Department of Telecom
-
బ్యాంక్ హామీని మినహాయించండి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ(ఎఫ్‌బీజీ) మినహాయించమంటూ టెలికం శాఖ(డాట్)ను అభ్యరి్థంచినట్లు తెలుస్తోంది. స్పెక్ట్రమ్ చెల్లింపులకుగాను 2025 సెపె్టంబర్లో అందించవలసిన రూ. 24,747 కోట్ల ఎఫ్బీజీని మినహాయించమని డాట్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్పెక్ట్రమ్ వేలం నిబంధనల ప్రకారం వార్షికంగా చెల్లించవలసిన మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) ఏడాది ముందుగానే సెక్యూరిటైజ్ చేయవలసి ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై వొడాఫోన్ ఐడియా స్పందించకపోవడం గమనార్హం! 2022కంటే ముందుగా నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్కుగాను వీఐఎల్ చెల్లించవలసిన మొత్తమిది. అయితే 2022లో చెల్లింపులపై ప్రభు త్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా వీఐఎల్ నాలుగేళ్ల నిషేధాన్ని(మారటోరియం) వివియోగించుకుంది. ఫలితంగా 2016వరకూ నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులు 2025 అక్టోబర్– 2026 సెప్టెంబర్ మధ్యకాలంలో చేపట్టవలసి ఉంటుంది. మరోవైపు ఏజీఆర్ బకాయిల(చెల్లింపులు)పైనా మారటోరియాన్ని కంపెనీ వినియోగించుకుంది. ఇది 2026 మార్చిలో ముగియనుంది. దీంతో మారటోరియం ముగియడానికి కనీసం 13 నెలల ముందుగా వీఐఎల్ బ్యాంక్ గ్యారంటీలను సమరి్పంచవలసి ఉంటుంది. కాగా.. 2024 మార్చి31కల్లా కంపెనీ ప్రభుత్వానికి రూ. 2,03,430 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,33,110 కోట్లుకాగా.. ఏజీఆర్ బకాయిలు రూ. 70,320 కోట్లు! మారటోరియాన్ని అందుకున్న సమయంలో కంపెనీ రూ. 16,000 కోట్ల వడ్డీ చెల్లింపులను ఈక్విటీ జారీ ద్వారా ప్రభుత్వానికి క్లియర్ చేసింది. తద్వారా కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించింది. తదుపరి కంపెనీ ఎఫ్‌పీవో ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించడంతో ప్రభుత్వ వాటా 23.8 శాతానికి పరిమితమైంది. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు ఫ్లాట్‌గా రూ. 16.62 వద్ద ముగిసింది. -
రెండు కంపెనీలకు ఐఎస్పీ లైసెన్స్
న్యూఢిల్లీ: జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వన్‌వెబ్ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) లైసెన్స్ అందుకున్నట్టు సమాచారం. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లతో లేదా వీశాట్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించవచ్చని ఒక అధికారి తెలిపారు. -
అన్ని సర్కిళ్లకు జియో 5జీ విస్తరణ పూర్తి
న్యూఢిల్లీ: అన్ని సర్కిళ్లలోనూ 5జీ విస్తరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. తదుపరి టెస్టింగ్ కోసం 10% సైట్లను టర్మ్ సెల్ ఎంపిక చేయనున్నట్లు టెలికం శాఖ (డాట్) వివరించాయి. వీటి ఫలితాలు వచ్చిన తర్వాత సేవల విస్తరణ నిబంధనలను పూర్తి చేసినట్లుగా సరి్టఫికెట్ జారీ అవుతుందని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా జూలై 7 నాటికి టెల్కోలు 2.81 లక్షల పైచిలుకు 5జీ టవర్లను (బీటీఎస్) ఏర్పాటు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ ఇటీవల తెలిపారు. -
6జీ టెక్నాలజీలో భారతీయులకు 100 పేటెంట్లు
న్యూఢిల్లీ: 6జీ టెక్నాలజీకి సంబంధించి భారతీయ సైంటిస్టులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు 100 పేటెంట్లు ఉన్నాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అనేది చాలా సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ మనవారు ఆ రంగంలో గణనీయ పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన భారత్ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. 5జీ నెట్వర్క్ విస్తరణ .. ప్రభుత్వం నిర్దేశించిన 200 నగరాలను కూడా దాటి ప్రస్తుతం 397 నగరాలకు చేరిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్.. పాలన, మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణలో మార్పులతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేస్తే .. 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఆవిర్భవించడాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆయన చెప్పారు. -
స్టార్టప్‌లకు ఉచితంగా 5జీ టెస్ట్‌బెడ్
