Jaise Mohammad
-
ది పుల్వామా కేస్: కశ్మీర్ గడ్డపై నెత్తుటి మరక
ఉత్తర భారతదేశంలోని... జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా హైవే... సమయం... మద్యాహ్నం 3గంటల 30నిమిషాలు. సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకు వెల్తున్న కాన్వాయ్‌పై ఒక్కసారిగా ఆత్మాహుతి దాడి జరిగింది. బ్లూకలర్ కార్... వేగంగా దూసుకువచ్చి జవాన్లు వెలుతున్న బస్సులోకి దూసుకుపోయింది. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న బస్సులు తునాతునకలై పోయాయి. అందులో ఉన్న వారి మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. అసలేం జరిగిందో అర్ధం అయ్యేలోపు... జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. భద్రతా దళాల మీద జరిగిన భయంకర దాడి తరువాతి కాలంలో దేశభద్రత, రాజకీయ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పుల్వామా దాడి ఒక ఆత్మాహుతి దాడి. కారుణలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు కూర్చి ఆ కారును భద్రతా దళాల వాహనాలతో ఢీకొట్టడం ఈ మొత్తం దాడిలో కీలకం. ఈ దాడి ఎలా జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఏవిధంగా పేలుడు పదార్ధాలు దేశంలోకి వచ్చాయనేది కూడా విచారణ సంస్థలను విస్మయానికి గురిచేశాయి. ఈ దాడిలో పాల్గొన్నది స్థానిక కశ్మీరీ ఉగ్రవాదులా లేక పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమాంతర ఉగ్రవాదులా అనేది ఈ కేసులో చాలాకాలం మిస్టరీగా ఉండింది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడి విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. పుల్వామా.. దక్షిణ కాశ్మీర్లో ఉన్న పట్టణం గుండా వెళుతున్న హైవే అటు జమ్మూను ఇటు కాశ్మీర్‌ను కలుపుతుంది. చలికాలంలో ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచుక కురవడం వల్ల... హైవేపై రాకపోకలు ఆగిపోతాయి. అటు జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న భద్రతా దళాలకు నిత్యావసరాల నుంచి అమ్యునేషన్ ఏది పంపాలన్నా ఈహైవే ద్వారానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 2019లో కూడా జమ్మూలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఉన్న జవాన్లను కాశ్మీర్‌కు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ముఖ్యంగా సెలవుల మీద వెళ్లివచ్చిన జవాన్లు ముందుగా జమ్మూలోని క్యాంప్‌లో రిపోర్ట్ చేస్తారు... ఆ తరువాత వారు ఒకేసారిగా కాశ్మీర్‌లోని క్యాంప్‌లకు భారీ భద్రత మధ్య కాన్వాయ్‌లో వెళతారు. అయితే 2019 జనవరి15 తరువాత కాశ్మీర్లో భారీగా మంచు కురిసింది దీంతో దాదాపు 20రోజుల పాటు జవాన్లను తరలించడం సాధ్యం కాలేదు. ఫిబ్రవరి 5వ తేదీన జవాన్ల కాన్వాయ్ వెళ్లేందుకు ఏర్పాటు చేసినా... మంచు కారణంగా అది ఫిబ్రవరి 14కు వాయిదా పడింది. గతంలో కాశ్మీర్లో వ్యవహారలను చూసే బీఎస్ఎఫ్ స్థానంలో సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత సీఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఫిబ్రవరి 14న తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో జమ్మూ నుంచి భారీగా జవాన్లను తీసుకుని వాహనాలు కాశ్మీర్‌కు బయలుదేరాయి. మొత్తం 78వాహనాల్లో 2547మంది సీఆర్పీఎఫ్ జవాన్లు... జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న క్యాంపుకు వెలుతున్నారు. జమ్మూ-కాశ్మీర్‌ను కలిపే టన్నెల్ వద్దకు మద్యాహ్నం సమయానికి జవాన్ల కాన్వాయ్ చేరుకుంది. టన్నెల్ నుంచి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలోనే జవాన్ల తరలింపు జరగాలి. ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. భద్రతా కారణాల దృష్ట్యా కాశ్మీర్లో భద్రతా దళాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లోనే ప్రయాణించాలి. అయితే భారీగా జవాన్లు ఉండటంతో... సరిపోయినన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టన్నెల్ వద్దరు రాలేదు. దీంతో చాలామంది జవాన్లు... సాధారణ బస్సుల్లోనే కూర్చుండి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించారు. 2019ఫిబ్రవరి 14 రోజున మద్యాహ్నం 2గంటల సమయంలో పుల్వామా హైవేపై పోలీసుల హడావిడి ప్రారంభం అయింది. ఏరియా డామినేషన్ పార్టీ పూర్తిగా హైవే తమ ఆధీనంలోకి తీసుకుంది. జవాన్లు ఆ ఏరియా దాటిపోయే వరకు హైవేపై ఇతర వాహనాలను అనుమతించరు. ఇది ఎప్పుడూ ఉండే ప్రొసీజర్. దాదాపు 3గంటల 15నిమిషాల సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సులు పుల్వామా సరిహద్దులోకి చేరుకున్నాయి. 3గంటల 30నిమిషాలకు పుల్వామా పట్టణాన్నిదాటి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. అంతలోనే రెండు ఒక బ్లూకలర్ మారుతి కారు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదకు వెళ్లే మార్గం దగ్గర నుంచి ఒక్కసారిగా కాన్వాయ్‌లోని బస్సుల మీదకు దూసుకుపోయింది. వెంటనే భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా తునాతునకలైంది. ఒక్కసారిగా ఊహించని విధంగా భారీ పేలుడు జరగడంతో అసలేం జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. వెంటనే ముందు బస్సులో ఉన్న జవాన్లు కన్ఫ్యూజన్లో కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకుని ఎవరూ లేరని గ్రహించి క్షతగాత్రుల వద్దకు చేరుకున్నారు. పేలుడు తీవ్రత దాదాపు 10కిలోమీటర్ల వరకు వినిపించింది. బస్సు నామరూపాల్లేకుండా ధ్వంసం అయింది చాలామంది జవాన్ల శరీర భాగాలు ముక్కలు ముక్కలైపోయాయి. హైవే పక్కన ఎలాంటి నివాస జనావాసాలు లేవు. అయితే హైవే కింది భాగంలో నివాస ప్రాంతం ఉంది. పేలుడు తరువాత వెంటనే తేరుకున్న అధికారులు సహాయంకోసం దగ్గరలోనే ఉన్న ఆసుపత్రితో పాటు ఆర్మీ క్యాంపుకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు ఆ భీతావాహ దృష్యాలను చూసి స్థబ్దులైపోయారు. చనిపోయిన జవాన్ల మృతదేహాలు చేసి అధికారుల కళ్లు చెమర్చాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు... చనిపోయిన వారి మృతదేహాల భాగాలను భద్రపరిచారు. దాదాపు 200మీటర్ల వరకు జవాన్ల మృతదేహాలు... చేతివేళ్లు.. కాలి ముక్కలు విసిరివేసినట్లు పడ్డాయి. ఆ భాగాలను బాక్సుల్లో అమర్చి...ఆర్మీ బేస్ క్యాంపుకు తరలించారు. పుల్వామా వార్త టీవీ స్క్రీన్లను తాకగానే .. దేశవ్యాప్తంగా ప్రజలు ఆ దృశ్యాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ దాడి మీద తీవ్రమైన ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన జరిగిన 15నిమిషాల్లోనే బాంబుదాడి జరిపింది తామేనంటూ జైషే మహమ్మద్ ఒక వీడియో విడుదల చేసింది. మహమ్మద్ దాడికి పాల్పడింది తామే అంటూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అదిల్ అహ్మద్ దార్ అని చెప్పుకున్న ఒ ఉగ్రవాది ఎమ్-4 కార్బైన్ గన్ , ఒక పిస్టల్ పట్టుకుని కనిపించాడు. ఆదిల్ వెనకాల జైషే మహమ్మద్ జెండా ఉంది. ఈ దాడికి పాల్పండింది తానేనని చెప్పుకున్న దార్... గతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన దాడుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో విడుదల కాగానే భద్రతాదళాలతో పాటు ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిపెరిగింది. ఆత్మాహుతి దాడి చేసి ఆ వెంటనే వీడియో విడుదల చేయడం ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రాపగాండాను విస్తరింపజేయాలనే కుట్ర జరిగింది. దాడిలో ఎంత మంది జవాన్లు చనిపోయారనే వార్తను సీఆర్పీఎఫ్ ధృవీకరించక ముందే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన వెబ్సైట్ అల్ఖలమ్లో 40మంది జవాన్లు చనిపోయారని ఖచ్చితమైన మృతుల సంఖ్యను ప్రకటించింది. దీంతో పేలుడు జరిగిన తరువాత ఎప్పటికప్పుడు సమాచారం పాకిస్థాన్‌కు వెలుతుందనే విషయాన్ని నిఘావర్గాలు గుర్తించాయి. పేలుడు తీవ్రత... భారీగా జవాన్లు చనిపోవడంతో... కేంద్రం వెంటనే ఈ కేసును జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ జమ్మూకాశ్మీర్ చీఫ్...