K Narayana
-
షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు!: సీపీఐ నారాయణ
హైదరాబాద్, సాక్షి: రాజకీయాల్లో జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ దివంగత మాజీ సీఎం డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, అయితే ఆయనకు ఆ గుర్తింపు ఊరికే రాలేదని అన్నారు సీపీఐ నారాయణ. సోమవారం (జులై 8న) వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్న నారాయణ.. వైఎస్సార్ రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీలోనూ వైఎస్సార్‌ను చాలామంది ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ ఇబ్బందులు కొనసాగాయి. సొంత పార్టీ, బయటి పార్టీల నుంచి రాజశేఖర్‌రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కష్టాలు ఎదుర్కొని నిలపడ్డారు కాబట్టే ‘జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్’ అయ్యారు’’ అని నారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్సార్ తనయ షర్మిలపైనా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మకి ఇంకా అన్ని కష్టాలు రాలేదు. ఒకవేళ షర్మిలకు ఏమైనా కష్టాలు వస్తే.. అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయి. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు? -
బీజేపీ విధానాలపై పోరాటాలు తీవ్రతరం
సాక్షి, అమరావతి: దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని సీపీఐ 24వ జాతీయ మహాసభలు తీర్మానం చేశాయి. విజయవాడలో జరుగుతున్న మహాసభల వివరాలను ఆ పార్టీ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అమర్జిత్కౌర్, అతుల్‌కుమార్ అంజాన్, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు మీడియా సమావేశంలో వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక సంస్కరణల అజెండా అమల్లో వేగం పెరిగిందని, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం ప్రజల్లో తీవ్రమైన అసమనతలకు దారితీసిందని చెప్పారు. ఫలితంగా కొద్ది మంది చేతుల్లోకే సంపద కేంద్రీకరణకు దారితీసిందన్నారు. కార్పొరేట్లకు రాయితీలు పెంచుతున్నారని, అదే సమయంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేదరికం పెచ్చుమీరి ఆకలి చావులు పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మహాసభ తీర్మానించినట్టు వివరించారు. అలాగే మూడేళ్ల బిడ్డకు తల్లీ, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని, తెలుగు ప్రజలు ఎక్కడకి వెళ్లినా మీ రాజధాని ఏది అంటే చెప్పలేక పోతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసినట్టు చెప్పారు. యువతరానికే నాయకత్వ పగ్గాలివ్వాలి: పార్టీ నిర్మాణంపై ప్రతినిధులు పార్టీని సంస్థాగతంగా చక్కదిద్దుకోకుండా ఉద్యమ పథంలో రాణించలేమని సీపీఐ జాతీయ మహాసభల్లో పలువురు ప్రతినిధులు తెగేసి చెప్పారు. విజయవాడలోని గురుదాస్ దాస్‌గుప్త నగర్లో జరుగుతున్న మహాసభల్లో ‘పార్టీ నిర్మాణం’పై ఆదివారం వాడివేడీ చర్చ జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. పార్టీలో వృద్ధ నేతల అనుభవాన్ని ఉపయోగించుకుంటూ యువతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కోరారు. కమ్యూనిజం అజేయం: 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధుల ఉద్ఘాటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించిన కమ్యూనిజానికి తిరుగులేదని, పీడిత, తాడిత జనం కోసం పోరాడే కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందని 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధులు తమ సందేశాన్ని విన్పించారు. మతతత్వ శక్తులను తిప్పికొడదామని, ఆంక్షలు పెడుతున్న అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని, పెట్టుబడిదారీ విధానాలపై రాజీలేని పోరును కొనసాగించాలని వివిధ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. -
అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా విజయవాడలో అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరు తో నిర్వహించే జాతీయ సదస్సుకు సీఎం కేసీఆర్‌తోపాటు తమిళనాడు, కేరళ, బిహార్ ముఖ్యమంత్రులు స్టాలిన్, పినరయి విజయన్, నితీశ్ కుమార్‌నూ ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. వచ్చే నెల 14–18 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ తరువాత తొలిసారిగా సీపీఐ నూతన రాష్ట్ర సమితి సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో, విధానాల్లో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో విజయవాడలో నిర్వహించనున్న మహాసభలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య జాతీయస్థాయిలో ఐక్యత బలపడేందుకు ఈ మహాసభ ద్వారా ప్రయత్నం జరగనుందని తెలిపారు. సీపీఐ జాతీయ మహాసభకు 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉద్యమాల విషయంలో మొహమాటం లేదు: కూనంనేని ప్రజా సమస్యలపై ఉద్యమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి మొహమాటం లేకుండా పోరాడతామని కూనంనేని సాంబశివరావు చెప్పారు. రాష్ట్రంలో మతతత్వ బీజేపీని నిలువరించేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతునిచ్చామని, అదే సమయంలో ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. దేవరకొండ నియోజకవర్గంలో మహిళల శిరోముండనం ఘటనను వదిలిపెట్టబోమని, సాంఘిక దురాచారాలు, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. -
మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది!
