Highways
-
గుడ్‌న్యూస్.. 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేదు
ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఉన్న వాహనాలు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం, వసూళ్లు) నిబంధనలు- 2008ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. కొత్త నిబంధనలు మంగళవారం నుండి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం.. జీఎన్ఎస్ఎస్ వాహనాలు 20 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరంపై మాత్రమే ఇప్పుడు రుసుము వసూలు చేస్తారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వాహనాల కోసం ప్రత్యేకమైన లేన్‌ను కేటాయిస్తారు. ఇతర వాహనాలు ఈ లేన్‌లోకి ప్రవేశించినట్లయితే రెండు రెట్ల రుసుమును చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా?ఎంపిక చేసిన జాతీయ రహదారులలో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని ఎన్‌హెచ్-709లోని పానిపట్-హిసార్ సెక్షన్లో జీఎన్ఎస్ఎస్ ఆధారిత వినియోగదారు రుసుము వసూలు వ్యవస్థకు సంబంధించి పైలట్ అధ్యయనం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
‘హిట్ అండ్ రన్’కు అంత కఠిన శిక్ష సబబేనా?
న్యాయ శిక్షాస్మృతుల్లో ఇటీవల కేంద్రం గణనీయమైన మార్పులతో కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(IPC)కి ప్రత్యామ్నాయంగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు ట్రక్ డ్రైవర్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. హిట్ అండ్ రన్లకు మరీ అంత శిక్ష సబబేనా? అనే చర్చ సోషల్ మీడియాలోనూ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ‘హిట్ అండ్ రన్’ గణాంకాలు ఆందోళన కలిగించే అంశమేనని కొందరు గణాంకాలతో చెబుతున్నారు. హిట్ అండ్ రన్.. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఎక్కడైనా పరిమితికి మించిన వేగంతో టూ వీలర్, కార్లు, ట్రక్కులు రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రమాదానికి కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతే అది హిట్ అండ్ రన్ అవుతుంది. అలా పరారు కావటాన్ని మన గత చట్టం.. ఇప్పుడు కొత్త చట్టం కూడా నేరపూరిత చర్యగా పేర్కొంటోంది. అయితే.. భారతీయ న్యాయం సంహిత ప్రకారం.. హింట్ అండ్ రన్, ప్రమాదకర డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత చర్యల కిందకు వస్తాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు ఉన్నాయి. మొదటి నిబంధన.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక ప్రాణం పోవడానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైటు శిక్ష ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇక రెండో నిబంధన: రోడు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదంటే స్థానిక మెజిస్ట్రేట్‌కు సమాచారం అందించాలి. అలా ఇవ్వకుండా.. ఘటన స్థలం నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, దాంతో పాటు రూ. 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంత ఆందోళనకరంగా ఉంది కాబట్టే.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తంగా 2022 ఏడాది కాలంలో అధికారంగా 67,387 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రమాదాల్లో 30,486 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 12,250 ప్రమాదాల నమోదయ్యాయి. మహారాష్ట్ర (8768), ఉత్తరప్రదేశ్ (7585), రాజస్థాన్ ( 5618) వంటి పెద్ద రాష్ట్రాల్లో హిట్ అండ్ రన్ ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. హిట్ అండ్ రన్ ప్రమాదాలకు మధ్య భారతం కేంద్ర బిందువుగా ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ (2099), ఆంధ్రప్రదేశ్(1560) హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో లెక్కలు ఉన్నాయి కాబట్టే.. కఠిన శిక్షల అమలును సమర్థిస్తున్నవాళ్లు లేకపోలేదు. అభ్యంతరాలు అందుకే.. భారతీయ శిక్షాస్మృతి (IPC)లో హిట్ అండ్ రన్ కేసులు సెక్షన్ 304 ఏ కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే గరిష్టంగా రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. అయితే మాములు రోడ్డు ప్రమాదాల కంటే హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో విచారణలు పూర్తై శిక్షలు పక్కాగా అమలవుతున్నాయి. 2022లో విచారణ పూర్తిన హిట్ అండ్ రన్ కేసుల రేటు 47.9గా నమోదైంది. అయితే ఇతర రోడ్డు ప్రమాదాల్లో ఈ రేటు కేవలం 21.8 శాతం మాత్రమే నమోదు కావటం గమనార్హం. కానీ, కొత్త చట్టం ప్రకారం హిట్ అండ రన్ కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తుండడంపై ట్రక్కులు, లారీ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారురు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. దీంతో.. ట్రక్కు డ్రైవర్లు తాత్కాలికంగా శాంతించి సమ్మె విరమించారు. -
ప్రమాదాలకు బ్లాక్‘స్పాట్’
సాక్షి, అమరావతి: వాహనాల్లో హైవేలపై రివ్వున దూసుకుపోవడం సరదాగానే ఉంటుంది కానీ, అదే హైవేలపై బ్లాక్స్పాట్లు (ప్రమాదకర ప్రదేశాలు) యమపాశాలుగా మారుతున్నాయి. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు హైవే బ్లాక్ స్పాట్ల వద్ద సంభవిస్తున్నాయి. దేశంలో హైవేలపై ఐదేళ్లలో బ్లాక్ స్పాట్ల వద్ద ఏకంగా 39,944 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 18,476 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం దేశంలో 5,803 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నివేదికలో వెల్లడించింది. బ్లాక్ స్పాట్లను సరిచేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొంది. బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు ప్రాధాన్యం జాతీయ రహదారులపై బ్లాక్స్పాట్ల ప్రమాదాలను నివారించేందుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణను వేగవంతం చేసింది. గుర్తించిన బ్లాక్ స్పాట్లను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన చర్యలు చేపడుతోంది. అందుకోసం పోలీసులు, రవాణా శాఖల సమన్వయంతో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో జాతీయ రహదారుల విస్తరణ, రోడ్లకు మరమ్మతులు, ప్రమాదకర మలుపుల సమీపంలో చెట్ల తొలగింపు, సైన్‌బోర్డుల ఏర్పాటు తదితర చర్యలు వేగవంతం చేస్తోంది. ఆ ప్రమాదాల్లో హైవే పెట్రోలింగ్‌ను కూడా పెంచింది. గత ఐదేళ్లలో దేశంలో మొత్తం 3,972 బ్లాక్ స్పాట్లను సరిచేశారు. బ్లాక్ స్పాట్ అంటే.. భారతీయ రోడ్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా జాతీయ రహదారి 500 మీటర్ల పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జరిగి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానిని బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు. మొదటి స్థానంలో తమిళనాడు బ్లాక్ స్పాట్లు, రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యలో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న 748 బ్లాక్ స్పాట్ల వద్ద 6,230 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 2,144 మంది దుర్మరణం చెందారు. 701 బ్లాక్ స్పాట్లతో రెండోస్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో 3,572 రోడ్డు ప్రమాదాల్లో 1,990 మంది ప్రాణాలు కోల్పోయారు. 551 బ్లాక్ స్పాట్లతో మూడోస్థానంలో ఉన్న కర్ణాటకలో 4,110 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 1,694 మంది మృతి చెందారు. ఆ జాబితాలో తెలంగాణ నాలుగోస్థానంలో, ఆంధ్రప్రదేశ్ ఐదోస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 485 బ్లాక్ స్పాట్లలో సంభవించిన 3,965 రోడ్డు ప్రమాదాల్లో 1,672 మంది దుర్మరణం చెందారు. ఏపీలోని 466 బ్లాక్ స్పాట్లలో 2,202 రోడ్డు ప్రమాదాల్లో 1,273 మంది ప్రాణాలు విడిచారు. -
పైసలు... తీసుకెళ్లాలంటే పరేషాన్!
