరి అప్యాయతలకు కృతజ్ఞుడిని. త్వరలోనే తిరిగి విధులు నిర్వహించాలని ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు. (సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్) ಇಂದು ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಬಿಡುಗಡೆಯಾಗುತ್ತಿದ್ದೇನೆ. ನಿಮ್ಮೆಲ್ಲರ ಶುಭಹಾರೈಕೆಗಳಿಂದ ಗುಣಮುಖನಾಗಿದ್ದೇನೆ. ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ಇನ್ನು ಕೆಲವು ದಿನ ಮನೆಯಲ್ಲೇ ಕ್ವಾರಂಟೈನ್ ನಲ್ಲಿ ಇರಲಿದ್ದೇನೆ. ಆತ್ಮವಿಶ್ವಾಸ, ವೈದ್ಯಕೀಯ ಚಿಕಿತ್ಸೆಗಳಿಂದ ಕೊರೋನಾ ಗೆಲ್ಲಬಹುದು. ಆತಂಕ ಬೇಡ, ಮುನ್ನೆಚ್ಚರಿಕೆ ಇರಲಿ. — B.S. Yediyurappa (@BSYBJP) August 10, 2020 కాగా యెడియరప్పకు ఆగస్టు 2 న కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వెంటనే బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటి రోజే ఆయన కుమార్తె పద్మావతికి కూడా కరోనా పాజిటివ్ తేలడంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో చేరారు. అయితే యెడియూరప్ప అనంతరం రాష్ట్రంలోని అనేకమంది రాజకీయ నాయకులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఆగష్టు 4న మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా సోకగా నిన్న( ఆగష్టు9) రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు సైతం కరోనా బారిన పడ్డారు. ఇక కర్ణాటకలో ఆదివారం కొత్తగా 5,985 కేసులు వెలుగు చూడగా, మొత్తం కేసుల సంఖ్య 1.78 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 3,198గా ఉంది. (కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం) -
సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్
బెంగళూరు: ప్రముఖులపై మహమ్మారి కరోనా పంజా విసురుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు ఆదివారం కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా ఆయన కుమార్తెకు సైతం కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమెను చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా సీఎం యెడియూరప్ప సైతం అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ప్రముఖులపై కరోనా పంజా) ఇక తనకు కరోనా సోకినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించిన 77 ఏళ్ల సీఎం యెడియూరప్ప.. ఇటీవల తనను కలిసినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్(80), ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారిన పడగా.. యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62) కోవిడ్‌తో మరణించిన విషయం విదితమే.(దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు) -
వదంతులు నమ్మొద్దు.. లాక్డౌన్ పొడిగింపు లేదు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్డౌన్ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్డౌన్ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ పరిష్కారం కాదన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే లాక్డౌన్ విధించినట్లు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఉదయం బెంగళూరులోని ఎనిమిది జోన్ల ఇన్చార్జి మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ... ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడి.. కోవిడ్, నాన్–కోవిడ్, హోం క్వారంటైన్ విషయాల గురించి చర్చించాలని మంత్రులకు సూచించారు. లక్షణాలు కనిపించని రోగులను ఇంట్లోనే క్వారంటైన్ ఉండేలా చూడాలన్నారు. అంతేకాకుండా మృతదేహాలకు కోవిడ్ పరీక్షల అనంతరం నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు. ఇళ్లలోనే మృతి చెందిన వారికి ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు చేసి అంత్యక్రియలు త్వరగా చేస్తే బాగుంటుందని తెలిపారు. త్వరలోనే వైద్యుల భర్తీ వైద్యుల కొరత