న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన అంకుర సంస్థలు, చిన్న..మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) 2024 జనవరి వరకూ 5జీ టెస్ట్ బెడ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. మిగతా పరిశ్రమవర్గాలు, విద్యారంగం, సర్వీస్ ప్రొవైడర్లు, పరికరాల తయారీ సంస్థలు మొదలైన వర్గాలు నామమాత్రపు రేటుతో దీన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే పలు స్టార్టప్‌లు, కంపెనీలు తమ ఉత్పత్తులు, సర్వీసులను పరీక్షించేందుకు ఈ టెస్ట్ బెడ్‌ను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. 5జీ సేవలకు ఊతమిచ్చే విధంగా రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్ బెడ్‌ను రూపొందించే ప్రాజెక్టుకు 2018లో టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. 2022 మే 17న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితం చేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలు టెస్ట్ బెడ్ రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. -
ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్, కాల్స్ నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టెలికం శాఖ (డాట్) ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాల్స్ నాణ్యతను మెరుగుపర్చేందుకు, కాల్ డ్రాప్స్‌ను కట్టడి చేసేందుకు సేవల నాణ్యత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సూచించింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో సేవల నాణ్యత (క్యూఓఎస్) చాలా ముఖ్యమని డాట్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యూఓఎస్ విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలను పరిశీలించిన మీద ట ట్రాయ్ కొన్ని కీలక అంశాలను ట్రాయ్‌కు సిఫార్సు చేసిందని పేర్కొన్నాయి. కాల్ డ్రాప్, కాల్స్ నాణ్యత అంశాలపై ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించిన మీదట డాట్ ఈ మేరకు సూచనలు చేసింది. మరోవైపు, సర్వీసుల నాణ్యత, నిబంధనల సమీక్ష, 5జీ సేవల ప్రమాణాలు, అవాంఛిత వాణిజ్య సందేశాలు మొదలైన వాటికి సంబంధించి తీసుకోతగిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఫిబ్రవరి 17న టెల్కోలతో ట్రాయ్ సమావేశం కానుంది. అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను టెల్కోలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 5జీ సేవలతో కాల్ నాణ్యత మెరుగుపడుతుందని ఆశించినప్పటికీ.. పరిస్థితి మరింతగా దిగజారిందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లోకల్‌సర్కిల్స్ సంస్థ జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం కాల్ నాణ్యత అస్సలు మెరుగుపడలేదని 42 శాతం మంది, మరింతగా దిగజారిందని 19 శాతం మంది 5జీ యూజర్లు వెల్లడించారు. ఓటీటీల నియంత్రణకు టెల్కోల పట్టు.. కమ్యూనికేషన్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థల నియంత్రణకు గట్టి నిబంధనలు రూపొందించాలని ట్రాయ్‌ని టెల్కోలు మరోసారి కోరాయి. ఒకే రకం సేవలు అందించే సంస్థలకు ఒకే రకం నిబంధనలు ఉండాలని పేర్కొన్నాయి. తమలాంటి సేవలే అందిస్తున్న ఓటీటీలకు కూడా తమకు అమలు చేసే నిబంధనలను వర్తింపచేయాలని స్పష్టం చేశాయి. 2023 అజెండాపై కసరత్తుకు సంబంధించి ట్రాయ్‌తో బుధవారం జరిగిన భేటీలో టెల్కోలు ఈ మేరకు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా, ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్, వొడాఫోన్ ఐడియా కార్పొరేట్ వ్యవహారాల అధికారి పి. బాలాజీ ఈ భేటీలో పాల్గొన్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..) -
టెలికం సేవల నాణ్యతపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలతో కేంద్ర టెలికం శాఖ బుధవారం భేటీ అయ్యింది. కాల్ డ్రాప్స్, సర్వీసుల్లో నాణ్యత తదితర అంశాలపై చర్చించింది. అలాగే కాల్ నాణ్యతను మెరుగుపర్చడానికి విధానపరంగా తీసుకోతగిన చర్యలపై సమాలోచనలు జరిపింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టెలికం శాఖ కార్యదర్శి కె రాజారామన్ ఈ సమావేశానికి సారథ్యం వహించగా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇది సాగింది. నిర్దేశిత ప్రమాణాలకు ప్రతిగా ప్రస్తుతం తాము అందిస్తున్న సర్వీసుల నాణ్యత గురించి టెల్కోలు వివరంగా చెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే అక్రమ బూస్టర్లలో సేవలకు అంతరాయం కలుగుతుండటం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిపాయి. సమస్యాత్మక విషయాలను గుర్తించి తమ దృష్టికి తేవాలని, కాల్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు విధానపరంగా తీసుకోతగిన చర్యలపై తగు సూచనలు చేయాలని ఆపరేటర్లను టెలికం శాఖ కోరినట్లు వివరించాయి. -