వీరేందర్ హయత్‌నగర్‌లో కిరాణా స్టోర్ నిర్వహిస్తున్నాడు. దసరా సీజన్ కావడంతో దుకాణంలోకి సరుకులు తెచ్చేందుకు రెండ్రోజుల క్రితం మార్కెట్‌కు బయలుదేరాడు. చింతలకుంట సమీపంలో రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. అతని వెంట ఉన్న రూ.2.30 లక్షల నగదును సీజ్ చేశారు. కిరాణా దుకాణం నిర్వాహకుడినని, సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు చెప్పినా ఫలితం లేక పోయింది. దుకాణంలో రోజువారీ సేల్స్ తాలూకు డబ్బులు కావడంతో సంబంధిత పత్రాలు లేవు.దీంతో నగదును వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. దీనిపై క్షేత్రస్థాయి లో అవగాహన లేకపోవడంతో చాలామంది నగదును తీసుకెళ్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం విధించిన రూ.50 వేల గరిష్ట పరిమితి నిబంధన వల్ల సామాన్యులు పలు సందర్భాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ చిల్లర వర్తకంలో నగదు లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్లోనూ నగదు లావాదేవీలు పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు దుకాణా దారులు చాలాచోట్ల రసీదులు ఇవ్వడం లేదు. హోల్‌సేల్ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుకు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. డిజిటల్ లావాదేవీలు మేలు: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది. చిల్లర వ్యాపారులు పలు అవసరాలకు నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. అంతేగాకుండా సరుకుల కొనుగోలుకు జనాలు సైతం నగదు తీసుకెళ్తుంటారు. ఇవేగాకుండా వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు. వీటికి లిఖిత పూర్వక ఆధారాలేమీ ఉండవు. చేబదులు రూపంలో తీసుకునే మొత్తానికి ఎలాంటి రసీదు ఉండదు. మరోవైపు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు, కాలేజీ ఫీజులు చెల్లించే వాళ్లు తమ వెంట రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా ఇలాంటివే ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో నగదును తీసుకెళాల్సి ఉంటే సరైన ఆధారాలను వెంట ఉంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సమీప బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం మంచిదని అంటున్నారు. -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కు రూ. 1,030 కోట్ల నిధులు!
న్యూఢిల్లీ: క్యూబ్ హైవేస్ ట్రస్ట్ (క్యూబ్ ఇన్విట్) తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) నుంచి రూ. 1,030 కోట్ల మేర నిధులు సమీకరించింది. దీర్ఘకాలిక లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ వివరించింది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో రహదారి అసెట్స్ ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 1,424 కిలోమీటర్ల విస్తీర్ణంలో 18 టోల్, యాన్యుటీ ప్రాజెక్టులు ఉన్నాయి. -
అభివృద్ధికి ‘రోడ్’మ్యాప్‌లు
ఎటైనా వెళ్లాలంటే.. బండి తీశామా, రోడ్డెక్కామా అంతే. వేరే పట్టణానికో, రాష్ట్రానికో వెళ్లాలంటే.. కారులోనో, బస్సులోనో హైవే ఎక్కాల్సిందే. కొన్ని హైవేలు అయితే వందలు, వేల కిలోమీటర్ల మేర సాగుతూనే ఉంటాయి. మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎంత పొడవున రోడ్లు ఉన్నాయో తెలుసా? మన దేశంలో ఉన్న రోడ్ల లెక్క ఏమిటో తెలుసా? దీనిపై తాజాగా ‘విజువల్ క్యాపిటలిస్ట్’సంస్థ ఓ అధ్యయనం చేయించి ‘రోడ్ల’లెక్కలు తేల్చింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మొత్తంగా కోట్ల కిలోమీటర్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద హైవేల నుంచి గ్రామీణ రోడ్ల దాకా.. మొత్తం రహదారుల పొడవు సుమారు 2.1 కోట్ల కిలోమీటర్లపైనే. చంద్రుడికి, భూమికి మధ్య దూరం సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఈ లెక్కన భూమ్మీద రోడ్ల పొడవు.. 35 సార్లు చంద్రుడి వద్దకు వెళ్లి వచ్చినంత అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 200కుపైగా దేశాలు ఉంటే.. మొత్తం రోడ్ల విస్తీర్ణంలో ఒక్క అమెరికాలోనే 14 శాతానికిపైగా ఉండటం గమనార్హం. విజువల్ క్యాపిటలిస్ట్ సంస్థ కోరిన మేరకు పైథాన్ మ్యాప్స్ సంస్థ ఈ అధ్యయనం చేసింది. ‘గ్లోబల్ రోడ్స్ ఇన్వెంటరీ ప్రాజెక్ట్ (జీఆర్‌ఐపీ)’లోని రోడ్ల డేటాను సేకరించి.. వివిధ దేశాలు, ప్రాంతాల వారీగా క్రోడీకరించింది. ఏ దేశంలో.. ఎంత పొడవుతో.. ప్రపంచవ్యాప్తంగా 222 దేశాల్లో కలిపి మొత్తం రోడ్ల విస్తీర్ణం 2,16,00,760 కిలోమీటర్లు. ఇందులో 30 లక్షల కిలోమీటర్లకుపైగా పొడవైన రోడ్లతో యూఎస్ఏ టాప్‌లో నిలిచింది. 17 లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో చైనా, పది లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో భారత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోని మొత్తం రహదారుల విస్తీర్ణంలో కేవలం ఈ మూడు దేశాల్లోనే 25 శాతానికిపైగా ఉండటం గమనార్హం. ఇక ఆండోరా, జీబ్రాల్టర్, వాలిస్ అండ్ ఫ్యుచురా ఐలాండ్స్, లీచెన్‌స్టీన్, పలౌ, అమెరికన్ సమోవా, ఫ్రెంచ్ సదరన్–అంటార్కిటిక్ ఐలాండ్స్, బెర్ముడా, క్రిస్మస్ ఐలాండ్స్, నార్ఫ్లోక్ ఐలాండ్ తదితర దేశాల్లో రోడ్ల విస్తీర్ణం 30 కిలోమీటర్లలోపే కావడం విశేషం. రోడ్ల విస్తీర్ణంలో మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 27వ (1,83,317 కి.మీ), పాకిస్తాన్ 38వ (1,06,183 కి.మీ), శ్రీలంక 43వ (96,023 కి.మీ) స్థానాల్లో ఉన్నాయి. హైవేలలో చైనా.. స్థానిక రోడ్లలో అర్జెంటీనా.. ♦ భారీ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు వంటి వాటిని పరిశీలిస్తే.. ప్రపంచంలో చైనా (6,83,248 కి.మీ) టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో అమెరికా (3,66,800), మెక్సికో (1,05,822), జపాన్ (94,451), కెనడా (91,173), బ్రెజిల్ (86,772), ఫ్రాన్స్ (74,956), ఇండియా (69,748), అర్జెంటినా (69,188), ఆ్రస్టేలియా (69,138) నిలిచాయి. ♦ మధ్య స్థాయి హైవేల పొడవులో.. ప్రపంచంలో అమెరికా (8,98,873 కి.మీ) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా (5,12,386 కి.మీ), ఇండియా (4,13,790 కి.మీ), చైనా (3,06,176 కి.మీ), బ్రెజిల్ (2,23,662 కి.మీ), మెక్సికో (1,81,088కి.మీ), ఫ్రాన్స్ (1,14,433కి.మీ) తదితర దేశాలు నిలిచాయి. ♦ జిల్లా, మండల స్థాయి రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే.. అర్జెంటీనా (534,876 కి.మీ) ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో ఇండియా (526,130 కి.