darna
-
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్
హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకపు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ పోలీసు బోర్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సమర దీక్ష నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు విచ్చేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు మాట్లాడుతూ బోర్డు నిర్ల క్ష్యం కారణంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య ర్థులు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివసేనా రెడ్డి మాట్లాడుతూ... బోర్డు ఇచ్చిన తప్పుడు ప్రశ్నల వల్ల ఏడు మల్టిపుల్ ప్రశ్నల మార్కులను అభ్యర్థులకు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేస్తే దాదాపు 70 వేల మంది అభ్యర్థులకు న్యాయం జరిగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నేతలు ప్రవళిక నాయక్, శివకుమార్ రెడ్డి, వెంకట్, మాతం ప్రదీప్, సునీత, దివ్య పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ‘మధ్యమానేరు’ నిర్వాసితులు
వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఏళ్లుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ నిర్వాసితులు సోమవారం రోడ్డెక్కారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నాకు పూనుకున్నారు. ముందస్తుగా పోలీసులు ముంపు గ్రామాలైన అనుపురం, రుద్రవరం గ్రామాల్లో భారీగా మోహరించారు. సోమవారం వందలాది మంది నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో అనుపురం వద్ద కరీంనగర్–సిరిసిల్ల రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులు నందికమాన్ వద్దకు భారీగా తరలివచ్చారు. ‘మేం వ్యవసాయం చేసుకుందామంటే భూములు లేవు. చేతిలో పనిలేక అడ్డాకూలీలుగా మారాం’అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. పట్టా ఇచ్చిన ప్రతీ కుటుంబానికి రూ.5.04 లక్షలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చలేదన్నారు. తమకు ఇళ్లు, భూముల పరిహారం, పట్టాలు, యువతకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 300 మందిని పోలీసులు కోనరావుపేట పీఎస్‌కు తరలించారు. మహాధర్నాకు తరలివస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులను వేములవాడ బ్రిడ్జిపై పోలీసులు అరెస్ట్ చేసి తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు. నిర్వాసితులకు అండ: రేవంత్‌రెడ్డి మిడ్‌మానేరు నిర్వాసితులకు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వారికి న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ధర్నా చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమని, నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయం చేయాలి: బండి రాష్ట్ర ప్రభుత్వం మిడ్‌మానేరు బాధితుల డిమాండ్లపై స్పందించి వెంటనే న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ, బీజేపీ నేతలను, మహిళలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు. -
యాదాద్రి ఆలయ ఈవోను తొలగించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో ఆలయ ఈవోను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైకుంఠద్వారం వద్ద ఆటోకార్మికులు కుటుంబాలతో కలసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆందోళన విరమించాలని చెప్పగా కార్మికులు అందుకు నిరాకరించారు. ఫైనాన్స్, అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని, ఆటోలను అనుమతించకపోతే సుమారు 300 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొట్టమీద కొడుతున్న ఈవోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దశలో పోలీసులకు ఆటోకార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. దీంతో భక్తులు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఆటోకార్మికులు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు. -
‘ఢిల్లీలో కేసీఆర్ దీక్షకు ఎమ్మార్పీఎస్ మద్దతు’
ముషీరాబాద్ (హైదరాబాద్): ఢిల్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 11న రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రకటించారు. శనివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లను, పంటను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లు సాధించేవరకు ఎమ్మార్పీఎస్ వారికి తోడుగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటును అందిస్తూ రైతు బాంధవుడిగా ఎల్లవేళలా అండగా ఉంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, చింతం తిరుపతి, శాగంటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యాసంగి ధాన్యం కొనాల్సిందే!
