jntuk
-
పలువురు వీసీల రాజీనామా
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామాతిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.వైదొలిగిన జేఎన్టీయూకే వీసీజేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఏపీ ఈఏపీ సెట్–2024 షెడ్యూల్ విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్–2024 దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు చెప్పారు. దరఖాస్తులకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకూ, రూ.1,000 ఫైన్‌తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్‌తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్‌తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మే 13–16 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 17–19 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో 47, హైదరాబాద్‌లో 1, సికింద్రాబాద్‌లో 1 చొప్పున ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షకు ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివరాలకు 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
‘జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ టాప్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమి షన్ చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. ఈ వి ద్యా విధానాన్ని అమలు చేయాలనుకున్న తొలినుంచి ప్రభుత్వం తోడ్పాటు, సహకారం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చాలా పటిష్టంగా ఉందని ప్రశంసించారు. జేఎన్టీయూ(కే)లో 2 రోజులపాటు జరిగే ఉన్నత విద్య ప్రణాళిక 5వ సమావేశం శనివారం జేఎన్టీయూ ప్రాంగణంలో ప్రారంభమైంది. దీనికి హాజరైన జగదీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. జాతీయ విద్యా విధానంతో 2030 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ విద్యావిధానం అమలు చేయడంలో రా ష్ట్రాలు, స్థానిక సంస్థలు, పాఠశాలల స్థాయి లో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 600 వర్సిటీలలో రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వివిధ రకాల పరిశోధనల కోసం రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వినియోగించేందుకు యూజీసీ కార్యచరణ ప్రణాళిక రూపొందించిందని జగదీష్ కుమార్ చెప్పారు. యువ తకు ఉద్యోగవకాశాలు రావాలంటే నైపుణ్యం ఉండాల్సిందేనన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి బాగుందన్నారు. ఈ యూనివర్సిటీల ఏర్పాటుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ–వర్సిటీలలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులను చే ర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు -
జేఎన్టీయూకే ప్లాటినం జూబ్లీ; రారండోయ్.. వేడుక చేద్దాం..
రెండేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైన జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 15, 16 తేదీల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల 1946లో ఉమ్మడి మద్రాస్‌లో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 1972 జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ ఏర్పడ్డాక కాకినాడ, అనంతపురం, హైదరాబాద్ ఈ మూడు ఇంజినీరింగ్ కళాశాలలు హైదరాబాద్ యూనివర్సిటీ అధీనంలో ఉండేవి. తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆగస్టు 2008లో జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దాని అధీనంలోకి జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలను తీసుకువచ్చారు. కళాశాల ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహణకు సిద్ధం కాగా.. 2020 జూలై 16న ఉన్నత విద్యామండలి చైర్మన్ కే.హేమచంద్రారెడ్డి, మెట్రో రైల్ మాజీ ఎండీ ఈ.శ్రీధర్, వర్చువల్ విధానంలో వీటిని ప్రారంభించారు. అప్పటి వీసీ రామలింగరాజు, ప్రిన్సిపాల్ బాలకృష్ణ కళాశాల ఆవరణలో ప్రారంభించారు. రెండేళ్ల పాటు విద్యార్థులకు అకడమిక్ వర్క్ షాపులు, ప్రముఖులతో సెమినార్లు నిర్వహిస్తూ వచ్చారు. పూర్వ విద్యార్థులు.. ప్రముఖులు ఇదే కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి ప్రముఖ స్థానాల్లో ఉన్న వారు ఉన్నారు. బెల్ సీఏండీ శాస్త్రి, శాంత బయోటెక్ అధినేత పద్మ విభూషణ్ వరప్రసాద్‌రెడ్డి, మెట్రో సీఏండీ పద్మవిభూషణ్ శ్రీధర్, ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఐఏఎస్‌లు కృష్ణబాబు, రవిచంద్ర, జిల్లాకు చెందిన దివంగత ఎస్వీప్రసాద్ మాజీ ఐఏఎస్, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర రంగ సంస్థల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు, శాసన సభ్యులు ఉన్నారు. జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ వీసీగా చేసిన డాక్టర్ రామలింగరాజు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ఉదయభాస్కర్ ఇదే కళాశాలలో అభ్యసించారు. రెండు రోజుల పాటు కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా వర్సిటీ అతిథి గృహం వద్ద వాటర్ ఫాల్ పైలాన్ నిర్మిస్తున్నారు. తొలిరోజు పైలాన్ ఆవిష్కరణ, నక్షత్ర వనం సందర్శన, పరిచయాలు, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింగరావు ప్రవచనం ఏర్పాటు చేశారు. రెండోరోజు క్రీడామైదానంలో పూర్వ విద్యార్థులు దాదాపు రూ.రెండు కోట్లతో నిర్మించే అతిథి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పూర్వ విద్యార్థులు కళాశాలలో వివిధ విభాగాలకు, పలు ల్యాబ్‌ల నిర్మాణాలకు, కళాశాల అభివృద్ధికి సహకరించనున్నారు. ఏర్పాట్లు పూర్తి ఇంజినీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల నిర్వహణకు కమిటీలు వేశాం. అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఇదే కళాశాలలో అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరిన వారు ఉన్నారు. వారి సహకారంతో కళాశాలను మరింత అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపాం. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం స్పందించి కళాశాల అభివృద్ధికి చేయూత ఇస్తామంటున్నారు. నా హాయాంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది. – డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వీసీ జేఎన్టీయూకే -