రాకేశ్ బల్వాల్ ఈ కేసు విచారణ అధిపతిగా నియమితులయ్యారు. వెంటనే రాకేశ్ సంఘటనా స్థలానిక వెళ్లి పరిశీలించారు. దాదాపు 200మీటర్ల దూరం వరకు పడి ఉన్న వాహన శకలాలు, ఇతర సాక్ష్యాధారాలను సేకరించారు. రెండవ రోజు పేలుడు జరిగిన ప్రాంతానికి సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరి, నేషనల్ బాంబ్ డాటా సెంటర్, ఎన్ఐఏ బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడుకు ఉపయోగించిన కారు ముక్కలను సేకరించారు. కారు ఇంజిన్ కు సంబంధించిన కొన్ని భాగాలను సేకరించి దాని ఛాసిస్ నెంబర్ గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారు తయారీకి సంబంధించిన నెంబర్లను ముందుగానే జాగ్రత్తగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఫిబ్రవరి 18న మారుతీ కంపెనీకి చెందిన ఇంజనీర్ల టీమ్ విచారణ సంస్థలకు సహకరించడానికి ఢిల్లీ నుంచి కాశ్మీర్‌కు చేరుకుంది. మారుతీ ఇంజనీర్స్ కారు ఇంజన్ పూర్తిగా ఓపెన్ చేసి అందులో ఉన్న కారు ఇంజన్ బ్యాచ్ నెంబర్ గుర్తించగలిగారు. ఆ నెంబర్ సహాయంతో దాడికి వాడిన కారు మారుతి ఈకో మోడల్ గా తేల్చారు. దాని మోడల్ నెంబర్ ద్వారా ఇది 25జనవరి 2011రోజున తయారైనట్లు... ఆరోజు తయారైన 7ఈకో కార్లలో ఒక్కటి మాత్రమే కాశ్మీర్లో అమ్ముడైనట్లు గుర్తించారు. ఈ దాడికి వాడిన మారుతి ఈకో కారు ఛాసిస్ నెంబర్ MA3ERLF1SOO183735... కారు ఇంజిన్ నెంబర్...G12BN164140గా గుర్తించారు. విచారణలో కారు డీటేయిల్స్ తెలియగానే... ఆ కారు యజమాని జలీల్ అహ్మద్ హక్కానీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు షోరూంలో కొనుగోలు చేసిన తరువాత కొన్నిరోజులకు తాను ఆ కారును ఇతరులకు అమ్మేసినట్లు హక్కాని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. పోలీసులు విచారణను మరింత లోతుగా జరిపినప్పుడు ఆ కారు తరువాతి కాలంలో దాదాపు 6గురి చేతులు మారిందని... గుర్తించారు. గతంలో కారును కొనుగోలు చేసిన 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణను రహస్యంగా ఉంచేందుకు కొన్నాళ్లపాటు ఆ ఆరుగురిని పోలీసులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఇక ఈ కారు అమ్మకంలో దానిష్ అహ్మద్ లోన్ అనే బ్రోకర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అహ్మద్ లోన్‌ను విచారిస్తే ఈ కారును తన బంధువు సజ్జాద్ భట్‌కు అమ్మినట్లు తెలిపాడు. చివరిసారిగా మారుతి ఈకో కారును 2019 జనవరిలో 1.85లక్షలకు సజ్జాద్ భట్‌కు అమ్మినట్లు బ్రోకర్ తెలిపాడు. ఇక సజ్జాద్ భట్ కోసం వెళ్లిన పోలీసులు అప్పటికే అతను పారిపోయినట్లు గుర్తించారు. దీంతో కేసు విచారణ అక్కడే ఆగిపోయింది. ఓ వైపు కేసు విచారణ కొనసాగుతుండగా ... ఈ పేలుడు పెద్ద ఇంటెలిజెన్స్ ఫేయిల్యూర్ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ కాశ్మీర్‌లోకి ఎలా వచ్చిందనే చర్చ ప్రారంభం అయింది. అది ఎన్నికల సమయం కావడంతో కావాల్సినంత రాజకీయం జరిగింది. దీంతో విచారణను వేగవంతం చెయ్యాలనే ఒత్తిడి ఎన్ఐఏపై పెరిగింది. దీంతో ఏదో విధంగా కేస్‌లో బ్రేక్ త్రూ సాధించాలనే పట్టుదలతో... విచారణాధికారి బలవాల్ సంఘటన స్థలంలో 250మీటర్ల వరకు పోలీసులతో క్షుణ్ణంగా వెతికించాలని సంకల్పించారు. ఆ ప్రాతంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఉండే అతివాద శక్తులున్నాయని... అక్కడ 250మీటర్లు వెతకాలంటే కుదిరే అవకాశం లేదని జమ్మూకాశ్మీర్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినా వెనక్కి తగ్గని బలావల్ పై అధికారులను ఒప్పించి సంఘటన జరిగిన 6రోజులకు ఫిబ్రవరి 20న బ్లాస్ట్ సైట్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు... ఈ సెర్చ్ ఆపరేషన్‌లో 400మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, 100మంది ఎన్ఐఏ అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి కొనసాగిన ఈ వెతుకులాటలో చనిపోయిన జవాన్ల చిన్న చిన్న శరీర భాగాలు... పేలిపోయిన వాహనాల ముక్కలు తప్ప ఏమీ లభించలేదు.అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు... పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. మద్యాహ్నం తరువాత పేలుడు జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 200మీటర్ల దూరంలో బలావల్‌కు మట్టిలో మెరుస్తూ ఒక తాళంచెవి కనిపించింది. 1026 నెంబర్‌తో ఉన్న కారు కీ ఎన్ఐఏ అధికారి బలావల్ చేతికి చిక్కింది. తాళంచెవి మీద ఉన్న రక్తం మరకలను ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ ఆహ్మద్ దార్ రక్తం డీఎన్ఏతో పోల్చారు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది అహ్మద్ దార్ అధికారులు నిర్ధరించారు. ముందుగా ఈ దాడి చేసింది.. కాశ్మీరీయా లేక పాకిస్థాన్ నుంచి వచ్చి న ఉగ్రవాదా అనే విషంయపై పెద్ద చర్చ జరిగింది. గతంలో కాశ్మీరీలు ఆత్మాహుతి దాడులు చేసిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో మొదటిసారిగా ఒక కాశ్మీరి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వీడియో విడుదల చేసిన ఆదిల్ అహ్మద్ దార్... స్వయంగా ఈ దాడి జరిపాడని పేలుడులో అతను కూడా మరణించాడని నిర్ధారణ అయింది. దాడికి పాల్పడిన వ్యక్తి కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఆదిల్ దార్గా తేలింది. ఇక కారు పుల్వామాకే చెందిన సజ్జాద్ భట్ కొనుగోలు చేసినట్లు కూడా నిర్దారణ అయింది. దీంతో ఇక కారు ఓనర్ సజ్జాద్ భట్ ఇంటిపై పోలీసులు రేడ్ చేశారు. భట్ అక్కడ లేడని... వారం రోజుల నుంచి ఇంటికి రాలేదని అతని తండ్రి తెలిపాడు. అయితే సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్ చదువుకున్న సిరాజ్ ఉల్ ఉలుమ్ మదర్సాలోనే భట్ కూడా చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జమాతే ఇస్లామీ జమ్ము-కాశ్మీర్ అనే సంస్థ ఈ మదర్సా నడుపుతోంది. వెంటనే 28ఫిబ్రవరి 2019నాడు ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. ఇక ఫిబ్రవరి 25నాడు ఏకే-47పట్టుకుని సజ్జాద్ భట్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో ఈ కేసులో సజ్జాద్ భట్ కీలకం అని పోలీసులు భావించారు.సజ్జాద్ భట్ కోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో అతను పాకిస్థాన్ వెళ్లిపోయినట్లు భావించారు. కేసు మళ్లీ మొదటికొచ్చింది.. ఈ కేసులో విచారణలో పురోగతి లేదు ఇక నెలలు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ఎన్ఐఏ అధికారులు పుల్వామా తరువాత జరిగిన ఎన్కౌంటర్లపై దృష్టిసారించారు. ఎన్ఐఏ అధికారి బలావల్ ఓ ఎన్కౌంటర్ సంఘటనపై దృష్టిసారించారు. 2019 మార్చిలో నౌగామ్ పోలిస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో జైషేమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కామ్రాన్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. కామ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయాడు.కామ్రాన్ స్థానికంగా జైష్ కమాండర్‌గా ఉన్నాడు... దీంతో చనిపోయిన రెండో ఉగ్రవాదిపై పోలీసులు పెద్దగా దృష్టిసారించలేదు. అయితే కామ్రాన్‌తో పాటు చనిపోయిన మరో ఉగ్రవాది ఆడిడాస్ జాకెట్ వెసుకుని నీట్‌గా హేయిర్ కట్ చేసుకుని ఉన్నాడు. సాధారణంగా కాశ్మీరీ ఉగ్రవాదులు ఇలా నీట్‌గా హేయిర్ కట్ చేసుకోవడంగాని గడ్డం ట్రిమ్ చేసుకోవడంలాంటివి చేయరు. దీంతో ఈ ఉగ్రవాదిపై ఎన్ఐఏ అధికారి బలావల్‌కు అనుమానం వచ్చింది. చనిపోయిన ఉగ్రవాది పేరు ఇద్రీస్ భాయ్ అని స్థానిక పోలీసులు చెప్పారు... ఇద్రీస్ దగ్గర ఒక ఎమ్-4కార్బన్‌తో పాటు పిస్టర్ రెండు సెల్ఫోన్లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఫోన్లలో ఒకటి ఐఫోన్ కాగా మరొకటి సాంసంగ్ ఎస్-9 ప్లస్. అయితే ఈ రెండు ఫోన్లు ఎన్కౌంటర్లో చనిపోకముందు ఇద్రీస్ పూర్తిగా వీటిని ధ్వంసం చేశాడని. ఈ ఫోన్ల నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని... పోలీసులు చెప్పారు. అయితే ఈ ఫోన్లను పరిశీలించిన కాశ్మీర్ పోలిస్ సైబర్ సెల్ ఇందులో ఎలాంటి డేటా తీయలేకపోయామని బలావల్‌కు తెలిపారు. ఈ ఫోన్లను ఎలాగైనా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు పంపాలని ఎన్ఐఏ అధికారి బలావల్ ప్రయత్నించాడు. అయితే దీనికి రూల్స్ ఒప్పుకోవని కాశ్మీర్ పోలీసులు కరాఖండీగా చెప్పారు. అయినా పుల్వామా కేసు కొలిక్కి రావాలంటే... ఏదో ఒక బ్రేక్ త్రూ కావాలనే తపనతో ఉన్న ఎన్ఐఏ అధికారి బలవాల్లో అన్ని అవకాశాలను వాడుకున్నాడు. దీంతో తనకు పరిచయమున్న కాశ్మీర్ క్యాడర్ ఐపిఎస్ అధికారిని రిక్వేస్ట్ చేసి ఆ ఫోన్లు స్వాధీన పరుచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాడు. వెంటనే ఆ ఫోన్లు ఢిల్లీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చేతికి అందాయి. చాలా కష్టపడి పూర్తి డేటాను వెలికితీసిన ఇంజనీర్ల టీమ్‌కు జాక్‌పాట్ తగిలింది. వెంటనే ఎన్ఐఏ అధికారి రాకేశ్‌కు అందులో ఉన్న డేటాను పరిశీలించడాని ఢిల్లీ వెల్లాడు. ఓ వైపు ఎన్ఐఏ అధికారులు ఫోన్లో దొరికిన సమాచారాన్ని ఫోటోలను పరిశీలిస్తున్న సమయంలో.. మరో సంఘటన జరిగింది. ఒక వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్‌లోకి ఎంటర్ అవుతుండగా పోలీసులకు అనుమానం కలిగి చెక్‌పోస్ట్ దగ్గర ఆపారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని నిలదీశారు. దీంతో వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు అడవిలోకి పారిపోయారు... వీరిని వెంబడించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒకరిని సమీర్ దార్ గా గుర్తించారు. సమీర్ దార్‌ను విచారించిన తరువాత పుల్వామా ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆదిల్ దార్ కు ఇతను సోదరుడిగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు పుల్వామా దాడి తరువాత వచ్చిన వీడియోను సమీర్దార్కు చూపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ ఆదిల్ దారేనని... అయితే ఆ గొంతుమాత్రం అతనిది కాదని చెప్పాడు. గతంలోనే ఆ వీడియోను పూర్తిగా పరిశీలించిన ఫొరెన్సిక్ అదికారులు ఇది డబ్బింగ్ చెప్పిన వీడియో అని చెప్పారు. చనిపోయింది సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్... డీఎన్ఏ టెస్టులో ఇది నిర్ధరణ అయింది. మరి గొంతు ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందో పోలీసులకు గతంలో అర్ధం కాలేదు. ఇప్పుడు విచారణలో సమీర్ ఆ గొంతు మరో ఉగ్రవాది హింజిలా జిహాదిది అని చెప్పాడు. దీంతో ఈ హంజిలా జిహాదీ ఎవరు దానిపై పోలీసులు విచారణ జరిపారు. ఈ హంజిలా జిహాది అనే వ్యక్తి పుల్వామాకే చెందిన ఒక కార్పెంటర్ అని పోలీసుల విచారణలో తేలింది. హంజిలా ఎక్కడున్నాడని పోలీసులు సాగించిన వేటలో... ఆర్టికల్ 370రద్దు సందర్భంగా అతడని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని తేలింది. దీంతో పోలిసు కస్టడీలో ఉన్న హంజిలాను తీసుకువచ్చి ఎన్ఐఏ విచారణ జరిపింది. ఇంతలో ఉగ్రవాది ఇద్రీస్ ఖాన్ ఐఫోన్లో ఉన్న ఫోటోలు కూడా ఎన్ఐఏ అధికారుల చేతికి అందాయి. ఇద్రీస్ఖాన్తో పాటు హంజిలా కూడా ఫోటోల్లో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్రీస్‌ఖాన్ గురించి అడిగితే హంజిలా అతను ఇద్రీస్ కాదని.. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉమర్ ఫారూఖ్ అని చెప్పాడు. ఈ మొత్తం దాడిలో ఉమర్ ఫారూఖ్ కీలకం అని.. ఉమర్ ఫారూఖ్ సాక్ష్యాత్తూ పాకిస్థాన్‌లో ఉన్న మసూద్ అజ్హర్ అన్న కొడుకు అని హంజిలా చెప్పాడు. తానే స్వయంగా సూసైడ్ బాంబర్‌ను కారులో పుల్వామా హైవే వరకు తీసుకు వెళ్లానని... బాంబు పేలుతున్న సమయంలో అక్కడే ఉన్నానని హంజిలా కథ మొత్తం చెప్పాడు. పుల్వామా బాంబు దాడికోసం పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాదాపు రెండేళ్లుగా రెక్కి నిర్వహించింది. దీనికోసం పాకిస్థాన్ నుంచి మౌలానా మసూద్ అజ్హర్ అన్న కొడుకు ఉస్మాన్ హైదర్ 2017లో కాశ్మీర్‌లోకి చొరబడ్డాడు. అయితే అతను ఆపరేషన్ పూర్తి చేయకముందే భద్రతా దళాల ఎన్కౌంటర్లోచనిపోయాడు. దీంతో మళ్లీ అతని సోదరుడు ఉమర్ ఫారూఖ్‌ను ఇద్రీస్ భాయ్ అనే పేరుపెట్టి పాకిస్థాన్ నుంచి కాశ్మీర్‌లోకి చొప్పించారు. ఆప్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన ఉమర్ ఫారూఖ్... ఐఈడీలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. తాలిబాన్ క్యాంపుల్లో చాలాకాలం పాటు అమెరికా సైనికులతో పోరాడని ఉమర్ ఫారూఖ్... ఇండియాలో పెద్ద పేలుడు చేసే ఉద్దేశంతో కాశ్మీర్ సరిహద్దుల నుంచి ఇండియాలోకి ఎంటరయ్యాడు. వచ్చే సమయంలో తనతో పాటు పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ తెచ్చుకున్నాడు. 50లక్షల రూపాయలు హవాలాద్వారా ఈ ఆపరేషన్‌కు ఉపయోగించినట్లు సమచారం. ఇండియాకు వచ్చిన ఇద్రీస్ పుల్వామాలోని బిలాల్ అహ్మద్ కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అక్కడే ఆదిల్ దార్‌ను పూర్తిగా సూసైడ్ బాంబర్‌గా మార్చడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాడు. ఆదిల్ దార్ ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడు... అతడికి మతమౌఢ్యం ఎక్కించడంతో పాటు ఇండియాపై విషం నింపాడు. ఇక పేలుడుకు కావాల్సిన కారును సజ్జాద్ అహ్మద్ భట్ ద్వారా కొనుగోలు చేయించాడు. ఇక తనతో పాటు తెచ్చుకున్న ఆర్డీఎక్స్‌కు తోడుగా కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు, అల్యూమినియం పౌడర్ సైతం అమెజాన్ నుంచి కొనుగోలు చేశారు. అవేజ్ భోలా అనే యువకుడి అమెజాన్ అకౌంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఇక కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కూతురు ఇన్షాజాన్తో ఉమర్ ఫారూఖ్ ప్రేమాయణం నడిపాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు కూడా తరువాత అతని ఫోన్లో లభ్యమయ్యాయి. ఇక పేలుడుకు నెల రోజుల ముందే బిలాల్ అహ్మద్ కూచే ఇంట్లో ఆదిల్ దార్‌తో దాడి తరువాత విడుదల చేసే వీడియోను చిత్రీకరించారు. అయితే అందులో ఆదిల్ దార్ సరిగా మాట్లాడలేకపోవడంతో... హంజిలా జివాదీతో డబ్బింగ్ చెప్పించారు. ఈ వీడియోను పాకిస్థాన్‌కు పంపి...అక్కడ ఉన్న నాయకులతో దానిని ఓకే చేయించారు. ముందుగా ఫిబ్రవరి 5వ తేదీనే దాడి చేయాలనుకున్నా... ఆరోజు మంచు కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో బాంబులతో నింపిన కారును దాదాపు పదిరోజుల పాటు కారు కొనుగోలు చేసిన సజ్జాద్ భట్ ఇంటిదగ్గరే ఉంచారు. ఇక చివరిగా 14వ తేదీన పోలీసుల మూవ్మెంట్ చూసి పుల్వామా హైవేపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సూసైడ్ బ్లాస్ట్ చేశారు. కేవలం గంట ముందు పాకిస్థాన్‌లో ఉన్న మసూద్ అజ్హర్ సోదరుడు తన చిన్నాన్న అమ్మార్ అల్వీకి ఫోన్ చేసి దాడి చేయాలన్న విషయంపై ఉమర్ ఫారూఖ్ పర్మిషన్ తీసుకున్నాడు. చివరి నిమిషంలో ఆదిల్ దార్ పారిపోతాడనే భయంతో...అక్కడికి హంజిలా జిహాదీని తోడుగా పంపించాడు. బయట ఉండి హంజిలా జిహాది బాంబు పేలే వరకు మొత్తం ఆపరేషన్ మానిటర్ చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న హంజిలా జిహాది... ఈ విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షిటీవీ -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ ఆర్మీ జవాను, ఓ పౌరుడు కూడా మరణించారు. పుల్వామాలో ముగ్గురు, సోపియాన్‌లోనూ మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్ వీరమరణం పొందగా, రయీస్ దార్ అనే పౌరుడు మరణించారు. అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. వీరు ముగ్గురూ తీవ్రమైన నేరచరిత్ర గలవారని, పలు ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక సోఫియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సిపాయి రోహిత్‌కు గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల వివరాలు తెలియలేదు. -
మళ్లీ భారత్‌పై దాడి జరిగితే..