మీ), ఆ్రస్టేలియా (426,346 కి.మీ), చైనా (373,831 కి.మీ), ఇండోనేషియా (334,164 కి.మీ), కొలంబియా (309,725 కి.మీ), బ్రెజిల్ (283,933 కి.మీ) తదితర దేశాలు ఉన్నాయి. ♦ పూర్తిగా స్థానిక, గ్రామీణ స్థాయి రోడ్లు అమెరికా (17,89,534 కి.మీ), చైనా (3,46,742 కి.మీ), జర్మనీ (3,01,853 కి.మీ) ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రోడ్లు ఉంటే ఏమిటి? విజువల్ క్యాపిటలిస్ట్ విశ్లేషణ ప్రకారం.. ఎక్స్‌ప్రెస్ వేలు, భారీ హైవేలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, పట్టణీకరణకు సంకేతాలు. ఎక్కువ ఖర్చు పెట్టగల దేశాలు మాత్రమే వీటిని నిర్మించగలుగుతాయి. ♦ మధ్యస్థాయి హైవేలు అభివృద్ధి చెందుతున్న, పట్టణీకరణ పెరుగుతున్న ప్రాంతాలకు సూచికలు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని నిర్మిస్తున్నాయి. ♦ జిల్లా, మండల, స్థానిక రోడ్లు.. స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తాయి. ♦మొత్తంగా రహదారుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం సుస్థిర అభివృద్ధికి సూచిక అని.. మౌలిక సదుపాయాల వల్ల అభివృద్ధి వేగం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. -
భారతదేశంలో రాబోయే టాప్ 10 ఎక్స్‌ప్రెస్‌వేలు
-
హైవేలపై సీసీ ఫుటేజ్: రాత్రి వేళ కష్టమే.. స్పీడ్ కూడా సమస్యే!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రైతు శ్రీశైలం హైవే సమీపంలోని తన పొలానికి నీళ్లు పెడదామని అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో హైవే మీద వెనక నుంచి 130–140 కి.మీ వేగంతో వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీ కొట్టింది. దూరంగా ఎగిరిపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఢీకొట్టిన వాహనం డ్రైవర్ హైవేలోనే ముందుకు వెళితే సీసీటీవీ కెమెరాలో రికార్డై పోలీసులకు దొరికిపోతానని ఊహించాడు. కడ్తాల్ టోల్గేట్ లైన్లో కాకుండా సర్వీస్ రోడ్డు గుండా పరారయ్యాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే సీసీటీవీ కెమెరా ఉన్నా.. అది పని చేయకపోవటంతో కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. సీసీటీవీ కెమెరాల పరిస్థితికి ఆమన్‌గల్ ఘటన అద్దం పడుతుంది. కేసు దర్యాప్తులో కీలకంగా నిలిచే కెమెరాలు పని చేయకపోవటం, పని చేసినా రాత్రి సమయాల్లో రికార్డయ్యే ఆధునిక కెమెరాలు కాకపోవటంతో హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తులో పోలీసులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాత్రివేళ కష్టమే.. స్పీడ్ కూడా సమస్యే.. హైవేలలో ఉదయం పూట జరిగే రోడ్డు ప్రమాదాలు ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న సీసీటీవీ కెమెరాల్లో బాగానే రికార్డవుతున్నాయి. అయితే రాత్రి పూట జరిగే ప్రమాదాలు మాత్రం సరిగా రికార్డు కావటం లేదు. వాహనాల లైట్ల కాంతి ఎక్కువగా ఉండటం, వీధి లైట్ల వెలుతురూ కెమెరాల మీద పడుతుండటంతో రాత్రివేళ దృశ్యాలు సరిగా రికార్డు కావటం లేదని శంషాబాద్ జోన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే జాతీయ రహదారులలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవటంతో వాహనాలు 100–130 కి.మీ వేగంతో దూసుకెళ్తుంటాయి. అంత స్పీడ్‌లో వెళ్లే వాహనాల నంబర్లను ఏఎన్పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు గుర్తించలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిధుల్లేవు.. నిర్వహణ లేదు.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వ హణ కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక వ్యవస్థా లేదు. అందువల్ల ప్రత్యేకంగా నిధుల కేటాయింపూ లేదు. హైవేలతో పాటు నగరాలు, పట్టణాల్లోని రోడ్లపై వీటిని ఏర్పాటు చేస్తున్న పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు, ఇతర సంఘాలు, సంస్థలు ఇచ్చే నిధులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన కెమెరాలు 10 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో 40% పనిచేయడం లేదని వెల్లడైంది. కెమెరాల ఏర్పాటే కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితుల్లో, ఏర్పాటైన కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. సీసీటీవీ ఫుటేజీలే ప్రధాన ఆధారం.. ప్రధాన నగరాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నాచింగ్‌లు, దాడులు, హత్యోదంతాలు ఇతర త్రా కేసుల్లో నేరస్తులను చాలావరకు.. ఆయా ఘటనలకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల రికార్డింగుల ఆధారంగానే పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయనప్పుడు మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆధునిక కెమెరాలైతేనే బెటర్.. రాష్ట్రంలో ప్రస్తుతం బుల్లెట్, ఏఎన్పీఆర్ కెమెరాలున్నాయి. ఆధునిక ఫీచర్లు తక్కువగా ఉండే ఏఎన్పీఆర్ కెమెరాల్లో 10– 20మీటర్లకు మించి జూమ్ చేయలేం. అదే ఫేస్ రికగ్నిషన్, పాన్ టిల్ట్ జూమ్ (పీటీజెడ్)వంటి ఆధునిక కెమెరాలు అయితే 1కి.మీ. దూరం వరకూ జూమ్ చేయవచ్చు. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటాయి. వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి, నంబరు ప్లేట్లను రీడింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గ్రామాల్లో రీసైక్లింగ్ రోడ్లు.. సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన ఏపీ సర్కారు.. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించే విధంగానూ రీసైక్లింగ్ యూనిట్లను సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది. పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల)లో ప్లాసిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు. గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు. రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా.. ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎస్‌వై (గ్రామీణ సడక్ యోజన) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని సిమెంట్ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్ నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్ధాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు. అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్ ప్రాసెస్ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
హైవే హిప్పోసిస్.. ప్రయాణం మాటున ప్రమాదం!
