Cyclone Phethai
-
66 హెక్టార్లలోనే నష్టమంట!
పెథాయ్... జిల్లాలో ఈ తుఫాన్ రైతాంగం నడ్డివిరిచింది. పంట కోతకోసి పొలాల్లోనే కుప్పలుండగా భారీ వర్షాలు కురిశాయి. ఎంతగా రక్షించుకుందామన్నా... కిందనుంచి నీరు చేరింది. చివరకు జిల్లాలో 74వేల హెక్టార్లకు పైబడి పంట కుప్పల్లోకి నీరుచేరినట్టు ప్రాథమికంగా నిర్థారణైంది. కానీ ఇంతలో ఏమైందో ఏమో... దానిని పరిగణనలోకి తీసుకోలేదు. పైగా 74వేల హెక్టార్లలో నష్టపోయిన ఇతర పంటల్ని 66వేలకు కుదించేశారు. దీనివల్ల ఎవరు నష్టపోవాలో ఏమో.. విజయనగరం ఫోర్ట్: కష్టాల్లో ఉన్న రైతులను అన్ని విధిలా ఆదుకుంటామని చెప్పే పాలకులు చేతల్లో దానిని ఆచరించడం లేదు. రైతుకు అందించే సాయం విషయంలోనే ఎంతో కొంత కోత విధించే యోచనతో ప్రస్తుత సర్కారున్నట్టు అర్థమవుతోంది. పె«థాయ్ తుఫాన్‌వల్ల జరిగిన పంట నష్టం అంచనా విషయంలో ఈ ఆరోపణలు రుజువవుతున్నాయి. పంట నష్టం జరిగినదానికీ, అధికారులు లెక్కల్లో చూపుతున్నదానికీ ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీనిని బట్టి రైతులపై ఈ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమవుతోంది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం సంభవించిన పెథాయ్ తుఫాన్ కారణంగా జిల్లాలో వివిధ పం టలకు పెద్ద సంఖ్యలో నష్టం వాటిల్లింది. అయితే పంట ప్రాధమిక అంచనాలో అధికారులు గుర్తించి న నష్టం విస్తీర్ణం తుది నివేదిక సమయానికి తగ్గి పోవడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇంతలో ఎంత వ్యత్యాసం తుఫాన్ సమయంలో మొక్కజొన్న 520 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. తాజా తుది నివేదికలో 64 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. చెరుకు పంట 12 హెక్టార్ల వరకు నష్టం జరిగినట్టు ప్రాధమికంగా అంచనా వేసి, తుది నివేదికలో 1.4 హెక్టార్లుగానే పేర్కొన్నారు. పరిగణనలో లేని వరి పంట నష్టం వేలాది హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. కోతకోసం పొలాల్లోనే కుప్పలు వేయగా వాటికిందకు భారీగా నీరు చేరింది. దీనివల్ల ధాన్యం రంగు మారడమే గాకుండా... కొంతవరకూ కుప్పలు కుళ్లి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కా నీ దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలే దు. తుఫాన్ కారణంగా జిల్లాలో పనలపై ఉన్న వరి పంట 14,788 హెక్టార్లలో నీట మునిగింది. కుప్పల రూపంలో 59,150 హెక్టార్లలో నీటమునిగింది. పంట నీటమునగడం వల్ల ధాన్యం రంగు మారి నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కానీ వరి పంటకు సంబంధించి పంట నష్టం జరిగినట్టు పరిగణనలోకి తీసుకోలేదు. వరి పంటకు నష్టం వాటిల్లినప్పటికీ రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. రూ. కోట్టలో నష్టం జరిగితే రూ. లక్షల్లో పరిహారం పెథాయ్ తుఫాన్ వల్ల వరి పంటకు 74,438 హెక్టార్లులో నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. మొక్కజొన్నకు 520 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, దాని విలువ రూ.65 లక్షల వరకు ఉంటుంది. చెరుకు పంట 12 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, దాని విలువ రూ. 2లక్షలు వరకు ఉంటుంది. కాని పరిహారం కోసం వ్యవసాయ అధికారులు మొక్కజొన్న, చెరుకు పంటలకు సంబంధించి 66.3 హెక్టార్లలో నష్టం జరిగినట్టు గుర్తించారు. దీనికి రూ.8.18 లక్షలు మాత్రమే పరిహారానికి వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కోసిన పంట పరిగణనలోకి రాదు వరి పంట కోసిన తర్వాత పంట నష్టం అంచనాలోకి పరిగణలోనికి తీసుకోం. రంగు మారి న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సిఫార్సు చేస్తాం. – జి.ఎస్.ఎన్.లీలావతి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ అధికారులు గుర్తించిన పంట నష్టం వివరాలు (హెక్టార్లలో) మండలం పంట నష్టం గుర్ల మొక్కజొన్న 1.4 పూసపాటిరేగ మొక్కజొన్న 48 చీపురుపల్లి మొక్కజొన్న 15.5 చీపురుపల్లి చెరకు 1.4 వర్షపు నీటిలో వరి చేను కుప్పలు(ఫైల్) -
గజగజ
ఖమ్మంమయూరిసెంటర్: పెథాయ్ తుపాన్ వణుకు పుట్టిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా గజగజలాడాల్సి వస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు కురిసిన వర్షం వల్ల జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి గాలులు పెరిగాయి. రెండు రోజుల క్రితం వరకు 24 డిగ్రీలు ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 18 డిగ్రీలకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలో కూడా ఇంతటి ప్రభావం కనిపించలేదు. ఆదివారం నుంచి చలిగాలులు వీస్తున్నప్పటికీ సోమ, మంగళవారాల్లో చలి పంజా విసిరి.. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు చేరాయి. చలి తీవ్రత ఇంకా రెండు రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలు చేయడం, శీతల గాలులతోపాటు చలి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఎలా తట్టుకోవాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు చలితో ఇబ్బంది పడుతున్నారు. తీవ్రతను తట్టుకునేందుకు స్వెట్టర్లు, జర్కిన్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌ల కోసం నేపాలీ షాపుల వద్ద కు పరిగెడుతున్నారు. రోజువారీ పనులకు వెళ్లే వారు సైతం బయటకు రావాలంటే జంకుతున్నారు. వణికిస్తున్న చలి.. ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు గతం అంత గా తగ్గనప్పటికీ తుపాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలిగాలులు ఎక్కువయ్యా యి. దీంతో మూడు రోజుల నుంచి తీవ్రమైన చలితో జిల్లా ప్రజలు గజగజలాడుతున్నారు. పట్టణాలకంటే పల్లెలు, మారుమూల అటవీ ప్రాంతా ల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో గిరిజన గూడేల్లో నెగడ్లు(మంటలు) పెట్టుకొని చలి కాగుతున్నారు. చలి తీవ్రత కారణంగా ఉదయం.. సాయంత్రం అని తేడా లేకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. బయటకు అడుగు వేయాలంటే భయపడుతున్నారు. ఇక వృద్ధులు, పిల్లలు, గర్భిణులు రాత్రి.. పగలు తేడా లేకుండా దుప్పటిని వీడడం లేదు. దీంతో రాత్రి 11 గంటల వరకు జనసందోహంతో ఉండే పట్టణాల్లోని ప్రధాన వీధులు ఆరు గంటలకే నిర్మానుష్యంగా మారుతున్నాయి. పూరి గుడిసెలో ఉన్నవారితోపాటు కిటికీలు, తలుపులు లేని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే లేవాల్సిన పేపర్ బాయ్‌లు, పాలు, కూరగాయల వ్యాపారులు చలి నుంచి కాపాడుకునేందుకు దుప్పట్లు కప్పుకొని పనుల్లోకి వస్తున్నారు. రాత్రిపూట పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వణుకుతూనే పనులు చేయాల్సి వస్తోంది. చలి తీవ్రత పెరగడంతో శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తాయని, ఇందుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలి జాగ్రత్తలు ఇలా.. సాధ్యమైనంత వరకు పసిపిల్లలను బయట తిప్పొద్దు. రాత్రి పడుకునే ముందు ముఖానికి పాండ్స్ రాయాలి. కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ఎంపిక చేసుకొని పిల్లలకు తొడిగించాలి. పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాతే బయటకు తీసుకురావాలి. స్కూల్ పిల్లలకు వేడి నీటితోనే స్నానం చేయించాలి. సాయంత్రం కాగానే ఇంటి నుంచి బయటకు పంపించొద్దు. అప్రమత్తత అవసరం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నూలు, ఉన్ని దుస్తులు ధరించాలి. చెవుల్లోకి చలిగాలి వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. వెంటనే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఉదయం 10 దాటిన తర్వాతే బయటకు తీసుకురావాలి. స్కూల్ పిల్లలకు వేడి నీటితోనే స్నానం చేయించాలి. సాయంత్రం ఇంటి నుంచి బయటకు పంపించొద్దు. – గంగరాజు, జనరల్ ఫిజీషియన్ -