వాషింగ్టన్: భారత్‌పై మరో ఉగ్రదాడి కనుక జరిగితే పాక్ ప్రమాదంలో పడినట్లేనని అమెరికా హెచ్చరించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని అమెరికా కోరుకుంటున్నట్లు బుధవారం వైట్‌హౌజ్‌లో సీనియర్ అధికారి చెప్పారు. ‘ఉగ్రసంస్థలపై పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భారత్‌పై మళ్లీ ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్‌కు అది తీవ్ర సమస్యాత్మకంగా మారుతుంది. దీనివల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది’అని ఆయన పేర్కొన్నారు. ‘గతంలో కూడా చాలా మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ అరెస్ట్ చేయడం చూశాం. కానీ కొద్ది నెలలకే వారిని విడుదల చేశారు. కొందరు ఉగ్రవాద నేతలు దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు ఇంకా అనుమతి ఉంది’అని చెప్పారు. ఆర్థికంగా అందుతున్న సహాయసహకారాలు కావాలో వద్దో పాకిస్తానే తేల్చుకోవాలని ఆయన సూచించారు. పాక్‌ను చైనా కాపాడొద్దు.. పాకిస్తాన్‌ను కాపాడటం చైనా బాధ్యత కాదని, దీనికి బదులు ప్రపంచ దేశాలతో కలసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్‌పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పెట్టిన ప్రతిపాదనను చైనా వీటో అధికారంతో అడ్డుకోవడం ఎంతో నిరాశ కలిగించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు సాంకేతిక కారణాలు చూపి నాలుగు సార్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. -
పాక్‌లో 22 ఉగ్ర శిబిరాలు
వాషింగ్టన్/ ఇస్లామాబాద్/జాబా: పాకిస్తాన్లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని, వాటిలో తొమ్మిది శిబిరాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవేనని సీనియర్ భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిరాలపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్లో ఉంటున్న ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. సరిహద్దు ఆవల నుంచి భారత దేశంలో మళ్లీ ఏమైనా ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగితే ప్రభుత్వం బాలాకోట్ తరహా దాడులు చేస్తుందని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రం పాకిస్తాన్. తీవ్రవాదులపై, తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. తన గడ్డపై 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నా వాటిపై ఏ చర్యా తీసుకోని పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో తీవ్రవాదులు లేరని బుకాయిస్తోందని, రెండు దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగానే.. బాలాకోట్‌పై భారత్ దాడి ఉగ్రవాద వ్యతిరేక చర్య అని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాక్ ఇలాగే చేస్తుందని, ఇందులో విశేషమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను గృహ నిర్బంధంలో ఉంచడమంటే వారికి విలాసాలు సమకూర్చడమేనని, పరిస్థితి సద్దుమణగగానే వారిని విడిచిపెడుతుందన్నారు. భారత్‌పై ఉగ్ర దాడికి పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని బాలాకోట్ దాడి ద్వారా భారత్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ట్రంప్ సర్కారు భారత్‌కు మద్దతిస్తోందన్నారు. పాక్ అభివృద్ధికి ఐఎంఎఫ్ 21 సార్లు ఆర్థిక సాయం చేస్తే ఆ దేశం ఇతర అవసరాలకు మళ్లించిందని పేర్కొన్నారు. చెట్లు కూల్చారని కేసు భారత వైమానిక దళానికి చెందిన గుర్తుతెలియని పైలట్లపై పాక్ కేసు వేసింది. బాలాకోట్‌లోని 19 చెట్లపై బాంబులు వేసి కూల్చివేసినందుకు శుక్రవారం ఈ కేసు వేసింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ అటవీ శాఖ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిసింది. కాగా, బాలాకోట్‌లోని ఐఏఎఫ్ దాడి జరిపిన మదరసా, ఇతర భవనాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పాకిస్తాన్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రాయిటర్స్‌కు చెందిన ప్రతినిధులు మూడుసార్లు ప్రయత్నించినా పాక్ బలగాలు అడ్డుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఆ మదరసా ఉన్న ప్రాంతానికి వెళ్లే దారులను మూసివేశారు. -
‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో వాటిల్లిన నష్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఐఏఎఫ్ అందుకు సంబంధించిన ఆధారాల్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. సంబంధించిన ఉపగ్రహ, రాడార్ చిత్రాలను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాడులకు వైమానిక దళం వార్హెడ్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ వివరాల్ని బుధవారం కొన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. బాంబులు ఉగ్రవాదుల ఆవాసాల పైకప్పులను చీల్చుకుంటూ వెళ్లి అంతర్గతంగా అపార నష్టం మిగిల్చినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిపిన వైమానిక దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ నష్టం అంత తీవ్రస్థాయిలో లేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అటవీ ప్రాంతంలో చెట్లు దెబ్బ తినడం తప్ప పెద్దగా నష్టమేమీ కలగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కాగా, భారత వైమానిక దళం దాడి తరువాత జైషే మహ్మద్ భవనాలకు అనుకున్నంత భారీ నష్టం జరగలేదని ప్లానెట్ ల్యాబ్స్ అనే అమెరికన్ ప్రైవేటు సంస్థ ఓ ఉపగ్రహ చిత్రం విడుదలచేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. బాలాకోట్ ఆపరేషన్‌పై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎందరు ఉగ్రవాదులు హతయ్యారో అధికారిక సమాచారం వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. వైమానిక దళ చర్యను రాజకీయం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దాడులతో నెరవేరిన లక్ష్యాలపై ఆధారాలతో వైమానిక దళం ప్రభుత్వానికి నివేదిక అందించడం గమనార్హం. 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు.. బాలాకోట్‌లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్‌లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి. దాడిలో మిరాజ్ విమానాలు ఇజ్రాయెల్ స్పైస్ బాంబుల్ని అత్యంత కచ్చితత్వంతో జారవిడవగా, అందులో 80% అనుకున్న లక్ష్యాల్ని తాకాయని తెలిపాయి. మిగిలిన 20% బాంబుల విజయ శాతం కచ్చితంగా ఎంతని అంచనా వేయలేకపోయామని చెప్పాయి. -
‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపుపై భారత వాయుసేన జరిపిన దాడికి కారణాలను వివరించాల్సిందిగా పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటన తర్వాత భారత్, పాక్‌ల మధ్య చోటుచేసుకున్న సంఘటనలను విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం వివరిం చారు. ఈ సందర్భంగా బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడి ఘటనను, ఆ తర్వాత పాకిస్తాన్ జెట్ విమానాలు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్నీ చెప్పారు. భారత్‌లోని మిలటరీ స్థావరాలపై దాడికి పాకిస్తాన్ వాయుసేన ప్రయత్నిం చిందని, అయితే భారత్ ఆ దేశ విమానాలను చాకచక్యంగా తిప్పికొట్టిందని తెలిపారు. ఆ విమానాలను వెనక్కి పంపే క్రమంలో భారత్‌కు చెందిన ఓ విమానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. పాక్‌లోని ఉగ్రవాద క్యాంపుపై దాడి చేయ డానికి గల కారణాలు చెప్పాలని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, ఈ విషయంలో రక్షణశాఖ సరైన సమాధానం చెప్పగలదని గోఖలే పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇస్లామిక్ సమాఖ్య సభ్య దేశాలు ఈ విషయంలో భారత్‌కు మద్దతివ్వడాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఐఏఎఫ్తో పాటు భద్రతా బలగాలను కమిటీ సభ్యులు కొనియాడారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్‌ను ఎంతో ఘనమైన, పరాక్రమమైన దాడిగా అభివర్ణించారు. పాక్ కాల్పుల ఉల్లంఘన.. ముగ్గురు దుర్మరణం జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ వరుసగా 8వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడింది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా సలోట్రి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్(24), ఆమె కుమారుడు ఫజాన్(5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె షబ్నమ్ చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయాలతో బయటపడ్డాడని వెల్లడించారు. పాక్ జరిపిన మోర్టార్ల దాడితో పూంచ్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యా యని పేర్కొన్నారు. అంతకుముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అక్తర్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు. పాక్ రేంజర్ల దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని తెలిపారు. గత వారం రోజు ల్లో పాక్ 60 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5కి.