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండపై పర్యాటక శాఖ చేపట్టిన రిసార్ట్ పునరుద్ధరణ పనులపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతుండగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను హైకోర్టు ప్రశ్నించింది. ఈ దశలో అక్కడికి వెళ్లాలంటే పునరుద్ధరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అనుమతి తీసుకోవడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖ పోలీస్ కమిషనర్, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుషికొండ రిసార్ట్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల పరిశీలన నిమిత్తం తాను అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఈ సందర్భంగా అడ్డంకులు సృష్టించకుండా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ కె.నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. నారాయణ తరఫు న్యాయవాది జువ్వాది శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. రిసార్ట్ పనులు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా? లేదా అన్న అంశంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఓ రాజకీయ పార్టీ నేతగా పిటిషనర్‌పై ఉందన్నారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రాంతం నిషిద్ధ ప్రదేశం కాదన్నారు. పర్యాటక శాఖ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పనులు జరుగుతున్న ప్రాంతం కాంట్రాక్టర్ నియంత్రణలో ఉందన్నారు. ప్రజాభద్రత దృష్ట్యా కాంట్రాక్టర్ ఆ ప్రాంతానికి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుత దశలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని నారాయణను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. -
దండం పెడుతున్నా, వదిలేయండి.. చిరు ఫ్యాన్స్‌కు క్షమాపణలు
మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు సీపీఐ నారాయణ. తాను వాడిన పదాలను భాషాదోషంగా పరిగణిస్తున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. విజయవాడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'చిరంజీవి గురించి చేసిన కామెంట్ భాషాదోషంగా గమనించాను. దీనివల్ల చిరంజీవి అభిమానులతో పాటు కొందరికి బాధ, ఆవేశం కలిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పార్టీలు లేవు. దాని ప్రకారం నేను మాట్లాడింది వాస్తవమే. అయితే రాజకీయ భాషకు మించి చిరంజీవి గురించి మాట్లాడినదాన్ని భాషాదోషంగా పరిగణించాలి. మీకు దండం పెడుతున్నా, దాన్ని వదిలిపెట్టండి' అని కోరారు. కాగా ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా చిరును పిలవడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవి స్టేజీపై స్థానం తగదంటూ చిల్లర బేరగాడు అంటూ తిట్టిపోశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చదవండి: గుడ్‌న్యూస్, ఇకమీదట అన్ని సినిమాలకు ఒకటే టికెట్ రేట్! చైసామ్ మా అపార్ట్మెంట్లో ఉండేవారు, అసలు గొడవపడేవారు కాదు -
కోరల్లేని పాములు కేసీఆర్, మోదీ
సాక్షి, కోదాడ అర్బన్, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కోరల్లేని పాముల్లా బుసలు కొడుతున్నారని, కాటు మాత్రం వేసుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యంగ్యంగా అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ దేశాన్ని ఇప్పటివరకు పాలించిన 14 మంది ప్రధానులు ప్రభుత్వరంగ సంస్థలను తీసుకొస్తే, ఒక్క మోదీనే 24 ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. మోదీ దత్తపుత్రుడైన ఆదానీ సంస్థ నుంచి బొగ్గును రాష్ట్రాలన్నీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి, స్టేషన్‌కు తరలించిన రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావును వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ మహిళలపై అటవీ, పోలీస్ శాఖల దాడులను తీవ్రంగా ఖండించారు. -
సీపీఐ నారాయణకు సతీ వియోగం