పగలే చలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అంతటా ఒకటే ‘కూల్’ టాపిక్.. ఈ చలేంట్రా బాబూ అన్నదే.. పెథాయ్ తుపాన్ దెబ్బకు రాత్రి, పగటి ఉష్ణోగ్రతలకు తేడా లేకుండా పోయింది. ఉదయం, మిట్టమధ్యాహ్నం అన్న తేడా లేకుండా చలి వణికించేసింది. అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలే పగలూ నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో భద్రాచలంలో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదైంది. అక్కడ సాధారణంగా పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 10 డిగ్రీలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. మహబూబ్‌నగర్‌లో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కాగా, హన్మకొండలో పగటి ఉష్ణోగ్రత కూడా 18 డిగ్రీలే నమోదైంది. వాస్తవంగా హన్మకొండలో సాధారణంగా 30 డిగ్రీలు పగటి ఉష్ణో గ్రత నమోదు కావాలి. కానీ 12 డిగ్రీలు తక్కువగా నమోదైంది. అంతేకాదు హన్మకొండలో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదైంది. అంటే అక్కడా పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య పెద్దగా తేడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గతంలో ఎన్నిసార్లు తుపాన్లు, చలికాలం వచ్చినా ఇలాంటి పరిస్థితి లేదని ప్రజలు అంటున్నారు. నిజామా బాద్, రామగుండంలోనూ 9 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే అనేకచోట్ల మోస్తరు నుంచి అధిక వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా తల్లాడ, మధిరల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. పెథాయ్ తుపాను శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. తుపాను తీరం దాటినందున ఒకట్రెండు రోజుల్లో శీతల గాలుల తీవ్రత తగ్గి, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ‘చిల్డ్’ సిటీ... రాజధాని ఒక్కసారిగా ‘చిల్డ్’జోన్లో చేరిపోయింది. తుపానుతో పాటు శీతల గాలుల జోరుతో నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తొమ్మిది డిగ్రీలు పడిపోయాయి. దీంతో రాత్రితో పాటు పగటి సమయాల్లోనూ చలి తీవ్రత నగరవాసుల్ని వణికిస్తోంది. చిరు జల్లులు సైతం చలి తీవ్రతను పెంచేశాయి. గడిచిన 24 గంటల్లో నగరంలో పగటిపూట 19.8, రాత్రివేళల్లో 15.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణగా 28 డిగ్రీలు నమోదు కావాల్సి ఉంది. కానీ తొమ్మిది డిగ్రీలు తగ్గి 19.8 డిగ్రీలు రికార్డు కావటంతో పగలు–రాత్రి తేడా లేకుండాపోయింది. దీంతో నగరంలో ఒక్కసారిగా స్వెటర్లు, బ్లాంకెట్లు, జెర్కిన్ల మార్కెట్‌కు డిమాండ్ పెరిగింది. తుపాను కారణంగా ఆకాశం మేఘావృతమవడంతో గాలి నాణ్యత కూడా ఓ మోస్తరుగానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలా ఉంటే నగరంలో 2012 జనవరి 15న మారేడుపల్లిలో 5.2 డిగ్రీలు, 2011 జనవరి 6న కాప్రాలో 5.6 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజృంభిస్తున్న ఫ్లూ... చలిగాలుల తీవ్రతతో రాష్ట్రంలో ఫ్లూ విజృంభిస్తోంది. మరోవైపు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వెంకయ్య(73) మంగళవారం మృతిచెందాడు. చలి తీవ్రత కారణంగా రాష్ట్రంలో పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. అధిక చలితో పిల్లల్లో ఆస్తమా, జలుబు వంటివి వచ్చే ప్రమాదముందని, తీవ్రమైన చలి కారణంగా ఊపరితిత్తులు దెబ్బతింటాయని డాక్టర్ కమల్‌నాథ్ ‘సాక్షి’కి తెలిపారు. తీవ్ర చలి కారణంగా అధిక ఆహారం తీసుకుంటారని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 14 మంది, ఏపీలో 19 మంది మృతి చలిపులి పంజా విసిరింది. పెథాయ్ తుపాను ప్రభావంతో వీస్తున్న గాలులు, చలి తీవ్రతను తట్టుకోలేక మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో 14 మంది మృతి చెందారు. కాగా ఏపీలో శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 19 మంది చనిపోయారు. పెథాయ్ తుపాను అల్పపీడనంగా బలహీనపడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. శనివారం నుంచే వణికించడం మొదలైంది. అన్నదాత గుండె పగిలింది మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్: అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని గొట్టిపల్లి చిన్నయ్య(69) కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరిసాగు చేసిన చిన్నయ్య కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. వర్షానికి పొలంలో కుప్పల చుట్టూ నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్‌కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా నీటమునిగిన తన పంటను చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా పంట మునగడంతో తీవ్రంగా కలత చెంది నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. -
పంటపొలంలోనే తనువు చాలించాడు
సాక్షి, శ్రీకాకుళం : పెథాయ్ తుపాను సృష్టించిన అలజడి ఓ రైతు కుటుంబంలో విషాదం నింపింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీట మునగడం తట్టుకోలేక కుప్పకూలిన రైతు.. ఆ పంటపొలంలోనే తనువు చాలించాడు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.... గత మూడు రోజులుగా కోస్తా తీరాన్ని హడలెత్తించిన పెథాయ్ తుపాను కారణంగా జిల్లాలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ధాన్యం నీట మునగడంతో పలువురు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో గొట్టిపల్లి చిన్నవాడు(70) అనే రైతు ధాన్యం తడిసిపోతుందన్న ఆవేదనతో మంగళవారం పొలంలో ఉన్న నీటిని దిగువకు వదిలేందుకు సమాయత్తమయ్యాడు. పార పట్టుకుని పొలంలో బట్టీ వేస్తుండగానే గుండె పోటు రావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. కాగా మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
మరింతగా బలహీనపడిన ‘పెథాయ్’