నివారించేందుకు పలు పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రతి వార్డులో వలంటీర్‌తో పాటు అంబులెన్సును కేటాయించామన్నారు. కోవిడ్ రోగులను ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన కోవిడ్ రోగులు, ఆస్పత్రిలో ఉన్న పడకల వివరాలు తెలుసుకునేందుకు వలంటీర్‌తో పాటు నోడల్ అధికారిని నియమించాలని మంత్రులకు సూచించారు. ప్రతి వార్డులో ఉన్న కల్యాణ మండపాలను గుర్తించి ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలన్నారు. (ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రోత్సాహకం) టెస్ట్‌లు పెరగాల్సిందే ప్రతి రోజు కోవిడ్ పరీక్షల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని సీఎం యడియూరప్ప సూచించారు. జనాలు గుంపులుగా ఉండే ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కోవిడ్ పరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే అంబులెన్సు వారికి సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. రోగుల్లో 65 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక పడకలు కేటాయించాలన్నారు. లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించాలని సూచించారు. -
సీఎం ఇంటి ఎదుట కరోనా బాధితుడి ఆందోళన
బెంగళూరు: దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తికి ఆస్పత్రిలో బెడ్ కేటాయించలేదు వైద్యులు. ఇదేంటని ప్రశ్నిస్తే.. బెడ్స్ ఖాళీగా లేవని సమాధానమిచ్చారు. దాంతో ఆ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి నివాసం దగ్గరకి వెళ్లి హల్చల్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇంటి బయట నిల్చున్నాడు. ‘నాకు ఆరోగ్యం బాగాలేదు.. నా కుమారుడికి కూడా జ్వరం వస్తోంది. నాకు కరోనా పాజిటివ్ అని వైద్యులకు తెలిపాను. అయినా నాకు బెడ్ కేటాయించలేదు. సీఎం గారు సాయం చేయండి’ అంటూ అరిచాడు. (ఆక్సిజన్ అందకే నా భర్త మృతి చెందాడు) దీని గురించి యడియూరప్ప సన్నిహితులను ప్రశ్నించగా.. వారు ఖండించారు. అంతేకాక సదరు వ్యక్తి ఆస్పత్రికి వెళ్లకుండా సరాసరి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతోనే అతడు ఇలా చేశాడన్నారు. అనంతరం అంబులెన్స్‌లో ఆ కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కర్ణాటకలో కరోనా కేసులు రోజుకురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న కేసులకు సరిపడా ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో లేవు. దీనిపై గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.(‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’) -
సీఎం సమీక్ష.. పకడ్బందీగా రాబోయే లాక్డౌన్
సాక్షి, బెంగళూరు: విజృంభిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగరంతో గ్రామీణ జిల్లాల్లో వచ్చే మంగళవారం నుంచి వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించించడం తెలిసిందే. లాక్డౌన్ తీరుతెన్నులపై ఆదివారం ఉదయం కావేరి అతిథి గృహంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి యడియూరప్ప సమావేశమై చర్చించారు. మంత్రి ఆర్.అశోక్, బీబీఎంపీ కమిషనర్ అనిల్‌కుమార్, ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్ కటారియా తదితరులు హాజరయ్యారు. కరోనా నియంత్రణకు ఏం చేయాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం స్పష్టంచేశారు. అయితే ఇతర జిల్లాల్లో కూడా లాక్డౌన్ విధిస్తే బాగుంటుందనే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు. పీజీలకు స్టైఫండ్ ఇప్పించండి.. దావణగెరెలో జేజేఎం పీజీ వైద్యుల స్టైఫండ్ సమస్యపై వైద్య విద్యా కె.సుధాకర్‌తో సీఎం యడియూరప్ప మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల వైపు ఉండాలని సూచించారు. ధర్నా చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పి విరమింపజేయాలన్నారు. కాలేజీ యాజమాన్యం మాట వినకుంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయాలని సూచించారు. కాగా, సీఎం విరామ సమయంలో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. తన సిబ్బందికి కరోనా రావడంతో ఆయన స్వచ్ఛంద క్వారంటైన్‌ను పాటిస్తున్నారు. చదవండి: 15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు -
సీఎం ఆఫీసుకు మరోసారి కరోనా సెగ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి మరోసారి కరోనా సెగ తాకింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. సీఎం ఆఫీసు 'కృష్ణ'లో పనిచేసే సిబ్బందికి వైరస్ పాజిటివ్ రావడంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. రానున్న కొద్దిరోజులు ఆయన ఇంటినుంచే పని చేయనున్నారు. బెంగళూరు డాలర్ కాలనీలోని తన వ్యక్తిగత నివాసంలో సీఎం బస చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. తన అధికారిక నివాసంలో పనిచేసే డ్రైవర్‌తో పాటు, ఇతర ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినందువల్ల, తాను ఇంటి నుండే వీడియో కాల్స్ ద్వారా కొన్ని రోజులు పని చేస్తానని సీఎం ప్రకటించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ దయచేసి పని చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, శారీరక దూరం కొనసాగించండి , తప్పనిసరిగా మాస్క్‌లో ధరించాలి అని సూచిస్తూ యడియూరప్ప ఒక ప్రకటన విడుదల చేశారు. (కరోనాతో మరో ముప్పు) కాగా సీఎం ఆఫీసులో జూన్19న ఒక ఉద్యోగి, జూన్ 25న మరో నలుగురు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ సందర్భంగా శానిటైజేషన్ నిమిత్తం ఆఫీసును మూసివేసి, తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. గురువారం రికార్డు స్థాయిలో 2228 కేసులు నమోదు కావడంతో కర్ణాటక రాష్ట్రంలోని కోవిడ్-19 కేసుల సంఖ్య 31105కు పెరిగింది. -
బెంగళూరులో 33 గంటల లాక్ డౌన్
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో 33 గంటల లాక్ డౌన్ ప్రకటించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. లాక్ డౌన్ శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది. బెంగళూరు పరిధిలో లాక్ డౌన్ ను సీఎం యెడియూరప్ప విధిస్తున్నారని బెంగళూరు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కేవలం నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందని, ఇతరులెవరు బయట తిరిగినా చర్యలు ఉంటాయని ప్రకటించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ లాక్ డౌన్ విధిస్తోందని చెప్పారు. దీంతో పాటు హోం ఐసోలేషన్ కాలాన్ని 14 రోజుల నుంచి 17 రోజులకు పెంచుతున్నట్లు చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు బూత్ లెవల్లో ఓ కమిటీని ఏర్పాటు చేశారు అందులో ఓ ఆరోగ్యాధికారి, పోలీసు, స్థానిక మున్సిపాలిటీ లేదా పంచాయతీ వాలంటీర్లు ఉంటారు. ఇలా మొత్తం 8,800 టీంలు బెంగళూరులో తయారయ్యాయి. ప్రతి 198 వార్డులకు రెండు అంబులెన్సులను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ 32 మంది విద్యార్థులకు కరోనా పదో తరగతి చివరి పరీక్షలు రాసేందుకు హాజరైన 7,71,506 మంది విద్యార్థుల్లో 32 మంది కరోనా సోకిందని కర్ణాటక ప్రభుత్వం శనివారం తెలిపింది. ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు వద్దంటున్నప్పటికీ ప్రభుత్వం ఈ పరీక్షలను జూన్ 25–జూలై 3 మధ్య నిర్వహించింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. మరో 80 మంది విద్యార్థులను హోం క్వారంటైన్లో ఉంచారు. 32 మంది విద్యార్థులను కలసిన వారిని, ఒకేచోట పరీక్షలు రాసిన వారిని క్వారంటైన్లోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. -
జూలై 5 తరువాత లాక్డౌన్?