25లోగా కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల అఫిలియేషన్(గుర్తింపు) ప్రక్రియను ఈనెల 25కల్లా పూర్తి చేయాలని కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులను ఏపీ ఈఏపీ సెట్ కమిటీ ఆదేశించింది. ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించేందుకు కమిటీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైంది. ఏపీ ఈఏపీ సెట్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎమ్.సుధీర్‌రెడ్డి, వర్సిటీల అధికారులు, కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. కానీ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియను యూనివర్సిటీలు ఇంకా పూర్తి చేయకపోవడంతో షెడ్యూల్ ఖరారు చేయలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న 272 ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల్లోని 1,39,862 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేసి చాలా రోజులయ్యింది. ఈ కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనల మేరకు నిర్ణీత సదుపాయాలు, సిబ్బంది ఉన్నారో, లేదో తనిఖీ చేసిన తర్వాత వర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులు రోజులు గడుస్తున్నా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఏఐసీటీఈ క్యాలెండర్ ప్రకారం ఇంజినీరింగ్ ప్రవేశాలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి తరగతులను ఆరంభించాలి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్ నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. అయినా కాలేజీల అఫిలియేషన్‌ను జేఎన్టీయూలు పూర్తి చేయకపోవడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుపెట్టలేకపోతున్నారు. వేగంగా పూర్తి చేయండి.. తాత్సారం వద్దు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి చాలా రోజులైందని, అక్టోబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నందున కాలేజీల అఫిలియేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని.. తాత్సారం చేయొద్దని సెట్ కమిటీ సమావేశంలో కన్వీనర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికల్లా జేఎన్టీయూ అధికారులు తమ పరిధిలోని కాలేజీల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం కాలేజీలకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. -
విమెన్ ఎంపవర్మెంట్ ‘డల్’
సాక్షి, బాలాజీచెరువు (తూర్పు గోదావరి): విద్యాసంవత్సరం ప్రారంభంలో కళాశాలల్లో ర్యాగింగ్, మహిళలపై అత్యాచారాలు, వేధింపులపై సదస్సులు హడావుడిగా నడుస్తాయి. ఆ రెండు నెలలు గడిస్తే మళ్లీ వాటి వంక చూసేవారు కనపడరు. పీఆర్జీ డిగ్రీ కళాశాలలో ఏడాదిన్నర క్రితం ఇదే నెలలో బోటనీ ఒప్పంద అధ్యాపకుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఓ డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ప్రేమించి మోసగించిన విషయం తెలిసిందే. ఆ ఏడాది ఇది పెద్ద దుమారాన్ని లేపగా తాజాగా గతేడాది పేరు ప్రఖ్యాతులు కలిగిన జేఎన్టీయూకేలో ప్రొఫెసర్ ఏకంగా 20 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడి కటకటాలపాలయ్యాడు. దీంతో విద్యాలయాల్లో విద్యార్థినులు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో చాలామంది పదవ తరగతితో తమ పిల్లలను విద్య మాన్పించి వివాహాలు చేసేవారు. అయితే మారిన కాలానికనుగుణంగా మార్పు వచ్చి ఇప్పుడు తమ పిల్లలను కనీసం డిగ్రీ వరకూ చదివిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇలా విద్యార్థినులకు రక్షణ లేకపోతే తల్లిదండ్రులు భయపడతారు. కాకినాడ నగరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది విద్యార్థినులు ఇంటర్మీడియెట్, డిగ్రీతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్ అభ్యసించడానికి వస్తున్నారు. ఇటువంటి సంఘటనలు కళాశాలల్లో జరుగుతున్న నేపథ్యంలో తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు వెనుకడుగేస్తున్నారు. సదస్సులు దేనికి ? అంతర్జాతీయ మహిళా సదస్సులు నిర్వహించిన గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో లైంగిక వేధింపులకు గురై న్యాయమో రామచంద్రా..! అంటూ గగ్గోలు పెట్టినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కళాశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయలేని ప్రభుత్వం మహిళా సదస్సులు దేనికోసం నిర్వహించిందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రోడ్డుపైకి వచ్చి మీడియాతో పాటు పత్రికల్లోకి ఎక్కితేనే గానీ తమకు న్యాయం జరగడం లేదని అంటున్నారు. నిరుపయోగంగా విమెన్ ఎంపవర్మెంట్ సెల్లు జేఎన్టీయూ కాకినాడ వర్సిటీతో పాటు నగరంలో పీఆర్ డిగ్రీ కళాశాల, అన్నవరం సత్యవతీదేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టరేట్లు, విమెన్ సెల్లు సంవత్సరంలో నాలుగైదుసార్లు మహిళా చైతన్యసదస్సులు, మహిళా దినోత్సవం నిర్వహించడానికి తప్ప వారికి ఏమాత్రం సహకరించడం లేదు. ఒక్క జేఎన్టీయూకే కాకుండా నగరంలో ఉన్న చాలా కళాశాలల్లో ఈ రకమైన వేధింపులు ఉన్నాయని, తమ పరువు ఎక్కడ పోతుందోనని భయపడి బయటకు రావడం మానేస్తున్నారని తెలుస్తోంది. తండ్రి వయసు కలిగిన అధ్యాపకులు ఇలా విద్యార్థినులపై మనసు పడటం ఏమిటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మహిళా రక్షణ సెల్ సమర్థవంతగా పనిచేయాలి మార్పు ప్రారంభం కావలసిన కళాశాలల్లోనే రక్షణ లేకపోవడం బాధాకరం. కళాశాలలతో పాటు వర్సిటీల్లో మహిళల సమస్యలతో పాటు వారి రక్షణకు ఏర్పాటు చేసిన విమెన్ ఎంపవర్మెంట్ సెల్లు సమర్థవంతంగా పనిచేయాలి. దీనిలోని సభ్యులు వాటిని తమలాంటి ఆడపిల్లల కోసమే ఏర్పాటు చేశారన్న విషయం గ్రహించి ఏ మాత్రం కుల,వర్గ వివక్ష చూపకుండా మహిళలందరికీ సమన్యాయం చేసేలా కృషిచేయాలి. రోడ్డెక్కితేనే న్యాయం జరుగుతుందన్న భావన వారిలో తొలగించి అందరికీ న్యాయం చేయాలి. ముఖ్యంగా మహిళా సంఘాలు ఇటువంటి సంఘటనల జరిగినప్పుడు విద్యార్థినులకు మద్దతుగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చూడాలి. –డాక్టర్ ఆర్.సత్యభామ, మహిళా సంఘం నాయకురాలు -
లైబ్రరీ సైన్సు.. ఆ ఒక్కటీ అడక్కు..
గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు, సమాజాభివృద్ధి వాటి ద్వారానే సాధ్యమంటూ సమావేశాల్లో ప్రసంగాలు చేసే అధికారులు.. వాటిపై శ్రద్ధ చూపడం లేదు. ఆ కోర్సు అభ్యసించి వాటిపై పరిశోధన చేయాలనుకునే వారి ఆశలను కూడా అడియాసలు చేస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్‌లో నిర్వహించే గ్రంథాలయ వార్షికోత్సవాల్లో తప్ప మిగిలిన కాలంలో అసలు గ్రంథాలయాల వ్యవస్థపైనే దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూకేలోని గ్రంథాలయ విభాగం ప్రస్తుతం పూర్తిగా మరుగున పడిపోయే పరిస్థితి ఏర్పడింది. సాక్షి, బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీకి 2012లో శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల విభాగంలో సుమారు.5 కోట్లతో భవనాన్ని నిర్మించారు. లైబ్రరీని 2014లో ప్రారంభించారు. సువిశాలంగా, దాదాపు 25 అడుగుల ఎత్తులో నిర్మించిన గ్రంథాలయానికి లిఫ్ట్ సౌకర్యం కల్పించలేదు. నేటికీ జనరేటర్ తదితర కనీస వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో.. కరెంట్ పోతే చీకట్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పరిశోధన కనుమరుగు ఎనిమిది జిల్లాల్లోని 264 ఇంజినీరింగ్ కళాశాలలకు వేదికగా ఉన్న జేఎన్టీయూకేలో గ్రంథాలయ విభాగంలో పరిశోధన ఇక నుంచి కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. ఇప్పటివరకూ పీహెచ్‌డీలు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే స్వయంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రతిభ కలిగిన వారికి సీట్లు కల్పించేవారు. అయితే గతేడాది నుంచి పీహెచ్‌డీల ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రంలోని 14 వర్సిటీలకు కామన్‌గా ఏపీఆర్‌సెట్ పేరుతో ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంచుకున్న వర్సిటీలో ప్రవేశాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. లైబ్రరీ సైన్సు విభాగం తప్ప.. జేఎన్టీయూకే ఎలక్ట్రికల్, సివిల్, మ్యాథ్స్ వంటి పది విభాగాల్లో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గత మే, జూన్ నెలల్లో అభ్యర్థులకు సమాచారం అందింది. అయితే లైబ్రరీ సైన్స్ విభాగంలో ఉత్తీర్ణత చెంది జేఎన్టీయూకే ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రం వర్సిటీలో లైబ్రరీలో పీహెచ్డీ లేదని అధికారులు చెప్పడంతో అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షకు దాదాపు 20 వేల మంది హాజరైతే 1,500 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో దాదాపు 100 మంది లోపు లైబ్రరీ సైన్స్‌కు హాజరయ్యారు. ఇప్పుడు జేఎన్టీయూకే పరిధిలో ఈ కోర్సును నిర్వహించకపోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జేఎన్టీయూకే ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ లైబ్రరీ సైన్స్ విభాగంలో 14 మందికి అడ్మిషన్లు కల్పించగా ఇద్దరూ డాక్టరేట్లు పొందారు.