అప్రయత్నంగా మెదడు విశ్రాంతిలోకి వెళ్లడమే హైవే హిప్పోసిస్.. ప్రొఫెషనల్ డ్రైవర్ల కంటే సాధారణ వ్యక్తులపైనే ఈ ప్రభావం ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తేనే ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చిన నిపుణులు చెబుతున్నారు.. ఏమిటీ హైవే హిప్పోసిస్.. సాక్షి, అమరావతి: నాలుగు లేదా ఆరు వరుసల హైవేలు.. మధ్యలో డివైడర్లు ఉండటంతో ముందునుంచి వాహనాలకు ఆస్కారమేలేదు.. ఎక్కడోగానీ మలుపులు లేకుండా నల్లత్రాచులా రోడ్లు.. మరోవైపు, ఆధునిక ఫీచర్లతో కార్లు.. ఏసీతో చుట్టూ చల్లదనం.. ఆడియో సిస్టం నుంచి మంద్రంగా సంగీతం.. దీంతో వేగంగా దూసుకుపోయే కార్లు.. ఇంకేముంది.. పెద్దగా శ్రమలేకుండానే ప్రయాణించవచ్చని అనుకుంటాం. కానీ, ఈ అత్యంత సౌకర్యవంతమైన డ్రైవింగ్ వెనుక ఓ పెనుముప్పు కూడా పొంచి ఉంది. అదే హైవే హిప్పోసిస్ స్థితి. ఇటీవల జాతీయ రహదారులపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలకు ప్రధాన కారణమిదే. తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ స్థితికి గురికాకుండా ఉండగలమని నిపుణులు సూచిస్తున్నారు. ఏమిటీ హైవే హిప్పోసిస్.. సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనురెప్పలు మూతపడి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. దీనికి హైవే హిప్పోసిస్ కాస్త భిన్నమైంది. పైన చెప్పుకున్నట్లు విశాలమైన హైవేలపై డ్రైవింగ్ సులభంగా మారింది. ఎదురుగా వాహనాలు రావు.. చాలా దూరం వరకు మలుపులు ఉండవు.. దీంతో కొంతదూరం వెళ్లిన తరువాత డ్రైవింగ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే డ్రైవర్ మెదడుకు పెద్దగా పనిఉండదు. ఫలితంగా మెదడు మెల్లగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆటోమేటిక్ వాహనాలైతే గేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి డ్రైవర్ మెదడుకు ఇంకా ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. ఈ స్థితిలో డ్రైవర్ నిద్రపోరు. కళ్లు తెరిచే ఉంటారు. స్టీరింగ్‌పై పట్టు ఉంటుంది. కానీ, పెద్దగా పనిలేకపోవడంతో డ్రైవర్ మెదడు మాత్రం నెమ్మదిగా విశ్రాంతిలోకి జారుకుంటుంది. ఈ స్థితినే హైవే హిప్పోసిస్ అంటారు. సాధారణంగా హైవేపై రెండు నుంచి మూడు గంటలు ప్రయాణం చేసిన తరువాత ఈ స్థితి ఏర్పడవచ్చు. అది కూడా రోజూ సాధారణంగా నిద్రించే సమయంలో ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ స్థితి ఆవహిస్తుంది. అంటే రాత్రి 10గంటల తరువాత నుంచి తెల్లవారుజాము మధ్యగానీ.. మ.2 గంటల నుంచి 4 గంటల మధ్య హైవేపై ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేటప్పుడు హైవే హిప్పోసిస్ స్థితి ఏర్పడుతుంది. ఇది 5–15 నిముషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో డ్రైవర్‌కు వాహనంపై నియంత్రణ ఉండదు. ఎదురుగా ఏదైనా వాహనాన్ని నిలిపి ఉంచితే చివరి నిముషం వరకు గుర్తించలేక ఢీకొడతారు. ఇలాగే ఎక్కువుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అలాగే, హైవేపై మలుపు వస్తే డ్రైవర్లు చివరి క్షణం వరకు గుర్తించలేరు. కారు రోడ్డు నుంచి పక్కకు వెళ్లిగానీ లేదా డివైడర్‌ను ఢీకొట్టి గానీ పల్టీలు కొడుతుంది. హైవేపై ఏదైనా ఫ్లైఓవర్గానీ, బ్రిడ్జ్గానీ వస్తే గుర్తించలేక రెయిలింగ్‌ను ఢీకొడతారు. హైవేపై జంక్షన్ల వద్ద రోడ్డుకు అడ్డంగా ఏదైనా వాహనంగానీ వ్యక్తులుగానీ వచ్చినా సరే గుర్తించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రొఫెషనల్ డ్రైవర్ల కంటే కూడా సాధారణ వ్యక్తులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువుగా ఈ స్థితికి గురవుతారు. 60 శాతం ప్రమాదాలకు ఇదే కారణం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం హైవే హిప్పోసిస్ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో కూడా హైవే హిప్పోసిస్ కారణంగానే 60 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిçÜ్తున్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నివేదిక తెలిపింది. కోల్‌కత–ఢిల్లీ జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదాలపై ఎన్హెచ్ఏఐ చేసిన అధ్యయన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిల్లో 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా 3.84 లక్షల మంది గాయపడ్డారు. తగిన జాగ్రత్తలు పాటిస్తేనే.. హైవే హిప్పోసిస్కు గురికాకుండా ఉండేందుకు డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మన రోజువారి పనితీరుకు అనుగుణంగా మన మెదడు అలవాటు పడి ఉంటుంది. రోజూ సాధారణంగా నిద్రకు అలవాటైన సమయంలో డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలి. తప్పనిసరైతే మాత్రం నిపుణుల సూచనలు పాటించాలి. అవి ఏమిటంటే.. - సాధారణంగా రెండు గంటల డ్రైవింగ్ తరువాత హైవే హిప్పోసిస్ ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి 90 నిమిషాల డ్రైవింగ్ తరువాత డ్రైవర్ బ్రేక్ తీసుకోవాలి. కిందకు దిగి అటూ ఇటూ నడవాలి. ఎవరికైనా ఫోన్ చెయ్యొచ్చు. కాసేపు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడొచ్చు. దాంతో మెదడు మళ్లీ చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. తర్వాత మళ్లీ డ్రైవింగ్ మొదలుపెట్టొచ్చు. - గంటసేపు డ్రైవింగ్ తరువాత డ్రైవర్ తనకు తాను కాస్త అసౌకర్యం కలిగించుకోవాలి. కారులో ఏసీని ఆఫ్ చేయలి. దాంతో చెమటలు పడతాయి. కారు అద్దాలు కిందకు దించితే బయట నుంచి వేగంగా గాలి లోపలకి వచ్చి కాస్త చికాకు పెడుతుంది. దాంతో డ్రైవర్ సుఖవంతమైన స్థితి నుంచి బయటకు వచ్చి అసౌకర్యానికి గురవుతారు. దాంతో మెదడు మళ్లీ చురుగ్గా పనిచేస్తుంది. - డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్, రియర్ మిర్రర్‌ను మాటి మాటికి చూస్తుండాలి. దాంతో కనుగుడ్లు అటూ ఇటూ తిరుగుతుండటంతో మెదడు చురుకుదనం సంతరించుకుంటుంది. - ప్రస్తుతం అధునాతన స్లీప్ మోనిటరింగ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కార్లు, వాహనాల్లో వాటిని ఏర్పాటుచేసుకోవాలి. స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ఫోన్లలోనూ ఇవి వస్తున్నాయి. ఇవి సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ శరీరంలో కాసేపు కదలికలు లేకపోతే వెంటనే బీప్ శబ్దంతో అప్రమత్తం చేస్తాయి. దాంతో హైవే హిప్పోసిస్ స్థితి నుంచి వెంటనే బయటకు రావచ్చు. - రోడ్డుపై దృష్టి సారించలేకపోతున్నామని గుర్తించగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాహనాన్ని నిలిపివేయాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, సురక్షిత దాబాలు, అనివార్యమైతే పెట్రోల్ బంకుల సమీపంలో వాహనాన్ని నిలిపి కాసేపు కునుకు తీయాలి. అనంతరం నిద్రలేస్తే మెదడు మళ్లీ చురుగ్గా పనిచేస్తుంది. -
‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత
సాక్షి, అమరావతి: ‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత మోగుతుంది..’ అంటోంది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ). హైవేలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. హైవేలతోపాటు రాష్ట్ర ప్రధాన రహదారులపై కూడా ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మార్కింగ్ లైన్లు దాటి వాహనాలు ప్రయాణిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో హైవేలపై భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించడంతో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో 8,200 మంది దుర్మరణం చెందారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రధానంగా భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణిస్తుండటం ప్రమాదాలకు దారితీస్తోందని గుర్తించారు. మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించే వాహనాలపై ఎన్హెచ్ఏఐ భారీ జరిమానాలను ఖరారుచేసింది. భారీ వాహనాలు కచ్చితంగా హైవేలపై ఎడమలైన్‌లోనే ప్రయాణించాలి. ముందు నెమ్మదిగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయాల్సి వస్తే తప్ప లైన్ దాటడానికి వీల్లేదు. అలా ఓవర్టేక్ చేసిన వెంటనే మళ్లీ ఎడమవైపు లైన్లోకి వచ్చేయాలి. అలాకాకుండా ఒక 200 మీటర్లకు మించి ఎడమవైపు లైన్‌ను దాటి ప్రయాంచే భారీ వాహనాలపై తొలిసారి రూ.500 జరిమానా విధిస్తారు. అదే వాహనం తరువాత లైన్ క్రాస్‌చేస్తే ప్రతిసారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తారు. నిబంధనలు పాటించాలి భారీ వాహనాలు కచ్చితంగా నిబంధనలను పాటించేలా హైవే పెట్రోలింగ్ అధికారులు కన్నేసి ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించిన వాహనాలతోపాటు హైవేలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల పుటేజీలను తరచూ పరిశీలించి నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధిస్తారు. రాష్ట్ర రహదారులపైన కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర రవాణాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందుకుగాను రాష్ట్ర ప్రధాన రహదారులపై వాహనచోదకులకు మార్గనిర్దేశం చేసేలా సైన్ బోర్డులు, లైన్ మార్కింగులు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త జరిమానాల విధానం అమలు చేయాలని చెప్పింది. ఈ లోపు రాష్ట్ర ప్రధాన రహదారులపై సైన్ బోర్డులు, లైన్ మార్కింగ్‌లు పూర్తిచేయాలని సూచించింది. -