సాక్షి నెట్వర్క్: తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. లేకుంటే కేంద్రానికి రాస్తా బంద్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, విజయవాడ రహదారులపై రాస్తారోకోలు చేపట్టాయి. నేతలు, కార్యకర్తలు వరి కంకులు, ప్లకార్డులు చేపట్టి, రోడ్లపై ధాన్యం కుప్పపోసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవే ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ‘‘రైతుల కోసం కేంద్రం ఏం చేసిం దో బీజేపీ నేతలు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. పండించిన పంటనే కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. అగ్రిమెంట్ రాసిచ్చారని ఒకరు.. కొంటమని మరొకరు.. కొనమని ఇంకొకరు.. నూకలు తినాలంటరు. నూకలు మేం తినం.. మీకు నూకలు చెల్లినయ్’’ అని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనేదాకా ఊరుకోబోమన్నారు. ఇక్కడ గంటకుపైగా ఆందోళన సాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అడుగడుగునా నిరసనలతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్‌ల ఆధ్వర్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండల కేంద్రం లో ఎమ్మెల్యే నోముల భగత్.. సూర్యాపేట సమీపంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో రాస్తారోకోలు జరిగాయి. ►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు నిరసనలు చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ►నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వైజంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ►ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) గ్రామ సమీపంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. ►సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాణిక్‌రావు, దేవీప్రసాద్‌రావు, చింతా ప్రభాకర్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ►మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నేడు జిల్లా కేంద్రాల్లో దీక్షలు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, దీక్షలకు టీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ మండల కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు దీక్షలకు రావాలని సూచించారు. -
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కంగ్రెస్ ధర్నా
-
గ్రామస్థులపై దాడి, నిరసనగా ధర్నా
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఉద్రిక్తత నెలకొంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పొయి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక వలస కార్మికుల విషయానికి వస్తే సొంత గ్రామాలకు వెళ్లలేక ఉన్న చోట ఉపాధిలేక, ఆహారం దొరకక, తలదాచుకోవడానికి నీడ లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాకర్టీలో బీహార్ నుంచి వచ్చిన చాలా మంది కార్మికులు పని చేస్తోన్నారు. (యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులే ఎక్కువ) అయితే లాక్డౌన్ కారణంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందో చూడటానికి బుధవారం పెదగార్లపాడు గ్రామస్థులు వారి వద్దకు వెళ్లారు. వారికి సాయం అందించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లగా వారిపై సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడింది. దీంతో గ్రామస్థులు దాడికి నిరసనగా ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకి దిగారు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇలా జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. (ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్..) -
టీడీపీ గూండాగిరిపై నిరసన గళం
సాక్షి, వజ్రపుకొత్తూరు: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ గ్రామ వలంటీర్లు నినదించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తమపై గూండాగిరి ప్రదర్శించి దాడులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కదం తొక్కా రు. పూండి– గోవిందపురం గ్రామ వలంటీర్ కిక్క రి సరస్వతిపై ఈ నెల 7న టీడీపీ నేత పుచ్చ ఈశ్వరరావు కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టడాన్ని నిరసిస్తూ తోటి వలంటీర్లు సోమవారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంచినీటి పథకం తాళం ఇవ్వాలని కోరడమే వలంటీర్ పాపమా.. అంటూ మండిపడ్డారు. రాజకీయ ముసుగులో దాడులు చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే సహించబోమని ముక్త కంఠంతో నినదించారు. పూండి–గోవిందపురంలోని వైఎస్సార్ కూడలి వద్ద వలంటీర్లు, నాయకుల మనవహారం కేసు విచారణలో ఉంది.. వలంటీర్‌పై దాడులను ఉపేక్షించేది లేదని వజ్రపుకొత్తూరు ఎంపీడీఓ సీహెచ్.ఈశ్వరమ్మ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు కేసుని విచారించారని, నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినందున పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు నెలలుగా స్థానికులకు తాగునీరు అందించకుండా మంచినీటి పథకానికి తాళాలు వేశారని, దీనిపై ప్రశ్నిస్తే వలంటీర్‌ను జుత్తు పట్టుకుని కొట్టడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింత రవివర్మ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సీదిరి త్రినాథ్, మండల పార్టీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలిన ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, కొల్లి రమేష్, డీసీఎంఎస్ డైరెక్టర్ నర్తు ప్రేమ్‌కుమార్, మద్దిల హరినారాయణ, కె.గోపాల్, జి.రామారావు, కొల్లి జోగారవు, అంబటి శ్రీను, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఖండించాలి.. వలంటీర్లపై దాడులను ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు వారథులుగా పని చేస్తున్న తమపై దాడులు చేయడం దారుణం. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి.– నర్తు అరుణ, గ్రామ వలంటీర్, గడరుడభద్ర పరారీలో ఉన్నారు.. వలంటీర్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గాలిస్తున్నాం. ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. వలంటీర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విచారణ పూర్తయింది. సరస్వతికి న్యాయం చేస్తాం. – ఎం.గోవింద, ఎస్ఐ, వజ్రపుకొత్తూరు -
ఖానాపూర్‌లో కోర్టు కొట్లాట!