సాక్షి, అమరావతి/నగరి: సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సతీమణి వసుమతిదేవి (65) ఆకస్మిక మృతి చెందారు. గురువారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసుమతిదేవి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. 1976లో తిరుపతి మహిళా వర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న సమయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న నారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1986లో వర్కింగ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్‌లో చిత్తూరు జిల్లా శాఖకు నాయకత్వం వహించారు. నారాయణతో వివాహం తర్వాత ఆయన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, ఆమె కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సహకరించారు. ఆమె మృతి వార్తతో నగరి నియోజకవర్గంలోని స్వగ్రామం ఐనంబాకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు వసుమతి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. ఆమె మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి అనీరాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి రామానాయుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్ తదితరులు నారాయణను ఫోన్లో పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. గవర్నర్, సీఎం సంతాపం వసుమతిదేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకురాలిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేసిన వసుమతి బ్యాంక్ ఉద్యోగిగా సేవలు అందించి స్వచ్చంద పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ మీడియా రంగంలోనూ వసుమతి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని గవర్నర్ తెలిపారు. ► సీపీఐ నాయకుడు కె.నారాయణ సతీమణి వసుమతి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ► వేరొక ప్రకటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. -
మత తత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ
తిరుపతి కల్చరల్: లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ మత ఛాందసవాదాన్ని బీజేపీ రెచ్చగొడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకునేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో మంగళవారం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో ‘భారతదేశ చరిత్ర, సంస్కృతి–వక్రీకరణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ.. గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదన్నారు. హిందూ తత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం, మైనారిటీ, బౌద్ధులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీఎల్ నరసింహులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శక్తులు హిందూ తత్వాన్ని భుజానికి ఎత్తుకుని ముస్లింలకు వ్యతిరేకంగా చరిత్రను మార్చివేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. సదస్సులో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
చెప్పులు, వస్త్రాలపై జీఎస్టీ పెంచడం సిగ్గుచేటు
తిరుపతి కల్చరల్: వస్త్రాలు, చెప్పులపై ఉన్న జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సిగ్గు చేటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రూ.వెయ్యిలోపు కాటన్ దుస్తులు కొనేవారికి 12 శాతం జీఎస్టీ విధించడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చే ప్రతి జీవో వెనుక కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధానాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కొట్టుకొచ్చిన డబ్బుతో కమ్యూనిస్టులు బిల్డింగ్లు కడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించడం దుర్మార్గమన్నారు. చీప్ లిక్కర్ రూ.50కే అందిస్తామన్న సోము వీర్రాజు చరిత్రలో సారాయి వీర్రాజుగా మిగిలిపోతారన్నారు. విజయవాడలో పోయిన పరువును గుంటూరు జిన్నా టవర్ వద్ద వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.కమ్యూనిస్టులను విమర్శించే అర్హతవీర్రాజుకు లేదన్నారు. సోము వీర్రాజుతో పాటు మరో బీజేపీ ముఖ్య నేత కల్కి ఆశ్రమానికి ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేయలేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనం వెలికి తీసుకొస్తాం అనే పేరుతో రెండు లక్షల కోట్లు బీజేపీ నేతలు కొల్లగొట్టారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పారు. సీపీఐ, సీపీఎం పునరేకీకరణకు సీపీఐ కట్టుబడి ఉందన్నారు. -
జైభీమ్: నాటి పోరాటం గుర్తొచ్చింది!
