Mahanadi
-
మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు. మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రతిపాదన ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. తెగని మహానది జలాల వివాదం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు. మహానది టు కావేరి వయా గోదావరి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది. గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే మహానది–గోదావరి అనుసంధానం
సాక్షి, అమరావతి: మహానది జలాల వినియోగంలో ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తలెత్తిన వివాదంపై ట్రిబ్యునల్ విచారణ నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానానికి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే అనుసంధానంపై ముందుకెళ్లాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మహానది ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన తర్వాతే ఆ రెండు నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన, నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ సమగ్రంగా చర్చించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. మూడేళ్ల గడువులోగా ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేయలేదు. దాంతో గడువును కేంద్రం 2023 మార్చి వరకు పొడిగించింది. ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతుండగా అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాంతో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది. గోదావరికి మహానదిని జత చేసి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. 247 టీఎంసీల గోదావరి జలాలకు 408 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది–గోదావరి–కావేరిలను అనుసంధానించి ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమింవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
గొడవపడి మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే..
భువనేశ్వర్/ కటక్: కటక్ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో శుక్ర వారం దంపతులు దూకేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక దళం సంఘటనా స్థలానికి వచ్చి నదిలో గాలించి ఆ దంపతులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చి స్థానిక ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత నదిలో దూకిన భార్య స్వల్పంగా గాయపడింది. భార్యను కాపాడేందుకు భర్త వెంటనే మహానదిలో దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దంపతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది. చదవండి: ఘోరం.. కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
నదుల అనుసంధానంపై నేల విడిచి నీటి వ్రాలు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో పేర్కొన్న గణాంకాలు అస త్యాలతో (నీటి వ్రాలు) కూడుకుని ఉన్నాయని ఏపీ జల వనరుల శాఖ తేల్చి చెప్పింది. నీటి లభ్యతపై స్పష్టత లేదంటూ జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు లేఖ రాసింది. ఈ విషయంలో కచ్చితమైన అంచనా లేకుండా.. ఏ సమ యంలో నీటిని మళ్లించాలనే దానిపై స్పష్టత లేకుం డా.. ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత ఆయకట్టుకు నీళ్లందిస్తారనేది తేల్చకుండా డీపీఆర్ రూపొందించడాన్ని ఎత్తిచూపింది. గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ వరకూ వరద ప్రవాహం ఉంటుందని.. ఆ సమయంలో మహానది నుంచి గోదావరికి నీటిని మళ్లిస్తే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేయడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండ దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్‌కు రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఇటీవల లేఖ రాశారు. దేశంలో హిమాలయ నదులను, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడంలో భాగంగా గంగా–మహానది–గోదావరి–కష్ణా–కావేరీ అనుసం« దానంపై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మహానది (బర్ముల్)–గోదావరి (ధవ ళేశ్వరం బ్యారేజీ) అనుసంధానంపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్)తో కలిసి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన డీపీఆర్‌పై అభి ప్రాయాలు చెప్పాలని ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాలను స్పష్టంగా వివరించింది. అనుసంధాన ప్రతిపాదన ఇదీ ఒడిశాలో బర్ముల్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఆధా రంగా మహానదిలో 1,733.95 టీఎంసీలు ఉంటా యని.. ఇందులో వరద కాలం పూర్తయ్యాక పున రుత్పత్తి ద్వారానే 910.46 టీఎంసీల లభ్యత ఉం టుందని ఎన్ఐహెచ్ అంచనా వేసింది. ఎన్ఐహెచ్ నివేదిక ఆధారంగా బర్ముల్ వద్ద మహానదిపై బ్యారేజీ నిర్మించి.. 356.84 టీఎంసీలను మళ్లించా లని పేర్కొంది. ఈ నీటిలో 178.65 టీఎంసీలను ఒడిశా సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఇవ్వాలని.. మిగతా 178.19 టీఎంసీలను గోదా వరికి మళ్లించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది.మానస్–సంకోష్–తీస్తా–గంగా–మహానది అ నుసంధానం తర్వాత మరో 51.34 టీఎంసీలతో కలిపి మొత్తం 229.53 టీఎంసీలను గోదావరిలోకి మళ్లించేలా డీపీఆర్‌ను రూపొందించింది. బర్ముల్ నుంచి ఒడిశాలో నయాఘర్, కుర్దా, గంజాం, గజ పతి జిల్లాలు.. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మీదుగా 844.595 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వాలని పేర్కొంది. ఈ కాలువ ద్వారా మహానది జలాలను తొర్రిగెడ్డ డ్రెయిన్‌లోకి తరలించి.. ధవళేశ్వరం బ్యారేజీకి 17 కిలోమీటర్ల ఎగువన సీతానగరం వద్ద గోదావరిలో కలపాలని ప్రతిపాదించింది. ఒడిశాకు కేటాయించిన 178.65 టీఎంసీల నీటిని 3.51 లక్షల హెక్టార్లకు అందించాలని పేర్కొంది. ఏపీకి కేటా యించిన 21.39 టీఎంసీలతో 91,110 హెక్టార్లకు నీళ్లందించి.. మిగతా 208.14 టీఎంసీలను కావేరి నదికి మళ్లించేలా డీపీఆర్‌ను సిద్ధం చేసింది. ఆ రెండు లెక్కలపై పొంతన ఏదీ! మహానదిలో నీటి లభ్యతపై ఎన్ఐహెచ్, ఎన్ డబ్ల్యూడీఏ వేర్వేరుగా రూపొందించిన అంచనాలకు పొంతన కుదరకపోవడాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తి చూపింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బర్ము ల్ వద్ద మహానదిలో సహజసిద్ధ ప్రవాహం