మరో ముగ్గురు చివరి దశలో ఉన్నారు. ఈ విషయంపై రిజిస్ట్రార్ సుబ్బారావును వివరణ కోరగా.. పూర్తి స్ధాయి ఫ్యాకల్టీలతో పాటు పీజీ స్థాయిలో విభాగం తప్పనిసరిగా ఉంటేనే పీహెచ్‌డీల ప్రవేశాలు ఉంటాయన్నారు. పూర్తి స్థాయి అధ్యాపకుల నియామకం తరువాత కమిటీ నిర్ణయం ప్రకారం ఈ విషయాన్ని ఆలోచిస్తామని ఆయన అన్నారు. వైఎస్సార్ ఆశయం నెరవేర్చాలి ప్రతి ఒక్కరికీ సాంకేతిక విద్యా ఫలాలు అందించేందుకు కాకినాడలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆశయాలు నెరవేరాలి. జేఎన్టీయూకేలో పీహెచ్‌డీలకు ప్రవేశాలు కల్పించాలి. వర్సిటీలో అన్నిరకాల సదుపాయాలు ఉండి అన్ని విభాగాల్లో పీహెచ్‌డీలు కల్పిస్తున్నారు. కేవలం గ్రంథాలయ శాస్త్రంలో ప్రవేశాలు కల్పించకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై విద్యా శాఖ మంత్రి, ఉన్నత అధికారులను కలుస్తాం. – డాక్టర్ బీఆర్ దొరస్వామి నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్, లైబ్రరీ సైన్స్, జేఎన్టీయూకే -
టీడీపీపై ఆపేక్ష.. అన్యులపై వివక్ష
కాకినాడ సిటీ: మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలై కొత్త ప్రభుత్వం రానున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా హడావుడిగా కొందరికి అదనపు బాధ్యతలు కట్టాబెట్టారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా తనకు పట్టనట్టు రిజిస్ట్రార్ ఇష్టానుసారంగా వ్యవహరించడం జేఎన్టీయూకేలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ డైరెక్టరేట్ల జోలికి వెళ్లని వర్సిటీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి సానుభూతిపరులుగా ఉన్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నియామక ఉత్తర్వులు ఇస్తే మరో ఏడాది వరకూ మార్పు చేయడానికి ఉండదు కదా అన్న ఉద్దేశంతో హడావుడిగా ఈ పని చేశారని అర్థమవుతోంది. పెత్తనమంతా ఆయనదే! వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒకాయన ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ నియామక కమిషన్ చైర్మన్ హోదాలో ఉండి అక్కడి నుంచి వర్సిటీని నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా ఏదో సదస్సు పేరుతోనో లేక సన్మానం వంకతోనో వర్సిటీకి వచ్చే ఆయన తన వర్గం వారిని కలుసుకుంటూ వారికి కావలసిన అధికారాలు కట్టబెడుతుంటారు. ఆ విధంగా వర్సిటీ పరిపాలన మొత్తం తన చేతుల్లో పెట్టుకుని కీలక స్థానంలో ఉన్న వారిని డమ్మీగా చేశారనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వర్సిటీతో సంబంధం లేని వ్యక్తి ఇలా అనధికారికంగా పరిపాలన వ్యవహారాల్లో వేలుపెట్టి వర్సిటీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని కొంతమంది అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీపై ఆపేక్ష.. అన్యులపై వివక్ష వర్సిటీ పాలనలో చక్రం తిప్పుతున్న ఆయన అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ పలు పోటీ పరీక్షల్లో టీడీపీ సంక్షేమ పథకాలపై ప్రశ్నలు వచ్చేలా చూస్తున్నారంటూ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో «ఆందోళన చేపట్టారు కూడా. ఆ ఉన్నతాధికారి అమరావతిలో ఉంటూ కొత్త ప్రభుత్వం వచ్చేలోగా మార్పులు చేపట్టాలని చెప్పడంతో ఉన్నపళంగా నియామక ఉత్తర్వులు వెలువడ్డాయని కొంతమంది అ«ధ్యాపకులు పేర్కొంటున్నారు. ఎంతోమంది విద్యావంతుల జీవితాలకు వెలుగులు ప్రసాదించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల అభిమానంతో కొంతమంది ప్రొఫెసర్లు ఉండటంతో వారి పట్ల వివక్ష చూపుతున్నారని, ఇలా వర్సిటీలో రాజకీయాలు జొప్పించి అధికార పార్టీకి అనూకులంగా వ్యవహరించడం ఎంతవరకూ సమంజసమని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విచిత్రమేమిటంటే సివిల్ ప్రొఫెసర్ ఏసురత్నంను ఐఎస్టీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రెండు గంటలకే రెండు నెలలు సెలవు పెట్టి అమెరికా వెళ్లిపోయారు. టీచింగ్ అసోసియేషన్లలో ఉన్న వారికి డైరెక్టరేట్లు కట్టబెట్టారు. ఉత్తర్వులు జారీచేసింది వీళ్లకే... సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్‌రాజును ఐక్యూ ఏసీ ఇన్చార్జ్గా, సీఎస్ఈ ప్రొఫెసర్ ఎ.కృష్ణమోహన్‌ను స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్‌గా, సివిల్ ప్రొఫెసర్ ఏసురత్నంను ఐఎస్టీ డైరెక్టర్‌గా, జి.అబ్బయ్యను లైబ్రరీ సైన్స్ డైరెక్టర్‌గా, ఈసీఈ ప్రొఫెసర్ ఎన్.బాలాజీను అడ్మిషన్స్ డైరెక్టర్‌గా, మేథమెటిక్స్ ప్రొఫెసర్ జీవీఎస్ఆర్ దీక్షితులను ఆర్అండ్డీ డైరెక్టర్‌గా, విజయనగరం కళాశాల ఈసీఈ ప్రొఫెసర్ కె.చంద్రభూషణంను నరసారావుపేట కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, మాజీ రెక్టార్ పూర్ణానందంను ఎస్సీఎస్టీ సెల్ లైజాన్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జేసీకి రిజిస్ట్రార్ వివరణ? జేఎన్టీయూకే రిజిస్ట్రార్ సుబ్బారావుకు కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో శుక్రవారం రాత్రి కలెక్టరేట్ బంగ్లాకు వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ను కలువగా వెంటనే వెళ్లి జేసీ–2 సత్తిబాబుతో మాట్లాడమని చెప్పడంతో కలెక్టరేట్లో ఉన్న జేసీ–2 ను కలిసి దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. బయటకు వచ్చిన రిజిస్ట్రార్ సుబ్బారావును వివరణ కోరగా ఏమీ లేదంటూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. జేసీ–2 సత్తిబాబును వివరణ కోరగా కౌంటింగ్ కేంద్రాలకు అదనపు గదుల సమాచారం కోసం మాట్లాడడానికి పిలిచామంటూ సమాధానమిచ్చారు. డైరెక్టర్ల హోదాల విషయంపై ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో దీనిపై రిజిస్ట్రార్‌ను వివరణ కోరడానికే కలెక్టరేట్‌కు పిలిపించారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదు వర్సిటీలో పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన డైరెక్టరేట్లకు సంబంధించి ప్రొఫెసర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం తప్ప వీటికి ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదు. ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఉన్నత విద్యాశాఖ సలహాతోపాటు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయంతో ఉత్తర్వులు జారీచేశాను. – వీవీ సుబ్బారావు, జేఎన్టీయూకే రిజిస్ట్రార్ -
ఆచార్యునిపై చర్య?