‘జైభీమ్’ సినిమా చూశాను... నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్‌లు లేవు. యువ లాయర్ల బాధ్యతను, సందేశాత్మక సంకేతాలను ‘జై భీమ్’ సినిమా సమాజానికి పంపింది. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఉపసంహరించు కోవాలన్న పోలీసు బాస్... నీ భర్త ఎటు రాడు... కనీసం పరిహారం తీసుకొని కోర్టు కేసు వెనక్కు తీసుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు చెంపపెట్టులా ఉంటుంది. నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు 37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది. నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ ఇల్లులేక ప్లాట్‌ఫారంపై పడుకునే అభాగ్యురాలు. ఒక రోజు రాత్రి బీట్ కానిస్టేబుల్స్ తమ లాఠీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు. లక్ష్మి పరుగెత్తుతుండగా పోలీసులు కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది. విషయం తెలియగానే మేమంతా ఘటనా స్థలానికి చేరుకున్నాం. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి నిరసన ప్రదర్శన ప్రారంభించాం. నిరసన 25 మందితోనే మొదలైనా, క్రమంగా వందలమంది జతకలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మరునాడు బంద్‌కు పిలుపునిచ్చాము. మేము బంద్ పిలుపు ఇచ్చిన రోజునే నాటి సీఎం ఎన్టీఆర్ తిరుమల పర్యటన ఉంది. ముందురోజు నడి రాత్రి కొందరు పోలీ సులు వచ్చి నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావు, ఎస్పీ ఆల్ఫ్రెడ్ నాతో మాట్లాడుతూ రేపటిబంద్ పిలుపును ఉపసంహరించుకోండి నగరంలో సీఎం పర్యటన ఉందన్నారు. నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. (చదవండి: వారి నిర్బంధంలో న్యాయముందా?) ఆ సమయంలో అధికారులు ఇద్దరూ నాతో.... చనిపోయిన లక్ష్మిది ఈ ప్రాంతం కాదు, ఆమె కోసం మీరు పోరాటం చేస్తే మీకూ, మీపార్టీకి వచ్చే లాభం ఏమిటి, మీపై కేసులు పడటం తప్ప అని వ్యాఖ్యానించారు. ‘మా ఉద్యమం వలన సామాన్యులు కూడా చైతన్యంతో, ధైర్యంగా నివసించగలరు. అధికారులు బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం’ అనేశాను. మరునాడు బంద్ జరిగింది. మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్ జైలులో వారంపాటు నిర్బంధించారు.. కానీ మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్, రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడటానికి ఊతం ఇచ్చింది. ‘జై భీమ్’ సినిమా చూస్తుంటే 37 ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమా రీళ్లలాగా నాకళ్ల ముందు కదులుతున్నాయి. (చదవండి: ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం) - డాక్టర్ కె. నారాయణ వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యదర్శి -
పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మోదీని నిలదీయాలి
ఆలకూరపాడు(టంగుటూరు): బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని కలిసి నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంతో పోరాడాలని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సూచించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుటుంబసభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్కే, కుమారుడు మున్నా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రుడైన పవన్ చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కుపై మోదీని నిలదీయాలన్నారు. కర్మాగారం కాపాడుకునేందుకు దీక్ష చేపడతానని ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.అలాగే ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రెండోసారి జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. శాసించే స్థాయి పదవిలో ఆయన ఉండి కూడా విశాఖ ఉక్కుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. -
కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డిలు అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్.సుగుణ రచించిన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబు, దొరల పాలనకు వ్యతిరేకంగా పేద, కార్మిక, కర్షక, కళాకారులు ఏకమై మహత్తరమైన పోరాటం చేశారన్నారు. ఆనా టి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లో ఈ సాయుధ పోరాటం జరిగిందన్నారు. అయి తే అప్పటి పోరాటంతో ఎలాంటి సంబంధంలేని బీజేపీ, దానిని కేవలం హిందూ, ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణలో వేల ఎకరాల భూమిని దొరల నుంచి లాక్కుని పేద ప్రజలకు ఇచ్చిన చరిత్ర ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప రస్పరం సహకరించుకుంటూ.. పేదలపై భారం మోపే లా పాలన కొనసాగస్తున్నాయన్నారు. కేం ద్రం.. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతుంటే.. టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని విమర్శించారు. సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అనారోగ్య కారణంగా సభకు హాజరు కానందున ఆయన సందేశాన్ని యూ ట్యూబ్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాçష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, రఘుపాల్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదేనని, మతోన్మాద బీజేపీ నాయకులకు దానిపై మాట్లాడే హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయుధ పోరాట యోధుడు మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద 74వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలు సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సభకు సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ అధ్యక్షత వహించగా నేతలు మఖ్డూమ్ మొహియుద్దీన్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అసలు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని ప్రజలను నారాయణ కోరారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతరేకంగా రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిందని, ఈ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని అన్నారు. అనంతరం ఎర్ర జెండాలతో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
బిగ్‌బాస్ షోను నిషేధించాలి: సీపీఐ నారాయణ
బిగ్‌బాస్ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిగ్‌బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. ఇలాంటి షోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఈ అనైతిక షోను వేల కోట్ల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహించారు. బూతులు, కొట్లాటలతో సాగే బిగ్‌బాస్ షో అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని ఆపాలంటూ గతంలో కోర్టుకెక్కినప్పటికీ, అటు న్యాయవ్యవస్థ, ఇటు పోలీసులు తనకు ఏమాత్రం సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికిమాలిన షోను టీవీలో ప్రసారించేందుకు అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అసలు డ్రగ్స్ సూత్రధారులను పట్టుకోవాలి: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖులపై ఈడీ విచారణ మంచి పబ్లిసిటీతో రక్తి కట్టిస్తుందని, అసలు డ్రగ్స్ సూత్రధారులను పట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశసరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడం, డ్రగ్ మాఫియాను అణిచివేయడం, ఎన్నికల్లో నల్లధనాన్ని ఆపడమే ధ్యేయంగా ప్రధాని మోదీ నోట్లరద్దుని ప్రకటించారని మరి ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరిందా అని ప్రశ్నించారు. గతంలో డ్రగ్స్ వినియోగించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని, విచారించిన రిపోర్టు బుట్టదాఖలైందని మండిపడ్డారు. ఇప్పటి విచారణ కూడా కళాకారులను ఏడిపించేదిగా ఉంది తప్ప అసలు మాఫియాను పట్టుకునేదిగా కనపడటం లేదని విమర్శించారు. -
రఘురామను అడ్డుపెట్టుకొని ఆటలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజును అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడించాలని చూస్తోందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జె.సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇటీవల ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను అర్థం చేసుకోవాలన్నారు. సీబీఐ బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని నారాయణ మండిపడ్డారు. పార్టీ సమితి సమావేశాలకు గుంటూరు జిల్లా నుంచి వస్తున్న సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. 11న సీపీఐ నేతలు టిడ్కో ఇళ్లను సందర్శించనున్నట్టు తెలిపారు. -
ఏపీ వివరణ ఆమోదయోగ్యమైనదే
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ఇస్తోన్న వివరణ సరైనదే అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. శనివారం దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఐదేళ్ల పాటు ఉన్న ఒప్పందం ముగిసింది. దాంతోనే ఈ ఇబ్బంది తలెత్తింది. మేము ఎన్ని కిలో మీటర్లు తిప్పితే మీరు అన్నే తిప్పాలి అంటూ తెలంగాణ, ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. లక్ష 26 వేల కిలోమీటర్లు తిప్పుతున్న ఏపీ దానిని తగ్గించుకునేందు సైతం ముందుకు వచ్చింది. ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఏపీకి మూడు కోట్లు, తెలంగాణకు రెండు కోట్ల రూపాయల నస్టం వస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ తగ్గిస్తే ప్రజలకు ఉపయోగం అని ఏపీ ప్రభుత్వం ఆలోచన. ప్రైవేటు వారు బాగుపడిన ఫర్వాలేదు కానీ ఏపీకి లాభం రాకూడదన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరిని అవలంబిస్తోంది. ఆర్టీసీ 400 రూపాయలు వసూలు చేస్తే.. ప్రైవేట్ ట్రావేల్స్ 1000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇరువురు సీఎంలు చొరవ తీసికోవాలి’ అని కోరారు. (చదవండి: టీఎస్ఆర్టీసీ కోరినట్లే ప్రతిపాదనలు పంపాం) చంద్రబాబు తప్పు చేశాడు ‘విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ మూర్తి గారు ప్రభుత్వ భూమిని కొంత ఆసుపత్రి కోసం తీసుకున్నామని ఎప్పుడో చెప్పారు. బీఆర్ఎస్ ప్రకారం ఫైన్ వేయవచ్చు.. చర్యలు తీసుకోవచ్చు కూల్చి వేయడం కరెక్ట్ కాదు. కట్టేటప్పుడు చూస్తూ ఉండి కట్టాక కూల్చేస్తున్నారు. విశాఖలో2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలో ఉంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఏపీలో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తారు. మోదీ ఏపీకి ఇచ్చిన హామీలు నిరవేర్చలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావాల్సిన డబ్బులు కేంద్రమే ఇవ్వాలి. ఇది జాతీయ ప్రాజెక్ట్.. పోలవరం కడతా అని చంద్రబాబు తప్పు చేశాడు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు 5వేల కోట్ల రూపాయలు జీఎస్టీ బకాయిలు రావాలి. కేంద్ర మంత్రులు రాష్టానికి వచ్చి అబద్దాలు చెప్పి పోతున్నారు’ అంటూ మండి పడ్డారు. (చదవండి: గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు) మోదీ, ట్రంప్ నాటకరాయుళ్లు ‘ప్రపంచలోనే గొప్ప నాటకరాయుళ్లు, రాజకీయ కళాకారులు ట్రంప్, మోదీలు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు చనిపోతే.. బిహార్ ఎన్నికల్లో ఓట్లకోసం బిహార్ రెజ్మెంట్ అని మోదీ ప్రచారం చేస్తున్నారు. బిహార్ రెజ్మెంట్లో బిహారీలు ఒక్కరే ఉండరు. తెలంగాణ వాసిని బిహార్ వాసిగా చెపుతున్నారు. ఇది జాతి ద్రోహం కాదా. నైతికంగా ఇంత దిగజారిన ప్రధానిని మేము చూడలేదు. శవాల మీద పేలాలు వేరుకునే తంతుగా అబద్దాలతో ఓట్లు అడుగుతున్నారు. ఓట్ల కోసం దేశాన్ని తప్పు దోవపట్టించే ఇలాంటి ప్రధానిని మేము చూడలేదు’ అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతు వ్యతిరేకి చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మారారని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీని వ్యతిరేకించాల్సిన చంద్రబాబు–బీజేపీకి అనుకూలంగా మారి, జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించే గొప్ప ఛాన్స్ పోగొట్టుకున్నారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘చంద్రబాబు అన్ని విధాలా విఫలమయ్యారు. కేంద్రం అనేక ప్రజా వ్యతిరేక బిల్లుల్ని, చట్టాల్ని తెచ్చింది. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ వ్యతిరేకించలేదు’ అని తెలిపారు. -
పవన్‌తో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేశాం
సాక్షి, ద్వారకానగర్ (విశాఖ): గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని, అందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేసిందంటూ విశాఖలో మంగళవారం వామపక్షాలు ఆందోళన చేశాయి. నారాయణ మాట్లాడుతూ.. ఆనాడు తమతో పొత్తు పెట్టుకున్న పవన్.. నేడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నాడని విమర్శించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి వ్యక్తిత్వమే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. (చదవండి: నిజాలు దాచి.. నిందలు) -
బిగ్‌బాస్ అనైతిక షో: నారాయణ
టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ఈ షో వల్ల ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. "అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ షోను ప్రారంభించారు. అది చూస్తుంటే హిమాలయంలో ఉన్న సాంస్కృతిక సంఘాన్ని తీసుకువచ్చి ఈ మురికి కుంటలో పడేసినట్లు ఉంది. విజయ్ మాల్యా జీవించే భవనాలు ఎంత విలాసంగా ఉన్నాయో, అంతకు మించి బిగ్‌బాస్ హౌస్ ఉంది. యువతీ యువకుల్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. వందరోజుల పాటు ఇంట్లోనే పెడతారట. (బిగ్‌బాస్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్!) నాగార్జున ఓ యువకుడిని(అభిజిత్) పిలిపించి.. ముగ్గురు సినిమా హీరోయిన్ల ఫొటోలను చూపించి వారి గురించి చెప్పమంటాడు. అప్పుడా యువకుడు ఒకమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఒకమ్మాయితో డేటింగ్ చేస్తా, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. ఇదేనా యువతీయువకులకు మీరిచ్చే సందేశం. 100 రోజుల పాటు లోపలే ఉంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయడం ఘోరం. ఇలా అనైతిక చర్యలకు పాల్పడటాన్ని మేము ఖండిస్తున్నాం. కళామతల్లికి అన్యాయం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కోట్ల మంది ప్రజలను టీవీ ముందు కూర్చోబెడుతూ సాంస్కృతిక దోపిడీ జరుగుతోంది. ఇలాంటి అనైతిక షోలను ప్రజలు ఆదరించవద్దు" అని నారాయణ పిలుపునిచ్చారు. (బిగ్‌బాస్: ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ) -
లాక్డౌన్లో మద్యం అమ్మకాలా?
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ కొనసాగుతుండగా మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మద్యం అమ్మకాల పునరుద్ధరణను ప్రజావ్యతిరేక చర్యగా పేర్కొంది. లాక్డౌన్ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ ఇప్పటికీ ఉనికిలో ఉంది. లాక్డౌన్ ఇప్పటికీ అమలులో ఉండగా మద్యం దుకాణాలను మద్యం విక్రయించడానికి ఎలా అనుమతిస్తారు? మద్యం అమ్మకాలను అనుమతించడం ప్రజా వ్యతిరేక విధానం. లాక్డౌన్ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలి. లేకపోతే ఇది ప్రజలపై చెడు ప్రభావాన్ని చూపుతుంద’ని నారాయణ అన్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభం కావడంతో వైన్ షాపుల ముందు మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో పలు పలు రాష్ట్రాలు మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, పేదలు, కూలీలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు దేశవ్యాప్తంగా సోమవారం ఒకరోజు దీక్షను చేపట్టారు. లాక్డౌన్ బాధితులను ఆదుకునేందుకు రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. (లాక్డౌన్ బాధిత వర్గాలను ఆదుకోండి) -
ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేయడానికే..
పాతమంచిర్యాల: దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని మోదీ పూజిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. మంచిర్యాలలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభకు హాజరయ్యారు. ట్రంప్ దేశ పర్యటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ట్రంప్ పర్యటనతో దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయని, తీవ్ర నిర్బంధకాండ మధ్య ట్రంప్ పర్యటన సాగుతోందని ఎద్దేవా చేశారు. -
ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తున్నాం
పాత మంచిర్యాల: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు రెండో రోజు ఆదివారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ.. అమెరికా రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆ భారాన్ని ఇతర దేశాలపై మోపడానికి ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారన్నారు. ట్రంప్ పర్యటన ఎలా ఉందంటే మీ ఇంటికొస్తే ఏమిస్తావు.. మా ఇంటికి ఏమి తెస్తావ్ అనేలా ఉందన్నారు. -
ఆర్థిక నేరగాళ్లకు అడ్డా బీజేపీ
సూళ్లూరుపేట: ఆర్థిక నేరగాళ్లకు బీజేపీ అడ్డాగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. ప్రజలసొమ్మును రుణాలుగా తీసుకుని ఆ నగదును తిరిగి బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిని ఆ పార్టీలోకి చేర్చుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సూళ్లూరుపేటలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, పరిపాలనను అస్తవ్యస్తం చేసి ప్రజలను తికమక పెడుతోందన్నారు. ఇప్పటికే అందరికీ ఆధార్ పేరుతో గుర్తింపు కార్డులున్నప్పటికీ ఇందులో మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తుగ్లక్ పాలనను చేస్తున్నారని విమర్శించారు. 1971కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు పౌరసత్వం లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారన్నారు. కార్గిల్ వార్‌లో యుద్ధం చేసిన ఓ మాజీ ముస్లిం సైనికుడికి కూడా పౌరసత్వం లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మనది సెక్యులరిజం దేశం అయినప్పటికీ హిందూమతం మాత్రమే ఉండాలన్నట్టుగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. జనవరి 8న దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు రాజధాని విషయంలో ప్రజలను చీటింగ్ చేశారని విమర్శించారు. -
చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజధానికి 33 వేల ఎకరాలు సమీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రెండు, మూడు వేల ఎకరాల్లో రాజధాని కట్టుకుని ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి రాజధానిని అభివృద్ధి చేయాలనుకోవడం సబబు కాదన్నారు. చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా.. అని మండిపడ్డారు. కుక్కపని కుక్క చేయాలని.. గాడిద పని గాడిద చేయాలని, అలా చేయనందుకే చంద్రబాబు బొక్క బోర్లా పడ్డారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. అసెంబ్లీ, సచివాలయం ఒకేచోట ఉండాలన్నారు. మతప్రాతిపదికన దేశాన్ని చీలుస్తారా? బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన దేశాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ, సచివాలయం ఉన్న రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్నారు. పార్టీ నేత జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.