రూపం లో కేవలం 123.528 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంటుందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క గట్టిందని గుర్తు చేసింది. సాధారణంగా సహజసిద్ధ ప్రవాహం 20 శాతం మాత్రమే పునరుత్పత్తి (రీజనరేషన్) ద్వారా వస్తాయని అంటే.. పునరుత్పత్తి ద్వారా వచ్చే జలాలు 12.35 టీఎంసీలకు మించవని స్పష్టం చేసింది. కానీ.. ఎన్ఐహెచ్ మాత్రం పునరుత్పత్తి ద్వారా 910.46 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిందని, ఆ స్థాయిలో లభ్యత ఎలా ఉంటుందో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ ఆయకట్టుకే నీళ్లిస్తే ఏం ప్రయోజనం! మానస్–సంకోష్–తీస్తా–గంగా–మహానది అనుసంధానం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదని ఏపీ ప్రభుత్వం కుండబద్ధలు కొట్టింది. మహానది–గోదావరి నదుల అనుసంధానానికి చేసిన ప్రతిపాదనలో పేర్కొన్న మేరకు ప్రధాన కాలువ వంశధార, తోటపల్లి, పోలవరం ఆయకట్టు ద్వారా వెళ్తుందని తెలిపింది. ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకే మహానది–గోదావరి నదుల అనుసంధానం ద్వారా నీళ్లందిస్తే ప్రయోజనమని ఏమిటని ప్రశ్నించింది. ఒడిశాలోని ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లందించాలని ప్రతిపాదించారని, ఏపీలో మాత్రం ఒక పంటకే నీళ్లివ్వాలని డీపీఆర్‌లో పేర్కొనడాన్ని తప్పు పట్టింది. -
నది ఇచ్చిన కూతురు
లోకంలో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతాయి. కాని మొన్న ఒడిసాలో జరిగిన పెళ్లి ఒక నది పట్టుబట్టి చేయించినట్టుగా ఉంది. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి మహానదిలో మునిగిపోబోతే ఆ నది పరుపులా మారి 50 కిలోమీటర్ల దూరంలో ఒక బెస్తవాడికి ఆ అమ్మాయిని చేర్చింది. బెస్తవాడు పేదవాడు– హృదయానికి కాదు. పెంచుకున్నాడు. ఊళ్లో అందరూ ఆ అమ్మాయిని ‘మహానది అమ్మాయి’ అని దగ్గరకు తీశారు. ఐదేళ్లు గడిచాయి. ఊరంతా డబ్బు పోగేసింది. ఎం.ఎల్.ఏ కన్యాదాతగా కూచున్నాడు. ఓహ్... ఆ పెళ్లి ఎంత హృదయపూర్వకమైనది. ఒడిస్సా, చత్తిస్గఢ్లలో పారే మహానది పొడవు దాదాపు 900 కిలోమీటర్లు ఉంటుందిగాని సోని యాదవ్ విషయంలో ఆ నది 50 కిలోమీటర్లు చాల్లే అని అనుకున్నట్టు ఉంది. నదిలో కాళ్లు కడుక్కుంటూ పొరపాటున జారి మునిగిపోబోయిన ఆ అమ్మాయిని చత్తిస్‌గఢ్‌లోని రాయఘర్ నుంచి ఒడిసాలోని ఝర్సుగ్దా వరకూ చేర్చింది. అంత దూరం సోని యాదవ్‌ను ప్రాణాలతోనే ఉంచింది. చిత్రమే ఇది. 2016 సెప్టెంబర్‌లో మహానదిలో కొట్టుకొని వచ్చిన అనంతరం ఒరిస్సాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోని యాదవ్ 2016 సెప్టెంబర్ 14న చత్తిస్‌గఢ్‌లోని మహానది ఒడ్డున ఉండే చంద్రహాసిని దేవి ఆలయానికి 18 ఏళ్ల సోని యాదవ్ తన బంధువులతో వచ్చింది. అప్పటికే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. బంధువులే పెంచుతున్నారు. పూజ అయ్యాక నదిలో కాళ్లు కడుక్కుందామని దిగిన సోని పొరపాటున నదిలో పడిపోయింది. ప్రవాహ ఉధృతికి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయితే చేయాల్సింది అంతా మహానదే చేసింది. పెంపుడు తల్లిదండ్రులతో సోని యాదవ్ సాయంత్రం నదిలో పడితే 12 గంటల పాటు చక్కగా సోనిని తేల్చుకుంటూ రాష్ట్రం దాటి పొరుగునే ఉండే ఒడిసాలోని ఝర్సుగ్దా జిల్లాలోకి తెల్లవారుజాముకు తీసుకెళ్లింది. ఆ జిల్లాలోని ‘కుశ్మేల్’ అనే గ్రామానికి చెందిన బెస్తవాడు సన్యాసి కాలో ఆ సమయంలో పడవతో మహానదిలో చేపలు పడుతున్నాడు. దూరంగా తేలుకుంటూ వస్తున్న మానవ ఆకారం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే పడవను చేర్చి సోని యాదవ్‌ను పడవలోకి లాగాడు. హడావిడిగా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. సోని బతికింది. ‘నీళ్లల్లో పడ్డాక తల నీటిపైకి పెట్టి కాళ్లు ఆడించడమే నేను చేయగలిగాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు’ అని సోని అంది. 2021 ఏప్రిల్ 21న సోని వివాహం ఆ అమ్మాయి కోలుకున్నాక సన్యాసి కాలో ఆమె వివరాలు కనుక్కొని ఇంటికి దింపుతానని అన్నాడు. కాని సోని నిరాకరించింది. తనకు ఎవరూ లేరని, ఇక్కడే ఉండిపోతానని అంది. సన్యాసి కాలో ఆ అమ్మాయిని పెంపుడు కూతురు చేసుకున్నాడు. ఊళ్లో ఈ సంగతిని అందరూ ఆహ్వానించారు. అంతే కాదు ‘మహానది అమ్మాయి’ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా ఆ చత్తిస్గఢ్ అమ్మాయి ఒడిస్సాలోని ఆ ఊరినే తన ఊరు చేసుకుంది. టైలరింగ్ నేర్చుకుంది. అందరి బట్టలూ కుట్టసాగింది. పెళ్లీడు వచ్చిన సోనికి తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నాడు కాలో. కాని అతనికి ఉన్నదే అంతంతమాత్రం. ఊళ్లో అందరూ బెస్తవారే. వారి దగ్గర కూడా ఏముంటుంది కనుక. కాని అందరూ సంతోషంగా నడము బిగించి ఉన్నంత లో తలో చేయి వేసి అబ్బాయిని వెతికారు. కుర్రాడు పురుషోత్తం యాదవ్ భవన నిర్మాణ కార్మికుడు. స్థానిక ఎం.ఎల్.ఏకు ఈ విషయం తెలిసి తాను కన్యాదాతగా కూచుంటానని ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 21న కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోని వివాహం జరిగింది. సోని అసలు బంధువులు, మారుతండ్రి బంధువులు ఈ పెళ్లికి హాజరయ్యారు. అంపకాలు పెట్టే సమయంలో కాలో, అతని భార్య సోనిని సాగనంపుతూ కన్నీరు కార్చారు. మహానది ఏమీ ఎరగనట్టుగా పారుతూ ఒడ్డును ఒరుసుకొని కొంత నురగను అక్షింతలుగా చల్లే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
మహానదే ఫస్ట్
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కొత్త అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. గోదావరి బేసిన్లో రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని మొదటినుంచీ గట్టిగా కోరుతున్న తెలంగాణ, ప్రస్తుతం మహానదిలో మిగులుగా ఉన్న నీటిని గోదావరికి తరలించాకే దిగువన అనుసంధాన ప్రక్రియ (గోదావరి– కావేరి) చేపట్టాలని బలంగా వాదిస్తోంది. గోదావరికి ఉపనదిగా ఉన్న ఇంద్రావతిలో మిగులు నీటిని చూపెట్టి వాటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... మొదట మహానది– గోదావరి అనుసంధానం చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది. మహానదిలో మిగులు నీరు గోదావరిలో కలిస్తే రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది రాదని, అప్పుడు గోదావరి–కావేరి అనుసంధానం చేస్తే తమకు అభ్యంతరమేమీ ఉండదని తెలిపింది. సోమవారం జరిగిన జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. మహానదిలో