సాక్షి, బెంగళూరు: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కట్టుదిట్టమైన లాక్డౌన్ నిబంధనల్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పదో తరగతి పరీక్షలు ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిసింది. జూలై 5వ తేదీన ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ముగియగానే.. కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశంలో చర్చించారు. (బెంగళూరు ప్రజలకు సీఎం వార్నింగ్) పెరుగుతున్న క్రమంలో వారంతపు సెలవుల్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. అయితే జూలై 5వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. వారంలో ఐదురోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఆదివారం అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్ అని ప్రకటించారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, బస్సులతో పాటు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. నేడు ఆదివారం లాక్డౌన్ ఉండదు. కానీ రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధన అమల్లోకి వస్తుంది. జూలై 5 వరకు ఇప్పుడున్న నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. (సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం) కరోనా దండయాత్ర ఓ వైపు వర్షాలు, మరోవైపు కరోనా కేసులతో రాష్ట్ర ప్రజలు సతమతం అవుతున్నారు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసులు 11,923 ఉండగా, ఒక్క బెంగళూరులోనే 569 కేసులు శనివారం నమోదు అయ్యాయి. పావగడలో సీల్‌డౌన్ పావగడ తాలూకాలోని మద్దిబండ, కణివేనహళ్ళి తండా పట్టణం లోని హాఫ్బండ, పాత కుమ్మరి వీధికి చెందిన నలుగురు వ్యక్తులకు కరోనా సోకిన నేపథ్యంలో ప్రాంతాలను సీల్ డౌన్ చేశారు. దీంతో పట్టణం లోని దుకాణాలు , సంత నిషేధించడంతో శనివారం పట్టణం బోసి పోయింది. (ఒంటి చేత్తో మాస్కులు కుట్టిన సింధూరి) -
బెంగళూరు ప్రజలకు సీఎం వార్నింగ్
బెంగళూరు: రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బెంగళూరు వాసులను గురువారం హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా లేదా మరోసారి లాక్డౌన్ విధించమంటారా? అని ప్రజలపై ఆసహనం వ్యక్తం చేశారు. తిరిగి లాక్డౌన్ విధించకుండా ఉండాలంటే తప్పసరిగా భౌతిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. (‘20 రోజులు లాక్డౌన్ విధించాలి’) But we are also thinking about the number of cases which is increasing in Bengaluru. I urge people to maintain social distancing and sanitisation if Bengalurians don't want one more seal down: Karnataka Chief Minister BS Yediyurappa https://t.co/K5TXkA9UIG — ANI (@ANI) June 25, 2020 కరోనా నివారణ చర్యలపై చర్చించేందుకు అధికారులతో యడియూరప్ప సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలో బెంగళూరు కూడా ఒకటి. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 418 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894కు చేరింది. 2,71,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!) -
ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ నుంచి వచ్చేవారిని మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఆయా రాష్ట్రాల నుంచి ప్రయాణీకుల రాకపోకలపై నిషేధం విధించింది. మహమ్మారి కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో విడత లాక్డౌన్లో పలు నిబంధనలు సడలించిన కేంద్రం... కంటైన్మెంట్ జోన్లు మినహా.. అంతరాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతినిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. (మే 31 దాకా లాక్డౌన్: కొత్త నిబంధనలు ఇవే!) ఈ నేపథ్యంలో మంత్రులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ మేరకు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సులు నడిపేందుకు అనుమతినిచ్చారు. అయితే సామాజిక ఎడబాటు నిబంధనలు అనుసరించి బస్సులో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించే వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలో ఓలా, ఉబెర్ కంపెనీలు మంగళవారం నుంచి టాక్సీలు నడుపవచ్చని పేర్కొన్నారు. ఇక విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.(ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం) కాగా కర్ణాటకలో ప్రతీ ఆదివారం లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తెలిపారు. ఆదివారాల్లో ఎటువంటి సడలింపులు ఉండవని.. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అదే విధంగా మంగళవారం నుంచి పార్కులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని షాపులు, మాల్స్, విద్యా సంస్థలు, జిమ్‌లు, స్విమ్మింగ పూల్, ఫిట్నెస్ సెంటర్లు తెరవబోమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా కర్ణాటకలో ఇప్పటివరకు దాదాపు 1231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.(లాక్డౌన్ : కేంద్రం కీలక ఆదేశాలు) -
వలస కార్మికులు: రైళ్లను రద్దు చేసిన కర్ణాటక!
