C Rama chandraiah
-
'టీడీపీ' కి మరో కొత్త తలనొప్పి! ద్వారకా రాకతో..
సాక్షి ప్రతినిధి, కడప: 'చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ఆ ఇద్దరు 30 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయ క్షేత్రంలో పోటీపడ్డారు. మూడు దశాబ్దాలుగా పరాన్నజీవులుగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. వారిని తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నాయకులను అంటగట్టడంపై మాకు ఇదేం ఖర్మ బాబు అనడం జిల్లాలో తెలుగుతమ్ముళ్ల వంతు అయింది. చెల్లని రూకలే మహా ప్రసాదంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, శిరోభారమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.' - చెన్నంశెట్టి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీ నుంచి 1985 ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి గెలుపొందారు. 1989లో జనరల్ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్‌కు, 1991 ఉప ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా తలపడి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పరోక్ష రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపియ్యారు. అయినప్పటికీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనేక పదవులతో సత్కరించిన టీడీపీ పట్ల విశ్వాసం, విధేయుతతో ఉండాల్సిన సీఆర్సీ ప్రజారాజ్యంలో, అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా ఎమ్మెల్సీ దక్కించుకొని మంత్రి పదవిని చేజేక్కించుకున్నారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా పార్టీలు మారుతూ పచ్చి అవకాశవాదిగా సీఆర్సీ ముద్ర వేసుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వయోభారంతో నెట్టుకొస్తున్న ఈదశలో ఆయన పార్టీ మారి అనైతికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉండిపోయారని పలువురు కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు వైఎస్సార్ దీవెనలతో.. వ్యాపార వ్యవహారిక కార్యక్రమాల్లో ఉన్న గడికోట ద్వారకనాథరెడ్డి 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగ్రేటం చేశారు. అప్పటి వర్గ రాజకీయాల ఫలితంగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గీయులు పనిచేశారు. వైఎస్సార్ చల్లని దీవెనలతో ద్వారకా లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీ ఛీ కొట్టింది. 1999లో టికెట్ నిరాకరించింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఉనికి చాటుకోవాలనే తపనతో తెరపైకి రావడం ద్వారకాకు సర్వసాధారణమైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాజాగా టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం. టీడీపీకి కొత్త తలనొప్పి రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబు ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వచ్చి చేరారు. ఇప్పటికే అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న నేతల మధ్యలోకి ద్వారకా రావడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పుకొని వెలుగొందిన ద్వారకా వైఎస్సార్సీపీకి దూరం కావడం వెనుక అవకాశవాదం ఉన్నట్లు పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. సీఆర్సీ,ద్వారకాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్మెంట్) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే. ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్ జియావో పింగ్ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి. ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే. భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్ జెయింట్) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్ అధ్యక్షుడు ‘లీ కువాన్ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్ సింగ్‌ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం. అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు. అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్‌కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్ జుమా’ పాపులిస్ట్గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు. ‘జాకబ్ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. అయితే, భారత్‌లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం. ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్.ఆర్.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్‌గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
సమాఖ్య వ్యవస్థకు ఎంతటి దుర్గతి!
గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా దేశానికి సమాఖ్య వ్యవస్థను ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. దీనినిబట్టి ఎవరి కైనా ఏమి అర్థమవుతుంది? గవర్నర్ పదవిలో ఉండే వారెవరూ కేంద్ర ప్రభుత్వానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదనేకదా? ఇందుకు సంబంధించి 1979 మే 4న సుప్రీం కోర్టు ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒక యజమాని (ఎంప్లాయర్)కీ, ఒక ఉద్యోగి (ఎంప్లాయీ)కీ ఉండే సంబంధం కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య ఉండదనీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో గవర్నర్ ఉండరనీ సుప్రీం కోర్టు ‘డాక్టర్ రఘుకుల్ కేసు’లో స్పష్టంగా చెప్పింది. అంటే, ‘గవర్నర్’ అన్నది ఓ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ స్థానంలో ఉండే వారు రాజ్యాంగబద్ధమైన విధులను మాత్రమే నిర్వహించాలి. కానీ, ఆచరణలో అలా జరుగుతోందా? గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారు దుర్వినియోగం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ల నియామకంలోనూ పాటించవలసిన మార్గదర్శకాలనూ, విధివిధానా లనూ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం గత ఏడు న్నర దశాబ్దాలుగా కనిపిస్తోంది. గవర్నర్‌ను కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఆర్టికల్ 356ను దుర్వినియోగ పరిచి ప్రజా ప్రభు త్వాలను కూలగొట్టిన సంఘటనలు అనేకం. కేరళ కమ్యూనిస్టు యోధుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు వరకు గవర్నర్ బాధితులు ఎందరో ఉన్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపర్చడం శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. కేంద్రం– రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల సమతుల్యతపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు 1983లో ఏర్పాటయిన జస్టిస్ రాజేందర్ సింగ్ సర్కారియా ఐదేళ్ల తర్వాత సమర్పించిన నివే దికలో గవర్నర్ల నియామకం, వారి పనితీరుపై స్పష్టమైన సూచనల్ని చేసింది. నిజానికి సర్కారియా కమిషన్ కంటే ముందు... 1969లో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాల మెరు గుదలపై నివేదిక ఇవ్వాలని రాజమన్నార్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చాలా స్పష్టంగా ‘గవర్నర్ నియామకంలో తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్‌తో సంప్రదింపులు జరపాలి’ అని చెప్పింది. కానీ, ఈ కమిటీ రికమండేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం, సర్కారియా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. కానీ, కేంద్రంలో ఎవరున్నా గవర్నర్లను ఏకపక్షంగా నియమించే సంప్రదాయమే కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ల వ్యవహారశైలి దుమారం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠానికి సొంతంగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ప్రసంగించడం కలవరం రేపింది. అలాగే, కొన్ని బిల్లుల్ని ఆమోదించకుండా తిప్పిపంపారు. ఇక పంజాబ్ గవర్నర్ అయితే, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించినా అందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో సర్వోన్నత న్యాయ స్థానం గడప తొక్కింది. ‘శాసనసభ నిర్వహణకు సంబంధించిన అధి కారాలు అసెంబ్లీ స్పీకర్‌కు ఉండగా, వాటి నిర్వహణలో మీకు అభ్యంతరం ఏమిటి’ అని పంజాబ్ గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ తీసు కున్న చర్యను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అంతేకాదు... ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్రస్వరంతో సుప్రీం కోర్టు గవర్నర్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం స్థానంలో రాజకీయ వైరం నెలకొని వారు ఎడమొఖం పెడమొఖంగా మారిన ఉదంతాలు గతంలో కోకొల్లలు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణలపై పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నో సంద ర్భాలలో వాడీ వేడీగా చర్చోపచర్చలు జరిగాయి. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదని, దానిని రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినిపించింది. ఆశ్చర్యం ఏమంటే, గవర్నర్ వ్యవస్థ వల్ల లోగడ ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ‘మేము సైతం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపర్చడమే చర్చనీయాంశం. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఇటువంటి వివాదాలు చేటు చోసుకొన్న దాఖలాలు లేవుగానీ, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గవర్నర్లను తమ ఇష్టానుసారం బీజేపీయేతర ప్రభుత్వాలపై సవారీ చేయిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ముఖ్యంగా బిల్లుల విష యంలో తమకులేని అధికారాలను ఆపాదించుకొని గవర్నర్ వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడంతోనే ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కొందరు గవర్నర్లు పోషిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దేశంలో సమాఖ్య వ్యవస్థకు పట్టిన దుర్గతిగా రాజ్యాంగ నిపుణులు అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలలో గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన మాట నిజం. గవ ర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం దఖలు పడింది. కానీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుండా లేదా తిప్పిపంపకుండా తొక్కి పెట్టడానికి గవర్నర్‌కు హక్కు లేదు. కాగా, తమ ప్రభుత్వానికి సహకరించని గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనుచితంగా ప్రవర్తిస్తూ కక్ష తీర్చుకొంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలుకొని, అసలు గవర్నర్ లేకుండానే శాసన సభ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పతనంలో దేశం పాతాళంలోకి శీఘ్రగతిన ప్రయాణిస్తున్న వేళ... దేశం శాస్త్ర సాంకేతిక రంగా లలో అద్భుతంగా ముందుకు సాగిపోతోందనీ; చంద్రయాన్, సూర్య యాన్లతో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ఠ ఆకాశాన్నంటుతోందనీ కేంద్రం జబ్బలు చరుచుకొంటే ఉపయోగం ఏమిటి? సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