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ రూ. 8 వేల కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కేంద్రానికి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. నాలుగేళ్లకు సరిపడా వాయిదాల మొత్తాన్ని టెలికం శాఖకు (డట్) ముందస్తుగా చెల్లించినట్లు సంస్థ తెలిపింది. దీనితో తాము ఇక పూర్తిగా 5జీ సేవలను అందుబాటులోకి తేవడంపైనే దృష్టి పెట్టేందుకు వీలవుతుందని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. తగినంత స్పెక్ట్రం, అత్యుత్తమ టెక్నాలజీ, పుష్కలంగా నిధుల ఊతంతో ప్రపంచ స్థాయి 5జీ సేవల అనుభూతిని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్టెల్ రూ. 43,039.63 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందులో ముందుగా రూ. 3,849 కోట్లు, తర్వాత 19 ఏళ్ల పాటు మిగతా మొత్తాన్ని విడతలవారీగా చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌కు అవకశం ఉంది. -
ప్రైవేట్ టెలికం నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు డాట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ (డాట్) ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రూ. 100 కోట్ల పైగా నికర విలువ ఉండి, డాట్ నుండి నేరుగా స్పెక్ట్రం తీసుకోవడం ద్వారా క్యాప్టివ్ నాన్–పబ్లిక్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) నెలకొల్పాలనుకునే సంస్థలు ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎన్‌పీఎన్ ఏర్పాటు చేసే సంస్థలకు నేరుగా స్పెక్ట్రంను కేటాయించేందుకు నెలకొన్న డిమాండ్‌ను అధ్యయనం చేసేందుకు కూడా డాట్ ఈ ప్రక్రియను ఉపయోగించుకోనుంది. ‘సీఎన్‌పీఎన్ నెలకొల్పే సంస్థలు స్పెక్ట్రంను టెలికం సంస్థల నుంచి లీజుకు తీసుకోవచ్చు లేదా డాట్ నుంచి నేరుగా తీసుకోవచ్చు’ అని డాట్ తెలిపింది. ప్రస్తుత టెలికం ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎన్‌పీఎన్ కోసం స్పెక్ట్రం నేరుగా కేటాయించే ప్రతిపాదనను డాట్ తెరపైకి తెచ్చింది. -
ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగుతోంది. ఆరో రోజైన ఆదివారం మరో రూ. 163 కోట్ల బిడ్లు అదనంగా రావడంతో ఇప్పటిదాకా వచ్చిన బిడ్ల విలువ మొత్తం రూ.1,50,130 కోట్లకు చేరినట్లు టెలికం శాఖ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కు శనివారం డిమాండ్ కాస్త తగ్గినట్లు కనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఏడో రోజైన సోమవారం నాడు కూడా వేలం కొనసాగనుంది. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో పాల్గొంటోంది. దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. -
‘క్యాప్టివ్’ స్పెక్ట్రం కేటాయింపు విధానాలేవీ?
న్యూఢిల్లీ: వివిధ విభాగాల సొంత అవసరాలకు (క్యాప్టివ్) కేటాయించే స్పెక్ట్రం విషయంలో ఇప్పటివరకూ నిర్దిష్ట విధానమేదీ ఖరారు చేయకపోవడంపై టెలికం శాఖ (డాట్) తీరును కాగ్ ఆక్షేపించింది. అలాగే, క్యాప్టివ్ యూజర్లకు కేటాయించే స్పెక్ట్రం ధరలను సమీక్షించే యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. క్యాప్టివ్ స్పెక్ట్రం నిర్వహణ విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించే శాఖలు, విభాగాలు, ఏజెన్సీలను ప్రోత్సహించేలా ధరల విధానాన్ని సత్వరం సమీక్షించాలని సూచించింది. అందరికీ ఒకే ధర పెట్టకుండా వినియోగం, ప్రత్యేకతలను బట్టి వివిధ రేట్లు నిర్ణయించే అవకాశాలను డాట్ పరిశీలించాలని పేర్కొంది. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఈ అంశాలు ప్రస్తావించింది. స్పెక్ట్రం లభ్యత, కేటాయింపులు, ప్రణాళికలు, ధర తదితర అంశాలను తరచుగా సమీక్షించేందుకు సంబంధిత వర్గాలందరితోనూ డాట్ శాశ్వత ప్రాతిపదికన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. స్పెక్ట్రంను సమర్ధవంతంగా వినియోగించుకునేలా వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కాగ్ తెలిపింది. మరిన్ని సూచనలు.. ► ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు వాస్తవంగా వినియోగించుకుంటున్న స్పెక్ట్రం వివరాలన్నీ ఒకే దగ్గర లభించేలా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఉండాలి. ► కేటాయింపుల విషయంలో వర్కింగ్ గ్రూప్‌ల సిఫార్సుల ఖరారు, ► సెక్రటరీల కమిటీ నిర్ణయాల అమలు కోసం అన్ని విభాగాలతో కలిసి డాట్ క్రియాశీలకంగా పనిచేయాలి. ► 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) ఆధారిత నెట్వర్క్ ప్రాజెక్టు సత్వరం పూర్తయ్యేలా డాట్, రైల్వేస్ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తుండాలి. ఇది పూర్తయితే ప్రస్తుతం రైల్వేస్ వినియోగిస్తున్న 900 మెగాహెట్జ్ బ్యాండ్‌ను ఇతరత్రా వాణిజ్యపరమైన అవసరాల కోసం కేటాయించవచ్చు. ► తమ దగ్గర నిరుపయోగంగా ఉన్న ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (ఐఎంటీ) స్పెక్ట్రంను వేలం వేసేందుకు/వినియోగంలోకి తెచ్చేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో సంప్రదింపులు జరపడం ద్వారా డాట్ సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ► ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలకు కేటాయించిన స్పెక్ట్రంను అవి పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా, నిరుపయోగంగా ఉన్న ఫ్రీక్వెన్సీలను వాపసు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్‌గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