స్మార్ట్ హైవేలుగా మన జాతీయ రహదారులు.. ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ!
సాక్షి, అమరావతి: మన జాతీయ రహదారులు త్వరలో స్మార్ట్ హైవేలుగా రూపాంతరం చెందనున్నాయి. దేశంలో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లైన్లు వేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. రూ.6వేల కోట్లతో 25వేల కి.మీ. మేర ఓఎఫ్సీ లైన్ల ఏర్పాటుకు భారీ ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ‘గతి శక్తి ప్రాజెక్టు’ కింద ఈ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)తో కలసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) స్మార్ట్ హైవేలు/డిజిటల్ హైవేల ప్రాజెక్ట్ కార్యాచరణకు ఉపక్రమించింది. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ముంబై–ఢిల్లీ, హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులలో 2వేల కి.మీ.మేర ఓఎఫ్సీ లైన్ల పనులు చేపట్టనుంది. ఇందుకోసం రూ.500కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచింది. అనంతరం చెన్నై–విజయవాడ, ముంబై–అహ్మదాబాద్ జాతీయ రహదారుల్లో 5వేల కి.మీ. మేర పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. బహుళ ప్రయోజనకరంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ... ► బహుళ ప్రయోజనకరంగా స్మార్ట్ హైవేల ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 2050నాటికి విస్తృతం కానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ► దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంబడి నిరంతరాయంగా 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుంది. ► 5జీ సేవల కోసం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఓఎఫ్సీ లైన్లు వేసేందుకు వివిధ అనుమతులు పొందేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. అందుకే జాతీయ రహదారుల వెంబడి కేంద్ర ప్రభుత్వమే డార్క్ ఫైబర్ కనెక్టివిటీని ఏర్పరచడానికి ఓఎఫ్సీ లైన్లు వేయాలని నిర్ణయించింది. ► హైవేల వెంబడి అవసరమైన చోట్ల ఓఎఫ్సీ లైన్లను నిర్ణీత ఫీజు చెల్లించి ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు వాడుకునేందుకు ట్రాయ్ సమ్మతిస్తుంది. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ఓఎఫ్సీ లైన్లను ఉపయోగించేందుకు వీలుగా ఏర్పాటుచేస్తారు. ► దేశవ్యాప్తంగా త్వరలో టోల్ గేట్లను ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. టోల్ గేట్లు లేకుండా 5జీ నెట్వర్క్ సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఓ వాహనం జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే శాటిలైట్ ఆధారిత పరిజ్ఞానంతో ఆటోమేటిగ్గా టోల్ ఫీజు వసూలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల వెంబడి 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి కూడా ఓఎఫ్సీ లైన్లు ఉపయోగపడతాయి. ► జాతీయ రహదారులపై భద్రత, నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కూడా ఈ ఓఎఫ్సీ లైన్లు ఉపకరిస్తాయి. ► రహదారి భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఓఎ‹సీ లైన్లు ద్వారానే స్పీడ్ రాడార్లు పనిచేస్తాయి. ► జాతీయ రహదారుల వెంబడి దశలవారీగా స్మార్ట్ హైవే లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఓఎఫ్సీ లైన్లు దోహదపడతాయి. -
‘లైట్’ తీస్కోవద్దు.. హెడ్ లైట్లు, వెనక లైట్లు వేసుకోని వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైవేలపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కనీసం పలువురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉదయం పూట మంచు కురిసే వేళలో సరైన జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడంతోనే తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఉదంతంలోనూ పొగమంచే ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే చలికాలం మొదలైంది. మరో రెండు మూడు నెలల పాటు చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటే దట్టమైన పొగ మంచు కూడా కమ్ముకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైవేలపై వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లైట్ ఆర్పితే అంతే సంగతులు.. ►దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా హెడ్లైట్లు వెలుగుతూనే ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. ►ప్రధాన రహదారులపై డివైడర్ల వల్ల ఎదురెదురు వాహనాలు ఢీకొనే అవకాశం తక్కువగానే ఉండొచ్చు. కానీ సరైన వెలుతురు లేకపోవడం వల్ల డివైడర్లే మృత్యు ఘంటికలు మోగించే ప్రమాదం ఉంది. పొగమంచు కమ్ముకొని ఉన్నప్పుడు లైట్లు ఆర్పినా, కాంతి తక్కువగా ఉన్నా డివైడర్లను గుర్తించడం కష్టమవుతోంది. ►సాధారణంగా హైవేలపై కార్లు, ఇతర వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు 50 నుంచి 60 కి.మీ వేగం మించకుండా వాహనాలను నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. వెనక లైట్లూ వెలగాలి.. ►రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్ లైట్లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిలిపి ఉంచిన వాహనం ఉనికిని ఈజీగా గుర్తించేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు. ►వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి. దీనివల్ల మంచు కురిసే సమయంలోనూ వాహనం ఉనికి తెలుస్తుంది. చాలా వరకు వాహనదారులు ఈ చిన్న నిబంధనను పాటించకపోవడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయాలు శ్రేయస్కరం.. చలికాలంలో పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించక వాహనాలు ఢీకొట్టుకోవటం, రోడ్డు సరిగా కనిపించక వాహనాలు దారితప్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు వాహనదారులకు పలు సూచనలు చేశారు. రాత్రి 10.30 లోపు, ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే ప్రయాణించాలన్నారు. రెండేళ్ల కాలంలో 50 మంది మృత్యువాత.. గత రెండేళ్లలో శీతాకాలంలో రోడ్డు ప్రమాదాల డేటాను ఆయన విశ్లేషించారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల వెంబడి కుటుంబ సబ్యులతో వాహనాల్లో ప్రయాణించడం ఇబ్బందికర విషయమన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేయాల్సి వస్తే.. సొంత డ్రైవింగ్ కాకుండా నైపుణ్యం ఉన్న డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. అది కూడా డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలని సూచించారు. ‘బే’లలోనే పార్కింగ్.. ట్రక్లు, ఇతరత్రా పెద్ద వాహనదారులు శీతాకాలంలో ఓఆర్ఆర్, హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపకూడదు. రాత్రి సమయంలో విశ్రాంతి కోసం తప్పనిసరి పరిస్థితులలో వాహనాలను నిలపాల్సి వస్తే... రోడ్డు నుంచి పూర్తిగా ఎడమ వైపు తీసుకొని వాహనాలను పార్కింగ్ చేయాలి. ఓఆర్ఆర్, హైవేలపై కేటాయించిన పార్కింగ్ బే, లైన్లలోనే ఆయా వాహనాలను నిలిపివేయాలి. లేకపోతే పొంగమంచుతో ప్రయాణిస్తున్న చిన్న వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నిద్ర మత్తు వీడాలి.. ► తెల్లవారుజామున జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం కూడా మరో కారణం. సాధ్యమైంత వరకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు వానాలను నడపకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే డ్రైవర్ పూర్తిగా ఆరోగ్యంగా ఎలాంటి నిద్రమత్తు లేకుండా ఉండాలి. ► రెప్పపాటు క్షణంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఒకవైపు మంచు కురుస్తుండగా, మరోవైపు నిద్రమత్తుతో బండి నడిపితే రోడ్డు ప్రమాదాలకు మరింత ఊతమిచ్చినట్లవుతుందని డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరించారు. -