విదేశాంగ నీతిలో కొరవడిన మూల సూత్రాలు
యుద్ధంలో పరాజితులే తప్ప విజేతలెవరూ ఉండరని టాల్‌స్టాయ్ తన ‘వార్ అండ్ పీస్’ నవలలో ఎప్పుడో చెప్పాడు. చరిత్ర దానిని అనేక మార్లు రుజువు పర్చింది కూడా! ఏడాది దాటిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, నెల రోజులుగా పాలస్తీనా (హమాస్) – ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో ‘పరా జిత’... యావత్ ప్రపంచం అంటే అతిశయోక్తి కాబోదు. అయితే, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య రాజుకొన్న యుద్ధ మూలాలు 40వ దశకం చివర్లోనే ఏర్పడ్డాయి. 1948లో ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఏర్పడి, ఆక్రమిత ప్రాంతాల నుంచి అరబ్బులను తరమికొట్టడంతోనే పశ్చిమాసియాలో శాంతికి విఘాతం ఏర్పడింది. ‘పాలస్తీనా విమోచన సంస్థ’ (పీఎల్ఓ) ఏర్పడి ఆక్రమిత ప్రాంతాలను తమకు అప్పగించాల్సిందిగా ఇజ్రా యెల్‌ను కోరింది. అందుకు భారత్‌తో సహా వివిధ దేశాల మద్దతు కోరింది. అయితే, స్వప్రయోజనాలు, రాజకీయ కార ణాలతో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఇజ్రాయెల్‌ను బలపర్చడమే కాకుండా, భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌ను మందలించే తీర్మానాలన్నింటినీ వీటో చేశాయి. ఈ నేపథ్యంలోనే అరబ్బులు ఇస్లావ్ు ఏకత్వ నినాదాన్ని ఎత్తుకొని ఇస్లా మిక్ దేశాలను తమకు అనుకూలంగా చేసుకోవాలని ప్రయ త్నించారు. కానీ, మత దృష్టితో ఏకం కావడం అన్నది తాత్కాలిక ప్రయోజనాలనే తీరుస్తుందన్నది పాలస్తీనా విష యంలో అనేకసార్లు రుజువయ్యింది. యుద్ధం అన్నది ఓ ఆకస్మిక పరిణామం కాదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం అయినా, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధమైనా వాటికి చారి త్రక కారణాలు ఉన్నాయి. ఈ పరిణామాలకు గల మూల కారణాలను అర్థం చేసుకొని తగిన చొరవతో పరిష్కారానికి ప్రయత్నిస్తేనే యుద్ధాలు నివారించబడతాయి. కానీ, ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఐక్యరాజ్య సమితా? పేరుకు తటస్థం అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి కొన్ని దేశాలకు కొమ్ముకాసే జేబు సంస్థగా మారిపోయిందన్న అపప్రథను ఎప్పుడో మూటగట్టుకొంది. ఐరాస తన అంతర్జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో వెనుకబడింది. గాజాలోని ఆసు పత్రిపై బాంబులు పడి వందలాది మంది మరణిస్తే.. ఆ క్షణాన్నే ఇజ్రాయెల్ భూభాగంపై కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ బాంబులు వేసింది ఇజ్రాయెల్ సైన్యం కాదనీ, ఉగ్రవాదుల పనేననీ ఇజ్రాయెల్ తరఫున వకాల్తా పుచ్చుకొని ఆ దేశాన్ని వెనకేసుకొచ్చారు. జనావాసాలపై, ఆసుపత్రులపై, విద్యా సంస్థలపై దాడులు చేయ కూడదని ‘జెనీవా ఒప్పందం’ ఉన్నా... వాటిని ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తుంటే, నోరు విప్పలేని ఐరాస ఆశక్తత అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇజ్రాయెల్‌పై ‘హమాస్’ చేసిన దాడిని ఎవ్వరూ సమర్థించరు. కానీ, ఉగ్రవాదుల ఏరివేత ముసు గులో గాజాలోని సామాన్య పౌరులను, ముఖ్యంగా పసి పిల్ల లను హతమార్చడాన్ని ఎవరు హర్షించగలరు?! ప్రపంచీకరణ వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలూ పరస్పర ఆధారితమైపోయిన నేపథ్యంలో... ఆ యా దేశాల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పు చోటుచేసుకొంది. ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి వ్యవస్థ పుట్టుకొచ్చి ఆ యా దేశాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను శాసించే స్థాయికి చేరుకొన్న తర్వాత, అంతర్జాతీయ పరిణామాలు కొన్ని దేశాలకు కొత్త సవాళ్లను తెచ్చి పెట్టాయి. ప్రపంచీకర ణతో లాభం పొందిన చైనా... దక్షిణాసియా దేశాల అంత ర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. బలహీనదేశాలకు ఆర్థిక సాయం అందించే నెపంతో కొన్ని దేశాల విదేశాంగ ప్రతిపత్తిని దెబ్బతీసే యత్నాలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. కాగా, భారత్‌కు సంబంధించినంతవరకు పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్నీ, ఏడాదికి పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా నడుమ జరుగుతున్న యుద్ధాన్నీ ఏ దృక్కోణంలోంచి చూడాలన్న అంశంలో దేశంలోని పాలక పార్టీ బీజేపీకీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం అంత ర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాంగ వ్యవహా రాలను కూడా ఆయనే నిర్వహించేవారు. సహజీవన సూత్రం ఆధారంగా అంతర్జాతీయ వ్యవహారాలను చూస్తామనీ; దానికి అనుగుణమైనదే దేశ తటస్థ వైఖరి అంటూ ఆ ప్రాతిపదికననే అలీన విధా నాన్ని (నాన్ అలైన్డ్) రూపొందించారు. అంతేకాదు... వివిధ దేశాల మధ్య సహృద్భావం, అవగాహనతోనే సమస్యలు పరి ష్కారం అవుతాయితప్ప సైనిక ఒప్పందాలు (పాక్ట్స్), సైనిక కూటములలో తీసుకునే సభ్యత్వాలు పరిష్కారం అందించ వని నిర్ద్వందంగా చెప్పేవారు. నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం నుంచి ఆ తర్వాత ఏ ఒక్క ప్రధానమంత్రీ... చివరకు వాజ్‌పేయి కూడా భిన్నంగా వ్యవహరించలేదు. 1999– 2004 మధ్య దాదాపు ఐదేళ్ల పాటు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి పలుమార్లు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. అయితే, తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి తెగబడి వందలాది మంది అమాయక ప్రజల్ని విచక్షణా రహితంగా చంపివేసిన దారుణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఖండించి ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాలస్తీనాకు మద్దతు ఇస్తూ తీర్మానం చేసింది. సాధారణంగా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి దేశంలోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. కేంద్రానికి బాసటగా నిలవాలి. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల మద్దతు పొందడమే లక్ష్యంగా పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం పట్ల అనుసరిస్తున్న తటస్థ వైఖరినే పాలస్తీనా–ఇజ్రాయెల్ అంశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇజ్రా యెల్‌పై హమాస్ దాడి ఓ ఉగ్రవాద చర్య. దీనిని ఖండిస్తూ ఇజ్రాయెల్‌కు బాసటగా నిలుస్తామని దేశ ప్రధానీ, విదేశాంగ మంత్రీ ఇరువురూ స్పష్టంగా వెల్లడించారు. మరోపక్క గాజా ప్రాంతంలోని బాధితులకు అవసరమైన ఆహారం, ఔషధా లను భారత్ తరలించడాన్నీ బాధ్యతాయుతమైన చర్యగా చూడాలి. ఇటీవల ఐరాస సర్వప్రతినిధి సభలో ‘ప్రజల భద్రత, న్యాయమైన మానవీయ బాధ్యత కోసం’ అంటూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. దీనిపై వచ్చిన విమర్శలూ గమనార్హమే. నిజానికి, కీలకమైన ఇటువంటి అంశాలపై ఏకాభిప్రాయ సాధన కోసం పాలక బీజేపీ, అన్ని ప్రధాన రాజకీయ పక్షాలను పిలిచి సమావేశం నిర్వహించాలి. గత 8 ఏళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. అమెరికా అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకోవడం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్ని ఆక్ర మించిన చైనాను నిలువరించలేకపోవడం, నేపాల్‌తో గత దౌత్యపరమైన సంబంధాలను చెడగొట్టుకోవడం, ఇటీవల కెనడాతో సంబంధాలు క్షీణించడం వంటి అంశాలను చూపించి విదేశాంగ విధానంలో ఎన్డీఏ విఫలమైనట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అయితే, ఓట్ల రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తోందని అది దేశ అంతర్గత భద్రతకు ముప్పు అని బీజేపీ తిప్పికొడుతోంది. కారణాలేవైనా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి మును పటిలా దేశంలో రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఓ చేదు వాస్తవం! సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
గురి తప్పిన లక్ష్యాలు
పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం తుడిచి పెట్టుకుపోతుందనీ, నగదు రహిత లావాదేవీలు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని అన్నారు. కానీ నగదు లభ్యత ఆరేళ్ల కిందితో పోల్చితే రెండు రెట్లు పెరిగింది. ప్రజలు పడిన కష్టాలు సరేసరి! కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని చెప్పినా దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో మెరుగుదల లేదు. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు 9 శాతానికి చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ఇవేనా అచ్ఛేదిన్? ఇదేనా సబ్ కా సాథ్... సబ్ కా వికాస్? జబ్బు ఒకటయితే దానికి మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంటుంది, రోగం ముదరడం తప్ప? ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో చలామణీలో ఉన్న నగదు గురించి ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత ఎవరికైనా ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఇటువంటి సందేహం రాక మానదు. 2016 నవం బర్ 8న రాత్రి వేళ అప్పటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1,000, రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేసిన నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నల్లధనం చాలావరకు తుడిచి పెట్టుకుపోతుందనీ, దేశంలో 2 శాతంగా ఉన్న నగదు రహిత లావాదేవీలలో పారదర్శకత పెరిగి రాబోయే ఐదేళ్లకు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని నమ్మకంగా చెప్పారు. కాగా, ఆ నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులైన అమర్త్యసేన్, సౌమిత్రి చౌదరి, మాంటెక్‌సింగ్ అహ్లువాలియా, బీపీఆర్ విఠల్ వంటి వారు తప్పుపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలలో భయాందోళనలు కలిగాయి. ఏటీఎంల వద్ద జరిగిన తొక్కిసలాటలలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక విధాలుగా ప్రజలు కష్ట నష్టాలకు లోనయ్యారు. అయితే, నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం రానున్నదని ఘనంగా సెలవిచ్చారు. కానీ ఈ 6 సంవత్సరాలలో జరిగిందేమిటి? 