సాక్షి, ఖానాపూర్: నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలో కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు చేపట్టిన నిరవదిక రిలే నిరాహార దీక్షకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పార్టీలకతీతంగా ప్రజలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు వెల్లువలా తరలివచ్చి బహిరంగ మద్దతు తెలుపుతూ కోర్టు ఏర్పాటులో జాప్యంపై ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న రీలే దీక్షకు మద్దతుగా శనివారం పట్టణంలో వ్యాపార సంస్థల సంపూర్ణ బంద్ పాటిస్తామని ఐక్య వ్యాపార కమిటీ అధ్యక్షుడు రాజేందర్ శుక్రవారం ప్రకటించారు. గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోర్టు కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం పలువురు ముస్లీంలు, పలు మజీద్ కమిటీల పెద్దలు తరలివచ్చి న్యాయవాదులకు సాంప్రదాయ (ఇమామ్ జామీన్) దట్టికట్టి సంఘీబావం తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పలు గ్రామాల సర్పంచ్‌లతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి దీక్ష స్థలి వద్ద మద్దతు ఇచ్చి బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం శాంతియుతంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేని యెడల న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం ప్రజల చేతుల్లోకి వచ్చి ఆందోళనలు ఉదృతం అయితే దానికి పూర్తి బాద్యత ప్రభుత్వమే వహించాలని వివిధ పార్టీలు, కులసంఘాలు పార్టీల నాయకులు హెచ్చరించారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రామయ్య దీక్షకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి సంఘీబావం తెలిపి మాట్లాడారు. కోర్టు ఏర్పాటుకు సరిపడా వనరులు పట్టణంలో అందుబాటులో ఉండడంతో పాటు 1,500 పైగా కేసులు ఉన్నందుకు కోర్టు ఏర్పాటు అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పద్మశాలి సంఘం నాయకులు ర్యాలీగా వచ్చి మద్దతుగా బైఠాయించారు. శివాజీనగర్ యూత్, ఎస్ఆర్ విద్యాసంస్థల యజమాన్యం విద్యార్థులు మద్దతు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేశ్, వెంకట్మహేంద్ర, సత్యనారాయణ, ఆసిఫ్అలీ, రాజశేఖర్, కిశోర్‌నాయక్, రాజగంగన్న, రాఘవేంద్ర, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులారా... ఆత్మహత్యలకు పాల్పడవద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గందరగోళంపై సోమవారం (29న) ఇంటర్‌బోర్డు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ ప్రకటించాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతర రాజకీయపార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలవారు కలసి రావాలని పిలుపునిచ్చాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో భేటీ అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 23 మంది మరణం హృదయవిదారకం ఇంటర్ బోర్డు తప్పులకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఎదిగిన పిల్లలు రాలిపోయి, ఎద నిండా ఆవేదనతో తల్లిదండ్రులున్నారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఒక కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తున్నా వెనకేసుకు వచ్చారని విమర్శించారు. తప్పులపై కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంటర్ కార్యదర్శికి సమస్యలన్నీ తెలుసని, విద్యార్థులు ఫెయిలైతే డ్రైవర్లు కావచ్చని, దుకాణాల్లో పని చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కూడా ఉచితంగా విద్యార్థులకు వాల్యూయేషన్ చేస్తామన్నారే తప్ప ఈ సమస్యపై సమగ్ర సమీక్ష నిర్వహించలేదన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా సమాజం పట్ల నిబద్ధత ఉందని, ఏదిఏమైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. నిద్ర నటించే సర్కార్‌ను తట్టి లేపేందుకే ఈ వ్యవహారంపై నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసుతోనే పరీక్షల నిర్వహణలో అనుభవంలేని గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ సంస్థకు పరీక్షా ఫలితాల బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ప్రతి అంశంపై ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఇంటర్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు. విద్యార్థులు రోడ్డున పడితే టీఆర్ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేబినెట్ బాధ్యత వహించాలి: రమణ ఇంటర్ బోర్డు తప్పులకు సీఎం కేసీఆర్, కేబినెట్ బాధ్యత వహించాలని, మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై విపక్షపార్టీలుగా గవర్నర్‌ను కలిస్తే నామమాత్రంగా స్పందించారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్బంధాన్ని ఛేదిస్తాం: చాడ సీఎం కేసీఆర్ ప్రయోగించే నిర్బంధాన్ని, పోలీస్ వ్యవస్థను ఛేదించి 29న ధర్నా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తొంభై మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంటర్‌బోర్డు సున్నా మార్కులు వేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి... ఇలాగే జరుగుతాయి అని చెప్తారా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. -