సాక్షి, అమరావతి : మూడు రోజులుగా హడలెత్తించిన పెథాయ్ తుపాను ఎట్టకేలకు నిష్క్రమించనుంది. వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారి ఒడిశా తీర సమీపంలో కేంద్రీకృతం కానుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఉత్తరాంధ్రలో ఈరోజు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ఎత్తివేసిన అధికారులు... ఈరోజు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. 22 మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతు కాకినాడ : పెథాయ్ తుపాన్ సృష్టించిన అలజడి కారణంగా 22 మంది మత్స్యకారుల జాడ తెలీకుండా పోయింది. తుపాన్ గాలుల ధాటికి ఆయిల్ రిగ్గుకు కట్టుకున్న తాడు తెగి వీరు ప్రయాణిస్తున్న బోటు మచిలీపట్నం వరకు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో వేటకు వెళ్లిన దుమ్ములపేట, పర్లోవపేట, ఉప్పలంకకు చెందిన మత్స్యకారులు ఆచూకీ తెలీకుండా పోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం దుమ్ములపేటకు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం తీరానికి చేరుకున్న వీరు బంధువులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇక పర్లోవపేట, ఉప్పలంకకు చెందిన 22 మంది మత్స్యకారుల గురించిన సమాచారం తెలియాల్సి ఉంది. వీరి జాడ కోసం నేవీ, కోస్టు గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు. రైతులకు కన్నీళ్లే తుపాను ధాటికి పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడ, చేబ్రోలు, విజయనగరం, మల్లవరంలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. వరి, ఉద్యానవన పంటలు నీట మునగడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉల్లి, మిర్చి, పత్తి, మినప పంటలకు భారీగా పెట్టుబడి పెట్టామని, ఇంత నష్టం జరిగినా అధికారులు తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో పెథాయ్ తుపాన్ నష్టం.. పెథాయ్ ప్రభావంతో గరివిడి మండలం కుమరాం గ్రామంలో చలికి 50 గొర్రెలు మృతి చెందాయి. వెదుర్లవలస గ్రామంలో వర్షం కారణంగా పాఠశాల ప్రహారీ గోడ కూలిపోయింది. కురపాం మండలంలో చలికి, వర్షానికి మొత్తం 26 ఆవులు మృత్యువాత పడ్డాయి. -
పెథాయ్ ఎఫెక్ట్ భారీ నష్టం
-
పెథాయ్ ఎఫెక్ట్: వేలాది ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడ్డ పెథాయ్ తుపాన్ రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతిసింది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డ తుపాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 3,488 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 182 హెక్టార్లలో కూరగాయలు, 630 హెక్టార్లలో అరటి పంట, 21 హెక్టార్లలో మిరప, 4 హెక్టార్లలో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. తెలిపారు. విద్యుత్ సరాఫరాకు పలు చోట్ల తీవ్ర అంతరాయం కలిగింది. ఉప్పాడ బీచ్ రోడ్ 6 కి.మీ మేర రోడ్డు పాడవ్వటంతో కోటి రూపాయల మేర నష్టం ఏర్పడింది. కాట్రేనికోనలో 250 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. కృష్ణా జిల్లాలో పదివేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు అనేక వాణిజ్య పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో నీటిలోనే చిక్కుకుని ఉండటంతో ప్రభుత్వం మంగళవారం కూడా పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది. -
తుపాన్ భాదితులను పరామార్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పు గోదావరి: పెథాయ్ తుపాన్ తీరం తాకడంతో కాకినాడలో తుపాన్ భాదితులను పరామర్శించిన వైస్సాఆర్సీపీ నాయకులు. కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్, పిఠాపురం కోఆర్డినేటర్ పెండెం దొరబాబు దుమ్ములపేట, పిఠాపురం గ్రామాల్లో పర్యటించారు. వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను కలసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మాకు ఎటువంటి సహయక చర్యలు తీసుకోలేదని భాదితులు వాపోయారు. తాగడానకి మంచి నీరు, వంటి సహయక చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . తుపాన్ భాదితులకు బిస్కెట్లు, మంచి నీళ్ల పాకెట్లు అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించడానికి ప్రభుత్వం వెంటనే సహయక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
అధికారులు సీఎంలా నిర్లక్ష్యంగా ఉండొద్దు : పార్ధసారధి
సాక్షి, విజయవాడ : పెథాయ్ తుపాన్ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో కోతలు పూర్తి కాలేదని, కుప్పలు కూడా వేసిన పరిస్థితిలేదన్నారు. రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులలో రైతులకు ఆసరాగా ఉండాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాలికొదిలేసి రాజకీయక్రీడలు ఆడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ పార్టీ కార్యలయంలో పార్ధసారధి మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో క్షుద్రపాలన జరుగుతోంది. రాజకీయాలు, ఇతర పార్టీలతో సంబంధాలు అనేవే చంద్రబాబుకు ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తోంది. క్షుద్రపూజలు అర్ధరాత్రి పూట జరుగుతుంటాయి. చంద్రబాబు కూడా ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇచ్చేసి తుపానుపై అర్ధరాత్రి సమీక్షలు చేస్తున్నారు. పెథాయ్ తీవ్రతను బట్టి ప్రభుత్వం అత్యవసర పరిస్దితిని ప్రకటించింది. అధికారులందరికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఆర్టీసి, రైల్వేల సర్వీసులు రద్దు చేశారు. స్కూళ్లకు సైతం సెలవులు ఇచ్చారు. 24 గంటలు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన చంద్రబాబు వేరే రాష్ట్రాల సీఎంల ప్రమాణస్వీకారానికి వెళ్లారు. తుపాను వచ్చే సమయంలోనే సీఎం పనిచేయరు. తుపాను వచ్చాక అధికారులను పనిచేయనివ్వరు. తుపాను సహాయక చర్యల సమయంలో చంద్రబాబు మందిమార్భలంతో వచ్చి అధికారుల పనులకు అడ్డుతగులుతుంటారు. నేడు వేరే రాష్ట్రాలలో ఉన్న చంద్రబాబు రేపు వచ్చి హడావుడి చేస్తారు. మరో రెండు రోజులు అయ్యాక కేంద్రం డబ్బులు ఇవ్వడంలేదు అంటూ ప్రచారం స్టార్ట్ చేస్తారు. తర్వాత హుద్ హుద్ సమయంలో లాగానే పెథాయ్‌ను కూడా చంద్రబాబు జయించేశాడంటారు. ఈరోజు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎవ్వరూ అందుబాటులో లేరు. సొంతపనులపై వెళ్లారని తెలిసింది. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారులందరూ కూడా ముఖ్యమంత్రిలా నిర్లక్ష్యంగా ఉండొద్దు. రిపోర్ట్‌ల కోసం గణాంకాలకోసం పనిచేయొద్దు. రైతులకు భరోసా కల్పించండి. నష్టతీవ్రతను తగ్గించే చర్యలు చేపట్టాలి. ప్రకృతి వైపరిత్యాల సమయంలో గతంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని సకాలంలో అందించడం లేదు. ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుని రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను విహారయాత్రలకు తీసుకువెళ్తున్నారు. పోలవరం పూర్తవ్వాలంటే మూడు నాలుగేళ్లు పడుతుందని అక్కడికి వెళ్లిన వారందరూ చెబుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం అనుమతులు సాధించారు. కాలువలు తవ్వించారు. ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించేలా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో చంద్రబాబు పాత్ర సున్నా. కేవలం ముడుపుల కోసమే ఇది చేపట్టారు. తాము నీళ్లిస్తామంటూ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మంత్రి దేవినేని చాలాసార్లు చెప్పారు, అవన్నీ కల్లబొల్లి మాటలుగా తేలిపోయాయి. అలా నీరు ఇవ్వలేరని తేలిపోయింది. ఏదైనా ఒక వస్తువును ఎక్కువ ధర పెట్టి కొంటే దానిలో స్పెషాలిటి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం కూడా చదరపు అడుగుకు రూ. 11, 666 వెచ్చించి కట్టారు. అందుకే వర్షం వచ్చినపుడల్లా లీకవుతుంటుంది. అదేదాని స్పెషాలిటీ. దీనిని బట్టి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఇలాగే ఉంటుందని అర్థమవుతోంది' అని తెలిపారు. -
తీరాన్ని తాకిన పెథాయ్ తుపాన్..