2016 నవంబర్ 8 నాటికి దేశంలో 16 లక్షల 41 వేల 571 కోట్ల రూపాయల విలువ గల కరెన్సీ చలామణీలో ఉండగా, 2022 డిసెం బర్ 2 నాటికి 31 లక్షల 92 వేల 622 కోట్ల రూపాయల నగదు చలామణీలో ఉందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో నగదు లభ్యత రెండు రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అర్థమవుతూనే ఉంది. ఇక, నల్లధనం ఏ మేరకు కట్టడి అయిం దనే దానిపై లెక్కలు లేవు. ప్రజా జీవితాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకొనే సందర్భంలో పర్యవసానాలను శాస్త్రీయంగా అంచనా వేయకపోతే కలిగే నష్టాలు ఏమిటో ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణ యంతో తెలిసొచ్చింది. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో పాలకులు తీసుకొనే సంస్కరణలు ప్రజాహితానికి అనుగుణంగా ఉండాలి. 2004–2014 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం తిరోగమనంలో పయనించిందనీ, అందువల్ల తాను కొన్ని కఠిన నిర్ణయాలు, కఠోర విధానాలతో గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించి పరుగులు పెట్టిస్తాననీ 2014 జూన్ మొదటివారంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. నిజానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. ప్రపంచ సంక్షోభం ఏర్పడిన 2008 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా 9 ఏళ్లు దేశ స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు సగటున 8 శాతం మేర నమోదయింది. ఆ తర్వాత 2014–2022 మధ్య 8 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క 2020–21లో మాత్రమే అత్యధి కంగా 8.95 శాతం మేర జీడీపీలో వృద్ధిరేటు కనిపించింది. అది కూడా అంతకుముందు ఏడాది కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లో లమై జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కనిపించింది. దానితో పోల్చుకుంటే 2021–22లో ఆర్థిక వ్యవస్థ కుదుటపడటం వల్ల అధిక వృద్ధిరేటు నమోదయింది. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 2 ట్రిలియన్ల డాలర్ల మేర ఉంది. గ్లోబల్ ర్యాకింగ్స్లో అప్పుడు భారత్‌ది 10వ స్థానం. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లతో భారత్ 5వ స్థానం ఆక్రమించడం చెప్పుకోదగ్గ ఘనతే. కానీ, ఇతర సూచికల్లో భారత్ ఏ విధంగా పురోగమించింది? వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకొన్నారు. చేనేత, చివరకు ప్రాణాధార ఔషదాల మీద కూడా జీఎస్టీ విధించడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతున్నది. కేంద్రానికి సమకూరే ఆదాయాన్ని దామాషా పద్ధతిలో రాష్ట్రాలతో పంచుకొనే విధానానికి కూడా ఎన్డీఏ చెల్లుచీటి పాడింది. కొన్ని రంగాలపై ఎన్డీఏ ప్రభుత్వం విపరీతంగా సెస్సు (ప్రత్యేక పన్ను) విధిస్తున్నది. గతంలో కూడా పెట్రోల్, డీజిల్, రహదారులు మొదలైన రంగాలలో ‘సెస్సు’లు ఉన్న మాట నిజమే. కాకపోతే ఆ మొత్తం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఉదాహరణకు 2013–14 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సెస్సు రూపంలో లభించిన మొత్తం రూ. 73,880 కోట్లు కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రానికి సెస్సు ద్వారా పోగుపడిన మొత్తం రూ. 2,96,884 కోట్లు. అంటే గత 7 ఏళ్లల్లో సెస్సుల ద్వారా కేంద్రం అంతకుముందు కంటే 3 రెట్ల మొత్తాన్ని తన ఖజానాలో వేసుకుంది. ఇందులో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజానికి, ‘సెస్సు’ను ఏ రంగం నుంచి అయితే వసూలు చేస్తారో, ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే ఖర్చు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం సెస్సు నిధులను ఇతర రంగాలకు దారి మళ్లిస్తోంది. ఒక్క సెస్సుల రూపంలోనే దేశ ప్రజలు రోజుకు రూ. 813 కోట్లు మేర కేంద్రానికి చెల్లిస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చి నట్లవుతుందని చెప్పినప్పటికీ దానికి ఫలితాలు కనబడటం లేదు. గత 8 ఏళ్లల్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల నమోదు కాలేదు. ఎగుమతుల రంగంలో ఏటా సగటున 100 బిలి యన్ల డాలర్ల మేర పెరుగుదల నమోదు అవుతున్నప్పటికీ, సాపేక్షంగా దిగుమతులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా, ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెం ట్స్’లో లోటు ఏర్పడి రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. 2014లో డాలర్ విలువ 52 రూపాయలుండగా, ప్రస్తుతం 82 ఉంది. రెండుళ్లుగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా నుంచి ఇప్పు డిప్పుడే క్రమంగా కోలుకొంటున్నప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు దాదాపు 9 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఈ) తెలి పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ప్రతియేటా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని మోదీ ఇచ్చిన హామీ నీటిపై రాతగానే మిగిలిపోయింది. మరోవైపు దేశంలో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగు తోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య 100 దాటినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2014–15లో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 86,454 కాగా, 2020–21 నాటికి అది రూ. 1.32 లక్షలకు చేరింది. తలసరి ఆదాయంలో పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు నిజమైన సూచికగా భావించవచ్చునా? సంపన్నులు మరింత సంపన్నులవుతు న్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. కనుక తలసరి ఆదాయ గణాంకాలు నిజమైన అభివృద్ధికి సూచికలు కావు. మరోవైపు రైల్వేలు, ఓడరేవులను ప్రైవేటుపరం చేసిన కేంద్రం త్వరలోనే 25 విమానాశ్ర యాలను లీజుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి సిద్ధం అయింది. ఇవన్నీ గమనించినప్పుడు భారత ఆర్థిక రంగం ‘మేడి పండు’లాగే కనిపిస్తోంది. దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తు లను పెంచకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చ కుండా, విలువైన సహజ వనరుల్ని ఉపయోగించుకోకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా పట్టిష్టం అవుతుంది? స్థిరమైన పెట్టుబడులు, ఎగుమ తులు, విదేశాలతో మెరుగైన వాణిజ్య సంబంధాలు, సరళీకృతమైన పారదర్శక ఆర్థిక విధానాలు, భారం పడని పన్నుల విధింపు తదితర చర్యలు మాత్రమే దేశ ఆర్థిక రంగాన్ని సుస్థిరపర్చగలవు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
‘గడప గడపకు ప్రభుత్వం’ ఫలితాలు షురూ
‘గడప గడపకు ప్రభుత్వం’ అన్నది ఓ విశిష్ట కార్యక్రమం. దీనిని నిరంత రాయంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం ఆహ్వానించదగినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పని తీరుతోపాటు పార్టీ నేతల భాగ స్వామ్యం, అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వారు చూపుతున్న శ్రద్ధ తదితర అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించడమేకాక, తన అభి ప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పనితీరు సరిగాలేని పార్టీ నేతల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోకుంటే తప్పిస్తానని నిష్కర్షగా చెబు తున్నారు. ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సరి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలలో 97 శాతం మేర నెరవేరు స్తున్నందున ప్రజలలో సంతృప్తి స్థాయిలు ఎక్కువగా ఉంటా యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనా. అయితే, ప్రజల సంతృప్తి అన్నది మొత్తంగా ప్రభుత్వంపైనా, తాము ఎన్ను కొన్న ప్రజాప్రతినిధి పనితీరు పైనా, అధికార యంత్రాంగం స్పందనపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల తానొక్కణ్ణే కష్టపడితే సరిపోదనీ, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న దాంట్లో అబద్ధం ఏముంది? ఎన్ని పనులు చేసినా ఇంకా చేయాల్సి నవి ఉంటూనే ఉంటాయి. అలాగే సమన్వయ లోపంతో కొన్ని పనులు జరగడం ఆలస్యం అవుతుంది. ‘గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం’లో అక్కడక్కడ ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న మాట నిజమే. అయితే, దాని గురించి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ పాలకుడి వద్ద రాత్రికిరాత్రే అద్భుతాలు సృష్టించే మంత్ర దండం ఉండదు. కష్టపడాల్సిందే. అందరి సహకారం స్వీకరించాల్సిందే. అప్పుడే ఫలితాలు అందుతాయి. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘నవరత్నాల’ను ఒక్క ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించలేరని కొందరు జోస్యం చెప్పారు. కానీ, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ రథ చక్రాలు ఆగలేదు. ఏ ఒక్క పథకమూ కుంటు పడలేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 97 శాతం పైగా అమలు చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు. ఒకట్రెండు హామీల విష యంలో వాటిని యుధాతథంగా అమలు చేయ డానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే స్థితిలో లేనందువల్ల వాటిని మెరుగైన విధానంలో అమలు చేస్తామని ధైర్యంగా, నిజాయితీగా చెప్పగలగడం కూడా గతంలో లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న వారి ప్రధాన ఆరోపణల్లో ఒకటి రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం లేదన్నది. ఆంధ్రప్రదేశ్‌లో 2 ఎకరాల భూమి విలువకు ప్రస్తుతం తెలంగాణలో 1 ఎకరం భూమి మాత్రమే వస్తుందట. ఈ ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి, ఇదొక డొల్ల వాదన. వీరి దృష్టిలో సంపద అంటే కేవలం రియల్ ఎస్టేట్. తెలం గాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్థిరపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి ప్రాంతంలో కోట్లు కుమ్మ రించి భూములు కొన్నారు. వాస్తవిక అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్ వాల్యూ) లేకుండా కేవలం ప్రచారార్భాటంతో విలువను పెంచి అదే సంపద సృష్టిగా చెప్పుకొన్నారు. నిజానికి అసలైన అభివృద్ధి ఏమిటన్నది ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపర్చడమే సంపద సృష్టి అని నిరూపించారు. పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తాయి. లాభాలు కోసం