బీసీల జీవనస్థితి మెరుగు జగన్‌తోనే సాధ్యం
విజయవాడ సిటీ: బీసీల కష్టాలు తీరి, జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలను చంద్రబాబు మోసం చేసిన తీరుపై గురువారం వైఎస్సార్ కాంగ్రె‹స్ పార్టీ బీసీ సెల్ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగా భావించి మోసం చేస్తున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై గుణపాఠం చెప్పాలన్నారు. ఆదరణ పేరుతో బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు జీవన పరిస్థితులు అలాగే ఉండాలనే ఉద్దేశంతో వారికి పనిముట్లు చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీసీల సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే సీఎం హోదాలో ఉండి అవహేళన చేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మాయల ఫకీర్ చంద్రబాబును వ చ్చే ఎన్నికల్లో సాగనంపాలన్నారు. బీసీలను జడ్జీలు కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుతంత్రాలను వివరించారు. దమ్మిడీకి పనికిరాని వారిని జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలపై రుద్ది రాజ్యాంగాన్ని చంద్రబాబు అవహేళన చేశారని మండిపడ్డారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డారన్నారు. అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. అటువంటి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నీరుగార్చి అడ్డంకులు సృష్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా అక్కాచెల్లిమ్మలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా అందర్నీ చంద్రబాబు మోసం చేశాడన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబుకు అణగారిన వర్గాలంటే చులకన అన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు అణగారిన వర్గాల జీవన స్థితిగుతులు మారుస్తాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ సాంబూ, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోను రాజేష్, బొమ్మ న్న శివశ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాసరావు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. నేతలు ర్యాలీగా వెళ్లి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రాన్ని అందజేశారు. -
‘చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైఎస్సార్సీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తమ పోరాటం కొనసాతుందని అన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ 2014 నుంచి పోరాటం చేస్తోందని, నోటీసులు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు మోసం వల్లనే ప్రత్యేక హోదా రాలేదని, తెలంగాణ ప్రజలు ఆయనకు దిమ్మతిరిగే జవాబిచ్చారని పేర్కొన్నారు. అదే రీతిలో ఏపీ ప్రజలు కూడా బుద్ధిచెబుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు నీతులు చెప్పారు.. తెలంగాణ ప్రజలు చంద్రబాబు చెంప చెల్లుమనిపించారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేసి ఏపీ ప్రజలను మభ్యపెట్టాలని ఆయన ప్రయత్నించారని, కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధిచెప్పారని అన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించాలని చంద్రబాబు నీతులు చెప్పారని ఆయన గుర్తుచేశారు. గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసిన నేతలు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాగా మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్లతో పాటు వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, వర ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులు పాల్గొన్నారు. రాజ్యసభలో ఆందోళన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళకు దిగారు. హోదాను డిమాండ్‌చేస్తూ సభలో ప్లకార్డులు పట్టుకుని నిరసనకు వ్యక్తం చేశారు. దీంతో సభ మధ్యాహ్న రెండు గంటలకు వాయిదా పడింది. -
మహదర్నాకు సిద్ధమవుతున్న ఏపీ ఉపాద్యయ సంఘాలు
-
విజయవాడలో బీజేపీ నేతల ధర్నా
-
అభివృద్ధి కోసమే కర్మాగారం..లాభాల కోసం కాదు
-
‘నాలుగేళ్లు చంద్రబాబు నిద్రపోయారా’