టోల్ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..!
చౌటుప్పల్ రూరల్, బీబీనగర్: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్–వరంగల్ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు -
ఎలక్ట్రిక్ హైవేలు కమింగ్ సూన్: కేంద్రం భారీ కసరత్తు
న్యూఢిల్లీ: సౌరశక్తిని వినియోగించుకుని భారీ ట్రక్కులు, బస్సుల చార్జింగ్కు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశీయంగా విద్యుత్‌తోనే నడిచే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉపరితలంపై ఉన్న విద్యుత్ లైన్స్‌తో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలకు కూడా చార్జింగ్ కోసం విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దే రోడ్లను ఎలక్ట్రిక్ హైవేగా పరిగణిస్తారు. మరోవైపు, టోల్ ప్లాజాల్లో కూడా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. మౌలిక సదుపాయాలను పటిష్టంగా అభివృద్ధి చేస్తే ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని, కొత్త వ్యాపారాలు.. ఉద్యోగాల కల్పనకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత లాజిస్టిక్స్, రోప్‌వేలు, కేబుల్ కార్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. అలాగే, చౌకైన, విశ్వసనీయమైన ఎలక్ట్రోలైజర్లు, హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా కంపెనీ సహకారం అందించాలని ఆయన కోరారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లకు మించి రాబడులు లభించేలా ఇన్విట్ వంటి వినూత్న పథకాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వాడకాన్ని బట్టే టోల్ ఫీజు.. టోల్ ప్లాజా రద్దీని తగ్గించేలా నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. అలాగే, టోల్ రహదారులపై ప్రయాణించినంత దూరానికి మాత్రమే వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వివరించారు. టోల్ బూత్‌ల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా, అలాగే రహదారిని ఉపయోగించినంత దూరానికే చెల్లింపులు జరిగేలా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాల టెక్నాలజీ ఉపయోగపడగలదని మంత్రి పేర్కొన్నారు. 2018-19లో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల నిరీక్షణ సయమం సగటున 8 నిమిషాలుగా ఉండగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టాక 2021-22లో ఇది 47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ చెప్పారు. నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గినప్పటికీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్దిష్ట సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల పైనా, ప్రస్తుతం ఉన్న 4 పైగా లేన్ల హైవేలపైనా అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎంఎస్) ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2024నాటికి జాతీయ రహదారులపై 15వేల కి.మీ. మేర ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ సిస్టంను(ఐటీఎస్) అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. -
2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ
Nitin Gadkari Said We All Must Be Aligned to Be Carbon Neutral Country by 2070: ఇటీవల COP-26 శిఖరాగ్ర సమావేశంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నిబద్ధతకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అంతేకాదు 2070 నాటికి ఎటువంటి ఉద్గారాలు లేని లేదా కార్బన్-న్యూట్రల్ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ కృషి చేయాలన్నారు. ఐసీసీకి చెందిన ఏజీఎం అండ్ వార్షిక సెషన్లో భారత్ @ 75 ''ఎంపవరింగ్ ఇండియా: టుమారో ఫర్ టుమారో''పై మంత్రి ప్రసంగిస్తూ, అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు డిజిటలైజేషన్‌ను వంటి వాటితో దేశంలో సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రయాణంలో మన ప్రభుత్వం రేపటిని నిర్మించే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్న మలుపులో మేము నిలబడి ఉన్నాం. ఇది మన నేటి కంటే చాలా శక్తివంతమైనది. ఆత్మనిర్భర్ ఈ వాతావరణాన్ని తట్టుకోగలదు." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వం గ్రీన్ హైవే మిషన్ కింద జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకం గొప్ప సరికొత్త మార్పిడిగా అభివర్ణించారు. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పెట్టుబడుల ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఈ మేరకు కారిడార్‌లో లాజిస్టిక్స్ పార్కులు, స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ పార్కులను నిర్మించడంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టవచ్చని అన్నారు. అంతేకాక భారతమాల ఫేజ్ 1, 2 కింద 65,000 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. భారత్‌మాల ఫేజ్-1 కింద సుమారు 35,000 కి.మీ హైవేలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉందని, మొత్తం మూలధన వ్యయం ₹. 10 లక్షల కోట్లు అని వెల్లడించారు. పైగా 20 వేల కి.మీ.లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయన్నారు. అయితే 2025 నాటి కల్లా 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందంటూ గడ్కరీ చెప్పుకొచ్చారు. -
ఎలక్ట్రిక్ వెహికిల్స్ క్రేజ్,కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
న్యూఢిల్లీ:జాతీయ రహదారుల వెంట ఎలక్ట్రిక్ వాహనాలకు సౌలభ్యత కలిగించడానికి చార్జింగ్ మౌలిక వ్యవస్థను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని వివరించారు. ఒక వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్–19 నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న ఆటోమొబైల్ పరిశ్రమ, క్రమంగా రికవరీ చెందుతుండడం తనకు సంతోషం కలిగిస్తోందని తెలిపారు. భారత్ జీడీపీ వ్యవస్థలో ఆటో రంగం వాటా 7.1 శాతం అని ఆయన పేర్కొంటూ, తయారీ జీడీపీ విషయంలో 49 శాతం వాటా కలిగి ఉందని తెలిపారు. వార్షిక టర్నోవర్ రూ.7.5 లక్షల కోట్లుకాగా, ఎగుమతుల విలువ రూ.3.5 లక్షల కోట్లని వివరించారు. జూలై 2021లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు నెలవారీగా 229 శాతం పెరిగి 13,345 యూనిట్లకు చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. వార్షికంగా చూస్తే 836 శాతం పురోగతి ఉందని వివరించారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన అంశమని పేర్కొన్నారు. రవాణా రంగం విషయంలో పర్యావరణ పరిరక్షణ విధానాలకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. చదవండి: ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ బైక్.. ధర రూ.40 వేలు మాత్రమే -
హైవేల పక్కనే టౌన్‌షిప్‌లు : నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు.రూ .2.5 లక్షల కోట్ల విలువైన టన్నెల్స్‌ను నిర్మించాలని తమ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని మంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాల నిధులను ఈ ఏడాది 34 శాతం పెంచిందనీ, రూ. 5.54 లక్షల కోట్లు మేర పెంచినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరగడం కరోనా మహమ్మారి సమయంలో ఉపాధిని సృష్టించడానికి సహాయపడుతుందని గడ్కరీ పేర్కొన్నారు. -
కేంద్రం కొత్త పథకం.. రియల్టీలో జోష్..