సాక్షి, అమరావతి: పెథాయ్ తుపాన్ కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. మరికొద్దిసేపట్లో కాకినాడ-యానాం మధ్య తుపాన్ తీరం దాటనుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. కాకినాడు, యానాం, తుని మండలాల్లో రానున్న రెండు గంటలపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తుపాన్ ప్రభావంతో విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడించారు. మరో రెండు గంటలపాటు తుపాన్ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, సెలటవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. తుపాన్ తీరం దాటే సమయంలో కొనసీమపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాట్రేనికోనలో కారుపై విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
పెథాయ్ తుపాన్: నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
సాక్షి, వరంగల్ / ఖమ్మం : పెథాయ్ తుపాన్ ప్రభావం వలన రాష్ట్రంలోని పాత వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాత వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మిరప పూతలు రాలిపోయి, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు. జనగామా జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం... జిల్లాలోని వైరా మండలంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఇల్లందులోని జేకే 5 ఓసీ, కోయగూడెంలోని కేఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవేకాక వర్షం కారణంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో సుమారు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆంటకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలుచోట్ల వరి, మొక్కజొన్న, ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భధ్రాద్రి కొత్తగూడెం... పెథాయ్ తుపాన్ కారణంగా పినపాక నియోజకవర్గంతో పాటు అశ్వాపురం, మణుగూరు గుండాల మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దాంతో పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మురుసు కమ్ముకుంది. చలి గాలులతో జనం వణికిపోతున్నారు. హుజురాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాలలో చిరుజల్లులు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో చిరుజల్లులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. మంథని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు. రైతులకు టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెథాయ్ ఎఫెక్ట్ : బస్సులు, విమానాలు రద్దు
సాక్షి, అమరావతి : తీవ్ర తుపానుగా మారిన పెథాయ్ దెబ్బకు జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. విజయవాడ, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విమాన సర్వీస్‌లను నిలిపివేసింది. దాంతో బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఏసియా విమానం బోర్డింగ్ పాస్‌లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఢిల్లీ - విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వగా చెన్నై - విశాఖ విమానం తిరిగి చెన్నైకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే హైదరాబాద్ - విశాఖ స్పైస్‌జెట్ విమానాన్ని రద్దు చేయడమే కాక.. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విమానాల రద్దుతో దాదాపు 700 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు గాస్తోన్నారు. అంతేకాక తుపాను ప్రభావం దృష్ట్యా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. (ఏపీలో పలు రైళ్లు రద్దు) శ్రీకాకుళం.. పెథాయ్ తుపాన్ కారణంగా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కానీ ఉపాధ్యాయులు, వంట ఏజేన్సీలు, వంట కార్మికులు పాఠశాలల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. విజయనగరం.. పెథాయ్ తుపాన్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారలు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ - 08922 276713, ఆర్డీవో ఆఫీస్ హెల్ప్‌లైన్ నంబర్ - 08922 276888 తూర్పు గోదావరి జిల్లా... జిల్లాలోని ముమ్మిడివరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యాశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోకవరం డిపో నుంచి బయలుదేరాల్సిన పలు బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. ఆత్రేయపురంలో అత్యధికంగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం, కోరుకొండ మండలంలోని రాఘవపురం, కోటి కేశవరం గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ వైపు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. పశ్చిమ గోదావరి... పెథాయ్ తుపాన్ కారణంగా జిల్లాలోని తీర ప్రాంతంలోని ఆరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 100 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. గడిచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 46(4.6 సెంటిమీటర్ల) మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏలూరులో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు... జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని జల్లులు, తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నిజాం పట్నం పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కోన శశీధర్ తీరప్రాంతంలో పరిస్థిని సమీక్షిస్తున్నారు. -
పెథాయ్ తుపాను బీభత్సం
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గజగజ..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. పెథాయ్ తుపాన్ ప్రభావంతో వీస్తున్న చలిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో చల్లటి గాలులు వస్తుండడంతో గజగజ వణుకుతున్నారు. దీనికి తోడు కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతుండడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత వారం, పది రోజుల క్రితం కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీలు నమోదు కాగా, రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. నవంబర్లోనే సాధారణ స్థాయిని దాటిన కనిష్ట ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం మరింత దిగజారాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటుతున్నా సాధా రణ స్థాయికి రాని పరిస్థితి నెలకొంది. చలి గాలులకు చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావం.. ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న పేథాయ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి జిల్లా ప్రజలను వణికిస్తుంది. దీంతో గత మూడు, నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. ఈనెల 13న 14.2 డిగ్రీల వరకు నమోదు కాగా, ఆదివారం తెల్లవారుజామున 6.4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రత పడిపోయింది. ఈఏడా ది అత్యల్పంగా నవంబర్ మాసంలో 7.9 డిగ్రీలు నమోదు కాగా, ఆ తర్వాత 6.4 డిగ్రీలు కనిష్టంగా నమోదైంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో పాల వ్యాపారులు, పేపర్‌బాయ్‌లు, పారిశుధ్య కార్మికులు, ఉదయం పూట పనులకు వెళ్లే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల మూల ంగా చలి తీవ్రత పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో చలి తక్కువగా ఉన్నప్పటికీ తెల్లవారుజామున, ఉద యం పూట దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చలి తీవ్రత పెరుగుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో యువకులు, వృద్ధులు చలిమంటలు కాగుతున్నారు. కమ్ముకుంటున్న పొగమంచు.. పెథాయ్ తుఫాన్ కారణంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పొగ మంచు కమ్ముకుంటోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది కనిష్ట ఉష్ణోగ్రత 3.5కి పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీలు, గరిష్టంగా 29.7 డిగ్రీ సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఇప్పటి వరకు ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పెథాయ్ తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులతో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో బయటకురాలేని పరిస్థితి ఉంటుంది. రాత్రి 7 గంటలు దాటితే చలి పంజా విసురుతోంది. గ్రామాల్లో, అటవీ çపరిసర ప్రాంతాల్లో చలి మరింత తీవ్రంగా ఉంటోంది. అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఈసారి అత్యల్పంగా నమోదువుతన్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి వణికిస్తున్న చలి ప్రకా రం డిసెంబర్, జనవరిలో తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా జిల్లాలో 2012 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రత 3.7 డిగ్రీలకు పడిపోయింది. 2014 డిసెంబర్లో కనిష్ట ఉష్ణోగ్రత 3.9 డిగ్రీలుగా నమోదైంది. 2017 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. 2018 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు.. తేదీ గరిష్టం కనిష్టం 10 31.8 16.4 11 31.8 14.7 12 28.8 12.0 13 27.8 14.2 14 27.8 12.2 15 27.8 10.8 16 26.8 6.4 ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనంపై ప్రభావం.. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో జనజీవనంపై ప్రభావం చూపుతుంది. పంట పొలాల్లో రైతులు పంటకు నీరివ్వడం, చెట్లు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో చలికి జనం అల్లాడిపోతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే గాని భానుడు కనిపించడం లేదు. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఉదయం, సాయంత్రం చలి మంటలు కాగుతూ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెల్లవారుజామున విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉదయం పూట పనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చలి నుంచి ఉపశమనం ఇలా.. శీతాకాలంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత 7 నుంచి 8గంటలకు నడకకు వెళ్లడం మంచిది. తాజా ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస వంటి పండ్లు, ఖర్జూరం ఎక్కువగా తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. చలి తీవ్రత తగ్గేంత వరకు ఉన్ని దుస్తులు ధరించాలి. వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్‌ను ధరించాలి. పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ కోల్డ్క్రీములతో మర్థన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బుల్లో సున్నం శాతం ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. పూర్తి చన్నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తుపాన్‌తో వాతావరణంలో మార్పులు పెథాయ్ తుపాన్ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గంటకు 12 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. సోమవారం 20 మిల్లీ మీటర్ల వర్షం పడే అవకాశముంది. ఈ గాలులు వారం రోజుల పాటు ఇలాగే ఉంటే శనగ, మొక్కజొన్న తదితర పంటలపై ప్రభావం చూపనుంది. చీడపీడలు పట్టే అవకాశముంది. పంట దిగుబడి కోసం రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మనుషులతో పాటు జంతువులపై కూడా చలి ప్రభావం ఉంటుంది. – శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్త, ఆదిలాబాద్ -
పెథాయ్ ఎఫెక్ట్: ఏపీలో పలు రైళ్లు రద్దు
సాక్షి, అమరావతి: ఏపీకి పెథాయ్ తీవ్ర తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అప్రమత్తమైంది. ఏపీలో రాకపోకలు సాగించే పలు ప్యాసింజర్ రైళ్లను సోమవారం రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీఆర్ జీఎం వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. రైలు పట్టాల వెంబడి నిరంతరం గస్తీని కొనసాగించాలన్నారు. అలాగే గుంటూరు, విజయవాడల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మరోవైపు తీవ్ర తుపాన్‌గా మారిన పెథాయ్ శరవేగంగా దూసుకొస్తుంది. కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్ తూర్పు గోదావరి జిల్లా వైపు వేగంగా కదులుతుంది. పెథాయ్ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని, యానాం లమధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వర్షాలకు ఇప్పటికే పలు జిల్లాలో పంట నీట మునిగింది. సోమవారం రద్దైన రైళ్ల వివరాలు.. 1. ట్రైన్ నెం. 67300, విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్ 2. ట్రైన్ నెం. 67295, రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్ 3. ట్రైన్ నెం. 67244, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్ 4. ట్రైన్ నెం. 67242, కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్ 5. ట్రైన్ నెం. 67221, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్ 6. ట్రైన్ నెం. 67222, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్ 7. ట్రైన్ నెం. 67225, గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్ 8. ట్రైన్ నెం. 67226, తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్ 9. ట్రైన్ నెం. 67227, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్ 10. ట్రైన్ నెం. 67228, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్ 11. ట్రైన్ నెం. 67296, విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్ 12. ట్రైన్ నెం. 67241, విజయవాడ-కాకినాడ పోర్ట్, మెము ప్యాసింజర్ 13. ట్రైన్ నెం. 77242, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్ 14. ట్రైన్ నెం. 77237, భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్ 15. ట్రైన్ నెం. 77238, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్ 16. ట్రైన్ నెం. 77231, భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్ 17. ట్రైన్ నెం. 77240, నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్ 18. ట్రైన్ నెం. 77206, భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్ 19. ట్రైన్ నెం. 77294, రాజమండ్రి-నర్సాపూర్, డెము ప్యాసింజర్ 20. ట్రైన్ నెం. 77295, నర్సాపూర్-గుంటూరు, డెము ప్యాసింజర్ 21. ట్రైన్ నెం. 77230, గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్ 22. ట్రైన్ నెం. 77269, విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్ చదవండి: ప్రజలు తస్మాత్ జాగ్రత్త: ఆర్టీజీఎస్ హెచ్చరికలు అవనిగడ్డలో ఆకలి కేకలు తరుముకొస్తున్న పెథాయ్ -
ప్రజలు తస్మాత్ జాగ్రత్త: ఆర్టీజీఎస్ హెచ్చరికలు
సాక్షి, అమరావతి : పెథాయ్ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పలు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుపాను తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోందని, గంటకు 19 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను ఈరోపు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో పెథాయ్ తీరం దాటనుందని తెలిపింది. తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడుతుందని తెలిపింది. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, అరటి రైతులు, ఉద్యానవన రైతులు తగు జాగ్రత్తల్లో ఉండాలని హెచ్చరించింది. వరి, జొన్న తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలని సూచించింది. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భద్రపరచాలని, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు టార్పాలిన్ పట్టలను పొందవచ్చునని తెలిపింది. గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న వారిని పునరావాస కేంద్రాలకు, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలని సూచించింది. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, రోడ్లపై వాహనాల్లో తిరగరాదు.. చెట్ల కింద తలదాచుకోరాదని.. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
రైల్వే అలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు పెథాయ్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సోమవారం తుపాను తీరాన్ని దాటనున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపానుపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రయాణికుల భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రైలు పట్టాల వెంబడి నిరంతర గస్తీని కొనసాగించాలని స్పష్టం చేశారు. కోస్తాంధ్రాలోని అన్ని రైల్వేస్టేషన్ల స్టేషన్ మాస్టర్లు రాష్ట్ర అధికారులు, రైల్వే ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, పరిస్థితిని బట్టి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే.. ఆహారం, నీరు తదితర సదుపాయాలు కల్పించాలని తెలిపారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గుంటూరు, విజయవాడల్లో 24 గంటలు పనిచేసే రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. -
తరుముకొస్తున్న పెథాయ్
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి పెథాయ్ తుపాను ముప్పు ముంచుకొస్తోంది. పెథాయ్ తీవ్ర తుపానుగా మారి శరవేగంగా దూసుకొస్తోంది. కాకినాడకు పశ్చిమ ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 410 కిలోమీటర్ల దూరంలో ఇది తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. అర్ధరాత్రి సమయానికి కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. సోమవారం మధ్యాహ్నం తుని–యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పెథాయ్ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచే రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. (పెథాయ్ ఎఫెక్ట్: ఏపీలో పలు రైళ్లు రద్దు) ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెథాయ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాన్ ధాటికి పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. పెథాయ్ నేపథ్యంలో అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పెథాయ్ తీవ్ర తుపానుగా మారుతుందని, కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు పెథాయ్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 110 కిలోమీటర్ల స్థాయికి కూడా చేరుకుంటాయని ఐఎండీ ప్రకటించింది. సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తుపాను పరిస్థితి గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం మీడియాకు వివరించారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. కోస్తాంధ్రలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల సహాయార్థం 1100 నంబర్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచింది. అధికార యంత్రాంగం అప్రమత్తం తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కాకినాడ పోర్టులో ఏడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరంలో 6, నిజాంపట్నం, మచిలీపట్నంలో 5, కళింగపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణం అందించేందుకు, సమాచారం చేరవేసేందుకు డివిజనల్, మండల కేంద్రాల్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత మండలాల్లో సోమ, మంగళవారాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తు సహాయక దళాలు (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు సహాయక దళాలు(ఎన్డీఆర్ఎఫ్) ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహాయక కార్యక్రమాల కోసం రంగంలోకి దిగాయి. ఈదురుగాలుల బీభత్సం తుపాను సోమవారం తీరం దాటనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖపట్నం, భీమిలి, పెదగంట్యాడ, గాజువాక తదితర ఎనిమిది తీర మండలాలను ప్రభావిత ప్రాంతాలుగా అధికార యంత్రాంగం ప్రకటించింది. సహాయక దళాలను సిద్ధం చేసింది. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా బోగాపురం మండలం కోయ్యపేడలో ఈదురగాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి కొబ్బరిచెట్లు విరిగిపడడంతో ఆవు మృతి చెందింది. తిత్లీ తుపాను వల్ల దారుణంగా నష్టపోయి ఇంకా కోలుకోని శ్రీకాకుళం జిల్లా వాసులు పెథాయ్ తుపానుతో కలవరపడుతున్నారు. కోసిన, కోత దశకు వచ్చిన వరి పంట పాడవుతుందని ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ గాలులు వీస్తే కొబ్బరి తోటలు పడిపోతాయనే భయం కోనసీమ రైతులను వెంటాడుతోంది. (దగ్గరవుతున్న పెథాయ్ ముప్పు ..) కాకినాడ–తుని బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేత తూర్పు గోదావరి జిల్లాలో 17 మండలాలపై పెథాయ్ విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లాలో వర్షం ప్రారంభమైంది. సముద్రం భీకరంగా మారింది. అలలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున కెరటాలు దూసుకొస్తుండటంతో తీరం కోతకు గురవుతోంది. కాకినాడ–తుని బీచ్ రోడ్డుపై కెరటాలు వచ్చిపడుతున్నాయి. రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి. దీంతో బీచ్ రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుపాను కారణంగా జిల్లాలో కోస్తా ప్రాంతంలోని 295 గ్రామాలు ప్రభావితం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 283 సహాయ శిబిరాలు, 61 తుపాను షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీ కోసం 1,664 మంది సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం పెథాయ్ తుపాను ఉత్తరాంధ్ర ప్రజలను వణికిస్తోంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 30 మీటర్లు ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలను చూసి బెంబేలెత్తుతున్నారు. తీర గ్రామాల్లో ఇన్చార్జి కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదివారం పర్యటించారు. మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ తీర గ్రామాల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. తీరం వెంబడి 40 కి.మీ వేగంతో గాలులు పెథాయ్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పాటు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గుంటూరు జిల్లాపై తుపాను ప్రభావం అంతగా ఉండదని, తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వీడియోకాన్ఫరెన్స్, సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నారు. పశ్చిమ డెల్టాలో వరి పంట, పల్నాడు ప్రాంతంలో మిరప, పత్తి చేతికొచ్చే దశలో ఉన్నాయి. వీటిని ఇంటికి చేర్చుకొనేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. తుపాను వల్ల వర్షం ఎక్కువ కురిస్తే కోత దశలో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సముద్ర తీరం అల్లకల్లోలం తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. వాకాడు, విడవలూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. జిల్లావ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరిగింది. తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. 13 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. సముద్రంలో వేటకు వెళ్లిన 200 పడవలను వెనక్కి రప్పించారు. పెథాయ్ వల్ల ఎలాంటి విపత్తు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తెలిపారు. ప్రత్యేక అధికారుల నియామకం ప్రకాశం జిల్లాలో పెథాయ్ తుపాను ఇప్పటికే ప్రభావం మొదలైంది. చలిగాలుల తీవ్రతతోపాటు జిల్లా అంతటా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. తీర ప్రాంతంలో 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. అలలు ఎగసి పడుతున్నాయి. సోమవారం జిల్లాలో అతిభారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. తుపాను సమాచారం కోసం ఒంగోలు కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నెంబర్ 1077, ఫోన్ నెంబర్ 08592–281400 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే 14 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ‘పశ్చిమ’లో పెథాయ్ అలజడి పెథాయ్ తుపాను పశ్చిమ గోదావరి జిల్లావాసులను వణికిస్తోంది. ఆదివారం ఉదయం పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. తీరంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, యలమంచిలి, పాలకొల్లు మండలాల్లో తుపాను ప్రభావం చూపుతోంది. 26 పునవాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల్లో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగాయి. ఫలితంగా రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అలసత్వం వద్దు : సీఎం పెథాయ్ తుపాను సహాయక చర్యలను అలసత్వం లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సహాయక చర్యలపై ఆయన ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తిత్లీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సహాయ చర్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జనరేటర్లు, మంచినీటిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈదురుగాలుల ధాటికి రోడ్లపై కూలిపోయిన చెట్లనే వెంటనే తొలగించి, రాకపోకలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులను పూర్తిగా నింపి కనీసం 45 రోజుల దాకా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను బాధితులకు సకాలంలో ఆహారం పంపిణీ చేయాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. బీభత్సం సృష్టించే అవకాశం సాక్షి, విశాఖపట్నం: పెథాయ్ తుపాను ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బలపడింది. ఉత్తర వాయవ్య దిశగా గంటకు 26 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత కాకినాడ పరిసరాల్లో తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. అయితే, ఆర్టీజీఎస్ మాత్రం కాకినాడ–తునిల మధ్య తీరం దాటవచ్చని వెల్లడించింది. మరోవైపు అమెరికా నిర్వహిస్తున్న జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్(జేటీడబ్లు్యసీ) విశాఖ సమీపంలో తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. ఇలా మూడు సంస్థల వేర్వేరు అంచనాలతో పెథాయ్ ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై ఒకింత గందరగోళం నెలకొంది. హుద్‌హుద్, తిత్లీ తుపాన్లు ముందుగా తాము పేర్కొన్న చోటే తీరం దాటాయని ఐఎండీ చెబుతోంది. కోస్తాంధ్రలో ఒకట్రెండు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. తుపాను తీరం దాటే సమయంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఐఎండీ సూచించింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాతఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, రోడ్లకు గండు పడవచ్చని, వరి, ఉద్యాన పంటలు దెబ్బతింటాయని హెచ్చరించింది. ‘పెథాయ్’ పేరు వెనక... మొన్న తిత్లి. నిన్న గజ. నేడు పెథాయ్. పేర్లు వేరైనా అవన్నీ ఇటీవల వేర్వేరు రాష్ట్రాల్లో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లి పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న తుపానుకు పెథాయ్ అని పేరు పెట్టింది థాయిలాండ్. పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజ అని అర్థం. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమైంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో వచ్చే తుపానులకు వాడిన పేర్లను మళ్లీ ఆరు సంవత్సరాల తరువాత వాడుతారు. ఇందుకోసం కొన్ని దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భవిష్యత్తులో సంభవించే తుపాను ఊహించిన దానికన్నా తీవ్రతరమైనా, ఆ పేరు అయోగ్యమైనదని భావించినా దాన్ని జాబితా నుంచి తొలగించి కొత్త పేరు చేర్చుతారు. కానీ ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకసారి వాడిన పేరును మళ్లీ వాడరు. భవిష్యత్‌లో సంభవించే తుపానులకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, థాయిలాండ్ దేశాలు సూచించిన పేర్లతో ఇప్పటికే జాబితా సిద్ధమైంది. రాబోయే తదుపరి తుపానుకు ఫణి, వాయు, మహా, బుల్‌బుల్‌లలో ఏదో ఒక పేరును పెట్టనున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.... - తీరం దాటే సమయంలో రహదారులపై తిరగరాదు - లోతట్లు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి - బలమైన గాలులు వీచే అవకాశముంది కాబట్టి చెట్ల కింద నిలవరాదు - తుపాన్ సహాయం కోసం 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలి పునరావాస కేంద్రంలో ఆకలి కేకలు కృష్ణా జిల్లాలోని తీర మండలాలైన మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్నులో పెథాయ్ ప్రభావం కనిపించింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా తేలికపాటి వర్షాలు పడ్డాయి. జిల్లాలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకాశం మేఘావృతమైంది. చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గిలకలదిన్నె తీరానికి చేరారు. తీర ప్రాంతాల్లో 64 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కోడూరు మండలం పాలకాయతిప్పలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలు ఆకలితో అలమటించారు. 