కాకినాడ / బాలాజీచెరువు: ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ప్రొఫెసర్ కె.బాబులు వ్యవహారం మరింత వేడెక్కింది. ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పించాలని విద్యార్థులు ఆదివారం రోడ్డెక్కడంతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన యూనివర్సిటీ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. మరోవైపు ప్రొఫెసర్ బాబులుకు అనుకూలంగా అధికార టీడీపీకి చెందిన నేతలు రంగంలోకి దిగారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు విద్యార్థులు కూడా సన్నద్ధమవుతున్నారు. ‘బాబులు’ కమిటీ భేటీ విద్యార్థులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ఐఎస్టీ డైరెక్టర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులుతో ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ భేటీ అయ్యింది. ఆదివారం రెక్టార్ పూర్ణానందం అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎదుట ప్రొఫెసర్ బాబులు హాజరయ్యారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ఫిర్యాదుల నేపథ్యంలో కమిటీ సభ్యులు కూడా ప్రొఫెసర్‌కు అనేక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో బాబులు వాదనను కూడా కమిటీ రాతపూర్వకంగా స్వీకరించినట్టు వర్సిటీ వర్గాలు చెప్పాయి. జేఎన్టీయూకే వద్ద నిరసన గళం ప్రొఫెసర్ బాబులును తక్షణమే విధుల నుంచి తప్పించాలంటూ ఆదివారం ఎంటెక్ విద్యార్థులంతా రోడ్డెక్కారు. జేఎన్టీయూకే ప్రధాన ద్వారం వద్ద దాదాపు 200 మంది బైఠాయించి ప్రొఫెసర్‌ను విధుల నుంచి తప్పించే వరకు తరగతులను బహిష్కరిస్తామని, పరీక్షలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఉభయవర్గాల సమక్షంలోనే విచారణ జరగాలంటూ ఆందోళన కొనసాగించడంతో చివరకు వీసీ కుమార్, రెక్టార్ పూర్ణానందం అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో రెండు గంటల తరువాత ఆందోళన విరమించారు. తాత్కాలికంగా తొలగింపు ప్రొఫెసర్ బాబులును ఐఎస్టీ డైరెక్టర్ పదవితోపాటు, ఎంటెక్ కోర్సు విధుల నుంచి తప్పిస్తూ ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో వివాదానికి తాత్కాలికంగా ముగింపుపలికారు. ఈ చర్యతో శాంతించిన విద్యార్థులు సోమవారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరయ్యేందుకు సమ్మతించారు. రాజకీయ ఒత్తిళ్లు? కమిటీ విచారణ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్టు విద్యార్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్‌కు అనుకూలంగా రాష్ట్రస్థాయి చైర్మన్ పదవిలో ఉన్న ఓ నేతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి కూడా రంగంలోకి దిగి వీసీ, కమిటీ సభ్యులపై బాబులుకు అనుకూలంగా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇది కాస్తా బయటకు పొక్కడంతో విద్యార్థులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసి రోడ్డెక్కారు. విచారణ తీరుపై విద్యార్థుల పెదవి విరుపు ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన తీరుపై విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. విద్యార్థులతో ఒకసారి, ప్రొఫెసర్‌తో మరొకసారి విడివిడిగా విచారణ జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నది వీరి వాదన. ఇరు వర్గాలతో ముఖాముఖి విచారణ జరపడంతోనే వాస్తవాలు బయటకు వస్తాయనే వాదన విద్యార్థుల్లో నెలకొంది. ఈ తరహా వివాదాలు తలెత్తిన సమయంలో గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బయటి వర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీ వేశారని, ఇక్కడ మాత్రం స్థానిక ప్రొఫెసర్లతోనే కమిటీ వేయడం వల్ల న్యాయం జరగదన్న వాదనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. -
ఎంటెక్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బాలాజీచెరువు: ఆయనో బాధ్యతాయుత వృత్తిలో ఉన్న ప్రొఫెసర్. ఉన్నత విలువలు బోధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తే దారితప్పాడు.. తన వద్ద చదివే విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థినుల ఫిర్యాదు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో సీఎస్ఈ, వీఎల్ఎస్ఐ విభాగాల్లో ఎంటెక్ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. ల్యాబ్‌లో జరగాల్సిన ‘వైవా’ మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్టీ) డైరెక్టర్ ప్రొఫెసర్ కె.బాబులు క్యాబిన్లో నిర్వహించారు. ఈ సందర్భంలో అబ్బాయిలను త్వరగా పంపించి తమను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇరవై మందికి పైగా విద్యార్థినులతో ఆయన వ్యవహరించారని ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్లకు రాతపూర్వకంగా శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉందని, అలాంటి ఫ్యాకల్టీ తమకొద్దంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరికి మద్దతుగా ఇతర విభాగాలకు చెందిన విద్యార్థులు సంతకాలు చేశారు. ఐదుగురు సభ్యులతో కమిటీ.. ఎంటెక్ విద్యార్థినుల ఫిర్యాదుతో జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ కుమార్.. రెక్టార్ పూర్ణానందం చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీ బాధిత విద్యార్థినులను పిలిచి మాట్లాడింది. వీరందరి దగ్గర స్టేట్మెంట్లను తీసుకున్నారు. ఆదివారం ప్రొఫెసర్ బాబులు వివరణ తీసుకున్నాక నివేదిక అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. -
జేఎన్టీయూ నిర్మాణానికి స్థలం కేటాయింపు
నరసరావుపేట రూరల్: ఎట్టకేలకు జేఎన్టీయూ నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల సొంత భవన నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. 2012–13 విద్యా సంవత్సరంలోనే వర్సిటీ ఏర్పాటుకు పునాది పడింది. అప్పటి వర్సిటీ పాలక మండలి నరసరావుపేటలో వర్సిటీ అనుబంధ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నరసరావుపేట మండలం కాకానిలో కొంత ప్రభుత్వ భూమి ఉండటంతో అక్కడ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ రాష్ట్ర విభజన జరిగి, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అవే భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తూ జీవో జారి చేసింది. దీనిపై మీడియాలో భారీ దుమారం రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం చివరికి వర్సిటీకి స్థలం కేటాయించింది. రెండేళ్ల నుంచి స్థలం కోసం ఎదురుచూపు.. రెండేళ్ల క్రితం నరసరావుపేటలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ వర్సిటీ కళాశాల ఏర్పాటైంది. కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి అధికారికంగా భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. దీంతో ప్రైవేటు స్థలాల్లోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఏపీఐఐసీకి కేటాయించిన కాకాని స్థలాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్ట్‌లో జీవో కూడా జారీ చేసింది. ఈ స్థలాన్ని తిరిగి కళాశాలకు కేటాయించడంలో ప్రభుత్వం అలసత్వం వహించింది. రెండేళ్లుగా కళాశాలకు భూములను కేటాయించాలని కోరుతూ వర్సిటీ అధికారులు అనేక సార్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు 86 ఎకరాలు కేటాయింపు.. భవనాల నిర్మాణానికి ఇప్పటివరకూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించకపోవడంతో ప్రస్తుతం అద్దె భవనాల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. రూరల్ పరిధిలోని పెట్లూరివారిపాలెం ఎ.