మీ పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఓ సరిహద్దు గ్రామంలో పాక్ మోర్టార్లు దాడిలో ధ్వంసమైన ఇల్లు వీరుడి తల్లిదండ్రులకు జేజేలు... న్యూఢిల్లీ: మృత్యువు ముంచుకొస్తోందని తెలిసినా కళ్లల్లో ధీరత్వం, అల్లరి మూక చావబాదుతున్నా స్థిరచిత్తంతో కూడిన మనో నిబ్బరం, మన దేశ రహస్యాలు శత్రువులకు చిక్కకూడదని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నమిలి మింగేసే సాహసం.. ఎంత మంది ఇలా చేయగలరు ? పాకిస్తాన్ చెరలో ఉన్న వైమానిక పైలట్ అభినందన్ వర్ధమాన్ నిజమైన హీరో. ఆ వీరుడి తల్లిదండ్రులకు ఢిల్లీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులు జేజేలు పలికారు. చెన్నై నుంచి బయల్దేరిన విమానం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాజధాని ఢిల్లీ చేరుకుంది. కన్న కొడుక్కి స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దుకు వెళ్లేందుకు అభినందన్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్, డాక్టర్ శోభ వర్ధమాన్లు ఆ విమానంలోనే ప్రయాణించారు. ఢిల్లీలో వారు విమానం దిగే ముందు తోటి ప్రయాణికులంతా గౌరవసూచకంగా లేచి కరతాళ ధ్వనులతో వర్ధమాన్ దంపతులే మొదట దిగడానికి దారిచ్చారు. వారు విమానంలో నడుస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. తామే తొందరగా దిగాలని, లగేజీని తీసుకోవాలనే ఆత్రుత ప్రయాణికుల్లో కనిపించలేదు. కొందరు యువతీ యువకులు అభినందన్ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కారాలు చేశారు. మరికొందరు వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వాయు మార్గంలో కుదరదు: పాక్ న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అత్తారీ–వాఘా సరిహద్దులో కాకుండా వాయు మార్గంలో అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన తరువాత, ఆయన్ని వాయు మార్గంలో అప్పగించాలని భారత్ కోరింది. కానీ అభినందన్‌ను రోడ్డు మార్గం ద్వారా అత్తారీ–వాఘా సరిహద్దులోనే అప్పగిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అంగీకరిస్తే అభినందన్‌ను తీసుకొచ్చేం దుకు ప్రత్యేక విమానం పంపాలని రక్షణ శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. మిగ్ విమానం కూలిపోయి పాకిస్తాన్ చెరలో ఉన్న మన పైలట్ అభినందన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. ఇస్లామాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకురావడం. రెండోది..వాఘా సరిహద్దులో స్వాగతం పలకడం. రెండో మార్గంలో అయితే వాఘా సరిహద్దులో జనసందోహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని, మీడియా కంటపడకుండా అభినందన్‌ను విమానంలో తీసుకురావడమే ఉత్తమమని భారత్ భావించింది. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. -
పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారిలా..
న్యూఢిల్లీ : మూడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు బుధవారం ఉదయం 9.58 గంటలకు భారత గగనతలంలోకి చొరబడ్డాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అందులో జేఎఫ్–17, ఎఫ్–16 లాంటి శక్తిమంతమైన విమానాలు ఉన్నాయి. క్రిష్ణగాటి, నంగి తేక్రిలోని ఆర్మీ స్థావరాలు, నారియన్‌లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ విమానాలు దాడులకు దిగాయి. అవి జారవిడిచిన బాంబులు జనావాసాలకు దూరంగా పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే స్పందించిన భారత వైమానిక దళం ప్రతీకార దాడులు ప్రారంభించింది. మిగ్–21, ఇతర యుద్ధ విమానాలతో ప్రత్యర్థికి దీటైన జవాబిచ్చింది. నౌషెరా, రాజౌరీలలోని కీలక స్థావరాలకు నష్టం కలగకుండా నిరోధించగలిగింది. మిగ్–21 బైసన్ విమానం కుప్పకూలే ముందు గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో పాకిస్తాన్ విమానం ఎఫ్–16ను నేలకూల్చింది. మన విమానాన్ని పాకిస్తాన్ విమానమే పేల్చి వేసిందా? లేదా క్షిపణితో దాడి చేశారా? అన్నది తెలియరాలేదు. ఉదయం 10.45 గంటలకు మిషన్ ముగిశాక అభినందన్ తప్ప మిగిలిన సిబ్బంది క్షేమంగా తిరిగొచ్చారు. -
మిరాజ్ సింగ్ రాథోడ్
పాకిస్తాన్ భూభాగంలోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత వైమానిక దళం (ఎఐఎఫ్) దాడిచేసిన తర్వాత దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. రాజస్తాన్‌లో ఓ జంటకు పుట్టిన బిడ్డకు ‘మిరాజ్ సింగ్ రాథోడ్’అని పేరు పెట్టుకున్నారు. పాక్ బాలాకోట్‌లోని జైషే శిక్షణా స్థావరంపై ఐఏఎఫ్ యుద్ధ విమానం దాడిచేసిన సమయంలోనే మంగళవారం ఉదయం 3.50 నిమిషాలకు బిడ్డ పుట్టడంతో యుద్ధ విమానం పేరు పెట్టుకున్నట్లు ఆ జంట తెలిపింది. రాజస్తాన్ నాగ్‌పూర్ జిల్లాలోని దబ్డా గ్రామానికి చెందిన మహవీర్ సింగ్, సోనమ్ సింగ్‌లు సైనిక కుటుంబ నేపథ్యం ఉన్నవారు. ఫ్రీ.. ఫ్రీ.. ఢిల్లీకి చెందిన మనోజ్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోపైన ‘ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ! పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న ఆనందంలో ఈ రోజు మీ సేవలో ఈ ఆటో తరిస్తుంది.. వీరుల పేరుతో.. సైనికులకు ప్రణామాలతో.. మోదీకి ధన్యవాదాలతో..’అన్న నినాదాలతో పోస్టర్ అంటించు కుని ఉచితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చా రు. ప్రైవేటు వ్యాపారులు కూడా ఆహార పదార్థాలపై, వివిధ ఉత్పత్తులపై ఒక రోజు ఆఫర్లు ప్రకటించారు. జైషే తీవ్రవాద శిబిరంపై ఐఏఎఫ్ దాడి తర్వాత రాజ్‌కోట్‌లోని ఒక మిఠాయి దుకాణం ఉచితంగా స్వీట్లు పంచింది. -
తేడా వస్తే తాట తీయండి..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దుల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాలపై భారత్ దాడి చేసిన అనంతరం దేశ భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్‌లతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్–పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టాలని హోం శాఖ ఆదేశించింది. ఇవిగో రుజువులు.. పుల్వామా దాడికి జైషే మహ్మదే కారణం న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో జైషే మహ్మద్ పాత్ర ఉందని చూపే ఆధారాలతోపాటు, పాక్‌లో నడుస్తున్న నిషేధిత ఉగ్ర సంస్థల వివరాలను భారత్ పాకిస్తాన్‌కు అందజేసింది. ‘పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్ హస్తం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలతోపాటు ఆ ఉగ్ర సంస్థ నేతలు, స్థావరాల వివరాలను పాక్‌కు అందజేశాం’అని విదేశాంగ శాఖ తెలిపింది. పాక్ తన భూభాగంలో కొనసాగుతున్న ఉగ్ర కార్యకలాపాలను తక్షణమే అడ్డుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. అమెరికా చేసిన పని మనమూ చేయగలం న్యూఢిల్లీ: భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను 2011లో అమెరికా దాడిచేసి మట్టుబెట్టిందని, భారత్‌కు అటువంటి సత్తా ఉందన్నారు. స్వచ్ఛగంగ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ లో మాట్లాడారు. ‘ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాకో విషయం గుర్తుకొస్తోంది. అబోటాబాద్‌లోని రహస్య స్థావరంలో దాక్కొన్న లాడెన్‌ను అమెరికన్ నేవీ షీల్స్ చాకచ క్యంగా మట్టుబెట్టగలిగినప్పుడు మనమెందుకు ఆ పని చేయలేం? గతంలో ఇటువంటి దా డులు కేవలం మన ఊహలకు మాత్రమే పరిమితమయ్యేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. శత్రువు ఎక్కడున్నా మట్టుబెట్టే సామర్థ్యం భారత్‌కూ ఉంది’అని జైట్లీ అన్నారు. -