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే చదువుకున్నయువతకు ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కడపలో మానవ వనరులు అధికంగా ఉన్నాయని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన నీరు, విద్యుత్, ఖనిజం, భూమి, ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సహజ వనరులు ఉన్నచోట ఫ్యాక్టరీని ఎందుకు నిర్మించరని రాచమల్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా ఉక్కు ఫ్యాక్యర్టీ కోసం దీక్ష చేయడం ఏమిటని రాచమల్లు ప్రశ్నించారు. కడపలో కర్మాగారం పెడితే లాభం రాదని కేంద్రం చెబుతోందన్న రాచమల్లు ప్రజల అభివృద్ధి కోసం కర్మాగారం నిర్మించాలిగానీ, లాభాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్ జగన్‌ను దెబ్బతియాలనే ఉద్దేశంతోనే టీడీపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. అర్హత, యోగ్యత, నైతిక విలువలు లేని రమేష్ నాయుడు (సీఎం రమేశ్) రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. 19 మంది ఎంపీలు ఉన్న టీడీపీ ఉక్కు ఫ్యాక్టర్టీ సాధించలేకపోతోందని, నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు నిద్రపోయారా అని ధ్వజమెత్తారు. కేంద్రంతో విభేదించినప్పుడే చంద్రబాబు దీక్ష చేసి ఉంటే 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపేవారని అన్నారు. ముగిసిన మహాధర్నా ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతంగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద జూన్ 23 నుంచి 26 వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నెల 24న బద్వేలులో మహా ధర్నా, 25న రాజాంపేటలో మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. నిరసనల్లో భాగంగా జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బందిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ జూన్ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. -
ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ మద్దతుగా నిలవాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవాలని సీపీఐ సీనియర్ నేత డి. రాజా వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలకు రాజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్‌ను ఆయన పరామర్శించారు. ప్రధాని మోదీ, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చర్యలను ఆయన ఖండించారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన రాజాకు కేజ్రీవాల్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ‘ధన్యావాదాలు కామ్రేడ్ రాజా’ అంటూ ట్వీట్ చేశారు. కాగా దేశ రాజధానిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో ముఖ్యమంత్రి కూర్చుని ధర్నా చేయడమేంటని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేజ్రీవాల్‌పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
పెళ్లయిన కొద్ది రోజులకే..
ఉండ్రాజవరం: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకే భర్త తన వద్దకు రావడం లేదని, అత్తవారింటికి వెళ్తే తనను రానివ్వకుండా తలుపులు వేసుకుంటున్నారని ఒక మహిళ అత్తవారింటి ముందు గురువారం రాత్రి నుంచి ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన పెదప్రోలు సురేష్ అదే గ్రామానికి చెందిన ఎమ్.సులోచన ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు మే5న గౌరీపట్నంలోని చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే తన భర్త తనవద్దకు రావడం మానేశాడని ఆరోపిస్తోంది. -
యూనిఫాం ఇవ్వలేదని డ్రైవర్ ధర్నా
తిరువొత్తియూరు: యూనిఫాం ఇవ్వలేదని ప్రభుత్వ బస్సు ముందు కూర్చొని డ్రైవర్ ధర్నా చేసిన సంఘటన దిండుక్కల్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. దిండుకల్ సమీపం వత్తలగుండు ఊర్కాలన్ ఆలయ వీధికి చెందిన సురేష్ దిండుకల్ ప్రభుత్వ రవాణా సంస్థ శాఖ డిపో–3లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం దిండుకల్ నుంచి కుములికి వెళ్లడం కోసం బస్సును తీశాడు. ఆ సమయంలో అతను యూనిఫారం ధరించలేదు. దీన్ని గమనించిన ట్రాన్స్‌పోర్టు డిపో సహాయ ఇంజినీర్ అక్కడికి చేరుకుని సురేష్‌ను అడ్డుకున్నాడు. దీంతో డ్రైవర్‌కు సహాయ ఇంజనీర్‌కు మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన డ్రైవర్ సురేష్ బస్సు ముందు కూర్చొని ధర్నా చేశాడు. రవాణసంస్థ అధికారులు యూనిఫాం అందచేయకపోవడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశాడు. సురేష్ మాట్లాడుతూ తాను 2009 నుంచి పర్మినెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లుగా యూనిఫాం అందజేయలేదని, 2014 నుంచి యూనిఫాం కుట్టు కూలి నగదును ఇవ్వలేదని, దీనిపై మదురై డిపో జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపాడు. అధికారులు యూనిఫాం, కుట్టు కూలి నగదు అందజేయాలని కోరాడు. -
మహిళా న్యాయవాది ధర్నా
అన్నానగర్: భర్తతో కలపాలని కోరుతూ కోర్టు ఆవరణలో ధర్నాకు దిగిన మహిళా న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు శ్రీనివాసపురానికి చెందిన అన్భళగన్ (33). ఇతని భార్య శరణ్య (27) తంజావూరు కోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా భార్య, భర్త విడిపోయి జీవిస్తున్నారు. ఈ స్థితిలె భార్య నుంచి విడాకులు కోరుతూ అన్భళగన్ తంజావూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాఉండగా తనను భర్తతో కలపాలని కోరుతూ బుధవారం సాయంత్రం శరణ్య తంజావూరు కోర్టు ఆవరణలో ధర్నా చేపట్టింది. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అర్ధరాత్రి ఆమెను ఇంట్లో వదిలిపెట్టారు. అనంతరం గురువారం శరణ్య మళ్లీ ధర్నాకు దిగింది. మధ్యాహ్నం ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఆమె ఇదేవిధంగా ధర్నా చేపట్టిన సమయంలో నమోదైన ప్రభుత్వ విధులకు ఆటకం కలిగించిన కేసు, ఆత్మహత్య బెదిరింపు కేసులను విచారించిన న్యాయమూర్తి తంగమణి, శరణ్యకు మే 10వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిర్పునిచ్చారు. పోలీసులు ఆమెను తిరుచ్చి సెంట్రల్ జైలుకు పంపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
మిడ్జిల్ (జడ్చర్ల): తనను పెళ్లి చేసుకోవాలని ఓ బాలిక ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ సంఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన బాలిక(17) మహబూబ్‌నగర్‌లో ఇంటర్ చదువుతుండగా.. అదే గ్రామానికి చెందిన మహేష్(21) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ నెల 8వ తేదీన గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా.. యువకుడి తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారు. అనంతరం యువకుడి కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే ఇంటి నుంచి పరారయ్యారు. తనను ప్రేమించి మోసం చేసిన మహేష్‌తో పెళ్లి జరిపించాలని బాలిక ఆదివారం గ్రామంలో యువకుని ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈమెకు ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన మహేష్‌తో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి యువకుడిపై కేసు నమోదు చేస్తామని బాలికకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. యువకుడితో తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు భీంరాజ్, గణేష్, రాజు తదితరులు ఉన్నారు. -
రైతులపై ఎస్.ఐ. జులుం
రెడ్డిగూడెం (మైలవరం) : శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఎస్.ఐ. విధి నిర్వహణలో ఓ వీధి రౌడీలా వ్యవహరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన మండలంలోని మిట్టగూడెం ప్రధాన సెంటర్లో గురువారం చోటు చేసుకుంది. రెడ్డిగూడెం నుంచి సీఎం బందోబస్తుకు వెళ్తున్న స్థానిక ఎస్.ఐ. అనిల్‌కుమార్.. మండలంలోని మిట్టగూడెం సెంటర్లో రోడ్డు పక్కన ట్రాక్టర్లో మామిడి కాయల ఖాళీ బాక్స్‌లు వేసుకుంటున్న రైతుల దగ్గరకు వెళ్లి దురుసుగా ప్రవర్తించి చెయ్యి చేసుకున్నాడు. ‘ట్రాక్టర్ ఎవడిదిరా...’ అంటూ రైతు అలవాల నర్సారెడ్డిపై చెయ్యి చేసుకోవడంతో అక్కడే ఉన్న మరో మామిడి రైతు నరెడ్ల నాగిరెడ్డి ఇదేమని ప్రశ్నించాడు. దీంతో అతని కాలర్ పట్టుకుని లాక్కురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్.ఐ. ఓవర్ యాక్షన్ చూస్తున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసి కంగుతిన్న ఎస్.ఐ. అక్కడ నుంచి ఉడాయించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో మిట్టగూడెం ప్రధాన కూడలికి చేరుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు. ఎస్.ఐ. అనిల్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులపై చెయ్యి చేసుకున్న ఎస్.ఐ.ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న మైలవరం సీఐ రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. రైతులను అనవసరంగా కొట్టిన ఎస్.ఐ.ని సస్పెండ్ చేసే వరకు ఆందోళన విరమింపచేసేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. విచారణ జరిపి ఎస్.ఐ.పై చర్యలకు నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామంటూ సీఐ సర్దిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా నాలుగు కూడలి సెంటర్లో రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నూజివీడు – గంపలగూడెం రహదారి, విజయవాడ – విస్సన్నపేట రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం తమపై దాడి చేసిన ఎస్.ఐ.పై చర్యలు తీసుకోవాలంటూ అలవాల నర్సారెడ్డి, నరెడ్ల నాగిరెడ్డి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేను సిద్ధంగా ఉన్నా..
పులివెందుల : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని.. సమయంతో నాకు పనిలేదని ఏ క్షణమైనా చర్చకు రావడానికి నాకు సమ్మతమేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. గురువారం కడప నగరంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో తాను నియోజకవర్గ అభివృద్ధిపై పూల అంగళ్ల సర్కిల్ వద్దకానీ, వేంపల్లె అడ్డరోడ్డులోకానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఎంపీ ప్రతి సవాల్ చేశారు. శుక్రవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలు తీరుపై కడిగిపారేస్తామన్నారు. వైఎస్సార్ హయాంలో పులివెం దులలో జరిగిన అభివృద్ధిపైనా.. సాగునీటి ప్రాజెక్టు పనులపైనా.. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు హయాంలో పులివెందులలో ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయంపైనా చర్చించి తీరుతామని వెల్లడించారు. అలాగే వైఎస్సార్ మర ణం తర్వాత ఆగిపోయిన పనులపైనా చర్చిద్దామని సవాలు విసిరారు. ఆ తర్వాతే 5వ తేదీన జరిగే ఢిల్లీలో జరిగే ధర్నాకు, పార్లమెంటు సమావేశాలకు హాజరవుతానని చెప్పారు. కానీ, టీడీపీ నాయకులు దీనికి 4వ తేదీ వరకు సమయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని చర్చా కార్యక్రమాన్ని పోలీసులతో భగ్నం చేయించాలని ప్రయత్నిస్తే మాత్రం టీడీపీ నేతలు నైతికంగా ఓటమి చెందినట్లేనని తెలిపారు. నేను రైతులతో నీళ్ల కోసం ధర్నా చేస్తే.. రౌడీలతో ధర్నా చేశానని సతీష్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అన్నదాతలను రౌడీలనడంతోనే వారిపట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతోందని చెప్పారు. నేను రౌడీయిజాన్ని ప్రోత్సహించే వ్యక్తినైతే పులివెందులలో టీడీపీ నాయకులు ఇంత స్వేచ్ఛగా తిరగలేరన్నారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యానికి, చట్టానికి కట్టుబడి ప్రవర్తిస్తుందే తప్ప.. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. ప్రతిపక్షనేత రివ్యూ మీటింగ్‌కు హాజరైన అధికారులను భయభ్రాం తులకు గురిచేసిన నీచమైన చరిత్ర మీదని.. పులివెందులకు ప్రతిపక్షనేత జగన్ ఏమీ చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు వదాలి.. పీబీసీ నీటి విషయమై, ప్రాజెక్టుల విషయమై వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేకసార్లు నా ఫోన్ ద్వారానే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఫోన్ చేశామన్నారు. వైఎస్సార్ పుణ్యంతో ప్రాజెక్టులు కడితే దేవుని దయతో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు వచ్చాయన్నారు. ఇప్పుడు ఆ నీటిని సక్రమంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. లింగాల.. పులివెందుల బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టు వరకు ఉన్న చెరువులను నీళ్లతో నింపాలని లేనిపక్షంలో పీబీసీ కార్యాలయం ఎదుట కాకుండా.. టీడీపీ నేతల ఇళ్ల వద్ద రైతులతో కలిసి ధర్నా చేపడతామన్నారు. వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నపుడు అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశంలో విజయమ్మ, నేను సీబీఆర్, పైడిపాలెం నీటి విషయమై అధికారులను నిలదీస్తుంటే.. అడ్డుకున్న సతీష్‌రెడ్డి ఇప్పుడు నీటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో లింగాల ఎంపీపీ సుబ్బారెడ్డి, పులివెందల మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, పట్టణకన్వీనర్ వరప్రసాద్, తొండూరు నాయకులు రవీంద్రనాథరెడ్డి, రామమునిరెడ్డి, రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం ప్రైవేటుకు అప్పగించొద్దు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపారాణి డిమాండ్ చేశారు. మధ్యాహ్నభోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో గురువారం ఆందోళన చేశారు. స్వరూపారాణి మాట్లాడుతూ పథకం కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 2003 నుంచి పనిచేస్తున్న కార్మికులను కాదని, నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారు. పథకం నిర్వాహణకు అవసరమైన స్థలం, కిచెన్ షెడ్లు ఏర్పాటుకు కావాల్సిన నిధులను ప్రభుత్వమే సమకూరుస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లను అరికట్టాలని కోరారు. ప్రైవేటు సంస్థలకు పథకాన్ని అప్పగించడం వల్ల 80 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, మద్యాహ్నభోజన పథకం కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మీ, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, కార్యదర్శి డి.రమాదేవి, నాగరాణి, నాగమణి, వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.