ఎం.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది తరగతులు నిర్వహించగా ఈ ఏడాది పట్టణంలోని ఎన్.బి.టి అండ్Š ఎన్.వి.సి కళాశాలలో తరగతులు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం కళాశాలకు 86 ఏకరాలు కేటాయిస్తూ శనివారం క్యాబినేట్ నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, అధ్యాపకుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం తీసుకున్నప్పటికీ పల్నాడు విద్యా హబ్‌గా ఉన్న నరసరావుపేటలో జేఎన్టీయూ భవన నిర్మాణాల కల సాకారం కానుందని పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులను సమకూర్చుకుని సిద్ధంగా ఉన్న కళాశాల యాజమాన్యం సైతం భూమి కేటాయింపు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తి.. కళాశాల భవన నిర్మాణాలకు వర్సిటీ రూ.80 కోట్లు ఖర్చుచేయనుంది. ప్రస్తుతానికి రూ.30 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. గతంలో టెండర్లు పిలిచినా భూములు అప్పగించకపోవడంతో పనులు ఆగిపోయాయి. భూములను మాకు అప్పగించిన వెంటనే పనులను ప్రారంభిస్తాం. ఇందుకోసం అవసరమైన ప్రిలిమినరీ వర్క్ ఇప్పటికే పూర్తి చేశాం. భవనాలు పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరో ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నాం. – కె.ఎస్.ఎస్ మురళీకృష్ణ, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ -
జేఎన్టీయూకేకు దక్కని చోటు
సాక్షి, బాలాజీచెరువు(కాకినాడసిటీ): సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం. విదేశీ వర్సిటీలతో కోర్సుల ఒప్పందాలు, మ్యూక్స్ ఆన్లైన్ కోర్సుల నిర్వహణతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నామంటూ పత్రికా ప్రకటనలు విడుదల చేసే వర్సిటీ అధికారులు ప్రపంచస్థాయి వర్సిటీ ర్యాంకుల్లో జేఎన్టీయూకేకు చోటు కల్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నాం.. వర్సిటీకి తగిన గుర్తింపు కోసం అన్ని విభాగాలు కలిసికట్టుగా పోరాడదామన్న ఆలోచన లేకుండాపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్సిటీలో ఏదైనా డైరెక్టర్ పోస్టు ఖాళీ అయితే ఆ పదవిని తమకున్న అధికార, ధన, కుల బలాలతో సర్వశక్తులూ ఒడ్డి దక్కించుకునే అధికారులు జేఎన్టీయూకే అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇటీవలే విడుదల చేసిన క్యూఎస్ ర్యాంకుల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న జేఎన్టీయూ కాకినాడకు స్థానం లేకపోవడం విస్మయానికి గురి చేసింది. విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ఆసియా బ్రిక్స్ ర్యాంకులు ఇచ్చే క్యూ ఎస్ సంస్థ విడుదల చేసిన 2018 ఫలితాల్లో జేఎన్టీయూ కాకినాడ ఎక్కడా కనిపించడకపోవడం గమనార్హం. ఏపీ ఎంసెట్, పీజీ సెట్, పోలీస్ రిక్రూట్మెంట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహిస్తున్న వరిర్సిటీకి గుర్తింపు రాలేదు. అకడమిక్, పరిశోధన, అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, వర్సిటీ ప్రతిష్ట తదితర అంశాలను ఆధారంగా అందజేసే ఈ ర్యాంకులలో జేఎన్టీయూ కాకినాడకు స్థానం లభించలేదు. ఏపీలో అనంతపురం, వైజాగ్ ఏయూ, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు 500 లోపు ర్యాంకులు సాధించగా జేఎన్టీయూ కాకినాడ దరిదాపుల్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచేలా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు తగ్గకుండా సాంకేతిక యూనివర్సిటీలు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నా దానికి తగ్గట్టుగా వర్సిటీ అధికారులు కృషి చేయడంలేదు. రాష్ట్ర విభజనకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ అంటూ మూడుగా విభజించాక జేఎన్టీయుహెచ్ తెలంగాణాలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్టీయూ అనంతపురం, కాకినాడ ఉన్నాయి. ప్రతిభ చూపిన నాలుగు వర్సిటీలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్రువీకరణ పత్రాలను ఆయా వర్సిటీల వీసీలకు అందజేస్తున్న నేపథ్యంలో ఆ అదృష్టం జేఎన్టీయూకేకు లేదు. ప్రస్తుత ఉపకులపతి అభివృద్ధి, పరిపాలనపై పెద్దగా దృష్టిసారించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించుకున్న ముఖ్యమంత్రి ఆ వర్సిటీకి గుర్తింపురాకపోవడంపై గల కారణాలు తెలుసుకుంటారని వర్సిటీ ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నారు. -
ప్రతిభ ఉంటే పతకాలే..
జేఎన్టీయూకేలో క్రియ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం హాజరుకానున్న పాఠశాలల చిన్నారులు కాకినాడ కల్చరల్ / బాలాజీచెరువు (కాకినాడ) : క్రియ పిల్లల పండుగ పేరుతో క్రియ స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహిస్తున్న వేడుకలకు జేఎన్టీయూకే ముస్తాబైంది. శని, ఆదివారాల్లో జరిగే ఈ పోటీల్లో నృత్యం, క్విజ్, డిబేట్, చిత్రలేఖనం, వేషధారణ తదితర 25 రకాల అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన వారికి ఈ పోటీల్లో అవకాశం కల్పించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ సబ్ జూనియర్స్‌గా, 6, 7 తరగతులను జూనియర్స్‌గా, 8, 9, 10 తరగతులను సీనియర్స్‌గా విభజించి జానపద, లఘు నాటికలు, శాస్త్రీయ నృత్యాలు, స్పెల్లింగ్, క్విజ్ పోటీలు, సినిమా పాటలకు నృత్యాలు నిర్వహిస్తారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం చిన్నారుల్లో ప్రతిభను వెలికితీయడానికి కొందరు క్రియ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఈ పండుగ నిర్వహిస్తున్నారు. దీనిలో వలంటీర్లుగా పనిచేయడానికి చాలామంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలను శనివారం జేఎన్టీయూకే ఉపకులపతి వీఎస్ఎస్కుమార్తో పాటు జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించే ముగింపు కార్యక్రమంలో విజేతలకు ప్రముఖులు బహుమతులు అందిస్తారు. 2002లో ‘క్రియ’ ఏర్పాటు కాకినాడ కల్చరల్: 2002లో తిమ్మాపురం(కాకినాడ రూరల్)లో ఆరుగురు యువకులు క్రియ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్‌పై పోటీ పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేశారు. 2013లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో రెండు రోజలు నిర్వహించిన పిల్లల పండుగకు స్పందన లభించింది. 2014లో కూడా పిల్లల పండుగను జేఎన్టీయూకేలో నిర్వహించారు. 2016లో జేఎన్టీయూకేలో పదివేలమంది పిల్లలతో కార్యక్రమం జరిపారు. నేడు ఈ సంస్థ రాష్ట్రస్థాయిలో అంతర పాఠశాలల పోటీలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఈ సంస్థ అందజేస్తోంది. శని, ఆదివారాల్లో జేఎన్టీయూకే ప్రాంగణంలో 12 వేల మంది విద్యార్థులతో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తోంది. ముఖ్యఅతిథులుగా లోక్‌సత్తా పార్టీ జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ, ఏపీపీఎసీ కమిషనర్ కె.ఉదయభాస్కర్ హజరవుతారు. పేద విద్యార్థులకు ప్రోత్సాహం క్రియ సంస్థ ద్వారా మట్టిలో ఉండే మాణిక్యాలను వెలికితీయాలన్నదే మా లక్ష్యం. పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు సాగుతున్నాం. దానికి అందరూ సహకారం అందజేయడం ఆనందంగా ఉంది. - ఎస్ఎస్ఆర్ జగన్నాథరావు, క్రియ సంస్థ కార్యదర్శి -
సత్తా చాటుతూ..