పుల్వామా దాడిలో వాడింది ఇతడి కారునే
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14వ తేదీన జరిగిన ఆత్మాహుతి దాడిపై సాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ దాడిలో వినియోగించింది ‘మారుతి ఈకో’ కారు అని తేల్చిన జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) దాని యజమానిని కూడా గుర్తించింది. ఫోరెన్సిక్ నిపుణులు, వాహన నిపుణులు కలిసి చేసిన దర్యాప్తులో ఛాసిస్ నంబర్ ఆధారంగా ఆ కారు ఎవరి వద్ద ఉన్నదీ కనిపెట్టారు. అనంత్‌నాగ్ జిల్లా కేంద్రంలోని హెవెన్ కాలనీకి చెందిన జలీల్ అహ్మద్ హకానీ 2011లో మొదట ఈ కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఇది ఏడుగురి చేతులు మారి ఆఖరుకు దక్షిణ కశ్మీర్‌లోని బిజ్బెహారాకు చెందిన సజ్జాద్ భట్‌కు చేరింది. ఇతడు ఈ కారును ఫిబ్రవరి 4వ తేదీన అంటే దాడికి పది రోజుల ముందు కొనుగోలు చేశాడు. ఇతడిని షోపియాన్‌లోని సిరాజ్–ఉల్–ఉలూమ్ స్కూలు విద్యార్థిగా గుర్తించారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శనివారం అతడుండే ఇంటిపై దాడి చేశారు. కానీ, అతడు అక్కడ లేదు. ఆయుధాలు పట్టుకున్నట్లుగా ఉన్న అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండటంతో ఉగ్ర సంస్థ జైషే ముహమ్మద్‌లో చేరి ఉంటాడని భావిస్తున్నారు. జైషే ముహమ్మద్‌కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లగా 40 మంది జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
పాక్ ఆర్మీ ఆస్పత్రి నుంచే ఉగ్ర కుట్ర
ముంబై: పుల్వామా ఉగ్రదాడికి పాకిస్తాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సూచనలు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాకుండా రావల్పిండిలోని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచే తన పథకాన్ని అతడు అమలు చేశాడు. అనారోగ్య కారణాలతో కొన్ని నెలలుగా ఆర్మీ బేస్ ఆస్పత్రిలో మసూద్ చికిత్స తీసుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఆరు నెలలుగా ఉగ్ర సమావేశాలకు కూడా మసూద్ దూరంగా ఉంటున్నాడు. అయితే అక్కడి నుంచే పుల్వామా దాడికి ఆదేశాలిచ్చి భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించాడు. కేవలం ఎనిమిది రోజుల ముందే పుల్వామా ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. భద్రతా దళాల చేతిలో గతేడాది అక్టోబరులో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైంది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా యువతను రెచ్చగొట్టినట్టు బయటకు వచ్చింది. ఉగ్రవాదుల వల్ల శాంతికి విఘాతం కలుగుతోందని కొందరు మాట్లాడుతున్నారు. కానీ, మీరు మాత్రం సరిహద్దుల వెంబడి పోరాటం ఆపకండి అంటూ ఆ ఆడియోలో అన్నట్లు ఉంది. తన సోదరుడు కుమారుడు మహ్మద్ ఉమేర్, అబ్దుల్ రషీద్ ఘాజీల సాయంతో ఈ ఆడియో టేపు ద్వారా కశ్మీర్ లోయలోని యువకుల మనసులో విషబీజాల్ని నాటించాడు. శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి దాడులకు పాల్పడాలని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫర్బాద్లో జరిగిన సమావేశంలో చర్చించారని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక్కడ చదవండి: దాడి సూత్రధారి ఉమేర్ -
దాడి సూత్రధారి ఉమేర్
దాడికి జైషే మొహమ్మద్(జేఈఎం)కు చెందిన మహ్మద్ ఉమేర్ వ్యూహరచన చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉమేర్ అఫ్గాన్‌లో శిక్షణ పొందాడని, ఆ అనుభవంతో దాడికి పథక రచన చేశాడన్నారు. జైషే చీఫ్ మసూద్ అజహర్‌కు ఉమేర్ స్వయానా సోదరుడి కొడుకని చెప్పారు. దాడికి ఉమేర్ సూత్రధారి కాగా, మరో ఇద్దరు ఆర్డీఎక్స్ బాంబును రూపొందించారని ఎన్ఐఏ అధికారులు అన్నారు. బాంబును తయారుచేసిన ఇద్దరు ఇప్పటికే సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోకి వెళ్లిపోగా, ఉమేర్ మాత్రం దాడిని పర్యవేక్షించేందుకు పుల్వామాలోనే ఆగిపోయాడని తెలిపారు. అతని కోసం భద్రతాబలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయన్నారు. మసూద్ అజహర్‌కు బంధువైన హైదర్ 2018, అక్టోబర్‌లో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో, అతని స్థానంలో ఉమేర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. సిరియా, అఫ్గాన్ తరహాలో.. సిరియా, అఫ్గానిస్తాన్‌లోని అమెరికా బలగాలు లక్ష్యంగా తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు కారుతో పుల్వామా తరహాలో ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఉగ్రవాదుల దగ్గర శిక్షణ పొందిన ఉమేర్ దాన్ని కశ్మీర్లో పక్కాగా అమలు చేశాడు. ఈ ఆత్మాహుతి దాడి కుట్ర రషీద్ ఘజీ, కమ్రాన్ అనే ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ)తో కలిసి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జమ్మూ–కశ్మీర్ జాతీయ రహదారికి సమీపంలో పుల్వామా–పొంపోర్‌ల మధ్య 20–25 కిలోమీటర్ల ప్రాంతం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామనీ, గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు అధికారులు ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దాడి జరగడానికి 48 గంటల ముందు వరకూ ఇంటర్నెట్ ద్వారా వెళ్లిన కాల్స్, సందేశాలను విశ్లేషిస్తున్నారు. ఐఎస్ఐ మునీర్ ముద్ర! దాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ముద్ర కనిపిస్తోంది. పాక్ ఉత్తర ప్రాంతాల కమాండర్‌గా పనిచేసిన మునీర్‌కు కశ్మీర్‌పై పూర్తి అవగాహన ఉందని ఐఎస్ఐ నిపుణులు వెల్లడించారు. ఐఎస్ఐ చీఫ్‌గా మునీర్‌ను గత ఏడాది అక్టోబర్‌లో పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా నియమించారు. పుల్వామా దాడి జరిపిన జైషే మహ్మద్‌తోనే గతంలో కశ్మీర్లో ఐఎస్ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చేయించింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్షకు గురైన అఫ్జల్ గురు వర్ధంతి సమయంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇంతటి భారీ దాడి చేయించడానికి ఐఎస్ఐ కుట్ర పన్నిందని పాక్ నిఘా సంస్థ గురించి తెలిసిన వారంటున్నారు. కానీ, తన పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి దాడిని కొద్ది రోజులు వాయిదా వేసింది. ‘ఇది అమలు జరిగిన తీరులో ఐఎస్ఐ చీఫ్ ముద్ర కనిపిస్తోంది’ అని కేబినెట్ సెక్రెటేరియట్‌లో పనిచేసిన తిలక్ దేవాశర్ తెలిపారు. -
పాక్‌పై దౌత్య యుద్ధం
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ వంటి ఉగ్రమూకలకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, జపాన్ సహా 25 దేశాల దౌత్యాధికారులకు పుల్వామా ఉగ్రదాడి జరిగిన తీరును భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని విదేశీ విధానంగా మలుచుకున్న పాక్ వ్యవహారశైలిని ఎండగట్టింది. ఢిల్లీలోని తన కార్యాలయానికి రావాల్సిందిగా పాక్ హైకమిషనర్ సోహైల్ మహమూద్‌కు భారత విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. దాడిపై ఆయన తీవ్ర నిరసనను తెలియజేశారు. జైషేకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సత్వరం, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసూద్‌కు చైనా మద్దతు బీజింగ్: దాడికి పాల్పడిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ప్రపంచ ఉగ్రవాదిగా ముద్ర వేయించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు తెలపబోమని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడారు. మసూద్ అజార్‌పై ‘పంచ ఉగ్రవాది’ ముద్ర వేసే విషయంలో చైనా వైఖరేంటని ప్రశ్నించగా, ‘ఐరాస భద్రతా మండలి నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. జైషే మహ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే భద్రతా మండలి గుర్తించి ఆంక్షలు విధించింది’ అని చెప్పారు. మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు భద్రతా మండలిలో వీటో అధికారాలున్న చైనా అడ్డుతగులుతోంది. -
విషాదం..కూతురుని చూడకుండానే..