వెంపర్లాడతాయి. అదికూడా తమ ప్రయోజనాలు కాపాడే వర్గాల కోసం. కానీ, జగన్ విధానం వ్యక్తిగతమైన లాభాలు అందించే వ్యవస్థను ప్రోత్సహించడం కాదు. అన్ని వర్గాలను, ప్రత్యేకించి దశాబ్దాలుగా అణగారి ఉన్న వర్గాలను బాగు చేయడం. వారిని ఆర్థికంగా, సామా జికంగా, రాజకీయంగా సాధికా రుల్ని చేయడం. నిజమైన అభివృద్ధి, నిజమైన సంపద సృష్టి అంటే అదే. కానీ, ఈ అభివృద్ధి నమూనాను కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమను తాము ఎలీట్ వర్గాలుగా భావిస్తూ సమాజంలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు అనుభవించడం తమ జన్మహక్కుగా, అన్ని రంగాలలో పైచేయి తమదే ఉండాలన్న ఫ్యూడల్ మనస్తత్వంతో... పేదలు, బడుగు బలహీన వర్గాలవారు సామాజిక, ఆర్థిక నిచ్చెనమెట్ల ద్వారా పైకి చేరుకొంటుంటే చూచి సహించ లేకపోతున్నారు. ఎలీటెస్ట్ థియరీ (శ్రేష్టవర్గ సిద్ధాంతం) ప్రకారం వారు తమకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించు కొంటారు. వారు ఇతర వర్గాల ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. కానీ, ఆ వర్గాల ఓట్లతోనే అధికారం సంపాదిం చాలని చూస్తారు. ఉదాహరణకు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ఎలీట్ వర్గాలు నిరాకరించాయి. రాజ ధాని ప్రాంతాన్ని కూడా ఓ గేటెడ్ కమ్యూనిటిలా తయారు చేయాలనుకొన్నారు. అందువల్లనే... అమరావతిలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ‘సామాజిక సమతుల్యత’ దెబ్బతింటుందని పేదలను, బలహీన వర్గా లను అవమానపర్చే విధంగా చెప్పారు. అంటే ప్రభుత్వం అన్నది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పని చేయాలా? లేక జగన్ విధానంలో లాగా పేదల కోసం పని చేయాలా? రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి అన్నది కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు పరిమితం చేయాలా? లేక అన్ని వర్గాల ప్రజలకూ అందించాలా? గత 3 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలు చెప్పు కోవడానికి చాలానే ఉన్నా... అన్నింటిలోకెల్లా భూమిలేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది ఓ చారిత్రాత్మక విజయం. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ లేదు. ఇపుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజాకేంద్రక అభివృద్ధి నమూనాకు మద్దతు పలకడం. సామాన్యులు, పేదలూ 2024లో కూడా వైసీపీనే గెలిపించాలి. పెట్టుబడిదారీ వర్గా లకు మరోసారి కోలుకోలేని గుణపాఠం నేర్పాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్‌కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్‌కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్‌లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
ఎన్టీఆర్ జిల్లాను హర్షించకపోవడం దారుణం
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఆహ్వానించి హర్షించకపోగా.. దానిని తప్పుబడుతూ సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించడాన్ని ఖండిస్తున్నట్టు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు నరనరాన ఎనలేని ద్వేషం ఉందన్న విషయం దీని ద్వారా తేటతెల్లమవుతోందని తెలిపారు. ఎన్టీఆర్‌ను గద్దెదించిన సమయంలోనే పార్టీలో ఎన్టీఆర్ చిహ్నాలు, ఆయన పేరును శాశ్వతంగా తొలగించాలని చంద్రబాబు యత్నించారని తెలిపారు. కానీ ఎన్టీఆర్ పట్ల గౌరవాభిమానాలున్న తమలాంటి వారు ఆ నాడు ఆ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకున్న విషయాలను ఆయన గుర్తు చేశారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించక పోవడంపై ఆనాడు ఎన్టీఆర్ వీరాభిమాని నెల్లూరు రమేష్‌రెడ్డి బహిరంగంగా ప్రశ్నించడంతో.. అది మీడియాలో వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఎదురుతిరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫొటోను సభ్యత్వ పుస్తకాలపై చంద్రబాబు ముద్రించినట్టు తెలిపారు. ఆ తర్వాత రమేష్‌రెడ్డిని కక్షపూరితంగా చంద్రబాబు దూరం పెట్టేశారని, రాజకీయంగా అణగదొక్కేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరు మళ్లీ ప్రజల్లో ప్రచారంలోకి వస్తే.. ఆయన వారసులైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వస్తుందని, అప్పుడు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నదే చంద్రబాబు భయమని తెలిపారు. అందుకే 2004–14 మధ్య ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారని, అయితే 2014–18 వరకు నాలుగేళ్ల పాటు అప్పటి కేంద్ర కూటమిలో భాగస్వామిగా ఉన్నా.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని ఏనాడూ బాబు కోరలేదన్నారు. ఎన్టీఆర్ పేరు మీదున్న అన్న క్యాంటీన్లు తొలగించారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నా.. నిజానికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని, కిలో రెండు రూపాయల బియ్యం వంటి పథకాలను తుంగలో తొక్కింది చంద్రబాబే అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు చరిత్ర తెలియదని, వారు చరిత్ర మర్చిపోతారని బాబు అనుకొంటారని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుమార్తెలు, కుమారులు హర్షించారని, చంద్రబాబుకు మాత్రం అలాంటి పెద్ద మనసు, సంస్కారం లోపించాయని ధ్వజమెత్తారు. -
పవన్‌తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో గెలిచే సత్తా లేక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. పొత్తుల గురించి ఇప్పుడేమీ మాట్లాడనని మీడియాతో చెప్పిన చంద్రబాబు.. కుప్పం పర్యటనలో పవన్‌తో పొత్తుకు తాను సిద్ధమేనని, స్పందించాల్సింది అతనేనని చెప్పారన్నారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడటంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఓ వైపు సీపీఐ నారాయణ, రామకృష్ణలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జనసేన, బీజేపీల ఉమ్మడి పొత్తును చంద్రబాబు ఎలా ఆశిస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న కమ్యూనిస్టులను కరివేపాకులా పక్కన పడేస్తాడని అర్థం అవుతూనే ఉందన్నారు. పచ్చి అవకాశవాది అయిన చంద్రబాబుతో చేతులు కలిపితే పవన్‌ను చరిత్ర క్షమించదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఢీ కొనడానికి చంద్రబాబు వద్ద నోటు బ్యాంకు ఉందేమోగానీ ఓటు బ్యాంకు లేదన్నారు. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు సీఎం జగన్‌కి పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. -
చంద్రబాబుకు బోయీలుగా...
ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రజలు తిరస్కరించిన ‘అమరావతియే ఏకైక రాజధాని’ అనే నినాదాన్ని అడ్డుగా పెట్టుకొని మరోసారి సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలు తెలుగుదేశంకు తోకగా మారడానికి తహతహలాడు తున్నాయి. ఆశ్చర్యమేమంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మళ్లీ తెలుగుదేశం వైపు చూడటం. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు, విశ్వాసాలకు పాతర వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చేతులు కలపడం కంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదని తెలిసినప్పటికీ... చంద్రబాబు ఆడే రాజకీయ జూదంలో పావులవడానికి ఈ పార్టీల నేతలు సిద్ధపడటమే విశేషం! చంద్రబాబు చెప్పిన మాటలు, చూపించిన గ్రాఫిక్స్ నమ్మి భూములిచ్చి మోసపోయిన అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికీ చంద్రబాబును పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యం. పైగా, గత రెండేళ్లుగా ఆయన డైరెక్షన్లోనే నడుస్తూ అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని పంతం పట్టి దీక్షలు చేశారు. అందులో భాగంగా టీడీపీ ‘అన్నీతానై నడిపించిన అమరావతి రైతుల ఐక్యవేదిక’ తిరుపతిలో నిర్వహించిన సభలో చంద్రబాబుకు కుడిఎడమలలో ఘనత వహించిన కామ్రేడ్లు, కాషాయధారులు, కాంగీయులు ఆసీనులై భవిష్యత్తులో తాము వేయబోయే రాజకీయపు అడుగులేమిటో చెప్పకనే చెప్పారు. (చదవండి: వితండవాదం ఆపండి... ప్లీజ్!) బీజేపీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో అంతుపట్టదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్ణయంతో తమకు సంబంధం లేదని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతిని రాజధానిగా గుర్తించమని కూడా పార్లమెంటులో స్పష్టంగా చెప్పింది. ఇదంతా రికార్డుల్లో పదిలంగా ఉంది. పైగా, ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉండి రాజకీయ కారణాల వల్ల బయటకొచ్చాక ఆనాడు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ‘విలన్’గా చిత్రీకరించి లబ్ధి పొందడానికి ఎంతగా దిగజారాడో బీజేపీ నేతలకు తెలియనిది కాదు. వంద మంది నరేంద్ర మోదీలు కలిసి వచ్చినా తాను ఎదుర్కోగలనని సవాల్ విసిరారు. పాపం రాష్ట్ర బీజేపీ నేతలకు మతిమరుపు కాబోలు, ఆ అవమానాలను మరచిపోయి చంద్రబాబు పల్లకీకి బోయీలుగా ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాల్లో సీపీఐ పోషిస్తున్న పాత్ర దారితప్పిన బాటసారి వ్యవహారాన్ని తలపిస్తుంది. కమ్యూనిజం పనైపోయింది... టూరిజం ఒక్కటే మిగిలిందన్న చంద్రబాబు వద్దకు కమ్యూనిస్టులు నిజంగానే టూరిస్టుల్లా ‘క్యూ’ కట్టారు. అలాగే కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండటం గమనించదగింది. ఒకవైపు బీజేపీతో చెలిమికట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు గేలం వేయడం చంద్రబాబు చాణక్య నీతిలో మరో కోణం. (చదవండి: ‘రియల్’ ప్రయోజనాలకే అమరావతి) తెలుగు సినిమాల్లో హీరో పాత్రలు పోషించే పవన్ కళ్యాణ్... రాజకీయాల్లో మాత్రం గొప్ప కామెడీ పండిస్తున్నారు. ‘‘నష్టాల్లో ఉందని విశాఖ ఉక్కును అమ్మేయదలుచుకొంటే... 5 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని ఎవరికి అమ్మాలి జగన్ రెడ్డి గారు?’’ అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ కరిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనన్న స్పృహ లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజమేనని గత ఏడేళ్ల నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం 126 లక్షల కోట్లకు పెరిగిన విషయం ఆయనకు ఎవరు చెప్పాలి? ఒకప్పుడు తను ఆదర్శంగా తీసుకొన్న (ఇప్పుడు కాదనుకొంటా) తరిమెల నాగిరెడ్డి ఏనాడో ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి రాశారని పవన్‌కు ఎవరైనా చెబితే బాగుంటుంది. ఆయనతో వచ్చిన సమస్య ఏమిటంటే తను నిద్రలేచినప్పుడే సూర్యుడు ఉదయించాడని అనుకొంటారు. అమరావతి అంశాన్ని సెంటిమెంట్‌గా మార్చి ప్రయోజనం పొందడానికి చంద్రబాబు గత ఎన్నికలలోనే పాచికలు విసిరారు. కానీ, అమరావతి చుట్టు పక్కల నియోజకవర్గాల ప్రజలు తెలుగుదేశంను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేశ్‌ను మట్టికరిపించారు. ‘‘ఈ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అమరావతిని రాసిచ్చేసినట్లే’’ అంటూ గుంటూరు, విజయవాడలలో ప్రజలను రెచ్చ గొట్టారు చంద్రబాబు. కానీ, ఆయనకు లభించిన ఫలితం శూన్యం. (చదవండి: ‘త్రికేంద్రీకరణ’ మనకు కొత్త కాదు!) అమరావతి ఉద్యమం పేరుతో ప్రవాసాంధ్రుల నుంచి టీడీపీకి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి ఏకైక రాజధాని అయితే... అక్కడి రియల్ ఎస్టేట్‌కు రెక్కలొస్తాయన్న ఆశ కలిగినవారు ఎటూ ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిని ప్రజల రాజధాని చేయకుండా... ఆ ప్రాంతంలో బడుగుబలహీన వర్గాల వారు కాలు మోపకుండా ఇన్సైడర్ ట్రేడింగ్‌తో... సంపన్న వర్గాలకు పరిమితం చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ గ్రహించినందునే రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు తెలుగుదేశంకు బుద్ధి చెప్పారు. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) ప్రజా తీర్పుకు అనుగుణంగా, అమరావతి కుంభకోణాన్ని అడ్డుకోవడానికే ముఖ్యమంత్రి జగన్ అధికార వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు ‘రియల్ ఎస్టేట్ అభివృద్ధి నమూనా’ను పేదలు హర్షించలేదు. మధ్యతరగతి వారు సమ్మతించలేదు. సామాన్యుల కోసం వైఎస్ జగన్... సంపన్నుల వైపు బాబు ఉన్నారని ప్రజలు గ్రహించారు. ఆ మేరకు పదేపదే ఎన్నికలలో విస్పష్టమైన తీర్పునిచ్చారు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పటికీ... జగన్‌కు ప్రజలలో లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలవారు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పేరుతో అందరూ జతకట్టి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు పల్లకీకి బోయీలుగా మారుతున్నారు. ఇంతకంటే రాజకీయ దివాళాకోరుతనం మరొకటి ఉంటుందా! (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
చంద్రబాబువల్లే రాష్ట్రానికి అన్యాయం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు హ్రస్వ దృష్టి, ద్వంద్వ ప్రమాణాలే రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటికోసం ఢిల్లీలో పోరాడతామంటూ హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014–19 మధ్య రాయలసీమ ప్రాజెక్టులకు ఏం ఒరగబెట్టారని సోమవారం ఓ ప్రకటనలో రామచంద్రయ్య ప్రశ్నిం చారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో సాహసోపేతంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ప్రాజెక్టు చే పట్టారని.. అలాగే, దానిపై తెలంగాణలో న్యాయపోరాటం చేయడానికీ సిద్ధపడ్డారన్నారు. నీటి హ క్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని జగన్ నిరూపిస్తున్నారని రామచంద్రయ్య కొనియాడారు. బాబు మాత్రం రాష్ట్ర హక్కుల్ని కాలరాసే విధంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో లేఖ రాయించారని ఎద్దేవా చేశారు. -
టీడీపీతో ఒప్పందంతోనే సీఎంపై పవన్ విమర్శలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. టీడీపీతో పవన్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం రామచంద్రయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా టికెట్ల అంశాన్ని అడ్డుపెట్టుకొని పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు, చేష్టలు, ఆయన అపరిపక్వ, అపసవ్య ఆలోచనా విధానానికి, అవగాహనాలేమికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా అమ్మాలని చాలాకాలంగా సినీ పరిశ్రమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఆన్లైన్ విధానంలో ఉన్న పారదర్శకతను, ప్రేక్షకుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిందన్నారు. దీన్ని సినీ పెద్దలందరూ బహిరంగంగా స్వాగతించారని గుర్తు చేశారు. అయితే కొందరు మాత్రం బ్లాక్ మార్కెటింగ్, అడ్డగోలుగా సినిమాల టిక్కెట్ల ధరల పెంపునకు అడ్డుకట్ట పడుతుందనే దుగ్ధతో సీఎం జగన్‌పై విషం కక్కుతున్నారని విరుచుకుపడ్డారు. జనాన్ని పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నాడు పవన్ కల్యాణ్ రోజురోజుకు రాష్ట్రంలో న్యూసెన్స్ వాల్యూగా తయారయ్యారని రామచంద్రయ్య మండిపడ్డారు. 2014లో జనసేన ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పైగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, విధానాలు అవలంబించడం పవన్‌కు సర్వసాధారణంగా మారిందని ధ్వజమెత్తారు. వామపక్షాలతో చెట్టాపట్టాలేసుకొని.. నెలల వ్యవధిలోనే బీజేపీ గూటికి చేరడం దేశ చరిత్రలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని తెలిపే పవన్ కల్యాణ్ తనను ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయాలని చూస్తున్నాడని చెప్పారు. ఆన్లైన్ టిక్కెట్ విధానం వల్ల ఉండే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయలేదని పవన్‌ను నిలదీశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో చేతులు కలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని విమర్శించారు. తెర మీద హీరోగా, రాజకీయాల్లో విలన్‌గా పవన్ నటిస్తున్నాడని మండిపడ్డారు. 2019లో పవన్ కల్యాణ్‌కు చెల్లింపులు చేసే విషయంలో స్వయంగా చంద్రబాబు, లోకేశ్ మధ్య విభేదాలు తలెత్తాయని టీడీపీ వర్గాలే వెల్లడించిన విషయం ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్రజలు పవన్‌ను సరిగ్గా అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు చోట్లా ఓడించారన్నారు. సమయం రాగానే మరోసారి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని చెప్పారు. -
ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం ఆపాలి : సీ.రామచంద్రయ్య
-
‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య విమర్శించారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని దుయ్యబట్టారు. అధికార పార్టీపై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చేరిగారు. చంద్రబాబు గాలి మాటలు చెబుతూ జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని, మోదీని విమర్శించాలంటే చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. -
రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో కేసీఆర్ అన్నారు
-
‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’
సాక్షి, విజయవాడ: కరోనాపై భయాందోళనలు కలిగించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎజెండా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు, మొసలి కన్నీళ్లు ప్రజలకు తెలుసన్నారు. ‘‘అలిపిరి సంఘటన జరిగినప్పుడు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీనే రద్దు చేసిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ బాబు’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాలలో 29 మందిని బలి తీసుకున్న బాబు.. ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడపాలో సీఎం వైఎస్ జగన్‌కి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ‘‘ప్రధాని మోదీ సీటులో బాబు కూర్చొని.. దేశంలో కరోనా కట్టడి చేయొచ్చు కదా?. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడిగా వెళ్లి ఈ భూగోళంలో కరోనా లేకుండా తరిమి కొట్టొచ్చు. ఇన్ని కబుర్లు చెబుతున్న చంద్రబాబు, లోకేశ్‌లు తిరుపతి ఉపఎన్నికలో పక్షం రోజులపాటు గల్లీ గల్లీ తిరిగి ఎందుకు ప్రచారం చేశారు’’ అంటూ రామచంద్రయ్య చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లకుండా అత్యంత బాధ్యతగా వ్యవహరించిన ఏకైక నాయకుడు దేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని సి.రామచంద్రయ్య అన్నారు. చదవండి: 600 మంది ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్ -
సంప్రదాయ రాజకీయాలకు చెల్లుచీటీ
గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం మారిపోయింది. గత పాలకుడి మాదిరిగా ప్రతిరోజూ మీడియాలో కన్పించాలన్న ధ్యాస, యావ సీఎం వైఎస్ జగన్‌కి లేవు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి.. అవన్నీ తన ఘనతలుగా చాటుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. సీఎం ఒక్కడే పనిచేస్తున్నాడన్న భావన కల్పించడానికి అప్పట్లో అందరూ శ్రమించారు. ఇపుడు.. సీఎంతోపాటు చిట్టచివరి గ్రామ, వార్డు వాలంటీరు కూడా కష్టపడుతున్నారన్న వాస్తవాన్ని సీఎం వైఎస్ జగన్ స్వయంగా చాటి చెబుతున్నారు. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని, అవసరం లేని సంప్రదాయ రాజకీయ విధానాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లుచీటీ పాడారు. ఇపుడు రాష్ట్రంలో వెల్లివిరిస్తోంది.. సంక్షేమ సంస్కృతి. తోవ చూపుతున్నది అభివృద్ధి పంథా! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు అనేక అంశాలలో దేశానికే ఓ రోల్ మోడల్‌గా నిలుస్తారు. అందుకు పలు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కరోనా రెండోదశ ఉధృతి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు రెండు నెలలు ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ దేశంలో ఎన్నికల క్రతువు, కుంభమేళా జాతరలను వాయిదా వేయలేదు. వాటి నిర్వహణ కనీసం కోవిడ్ నిబంధనలకు లోబడి జరగలేదు. అయితే, అదే సమయంలో రాష్ట్రంలో తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొనకుండా.. దానిని రద్దు చేసుకొని తనకు ఎన్నికల లాభం కంటే ప్రజారోగ్యమే మిన్న అని వైఎస్ జగన్ చాటి చెప్పారు. ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని భావిం చారు. అందుకే రాష్ట్ర ప్రజలకు ఆయన అత్యంత ఆప్తుడిగా మారారు. కనుకనే, పంచాయతీ, మున్సిపల్, జెడ్పీ ఎన్నికలలో ఆయన ఎన్నికల ప్రచారం చేయకపోయినా.. ప్రతిపక్షాన్ని చిత్తుచిత్తుగా ఓడించమని పిలుపు ఇవ్వకపోయినా, ప్రజలు ఆయనను ఆదరించారు. సీఎం జగన్ చిరునవ్వు ఒక్కటే అధికార పార్టీకి ప్రచారాస్త్రమైంది. ఫలితంగానే, అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాన్ని మించి అదనంగా మరో 10 శాతం ఓట్లతో.. స్థానిక సంస్థల ఎన్నికలలో కనీవినీ ఎరుగని చారిత్రక విజయం వైఎస్సార్సీపీకి దక్కింది. ఆచరించి చూపేవారే నాయకులు కరోనా వంటి ప్రాణాంతక వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో రాజకీయాలను ఇంకా సంప్రదాయశైలిలో నిర్వహించడం మంచిది కాదనే సందేశాన్ని వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా స్పష్టం చేశారు. కానీ.. ఎన్నికలలో గెలుపే పరమావధిగా భావించినవారు.. ఎప్పటిలాగానే పెద్దఎత్తున బహిరంగ సభలు, ర్యాలీలతో మోత మోగించారు. జనాన్ని సమీకరించి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. తిరుపతి మొదలుకొని ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ఇదే విధానం కనిపించింది. అయితే, కోవిడ్ నేపథ్యంలో ఈ సంప్రదాయ రాజకీయ విధానాలకు బలైంది సామాన్యులే. తిరుపతి ఉపఎన్నికలో వివిధ రాజకీయ పార్టీల భారీ ప్రచారం వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అంతకు ముందు కంటే కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ శాసనసభకు జరి గిన ఉపఎన్నిక సందర్భంగా ప్రచార ముగింపు దశలో భారీ బహిరంగ సభ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడి అదృష్టవశాత్తూ కోలుకోగలిగారు. ఆ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న అన్ని పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో కరోనా బాధితుల జాబి తాలో చేరిపోయారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ మొదలుకొని శశిథరూర్, అధీర్రంజన్రాయ్, ఆనంద్ శర్మ తదితరులు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం వల్ల కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించడం గమనార్హం! అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభలకు, ర్యాలీలకు హాజరయ్యారు. అగ్రనేతలు లేకుంటే ప్రచార సభలు సాధారణంగానే జరిగేవి. కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదు. ఈ వాస్తవం తెలిసీ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడం జీర్ణించుకోలేనిది. కఠోర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు సరైన మార్గాన్ని దిశానిర్దేశం చేసేవారే నిజమైన నాయకులు. కరోనా కట్టడిలో పాటించాల్సిన జాగ్రత్తల్ని అగ్రనేతలే ఉల్లంఘించినప్పుడు సామాన్యులకు సుద్దులు చెప్పడం ఏ రకమైన నీతి అవుతుంది? ప్రజలను ఓటర్లుగా పరిగణించే వికృత సంస్కృతి మన దేశంలో.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను కేవలం ఓట ర్లుగా పరిగణించే వికృత సంస్కృతి కొన్ని దశాబ్దాల క్రితం వేళ్ళూనుకొంది. అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండే వర్గాల మధ్య కులచిచ్చు రేపే రాజకీయం చేయడం; జిల్లాలవారీగా కులాల సంఖ్యాబలం బట్టి కొందరికి గొడుగు పట్టడం, మరికొందర్ని విస్మరించడం.. ఈ విధంగా మొత్తం తమ ఎజెండాను రాజకీయలబ్ధి కోసం ఎన్నికల చుట్టూ తిప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను ప్రజలుగానే పరిగణిం చిన మహానాయకులు ఇద్దరు. అందులో ఒకరు ఎన్టీఆర్, రెండోవారు డాక్టర్ రాజశేఖరరెడ్డి. ఎన్నికల్లో అనవసరంగా డబ్బు ఖర్చు చేయొ ద్దని చెప్పేవారు ఎన్టీఆర్. కులమత ప్రాంతాలకు అతీతంగా, చివరకు పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించినవారు వైఎస్సార్. సీఎంగా ఉండగా.. వైఎస్సార్ తమ పట్ల కనబర్చిన ఉదారతను, తాము ఇచ్చిన విజ్ఞాపన పత్రాలపై ఆయన స్పందించిన తీరును ఇప్పటికీ వివిధ పార్టీల నేతలు గొప్పగా చెబుతారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో ఆ ఇద్దరు మహానేతల లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రజల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో కనుమరుగవుతున్న విలువల్ని పెంచుతున్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య.. ఓడ దిగాక వోటి మల్లయ్య’ అనే తీరులో అధికారంలో ఉన్న వారు వ్యవహరిస్తారని ప్రజల్లో నెలకొన్న నానుడిని సీఎం వైఎస్ జగన్ చెరిపివేశారు. అధికారంలో ఉన్నవారి పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉండటం సామాన్యమైన అంశం కాదు. మారిన రాజకీయ స్వరూపం గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం మారిపోయింది. గత పాలకుడి మాదిరిగా ప్రతిరోజూ మీడియాలో కన్పించాలన్న ధ్యాస, యావ సీఎం వైఎస్ జగన్‌కి లేవు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి.. అవన్నీ తన ఘనతలుగా చాటుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. మీడియాలో కన్పించడం కోసం, ప్రతిరోజూ జిల్లాలకు వెళ్లి.. గతంలో వేసిన శిలాఫలకాలను మళ్లీ మళ్లీ వేయడం, పెట్టుబడుల వేట అంటూ మందీమార్బలంతో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడం, పెట్టుబడి సదస్సుల పేరుతో హడావుడి చేయడం.. మొదలైన కృత్రిమ ప్రచారాలకు సీఎం జగన్ దూరంగా ఉంటున్నారు. మంత్రులు, అధికారులను వారిపని వారిని చేసుకోనిస్తున్నారు. అవసరమైన దిశానిర్దేశం చేయడం, సమీక్షలు జరిపి పురోగతిని తెలుసుకోవడం.. వంటి వికేంద్రీకరణ విధానాన్ని పరిపాలనలో ప్రవేశపెట్టారు. ఫలితంగానే, గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలకు అందే సేవలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా, వేగంగా, నిశ్శ బ్దంగా సాగిపోతున్నాయి. ప్రభుత్వపరంగా ఎక్కడా హడావుడి ఆర్భాటం లేదు. గత పాలకుడి మాదిరిగా మొత్తం రాష్ట్రాన్ని తన భుజస్కంధాల మీదనే అతికష్టం మీద మోస్తున్న బిల్డప్‌లు ఇపుడు కనపడవు. ఇపుడు రాష్ట్రంలో ఓ నూతన రాజకీయ సంస్కృతి వెల్లివిరిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉత్సాహం, చురుకుదనం, జవాబుదారీ తనం నేడు కనిపిస్తున్నాయి. ప్రజలకు అందుతున్న సేవల్లో వేగం, నాణ్యత పెరిగాయి. ముఖ్యమంత్రి ఒక్కడే పనిచేస్తున్నాడన్న భావన కల్పించడానికి అప్పట్లో అందరూ శ్రమించారు. ఇపుడు.. సీఎంతోపాటు చిట్టచివరి గ్రామ, వార్డు వాలంటీరు కూడా కష్టపడుతున్నారన్న వాస్తవాన్ని వైఎస్ జగన్ స్వయంగా చాటి చెబుతున్నారు. వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించడం ఇందుకు తాజా ఉదాహరణ. ‘స్వేచ్ఛ’ అన్ని హక్కులకు మూలం అని, అభివృద్ధికి సాధనం అని డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పిన విధంగానే నేడు.. ఏపీలో అన్ని వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని, అవసరం లేని సంప్రదాయ రాజకీయ విధానాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లుచీటీ పాడారు. ఇప్పుడు రాష్ట్రంలో వెల్లివిరిస్తోంది.. సంక్షేమ సంస్కృతి. తోవ చూపుతున్నది అభివృద్ధి పంథా! సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ -
ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కులేదు
తిరుపతి తుడా: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీతో పాటు ఆయన జంటపక్షులు పవన్, చంద్రబాబు పోటీపడి ప్రకటించి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ముంచారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. తిరుపతిలో బుధవారం కాపు/బలిజ నేతలతో సమావేశమైన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించుకుందామని వారికి సూచించారు. చంద్రబాబు బలిజల్ని ఓటు బ్యాంక్‌గా చూసి ఇన్నాళ్లు మాయమాటలతో మోసగించారని చెప్పారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బలిజలు చంద్రబాబుకు గుర్తురారన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎవరు ఓటేసినా అది బూడిదలో పోసిన పన్నీరులా వృధా అవుతుందన్నారు. ప్రత్యేక హోదా నినాదం బలపడాలన్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన నినాదం నిలవాలన్నా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఉండాలని చెప్పారు. తనది కమ్యూనిస్ట్ సిద్ధాంతమని చెప్పుకొనే పవన్‌కల్యాణ్ బీజేపీతో కలవడం సిగ్గుచేటన్నారు. ఈ పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీని బలపరిచి ఫ్యాన్‌గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఆయన గత 3 రోజులుగా నియోజకవర్గాల వారీ బలిజ నేతలతో సమావేశమవుతున్నారు. నైనారు శ్రీనివాసులు, మురళి, జయకృష్ణ, రవి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో నేతలు రామచంద్రయ్యను సత్కరించారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు శకం ముగిసింది : సి. రామచంద్రయ్య
-
లోకేశ్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలి
కడప కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే న్యాయస్థానాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించిన నారా లోకేశ్‌పై న్యాయస్థానాలే సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. లోకేశ్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తణుకులో లోకేశ్ చేసిన విమర్శ కూడా న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కించపరిచే విధంగా ఉందన్నారు. -
‘లోకేష్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలి’
సాక్షి, అమరావతి : నారా లోకేష్ వ్యాఖ్యలపై న్యాయస్థానాలే సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత సీ రామచంద్రయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. తణుకులో లోకేష్ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కించపరచడమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు న్యాయస్థానాలు నడుస్తున్నాయని మాట్లాడటం లోకేష్ అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమని సీ రామచంద్రయ్య అన్నారు. కాగా తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తణుకులో లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారుచదవండి: ‘వరి చేనుకు చేపల చెరువుకు తేడా తెలియని మేధావి’ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు న్యాయ స్థానాలు నడుస్తున్నాయనట్లు మాట్లాడటం ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. లోకేష్ వ్యాఖ్యలపై న్యాయస్థానాలే 'సుమోటో' గా కేసు నమోదు చేయాలి. — C RAMACHANDRAIAH (@crama39111) October 27, 2020 -
జశ్వంత్ సింగ్ మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొలుత సైనికుడిగా దేశానికి వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా జశ్వంత్‌సింగ్ ఎన్నికయ్యారని తెలిపారు.దేశ రాజకీయాలలో జశ్వంత్ సింగ్ కీలక పాత్ర పోషించారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేత సీ. రామచంద్రయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జశ్వంత్ సింగ్ గొప్ప దేశభక్తుడని, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. -
అమరావతి రైతుల్ని మోసం చేసింది బాబే!