బెంగళూరు: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు పయనమైన వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నందున వలస కార్మికులకు అక్కడే ఉండాల్సిందిగా కోరుతూ రైళ్లను రద్దు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రాపర్టీ బిల్డర్స్‌తో సమావేశమైన అనంతరం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో వ్యాపారాలు, భవన నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికుల ప్రయాణాలు అనవసరం అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.(2 వేల కి.మీ. సైకిల్‌పై ప్రయాణించనున్న వలస కార్మికులు) అదే విధంగా ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 3500 బస్సులు, రైళ్లలో దాదాపు లక్ష మందిని స్వస్థలాలకు పంపించామని యడియూరప్ప తెలిపారు. ఉపాధి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నందున రాష్ట్రంలోనే ఉండిపోవాలని వలస కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయం గురించి వలస కార్మికుల తరలింపు ఇన్చార్జి, నోడల్ ఆఫీసర్ మంజునాథ్ ప్రసాద్ రైల్వేశాఖకు మంగళవారం లేఖ రాశారు. బుధవారం కర్ణాటక నుంచి బయల్దేరే రైళ్లను రద్దు చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాదాపు 10 వేల మంది కార్మికులు బిహార్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. (64 విమానాల్లో 15 వేల మంది..) ఈ నేపథ్యంలో మంగళవారం నిర్మాణ సంస్థలతో భేటీ అయిన సీఎం యడియూరప్ప.. మెట్రో, బీఐఏఎల్, ఇతర ఇన్ఫ్రా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నందున వారిని ఇక్కడే నిలిచిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉపాధి పనులు ప్రారంభం అవుతాయి కాబట్టి రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖకు లేఖ రాశాం’’ అని పేర్కొన్నారు. కాగా వలస కార్మికుల తరలింపునకై రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడపాల్సిందిగా ప్రభుత్వం రైల్వే శాఖను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు రెండు శ్రామిక్ రైళ్లు చిక్బన్వారా నుంచి లక్నో, మాలూర్ నుంచి బార్కకానా(జార్ఖండ్)కు బయల్దేరాయి. దాదాపు 2400 మంది ప్రయాణికులు తమ స్వస్థలాలకు చేర్చనున్నాయి. -
ఏడాది జీతాన్ని విరాళంగా ప్రకటించిన సీఎం
సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల దేశ దేశాలై స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనాపై యుద్ధం కోసం చాలామంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్నారు. సామాన్యులు, సెలబ్రీటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు దోచిన సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తన ఏడాది జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బుధవారం ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు మనం చాలా కష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి కరోనా మహమ్మారితో పోరాడాలి. వ్యక్తిగతంగా, నేను నా ఏడాది జీతాన్ని ముఖ్యమంత్రి సహాయకనిధికి ఇస్తున్నాను. కరోనాపై పోరుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. మీకు తోచిన సహయం చేయమని అభ్యర్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. మరోవైపు కరోనా రక్కసి కన్నడనాట నిరంతరాయంగా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య వందకు దగ్గరగా చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒక్క మంగళవారమే కొత్తగా 13 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించగా, మరో ఆరుమంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. -
కోవిడ్-19: నిబంధనలు ప్రజలకు మాత్రమేనా!?
బెంగళూరు: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాపిస్తున్న తరుణంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఓ వివాహానికి హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్సీ మహాంతేశ్ కవాటగిమత్ కూతురి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో మొట్టమొదటి మరణం కర్ణాటక రాష్ట్రంలో సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాల్స్, సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా జనసమ్మర్ధం ఉన్న చోటకు వెళ్లరాదని.. పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని.. అలా కుదరని పక్షంలో కేవలం 100 మంది కంటే తక్కువ అతిథుల మధ్య తంతు జరిపించాలని ఆదేశించింది.(కరోనా తొలి మరణం: కర్ణాటక యాక్షన్ ప్లాన్!) ఈ క్రమంలో ఆదివారం బెలగావిలో జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ మహంతేశ్ కవాటగిమత్ కుమార్తె వివాహానికి పెద్ద ఎత్తున అతిథులు హాజరుకావడం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సీఎం యడియూరప్ప ఈ వేడుకకు హాజరవడం పట్ల భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎగ్జిబిషన్లు, సమ్మర్ క్యాంపులు, సమావేశాలు, పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు, క్రీడా ఈవెంట్లు ఇలా అన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఇలా ఆడంబరంగా జరిగే వివాహానికి రావడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ప్రజలకు మాత్రమేనా.. నాయకులకు ఉండవా అని మండిపడుతున్నారు. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య సోమవారం నాటికి 118కి చేరింది. ఇక దేశంలో తొలి కరోనా మరణం కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకోగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ ఈ మహమ్మారి కారణంగా మృత్యువాతపడ్డారు.(కరోనా: సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం!)