ఇన్నోవేషన్ ఫెలోస్‌కు జేఎన్టీయూకే, గైట్ కళాశాల విద్యార్థులు బాలాజీచెరువు(కాకినాడ) : సాంకేతిక యూనివర్సిటీలో అగ్రగామిగా నిలుస్తున్న జేఎన్టీయూకే ఇప్పుడు తన వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీలతో పోటీపడి ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఒక బ్యాచ్ అర్హత సాధించి సిలికాన్ వ్యాలీ సదస్సులో పాల్గొనగా.. మరో నలుగురు విద్యార్థులు నవంబర్‌లో జరిగే సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హస్పోప్లాటర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(డీస్కూల్) కల్పించే యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్‌కు(యూఐఎఫ్) జేఎన్టీయూకే విద్యార్థులు ఎంపికయ్యారు. సీఎస్ఈ విభాగం నుంచి చైతన్య, ప్రతిభాంకిత, ఈసీఈ నుంచి సౌమ్య,తేజస్వినీలు ఎంపికైన వారిలో ఉన్నారు. గైట్ విద్యార్థులు కూడా.. వెలుగుబంద (రాజానగరం) : యూఎస్ఏలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమానికి స్థానిక గైట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గూగల్, స్టా¯ŒS ఫోర్టు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ఎంపికైన వారిలో బీటెక్ తృతీయ సంవత్సర విద్యార్థులు రచన పారుపూడి, మెండ్రోటి వెంకటసత్యసాయిసిద్దార్థ (ఈసీఈ), గ్నషాకేర్ సహాని (సీఎస్ఈ), బీటెక్ సెకండియర్ విద్యార్థి సుందరిజాహ్నవి మావూరి (సీఎస్ఈ) ఉన్నారు. దేశవ్యాప్తంగా 224 మంది విద్యార్థులు ఎంపిక కాగా వారిలో గైట్ నుంచి నలుగురు ఉండడం హర్షణీయమన్నారు. మార్చి 9 నుంచి 12 వరకు జరిగే సిలికాన్ వాలీ మీటప్‌లో పాల్గొని, వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమం మన దేశంలోని ఉన్నత విద్యలో మార్పును తీసుకువచ్చేలా విద్యార్థి నాయకులను తయారు చేయడానికి, విద్యార్థుల శక్తిని మార్పునకు అనుగుణంగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్షీ్మశశికిరణ్ అన్నారు. సమావేశంలో సీఈఓ డాక్టర్ డీఎల్ఎన్ రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రామ్మూర్తి, డీన్ డాక్టర్ వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు, ఏపీఎస్ఎస్డీసీ ఎకనామిక్ కన్సల్టెంట్ టీవీ రావు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నినాదాల హోరు..
జేఎన్టీయూకే ప్రాంగణం ఆర్–13 రెగ్యులైజేషన్‌లో రెండు సబ్జెక్టుల సడలింపు కోసం ధర్నా బాలాజీచెరువు(కాకినాడ) : జేఎన్టీయూకేకు అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష విధానంలో తీసుకొస్తున్న మార్పులను రద్దు చేయాలంటూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గతంలో నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా రెండు సబ్జెక్టులు వదులుకునే వెసులుబాటు ఉండేదని, ప్రస్తుతం ఆ విధానం రద్దు చేశారని, ఈ విధానం కొత్త సంవత్సర విద్యార్థులకు విధించినా 2013లో చేరిన విద్యార్థులకు వర్తింపు లేకుండా నిబంధన సడలించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరీక్షల విధానంలో జంబ్లింగ్ విధానాన్ని 50 నుంచి 60కిలోమీటర్లు పెంచడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. వివిధ కళాశాలల నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు ఒక్కసారిగా వర్సిటీ భవనం ఎదుట అందోళనకు దిగి లోపలకు ప్రవేశించడానికి ప్రయత్నించడంతో వారిని అడ్డుకోవడం సెక్యూరిటీ వల్ల సాధ్యం కాకపోవడంతో సర్పవరం పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు రిజిస్ట్రార్ సాయిబాబు, రెక్టార్ ప్రభాకరరావులను కలిసి ఈ సమస్యలపై చర్చించారు. విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకుల నుంచి వినతిప్రతం తీసుకున్న రిజిస్ట్రార్, రెక్టార్లు ఈవిషయాన్ని వీసి దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
జేన్‌టీయూకే అధ్యాపకుడికి యంగ్‌సైంటిస్ట్ అవార్డు
బాలాజీచెరువు (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ అవార్డులో భాగంగా ప్రతి సంవత్సరం అందజేసే యంగ్‌సైంటిస్ట్ అవార్డు 2016కు జేఎన్టీయూకే కెమికల్ సైన్స్ అధ్యాపకుడు డాక్టర్ ఆర్.శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్తసైన్స్ స పోటీలలో పాల్గొనగా శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఒకరితో పాటు జేఎ¯ŒSటీయూ కాకినాడ వర్సిటీ నుంచి శ్రీనివాసులు కెమికల్ సైన్స్ విభాగంలో ఎంపికయ్యారు. అవార్డును విజయవాడలో సోమవారం జరిగిన సై¯Œ్సకాంగ్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సైంటిస్ట్ ఏ.వి.రామారావు చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డుతో పాటు పదివేల రూపాయల బహుమతి తీసుకున్నారు. -
కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
–221 పోస్టులకు 40,032 మంది దరఖాస్తు – పరీక్షకు హాజరైన అభ్యర్థులు 37,301 మంది కర్నూలు: కానిస్టేబుళ్ల ఎంపికకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖలో 221 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 40,032 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కర్నూలులో 35 సెంటర్లు 22,698 మంది, నంద్యాలలో 32 సెంటర్లలో 17,334 మంది కలిపి మొత్తం 71 సెంటర్లలో 37,301 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. 2731 మంది గైర్హాజరయ్యారు. బయో మెట్రిక్ హాజరుతో అనుమతి : కాకినాడ జేఎన్టీయూ కళాశాల ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. జిల్లాలోని ఇంజినీరింగ్, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సహకారంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించారు. 250 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున ఏర్పాటు చేసి బయో మెట్రిక్ (వేలి ముద్రలు) సేకరణ ద్వారా వారిని పరీక్షలకు అనుమతించారు. పోలీసు శాఖ నుంచి కొంతమంది సిబ్బందిని (ఫింగర్ ప్రింట్స్ బృందం) నియమించి బయో మెట్రిక్ సేకరణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను బయో మెట్రిక్ హాజరుతో అనుమతించి 10 గంటలకు పరీక్షలను ప్రారంభించారు. ఆధార్ లేదా, ఇతర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది అభ్యర్థులు మరిచిపోయి వచ్చారు. చివరి నిమిషంలో అలాంటి వారిని కూడా పరీక్షకు అనుమతించారు. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి కర్నూలులోని పరీక్ష కేంద్రాలకు, నంద్యాలలోని ఆర్జీఎం కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అక్కడి పరీక్ష కేంద్రాలకు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఎస్పీ, డీఎస్పీలు ఆకస్మిక తనిఖీ: కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్షను పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, ఏ.క్యాంపులో ఉన్న మాంటిస్సోరి స్కూలులో ఎస్పీ ఆకే రవికృష్ణ పరిశీలించారు. పరీక్ష బాగా రాసి పట్టుదలతో ఉద్యోగం సాధించాలని అభ్యర్థులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష కేంద్రాల యాజమాన్యంతో మాట్లాడి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్పీలు రమణమూర్తి, ఏజీ కృష్ణమూర్తి, సీఐలు మహేశ్వరరెడ్డి, మధుసూదన్‌రావు, ఈ–కాప్స్ ఎస్ఐ రాఘవరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు, సీఐలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. -
నిబద్ధతకు గుర్తింపు