‘ఎలన్‌మస్క్, స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’
న్యూఢిల్లీ: లైసెన్సు లేకుండానే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామంటూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేసినందుకు గాను అమెరికన్ సంస్థ స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థ టెలికం వాచ్డాగ్ విజ్ఞప్తి చేసింది. నవంబర్ 27న టెలికం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది. ఈ విషయంలో తగు స్థాయిలో సత్వర చర్యలు తీసుకోనందుకు గాను సంబంధిత అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. 2021 ఫిబ్రవరి నుంచే స్టార్‌లింక్ ప్రీ–బుకింగ్ ప్రారంభించినప్పటికీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడంలో టెలికం శాఖ (డాట్) తీవ్ర జాప్యం చేసిందని పేర్కొంది. ఈలోగా అమాయక కస్టమర్ల నుంచి స్టార్‌లింక్ భారీగా దండుకుందని టెలికం వాచ్డాగ్ తెలిపింది. కంపెనీ చెప్పే లెక్కలు బట్టి చూస్తే 11,000 కస్టమర్ల నుంచి దాదాపు 10,89,000 డాలర్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని వివరించింది. అనుమతులు తీసుకోకుండానే కష్టమర్ల నుంచి చందాలు వసూలు చేసిన వ్యవహారంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని, కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును వడ్డీతో సహా, ఎలాంటి కోతలు లేకుండా, స్టార్‌లింక్ పూర్తిగా రిఫండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని టెలికం వాచ్డాగ్ కోరింది. అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్.. భారత్‌లోనూ కార్యకలాపాలు మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. ప్రీ–బుకింగ్ కూడా చేపట్టింది. అయితే, స్టార్‌లింక్‌కు లైసెన్సు ఇవ్వలేదని, కంపెనీ సర్వీసులకు సబ్స్క్రయిబ్ చేయరాదని డాట్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టెలికం వాచ్డాగ్ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. -
టెలికంలో 100 శాతం ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: టెలికం సేవల రంగంలో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మంగళవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020లో జారీ చేసిన ప్రెస్ నోట్ 3లోని నిబంధనలు దీనికి వర్తిస్తాయని పేర్కొంది. దీని ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాల ఇన్వెస్టర్లు, లేదా అంతిమంగా ప్రయోజనాలు పొందే వారు సరిహద్దు దేశాలకు చెందినవారైతే మాత్రం దేశీయంగా టెలికంలో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా టెలికం రంగంలో 49 శాతం దాకా మాత్రమే ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్ విధానం అమలవుతోంది. అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది. సంక్షోభంలో చిక్కుకున్న టెల్కోలను గట్టెక్కించేందుకు ఇటీవల ప్రకటించిన ఉపశమన చర్యల్లో భాగంగా ఎఫ్‌డీఐల పరిమితిని కూడా కేంద్రం 100 శాతానికి పెంచింది. మరోవైపు, టెల్కోలు సమరి్పంచాల్సిన పనితీరు, ఆర్థిక బ్యాంక్ గ్యారంటీ పరిమాణాన్ని 80 శాతం మేర తగ్గిస్తూ టెలికం శాఖ (డాట్) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్సు నిబంధనల సవరణ నోట్‌ను జారీ చేసింది. దీని ప్రకారం టెల్కోలు తాము తీసుకునే లైసెన్సు కింద అందించే ప్రతి సర్వీసుకు రూ. 44 కోట్ల పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. పాత నిబంధన ప్రకారం ఇది రూ. 220 కోట్లుగా ఉండేది. అలాగే కొత్త నిబంధన ప్రకారం ప్రతి సర్కిల్‌కు గరిష్టంగా రూ. 8.8 కోట్ల ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. గతంలో ఇది రూ. 44 కోట్లుగా ఉండేది. కోర్టు ఆదేశాలు లేదా వివాదానికి సంబంధించి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలకు ఇది వర్తించదు. తాజా సవరణతో టెల్కోలకు ఊరట లభించనుంది. గ్యారంటీల కింద బ్యాంకులో తప్పనిసరిగా ఉంచే మొత్తంలో కొంత భాగం చేతికి అందడం వల్ల నిధులపరంగా కాస్త వెసులుబాటు ఉంటుంది. -
ఇంటివద్దకే మొబైల్ సిమ్!
న్యూఢిల్లీ: కొత్త మొబైల్ కనెక్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ టెలికం శాఖ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం కస్టమరు.. ఆన్లైన్లోనే కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఆధార్ లేదా డిజిలాకర్‌లో భద్రపర్చిన ఇతరత్రా గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటి వద్దే సిమ్ కార్డు పొందవచ్చు. కొత్త మొబైల్ కనెక్షన్ కోసం విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి సంబంధించిన ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ సర్వీసులను వినియోగించుకున్నందుకు గాను కస్టమర్లు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం టెలికం రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా డాట్ .. తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్–పెయిడ్‌కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్ కనెక్షన్‌కు మారాలన్నా కస్టమరు కచ్చితంగా భౌతిక కేవైసీ (కస్టమరు వివరాల వెల్లడి) ప్రక్రియ పాటించాల్సి ఉంటోంది. గుర్తింపు, చిరునామా ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో రిటైల్ షాపునకు వెళ్లాల్సి వస్తోంది. ఆన్లైన్ వినియోగం పెరగడం, కోవిడ్–19 కారణంగా కాంటాక్ట్‌రహిత సర్వీసుల అవసరం నెలకొనడం వంటి పరిణామాల నేపథ్యంలో .. కొత్త విధానం సబ్స్క్రయిబర్స్కు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని డాట్ తెలిపింది. -
ఎప్పట్లోగా కడతారో చెప్పండి..
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలకు సంబంధించిన (ఏజీఆర్) బకాయీలను ఎప్పట్లోగా, ఎలా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక సమర్పించాలంటూ టెలికం సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే పూచీకత్తులు కూడా ఇవ్వాలని సూచించింది. టెల్కోలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బాకీలు కట్టేందుకు టెల్కోలకు 20 ఏళ్ల గడువు ఇచ్చే అంశంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. 1999 నుంచి కేసు నలుగుతోందని.. ఈ 20 ఏళ్లలో బాకీలు కట్టనప్పుడు మరో 20 ఏళ్లలో కట్టేస్తారనడానికి గ్యారంటీ ఏమిటని టెల్కోలను ప్రశ్నించింది. వాయిదాల పద్ధతిలో కట్టుకోవడానికి కోర్టు అనుమతించే పరిస్థితి లేదని.. బ్యాంక్ గ్యారంటీలివ్వడానికి టెల్కోలు, వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి ఆయా సంస్థల డైరెక్టర్లు గానీ సిద్ధంగా ఉన్నారేమో తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. సవరించిన ఆదాయాల ఫార్ములా ప్రకారం టెల్కోలు బాకీలు కట్టేలా సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. టెలికం శాఖ లెక్కల ప్రకారం భారతి ఎయిర్టెల్ రూ. 43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ రూ. 16,798 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, టెల్కోలు తమ బాకీలు ఆ స్థాయిలో లేవని చెబుతున్నాయి. స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే కొంత కట్టాయి. ఇది పోగా మిగతా రూ. 93,520 కోట్ల ఏజీఆర్ బాకీలను టెల్కోలు కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినిచ్చేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. స్పెక్ట్రమే గ్యారంటీ..: వొడాఫోన్ ఐడియా తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని విచారణ సందర్భంగా ఆ సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు తెలిపారు. టెలికం సంస్థలు వేల కోట్ల రూపాయలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం, లైసెన్సులనే ప్రభుత్వం గ్యారంటీగా పరిగణించవచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ టెల్కోలు బాకీలు కట్టకపోతే వీటిని రద్దు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే 70% కట్టేశామని, ప్రభుత్వంతో సంప్రతించాకా మిగతాది కూడా కట్టేస్తామని భారతి ఎయిర్టెల్ తెలియజేసింది. పీఎస్యూలపై ఆ బాదుడేంటి.. ఇక ఏజీఆర్ బాకీలపై గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) నుంచి రూ. 