న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యం తో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. -
అతి వేగానికి బ్రేకులు..
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై అతి వేగంతో దూసుకెళ్లే వాహనాలకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. నిర్దేశించిన వేగ పరిమితిని దాటితే భారీ జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణా, పోలీస్ శాఖలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం హైవేలపై టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఎంత వేగంతో వాహనం ప్రయాణిస్తుందో తెలుసుకోనున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని పోలీసులు రహదారి భద్రత కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రహదారి భద్రత నిధి నుంచి రూ.6 కోట్లతో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను కొనుగోలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం పోలీస్ శాఖ నుంచి ఓ అధికారిని నామినేట్ చేయాలని కోరింది. హైవేలపై నిర్దేశించిన వేగానికి అనుగుణంగానే ఇకపై వాహనాలను నడపాల్సి ఉంటుంది. ఇప్పటివరకు హైవేలపై గంటకు 80 కి.మీ. వేగంతో కార్లు వెళ్లేందుకు అనుమతి ఉండగా, దాన్ని 100 కి.మీ.కు. ద్విచక్ర వాహనాలకు 60 కి.మీ. నుంచి 80 కి.మీ.కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. బస్సులు, లారీలు కూడా గంటకు 80 కి.మీ. వేగంలోపే ప్రయాణించాల్సి ఉంటుంది. హైవేలపై ఆటోలు ప్రయాణించడానికి వీల్లేదు. అయినా కొన్నిచోట్ల ఆటోలు హైవేలపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ల ద్వారా వేగ నిర్ధారణ హైవేలపై వాహనాలు ఎంత వేగంతో వెళుతున్నాయో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు అంచనా వేస్తాయి. ఒక టోల్‌ప్లాజా నుంచి మరో టోల్‌ప్లాజాకు ఎంత సమయంలో చేరుతున్నాయో శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. దీన్నిబట్టి అతివేగానికి భారీ జరిమానాలు విధించనున్నారు. తొలుత ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా), ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్) మధ్య ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకే.. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని దీనిపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో జాతీయ రహదారులపై 38 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ–విశాఖ (ఎన్‌హెచ్–16), విజయవాడ–హైదరాబాద్ (ఎన్‌హెచ్–65) మధ్య హైవేలపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అంచనా. గతేడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు మొత్తం 17,910 జరిగితే 7,059 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో విజయవాడ–విశాఖ మధ్య 6,843 రోడ్డు ప్రమాదాల్లో 1,866 మంది, విజయవాడ–హైదరాబాద్ మధ్య 4,589 రోడ్డు ప్రమాదాల్లో 1,235 మంది మృతి చెందారు. అతివేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమంటున్న రవాణా శాఖ ఇక వేగ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టనుంది. స్పీడ్ గన్లు, టోల్‌ప్లాజాల్లో బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు చేసి వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. చదవండి: పట్టణాలకు కొత్తరూపు మారుమూల పల్లెలకు బడిబస్సులు -
హైదరాబాద్ రాకపోకలకు ‘హైవే’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కురిసిన భారీ వర్షం హైవే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగించింది. వివిధ జాతీయ రహదారులపై నగరానికి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ హైవేలపై పలుచోట్ల వరద ప్రవహిస్తుండటంతో హైదరాబాద్ చేరుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కొన్ని చోట్ల వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగరంలోకి వచ్చేలా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉంటూ వెళ్లిన పరిస్థితి కనబడింది. ఎక్కడెక్కడ ఎలా అంటే... ►జాతీయ రహదారి 44 (బెంగళూరు హైవే) అరాంఘర్–శంషాబాద్ మార్గం గగన్ పహాడ్‌లోని అప్పా చెరువు కట్ట తెగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలైతే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గగన్ పహాడ్ అండర్‌పాస్ రహదారి సగం వరకు కొట్టుకుపోయిందన్న సమాచారంతో.. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ►వరంగల్ హైవేలోని ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాచకొండ పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను ఘట్కేసర్ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్‌వైపు మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను నాగోల్, బండ్లగూడ మీదుగా ఓఆర్ఆర్ ద్వారా ఘట్‌కేసర్‌వైపు మళ్లించారు. ►నాగపూర్ హైవే మార్గంలోనూ వాహన రాకపోకలకు తిప్పలు తప్పలేదు. భారీ వర్షంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద పనులు జరుగుతున్న అండర్‌పాస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనాలను తూప్రాన్, నాచారం, గజ్వేల్, ములుగు, కిష్టాపూర్ మీదుగా మేడ్చల్ చెక్‌పోస్టుకు మళ్లించారు. తిరుగు ప్రయాణంలోనే అదే మార్గంలో వాహనాలను అనుమతించారు. ►అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెడ్డికుంట చెరువు తెగి.. విజయవాడ హైవే మార్గంలోని ఇమామ్‌గూడ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడ మరమ్మతులు చేసి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూశారు. ►శ్రీశైలం హైవేలోనూ రహదారులపై వరద నీరు ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నింపాదిగా కలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిగిలిన జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ వరద వల్ల వెతలు తప్పలేవు. రాజధానిలోనూ తిప్పలు... భారీ వర్షం వల్ల హైదరాబాద్ రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ఫ్లైఓవర్ ఎక్కకుండా సెవెన్ టూంబ్స్ రోడ్డు మీదుగా వెళ్లాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలు షేక్‌పేట, సెన్సార్ వల్లీ, ఫిల్మ్‌నగర్, బీవీబీ జంక్షన్ , బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 మీదుగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు, మలక్‌పేట ఆర్యూబీ పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలను అనుమతించకపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