జేఎన్టీయూకే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రసాదరాజు ఎంపిక బాలాజీచెరువు(కాకినాడ): జేఎన్టీయూకే అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జేఎన్టీయూకే ప్రిన్సిపాల్ గొట్టిముక్కల ప్రసాదరాజు ఎంపికయ్యారు. నిబద్ధతతో, కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందనడానికి తాను ఈ అవార్డుకు ఎంపికకావడం నిదర్శనమని ప్రసాదlరాజు పేర్కొన్నారు. జీవనప్రస్థానం పశ్చిమ గోదావరి జిల్లా ఐ. భీమవరంలో రిటైర్డ్ ఆర్అండ్బీ ఇంజనీర్ రామకృష్ణంరాజు, సత్యవతి దంపతుల మూడో కుమారుడిగా 1963లో ప్రసాదరాజు జన్మించారు. పదవ తరగతి స్వగ్రామంలో, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ భీమవరం, ఎంటెక్ ఆంధ్రా యూనివర్సిటీ, పీహెచ్డీ నిట్ వరంగల్‌లో చదివారు. జేఎన్టీయూకేలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా 1989లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి సివిల్ విభాగాధిపతిగా, జేఎన్టీయూకే కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్‌గా, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, రిజిస్ట్రార్‌గా సేవలందించిన ప్రసాదరాజు ప్రస్తుతం జేఎన్టీయూకే∙కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 2004–05, 2006–07లో అందుకున్నారు. 13 జాతీయ, 26 అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురించి, 66 జాతీయ, 13 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఏపీపీజీ ఈసెట్ రెండు సార్లు దిగ్విజయంగా నిర్వహించారు. అందరి సహకారంతో అవార్డు... అందరి సహకారంతో ఈఅవార్డు దక్కింది. ఈ అవార్డుతో అధ్యాపక వృత్తితో పాటు కళాశాల అభివృద్ధి బాధ్యత మరింత పెరిగింది. జేఎన్టీయూకే ఉపకులపతి వీఎస్ఎస్ కుమార్, రిజిస్ట్రార్ సాయిబాబు, అధ్యాపకులు సహకారంతో కళాశాల పేరు ప్రతిష్టలు మరింత పెంచేందుకు కృషిచేస్తాను. – డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రిన్సిపాల్, జేఎన్టీయూకే కళాశాల -
యూనివర్సిటీ కన్వెన్షన్ పోస్టర్ విడుదల
బాలాజీచెరువు : భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర యూనివర్సిటీ కన్వెన్షన్ పోస్టర్ జేఎన్టీయూకేలో శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ సాయిబాబు ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ సాయిబాబు మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రపంచస్థాయి శాస్త్ర సాంకేతిక పురోగామి అభివృద్ధి చెందడానికి యూనివర్సిటీ విద్యలో కొన్ని మార్పులు తీసుకురావలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కన్వెన్షన్ సదస్సులు జయప్రదం చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్‌రాజు మాట్లాడుతూ ఈ సదస్సులో యూనివర్సిటీ విద్యలో పరిశోధన రంగం ప్రా«ధాన్యాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే టెక్నాలజీపై చర్చించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వై.సురక్షిత, ఉదయ్, రాజా, తదితరులు పాల్గొన్నారు. -
నాన్ టీచింగ్ పోస్టుల ప్రమోషన్లకు అనుమతి
బాలాజీచెరువు(కాకినాడ) : జేఎన్టీయూ కాకినాడలో వివిధ విభాగాల్లో నాన్‌టీచింగ్ పోస్టుల ప్రమోషన్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప గురువారం జీవో నెంబర్ :157 జారీ చేశారు. జాయింట్ రిజిస్ట్రార్ ఒకటి, ఫైనాన్స్ ఆఫీసర్–1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1, సూపరింటెండెంట్–2, సీనియర్ అసిస్టెంట్–3, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ –1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–1 పోస్టుల ప్రమోషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ ఆఫీసర్ మినహా మిగతా పోస్టులన్నీ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశారు. ఆ ఒక్క పోస్టుకూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
జేఎన్టీయూకే వీసీతో ఎన్టీయూ డైరెక్టర్ భేటీ
బాలాజీచెరువు (కాకినాడ) : సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ( ఎన్టీయూ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి మంగళవారం జేఎన్టీయూకే ఉపకులపతి వీఎస్ఎస్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఎన్టీయూ అందిస్తున్న కోర్సులు, ఉపకార వేతనాలు, పరిశోధనలు తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జేఎన్‌టీయూకేతో కలిసి కొన్ని కోర్సులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్లతోనే తమ పాఠ్యప్రణాళిక రూపొందించి తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో రెక్టార్ ప్రభాకరరావు, రిజిస్ట్రార్ సాయిబాబు, ఓఎస్డీ ప్రసాద్‌రాజు పాల్గొన్నారు. -
జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సాయిబాబు
బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రసాద్‌రాజును ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమించారు. జేఎన్టీయూకే కళాశాల ఈఈఈ విభాగ ఆచార్యులుగా ఉన్న సాయిబాబు ఏపీ జెన్కో, ఏపీ ఈపీడీసీఎల్ పోస్టుల భర్తీకు కన్వీనర్‌గా, మూడు సార్లు ఈసెట్ పరీక్షల కన్వీనర్‌గా, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎంసెట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తనను ఈ పదవిలో నియమించిన వీవీ వీఎస్ఎస్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో జేఎన్టీయూకే అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సాయిబాబును వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
జేఎన్టీయూకే తీరుపై శివాజీ ఆగ్రహం
కాకినాడ సిటీ: జేఎన్టీయూకేలో ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేసిన రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణలో వైఫల్యంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమంపై నివేదిక అందజేయాలని జేఎన్టీయు అధికారులను ఆయన ఆదేశించారు. జేఎన్టీయూకే సమావేశ మందిరంలో వైస్‌చాన్సలర్ వీఎస్ఎస్ కుమార్, సంబంధిత అధికారులతో ఆయన ఎస్సీ, ఎస్టీ పోస్టుల నిర్వహణలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు సంబంధించిన రికార్డులన్నింటినీ వారం రోజుల్లోగా సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకుల వద్దకు తీసుకువెళ్లి వారితో పరిశీలింపజేసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించారు. ఆయన విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. లైజన్ ఆఫీసర్‌కు ఇ–మెయిల్ అడ్రస్ క్రియేట్ చేయాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అప్పుడే విద్యార్థులకు ఏవిధమైన సమస్య వచ్చినా లైజన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వీలుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి. ఔట్ సోర్సింగ్‌లో రిజర్వేషన్ పాటిస్తున్నారా లేదా అనే అంశంపై శివాజీ ఆరా తీశారు. సంబంధిత రికార్డులను అధికారులు చూపకపోవడంతో 15–20 రోజుల్లో అన్ని రికార్డులు సిద్ధం చేసి, నివేదికలు పొందుపరచాలని అంటూ కమిషన్ చైర్మన్ శివాజీ సమావేశాన్ని వాయిదా వేశారు. నివేదికలను పరిశీలించిన అనంతరమే తదుపరి సమావేశం నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, జేఎన్టీయూకే ప్రొఫెసర్లు పాల్గొన్నారు. జేఎన్టీయూకే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు చైర్మన్ కారెం శివాజీని ఘనంగా సన్మానించారు. -
గ్లోబరీనా ‘గోల్మాల్’పై ఆరా?