4 లక్షల కోట్ల బాకీలు రాబట్టేందుకు టెలికం శాఖ చర్యలు తీసుకోవడాన్ని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పీఎస్‌యూలనుంచి బాకీలు రాబట్టేందుకు తమ ఉత్తర్వును ప్రాతిపదికగా తీసుకోవడానికి లేదని పేర్కొంది. ‘ఈ డిమాండ్ నోటీసులను వెనక్కి తీసుకోండి. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఏజీఆర్ బాకీలపై సుప్రీం ఆదేశాల ప్రకారం.. స్పెక్ట్రం, లైసెన్సులున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్ ఇండియా మొదలైన పీఎస్‌యూలు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ లెక్కేసింది. దీనిపై ఆయా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. -
కట్టాల్సినది రూ. 21 వేల కోట్లే
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల (ఏజీఆర్) కింద తాము కట్టాల్సినది టెలికం శాఖ (డాట్) చెబుతున్న దానికంటే చాలా తక్కువేనని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తెలిపింది. వాస్తవంగా తాము చెల్లించాల్సినది రూ. 21,533 కోట్లు మాత్రమేనని స్వీయ మదింపులో తేలిందని సంస్థ వివరించింది. ఇందులో ఇప్పటికే రూ. 3,500 కోట్లు కట్టినట్లు పేర్కొంది. వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్ల పైగా కట్టాలని డాట్ చెబుతోంది. మరోవైపు, వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. కంపెనీని నిలబెట్టేందుకు తోడ్పాటు అందించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు (ఐఎస్పీ) ఫీజులు తదితర బాకీలకు సంబంధించి ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లు కట్టాలంటూ ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ పంపింది. ఐపీ–1, ఐపీ–2, ఐఎస్పీ లైసెన్సు ఫీజుల బకాయిల కింద రూ. 1,72,655 కోట్లు చెల్లించాలని ఇందులో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే కట్టాల్సినదంతా కట్టేశామని.. ఇక చెల్లించాల్సిన బాకీలం టూ ఏమీ లేవని గెయిల్ ప్రత్యుత్తరంలో పేర్కొన్నట్లు వివరించాయి. 2002లో తీసుకున్న ఐఎస్పీ లైసెన్సు గడువు 2017తో తీరిపోయిందని గెయిల్ తెలిపింది. అసలు దీనితో వ్యాపారమేమీ చేయనందున ఆదాయార్జన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ కేటగిరీ 1, 2 కింద తీసుకున్న లైసెన్సులపై 2001–02 నుంచి రూ. 35 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని.. టెలికం విభాగం చెబుతున్నట్లుగా రూ. 2,49,788 కోట్లు కాదని స్పష్టం చేసింది. మరోవైపు, టెలికం విభాగం అడుగుతున్న మొత్తం .. గెయిల్ కంపెనీ విలువకు ఏకంగా మూడు రెట్లు ఉంటుందని సంస్థ వర్గాలు వ్యాఖ్యానించాయి. టెలికంయేతర వ్యాపా రాల ద్వారా వచ్చిన రెవెన్యూను కూడా ఆదాయం కిందే లెక్కించి, దాన్ని బట్టి లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలను కట్టాలంటూ టెల్కోలను ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా ఇదే ప్రాతిపదికన బాకీలు కట్టాలంటూ గెయిల్‌ను టెలికం విభాగం ఆదేశించింది. -
వాట్సాప్ యూజర్లకు అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక వాట్సాప్‌ల వేధింపులను ఎదుర్కొంటున్న బాధితులకు ఊరట. వాట్సాప్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) అవకాశాన్ని కల్పించింది. అశ్లీల, అభ్యంతరకరమైన సందేశాలకు చెక్ చెప్పేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు తమకు ఫిర్యాదు చేయవచ్చని శుక్రవారం సంబంధిత అధికారి ప్రకటించారు. వేధింపులు, బెదిరింపులు కస్టమర్ డిక్లరేషన్ ఫాంలో అంగీకరించిన నిబంధనల ఉల్లంఘనకు కిందికి వస్తుందని తెలిపింది. ఇలాంటి అవాంఛిత పద్ధతులను అనుసరిస్తున్న కస్టమర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఫిబ్రవరి 19న కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదకరమైన, బెదిరింపు, అసభ్యమైన వాట్సాప్ సందేశాలను అందుకున్న బాధితులు ఎవరైనా ccaddn-dot@nic.in కు బఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని డాట్ కంట్రోలర్ ఆశిష్ జోషి ట్వీట్ చేశారు. అయితే ఇందుకు అలాంటి సందేశాల స్క్రీన్ షాటన్లు అందిచాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సంబంధిత టెలికాం ప్రొవైడర్లతోపాటు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటామని జోషి వెల్లడించారు. అలాగే అభ్యంతరకరమైన, అశ్లీల, అనధికారిక కంటెంట్ పంపిణీ అవుతున్న ప్రొవైడర్ల లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇటీవల జర్నలిస్టులు సహా, పలువురు ప్రముఖులకు వాట్సాప్ ద్వారా బెదిరింపులు, వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో టెలికాం విభాగం ఈ చర్యలు చేపట్టింది. -