129 దాబాలకు అనుమతి
సాక్షి, అమరావతి: అత్యవసర వస్తువుల సరఫరాకు వాహనాలను అనుమతిస్తుండటంతో రహదారుల్లో వారికి ఆహార ఇబ్బందులు తలెత్తకుండా పరిమిత సంఖ్యలో దాబాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 129 దాబాలను ప్రారంభించడానికి అనుమతిచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఇవి కేవలం రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసమేనని, సాధారణ జనాన్ని అనుమతించడానికి వీలులేదన్నారు. ఈ దాబాల్లో పరిశుభ్రత, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వీటిని పర్యవేక్షించే బాధ్యతను ఆయా జిల్లాల జీఎంలకు అప్పచెప్పినట్లు రజత్‌భార్గవ తెలిపారు. అనుమతులు ఇలా... ► అత్యవసర సేవలు, నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలకు.. ► పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు... ► నిరంతరాయంగా పనిచేయాల్సిన పరిశ్రమలకు ముడి సరుకు తరలించేందుకు... ► లాక్డౌన్ సమయంలో ఫార్మా, ఆహార శుద్ధి రంగాలకు చెందిన పరిశ్రమలు పనిచేయడానికి అనుమతించడంతో వాటికి సంబంధించిన వాహనాలకు. -
ఎన్డీఎంసీ రోడ్ల నిర్వహణపై పరిశీలన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మున్సి పల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పరిధిలోని రహదారుల మెరుగైన నిర్వహణ, అభివృద్ధి విధానా లను పరిశీలించడానికి జీహెచ్ఎంసీ ఇంజనీర్ల బృందం శనివారం ఇక్కడ పర్యటిం చింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి అర వింద్‌కుమార్ ఆదేశాల మేరకు ఎన్డీఎంసీ ఇంజనీర్లతో తెలం గాణ భవన్ ఆర్సీ గౌరవ్ ఉప్పల్, జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సమావేశ మయ్యారు. ఇక్కడి తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో రహదారుల నాణ్యత, మరమ్మతులకు స్పందించే విధి విధా నాలను ఎన్డీఎంసీ ఇంజనీర్లు వివరించారు.ఎన్డీఎంసీ పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బం ది రహదారుల నిర్వహణకు వాడే సామగ్రి, వాహనాల వివరాలు, సబ్‌వేల ఏర్పాటు, వాహనాల వేగం తగ్గించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు. నిల్వ నీటిని తొలగించే విధానం, రోడ్ కటింగ్‌లో పాటించే నిబంధనలు, కాలనీ రోడ్ల నిర్వహణ, ప్రతి ఇంటి ముందు రోడ్లకు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, బస్ షెల్టర్లు, సమాచార చిహ్నాల ఏర్పాటు, నీటిపారుదల వ్యవస్థ, కమ్యూ నికేషన్ వైరింగ్ గురించి జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు వివరించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు ఆర్.శ్రీధర్, మొహమ్మద్ జియా ఉద్దీన్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు ఆర్.శం కర్ లాల్, టి.రవీంద్రనాథ్, పి.అనిల్ రాజ్ పాల్గొన్నారు. కాగా, ఎన్డీఎంసీ నుంచి చీఫ్ ఇంజనీర్ సంజయ్ గుప్తా, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్‌పీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేఎమ్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆర్కే శర్మ పాల్గొన్నారు. -
గ్రేటర్ రోడ్లు ప్రైవేటుకు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని పేరెన్నికగన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చేపట్టనున్నాయి. భారీ ఫ్లైఓవర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులతోసహా వివిధ ఇంజనీరింగ్ పనుల్లో పేరుగాంచిన సంస్థలు ఇకపై నగర రోడ్ల నిర్వహణ పనులు చేయనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 9వేల కిలోమీటర్లకు పైగా రోడ్లుండగా, ప్రధాన మార్గాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్లు ఉన్నాయి. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్, తదితర పనుల కోసం జీహెచ్ఎంసీ ఏటా రూ. 500– 600 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ రోడ్లు ఎప్పుడూ గుంతల మయమే. అధ్వానపు రోడ్లతో ప్రజలకు అవస్థలేకాకుండా, సామాజిక మాధ్యమాల్లో నిత్యం ప్రభుత్వంపై విమర్శలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకివ్వాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. విధివిధానాలు రూపొందించేందుకు జీహెచ్ఎంసీలోని ముగ్గురు చీఫ్ ఇంజనీర్లతోపాటు, పబ్లిక్‌హెల్త్ మాజీ ఈఎన్సీని కమిటీ సభ్యులుగా నియమించారు. దీనికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ముందుగా పేరెన్నికగన్న పలు కంపెనీలతో కమిటీ సమావేశం నిర్వహించింది. వందలు, వేల కోట్ల భారీ ప్రాజెక్టులు చేసే పెద్ద కంపెనీలు రోడ్ల నిర్వహణకు ఒప్పుకుంటాయా అనే అనుమానాలున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించేందుకు అంగీకరించాయి. ఆయా సంస్థలు రోడ్లను పరిశీలించాక, మరోమారు జరిగే సమావేశంలో టెండర్లలో పొందుపరిచే అంశాలు, నిబంధనలు, నిర్వహణ వ్యయం తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. అది పూర్తయ్యాక టెండర్లను ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ప్రీబిడ్ సమావేశాలు పూర్తిచేసి టెండర్లలో అర్హత పొందే కంపెనీకి రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. సాఫీ ప్రయాణమే లక్ష్యం.. రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సిమెంట్ కాంక్రీట్ వేస్తారా లేక బీటీనా అన్న విషయంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలపాటు రోడ్లు సవ్యంగా, ప్రయాణానికి సాఫీగా ఉండేలా నిర్వహించడం నిర్వహణ చేపట్టే సంస్థ పని. వర్షాలు తదితర కారణాల వల్ల పెద్ద గుంతలు ఏర్పడ్డా, ఇతరత్రా దెబ్బతిన్నా, 24 నుంచి 48 గంటల్లో మరమ్మతులు పూర్తిచేయాలి. వివిధ సంస్థల అవసరాల కనుగుణంగా రోడ్ కటింగ్‌లకు అనుమతులిచ్చే అధికారం, ఆ తర్వాత త్వరితంగా తిరిగి పూడ్చటం వంటివాటిపై కాంట్రాక్టు సంస్థకే అధికారం ఉంటుంది. తొలిదశలో 687 కి.మీ.లు తొలిదశలో జోన్ల వారీగా ఎక్కువ వాహనరద్దీ ఉండే ప్రధాన మార్గాలను గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 687.43 కి.మీ.ల రద్దీ రోడ్లు ఉన్నాయి. జోన్ల వారీగా రోడ్ల నిర్వహణ కోసం యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఏఎంసీ) పేరిట వీటికి టెండర్లు ఆహ్వానించనున్నారు.