60 మంది ఉన్న కేంద్రంలో కేవలం 10 కిలోల బియ్యం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. మంగినపూడి బీచ్‌లో అలల ఉధృతి పెరిగింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి నేలకొరిగింది. మత్య్సకారుల్లో గుబులు పెథాయ్ హెచ్చరికలు గంగపుత్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో మత్య్సకారుల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి పాయకరావుపేట వరకు తూర్పుతీరం వెంట 110 కిలోమీటర్ల పరిధిలో 47 మత్య్సకార గ్రామాలున్నాయి. వీటిలో చాలావరకు తీరానికి ఆనుకుని కూతవేటు దూరంలో ఉన్నవే. విశాఖ జిల్లాలో తీరప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తీరప్రాంతంలోని గ్రామాల ప్రజలకు భోజన వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ప్రొక్లెయిన్లు, జనరేటర్లు, మంచినీటి ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. రైతన్నల ఆందోళన : శ్రీకాకుళం జిల్లాలో రాజాం, ఎచ్చెర్ల, రణస్థలం, శ్రీకాకుళం తదితర మండలాల్లో జల్లులు కురిశాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో కోసి ఉన్న వరి పనలను భద్రపరుచుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులంతా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. ఆయన ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. నిత్యావసరాలను పునరావాస కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలని సూచించారు. సముద్రంలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులు కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లోని దుమ్ములపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులతో గత మంగళవారం వేటకు వెళ్లిన 3573 నంబరు బోటు సముద్రంలో చిక్కుకుపోయింది. దీంతో తమవారి కోసం ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. బోటులో ఆయిల్ అయిపోవడంతో ఐ.పోలవరం మండలం భైరవపాలేనికి 10 మైళ్ల దూరంలో ఉండిపోయామని, అక్కడ రిగ్గో లేక ఓడో తెలియడం లేదని, దానికి బోటు కట్టి ఉన్నామని, తమను రక్షించాలని మత్స్యకారులు తమకు సమాచారం అందజేశారని కుటుంబ సభ్యులు ఆదివారం విలేకర్లకు తెలిపారు. సముద్రంలో చిక్కుకుపోయిన వారిలో కళాసీలు వాసుపల్లి దానియేలు, మారుపల్లి సతీష్, పేర్ల కాసులు, కంది పాపయ్య, వాసుపల్లి ఎర్రయ్య, మేరుగు ఏసేబు ఉన్నారని వివరించారు. తమవారు సముద్రంలో చిక్కుకుపోయిన సమాచారాన్ని మత్స్యశాఖ అధికారులకు, కలెక్టరేట్‌కు సమాచారం అందించామన్నారు. . అప్రమత్తమైన నౌకాదళం సహాయ చర్యలకు సిద్ధమైన ఈఎన్సీ విశాఖసిటీ: పెథాయ్ తుపాను తీవ్రత దృష్ట్యా తూర్పు నౌకాదళం (ఈఎన్సీ) అప్రమత్తమైంది. తుపాను తీవ్ర తుపానుగా మారుతుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన మానవతా సహాయాన్ని అందించేందుకు సమాయత్తమైంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని సమీపంలో ఉన్న నౌకాశ్రయానికి తిరిగి వెళ్లిపోవాలని రెండు రోజులుగా 11 నేవీ విమానాల ద్వారా నౌకాదళ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. తూర్పు నౌకాదళ హెచ్ఏఆర్డీలో భాగంగా పునరావాస కేంద్రాలకు ప్రజల్ని తరలించడంతో పాటు లాజిస్టిక్ సపోర్టు అందించేందుకు, వైద్య సహాయం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. అదనపు వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు, గ్యాస్ రబ్బర్ పడవలు, సహాయ సామగ్రి, ఆహారం, తాత్కాలిక వస్తువులు, దుస్తులు, మందులు, దుప్పట్లు సిద్ధం చేసినట్లు వివరించారు. జెమినీ బోట్లతో డైవర్లు అప్రమత్తంగా ఉన్నారని, ఏక్షణంలోనైనా వెళ్లేందుకు రెస్క్యూటీమ్ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమాచారం అందిపుచ్చుకునే విధంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఐఎన్ఎస్ డేగాలో సహాయ సామగ్రితో నౌకాదళ బృందం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. -
తీరం వైపు దూసుకొస్తున్న పెథాయ్
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాన్ తీవ్ర వాయువేగంతో దూసుకొస్తోంది.పెథాయ్ తుపాన్ పశ్చిమ బంగాళాఖాతానికి అనుకొని కొనసాగుతోంది. మచిలీపట్నానికి తూర్పున ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలోను, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ, దూరంలో కేంద్రికృతమైంది. శ్రీహరికోటకు 280 కిలోమీటర్ల దూరంలోను, ఉత్తర వాయువ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది మరింత బలపడి రాత్రికి తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం నాటికి కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో తాళ్లరేవు, కాజులూరు, తుని పాటు, తొణంగిలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ, గాజువాక, భీమునిపట్నం, పరవాడ, పెదగంట్యాడ, అచ్యుతాపురం, రాంబిలి, ఎస్. రాయవరం, పాయకరావు పేటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో భారీ వర్షలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గార, పలాస, మందస, సంతబొమ్మాళి, కవిటి, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నాయని ఆధికారులు తెలిపారు. -
దూసుకొస్తున్న‘ పెథాయ్’ తుపాను
సాక్షి, విశాఖ పట్నం : వాయువేగంతో దూసుకొస్తున్న ఫెథాయ్ తుపాను కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకొని కొనసాగుతున్న తుపాను మచిలీ పట్నానికి తూర్పు ఆగ్నేయంగా 560 కిలో మీటర్లు, కాకినాడ దక్షిణ ఆగ్నేయంగా.. శ్రీహరికోటకు 450 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఫెథాయ్ తుపాను ఉత్తర వాయవ్య దిశగా గంటకు 20 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను తీవ్ర తుపానుగా మారింది. సోమవారం మధ్యాహ్నానానికి వాయుగుంగం బలహీనపడి కాకినాడ, తుని మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో 100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, 6మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లంతా సురక్షితం. జాలర్లతంగా సురక్షితంగా తీరానికి చేరారు. సుముద్రంలో ఉండిపోయిన ప్రకాశం జిల్లాకు చెందిన జాలర్లకు ఆశకావాణి ద్వారా సందేశాలు పంపించాం. తుపాను హెచ్చరికలు విని తిరుగు ప్రయాణమైన జాలర్లు ఆదివారం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. - రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ( ఆర్టీజీఎస్) కాకినాడ పరిసర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటుతుంది. తీర ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ నెల 18న ఓ మోస్తరు, రాయలసీమలో తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది- వైకే రెడ్డి, వాతావరణ శాఖ డైరెక్టర్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి, మలికిపురం మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మూడు గంటలుగా కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లా బోగాపురం మండలం కోయ్యపేడలో ఈదురగాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి కొబ్బరిచెట్లు విరిగిపడి ఆవు మృతి మృతి చెందింది. -
అవనిగడ్డలో ఆకలి కేకలు
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెథాయ్ తుపాన్ కన్నెర్ర చేసింది. తుపాన్ ప్రతాపానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కూడు,గూడూ,బట్ట లేక అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పునరావాస కేంద్రాల్లో రెండు రోజుల నుంచి మంచినీరు, భోజనం లేక తుపాను బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడూరు మండలం పాలకాయతిప్ప సహాయ కేంద్రాల్లో ఉన్న బాధితులను ఆదివారం పరామర్శించడానికి వచ్చిన జిల్లా ఎస్పీ సర్వేష్ఠ త్రిపాఠి వద్ద వారి బాధలను వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా అందిచలేకపోతుందని, రెవిన్యూ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయిందని వారు అవేదన వ్యక్తం చేశారు. తుపాను దాటికి పిల్లల నుంచి పెద్దల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సహాయ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యరని తుపాను బాధితులు వాపోయారు. పంటలు నష్టపోయి, ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండిలేకపోయినా తమను పట్టించుకునే నాథుడే కరువైయ్యారని ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
తప్పిన పెథాయ్ ముప్పు
నెల్లూరు(పొగతోట): పెథాయ్ తుపాను ముప్పు నుంచి జిల్లా తప్పించుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి, శుక్రవారం రాత్రి దిశమార్చుకుంది. శనివారం రాత్రి తుపానుగా మారి తూర్పుగోదావరి వైపు అతి వేగంగా పయనిస్తోంది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తొలుత అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి నెల్లూరు–చెన్నైల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉంటుందని, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పెథాయ్ తన దిశను మార్చుకుంటూ మచిలీపట్నం వైపు నుంచి కాకినాడ వైపు కదిలిపోయింది. దీంతో జిల్లాకు ముప్పు తప్పిందని అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే తుపాను ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. గత నెలలో ఏర్పడిన గజ తుపాను కూడా నెల్లూరు ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. గజ తన దిశను మార్చుకుని తమిళనాడులో తీరం దాటింది. వాతావరణంలో పెనుమార్పులు పెథాయ్ తుపాన్ తీరం వైపు దూసుకున్న నేపథ్యంలో జిల్లాలో వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. విపరీతంగా చలిగాలు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా మారింది. తుపాను ప్రభావంగా తీర ప్రాంతాల మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని 13 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రతి హ్యాబిటేషన్‌కు వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులను నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను జిల్లా అధికారులు వెనక్కి రప్పించారు. ఎటువంటి విపత్తు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలతో సిద్ధంగా ఉంది. అల్లకల్లోలంగా తీరం పెథాయ్ ప్రభావంతో జిల్లాలోని సముద్రం తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల సముద్రం 50 నుంచి 60 మీటర్లు ముందుకొచ్చింది. గాలులు తీవ్రంగా ఉన్నాయి. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు, వెంకన్నపాళెం సముద్రతీరాల్లో శనివారం సాయంత్రానికి అలల తాకిడి అధికమై అల్లకల్లోలంగా మారిపోయింది. సముద్రపు నీరు దాదాపు 50 నుంచి 60 అడుగుల మేర ముందుకు చొచ్చుకుని రావడంతో తీరం కోతకు గురవుతోంది. ఉవ్వెత్తిన ఎగిసి పడుతున్న అలలతో తీర ప్రాంత వాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకారులు వేటకు విరామం పలికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌కు పర్యాటకుల రాక తగ్గుముఖం పట్టింది. మత్స్యకారులు ఇప్పటికే వేటను తాత్కాలికంగా నిషేధించారు. తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు మధుసూదన్‌రావు హెచ్చరించారు. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి, ఈదురు గాలులు అధికమై సముద్రం అల్లకల్లోంగా మారింది. నిత్యం పర్యాటకులు, చిరుతిండి దుకాణాలతో సందడిగా ఉండే తూపిలిపాళెం బీచ్ తుపాన్ కారణంగా బోసిపోయింది. తీరంలో ఉన్న చిల్లర దుకాణాలు ఈదురు గాలులకు నేలవాలి కుప్ప కూలాయి. మత్స్యకారులు రెండు రోజులుగా వేట మానేసి బోట్లను ఒడ్డుకు చేర్చారు. సముద్రంపై వేట చేస్తోన్న పొరుగు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లతో ఆయా సమీప ప్రాంతాల ఒడ్డుకు చేరుకుని వేట సామగ్రిని భద్ర పరుకుంటున్నారు. సముద్రం సాధారణ స్థితికన్నా ఇప్పుడు 10 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
‘పెథాయ్‌ను సమర్థంగా ఎదుర్కొండి’
సాక్షి, నెల్లూరు : పెథాయ్ తుపాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి తగిన చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కట్టర్లు, జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఆహారం అందించడానికి తగిన ఏర్పాట్లు వేగంగా చేయాలన్నారు. తుపాను ప్రభావం కలిగిన గంటల్లోనే సహాయక చర్యలు ప్రజలకు అందాలన్నారు. -
ముంచుకొస్తోంది
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: వాయువేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుపాను కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వడివడిగా ప్రయాణిస్తూ అలజడి రేపుతోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్రవాయుగుండం సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుపానుగా బలపడింది. శనివారం రాత్రి సమయానికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఫెథాయ్ తుపాను ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ ఆదివారం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం అదే దిశలో కదులుతూ సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడి మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం... తుపాన్ ప్రభావంతో ఆది, సోమవారాల్లో గంటకు 80 – 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం కొన్నిచోట్ల భారీ వర్షాలు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావచ్చు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు, పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలవచ్చని, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను తీవ్రతతో కెరటాలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశముందని తెలిపింది. తుపాను తీరం దాటే ప్రాంతంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ఆర్టీజీఎస్ సూచించింది. గాలుల తీవ్రత ఎక్కువే... తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్టోబరు రెండోవారంలో శ్రీకాకుళం జిల్లాను వణికించిన తిత్లీ తుపాను తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలులకు ఉద్దానంలో జీడి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. పెట్రోలు బంకులు, రైస్‌మిల్లులు, గ్రానైట్ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, నివాస గృహాల పైకప్పులు ఎగిరిపోయాయి. పెథాయ్ కూడా తీవ్ర తుపానుగా మారుతున్నందున జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. తీరప్రాంతాల ప్రజలు 17వ తేదీన తుపాను తీరం దాటే సమయంలో సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా ఇళ్లలో ఉండటం మంచిదని సూచిస్తున్నారు. సీఎంకు గవర్నర్ నరసింహన్ ఫోన్ ఏపీకి పెథాయ్ తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేసి ముందస్తు జాగ్రత్త చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. కోనసీమ తీర ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవు.. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలపై విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశం, కార్యదర్శి వరప్రసాద్ ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు రాష్ట్ర విపత్తు సహాయక దళాల (ఎస్డీఆర్ఎఫ్) తోపాటు జాతీయ విపత్తు సహాయ దళాలను (ఎన్డీఆర్ఎఫ్ను) పంపించారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా సహాయక చర్యలకోసం సిద్ధం చేశారు. పెథాయ్ తీవ్ర తుపాను తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్య తీరం దాటే అవకాశముందని భావిస్తున్నారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా సూచించారు. మరోవైపు కోనసీమలో 27 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోనసీమలోని ఎనిమిది తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం, మంగళవారం అధికార యంత్రాంగం సెలవుగా ప్రకటించింది. కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ హెచ్చరిక జారీ... తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను తీవ్రతకు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చేపల వేటను నిలిపివేసి మరపడవల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. మరోవైపు చీరాల వాడరేవు నుంచి గత మంగళవారం ఐదుబోట్లలో వేటకు వెళ్లిన 30 మంది మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావటంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో తీరప్రాంత మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశామని జాయింట్ కలెక్టర్ క్షితిజ తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు తమ కేంద్రాలను వదిలి వెళ్లరాదని పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్తర్వులు జారీ చేశారు. నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం మండలాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక అధికారులు, బృందాలను నియమించారు. గుంటూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా వరి పంట కోతకు సిద్ధంగా ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బలపడే అవకాశం తక్కువే! – ‘సాక్షి’తో ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ పెథాయ్’ తీవ్ర తుపానుగా బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, ఇది తుపాను దశ నుంచి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘పెథాయ్ శనివారం సాయంత్రం 5.30 గంటలకు తుపానుగా మారింది. ఇది తీవ్ర తుపానుగా మారడానికి ప్రస్తుతం సముద్రంలో వాతావరణం కొంత ప్రతికూలంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి తుపాన్ ఒంగోలు సమీపానికి చేరుకుంటుంది. చెన్నై, మచిలీపట్నం రాడార్ కేంద్రాల పరిధిలోకి వచ్చాక పెథాయ్ కదలికలు, స్థితిగతులను పరిశీలించాక అది తుపానుగానే మిగిలిపోతుందా? తీవ్ర తుపానుగా మారుతుందా? ఎక్కడ తీరం దాటుతుందనే అంశాలను అంచనా వేయవచ్చు’ అని న్యూఢిల్లీలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం పెథాయ్ తీవ్ర వాయుగుండంగానే తీరం దాటేలా ఉందన్నారు. ‘ఇది సోమవారం మధ్యాహ్నానికిగానీ తీరం దాటదు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత సమీక్షించాక ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా నిర్ధారణకు రావచ్చు..’ అని వివరించారు. కంట్రోల్ రూంల నంబర్లు ఇవీ... తుపాను, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలు, సాయం పొందేందుకు పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్ : 08672– 252170, 252171, 252172 గుడివాడ: 08674–243697 నూజివీడు : 08656–232717 విజయవాడ : 0866–2574454 పశ్చిమ గోదావరి కలెక్టర్ కార్యాలయం: 1800233 1077 (టోల్‌ఫ్రీ నెంబరు) ప్రకాశం జిల్లా కంట్రోల్ రూం: 08592–281400, 1077 (టోల్ ఫ్రీ నంబర్) శ్రీకాకుళం కంట్రోల్ రూం నంబర్ 08942–240557 -
పడగ విప్పిన పెథాయ్.. రేపు తీరం దాటే అవకాశం!
సాక్షి, అమరావతి: తుఫాన్ పెథాయ్ పడగ విప్పుకొని వస్తోంది. తిత్లీ తుఫాన్‌తో ఇంకా కోలుకొని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై విరుచుకుపడబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఇప్పుడు పెనుతుఫాన్ పెథాయ్‌గా మారింది. ప్రస్తుతం తుఫాన్ చెన్నైకి 670 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ సోమవారం సాయంత్రం ఒంగోలు, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటిమీటర్ల వర్షం కురవవచ్చని అప్రమత్తం చేసింది. తీరప్రాంతంలో గంటకు 100 కిలోమీటర్లతో వేగంతో గాలులు వీచనున్నాయి. భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్య పెథాయ్ తుఫాన్ తీరం దాటే అవకాశముందని, ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. కాగా, పెథాయ్ తుఫాన్ నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహాన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఫోన్ చేసి.. ముందస్తు చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ సీఎంకు సూచించారు.