రిలయన్స్ జియో మరో సంచలనం
ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లతో టెలికాం ఇండస్ట్రీలో పెను సంచనాలు సృష్టించిన రిలయన్స్ జియో మరో వినూత్నానికి శ్రీకారం చుడుతోంది. తను జారీచేసే మొబైల్ నెంబర్లకు కొత్త సంఖ్యారూపాన్ని తీసుకొస్తోంది. 6-సిరీస్ తో నెంబర్లను జారీచేసేందుకు కంపెనీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వద్ద అనుమతి తీసుకుంది. ఈ అనుమతితో 6 సిరీస్‌లో మొబైల్ స్విచ్ఛింగ్ కోడ్‌ను జియో కస్టమర్లకు అలాట్ చేయనుంది. దీంతో ఆరు అంకెతో మొబైల్ నెంబర్లను ఆఫర్ చేసే తొలి టెలికాం ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో పేరొందనుంది. ఇప్పటికే ఆరు సిరీస్‌తో అస్సాం, రాజస్తాన్, తమిళనాడులో ఎంఎస్సీ కోడ్స్‌ను డీఓటీ రిలయన్స్ జియోకు జారీచేసిందట కూడా. రాజస్తాన్‌లో ఎంఎస్సీ కోడ్స్ 60010-60019, అస్సాంలో ఎంఎస్సీ కోడ్స్ 60020-60029, తమిళనాడులో ఎంఎస్సీ కోడ్స్ 60030-60039ను రిలయన్స్ జియో పొందిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్తగా ఒక మిలియన్ సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ కొత్త సిరీస్‌లో నెంబర్లను ఆఫర్ చేయడం ప్రారంభిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశీయ టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆపరేటర్లు 9,8,7 సిరీస్‌లో మొబైల్ నెంబర్లను ఆఫర్ చేస్తున్నాయి. కొత్తగా నెంబర్ సిరీస్‌కు జియో శ్రీకారం చుడుతుండటంతో 9,8,7 సిరీస్‌లకు డిమాండ్ తగ్గనుందని తెలుస్తోంది. దీంతో ఇవి కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. -
టవర్ల రేడియేషన్ తెలుసుకోవడం ఇక సులభం!
న్యూఢిల్లీ: టెలికం శాఖ తరంగ్ సంచార్ పేరుతో అతి త్వరలోనే ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనుంది. దీని ద్వారా మొబైల్ కంపెనీల టవర్లు ఎంత మేర రేడియేషన్ విడుదల చేస్తుందీ తెలుసుకోవచ్చు. దేశంలోని 12.5 లక్షల బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ల (బీటీఎస్) సమాచారాన్ని టెలికం శాఖ ఈ వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనుంది. ప్రతీ టవర్‌కు సంబంధించి... అది ఏ కంపెనీకి చెందినది, 2జీ/3జీ/ 4జీ సేవల్లో దేనికి సపోర్ట్ చేస్తుంది, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫ్రీక్వెన్సీ నిబంధనలను అమలు చేసిందా? తదితర వివరాలు తెలుసుకోవచ్చని టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ పరీక్షా దశలో ఉందని, త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్టు చెప్పాయి. ‘ఫలానా బేస్ స్టేషన్ వెలువరించే రేడియేషన్ ఏ స్థాయిలో ఉన్నదీ అప్పటికే టెలికం శాఖ పరీక్షిం చి ఉంటే అభ్యర్థన మేరకు ఆ సమాచారాన్ని పొందొచ్చు. ఒకవేళ సంబంధిత ప్రాంతంలో పరి మితి దాటిపోతే... నిర్ణీత ఫీజు చెల్లించినట్టయితే టెలికం శాఖ సిబ్బంది రేడియేషన్‌ను పరీక్షించి ఆ సమాచారాన్ని కోరిన వారికి అందజేస్తారు. -
ఈ-ఆధార్‌తో సిమ్ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ-ఆధార్ కార్డు కాపీని చూపించి మొబైల్ ఫోన్లకు కొత్త సిమ్‌లు కొనుగోలు చేసుకునేలా వినియోగదారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అవకాశం కల్పించింది. ఈ-ఆధార్ కార్డునే అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణిస్తారు. కొత్తగా మొబైల్ కనెక్షన్ తీసుకునేందుకు వ్యక్తిగత, నివాస చిరునామాకు వేర్వేరు ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి లభించే ఇ-ఆధార్ లేఖ/డౌన్లోడ్ చేసుకున్న కార్డునే మొబైల్ కనెక్షన్ కోసం వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణ కోసం వినియోగించవచ్చు. ఇ-ఆధార్ కార్డులో వ్యక్తి పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు నమోదవుతాయని.. వాటిని సిమ్‌కార్డు విక్రయించే వ్యక్తి పరిశీలించాలని డీఓటీ సూచించింది. కొనుగోలుదారుకు సంబంధించి యూఐడీఏఐ నుంచి పొందిన వివరాలతో ఇ-ఆధార్ లేఖలోని అంశాలు సరిగా ఉన్నాయని సిమ్‌కార్డు అమ్మేవారు స్టేట్మెంట్ నమోదు చేయాలని సూచించింది. మొబైల్ కనెక్షన్ల జారీకి ఇ-ఆధార్ లేఖను ధ్రువీకరణగా పరిగణించాలని, ఈ ఏడాది ఆరంభంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాధ్యూస్, ఆస్పి సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ టెలికాం విభాగాన్ని కోరారు. ఆధార్ కార్డుకు, యూఐడీఏఐ వెబ్సైట్ ఇ-ఆధార్ లేఖకు తేడా ఏమీ లేదని, అందువల్ల మొబైల్ కనెక్షన్‌కు రెండింటినీ అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుని, యూఐఏడీఐ నుంచి ఇ-ఆధార్ లేఖ పొందిన పలువురికి, ఇప్పటికీ ఆధార్ కార్డు అందలేదు. టెలికాం శాఖ తాజా నిర్ణయం ఇలాంటి వారికి ఉపయోపడుతుంది. -
సెల్ టవర్ అంటే భయం వద్దు
- దాంతో ఎలాంటి హానీ లేదు - టెలికం శాఖ ముమ్మర ప్రచారం సాక్షి, హైదరాబాద్ : సెల్‌టవర్ నుంచి ప్రమాదకరమైన స్థాయిలో రేడియో ధార్మిక శక్తి విడుదల కాదని, అది పూర్తిగా సురక్షితమేనని, ప్రజలు భయాందోళనలు లేకుండా ఉండొచ్చంటూ కేంద్రప్రభుత్వం ముమ్మర ప్రచారానికి సిద్ధపడింది. టెలికం శాఖ దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి టెలికం శాఖ నగరంలో తొలి అవగాహన సదస్సు నిర్వహించింది. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఎస్ఐబీ ఐజీ సజ్జనార్ తదితరులు రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మాజీ సలహాదారు టి.హనుమాన్ చౌదరి, ప్రముఖ వైద్య నిపుణులు కాకర్ల సుబ్బారావుతోపాటు టెలికం సీనియర్ డీటీజీ శివేంద్ర భట్నాగర్, డీడీజీ రఘునందన్, పలు మొబైల్ ఆపరేటర్లు తదితరులు హాజరయ్యారు. టవర్లతో ప్రమాదం లేదు సదస్సులో డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ సెల్ టవర్ల వల్ల మనకెలాంటి ప్రమాదం లేదని ప్రజలు అనవసరంగా భయపడకుండా నిశ్చితంగా ఉండొచ్చని అన్నారు. టి.హనుమాన్ చౌదరి మాట్లాడుతూ సెల్ ఫోన్, టవర్ల రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుందని, ఎలాంటి భయం వద్దని పేర్కొన్నారు. -
ఎయిర్టెల్-ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్ ఒప్పందానికి ఆమోదం!
డీల్ విలువ రూ. 3,500 కోట్లు న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, ఎయిర్‌సెల్‌ల రూ.3,500 కోట్ల 4జీ స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ఒప్పందానికి టెలికం శాఖ ఆమోదం లభించిందని సమాచారం. అయితే ఈ విషయమై వ్యాఖ్యానించడానికి భారతీ ఎయిర్టెల్ నిరాకరించింది. ఎనిమిది టెలికం సర్కిళ్ల (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నైతో కలుపుకొని),బిహార్, జమ్ము అండ్ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య ప్రాంతం, ఒడిశా) ఎయిర్‌సెల్‌కు చెందిన 4జీ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకునే హక్కులను రూ.3,500 కోట్లకు కొనుగోలు చేయడానికి భారత్ ఎయిర్టెల్ ఇంతకుముందు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక టెలికం సర్కిల్‌కు కేటాయించిన మొత్తం స్పెక్ట్రమ్‌లో ఏ కంపెనీకి 25 శాతానికి మించి స్పెక్ట్రమ్ ఉండకూడదు. ఒడిశా సర్కిల్లో అప్పటికే ఎయిర్‌టెల్‌కు కొంత స్పెక్ట్రమ్ ఉంది. ఒడిశా సర్కిల్లోని ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్ కొనుగోలు కారణంగా ఈ పరిమితిని మించిన స్పెక్ట్రమ్ భారతీ ఎయిర్‌టెల్‌కు ఉంటుంది. అదనంగా ఉన్న 1.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ఎయిర్టెల్ ప్రభుత్వానికి అప్పగించిందని, దీంతో ఈ ఒప్పందం సాకారమైందని సమాచారం. కాగా ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్‌ను తక్షణం స్తంభింపజేయాలని ప్రశాంత్ భూషణ్ అనే ఉద్యమ న్యాయవాది ఈ నెల 8న సీబీఐ, ఈడీలకు ఒక లేఖ రాశారు. ఆర్‌కామ్, ఎయిర్‌టెల్‌లతో ఎయిర్‌సెల్ కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారమైతే, ఎయిర్‌సెల్ మాతృ కంపెనీ మ్యాక్సిస్ పారిపోతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.