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు అక్రమ మార్గాలలో అడ్డుపడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు.. తాజాగా అమరావతి అంశంపై పెద్దఎత్తున తన మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. అమరావతి రైతులను వ్యవసాయానికి దూరం చేసి వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించాలనుకోవడంతోనే సమస్యలు వచ్చిపడ్డాయి. నిజానికి, అమరావతి రైతులు దీక్ష చేయాల్సింది చంద్రబాబు ఇంటి ఎదుట. శాపనార్థాలు పెట్టాల్సివస్తే.. తమను మభ్యపెట్టి మోసం చేసిన చంద్రబాబునే వారు టార్గెట్ చేయాలి. ఎందుకంటే, అమరావతి రైతాంగానికి నమ్మకద్రోహం చేసింది ముమ్మాటికి చంద్రబాబునాయుడే. ఆయన స్వార్థం, ధనదాహం కారణంగానే అమరావతి రైతులు తమ విలువైన వ్యవసాయ భూముల్ని కోల్పోయారు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియనివారికి రియల్ ఎస్టేట్ రుచి మప్పాలని చూశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి చంద్రబాబు రాజధాని కట్టకుండా కాలయాపన చేసినందునే అక్కడ తాత్కాలిక నిర్మాణాలు మినహా చెప్పుకోదగ్గ శాశ్వత కట్టడం ఒక్కటీ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు అమరావతి రైతాంగాన్నేకాదు.. రాష్ట్ర ప్రజలందర్నీ రాజధాని పేరుతో మభ్యపెట్టారు. మోసం చేశారు. అందుకు తగిన ఫలితం ఎన్నికలలో అనుభవించారు. అమరావతి రైతులు తన మీద తిరుగుబాటు చేస్తారనే! తనను నిలదీసి ప్రశ్నించే రోజు వస్తుందనే భయంతోనే హైదరాబాద్‌లో కూర్చొని.. రాజకీయ స్టీరింగ్ తిప్పుతూ మీడియాలో మాత్రమే చంద్రబాబు కనిపిస్తున్నారు. డొల్ల వాదన చంద్రబాబుకు తెలిసిన అనేకానేక వక్ర విద్యల్లో.. మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం ఒకటి. ఈ మధ్య సోషల్ మీడియా, అదేవిధంగా అనుకూల మీడియా ద్వారా గతంలోని వార్తల్ని, ప్రత్యేకించి ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై అసెంబ్లీలో మాట్లాడిన మాటలను పదేపదే చూపుతూ ఆయనేదో మాట మార్చారన్నట్లుగా వక్రీకరిస్తున్నారు. 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఒక ‘గుడ్ ఫెయిత్’తో వైఎస్ జగన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ అటవీ భూములు పుష్కలంగా ఉన్న దొనకొండ ప్రాంతం లేదా నూజివీడు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. ప్రజలను, ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టిస్తూ.. చంద్రబాబు గన్నవరం, నూజివీడు, దొనకొండ.. ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒకచోట రాజధాని రాబోతున్నదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో.. 3 పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు. కానీ, శివరామకృష్ణన్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకముందే సొంత మనుషులతో ఓ కమిటీ వేసుకొన్నారు. పైగా, ఎటువంటి వెరపులేకుండా శివరామకృష్ణన్ కమిటీ.. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయమని సూచించిందని, ఆన్లైన్ ద్వారా 4 వేలమంది అభిప్రాయాలు కోరితే, అందులో మెజారిటీ ప్రజలు అమరావతికి అనుకూలంగా ఓటు వేశారంటూ పచ్చిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత శివరామకృష్ణన్ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం ఆత్మహత్యాసదృశం అంటూ ‘హిందూ’లో ఓ వ్యాసం రాశారు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నది బూటకం ఇక, ‘అమరావతి నిర్మాణం’కు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని.. ఇదొక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, సొంతంగా సమకూరే ఆదాయంతోనే.. ప్రపంచ రాజధానులను తలదన్నే రీతిలో అమరావతిని కట్టవచ్చునని చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు. సొంత నిధుల నుంచి రూపాయి కూడా రాజధానికి అవసరం లేకపోతే.. కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఇచ్చిన రూ. 2,500 కోట్లు సరిపోవని, ఇంకా నిధులు ఇవ్వాలని పదేపదే కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం, ప్రధాని నరేంద్ర మోదీని దూషించాల్సిన అగత్యం ఆనాడు ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుపై ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అది చాలదన్నట్లు రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరణకోసం హడ్కో, ఆసియన్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ మొదలైన ఆర్థిక సంస్థలను అప్పులిమ్మని ఎందుకు అర్థించినట్లు?! అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందని అబద్ధం చంద్రబాబు, తెలుగుదేశం నేతలు తాజాగా చేస్తున్న శుష్క ప్రచారానికి పరాకాష్ఠ.. తమ ఐదేళ్లపాలనలో అభివృద్ధి వికేం ద్రీకరణ చేశామనడం. పునర్వ్యవస్థీకరణ బిల్లుననుసరించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని వెనుకబడిన 7 జిల్లాలకు కేటాయించిన రూ. 350 కోట్లు కూడా ఆ జిల్లాల అభివృద్ధికై ఖర్చుపెట్టలేదు. పైగా, చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకు కేంద్రం ఇచ్చిన రూ. 50 కోట్లల్లో కేవలం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి.. మిగతా మొత్తాన్ని దారి మళ్లించారు. రాష్ట్రంలో కరువే భయపడి పారిపోయేటట్లు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని మెజారిటీ మండలాలు కరువుకోరల్లో చిక్కి సతమతం అయ్యాయి. ఈ తప్పిదాలు, వైఫల్యాలు, పాపాలు గమనించడం వల్లనే ప్రజలు చంద్రబాబును ఎన్నికలలో శిక్షించారు. అమరావతి ప్రాంతం ఉన్న రెండు నియోజకవర్గాలు మంగళగిరి, తాడికొండ రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగినవిధంగా గుణపాఠం చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ తరహాలో తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున తమ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని ఆ రెండు నియోజకవర్గాలలో ఎవరిని కదిపినా కథలుకథలుగా చెబుతారు. అవసరం లేకపోయినా హైదరాబాద్‌ను వీడి అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు నేడు ప్రధాన ప్రతిపక్షనేతగా సొంత రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. హైదరాబాద్ నుండి కదలడం లేదు. అమరావతికి వస్తే ఏదో ఒక రోజు రైతులు తన మీద తిరగబడతారన్న భయం ఆయనను వెంటాడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు 100 మంది నరేంద్ర మోదీలొచ్చినా, 1,000 మంది కేసీఆర్‌లొచ్చినా భయపడనని బీరాలు పలికిన చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్రమోదీని ప్రసన్నం చేసుకోవడానికి ఏవిధంగా సాగిలపడుతున్నారో అందరూ చూస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబునాయుడు అనేక విధాలా తాపత్రయ పడుతున్నారు. కొన్ని వ్యవస్థలలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల సహాయసహకారాలను స్వీకరించి.. రాజకీయంగా మళ్లీ ఉచ్ఛదశలోకి రావాలన్న తాపత్రయంతో చంద్రబాబు అనేక రాజకీయ విన్యాసాలు సాగిస్తున్నారు. అభివృద్ధి వికేం ద్రీకరణకు అడ్డుపడుతున్నారు. అయితే, ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబును అమరావతి రైతులే ప్రజాకోర్టులో నిలబెట్టే సమయం ఎంతో దూరంలో లేదు. వ్యాసకర్త మాజీ మంత్రి, సీ రామచందయ్య ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
అస్తిత్వాన్ని చాటుకునేందుకే చంద్రబాబు తంటాలు
కడప కార్పొరేషన్/ సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఒక ముగిసిన అధ్యాయం కాబోతుందన్న ఆందోళనతో తన అస్తిత్వాన్ని చాటుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తంటాలు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య విమర్శిం చారు. మంగళవారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► బాబుకు భ్రమల్లో బతకడం ఎక్కువైంది. 2014–19 మధ్య కాగితాల్లో చూపిన అభివృద్ధిని ఇప్పుడు మళ్లీ ప్రజలకు చూపిస్తూ సొంత మీడియాలో బాకా కొట్టుకోవడం సిగ్గు చేటు. అమరావతిలో కొన్ని భవనాలు మాత్రమే కట్టి మొత్తం రాజధాని పూర్తయినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ► చంద్రబాబు ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టి నమ్మించారు. ప్రత్యేక విమా నాల్లో ఐదేళ్లపాటు విదేశాలకు పెట్టుబ డుల కోసమని పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. ► భాగస్వామ్య సదస్సులు పెట్టి రూ.25 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పినా అందులో 2 శాతం కూడా సాధించలేకపోయారు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. ► బాబు అవినీతి ముద్రలు అన్ని జిల్లాల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియనట్లు అమాయకత్వం నటించడం విచిత్రంగా ఉంది. -
స్వీయ తప్పిదాలతోనే ఈ దుస్థితి
రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఏ చిన్న అంశాన్నీ వదలకుండా అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలను నిర్వహించి గంటల కొద్దీ తెచ్చిపెట్టుకొన్న ఆవేశం, ఆవేదనతో మాట్లాడే అలవాటు ఉన్న చంద్రబాబు తన వ్యక్తిగత సహాయకుడిపై, తదితరులపై తాజా ఐటీ దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? 2050 వరకు తామే అధికారంలో ఉంటామనే ధీమాతో చట్టాల్ని చాపలా చుట్టిన చంద్రబాబు అండ్ కోకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అధికారంలో ఉండగా చంద్రబాబు, ఆయన తాబేదార్లుగా పనిచేసిన అధికారులు పాల్పడిన అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వ సంస్థలు నేడు దృష్టి సారించాయి. వాటి లోతు తెలుసు కాబట్టే బాబు తన అనుయాయులపై ఐటీదాడుల పట్ల వ్యాఖ్యానించకుండా కుక్కిన పేనులా పడిఉంటున్నారు. చంద్రబాబు స్వయంకృత పాపాల పంట పండుతున్నట్లుంది. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు’ ఓ పాపులర్ తెలుగు సినిమాలో విలన్‌ను ఉద్దేశించి హీరో పలికిన డైలాగ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు, అధికారంలో ఉండగా ఆయనకు తాబేదార్లుగా పనిచేసిన కొంత మంది అధికారులకు సరిగ్గా అన్వయిస్తుంది. 2050 వరకు తామే అధికారంలో ఉంటామనే ధీమాతో చట్టాల్ని చాపలా చుట్టిన చంద్రబాబు అండ్ కోకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. పాపాలు చేస్తే అవి వెంటాడటం, మెడకు చుట్టుకోవడం ఎవరికైనా సహజమే. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబుకు బినామీలుగా, తాబేదారులుగా వ్యవహరించి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కొందరు వ్యక్తులపై చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కొన్ని వ్యవస్థలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోగలిగిన ‘రాజకీయ కళ’ చంద్రబాబుకు ఉన్న మాట నిజం. కానీ, చంద్రబాబు విద్యల కంటే ‘చట్టం’ గొప్పది. కొంత ఆలస్యం కావచ్చునేమోగానీ.. అక్రమాలను కప్పిపుచ్చడం ఎవరికీ సాధ్యం కాదు. 15 ఏళ్లపాటు తన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఓ సాధారణ ప్రభుత్వోద్యోగి ఇంటి మీద ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం 5 రోజులపాటు నిర్విరామంగా సోదాలు నిర్వహించి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకొన్న ఉదంతంలో రోజులు గడుస్తున్నా పల్లెత్తు వ్యాఖ్య చేయడానికి చంద్రబాబు సాహసించలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం వరకూ.. టీడీపీకి చెందిన వ్యక్తులు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసుల్లో, ఆదాయపు పన్ను ఎగవేసిన ఉదంతాల్లో చట్టం తన పని తాను చేసుకుపోయినా.. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు.. అవన్నీ పనిగట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్నాడంటూ నిందించారు. ప్రస్తుతం.. తన పార్టీకి చెందిన కీలక వ్యక్తులు, వారి బంధుగణం పాల్పడిన అక్రమాలపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తులో భాగంగా దాడులు చేసినప్పటికీ.. చంద్రబాబు మూగనోము పట్టారు. రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఏ చిన్న అంశాన్నీ వదలకుండా అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలను నిర్వహించి గంటల కొద్దీ తెచ్చిపెట్టుకొన్న ఆవేశం, ఆవేదనతో మాట్లాడే అలవాటు ఉన్న చంద్రబాబు ఈ ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు ఐదేళ్ల అవినీతి పాలనలో అడుగడుగునా అవినీతి పుట్టలు పుట్టుకొచ్చాయి. సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఉన్నతాధికారులను దగ్గర పెట్టుకొని.. చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు చంద్రబాబు పాల్పడ్డారు. ఒకరిద్దరు అధికారులు ‘సర్వంతామే’ అన్నట్లు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారి చంద్రబాబు చెప్పినదల్లా చేశారు. చెప్పనివి కూడా చేసిపెట్టారు. ప్రభుత్వంలోని అనేక పనులను అస్మదీయులకు దఖలు పరిచారు. ఇవన్నీ చేసిపెట్టిన అధికారులు చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు సరికదా.. వారికి మితిమీరిన స్వేచ్ఛ కల్పించారు. చంద్రబాబు ‘నరేంద్రమోదీ’ని ఏపీ ప్రజల దృష్టిలో విలన్‌గా చిత్రీకరించడానికి తెర వెనుక అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని నరేంద్రమోదీ, అమిత్‌షాలపై దారుణమైన పోస్టింగ్‌లు పెట్టారు. తనకు అనుకూలమైన ఓ దినపత్రికలో నరేంద్రమోదీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఓ మానసిక విశ్లేషకుడితో జుగుప్సాకరమైన రాతలు రాయించారు. విజయవాడలో ప్రజాధనంతో ‘ధర్మదీక్ష’ పేరుతో నిర్వహించిన సభలో సినీనటుడు బాలకృష్ణ.. ప్రధాన మంత్రిని పచ్చిబూతులు తిడుతుంటే.. సీఎంగా ఉన్న బాబు ఆ మాటల్ని ఆమోదిస్తున్నట్టుగా నిర్వికారంగా ఉండటం ‘యూట్యూబ్’లో ఇప్పటికీ కనిపిస్తుంది. సినీ నటుడు శివాజీ అనే వ్యక్తితో ‘గరుడపురాణం’ పేరుతో.. కొన్నాళ్లు రోజువారీ సీరియల్ నడిపించారు. మోదీ.. టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని, అందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఊదరగొట్టారు. దేశ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పాలన్న ఆశతో చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలను, దాంతోపాటు పార్టీ సిద్ధాంతాలను కాలరాసి కాంగ్రెస్ పార్టీతో అంటకాగటం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే గుజరాత్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు రహస్యంగా నిధులు సమకూర్చారన్న వార్త గుప్పుమంది. ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల సమయానికి.. చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించడానికి చంద్రబాబు కాంగ్రెస్, జేడి(ఎస్)లకు ఇతోధికంగా సహాయం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. ఆ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ గెలవడంలో నా పాత్ర కూడా ఉంది’’ అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సహకారం అంతటితో ఆగలేదు. చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఊది నరేంద్ర మోదీని గద్దె దించడానికి చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేశారు. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలను దగ్గర చేసి యూపీఏ–3 గొడుగు కిందికి తేవడానికి చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో ప్రధానమైనది నిధులలేమితో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి పెద్దఎత్తున ఆర్థిక సాయం చేయడం. ఆ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలలో, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారన్న సమాచారాన్ని బీజేపీ పసిగట్టింది. చంద్రబాబు ఏ విధంగా నిధులు సమీకరించారు.. వాటిని ఏ విధంగా ఏయే వ్యక్తుల ద్వారా.. ఏయే మార్గాలలో చేరవేశారన్న పక్కా సమాచారం కేంద్రం వద్ద ఉందని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఆనాడు చంద్రబాబు, ఆయన తాబేదార్లుగా పనిచేసిన అధికారులు పాల్పడిన అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వ సంస్థలు నేడు దృష్టి సారించాయి. చంద్రబాబు చేసిన అనేక తప్పులు, మోసాలు, పాపాలకు బదులుగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలతో కనాకష్టంగా ప్రతిపక్ష హోదాకు పరిమితం చేశారు. ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు చంద్రబాబు ఓటమిలో ఒక పార్శ్వం మాత్రమే. చంద్రబాబు ఓటమిలో రెండో పార్శ్వం ప్రజల తీర్పును వమ్ము చేసి స్వార్థంతో తను, తన అనుచర వర్గం ఆర్థికంగా బలోపేతం కావడానికి అక్రమాలకు పాల్ప డటం. దీనికి చట్ట ప్రకారం శిక్షపడాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రజల దృష్టిని మరల్చడానికి, తానేమీ అన్యాయాలు, అక్రమాలకు పాల్పడలేదని చెప్పుకోవడానికి చంద్రబాబు గత 7 నెలలుగా అధికార వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని 23 గ్రామాలకు చెందిన రైతులతో దీక్షలు, ఉద్యమాల పేరుతో చేయిస్తున్న క్రతువును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాజధాని రైతులకు ఎటువంటి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ.. రాజధాని రైతులు దీక్షలు విరమించకుండా చంద్రబాబు, ఆయన సృష్టించిన కొంత మంది రెడీమేడ్ నాయకులు వారిని రెచ్చగొడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టిన అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడానికి చంద్రబాబు రైతులను పావులుగా వాడుకుంటున్నారు. నిజానికి, రైతులు ఉద్యమించాల్సింది చంద్రబాబుకి వ్యతిరేకంగా! ఐదేళ్లలో చంద్రబాబు తమకు ఎందుకు న్యాయం చేయలేదో రైతులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ భూములను కొన్ని సంస్థలకు ఎందుకు కారుచౌకగా కట్టబెట్టాడో, తమకు ఇస్తామన్న భూములను ఎందుకు అభివృద్ధి చేసి ఇవ్వలేదో రైతులు చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అమరావతి వద్దనే లక్ష కోట్లు పెట్టుబడి పెడితేనే 29 గ్రామాల రైతులకు న్యాయం జరుగుతుందా? రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక మంది రైతులు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారు. కొన్ని పత్రికలు, చానళ్లు చంద్రబాబుకు వంతపాడుతూ రైతులను రెచ్చగొట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలకు గొడుగుపట్టే కొంతమంది ఇతర పార్టీల్లోని అగ్రనేతలు.. అమరావతిపై చంద్రబాబు అనుకూల ధోరణి, వాణిని వినిపించడం సిగ్గుచేటు. చంద్రబాబు విష కౌగిలి కారణంగానే.. ఎంతో చరిత్ర కలిగిన కొన్ని పార్టీలు నామమాత్రంగా మిగిలాయి. చంద్రబాబు విష పరిష్వంగం నుంచి బయటపడకపోతే ఆ పార్టీలను, నాయకులను చరిత్ర క్షమించదు. చంద్రబాబు దళం ఆంధ్రప్రదేశ్ బీజేపీని హస్తగతం చేసుకొని, బాబు ఎజెండాను అమలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ కేంద్ర నాయకత్వంపై ఉంది. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబును రాజకీయంగా ఆదరిస్తే అంతే సంగతులు! వ్యాసకర్త మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య