జైపూర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. రాజస్తాన్‌లోని జైపూర్ సమీపంలోని అమర్‌సర్‌లోని గోవింద్‌పురా గ్రామానికి చెందిన రోహితేష్ లంబా(27) సీఆర్పీఎఫ్ జవాన్‌గా సేవలందిస్తున్నారు. రోహితేష్ లంబా 25 ఏళ్లకే సీఆర్పీఎఫ్లో ఉద్యోగం రాగా, మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో రోహితేష్ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరీత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతరును చూడలేకపోయారు. బిడ్డను చూసేందుకు సెలవుపెట్టి గోవింద్‌పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతరును చూడడానికి వస్తాడనుకున్న భర్త ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది. రోహితేష్ లంబా వీరమరణంతో గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
సీఆర్పీఎఫ్ చూపిన జాలే.. ప్రాణాలు తీసింది
న్యూఢిల్లీ : భద్రతా బలగాలను తరలించే ముందు ఆ రూట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అణువణవు పరీక్షిస్తారు. రోడ్ ఓపెనింగ్ పార్టీలు ముందుగా వెళ్లి తనిఖీలు నిర్వహిస్తాయి. గురువారం జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడక ముందు కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ స్థానికులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో వారి వాహనాలను అనుమతించారు. ఇదే సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకుంది. స్థానికుని నెపంతో సర్వీస్ రోడ్డుపై నుంచి దూసుకొచ్చిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. గురువారం జరిగిన ఈ ఆత్మహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. (చదవండి : ఉగ్ర మారణహోమం) ఎవ్వరినీ వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్ -
ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై తీవ్రంగా కలత చెందిన గంభీర్.. ఆవేశంగా ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. (చదవండి: ఉగ్ర మారణహోమం) అయితే ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. భూగోళంపై ఉగ్రవాదానికి చోటు లేదని, ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’) భారత క్రికెటర్ల ట్వీట్స్.. ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కాకుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి. - గౌతం గంభీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం, వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇదో విచారకరమైన వార్త. ఈ దాడిలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. - వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఉగ్రదాడి వార్త తీవ్రంగా కలచి వేసింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - శిఖర్ ధావన్ జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం.. అనేక మంది జవాన్లు ప్రాణాలుకోల్పోవడం వినడానికి చాలా బాధగా ఉంది. ఈ దాడిచేసిన పిరికి పందలకు త్వరలోనే గుణపాఠం కలగాలని ప్రార్థిస్తున్నాను. - మహ్మద్ కైఫ్ ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు నా ఆలోచన, ప్రార్థన అంతా వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల గురించే. -సురేశ్ రైనా సీఆర్పీఎఫ్ జవాన్లపై పిరికిపందలు జరిపిన దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందడం బాధను కలిగిస్తోంది. ఈ బాధను వర్ణించడానికి పదాలు రావడం లేదు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి. - వీరేంద్ర సెహ్వాగ్ -
‘అక్కడ శవాలు పడున్నాయి’
-
వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరుగుతుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సెల్ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో దాడి జరిగిన ప్రాంతంలోని భయానక పరిస్థితులను, నష్టాన్ని కళ్లకు కడుతుంది. వీడియోలో ‘చంపేశాడు, చంపేశాడు.. అక్కడ శవాలు పడి ఉన్నాయనే’ మాటలు వినిపిస్తున్నాయి. బహుశా వీడియో తీసిన వ్యక్తి దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని.. ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. సెల్ఫోన్లో తీసిన ఈ వీడియోలో పేలుడు జరిగిన ప్రాంతం, చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు, తుక్కుతుక్కయిన వాహనాలు దాడి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉగ్రవాదుల మౌలిక వసతులు కూల్చండి పాక్‌కు సూచించిన భారత్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని ఆపాలని, తన భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల మౌలిక వసతుల్ని కూల్చివేయాలని భారత్ పాకిస్తాన్‌కు సూచించింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌తో పాటు ఇతర ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. పుల్వామా దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు నిషేధించిన, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే ఈ హేయమైన దాడికి పాల్పడిందని పేర్కొంది. జైషే చీఫ్ అయిన మసూద్ తన ఉగ్ర కార్యకలాపాల్ని విస్తరించడానికి, భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించింది. జాతీయ భద్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడమని తేల్చిచెప్పింది. -
సీఆర్పీఎఫ్ రాకపై సమాచారం లీక్
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లడంపై సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండొచ్చని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని విధుల్లో చేరేందుకు వస్తున్నవారేనని వెల్లడించారు. శ్రీనగర్‌కు వెళ్లే సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను పాటించాయో? లేదో? విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాల కదలికలు జరిగినప్పుడు ఆ విషయం చాలామందికి తెలుస్తుందని పేర్కొన్నారు. వాళ్లలో కొందరు ఉగ్రవాదులకు బలగాల రాకపై సమాచారం అందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ రహదారిపై గత రెండ్రోజులుగా రాకపోకలు లేకపోవడంతో కాన్వాయ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు బయలుదేరారనీ, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. -
12 కి.మీ వరకూ పేలుడు శబ్దం
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో గురువారం జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో స్థానికులు వణికిపోయారు. లెత్‌పొరా మార్కెట్‌కు 300 మీటర్ల దూరంలోనే ఈ దాడి చోటుచేసుకోవడంతో దుకాణదారులు షట్టర్లు మూసేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఆత్మాహుతి దాడి సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్దం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఉన్న శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం పేలుడు శబ్దం వినిపించదన్నారు. పేలుడు తీవ్రతకు ఉగ్రవాది ఆదిల్‌తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయని జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిని గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. ఈ ఘటనలో జవాన్ల బస్సుతో పాటు స్కార్పియో వాహనం నామరూపాలు లేకుండా పోయాయన్నారు. 2001, అక్టోబర్ 1న జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. తాజాగా ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 43 మంది జవాన్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కశ్మీర్లో ఉగ్రదాడులు 1999 నుంచి ఇప్పటివరకు భద్రతా దళాలపై జరిపిన ప్రధాన దాడులు.. ► 2017 ఆగస్ట్ 26: పుల్వామా జిల్లా పోలీస్ లైన్స్‌పై ఉగ్రదాడి. ఎనిమిది మంది భద్రత సిబ్బంది మృతి. ► 2016 నవంబర్ 29: నాగ్రోటా వద్ద గల సైనిక ఆయుధాగారంపై దాడి. ఏడుగురు సైనికులు మరణించారు. ► 2016 సెప్టెంబర్ 18: బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఆర్మీ శిబిరంపై నలుగురు పాక్ తీవ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడి చేసింది. ► 2016 జూన్ 25: శ్రీనగర్–జమ్మూ హైవేపై పాంపోర్ వద్ద సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రకాల్పులు. ఎనిమిది మంది జవాన్ల మృతి. ► 2016 జూన్ 3: పాంపోర్‌లో సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి. దాడి తర్వాత ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు. రెండ్రోజులు కొనసాగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు. ► 2014 డిసెంబర్ 5: మొహ్రాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి. పది మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ► 2013 జూన్ 24: హైదర్పోరా వద్ద సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి. ఎనిమిది మంది సైనికుల మృతి. ► 2008 జూలై 19: శ్రీనగర్–బారాముల్లా రహదారిపై నరబల్ వద్ద రోడ్డు పక్కన ఐఈడీ అమర్చి పేల్చడంతో పది మంది సైనికులు చనిపోయారు. ► 2005 నవంబర్ 2: నౌగమ్‌లో నాటి సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ఇంటి దగ్గర్లో కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల మరణం. ► 2005 జూలై 20: భద్రతా దళాల కాన్వాయ్‌పై కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరుల దుర్మరణం. ► 2005 జూన్ 24: శ్రీనగర్ శివార్లలో కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు. తొమ్మిది మంది సైనికుల మృతి. ► 2004 ఏప్రిల్ 8: బారాముల్లా జిల్లాలోని ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై గ్రెనేడ్లతో దాడి. 11 మంది చనిపోయారు. ► 2003 జులై 22: అక్నూర్లో సైనిక శిబిరంపై దాడి. బ్రిగేడియర్సహా ఎనిమిది మంది సైనికుల మరణం. ► 2003 జూన్ 28: సన్జాన్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి. 12 మంది సైనికుల దుర్మరణం. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం. ► 2002 మే 14: కలుచాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు. ► 2001 నవంబర్ 17: రాంబన్‌లోని భద్రతా దళ స్థావరంపై ఉగ్రదాడి. 10 మంది సైనికులు మరణించారు. నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ► 2001 అక్టోబర్ 1: శ్రీనగర్‌లోని పాత శాసనసభ కాంప్లెక్స్ వెలుపల కారు బాంబు పేలుడు. 38 మంది దుర్మరణం. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ► 2000 ఆగస్ట్ 10: శ్రీనగర్‌లోని రెసిడెన్సీ రోడ్లో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడి, కారు బాంబు పేలుడు. 11 మంది సైనికులు, ఓ జర్నలిస్టు మరణించారు. ► 2000 ఏప్రిల్ 19: శ్రీనగర్‌లోని బాదామిబాగ్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద తొలిసారిగా కారుతో ఆత్మాహుతి దాడి. ఇద్దరు సైనికులు మరణించారు. ► 1999 నవంబర్ 3: బాదామిబాగ్ ఆర్మీ హెడ్‌క్వార్టర్ వద్ద దాడి చేసి 10 మంది సైనికులను చంపేశారు. -
ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు
న్యూఢిల్లీ: సైనిక బలగాలపై దాడులకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగినవే. పుల్వామాలో జరిగిన దాడిలో ఉగ్రవాది 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి జవాన్ల వాహనశ్రేణి వద్ద పేల్చుకోవడం వారి కొత్త వ్యూహాన్ని సూచిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఇలాంటి తరహా పేలుళ్లు చివరిసారిగా 2001లో సంభవించాయి. అప్పుడు అసెంబ్లీ సమీపంలో కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఉగ్రవాదులు 38 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న నౌషెరా సెక్టార్లో జరిగిన ఐఈడీ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. చాన్నాళ్లు తరువాత కశ్మీర్లో ఐఈడీ దాడులు పెరగడంపై ఆర్మీ ఆందోళన చెందుతోంది. గతేడాది జనవరిలో బారాముల్లాలో చోటుచేసుకున్న ఇలాంటి దాడిలో నలుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు భద్రతా బలగాలకు కొత్తేం కాదు. కానీ కశ్మీర్లో తక్కువ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల వ్యూహాలు వేరుగా ఉంటాయి. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారు. ఇటీవల అగ్రస్థాయి ఉగ్రవాదుల్ని వరసగా మట్టుపెట్టడంతో, మిగిలిన టెర్రరిస్టుల్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ పెరిగిందని, ఇందులో భాగంగానే ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వేర్పాటువాదులకు చేరువకావాలనుకుంటున్న పాకిస్తాన్ ప్రయత్నాలను భారత్ అడ్డుకోవడం కూడా ఉగ్రవాదుల వ్యూహాల మార్పునకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌ను పాక్‌లో కలపడమే లక్ష్యం భారత్‌లో పలు ఉగ్రదాడులకు జైషే స్కెచ్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పాల్పడిన జైషే మొహమ్మద్‌ను మౌలానా మసూద్ అజహర్(50) 2000, మార్చి నెలలో ప్రారంభించాడు. కశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టి పాకిస్తాన్లో కలపాలన్న ఏకైక లక్ష్యంతో ఈ సంస్థ పనిచేసేది. పాక్ ప్రోద్బలంతో జైషే ఉగ్రవాదులు భారత్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సైనికులపై దాడులకు పాల్పడ్డారు. సొంత దేశంలోని ముస్లిమేతరులను ఈ ఉగ్రసంస్థ విడిచిపెట్టలేదు. 2001, అక్టోబర్ 1న కశ్మీర్ అసెంబ్లీపై దాడికి పాల్పడి 38 మందిని బలికొనడంతో జైషే మొహమ్మద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని తామే చేశామని తొలుత గర్వంగా ప్రకటించుకున్న జైషే సంస్థ.. ఆ తర్వాత తమకు సంబంధం లేదని బుకాయించింది. అదే ఏడాది భారత పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి దాడిచేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ జైషే మొహమ్మద్‌ను 2002లో నిషేధించింది. అయినప్పటికీ ఇతర సంస్థల ముసుగులో జైషే మొహమ్మద్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ జైషే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మసూద్ అజహర్ మేనల్లుడు, స్నైపర్ ఉస్మాన్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి మసూద్ తెగబడ్డాడని నిపుణులు భావిస్తున్నారు. -
ఉగ్ర మారణహోమం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్‌లోని 92 బేస్ బదామీగఢ్ ఆర్మీ కంటోన్మెంట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. విధుల్లో మళ్లీ చేరేందుకు వెళుతుండగా.. మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతాబలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతున్నాయి. రెప్పపాటులో ఉగ్రవాది కారుతో బస్సును ఢీకొట్టాడు. భద్రతాబలగాలు తేరుకునేలోపే తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఎస్జీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని సాక్ష్యాలు, పేలుడు అవశేషాలను సేకరించారు. ఉగ్రదాడి జరగడంతో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిహార్ పర్యటను రద్దుచేసుకుని వెనుదిరగగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబా భూటాన్ పర్యటన నుంచి అర్ధంతరంగా తిరుగుప్రయాణమయ్యారు. 2016, సెప్టెంబర్ 18న కశ్మీర్లో ఉడీ ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉడీ ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మూసేయడంతో భారీ కాన్వాయ్ ప్రమాద విషయమై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆర్.ఆర్. భట్నాగర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వాతావరణం బాగోలేకపోవడంతో గత రెండ్రోజులగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ఉగ్రవాదుల ఆత్మాహుతిదాడికి గురైన బస్సులో 39 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందినవారని పేర్కొన్నారు. దాడి సందర్భంగా జవాన్ల వాహనాలపై కాల్పులు జరిగాయన్నారు. సాధారణంగా సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో వెయ్యి మంది జవాన్లు మాత్రమే ఉంటారనీ, కానీ గత రెండ్రోజులుగా రహదారి మూతపడటంతో ఒకేసారి భారీ సంఖ్యలో 2,547 మంది జవాన్లు శ్రీనగర్‌కు బయలుదేరారని తెలిపారు. ఈ ఘటనపైకశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఉగ్రదాడి తీవ్రత దృష్ట్యా కశ్మీర్ పోలీసులతోపాటు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు ఈ విచారణలో పాలుపంచుకుంటారని భట్నాగర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో శాంతిభద్రతలను సమీక్షించేందుకు శుక్రవారం కేంద్ర భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఖండించిన అంతర్జాతీయ సమాజం పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి, అమెరికా, రష్యాతోపాటు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఖండించాయి. పుల్వామా దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారకులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతోపాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగాలు వృథా కావు జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై జరిగిన దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మన భద్రతా బలగాల త్యాగాలు వృథా కావని ఆయన అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిలో వీరమరణం పొందినవారి కుటుంబాలకు జాతి మొత్తం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన అనంతర పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌తోపాటు అధికారులతో చర్చించానన్నారు. ‘పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి అత్యంత హేయం. పిరికిపందలు పాల్పడిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సాహసవంతులైన మన భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా కావు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రదాడి తరువాత మంటల్లో చిక్కుకున్న ఆర్మీ వాహనాలు. సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న తోటి సైనికులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది ఎవరేమన్నారంటే.. ప్రతీకారం తీర్చుకుంటాం పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని హోం మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. హింసాత్మక చర్యల ద్వారా శాంతికి భగ్నం కలిగించాలనుకునే శక్తుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఇందుకు తగినవిధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవానుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. - హోం మంత్రి రాజ్‌నాథ్ ‘కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉగ్ర మూకలపై జరిగే పోరాటంలో జాతి మొత్తం ఐక్యంగా నిలబడుతుంది. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దుష్ట, ఉగ్ర మూకలపై జరిగే పోరులో జాతి మొత్తం ఒక్కటిగా నిలబడుతుంది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బలగాలపై ఉగ్రదాడిపై తీవ్ర వేదనకు గురయ్యా. పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అమర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ ధోరణి అవలంభిస్తోంది. – రాహుల్ గాంధీ ‘కశ్మీర్లో భారత్ బలగాలపై జరిగిన దాడిని అమెరికా దౌత్య కార్యాలయం ఖండిస్తోంది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్ చేసే పోరాటానికి అమెరికా వెన్నంటి ఉంటుంది’ –అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ ‘అవంతిపొరాలో 30 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ తీవ్రమైన ఉగ్రవాద చర్యను ఖండించడానికి ఏ పదాలూ సరిపోవు. ఈ మూర్ఖత్వపు చర్యలు ఆగిపోయేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి?’ –జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ‘కశ్మీర్లో బలగాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. ఇది యావత్ దేశానికే విషాద దుర్ఘటన. జవాన్ల కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం చర్యలు తీసుకోవాలి ‘పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల వేదన తీరనిది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వీరుల కుటుంబాలకు కాంగ్రెస్‌తోపాటు దేశం యావత్తూ అండగా నిలుస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గురువారం లక్నోలో తన మొట్ట మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె అమర జవాన్ల మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. - ప్రియాంకా గాంధీ -
పాక్ బృందానికి వీసా మంజూరు
‘పఠాన్‌కోట్’పై దర్యాప్తునకు జేఐటీ ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ వైమానిక క్షేత్రంపై పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు పాక్ బృందం భారత్‌కు వస్తోంది. పాక్ సంయుక్త దర్యాప్తు బృందం(జేఐటీ)లోని ఐదుగురు అధికారులకు భారత్ వీసా మంజూరుచేసింది. వీరు భారత్‌కు వెళ్లి పఠాన్‌కోట్ దాడి సంబంధించిన ఆధారాలు సేకరిస్తారని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి చెప్పారు. ఈనెల 27న భారత్‌కు బయలుదేరుతున్న ఈ బృందంలో మిలిటరీ ఇంటెలిజెన్స్‌తోపాటు పోలీసు అధికారులున్నారు. 28న వీరు ఘటనాస్థలికి వెళ్లనున్నారు. పాక్ పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) చీఫ్ అయిన అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముహమ్మద్ తాహిర్ రాయ్ ఈ బృందానికి నేతృత్వ వహిస్తారు. ఇటీవల కఠ్మాండులో జరిగిన సార్క్ మంత్రుల సమావేశాల్లో భారత్, పాక్ విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, అజీజ్‌ల భేటీలో జేఐటీ బృందం రాకకు భారత్ అనుమతించింది. ఎస్పీ సల్వీందర్కు ఎన్ఐఏ తాజా సమన్లు న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి కేసులో పంజాబ్ పోలీసు ఎస్పీ సల్వీందర్ సింగ్ తో పాటు మరో ఇద్దరికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తాజాగా సమన్లు జారీచేసింది. సాధారణ దర్యాప్తులో భాగంగానే సింగ్‌తోపాటు అతని స్నేహితుడు రాజేష్ వర్మ, వంటమనిషి మదన్ గోపాల్‌ను తమ ముందు హాజరవ్వాలని ఆదేశించామని ఎన్ఐఏ వర్గాలు చెప్పాయి. -
మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చండి: భారత్
న్యూయార్క్: ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్, పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కుట్రదారు మసూద్ అజార్ పేరును భద్రతా మండలి ఆంక్షల జాబితాలో చేర్చాలని భారత్ ఐరాసను కోరింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, దౌత్యవేత్త సయీద్ అక్బరుద్దీన్ ఈమేరకు న్యూజిలాండ్ రాయబారి, 1267 అల్ కాయిదా ఆంక్షల కమిటీ అధ్యక్షుడు జెరార్డ్ జాకౌబ్స్ వాన్ బోహెమెన్కు ఈమేరకు లేఖరాశారు. జైషే సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు, పఠాన్‌కోట్ దాడి ఘటనకు ఆ సంస్థ చీఫ్ మసూద్ ప్రమేయమున్నట్లు పటిష్ట ఆధారాలు చూపుతూ దీన్ని రాశారు. మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చకుంటే భారత్‌తోపాటు దక్షిణాసియాలోని ఇతర దేశాలకు ముప్పు ఉంటుందని స్పష్టంచేశారు.