జేఎన్టీయూకే వీసీతో గవర్నర్ ప్రత్యేక భేటీ రూ.100 కోట్ల ఆ ఒప్పందంపైనే ప్రధాన చర్చ! దీనిపై గతంలోనే గవర్నర్‌కు సీపీఐ నేతల ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్ర గవర్నర్ ఎస్ఎల్ నరసింహన్‌తో జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్సలర్ వీఎస్ఎస్ కుమార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ రెండు రోజుల జిల్లా పర్యటన మంగళవారంతో ముగిసింది. తొలిరోజు సోమవారం రాజమండ్రిలో పుష్కర ఘాట్లను పరిశీలించి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ కాకినాడలో డాక్టర్ ఎస్వీఎస్ రావు కుమారుడి వివాహానికి హాజరయ్యూరు. అనంతరం ఆర్అండ్బి అతిథిగృహంలో బసచేశారు. కాగా మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్ ఒక్కరే ఒక ఫైల్ పట్టుకుని వడివడిగా ఆర్అండ్బి అతిథిగృహంలోకి వెళ్లారు. అలా వెళ్లిన వీసీ సుమారు అరగంట పాటు చాన్సలర్, గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఆ అరగంట చాన్సలర్, వైస్ చాన్సలర్ల మధ్య ఏం జరిగిందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరి మధ్య ఏకాంతంగా సాగిన ఆ అరగంట భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై వర్సిటీ వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. గత వీసీ తులసీరామ్‌దాస్ హయాంలో గ్లోబరినాతో కుదుర్చుకున్న ఒప్పందం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సుమారు రూ.100 కోట్ల ఈ ఒప్పందంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఒప్పందంలో అవకతవకలు జరిగాయని గతంలో జిల్లా నుంచి సీపీఐ నాయకుడు మీసాల సత్యనారాయణ, ఇటీవల సీపీఐ రాష్ట్ర నేత నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వీసీ వీఎస్ఎస్ కుమార్ గవర్నర్‌తో సమావేశం కావడంతో సహజంగానే ఈ అంశం చర్చకు వచ్చిందని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఆ ఒప్పందం వల్ల పరీక్షల ఫలితాలు సకాలంలో విడుదల కాక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనే వీసీ, గవర్నర్లు ప్రధానంగా చర్చించినట్టు భావిస్తున్నారు. ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి అనే దానిపై గవర్నర్ ఆరా తీశారని తెలుస్తోంది. ఫిర్యాదులు వస్తున్నట్టుగా రూ.100 కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న దానిలో వాస్తవమెంత, ఒప్పందానికి ముందు ఫలితాల విడుదలకు ఎంత సమయం పట్టేది, ఒప్పందం తరువాత ఎంత కాలం పడుతోంది, ఇందుకు కారణాలు ఏమిటి అన్నది గవర్నర్ వీసీని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన గవర్నర్ దీనిపై సమగ్ర సమాచారాన్ని కోరారని తెలుస్తోంది. పోస్టుల భర్తీపై సానుకూల స్పందన అలాగే వర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల విషయంలో ఇంతవరకు తీసుకున్న చర్యలు, పంపిన ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగిందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జేఎన్టీయూకే తొలిసారి నిర్వహించిన ఎంసెట్‌పై కూడా గవర్నర్ ఆరా తీశారు. ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఆర్టీసీ సమ్మె ప్రభావం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం మీద గవర్నర్ పర్యటనతో వర్సిటీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని వర్సిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గవర్నర్‌తో భేటీ విషయమై వీసీ వీఎస్ఎస్ కుమార్‌ను ‘సాక్షి’ సంప్రదించగా మర్యాదపూర్వకంగా జరిగిందని, ఎంసెట్ నిర్వహణపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసి ఎంసెట్ టీమ్‌కు అభినందనలు తెలియచేశారన్నారు. ఇతర విషయాలపై స్పందించ లేదు. గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు కోరుకొండ : జిల్లా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వెళ్లిన గవర్నర్ నరసింహన్ దంపతులకు మధురపూడి విమానాశ్రయంలో పలువురు ఘనంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్పైస్‌జెట్‌లో గవర్నర్ దంపతులు హైదరాబాద్ పయనమయ్యారు. వీడ్కోలు పలికిన వారిలో రాజమండ్రి సబ్‌కలెక్టర్ వి.విజయరామరాజు, రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ, అడిషనల్ ఎస్పీలు సిద్ధారెడ్డి, బి.శరత్‌బాబు, కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, సీఐ ఎన్.మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు ఎస్సై ఎం. కనకరావు తదితరులు ఉన్నారు. -
జేఎన్టీయూకేకు కొత్త సాఫ్ట్వేర్
మెయిన్‌రోడ్(కాకినాడ): జేఎన్‌టీయుకే వర్సిటీలో విద్యార్ధుల అవసరార్ధం ‘మినిమలిస్టిక్ అబ్జెక్ట్ ఓరియంటేడ్ లెనైక్స్ సాఫ్ట్వేర్’ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు జేఎన్‌టీయుకే అధికారులు సోమవారం వర్సిటీ సెన్ట్ హాల్లో సమావేశమై సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడీఏసీ) అండ్ ఐఐటీ చెన్నై వారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.వి.ఆర్.ప్రసాదరాజు, చెన్నై ఐఐటీకి చెందిన సీఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ డి.జానకిరామ్‌లు సంతకాలు చేసి మార్చుకున్నారు. లెనెక్స్ సాఫ్ట్వేర్ సహాయంతో విద్యార్థులు ప్రాజెక్ట్స్‌ను చేపట్టడానికి, పరిశోధనలను కొత్తపుంతలతో ముందుకు తీసుకువెళ్ళడానికి, ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ ద్వారా ఇతర సాఫ్ట్వేర్ల రూపకల్పనకు కృషి చేయొచ్చని ప్రొఫెసర్ దాసు వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు లెసైన్స్ ఫీజు వసూలు చేయబోమని, విద్యార్థులు మధ్య ఓపెన్‌సోర్స్ సాఫ్ట్వేర్ ప్రోత్సహించవచ్చన్నారు. జేఎన్టీయూకే వెబ్సైట్లో దీన్ని పొందుపరుస్తామని, ఆసక్తిగల కళాశాలల మేనేజ్మెంట్ దీన్ని విద్యార్థులకు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ బి.ప్రభాకర్‌రావు, డీఏపీ డాక్టర్ పి.ఉదయభాస్కర్, డెరైక్టర్ సీఈ అండ్ ఓఆర్డీ డాక్టర్ వి.రామచంద్రరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె పద్మరాజు, ఆర్ అండ్ డీ కో-ఆర్డినేటర్, ఐఐటీ, చెన్నై డాక్టర్ మధుసూధనరావు, విభాగాధిపతులు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి డెరైక్టర్ డాక్టర్ జె.వి.ఆర్.మూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు.