fish farming
-
కొరమేను చేప మాంసాహారి
-
జాగ్రత్తలు పాటిస్తే చేపల సాగు అధిక లాభాలు..!
-
ఈ పద్ధతిలో చేపల పెంపకం చేస్తే.. లాభాలు కూడా భారీగానే..!
-
కొరమేను చేపలు మంచి నీటిలో బాగా పెరుగుతాయి
-
చేపలపెంపకంలో జాగ్రత్తలు అవసరం
-
వ్యవసాయం చేస్తూనే చేపల పెంపకం
-
చేపల పెంపకంతో లాభాలే .. లాభాలు
-
‘కేజ్ కల్చర్’.. అసలేంటీ కథ..!
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో పంజరం వంటివి ఏర్పాటు చేసి వాటిలో చేపలను పెంచే విధానాన్ని కేజ్ కల్చర్‌గా పేర్కొంటారు. వీటిలో పెరిగే చేపలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కేజ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్ల నుంచి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో సముద్రంలో కేజ్‌లను అమర్చి పరిశోధనలు సాగిస్తున్నారు. వీరు అక్కడ ఉన్న 30 కేజ్‌ల్లో వివిధ రకాల చేపలను పెంచుతున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) ద్వారా మత్స్యకారులతో పాటు వివిధ కులాల మహిళలకు ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, మత్స్యకార మహిళలకు 60 శాతం, బీసీ మత్స్యకారులకు 40 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు 18 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో జనరల్ కేటగిరీ వారికి 14, ఎస్సీలకు 4 చొప్పున కేటాయించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు. ఇందులో 10 శాతం లబ్దిదారు వాటాగా భరిస్తే సబ్సిడీ సొమ్ము 40/60 శాతం) పోగా మిగిలినది బ్యాంకు రుణంగా సమకూరుస్తోంది. సబ్సిడీ సొమ్మును లబ్ధిదారునికి దశల వారీగా చెల్లిస్తారు. విశాఖ జిల్లాలో బి.రేవతి అనే మహిళకు 10 ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేశారు. వీటిని సీఎంఎఫ్ఆర్ఐ నిర్వహిస్తున్న కేజ్‌ల సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేజ్‌ల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని సీఎంఎఫ్ఆర్ శాస్త్రవేత్తలే అందజేస్తారు. అంతేకాదు.. వీరి పర్యవేక్షణలోనే కేజ్‌ల్లో చేపల పెంపకం కూడా జరుగుతుంది. చేప పిల్లలు, మేత, రవాణా తదితర అవసరాలకు సీఎంఎఫ్ఆర్ఐ సహకరిస్తుంది. విశాఖలో సముద్రంలో కేజ్‌ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. నెల రోజుల్లో వీటిలో చేపల పెంపకం ప్రక్రియ ప్రారంభమవుతుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేజ్‌ల నిర్మాణం ఇలా.. ఒక్కో ఓపెన్ సీ కేజ్‌ను ఆరు మీటర్ల వ్యాసార్ధంలో, నాలుగు మీటర్ల లోతులో రబ్బరు ట్యూబ్‌లు, పీవీసీ పైప్‌లతో నిర్మిస్తారు. వీటికి ప్లాస్టిక్ డ్రమ్ములు, వెదురును కూడా ఉపయోగిస్తారు. చుట్టూ ఔటర్, ఇన్నర్ నెట్లను ఫ్రేమ్‌ల మాదిరిగా అమరుస్తారు. ఈ కేజ్‌లు కొట్టుకుపోకుండా సముద్రంలో లైన్లు, యాంకరింగ్‌కు వీలుగా చైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ కేజ్‌ల్లో పండుగప్పల పెంపకం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కేజ్‌ల్లో పండుగప్ప రకం చేపలను పెంచనున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో పండుగప్ప చేపలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పండుగప్ప చేప పిల్లలను (3–4 అంగుళాల పొడవు) పాండిచ్చేరి సమీపంలోని సీడ్గాళిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ నుంచి తీసుకొచ్చి ఈ కేజ్‌ల్లో పెంచుతారు. 10–12 నెలల్లో చేప పూర్తి స్థాయిలో (కిలో వరకు బరువు) ఎదుగుతుంది. ఇలా ఒక్కో కేజ్ నుంచి 2–3 టనునల చేపల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో పండుగప్ప ధర రూ.500–700 వరకు పలుకుతోంది. -
రాయితీపై రొయ్య పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలో సబ్సిడీ మీద రొయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. చేపపిల్లలను వంద శాతం సబ్సిడీతో అందచేస్తూ ముదిరాజ్, బెస్త తదితర సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు జీవన్‌రెడ్డి, ముఠా గోపాల్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. 2022–23లో 4.67 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 23,748 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలామని చెప్పారు. చేపల మార్కెటింగ్ కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో 647 సొసైటీలు ఉండగా, ఇప్పుడు వాటిని 5112కు పెంచుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా లక్ష మందికి సభ్యత్వం ఇచ్చినట్లు చెప్పారు. పాల ఉత్పత్తి పెంపునకు చర్యలు విజయ డెయిరీని మూసివేసే పరిస్థితి నుంచి పురోగమించే స్థితికి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిపై సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, జైపాల్ యాదవ్, భాస్కర్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెపుతూ విజయ డెయిరీతో పాటు కరీంనగర్, ముల్కనూర్ తదితర నాలుగు సహకార డెయిరీల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. -
ఇండియన్ సాల్మన్.. సాగు సక్సెస్..
సాక్షి, అమరావతి: ఇండియన్ సాల్మన్.. మన వాడుక భాషలో ‘మాగ’గా పిలిచే ఈ చేపలను దేశంలో తొలిసారి మన రాష్ట్రంలో సాగుచేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద కేజ్ కల్చర్‌లో చేపట్టిన ఈ చేపల సాగు విజయవంతమైంది. దీంతో చెరువుల్లో సాగుచేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సముద్రచేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో ఇదొకటి. జంతుశాస్త్రపరంగా సాల్మో సాలార్‌గా పిలిచే ఈ చేప మన దేశానికి చెందినది కాదు. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లో పెరిగే ‘సాల్మో నిడ్స్’ సమూహానికి చెందినది. 5 నుంచి 10 అడుగుల లోతులో చల్లటి ఉప్పునీటి జలాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇవి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సముద్రపునీరు, మంచినీరు కలిసే చోటుకువచ్చి గుడ్లు పెట్టి పొదిగి తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోతాయి. ఇవి 10 కిలోల వరకు పెరుగుతాయి. పొడవుగా, నునుపాటి శరీరంతో ఉండే ఈ చేపకు పైభాగానే చిన్న నల్లటి చుక్కలుంటాయి. కింద భాగం (పొట్ట) తెల్లగా ఉంటుంది. మలేషియా, కువైట్లలో మాత్రమే వీటిని సాగుచేస్తున్నారు. ఈ చేపల తొలి హేచరి మలేషియాలో ఉంది. సముద్ర జలాల్లో సహజసిద్ధంగా దొరకడమే తప్ప.. వీటిసాగుపై ఇన్నాళ్లు దృష్టి పెట్టలేదు. పోషకాలు పుష్కలం.. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ చేపల్లో విటమిన్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, అయోడిన్‌కు కొదవలేదు. వారానికి కనీసం రెండుసార్లు తిన్నవారిలో గుండెపోటు, క్యాన్సర్, ట్యూమర్స్ దరిచేరవు. బీపీ తగ్గడమే కాదు.. ఎముకలు బలపడతాయి. నాడీవ్యవస్థ, మెదడు పనితీరు మెరుగుపడడమేగాక జ్ఞాపకశక్తి పెరుగుతుందని, వయసు సంబంధిత నష్టం తగ్గిస్తాయని అధ్యయనాల్లో రుజువైంది. మన దేశంలో మత్స్యకారులకు ఈ చేపలు అరుదుగా దొరుకుతాయి. మార్కెట్‌కు ‘మాగ’ చేప వస్తే చాలు.. ఎంత రేటైనా ఎగరేసుకుపోతారు. వెన్నుముల్లు మాత్రమే ఉండే ఈ చేపను వేపుడు చేసుకునేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. ఇగురు, పులుసు కూడా వండుకుంటారు. రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు ఈ చేపలసాగుపై దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడికి రెట్టింపు ఆదాయం దేశంలో తొలిసారి కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద సముద్ర జలాల్లో ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ విధానంలో వీటిసాగు చేపట్టారు. కేజ్ కల్చర్‌లో విజయవంతం కావడంతో చెరువుల్లో సాగుపై దృష్టిసారించారు. కేజ్‌ల్లో అరకిలోకు మించి పెరగవు. అదే నాలుగడుగుల లోతున్న చెరువుల్లో 8–12 నెలలు పెంచితే కిలో నుంచి రెండుకిలోల వరకు పెరుగుతాయి. సీ మౌత్‌లో దొరికే సీడ్‌ను నర్సరీ చెరువులో మూడంగుళాల సైజు వరకు పెంచి తర్వాత ఎకరా చెరువులో రెండువేల పిల్లల వరకు వేయవచ్చు. 45 శాతం ప్రొటీన్లు, 12 శాతం కొవ్వు పదార్థాలు కలిగిన మేత వేస్తే చాలు. వ్యాధి నిరోధకశక్తి అధికం కాబట్టి వ్యాధులకు కూడా దూరంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కిలో రూ.450కి పైగా పలుకుతోంది. కిలోకి రూ.225 వరకు పెట్టుబడి అవుతుంది. రెట్టింపు ఆదాయం వస్తుంది. ఈ చేపల సాగుపై లోతైన అధ్యయనం చేసి రైతులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తొమ్మిదేళ్లు శోధించా కొన్నేళ్లుగా కేజ్‌కల్చర్‌లో పండుగప్ప సాగుచేస్తున్నా. ఇండియన్ సాల్మన్ సాగుచేయాలని తొమ్మిదేళ్ల నుంచి ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఇటీవలే ప్రయోగాత్మకంగా చేపట్టా. సీ మౌత్‌లో పిల్లలను సేకరించి వేశా. పోషక విలువలున్న మేత అందిస్తున్నా. నాలుగు నెలల్లో పావుకిలో సైజు పెరిగాయి. మరో మూడునెలలు పెంచితే ముప్పావు కిలోవరకు వస్తాయి. రూ.లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుంది. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నా. చెరువుల్లో సాగుకు ఎంతో అనుకూలమైన ఈ చేపల సాగుపై రైతులు దృష్టిసారిస్తే మంచిది. – తలశిల రఘుశేఖర్, నాగాయలంక, కృష్ణాజిల్లా -
పంగాసియస్.. కేరాఫ్ ఏపీ
పంగాసియస్గా పిలిచే ఈ చేపకు వెన్ను ముల్లు తప్ప చూద్దామంటే మరో ఎముక కనిపించదు. పైగా నీచు వాసన రాదు. దీంతో చేసే ఏ వంటకమైనా చాలా మృదువుగా.. రుచికరంగా ఉంటుంది. తింటే ఇట్టే జీర్ణమైపోతుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని ఇష్టపడని వారుండరు. అందుకే స్టార్ హోటల్స్‌తోపాటు సాధారణ హోటళ్లలోనూ ఈ చేప వంటకాలకు డిమాండ్ ఎక్కువ. అపోలో ఫిష్‌గా దీనిని ఎక్కువగా వండుతారు. వియత్నాంలో పుట్టిన ఈ చేపలు మన ప్రాంతంలో పెరిగే ఏటి జెల్లను పోలి ఉంటాయి. దేశీయంగా వీటిని పంగా, పంగస్, అపోలో, వెండి చేప అని కూడా పిలుస్తారు. సాక్షి, అమరావతి: పంగాసియస్ చేపల సాగులోను.. అధిక దిగుబడులు సాధించడంలోను దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 50 వేల హెక్టార్లలో ఈ చేపల్ని పెంచుతుండగా.. అందులో 20 వేల హెక్టార్లు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ఏటా 80 లక్షల టన్నుల పంగాసియస్ చేపలు ఉత్పత్తి అవుతుండగా.. వాటిలో 30నుంచి 35 లక్షల టన్నులు ఏపీ నుంచే దిగుబడి వస్తుండటం గమనార్హం. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వీటి సాగు విస్తరించి ఉంది. స్థానికంగా ఈ చేపల వినియోగం కేవలం 2 శాతమే కాగా.. మిగిలిందంతా పొరుగు రాష్ట్రాలకే ఎగుమతి అవుతోంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు 10 లక్షల టన్నుల వరకు వెళుతోంది. బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్లోనూ వీటికి డిమాండ్ ఎక్కువే. నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోగలవు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ చేపలు ఎలాంటి తెగుళ్లు, వ్యాధులనైనా తట్టుకుంటాయి. మొప్పలు కాకుండా వీటికి ఉండే గాలి తిత్తుల ద్వారా గాలి పీల్చుకుంటాయి. నీటిలో ఆక్సిజన్ తగ్గినప్పుడు నీటి ఉపరితలానికి చేరి వాతావరణంలోని ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. ఎలాంటి వాతావరణంలో అయినా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వేసిన ప్రతి పిల్ల బతకడం వీటి ప్రత్యేకత. రెండేళ్లలో మూడు పంటలు తీస్తున్నారు. గరిష్టంగా ఏడాది పాటు పెంచగలిగితే ఒక్కో చేప 3నుంచి 4 కేజీల వరకు పెరుగుతుంది. ఎకరాకు సైజును బట్టి 12 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పోషకాలు పుష్కలం ప్రొటీన్స్, ఐరన్, జింక్, కాల్షియం, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఈ చేపల్లో కార్బోహైడ్రేట్స్, సోడియం తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చేపలో ప్రొటీన్ 15.2 గ్రాములు, కొవ్వు 2.9 గ్రాములు, కార్బోహైడ్రేట్స్, యాష్ గ్రాము, నీరు 60 గ్రాములు, 89 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. హాని కల్గించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అధికంగా ఉండే కాల్షియం ఎముకలు, కీళ్ల బలోపేతానికి, సేంద్రియ ఆమ్లాలు కంటిచూపు మెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి. బ్రూడర్ కేంద్రం ఏపీలోనే.. కేంద్రీయ మంచినీటి మత్స్య పరిశోధనా సంస్థ (భువనేశ్వర్)కు అనుబంధంగా కృష్ణా జిల్లా కానూరు వద్ద గల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం పంగాసియస్ బ్రూడర్గా కేంద్రం గుర్తింపు పొందింది. 2013లో వియత్నాం నుంచి తీసుకొచ్చిన బ్రూడర్స్ ద్వారా తల్లి చేపలను ఉత్పత్తి చేసి కనీసం 4 ఏళ్లపాటు పెంచి పిల్లలను ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన 30–40 గ్రాముల సైజు పిల్లలను హేచరీలకు ఇస్తుంటారు. హేచరీల్లో మరో మూడేళ్ల పాటు సీడ్ ఉత్పత్తి జరుగుతుంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సీడ్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 టన్నుల బ్రూడర్స్ ఉన్నాయి. ఏటా 100 లక్షల సీడ్ అవసరం కాగా.. 50 లక్షల సీడ్ ఈ కేంద్రం అభివృద్ధి చేసిన బ్రూడర్స్ నుంచే ఉత్పత్తి చేస్తారు. అపోలో ఫిష్‌గా, ఫిష్ స్టాటర్స్గా ఉపయోగించే ఈ చేపకు స్టార్ హోటల్స్ నుంచి సాధారణ హోటల్స్ వరకు డిమాండ్ ఎక్కువ. ఈ కారణంగానే వీటికి అపోలో ఫిష్ అనే పేరొచ్చింది. పదేళ్లుగా ఇదే సాగు పదేళ్లుగా వంద ఎకరాల్లో పంగాసియస్ సాగు చేస్తున్నా. మిగిలిన చేపలతో పోలిస్తే వీటి సాగులో ఏమాత్రం నష్టాలు ఉండవు. కేజీ, కేజీన్నర సైజులో చేపలు పట్టుబడి చేస్తా. ఎకరాకు 9నుంచి 12 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. మంచి ఆదాయం వస్తుంది. – ఉమాశంకర్‌రెడ్డి, రైతు, గుడివాడ, కృష్ణా జిల్లా బ్రూడర్స్ ఉత్పత్తిలో.. పదేళ్లుగా పంగాసియస్ తల్లి చేపల(బ్రూడర్స్)ను ఉత్పత్తి చేస్తున్నాం. జన్యుపరమైన సమస్యలు లేకుండా వీటిని అభివృద్ధి చేసి హేచరీలకు ఇస్తున్నాం. వీటి సాగు, దిగుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2013లో 200 బ్రూడర్స్ తీసుకొచ్చాం. ప్రస్తుతం 6వేల కిలోల బ్రూడర్స్ ఉన్నాయి. – బి.శేషగిరి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రాంతీయ మత్స్య పరిశోధనా కేంద్రం -
రూట్ మార్చిన రైతులు.. కొత్త రకం సాగుతో అన్నదాతకు లాభాలు!
కొందుర్గు, రంగారెడ్డి జిల్లా: ఆహార, వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పూలతోటలు సాగులో అధిక పెట్టుబడులు పెట్టి నష్టాలపాలైన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్కడో థాయ్‌లాండ్, వియత్నం దేశాల్లో సాగుచేసే డ్రాగన్ పండ్ల తోటలతోపాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి చీడపీడలు ఆశించని, తక్కువ పెట్టుబడితో సాగుచేసే డ్రాగన్ పండ్ల తోటలను రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల, ముట్పూర్ గ్రామాల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో సాగు చేస్తున్నారు. ఫ్రూట్స్ పండించడంతోపాటు డ్రాగన్ మొక్కలకు సంబంధించిన నర్సరీని సిద్ధం చేసి ఇతర రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయానికి అంతగా అనుకూలించని గరపనేలల్లోనూ తక్కువనీటితో ఈ పండ్లు సాగు చేయొచ్చని చెబుతున్నారు. యూట్యూబ్ చూసి.. సాగు చేసి కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి యూట్యూబ్ చూసి ఈ పంటను సాగుచేసి అధునాతన ఒరవడి సృష్టించాడు. సంగారెడ్డిలో ఓ రైతు సాగుచేసిన తోటను పరిశీలించి ఆయన అనుభవాలను తెలుసుకున్నాడు. డ్రాగన్ ఫ్రూట్స్ పీ పింక్ రకం మొక్కలు ఎంపిక చేసుకొని ఒక్కో మొక్కకు రూ.70 చొప్పున మాట్లాడుకొని 2 వేల మొక్కలు తెచ్చి మూడెకరాల్లో నాటాడు. ప్రస్తుతం మరో రెండువేల మొక్కలను స్వతహాగా తయారు చేసుకొని మరో మూడు ఎకరాల్లో నాటడంతోపాటు ఇతర రైతులకు మొక్కలను సిద్ధం చేశాడు. అతడిని చూసిన మరికొంతమంది రైతులు డ్రాగన్ తోటలను సాగుచేశారు. కేశంపేట, చేవెళ్ల, భూత్పూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లోనూ డ్రాగన్ తోటలను సాగుచేస్తున్నారు. దిగుబడి, మార్కెటింగ్.. ఈ పంట సాగుచేసిన 8 నెలలకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక పండు 600 నుంచి 700 గ్రాములు ఉంటుంది. ఒక్కో మొక్కకు దాదాపు 25 కిలోల పండ్లు వస్తాయి. హైదరాబాద్‌లోని ఫ్రూట్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. చెరువులు తవ్వి.. చేపలు పెంచి మరోవైపు మరికొంతమంది రైతులు చెరువులను తవ్వి చేపల పెంపకంపై దృష్టి సారించారు. ఒక్కో చేప పిల్లకు రూ.16 చొప్పున ఖర్చుచేసి నల్లగొండ నుంచి మూడు నెలల వయస్సు గల చేప పిల్లలను తెచ్చి చెరువుల్లో వదిలారు. అర ఎకరం విస్తీర్ణంలో పదివేల వరకు చేపపిల్లలను పెంచొచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దాణా వేయాలని, 8 నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక్కో చేప కిలో బరువు దాటుతుందని అంటున్నారు. రెండో ఏడాది నుంచి దిగుబడి డ్రాగన్ సాగుచేయడానికి మొదటగా పిల్లర్లు, డ్రిప్‌ల కోసం ఎకరాకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది కాస్తా దిగబడి తక్కువగా ఉన్నా రెండో ఏడాది నుంచి పెరుగుతుంది. మూడు, నాలుగేళ్ల సమయంలో ఎకరాకు 50 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను ఎకరాకు రూ.5 లక్షల దాకా లాభం వస్తుంది. ఈ పంట 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. – రవీందర్‌రెడ్డి, రైతు, ఉమ్మెంత్యాల చేపల పెంపకంతో లాభాలు 15 గుంటల విస్తీర్ణంలో చెరువు తవ్వి 10 వేల చేపపిల్లలను వదిలాను. గుంత తవ్వడం, కవర్ వేయడం, చుట్టూ కంచె వేయడానికి రూ.5 లక్షల ఖర్చు వచ్చింది. దాణాకు మరో రూ.10 లక్షలు అయ్యింది. తొమ్మిది నెలల్లో ఒక్కో చేపపిల్ల కిలో బరువు వచ్చింది. ప్రస్తుతం చెరువు వద్దే కిలో రూ.310 చొప్పున విక్రయిస్తున్నాను. ఇప్పటికి 500 కిలోలు అమ్మగా మరో 6 వేల కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఖర్చులు పోను రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. వచ్చే ఏడాది చేపపిల్లలు, దాణా ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన అర ఎకరం విస్తీర్ణంలో చెరువును తవ్వి చేపలు పెంచితే 10 నెలలకు రూ.10 లక్షలు సంపాదించొచ్చు. – రాయికంటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మెంత్యాల. -
ప్రజారోగ్యంతో చెలగాటం.. చేపలకు మేతగా కుళ్లిన కోళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు. టాస్క్ఫోర్సు కమిటీలు రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్ఓ, వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)లతో టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్ఫోర్సు చేస్తోంది. అక్రమ రవాణా ఇలా.. వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తప్పవు కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం. – ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు ప్రజారోగ్యానికి ముప్పు కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం. – బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్సీ డాక్టరు, కైకలూరు మండలం -
పంజరంలో పండు‘గొప్ప’
సాక్షి, అమరావతి: తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం చేపల సాగు (కేజ్ కల్చర్) సిరుల పంట పండిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతిక చేయూత అందించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద సీడ్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. సీఎంఎఫ్ఆర్ఐ సహకారంతో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద ఉప్పుటేరులో కేజ్ కల్చర్ చేపట్టిన యానాదులకు సిరుల పంట పండింది. 1.85 టన్నుల పండుగప్ప దిగుబడి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది డిసెంబర్లో 585 మీటర్లు పరిమాణం గల 4 పంజరాల్లో 80 నుంచి 100 గ్రాముల బరువు గల పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీన్నర నుంచి 2 కేజీల వరకు బరువు పెరిగాయి. 4 పంజరాల్లో తాజాగా పట్టుబడి పట్టగా 1.85 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.460 చొప్పున విక్రయించారు. మరో 700 గ్రాముల సైజులో మరో 400 కేజీల వరకు పట్టుబడి చేయాల్సి ఉంది. వేటకు వెళ్లే ఈ కుటుంబాలు చిన్నపాటి చేపలను తీసుకొచ్చి పంజరాల్లోని పండుగప్పలకు మేతగా ఉపయోగించేవారు. పైసా పెట్టుబడి లేకుండా ఒక్కో పంజరం నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆర్జించారు. భూమిలేని పేదలకు వరం భూమిలేని పేదలకు ఇది ఎంతో లాభదాయకమని సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ మేఘరాజన్ అన్నారు. సీఎంఎఫ్ఆర్ఐ ఇచ్చిన చేయూత వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాయని ఎస్టీ మత్స్యకారుడు నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు. -
చేప.. చెంగుమంటుంది!
సాక్షి ప్రతినిధి, కడప: జలవనరులు పుష్కలంగా ఉన్న జిల్లాను చేపల ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాత సాగునీటి వనరుల పెండింగ్ పనులు పూర్తి చేయడమే కాకుండా కొత్త సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ ప్రాజెక్టుల పరిధిలోని సాగునీటి వనరులలో 80 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ పెట్టింది. వేసవిలోనూ ప్రాజెక్టులు జలాలతో నిండుకుండల్లా ఉన్నాయి. భవిష్యత్తులో మిగిలిన కొత్త ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి పెద్ద ఎత్తున నీటిని నిల్వ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు సైతం నీటితో నిండడంతో జిల్లాలో చేపల పెంపకానికి అనువుగా ఉంటుందని భావించిన ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తోంది. రూ. 2.70 కోట్లతో ఫిష్ బ్రీడింగ్ సెంటర్ రూ. 2.70 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో బ్రహ్మంసాగర్ జలాశయం వద్ద ప్రభుత్వం షిఫ్ బ్రీడింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. 14 చిన్నపాటి చెరువులు, 20 టబ్బులను నిర్మిస్తున్నారు. సాగునీటి వనరుల శాఖ వీటి నిర్మాణాలను చేపట్టింది. మరో నెల రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. అనంతరం చెరువులు, టబ్బులలో జిల్లా మత్స్యశాఖ చేపల సీడ్ ఉత్పత్తి చేపట్టనుంది. కట్లకట్ల (బొచ్చ), రోహిత (సీలావతి), ఎర్రమోసు (మిగాల), బంగారు తీగలు తదితర రకాల చేప పిల్లలను ఇక్కడే ఉత్పత్తి చేస్తారు. వాటిని గుడ్లు పెట్టించి పిల్లలను ఇక్కడ తయారు చేయనున్నారు. అనంతరం ఆ చేప పిల్లలను మత్స్యకారులు, ఇతర చేపల పెంపకం ఆసక్తి గల వారికి సరఫరా చేస్తారు. ప్రస్తుతానికి జిల్లాలో వివిధ నీటి వనరుల ద్వారా 70 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. షిఫ్ బ్రీడింగ్ సెంటర్ పనులు పూర్తి కాగానే రూ. 2 కోట్లకు పైగా చేప పిల్లలను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. వీటిని జిల్లాలోని వివిధ జలాశయాలలో పెంచుతారు. రాయలసీమ వ్యాప్తంగా ఇక్కడి నుంచే చేప పిల్లలను సరఫరా చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మత్స్యకారులు, రైతులకు నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చేపల సీడ్ ఉత్పత్తి కేంద్రంగా జిల్లా వైఎస్సార్ జిల్లాలోని జల వనరులను దృష్టిలో పెట్టుకుని చేపల పెంపకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రధానంగా బ్రహ్మంసాగర్ జలాశయం వద్ద రూ. 2.70 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున చేప పిల్లలను ఉత్పత్తి చేసి జిల్లాలోని మత్స్యకారులు, రైతులకే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఆసక్తి గల వారికి చేప పిల్లలను సరఫరా చేయనున్నాము. – నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్, మత్స్యశాఖ, కడప -
చేనులో చేపలే పంట!
వరి పండాలంటే.. ఎప్పుడూ మడి నిండా నీళ్లుండాలి. మరి అన్ని నీళ్లున్న మడిని మరో పనికీ వాడుకోగలిగితే.. సింపుల్‌గా చేపలు పెంచితే.. ఇటు రైతులకు అదనపు ఆదాయం, అటు పర్యావరణానికీ ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో, మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరి చేన్లతో ‘చేపలు పండిస్తున్నా’రని అంటున్నారు. రాష్ట్రంలోనూ వరి చేన్లలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కథనం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వరికి ‘అదనం’గా.. ప్రపంచవ్యాప్తంగా సగం జనాభాకు అన్నమే ప్రధాన ఆహారం. వ్యవసాయం చేసే భూమిలో దాదాపు పావు వంతు వరి సాగు చేస్తున్నట్టు అంచనా. ఇలా వరి పండిస్తూనే.. అదనపు ఆదాయం పొందడానికి ఎన్నోఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరి చేన్లలో చేపలు పెంచితే ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి పలు దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మన దేశంలోనూ పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికంగా కొందరు రైతులు ఇలా చేపలు పెంచుతున్నారు. దీనితో ఎంతో ప్రయోజనం ఉన్నా రైతులకు పెద్దగా అవగాహన లేదు. చేన్లలో పెంచడం ఎలా? వరికి నీళ్లు ఎక్కువ కావాలి. పంటకాలమంతా మడులు నీటితో నిండే ఉండాలి. ఇతర అంతర పంటలు వంటివి వేయడం కష్టం. కానీ కాస్త అదనపు శ్రమ తీసుకోగలిగితే.. చేన్లలో చేపలు పెంచొచ్చు. ప్రతి మడిలో వరి చుట్టూ.. గట్టు వెంట ఐదారు అడుగుల వెడల్పుతో (పెరెన్నియల్ ట్రెంచ్)గానీ.. ఏదో ఓ పక్కన గుంత (రెఫ్యూజ్ పాండ్) లాగా గానీ నిర్ణీత పరిమాణంలో కందకాలు తవ్వి చేపలు పెంచవచ్చు. వరి–చేపల పంట ఇలా... ►సాధారణంగా వరి మడులు ఒక అడుగు నుంచి అడుగున్నర వరకు లోతు ఉంటాయి. దీనికి అదనంగా.. చేపల కోసం తవ్వే కందకాలు 3–4 అడుగుల లోతు ఉంటాయి. ►ఈ నీటిలో రోహు, తిలాపియా, బొచ్చె, కొరమీను, కామన్ కార్ప్ వంటి రకాల చేపలను పెంచవచ్చు. ఎకరానికి 400 కిలోల నుంచి 900 కిలోల వరకు చేపల దిగుబడి వస్తుందని అంచనా. ►ఒక ఎకరంలో 70 శాతం స్థలంలో వరి, మిగతా 30 శాతం స్థలంలో కందకాలు తవ్వి చేపలు వేయవచ్చు. ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల గడువులో.. ఒక్కో ఎకరంలో 400 కిలోల నుంచి 700 కిలోల వరకు చేపల దిగుబడి వస్తుందని అంచనా. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక ఎకరంలో.. కేవలం వరిసాగు చేస్తే సగటున రూ.20 వేల ఖర్చుతో.. రూ.48 వేల వరకు ఆదాయం వస్తుంది. అదే వరితోపాటు చేపలు కూడా వేస్తే సగటున రూ. 60 వేల ఖర్చుతో.. రూ.80 వేల నుంచి రూ.1.7 లక్షల వరకు ఆదాయం వస్తుంది. దిగుబడి.. చేపలు.. రెండూ పెరుగుతాయి ►చేపలు తినగా మిగిలే ఆహారం, చేపల విసర్జితాలు వంటివి వరికి ఎరువుగా ఉపయోగపడతాయి. పంట దిగుబడి 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. రసాయన ఎరువుల అవసరం కూడా తగ్గిపోతుంది. ►పురుగులు, ఇతర కీటకాలు, నాచు వంటివాటిని చేపలు తినేయడం వల్ల వరి దెబ్బతినకుండా ఉంటుంది. పైగా చేపలు బాగా ఎదుగుతాయి. ►చేన్లలో లోతుగా తవ్వి నీళ్లు నింపడం వల్ల ఎలుకల బెడద కూడా తగ్గిపోతుంది. ►వరి చేన్లలో చేపల పెంపకానికి మరీ ఎక్కువ ఖర్చుగానీ, శ్రమగానీ అవసరం ఉండదు. పైగా రెండు విధాలా ఆదాయం పొందవచ్చు. ►వరి కోతలు పూర్తయిన తర్వాత కూడా చేపల పెంపకాన్ని ఏడాది పొడవునా కొనసాగించవచ్చు. ►ఇండోనేషియాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. కేవలం వరిసాగుతో పోలిస్తే, ‘వరి–చేపలు’ కలిపి వేయడం వల్ల ఆదాయం కనీసం 30శాతం ఎక్కువ. చైనాలో ఈ ఇబ్బందులను అధిగమిస్తే.. ►వరి చేన్లలో చేపల పెంపకానికి నిరంతరాయంగా తగిన స్థాయిలో నీటి సరఫరా ఉండాలి. ►మొదటిసారి చేపలు వేసినప్పుడు మడుల్లో చుట్టూ తవ్వి గుంతలు చేయడం, గట్లను బలోపేతం చేయడానికి పెట్టుబడి, శ్రమ అవసరం ఉంటాయి. ►చేప పిల్లలు వేయడానికి, వాటికి ఆహారానికి కాస్త పెట్టుబడి అవసరం. ►నిరంతరం నీటి తడి ఉన్నా తట్టుకునే రకాల వరినే వేయాల్సి ఉంటుంది. ►కొన్నిరకాల నేలల్లో నీరు సరిగా నిలవదు. మరికొన్ని చేపల పెంపకానికి అనువు కాదు. అందువల్ల నిపుణులతో పరిశీలన చేయించాలి. ►వరదలు వచ్చే అవకాశమున్న చోట్ల చేపలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. పర్యావరణానికీ లాభమే.. వరి చేన్లలో చేపల పెంపకం వల్ల రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. సాగుభూములు ఏవైనా కొంతకాలానికి సారం కోల్పోతాయి. అదే ‘వరి–చేపల పంట’ వల్ల.. నేల సారం కోల్పోకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వరిసాగు వల్ల పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు వెలువడుతోందని.. వియత్నాంలో... ఇది భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడానికి (గ్లోబల్ వార్మింగ్‌కు) కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వరి చేన్లలో చేపల పెంపకం వల్ల మిథేన్ విడుదల 35శాతం వరకు తగ్గినట్టు తమ ప్రయోగాల్లో గుర్తించామని ఇటీవలే ప్రకటించారు. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా వరి మడుల్లో చేపలతోపాటు రొయ్యలు కూడా పెంచుతున్నారు. -
లాభాల పండుగప్ప
భీమవరం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో పండుగప్ప చేప సాగు విస్తరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో సాగు అంతంతమాత్రంగా ఉండగా గతనెల నుంచి చేప ధరలు పెరగడంతో ఆక్వా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని భీమవరం, మొగల్తూరు, నరసాపురం, కాళ్ల మండలాల్లో సముద్రం, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో పండుగప్పను సాగుచేస్తున్నారు. ఈ చేప సప్ప, ఉప్పు నీటిలోనూ పెరుగుతుంది. ఇటీవల పండుగప్పకు డిమాండ్ పెరగడంతో సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ధర ఆశాజనకం ప్రస్తుతం పండుగప్ప చేపల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కిలో నుంచి రెండు కిలోలలోపు ఉన్న చేప రూ.320, రెండు నుంచి ఐదు కిలోలలోపు ఉంటే రూ.380, ఐదు నుంచి ఏడు కిలోలలోపు ఉంటే రూ.420, ఏడు కిలోలలు దాటితే రూ.480 చొప్పున ధర పలుకుతోంది. జిల్లాలో పండిన చేపలను హౌరా, ముంబై, గోవా, కోల్‌కతా, బిహార్ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉన్న ఎకరా చెరువులో 500 నుంచి 700 వరకు పిల్లలు వదులుతున్నామని, వీటికి ఆహారంగా చైనా గొరకలు, చిన్న చేపలను వేస్తుంటామని రైతులు అంటున్నారు. బతుకున్న చేపలను మాత్రమే వేటాడటం పండుగప్ప ప్రత్యేకత. చెరువులో ఏడాది పాటు పెంచితే పది కిలోల వరకు బరువు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న, సన్నకారు రైతుల మొగ్గు వనామీ పెంపకంలో వైట్ స్పాట్, విబ్రియో, వైరస్ వల్ల నష్టాలను చవిచూస్తున్న రైతులకు పండుగొప్ప పెంపకం వరంలా మారింది. ఎకరా, రెండెకరాల్లో వనామీ సాగు చేసిన ఆక్వా రైతులు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పండుగప్పను సాగుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడులు పోను రాబడి బాగుంటుందని అంటున్నారు. ఆహారంగా చైనా గొరకలు పండుచేప బతుకున్న చేపలను మాత్రమే ఆహారం తింటుంది. దీంతో రైతులు స్థానిక చేపల చెరువుల్లో బెత్తులు, చైనా గొరకలు వంటి చిన్నపాటి చేపలను ఆహారంగా వేస్తున్నారు. కొంతకాలంగా మేత కొరత రావడంతో కొల్లేరు, మచిలీపట్నం, కైకలూరు ప్రాంతాల నుంచి లారీలపై డ్రమ్ముల్లో ఆక్సిజన్ సాయంతో చైనా గొరకలు, చిన్న చేపలను తీసుకువచ్చి పండుగప్ప చెరువుల్లో వేస్తున్నారు. లాభసాటిగా ఉంది నాకు రెండు మీటర్ల లోతు కలిగిన ఎకరా ఉంది. దానిలో 600 పండుగప్ప చేప పిల్లలు వదిలాను. ఏడాది పాటు చైనా గొరకలు, చిన్న చేపలను రోజుకు 60 కిలోల వరకు మేతగా వేశాను. రూ.3 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. పట్టుబడి అనంతరం ఖర్చులు పోగా మిగిలిన దాంతో అప్పులు తీర్చాను. –దాసరి నారాయణరావు, రైతు, లోసరి మేత కోసం ఇబ్బందులు తీర ప్రాంతాల్లో పండు చేప సాగు చేస్తున్నారు. ఈ చేపలకు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్ బాగుంది. వీటికి ఆహారంగా వేసే చైనా గొరకల ధరలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.25కు కొని వీటికి మేతగా వేస్తున్నాం. మేత కోసం ఇబ్బందులు తప్పడం లేదు. – గంధం రమేష్, రైతు, లోసరి ఏడాదికి 5 వేల టన్నుల వరకు ఎగుమతి పండుగప్ప చేప శాస్త్రీయ నామం లేటస్ కాల్‌కేర్‌ఫర్. ఇది ఉప్పు, సప్ప నీటిలో పెరుగుతుంది. దీనిలో ప్రోటీన్లు, కార్పొహైడ్రేట్లు ఉండటంతో డిమాండ్ బాగుంది. ఏడాదికి జిల్లావ్యాప్తంగా 4 వేల నుంచి 5 వేల టన్నుల పండుగప్ప చేపలు ఎగుమతి అవుతున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, మత్స్య అభివృద్ధి అధికారి, భీమవరం -
మురిపిస్తున్న 'కరిమీన్'
సాక్షి, అమరావతి: కేరళ ‘కరిమీన్’ చేప ఆంధ్ర తీరప్రాంత మత్స్యకారులను మురిపిస్తోంది. సాగుయోగ్యం కాని తీరప్రాంత భూముల్లో సిరులు కురిపించే ఈ చేపల సాగును మన రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో చేపట్టిన ఈ సాగు సత్ఫలితాలివ్వడంతో గోదావరి జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటి సాగుకు అవసరమైన సాంకేతికతను సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) అందిస్తోంది. కేరళ రాష్ట్ర అధికారిక చేప పెరల్స్ పాట్.. (శాస్త్రీయ నామం–ఎట్రోప్లస్ సురాటెన్సిస్). ఒళ్లంతా ముత్యాల్లా తెల్లటి మచ్చలుండడంవల్ల దీన్ని ముత్యాల మచ్చగా పేరొందింది. కేరళ రాష్ట్ర అధికారిక చేపగా ప్రసిద్ధి చెందిన ఈ చేపను అక్కడ ‘కరిమీన్’గా పిలుస్తారు. మన వాడుక భాషలో ఈ చేపను ప్రాంతాన్ని బట్టి మురి మీను/చుక్కగొరక/దువ్వెన చేపని పిలుస్తుంటారు. మన ప్రాంతంలో పెద్దగా డిమాండ్‌లేని ఈ చేపకు కేరళలో మాత్రం మంచి మార్కెట్ ఉంది. అక్కడ స్టార్‌హోటళ్లు, రెస్టారెంట్ మెనూల్లో స్పెషల్ డిష్ ఇదే. స్థానికులే కాదు..అక్కడకొచ్చే విదేశీయులు ఈ చేపతో చేసే కరిమీన్ ఫ్రై, కరిమీన్ మోలీ, కరిమీన్ పొల్లిచాతు వంటకాలను అమితంగా ఇష్టపడతారు. ఈ చేపల సాగుకు సీజన్ అంటూ ఏమీలేదు. ఇది ప్రాథమికంగా ఉప్పునీటి చేప. కానీ, మంచినీరు, సముద్రపు నీటిలో జీవిస్తుంది. లోతు జలాల్లో దొరికే ఆల్గే మొక్కలు, కీటకాలను ఆహారంగా తీసుకునే ఈ చేప గరిష్టంగా 20 సెం.మీ వరకు పెరుగుతుంది. 150 గ్రాముల సైజు పెరిగితే చాలు కిలో రూ.325 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.600 వరకు కూడా విక్రయిస్తారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన కృష్ణాజిల్లా పెద్దపాలెంలో గిరిజన మత్స్యకారులు పట్టిన చేపలు ‘కృష్ణా’లో ప్రయోగం విజయవంతం ఐసీఎఆర్–సీఎంఎఫ్ఆర్ఐ విశాఖ ప్రాంతీయ కేంద్రం సహకారంతో ఎలెర్ట్ ఎన్జీఓ అనే సంస్థ కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెద్దపాలెంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మురిమీను సాగు అద్భుత ఫలితాలిచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన యానాదులతో ఏర్పాటుచేసిన గ్రూపులకు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చి చేపల సాగుకు శ్రీకారం చుట్టారు. 20 గ్రాముల పరిమాణం కలిగిన 5వేల చేప పిల్లలను అందించారు. పది నెలలపాటు సాగుచేయగా, ఒక్కో చేప సగటున 120 గ్రాముల పరిమాణంలో 510 కిలోల చేపలను శుక్రవారం పట్టుబడి చేశారు. కిలో రూ.225ల చొప్పున విక్రయించగా రూ.1.14లక్షల ఆదాయం ఆర్జించారు. పెట్టుబడి పోనూ రూ.60 వేలకు పైగా మిగలడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఈ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. నిరుపయోగంగా ఉన్న తీరప్రాంత భూముల్లో వీటి సాగును ప్రోత్సహించవచ్చు. చేపల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. మనుగడ మాత్రం 83 శాతానికి పైగా ఉంటుంది. సీడ్ క్రీక్ వాటర్‌లో విరివిగా దొరుకుతుంది. కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా ఈ చేపల సాగుకు అనుకూలం. విత్తన సాంకేతిక సీఐబీఏ–చెన్నై, సీఎంఎఫ్ఆర్ఐ, కొచ్చిన్ వద్ద ఉంది. – డాక్టర్ శుభదీప్ ఘోష్, హెడ్, ఐసీఏఆర్–సీఎంఎఫ్ఆర్ఐ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం -
మత్స్య సాగుబడులతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆక్వా రంగం బలోపేతానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. పెట్టుబడి తగ్గిపోయి దిగుబడి, నాణ్యత పెరుగుతోంది. పొలం బడి, ఉద్యానబడి తరహాలో నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యంగా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహణ ద్వారా ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన యాంటి బయోటిక్స్ వాడకం అనూహ్యంగా తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు పెరుగుతున్నాయి. మూడేళ్లలో 12.76 శాతం వృద్ధి రేటు తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన లక్ష్మీపతి రాజు చెరువు వద్ద అవగాహన కల్పిస్తున్న మత్స్య శాఖాధికారులు ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. ఏపీలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం వాటా మన రాష్ట్రానిదే. 2018– 19లో 39.92 లక్షల మత్స్య టన్నులున్న దిగుబడులు 2020–21 నాటికి 46.20 లక్షల టన్నులకు (16 శాతం వృద్ధి) చేరాయి. 2018–19లో వార్షిక వృద్ధి రేటు 7.69 శాతం కాగా 2019–20లో 11 శాతంగా నమోదైంది. 2020–21 నాటికి 12.76 శాతానికి పెరిగింది. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన లక్ష్మీపతి రాజు చెరువు వద్ద అవగాహన కల్పిస్తున్న మత్స్య శాఖాధికారులు 2018–19లో ఆక్వా ఎగుమతుల్లో 86 శాతానికిపైగా మితిమీరిన యాంటి బయోటిక్స్ ఉండటంతో అమెరికా, చైనా సహా ఐరోపా, మధ్య ఆసియా దేశాలు వెనక్కి పంపాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా యాంటి బయోటిక్స్ శాతం 37.5 శాతానికి తగ్గింది. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్ చట్టాలని ప్రవేశపెట్టి రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లతో పాటు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తెచ్చారు. సర్వే నెంబర్ల వారీగా రైతులు సాగు చేస్తున్న మత్స్య ఉత్పత్తులను ఈ –క్రాప్ ద్వారా గుర్తించి నాణ్యమైన ఆక్వా దిగుబడుల కోసం మత్స్య సాగుబడులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్స్య సాగుబడులు ఇలా.. మూస పద్ధతి సాగు విధానాలకు తెరదించి యాంటి బయోటిక్స్ వాడకుండా నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల కోసం నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోంది. మత్స్యసాగుబడుల ద్వారా మెరైన్/ఇన్‌ల్యాండ్ మత్స్యకారులు, ఆక్వా రైతులకు సాగులో మెళకువలు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. ఒకవైపు ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తూనే క్షేత్ర స్థాయిలో ఆర్బీకేల ద్వారా ఆక్వా, ఇన్‌ల్యాండ్, మెరైన్ సెక్టార్లలో మత్స్యసాగుబడుల ద్వారా అంశాలవారీగా శిక్షణ ఇస్తున్నారు. యాంటి బయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించేలా పంటకాలంలో కనీసం ఐదుసార్లు వాటర్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులను సమీప ఆర్బీకేలకు ట్యాగ్ చేస్తున్నారు. చెరువులను జియోట్యాగ్ చేస్తున్నారు. ప్రతీ విషయాన్ని ఈ–మత్స్యకార పోర్టల్‌లో అనుసంధానం చేస్తున్నారు. హెక్టార్‌కు 4 టన్నులు నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్, మత్స్యసాగుబడుల్లో సూచించిన సాగు విధానాలను పాటించా. పంట కాలంలో దశలవారీగా నీటి నమూనాలను సేకరిస్తూ వ్యా«ధుల నిర్ధారణ, ఫీడ్ నిర్వహణ పాటించా. నిషేధిత యాంటి బయోటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశా. సిఫార్సు చేసిన ప్రొ బయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు కాగా ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపే వ్యయం అవుతోంది. గతంలో హెక్టార్‌కు 3–3.2 టన్నుల దిగుబడి రాగా ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2–3 లక్షలు అదనపు ఆదాయం లభించింది. – పి.లక్ష్మిపతిరాజు, కరప, తూర్పుగోదావరి జిల్లా సత్ఫలితాలనిస్తున్న మత్స్యసాగుబడులు నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా మత్స్యసాగుబడులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ప్రతీ రైతును భాగస్వామిగా చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందిస్తున్నాం. శాస్త్రవేత్తలతో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ సలహాలు అందిస్తున్నాం. నిషేధిత యాంటి బయోటిక్స్ వినియోగం 10 శాతానికి తగ్గినట్లు గుర్తించాం. పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగాయి. – కె.కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్ -
మూడు ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం ఉపయోగించే బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) నాణ్యతను కాపాడేందుకు, వాటినుంచి ఎలాంటి రోగాలు లేని సీడ్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రాన్ని రూ.36.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనుంది. ఇలాంటి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం. మరోవైపు పండుగప్ప పిల్లల ఉత్పత్తికి రూ.23.78 కోట్లతో హేచరీ, పసుపు పీత పిల్లల ఉత్పత్తి కోసం రూ.14.20 కోట్లతో మరో హేచరీ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు 2023 మార్చి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ (ఏక్యూఎఫ్‌సీ) ఏర్పాటు కాబోతుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎపిడ్యూజిస్ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు సంక్రమించని బ్రూడర్స్ నుంచి మాత్రమే సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. వాటికి వ్యాధులు లేవని నిర్ధారించే పరీక్షలు నిర్వహించే కేంద్రమే ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్. ప్రస్తుతం దేశంలో చెన్నైలో మాత్రమే ఈ కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే 560 హేచరీలుండగా.. వాటిలో 389 హేచరీలు ఏపీలోనే ఉన్నాయి. సీడ్ ఉత్పత్తి కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్రూడర్స్‌ను క్వారంటైన్ చేసేందుకు హేచరీలన్నీ చెన్నై కేంద్రం వద్ద నెలల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంగారమ్మ పేట వద్ద 30 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి 1.25 లక్షల బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ కేంద్రంలో 625 బ్రూడర్స్‌ను క్వారంటైన్ చేయ్యొచ్చు. పరసావారిపాలెం వద్ద రెండు హేచరీలు ఏపీలో ప్రస్తుతం 12వేల హెక్టార్లలో సాగవుతున్న పండుగప్ప (సీబాస్), పసుపు పీత (మడ్ క్రాబ్) సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి సీడ్ కోసం మన రైతులు తమిళనాడుపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిíస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపు పీతల హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది. ఆక్వారంగ విస్తరణకు ఊతం బ్రూడర్స్ సకాలంలో క్వారంటైన్ కాకపోవడంతో సీజన్లో డిమాండ్‌కు తగిన స్థాయిలో రొయ్యల సీడ్‌ను హేచరీలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోతున్న ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఆక్వారంగ విస్తరణకు దోహదపడుతుంది. – ఐపీఆర్ మోహన్‌రాజు, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య ప్రతిష్టాత్మక ప్రాజెక్టులివి ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీలో ఆక్వా రంగ సుస్థిరతకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయి. అక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ చాలా కీలకమైనది. దేశంలో మరెక్కడా ఈ సెంటర్ లేదు. పసుపు పీత, పండుగప్ప హేచరీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఆక్వారంగం మరింత విస్తరిస్తుంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
రిపబ్లిక్ చిత్రంపై కొల్లేరు ప్రజల ఆగ్రహం
ఏలూరు రూరల్/కైకలూరు: ‘రిపబ్లిక్’ చిత్ర ప్రదర్శనపై పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను కించపరిచేలా సినిమాను చిత్రీకరించిన దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ రాహుల్దేవ్శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. వడ్డి కుల సంక్షేమ సంఘం నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరు ప్రజలు విషపూరిత రసాయనాలతో చేపల సాగు చేస్తున్నట్లుగా సినిమాలో చూపించడం దారుణమన్నారు. దీనివల్ల చేపల సాగుపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అసత్యాలతో సినిమా తీయడం దారుణమని రాష్ట్ర వడ్డి కుల కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి సంతోషి అన్నారు. వెంటనే తమ ప్రాంతం గురించి చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలిగించాలని రాజన్న కొల్లేరు సంఘం చైర్మన్ మండల కొండలరావు డిమాండ్ చేశారు. చిత్ర ప్రదర్శన నిలిపివేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లెం ప్రసాద్ హెచ్చరించారు. సినిమా అనేది ప్రజల జీవన స్థితిగతులు పెంచేలా ఉండాలని ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు సూచించారు. కొల్లేరు ప్రజలను కించపరిచేలా సినిమాలు తీస్తే గట్టిగా బుద్ధి చెబుతామని కలకుర్రు, ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు సర్పంచ్‌లు ఘంటసాల నాగప్రసాద్, ఘంటసాల మహలక్ష్మీరాజు, ముంగర తిమోతి, ప్రసాద్ తదితరులు హెచ్చరించారు. కైకలూరు, కొల్లేటి కోటలో కూడా ఆందోళన చేపట్టారు. రిపబ్లిక్ సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ థియేటర్ వద్ద హైవేపై నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, తహసీల్దారు సాయి కృష్ణకుమారికి కొల్లేరు సంఘ జిల్లా అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో వినతి పత్రాలిచ్చారు. నిరసనల్లో నాయకులు జయమంగళ కాసులు, మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
ముక్కుడు పారతో మంచి ఆదాయం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ముక్కుడు పార(ఇండియన్ పాంపనో) చేపలు సిరులు కురిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్లలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దీనికి మంచి డిమాండ్ వచ్చింది. వైరస్లు, తెగుళ్లు దరిచేరని ఈ సముద్రపు చేపల సాగు ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. వీటిలో అంతర పంటగా రొయ్యలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు. ఇండియన్ పాంపనో.. శాస్త్రీయ నామం ట్రాచినోటుస్మూకలీ.. వాడుక భాషలో ‘ముక్కుడు పార’గా పిలుస్తారు. ఈ చేపలో ప్రొటీన్స్, వైట్‌మీట్ అధికంగా ఉంటుంది. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ)లో 2016లో అభివృద్ధి చేసిన ‘ఇండియన్ పాంపనో’.. సంప్రదాయ చేపలు, రొయ్యలకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ప్రస్తుతం పలుచోట్ల తీరప్రాంత లోతు జలాల్లో వీటిని సాగు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా కృష్ణా, తూ.గోదావరిలో.. సీఎంఎఫ్ఆర్ఐ ద్వారా కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భవదేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా కొమరిగిరిపట్నంలో ప్రయోగాత్మకంగా 6 ఎకరాల్లో సాగు మొదలుపెట్టగా.. ప్రస్తుతం అక్కడి పరిసర గ్రామాల్లో మరో 50 ఎకరాల్లో రైతులు ఈ చేపలను పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. 2 నుంచి 10 గ్రాముల సైజులో ఉన్న చేప పిల్లలను ఎకరాకు 4 వేల నుంచి 4,500 వరకు వేసుకోవచ్చు. ఇవి 7 నెలలకు 900 గ్రాముల నుంచి కేజీ వరకు పెరుగుతాయి. రోజుకు 4 సార్లు మేత వేస్తే సరిపోతుంది. ఈ చేప.. ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతుంది. 600 గ్రాముల నుంచి పట్టుబడి మొదలు పెడతారు. కిలో సైజుండే చేపకు మార్కెట్లో రూ.300 నుంచి రూ.330 వరకు ధర పలుకుతోంది. అంతరపంటగా రొయ్యలు.. ఇండియన్ పాంపనోతో పాటు అంతర పంటగా రొయ్యలు సాగు చేస్తున్నారు. కిలో సైజులో ఉండే పాంపనో ఎకరాకు 4 టన్నులు వస్తుండగా, అంతర పంటగా వేసే రొయ్యలు 18–20 కౌంట్‌లో టన్ను వరకు దిగుబడి వస్తున్నాయి. పెట్టుబడి హెక్టార్‌కు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు అవుతుండగా.. రొయ్యలతో కలిపి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం వస్తోంది. పెట్టుబడి పోనూ హెక్టార్‌కు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. కేరళ, బెంగాల్లో వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అవసరమైన సహకారమిస్తాం.. ఇండియన్ పాంపనో సాగును మరింత విస్తరించాల్సిన అవసరముంది. మంచి పోషక విలువలున్న ఈ చేపల సాగు పట్ల ఏపీలో ఇప్పుడిప్పుడే రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాంకేతికంగా అవసరమైన సహకారం అందించేందుకు సీఎంఎఫ్ఆర్ఐ సిద్ధంగా ఉంది. – డాక్టర్ సుభదీప్ఘోష్, విశాఖ రీజనల్ హెడ్, సీఎంఎఫ్ఆర్ఐ హేచరీలను ప్రోత్సహించాలి.. రొటేషన్ పద్ధతిలో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ పాంపనోను పెంచవచ్చు. అపారమైన సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ఇండియన్ పాంపనో సాగుకు విస్తారమైన అవకాశాలున్నాయి. అవసరమైన సీడ్ ఉత్పత్తి కోసం హేచరీలను ప్రోత్సహించాల్సిన అవసరముంది. – డాక్టర్ శేఖర్ మేఘరాజన్, సీనియర్ శాస్త్రవేత్త, సీఎంఎఫ్ఆర్ఐ రూ.8 లక్షల ఆదాయం వచ్చింది ఎకరాకు 6 వేల పిల్లలు వేశాను. ఐదు టన్నుల వరకు వచ్చింది. వీటిని కేరళకు ఎగుమతి చేశా. కిలోకి రూ.330 వరకు ఆదాయం వచ్చింది. అంతర పంటగా 10 వేల రొయ్య పిల్లలు వేశాను. 20 కౌంట్‌లో టన్ను వచ్చింది. మొత్తమ్మీద పెట్టుబడి పోగా రూ.8 లక్షలు మిగిలింది. – ఉప్పలపాటి కృష్ణప్రసాద్, రైతు, కొమరిగిరిపట్నం -
ఆశాజనకంగా వరి – చేపల మిశ్రమ సాగు!
వరి సాగు చేసే ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు, అభ్యుదయ రైతులతో వరి తోపాటు చేపలను కలిపి సాగు చేయిస్తే వారికి ఆదాయం పెరగడంతోపాటు భూతాపోన్నతి తగ్గి పర్యావరణానికీ మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వరి బియ్యంతోపాటు చేపలు కూడా అందుబాటులోకి రావడం వల్ల పేద రైతు కుటుంబాలకు పౌష్టికాహారం అందుతుంది. నీటిని నిల్వగట్టే వరి చేలల్లో చేపలు, పీతలు, రొయ్యలతోపాటు బాతులను సైతం పెంచుతూ సమీకృత వ్యవసాయం చేయింవచ్చు. నీటిని నిల్వ గట్టే పద్ధతిలో వరి సాగు చేయటం వల్ల భూగోళాన్ని వేడెక్కించే మిథేన్ వాయువు వెలువడుతోంది. వాతావరణంలోకి చేరుతున్న మిథేన్‌లో 10–20 శాతం వరి పొలాల వల్లనే. కార్బన్ డయాక్సయిడ్ కన్నా మిథేన్ 25 రెట్లు ఎక్కువగా భూతాపోన్నతికి కారణభూతమవుతోంది. వట్టిగా వరి సాగు చేసినప్పటి కన్నా.. వరి–చేపల సాగులో 34.6 శాతం మిథేన్ వాయువు వెలువడినట్లు ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గింది. ఆ మేరకు ఉత్పాదకాలపై ఖర్చూ తగ్గింది. భూసారం పెరుగుతుంది. వరి–చేపల మిశ్రమ సాగు వల్ల ధాన్యం దిగుబడి10–26% పెరిగింది. కూలీల అవసరం 19–22 శాతం మేరకు తగ్గింది. ఇతర ఉత్పాదకాలు 7% మేరకు తగ్గాయి. చేపల పెంపకం వల్ల ఆదాయమూ పెరిగింది. ఇండోనేషియాలో వరి–చేపల మిశ్రమ సాగు చేసిన రైతుల నికరాదాయం 27 శాతం పెరిగింది. వరి–చేపల మిశ్రమ సాగుకు వరి పొలాలన్నీ పనికిరావు. మన దేశంలో వరి సాగవుతున్న 4.35 కోట్ల హెక్టార్లలో లోతట్టు, మధ్యస్థ వర్షాధార సాగు భూములతో కూడిన 2 కోట్ల హెక్టార్లు (ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో) ఈ సాగుకు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ మిశ్రమ సాగు కొత్తదేమీ కాదు. అక్కడా ఇక్కడా పూర్వకాలం నుంచీ 2.3 లక్షల హెక్టార్లలో రైతులు అనుసరిస్తున్నదే. అధిక దిగుబడి వరి వంగడాలకు రసాయనిక పురుగుమందులు విధిగా వాడాల్సి ఉండటం వల్లనే రైతులు వరి–చేపల మిశ్రమ సాగును ఎక్కువగా చేపట్టలేకపోతున్నారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో దేశీ వరి రకాలను వాడే రైతులకు, కూలీలపై ఆధారపడకుండా చిన్న కమతాల్లో వ్యవసాయ పనులన్నిటినీ ఇంటిల్లపాదీ కలిసి చేసుకునే సంస్కృతి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు వరి–చేపల మిశ్రమ సాగు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, వరి–చేపల మిశ్రమ సాగు నిర్లక్ష్యానికి గురైంది. దీనిపై పరిశోధకులు దృష్టి పెట్టడం లేదు. వరి దిగుబడి కూడా పెంచుకోవడానికి వీలున్న ఈ దివ్యమైన సాగు పద్ధతిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఏయే నేలలకు ఏయే రకాల చేపలను వరితో కలిపి సాగు చేయింవచ్చో స్థానికంగా పరిశోధనలు చేయించాలి. ఈ పద్ధతిలోకి మారాలంటే రైతులు తమ పొలాలను అందుకు తగినట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇంజినీరింగ్ నిపుణుల సహాయంతోపాటు పెట్టుబడి కూడా అవసరమవుతుంది. ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాలను ప్రవేశపెట్టి వరి–చేపల సాగుకు చేదోడుగా ఉంటే చిన్న రైతులకు ఆదాయం పెరిగే వీలుందన్నది నిపుణుల మాట. -
రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..
రెండున్నర ఎకరాల చేపల చెరువులో సాగు చేసే చేపలను కేవలం 484 (22 “ 22) చదరపు అడుగుల పంజరాల(కేజ్‌ల)లో సాగు చేయడం ద్వారా.. నెల నెలా రూ. 25,750ల చొప్పున ఏడాదికి రూ. 3.09 లక్షల ఆదాయం పొందే ఇంటెన్సివ్ కేజ్ కల్చర్ పద్ధతిని కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించింది. పెరట్లో తక్కువ స్థలంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పునర్వినియోగించే ఆక్వా సాగు పద్ధతి కావడంతో రోజుకు కేవలం వెయ్యి లీటర్ల నీరు మాత్రమే అవసరం అవుతుంది. 484 చదరపు అడుగుల పంజరాలలో చేపలు పెంచుతారు. అయితే, నీటి శుద్ధి పరికరాలకు, షేడ్‌నెట్ వేసుకోవడానికి మొత్తం 200 చదరపు మీటర్ల విస్తీర్ణం చోటు అవసరమవుతుంది. రైతులకు నెల నెలా చెప్పుకోదగిన ఆదాయం పొందే ఈ పద్ధతి ద్వారా నీటి వనరులకు తీవ్ర కొరత ఉండే జిల్లాల్లో కూడా యువతను ఆక్వా సాగులోకి ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.), జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.) ఆవరణలో ఈ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. రైతులు, యువత స్వయంగా వెళ్లి చూసి అవగాహన కలిగించుకోవచ్చు. యూనిట్ వెల రూ. 5.6 లక్షలు 22 “ 22 చదరపు అడుగుల్లో ఒక రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి రూ. 5.6 లక్షలు ఖర్చవుతుంది. జనరల్, ఒబిసి అభ్యర్థులకు 40%, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యుర్థులకు 60% మేరకు ఎన్.ఎఫ్.డి.బి. సబ్సిడీ ఇస్తుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు రుణం పొందవచ్చు. పక్కపక్కనే మూడు కేజ్‌లను (ఈ మూడూ కలిపి 22 “ 22 చదరపు అడుగులే) ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేజ్‌లో 45 రోజుల తేడాతో చేప పిల్లలను వదులుకుంటే.. 3 నెలల తర్వాత నుంచి ఏడాది పొడవునా దశల వారీగా చేపల దిగుబడి వస్తుందని, తద్వారా రైతుకు ప్రతి నెలా ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు వెయ్యి లీటర్ల నీరు చాలు.. మొదట్లో 90 వేల లీటర్ల నీరు నింపుతారు. గిఫ్ట్ తిలాపియా, జెల్ల (పంగాసియస్), కొర్రమేను (ముర్రెల్), కషిమీర (పెర్ల్ స్పాట్) వంటి చేప పిల్లలను వదులుతారు. రెండు వేల నుంచి మూడు వేల చేప పిల్లలను వదులుతారు. అనుదినం నీటిని శుద్ధి చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. కాబట్టి రోజుకు 800–1,000 లీటర్ల మడ్డి నీటిని బయటకు తోడేసి, ఆ మేరకు మంచి నీటిని నింపాల్సి ఉంటుంది. ఈ మడ్డి నీరు పోషకాలతో కూడి ఉంటుంది. రోజూ చేపల వయసును బట్టి నీటిపై తేలాడే బలపాల (పెల్లెట్స్) మేత వేస్తారు. మేత అవశేషాలు, చేపల విసర్జితాలు కలిసిన ఈ నీటిలో నత్రజని వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక జలాన్ని కూరగాయలు, ఇతర పంటలకు పారగట్టవచ్చు. ఇలా పెరిగే చేప పిల్లలు మూడు నెలల్లో మంచి సైజుకు పెరుగుతాయి. నీరు ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి జబ్బుల సమస్య ఉండదు. ప్రతి మూడు నెలలకు 1,620 కిలోల చేపల దిగుబడి వస్తుందని, కిలో రూ. 180 నుంచి 200 వరకు గిట్టుబాటవుతుందని నిపుణుల అంచనా. ప్రతి 3 నెలలకు రూ. లక్షా 40 వేల వరకు మేత, తదితర ఖర్చులు ఉంటాయి. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వారికి మొదటి 3 నెలలకు అవసరమైన పెంపకం ఖర్చు రూ. లక్షా 40 వేలను ఎన్.ఎఫ్.డి.బి. అందిస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి 3 నెలలకు రూ. 2.4 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఏడాదికి 4 పంటలు తీయవచ్చు. అంటే మొత్తం రూ. 7.29 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో రూ. 4.2 ఖర్చులు పోను నికరంగా రైతుకు రూ. 3.09 లక్షల(నెలకు రూ. 25,750 చొప్పున) నికరాదాయం వస్తుందని ఎన్.ఎఫ్.డి.బి., ఎన్.ఐ.ఆర్.డి. నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో రూ. 400 ధర పలికే కాట్ ఫిష్‌ను కూడా పెంచుకోవచ్చు. ఎవర్ని సంప్రదించాలి? తక్కువ స్థలంలో అధిక సాంద్రతలో చేపలను ఉత్పత్తి చేసే ఈ బాక్యార్డ్ రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయదలచుకునే వారు సబ్సిడీ, సాంకేతిక సహాయం కోసం హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (టెక్నికల్) ను 040–24000113 నంబరు లో సంప్రదించవచ్చు. లేదా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.కు చెందిన రూరల్ టెక్నాలజీ పార్క్‌లోని శేఖర్‌ను 98487 80277 నంబరులో సంప్రదించవచ్చు. ఈ రెండు చోట్లా ఈ కేజ్ కల్చర్‌కు సంబంధించిన నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఎవరైనా వెళ్లి చూడవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ జిల్లాలోనైనా ఈ పెరటి చేపల చెరువులను ఏర్పాటు చేసుకోవచ్చని.. అయితే, వీటిపై నీడ కోసం, పక్షుల నుంచి రక్షణ కోసం షేడ్‌నెట్ షెడ్ వేసుకోవడం తప్పనిసరి. అయితే, షేడ్‌నెట్ హౌస్ ఖర్చును రైతులే భరించాల్సి ఉంటుందని రూరల్ టెక్నాలజీ పార్క్ డైరెక్టర్ రమేశ్ శక్తివేల్ ‘సాక్షి’తో చెప్పారు. -
ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...
ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం. పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలలో చేపలు ప్రధానమైనవి. చేపలలో ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధంగా చేపను చెప్పవచ్చు. 2001 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జూలై 9, 10 తేదీల్లో జాతీయ మత్స్య రైతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆక్వా కల్చర్ ఫార్మింగ్ దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన కల్చర్‌గా అభివృద్ధి అవుతున్న తరుణంలో జాతీయస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి 5వేల మంది ప్రతినిధులు,అయిదువేల మంది ప్రజలు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపల పెంపకం సంబంధించిన సాంకేతిక సలహాలు, విశిష్ట ప్రసంగాలతోపాటు, 30కిపైగా రకాలు చేపల ప్రదర్శన, నోరూరించే చేపల వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ,వ్యవసాయ నిపుణులు యమ్‌వీఎస్ నాగిరెడ్డి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.