మిగులు 100 టీఎంసీలే: ఒడిషా ఒకనదిలో అధిక లభ్యత ఉన్న నీటిని ఆ నది పరివాహక ప్రాంత అవసరాలకు తీరాక మరో నదికి తరలించే క్రమంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియకు ఆదినుంచి ఇక్కట్లే ఎదురవుతున్నాయి. మొదటగా ఒడిషాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహానదిలో సుమారు 320 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. అయితే ఈ ప్రతిపాదనపై ఎగువన ఉన్న ఒడిషా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలతో ఒడిషా విబేధించింది. మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని వాదించింది. ఈ అనుసంధానంతో తమ రాష్ట్రంలోని 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని అభ్యంతరం తెలిపింది. తెలంగాణ సైతం గోదావరిలో లభ్యంగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో 350 టీఎంసీ అదనపు జలాలున్నాయనడం (తెలంగాణ రాష్ట్ర పరిధిలో) సరికాదని అంటోంది. అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాలోŠల్ కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహానది–గోదావరి ప్రతిపాదనను పక్కనపెట్టి, గోదావరి–కావేరి అనుసంధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చి నాలుగు రకాల ప్రతిపాదనలు రూపొందించింది. చత్తీస్‌గఢ్ కొర్రీ... ఇక గోదావరి– కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతుండటంతో వరంగల్ దగ్గర్లోని జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్‌న్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని కూడా తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మిగులు ఉన్నాయని చెబుతున్న ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే ఉపయోగించుకుంటామని ఎన్‌డబ్ల్యూడీఏ ముందు చత్తీస్‌గఢ్ గట్టిగా వాదిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని పేర్కొంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీల వినియోగం చేస్తామని అంటోంది. దీంతో తెలంగాణ సైతం మహానదిలో మిగులు నీటిని గోదావరికి తరలించి, రాష్ట్ర అవసరాలు తీర్చుతూ మిగులు నీటిని కావేరికి తరలించాలని పట్టుబడుతోంది. దీంతో పాటే ఎగువన రాష్ట్రాలు వారి రాష్ట్రాల సరిహద్దు పరిధిలో అంతర్గత నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాయని, దీనిద్వారా దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటి లభ్యత తగ్గుతుందని అభ్యంతరం తెలిపింది. అయితే దీనిపై రాష్ట్ర అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు తెలియజేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. -
తేలని.. ‘మహా’ జలవివాదం
భువనేశ్వర్: మహానది జలాల పంపిణీకి సంబంధించి ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతుంది. మహానది జల వివాదాల ట్రిబ్యునల్‌లో ఈకేసు విచారణ కొనసాగుతుంది. తాజాగా జరిగిన విచారణ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేర్వేరుగా నివేదికలను దాఖలు చేయాలని ట్రిబ్యునల్ ఉభయ రాష్ట్రాలకు ఆదేశించింది. రానున్న జనవరిలో క్షేత్రస్థాయి పరిశీలన ముగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 4న ఛత్తీస్గడ్ ప్రభుత్వ ప్రతినిధులు ఒడిశాను సందర్శిస్తారు. అనంతరం అదే నెల 16న ఒడిశా ప్రతినిధులు ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని ట్రిబ్యునల్ తేదీలను ఖరారు చేసింది. ఈ రెండు ప్రభుత్వాల నివేదిక దాఖలైన మేరకు వచ్చే ఫిబ్రవరి 1న తదుపరి విచారణ జరుగుతుందని ట్రిబ్యునల్ తెలిపింది. గతంలో ఉభయ రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో సందర్శించాయి. ఈ ఏడాది అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు ఒడిశా ప్రభుత్వ ప్రతినిధులుఛత్తీస్‌గడ్‌లో పర్యటించారు. నవంబరు 2వ వారంలో అక్కడి అధికారుల బృందం స్థానికంగా సందర్శించింది. ఉభయ బృందాలు క్షేత్రస్థాయి నివేదికను ట్రిబ్యునల్‌కు దాఖలు చేశాయి. ఛత్తీస్గడ్ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు శనివారం నివేదిక దాఖలు చేయగా.. దీనిపై అభ్యంతర పిటిషన్ దాఖలు చేసేందుకు ఒడిశాకు 4 వారాల గడువు మంజూరు చేయడం విశేషం. ఉమ్మడి సర్దుబాటుకు సంకేతాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్న మహానది జలాల పంపిణీ వివాదం క్రమంగా కొలిక్కి వస్తున్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాలు మహానది జలాల పంపిణీ విషయంలో ఉమ్మడి సూత్ర ప్రాతిపదికన రాజీ కుదరకుంటే ట్రిబ్యునల్ చొరవ కల్పించుకుని పరిష్కార మార్గదర్శకం జారీ చేస్తుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న జరగనున్న విచారణలో నదీ జలాల పంపిణీ వివాదానికి స్పష్టమైన పరిష్కారం ఖరారు అవుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా అభ్యర్థన మహానది ఎగువ భాగంలో ఛత్తీస్గడ్ ప్రభుత్వం బ్యారేజీలు ఇతరేతర నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులను వెంటనే నిలిపి వేయాలని ఒడిశా ప్రభుత్వం అభ్యర్థించింది. వర్షాకాలం తరువాతి వ్యవధిలో రాష్ట్రంలో మహానది లోతట్టు ప్రాంతాలకు 1.74 మిలియన్ ఎకరపు అడుగుల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను అభ్యర్థించింది. -
ఒడిశాలో ఘోర ప్రమాదం
-
ఒడిశాలో ఘోర ప్రమాదం
భువనేశ్వర్/కటక్: ఒడిశా రాష్ట్రం కటక్‌లోని మహానది వంతెన పైనుంచి మంగళవారం సాయంత్రం బస్సు బోల్తాపడిన ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డీజీపీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శర్మ తెలిపిన వివరాల మేరకు..అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ నగరానికి వస్తున్న జగన్నాథ్ అనే ప్రైవేట్ బస్సు కటక్‌లోని మహానది వంతెనపై వస్తున్న దున్నపోతును తప్పించే క్రమంలో దాన్ని ఢీకొని..అనంతరం 30 అడుగుల పైనుంచి నది పక్కకు పడిపోయింది. ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, దున్నపోతు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పోలీసు, అగ్నిమాపకదళం, విపత్తు స్పందనదళం (ఒడ్రాఫ్) జవాన్లు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల్ని ఆదుకోవడంలో తలమునకలయ్యారు. చీకటి పడడంతో సహాయ, పునరుద్ధరణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. బాధితుల వివరాల కోసం 6712304001లో సంప్రదించాలని డీజీపీ తెలిపారు. -
ముచ్చట పడి కొన్న కారే.. ముగ్గురిని బలిగొంది!
పూణేలో బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్న తోట చంద్రమౌళి భార్యా పిల్లలతో కలిసి సంక్రాంతి సెలవులకు స్వగ్రామమైన మహానంది మండలం తిమ్మాపురానికి వచ్చారు. సోమవారం పండుగను ఘనంగా చేసుకున్నారు. బుధవారం నంద్యాలలో ఓ సెకండ్ హ్యాండ్ కారును ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేశారు. కర్నూలులోని మిలటరీ క్యాంటీన్లో వస్తువులను కొనేందుకు ఆ కారులోనే భార్య, తమ్ముళ్లు, స్నేహితుడితో కలిసి బయలుదేరారు. పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. కారు, బస్సు ఢీకొనడంతో చంద్రమౌళి భార్య పద్మావతి (28), స్నేహితుడు హేమసుందర్ గౌడు(32), తమ్ముడు రవికుమార్(24) మృతిచెందారు. పాణ్యం/ మహానంది: పాణ్యం సమీపంలోని జాతీయ రహదారిపై నూలుమిల్లు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. మçహానంది మండలం తిమ్మాపురానికి చెందిన తోట చంద్రమౌళి బీఎస్ఎ‹ఫ్(ఫూణే)లో పని చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన పద్మావతి(28)తో వివాహమైంది. వీరికి కార్తీక్, లక్ష్మీప్రియ ఉన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఇటీవల సెలవుపై భార్య, పిల్లలతో కలిసి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం నంద్యాలలో సెకండ్ హ్యాండ్ కారు, కర్నూలుకు వెళ్లి క్యాంటీన్లో వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు చంద్రమౌళి తన క్లాస్మేట్ హేమసుందర్‌గౌడు(32), తన తమ్ముళ్లు హరిప్రసాద్, రవికుమార్(24)లతో కలిసి ముందుగా బైక్‌లపై నంద్యాలకు వెళ్లారు. అక్కడ సెకంyŠ హ్యాండ్ కారుకొన్నారు. తర్వాత పద్మావతిని పిలుచుకురావాలంటూ చంద్రమౌళి తమ్ముడు హరిప్రసాద్‌ను పంపాడు. ఆమె రావడంతో అందరూ కర్నూలుకు కారు(ఏపీ 21బీఎం 9132)లో బయలుదేరారు. ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల వద్ద హైవేపై డైవర్షన్ ఉండడంతో ఎడమ వైపు నుంచి కుడివైపు వెళ్తుండగా నూలుమిల్లు వద్ద ఎదురుగా వస్తున్న కడప డిపోకు చెందిన ఏపీ04జెడ్ 0224 నంబర్ గల అల్ట్రా డీలక్స్ బస్సు ఢీ కొంది. ఘటనలో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన హేమచంద్రగౌడ్, హరిప్రసాద్, చంద్రమౌళి, రవికుమార్‌ను స్థానికులు, సీఐ పార్థసారథిరెడ్డి , ఎస్ఐ చిరంజీవి బయటకు తీసి పోలీస్ వాహనంలో శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. తర్వాత రవికుమార్‌ను కర్నూలు ప్రభుత్వాస్పత్రి, హేమచంద్రగౌడ్ను గౌరీగోపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించకపోవడంతో ఇద్దరూ మృతి చెందారు. ప్రస్తుతం చంద్రమౌళి గౌరీగోపాల్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఎం.తిమ్మాపురంలో విషాదఛాయలు. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో ఎం.తిమ్మాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే చంద్రమౌళి తల్లి పుల్లమ్మ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు మజ్జిగ తాపించి ఓదార్చారు. మరో మూడేళ్లలో చంద్రమౌళి రిటైర్ కానున్నాడు. ఇక్కడే ఉండేందుకు స్థలం కూడా కొనుగోలు చేశాడు. వీరితో పాటు వెళ్లిన హేమసుందర్‌గౌడు చంద్రమౌళికి క్లాస్మేట్. ఎంఎస్సీ, బీఈడీ పూర్తిచేసి ప్రైవేటు స్కూలులో ఉద్యోగం చేస్తున్నాడు. హేమసుందర్ మృతితో ఆయన తండ్రి ఎస్.నరసింహులు అలియాస్ టైలర్ నరసింహులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. రవికుమార్ పదవతరగతి వరకు చదివి డ్రైవర్‌గా పని చేసేవాడు. పెద్ద దిక్కు పోయింది నా పెద్దదిక్కు పోయింది...నా పద్దూ తల్లీనే నా పెద్దకొడుకులా ఉండేది...అంటూ పద్మావతి తల్లి లక్ష్మిదేవి రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె పద్మావతి. కూలి పనులు చేసుకుంటూ తమ కుమార్తెలను కష్టపడి చదివించి ముగ్గురికి పెళ్లిళ్లు చేశారు. అక్కా...లే అక్కా.. పద్మావతి అంటే ఆమె చెల్లి దివ్యకు ప్రాణం. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన తన అక్కను చూసి అక్కా...లే అక్కా...మేమొచ్చాము అంటూ చెల్లి దివ్య రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తిమ్మాపురంలోని అత్తారింటికి తీసుకుని వచ్చారు. అనంతరం వాహనంలో తల్లి, తండ్రి, చెల్లీ వచ్చారు. తన అక్క మృతదేహంపై పడి దివ్య రోదించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది. డైవర్షన్‌తోనే ప్రమాదం? శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల వద్ద హైవే వారు డైవర్షన్ మళ్లించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎడమ వైపు చిన్న పాటి పనులు జరుగుతుండడంతో ఆ వైపు రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో కుడి వైపు రోడ్డు రద్దీగా మారింది. దీంతోపాటు వాహనాలు రెండూ వేగంగా రావడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే డైవర్షన్‌ను తొలగించి యథావిధిగా రాకపోకలు పునరుద్ధరించారు. ప్రాణాలతో బయటపడిన చిన్నారులు.. చంద్రమౌళి, పద్మావతి దంపతులకు కార్తీక్(మూడోతరగతి), లక్ష్మీప్రియ(రెండోతరగతి) సంతానం. తండ్రి వెంట వెళ్లేందుకు వారు ఉదయం మారాం చేశారు. కానీ వారి అవ్వ, తాతలు సర్దిచెప్పడంతో మిన్నకుండిపోయారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడినట్లయింది. వెంటాడిన మృత్యువు సంఘటనా స్థలంలో మృతి చెందిన పద్మావతిని మృత్యువు వెంటాడింది. ముందుగా వారితో పాటు వెళ్లలేదు. అయితే నంద్యాలలో సంతకం, వేలిముద్రలు అవసరమని, పిలుచుకుని రావాలని చంద్రమౌళి తమ్ముడు హరిప్రసాద్‌ను పంపడం, బైక్‌పై తీసుకురావడం జరిగింది. ఇంటి దగ్గరే ఉన్నా ఆమె ప్రాణాలతో బయటపడేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి
కన్నడ టీవీ సీరియల్స్ మహానది, త్రివేణి సంగమ, మధుబాల లాంటి సీరియల్స్ లో నటించిన యువ నటి రచన, నటుడు జీవన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మిత్రులతో కలిసి బెంగుళూరు దగ్గరలోని సుబ్రమణ్య స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్యాంకర్ ను డీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో జీవన్ డ్రైవింగ్ సీట్లో ఉండగా రచన అతని పక్క సీట్లో కూర్చోని ఉంది. వీరితో పాటు ప్రయాణిస్తున్న మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుధవారం రచన, జీవన్ ల స్నేహితుడు కార్తీక్ బర్త్‌డే సందర్భంగా పూజలు నిర్వహించి అక్కడే బర్త్‌డే పార్టీ చేసుకుని గురువారం తెల్లవారు జామున సఫారీ కారులో బయలుదేరారు. తిరిగి వస్తుండగా కర్నాటకలోని మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన రచన, జీవన్ ల మిత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. -
సీనియర్ ఎన్టీఆర్‌గా జూనియర్?
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘మహానటి’ సినిమా నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక్కో రోజు ఒక్కో న్యూస్ బయటికొస్తోంది. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఆయన మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో పెద్ద ఎన్టీఆర్ పాత్రకూ ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ఆ పాత్రలో వేరెవరో కంటే చిన్న ఎన్టీఆర్ అయితే బెస్ట్ అని ‘మహానటి’ బృందం ఆలోచనట. అందుకే ఎలాగైనా జూనియర్ని ఒప్పించాలనుకుంటున్నారట. మరి తాత పాత్రలో మనవడు నటిస్తారా? లేదా? వెయిట్ అండ్ సీ. -
ప్రేమజంట ఆత్మహత్య
పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా మహానంది ప్రాంతానికి చెందిన అశోక్, అహోబిలానికి చెందిన రజిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శుక్రవారం ఉదయం మహానంది సమీపంలోని ఎంసీఫారమ్ గ్రామ అటవీ ప్రాంతంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
తుంగా స్నానం..ఎంతో కష్టం
► పుణ్యస్నానాలకు పడరాని పాట్లు ► ఎండిన తుంగభద్ర.. కానరాని ప్రత్యామ్నాయం ► భక్తుల ఇబ్బందులను గాలికి వదిలేసిన శ్రీమఠం మంత్రాలయం తుంగా స్నానం పాప హరణం. ఇది భక్తుల ప్రగాఢ నమ్మకం. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తుడూ తుంగభద్రమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచారం. ప్రస్తుతం చుక్కనీరు లేక తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయింది. భక్తులకు పుణ్యస్నానాలు కరువయ్యాయి. శ్రీమఠం అధికారులు సైతం భక్తుల కష్టాలను గాలికి వదిలేశారు. కారణంగా భక్తులు స్నానాలకు పడరాని పాట్లు పడుతున్నారు. పేరు గొప్ప.. కష్టాల దిబ్బ అన్న చందంగా క్షేత్రంలో భక్తుల పరిస్థితి మారింది. వేడుక చూస్తున్న శ్రీమఠం.. రాఘవేంద్రస్వామి దర్శనార్థం రోజుకు 2-3 వేలు మంది భక్తులు ఇక్కడి వస్తారు. వేసవి సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగిపోయింది. అయితే భక్తులు పుణ్యస్నానాల చేసుకోవడానికి నీరులేక అల్లాడిపోతున్నారు. నదిలో ఓచోట మడుగులో నిల్చిన కలుషిత నీటిలోనే ముక్కు మూసుకుని ఒళ్లు తడుపుకుంటున్నారు. నీరు పచ్చగా మారి వాసన వస్తున్నా వేరే గత్యంతరం లేక స్నానాలు చేస్తున్నారు. అందులో స్నానం చేయడంతో ఒళ్లు దద్దులు, దురద వేస్తోందని భక్తులు వాపోతున్నారు. ఆ మడుగులో నీరింకితే అగమ్య గోచరమే. వర్షాభావ పరిస్థితుల్లో భక్తులకు ఇక్కట్లు వస్తాయని తెలిసినా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. కోనేరును కూల్చే యోచన.. తిరుపతి, మహానంది, యాగంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు కోనేరుల్లో ఎంతో ఆనందంగా స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి భక్తులకు ఆ భాగ్యం ఎప్పటి నుంచో లేదు. చెంతనే తుంగభద్ర నది ఉన్నా పుష్కరిణి నిర్మించలేకపోయారు. ఏడేళ్ల క్రితం భక్తుల సౌకర్యార్థం అంచనా వ్యయం రూ.16 లక్షలతో మఠం వెనుకభాగం తులసీవనం సమీపంలో పుష్కరిణి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాకారం, వాటర్ ఫౌంటెన్ నిర్మాణాలు సైతం పూర్తి చేశారు. అయితే మఠం అధికారులు అర్ధంతరంగా పనులు నిలిపేశారు. కట్టిన అరకొర కట్టడాల కోనేరును సైతం ప్రస్తుత అధికారులు కూల్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు పుణ్యస్నానాలకు కనీసం నీళ్ల ట్యాంకర్లు ఏర్పాటు చేసినా పర్వాలేదు. అధికారులకూ ఇవేమీ పట్టడం లేదు. భక్తులను కష్టాలకు వదిలేసి వేడుక చూస్తున్నారు. పుణ్యస్నానాల విషయంలో వచ్చిన ప్రతి భక్తుడూ శ్రీమఠం అధికారులను నిట్టూరుస్తున్నా స్పందించని వైనం. -
మహానంది పుణ్యక్షేత్రంలో దొంగల చేతివాటం
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో దొంగల చేతివాటం పెరిగిపోయింది. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన అనురాధ అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలసి మహానందీశ్వరుని దర్శనం కోసం వచ్చారు. కోనేరులో మూడు మునకలు వేసి వచ్చి చూడగా.. ఒడ్డున ఉంచిన వస్త్రాలు మాయం అయ్యయి. అందులోని రూ.1200 నగదు, కారు తాళం పోయాయని గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురు యవుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహనంది పుణ్యక్షేత్రంసమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మహనందికి చెందిన రాజశేఖర్(22) తన ఇద్దరు మిత్రులతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రాజశేఖర్ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. -
మహానందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కర్నూలు జిల్లాలోని మహానందిలో కొలువైన కామేశ్వరిదేవీ సమేత మహానందీశ్వరుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన న్యాయమూర్తుల బృందానికి ఆలయ ఏఈవో మధు, వేద పండితులు స్వాగతం పలికారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెంట నంద్యాల జడ్జి యూ రామ్మోహన్, కర్నూలు ఎక్సైజ్ మేజిస్ట్రేట్ రాజు, నాంపల్లి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శంకర్ తదితరులు ఉన్నారు. స్వామి దర్శనం అనంతరం వారు అహోబిలం వెళ్లారు. -
మహానందిలో రేపటి నుంచి ఉచిత దర్శనం
మహానంది పుణ్యక్షేతంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి డబ్బులు ఇక చెల్లించనక్కర్లేదు. భక్తులు ఉచితంగా దర్శించుకునేలా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహానంది పుణ్యక్షేత్ర చైర్మన్ మాన్యం ప్రసాదరావు, ఈవో శంకర వరప్రసాద్, పాలకమండలి సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు ఆలయ అధికారులు సాధారణ దర్శనం కోసం రూ.10 వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు ఉచితంగా మార్చారు. ప్రత్యేక దర్శనం రేట్లు ఎప్పటిలానే ఉన్నాయి. కొత్తగా క్షీరాభిషేకంను ప్రారంభించారు. దీని ధర రూ.200లుగా నిర్ణయించారు. -
మహానందిలో భక్తుల కిటకట
కార్తీక మాసం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. కార్తీక సోమవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. కర్నూలు జిల్లా మహానందిలో వెలిసిన మహానందీశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో.. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
అప్పుల బాధ తాళలేక
మరో మూడు రోజుల్లో కూతురు పెళ్ళి ఉండగా.. ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మహానంది మండలం గాదెల పల్లి గ్రామానికి చెందిన రైతు మహానంది(40)కి నలుగురు కుమార్తెలు. పెద్ద కూమార్తె వివాహం ఈ నెల 24న జరగాల్సి ఉంది. కాగా.. బుధవారం తెల్లవారుజామున మహానంది ఇంటివద్ద పురుగుల మందు తాగి ఆహ్మతహ్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో.. కుమార్తె పెళ్లి ఖర్చు రైతును కుంగదీసింది. ఇదే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని బంధువులు చెబుతున్నారు. -
నదుల స్వగత కథనం
నడకే నాట్యం గమనం స్వదేశీ యాత్రికులు పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ విదేశీ యాత్రికులు నా తీరాన విస్తృతంగా పర్యటించారు. గ్రీకు యాత్రికుడు టాలమీ, చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్లు నా తీరాన్ని ప్రపంచానికి తెలియచేశారు. స్వాతంత్య్రపోరాటంలో గాంధీజీ వచ్చి గిరిపుత్రులను స్వాతంత్య్రోద్యమబాట పట్టించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ వచ్చి లండుంగ్రీ- చందిలిడుంగ్రీ కొండల మధ్య హీరాకుడ్ ఆనకట్ట కట్టి జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట అంటూ పిల్లలు పాఠం నేర్చుకుంటూంటే విని మురిసిపోతుంటాను. నా మీద చిన్న పెద్దా కలిసి ముప్పైకి పైగా పవర్ ప్లాంటులున్నాయి. హీరాకుడ్తోపాటు రవిశంకర్సాగర్, దూధ్వా, సోందూర్ రిజర్వాయర్లు, హాస్దేవ్ వంటి ప్రధాన ప్రాజెక్టులతోపాటు చిన్న పెద్ద ఆనకట్టలు నా నీటిని ప్రజోపకరంగా మారుస్తున్నాయి. చత్తీస్‌ఘడ్‌లో పుట్టి తూర్పు కనుమల గుండా ప్రవహిస్తూ ఒడిషాలో అడుగుపెట్టి బంగాళాఖాతంలో కలిసే మధ్యలో సియోనాథ్, జోంక్, హాస్దేవ్, మాండ్, ఇబ్, ఓంగ్, తేల్ నదులు నాతో జతకడతాయి. ఇన్నేసి నదులు నా స్నేహం కోసం వచ్చాయని సంతోషపడుతూ పరుగులు తీస్తుంటాను. కనుచూపు మేరలో కటక్ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఇంతలో నా ప్రవాహం నుంచి ఒక పెద్ద పాయ చీలిపోతుంది. కట్జోరి పేరుతో కొత్త పేరు పెట్టుకుని ఆ పాయ తన ఉనికిని చాటుకునే లోపు నీరు పల్లమెరుగు అనే నానుడిని రుజువు చేస్తూ ఆ ప్రవాహం కాస్తా మరో ఐదు పాయలుగా చీలిపోతుంది. అవి పైకా, బిరుప, చిత్రోక్తల, గెంగుటీ, లున్ పేర్లతో సాగరం వైపు పరుగులు తీస్తుంటాయి. నేను పారాదీప్‌కు సమీపంలో జగత్సింగ్పూర్ దగ్గర సాగరంలో కలిసిపోతాను. నా ప్రవాహం ఎంత విశాలంగా ఉండేదంటే... బంగాళాఖాతం నుంచి నౌకలు దాదాపుగా 150 కిలోమీటర్ల లోపలికి వచ్చేవి. హీరాకుడ్... నీటికి ఆనకట్టతోపాటు నౌకలకు అడ్డుకట్ట అయింది. ప్రాచీనకాలంలో సంబల్పూర్ వర్తకవాణిజ్య కేంద్రం కావడానికి కారణం నా ప్రవాహమే. తూర్పు కనుమల మధ్య దారి వెతుక్కుంటూ మెలికలు తిరుగుతూ నెమ్మదిగా ప్రవహించే నేను సత్కోసియా దగ్గర కొండలను ఒరుసుకుంటూ నేలకు ఉరుకుతాను. నన్ను కళ్లారా చూడడానికే ఆనకట్ట డెక్ మీద 21 కి.మీల దూరం ప్రయాణించే పర్యాటకులను చూడడం నాకు అద్భుతమైన అనుభూతి. మన సాంకేతిక పురోగమనానికి నిదర్శనంగా ఆనకట్టకు ఉత్తరాన గాంధీ మినార్, దక్షిణాన నెహ్రూ మినార్లుంటాయి. హిండాల్కో హీరాకుడ్ స్మెల్టర్, హిండాల్కో హీరాకుడ్ పవర్, సామలేశ్వరి స్పాంజ్ ఐరన్ లిమిటెడ్, టి.ఆర్. కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలకు నేనే పెద్ద ఆసరా. గిరిపుత్రుల సామూహిక వేడుకలు... సంబల్పూర్లో అడుగుపెడుతుంటే ప్రకృతిని ప్రేమించే గిరిజనుల ఆహార్యం గుర్తొచ్చి మనసు పులకిస్తుంది. గోండు, భుయాన్ గిరిపుత్రులు ఏడాదిలో ప్రతి దశనూ వేడుక చేసుకుంటారు.ఎర్రటి, పసుపువర్ణం వస్త్రాలు ధరించి జుట్టును కొప్పు పెట్టి పూలు చుట్టుకుని అచ్చమైన అడవి మల్లెల్లాంటి యువతులు అర్ధ వలయాకారంగా నిలబడి సంగీతానికి, సాహిత్యానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు కదుపుతూ చేసే ‘దాల్ఖాయ్’ నృత్యం, పిల్లల కోసం చేసే ‘కర్మా’ నృత్యం, రాధాకృష్ణుల ప్రేమ ఇతివృత్తంతో యువతీయువకులు చేసే ‘కోయిసాబాదీ’ నృత్యం కనువిందు చేస్తాయి. బౌద్ధ పరిమళాలు... నా తీరం చారిత్రక కట్టడాలు, పచ్చటి కొండలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల సుమహారం. హ్యూయాన్‌త్సాంగ్ ఇక్కడ అంగుళం అంగుళాన్ని పరికించి గ్రంథస్థం చేస్తుంటే చూసి పొంగిపోయాను. బౌధ్‌లో అడుగుపెట్టగానే మధ్యయుగం నాటి బౌద్ధ విగ్రహాలు కళ్ల ముందు మెదలుతాయి. చౌహాన్ పాలకులు కట్టించిన పటానేశ్వరి ఆలయం, సామలేశ్వరి గుడి, బారా జగన్నాథ ఆలయాలు పర్యాటకులతో కళకళలాడుతూంటాయి. వీటన్నింటికంటే ఆసక్తికరమైనది బిమలేశ్వర్ ఆలయం. హుమా ఆలయంగా పిలిచే ఈ కట్టడం కొద్దిగా ఒరిగి ఉంటుంది. ఒరిగి నిలబడడం ఓ ప్రపంచ వింత అయితే ‘లీనింగ్ టవర్ ఆఫ్ పిసా’లాగ బిమలేశ్వర్ ఆలయమూ ఓ వింతే. ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి email: manjula.features@sakshi.com మహానది ప్రవాహ దూరం: 858 కి.మీ.లు పుట్టింది: చత్తీస్‌ఘర్ కొండల్లో సాగరసంగమం: బంగాళాఖాతంలో ఒరిస్సా రాష్ట్రంలోని పారాదీప్ దగ్గర -
మహా’యజ్ఞం మొదలు!
మహానది-గోదావరి-కృష్ణా-కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియకు కేంద్రం శ్రీకారం ఈ వారంలోనే తెలంగాణ, ఒడిశాలతో కేంద్ర ప్రత్యేక బృందాల చర్చలు ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్, ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టుల అనుసంధానం గోదావరి నీటిని కృష్ణాకు తరలించేలా ప్రణాళిక ఇచ్చంపల్లి-సాగర్ లింకుకు రూ. 26,289 కోట్ల ఖర్చు సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రధాన నదుల అనుసంధాన ప్రక్రియ ఆరంభమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ప్రణాళికలు రచిస్తోంది. నదుల అనుసంధాన పథకం కింద దక్షిణాది ప్రాంతానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రాలతో చర్చలకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా తొలుత తెలంగాణ, ఒడిశాలను సంప్రదించనుంది. మహానది-గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన ంపై కేంద్రం నియమించిన రెండు ప్రత్యేక బృందాలు ఈ వారంలోనే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు రానున్నాయి. ఇప్పటికే అనుసంధాన సాధ్యాసాధ్యాలపై నివేదికలు సిద్ధమయ్యాయి. తదుపరి కార్యాచరణలో.. పర్యావరణ, అటవీ అనుమతులు, ప్రణాళిక వ్యయం, నీటి లభ్యతపై బృందాల ప్రతినిధులు అధికారులతో చర్చించి ఓ అంచనాకు రానున్నారు. బృహత్తర ప్రణాళిక.. భారీ ఖర్చు! అదనపు జలాల లభ్యత ఉన్న నది నుంచి మరో నదికి నీటిని మళ్లించడమే అనుసంధాన ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. దక్షిణాదిలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణా, కావేరీలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యం కల్పించారు. ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించాలన్నది ప్రణాళిక. మహానదిలో సుమారు 360 టీఎంసీలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి(గోదావరి)-నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించేందుకు చర్యలు చేపడతారు. ఇందుకు ఒక్క 299 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధాన ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరం అవుతాయని లెక్కగట్టారు. ఇందులో ప్రధాన లింక్ కెనాల్‌కు రూ. 14,636 కోట్ల అవసరమని అంచనా వేశారు. ఇక 312 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి-పులిచింతలకు సైతం భారీ ప్రణాళికే రచించారు. దీని పూర్తి అంచనా ఎంతన్నది తెలియకున్నా ప్రధాన కెనాల్‌కు మాత్రం రూ. 4,252 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక అనుసంధాన కాల్వల వెంబడి రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకంతో 226 గ్రామాలు, లక్ష మంది ప్రజలు ప్రభావితం కానున్నారు. మరో 51 వేల అటవీ, 70 వేల వ్యవసాయ భూమి కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక బృందాలు వీటన్నింటిపై కూలంకషంగా రెండు రాష్ట్రాలతో చర్చించనున్నాయి. అనుసంధానంపై రాష్ట్రాల అభ్యంతరాలు తెలుసుకుంటాయి. గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), ఎల్లంపల్లి(60 టీఎంసీలు), దేవాదుల(38 టీఎంసీలు), కంతనపల్లి(50 టీఎంసీలు) ప్రాజెక్టుల నీటి అవసరాలపైనా బృందం చర్చించనుంది. లబ్ధి అంచనాలు ఇలా.. అనుసంధానించనున్న ఇచ్చంపల్లి-పులిచింతల, ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో తెలంగాణలో మొత్తంగా 9 లక్షల హెక్టార్ల మేర అదనపు సాగు అందుబాటులోకి వస్తుం దని కేంద్రం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అలాగే గృహ, సాగునీటి అవసరాలకు మరో 15 టీఎంసీల మేర నీరు అందుబాటులోకి వస్తుందని, 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధానంతో కరీంనగర్ జిల్లాలో 2 మండలాలు, వరంగల్ 11, నల్లగొండలోని 9 మండలాల్లో 2.87లక్షల హెక్టార్లకు అదనపు సాగునీరు లభిస్తుంది. ఇచ్చంపల్లి-పులిచింతలతో వరంగల్ 2 మండలాలు, ఖమ్మం 13 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 2, కరీంనగర్లో ఒక మండల పరిధిలో 6.13 లక్షల హెక్టార్ల సాగు భూమికి నీరందనున్నట్లు అంచనా వేశారు. అనుసంధాన కార్యక్రమానికి ఖర్చు భారీగానే ఉన్నా పథకం ఫలితాలు.. పదేళ్ల తర్వాత తెలుస్తాయని, అవి వందేళ్ల పాటు నిలిచి ఉంటాయని భావిస్తున్నారు. ప్రాథమిక అంచనా మేరకు పదో ఏడాది తర్వాత విద్యుత్ అవసరాలు, సాగు రూపేనా ఇచ్చంపల్లి-సాగర్ల కింద ఏటా రూ.3 వేల కోట్లు, ఇచ్చంపల్లి-పులిచింతల కింద రూ.2,201.67 కోట్ల మేర ప్రయోజనాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. -
దక్షిణాది నుంచే అనుసంధానం
మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానానికి కేంద్రం ప్రణాళిక గోదావరిలో 530 టీఎంసీల మిగులు జ లాలు ఉన్నాయంటున్న జల వనరుల శాఖ వీటిని కృష్ణా, కావేరిలకు తరలించాలని యోచన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. ఉన్న ప్రాజెక్టులకే నీళ్లు సరిపోవని వెల్లడి 15 ఏళ్ల నాటి లెక్కలను పరిగణన లోకి తీసుకోవడంపై అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టను న్న నదుల అనుసంధాన కార్యక్రమాన్ని దక్షిణా ది నుంచే మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి మరో నదికి నీటిని మళ్లించడంలో భాగంగా తొలుత దక్షిణాదిలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణా, కావేరిల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం కల్పించనుంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. తెలంగాణ పరిధిలోని గోదావరి నది లో మిగులు జలాల లభ్యత ఉందని చెబుతున్న కేంద్ర జల వనరుల శాఖ... ఈ నది నీటిని కృష్ణాకు తరలించే అంశంపై కసరత్తు చేస్తోంది. అయితే గోదావరి నీటి తరలింపును తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరిలో ఎక్కడా మిగులు జలాలు లేవని.. ప్రస్తుతం లభ్యమవుతున్న జలాలు తమ అవసరాలకే సరిపోవడం లేదని వాదిస్తోంది. అయినా కేంద్రం మాత్రం మొండిగా నదుల అనుసంధానంపై ముందుకు వెళ్లాలనే గట్టి పట్టుదలతో ఉంది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చిన ఈ నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తుది మెరుగులు దిద్ది, ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఉత్తరాది నదు లకోసం ‘హిమాలయ నదుల అభివృద్ధి’, దక్షిణా ది నదుల కోసం ‘ద్వీపకల్ప నదుల అభివృద్ధి’ పథకాలను చేపట్టింది. ఇందులో హిమాలయ నదుల అభివృద్ధి పథకం కింద బ్రహ్మపుత్ర, గంగా, నర్మదా తదితర నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిం చినా... బ్రహ్మపుత్ర నదుల నీటి వాడకం విషయంలో పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌తో వివాదాలు ఉన్న దృష్ట్యా దానిని వాయిదా వేసింది. దీంతో దక్షిణాదిలోని నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. గోదావరిపైనే కన్ను..: మహానదిలో సుమా రు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా... వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలన్నది కేంద్ర జల వనరుల శాఖ వాదన. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తెలంగాణ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరిపై ఆధారపడ్డ ప్రస్తుత ప్రాజెక్టులకే నీటి అవసరాలు సరిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదీగాక ప్రస్తుతం కేంద్రం చెబుతున్న 530 టీఎంసీల అదనపు జ లాలు ఎప్పుడో 15 ఏళ్ల కిందట 75 శాతం డిపెం డబిలిటీతో లెక్కించినవని.. ఇప్పడు ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయని చెబుతోంది. నిర్మాణంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయితే గోదావరిలో ఏపీ, తెలంగాణకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు తమ అవసరాలకే సరిపోవని స్పష్టం చేస్తోంది. తెలంగాణ పీఠభూమి ప్రాంతం అయినందున గోదావరి ప్రవాహం కింది రాష్ట్రమైన ఏపీకి ఉంటుందని.. అక్కడే అదనపు జలాల అవకాశం ఉంటుందని చెబుతోంది. రాష్ట్ర పరిధిలోని నదుల అనుసంధానానికి అభ్యంతరం లేదని, అలాకాకుండా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నీటిని తరలిస్తామంటే అంగీకరించేది లేదని తెలంగాణ వాది స్తోంది. విషయాలను ఇటీవల కేంద్రం నిర్వహించిన జల్ మంథన్ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రానికి స్పష్టంగా వివరించినా, వాటిని కేం ద్రం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. -
అవార్డులు ఆయన సొంతం
మహానంది: విధి నిర్వహణ ఆయన ప్రాణం. పేదలకు న్యాయం చేయాలి...వారికి అండగా నిలవాలన్న తపనే ఆయనకు గుర్తింపు తెచ్చింది. కష్టపడితే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. పోలీస్ కావాలనే లక్ష్యంతో శ్రమించి అనుకున్నది సాధించాడు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయని నమ్మిన వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. ఎక్కడ పనిచేసిన అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పటి వరకు ఆయన 366 రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. అంతేకాకుండా భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపికైనట్లు 2013 గణతంత్ర వేడుకల్లో ఆయన పేరు ప్రకటించారు. ఈ అవార్డును శుక్రవారం కర్నూలులో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీఐ అందుకోనున్నారు. శ్రీనివాసులు విజయ గాధపై సాక్షి కథనం... మహానంది మండలం ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకటసుబ్బయ్య అలియాస్ మోజెస్, మద్దమ్మ దంపతుల కుమారుడు బుక్కా శ్రీనివాసులు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలన్న సంకల్పంతో శ్రమించాడు. గ్రామంలోని జెడ్పీ స్కూల్లో 10 వరకు చదివాడు. కర్నూలులోని కోల్స్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్, సిల్వర్‌జూబ్లీలో డిగ్రీ, ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. జులై 15, 1991లో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. ఎస్ఐగా అనంతపురం జిల్లా పెనుగొండ, ఎల్కే పల్లి, రామగిరి, కూడేరు, తాడిపత్రి, ధర్మవరం, తదితర ప్రాంతాల్లో పనిచేసి అన్ని వర్గాల ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. తిరుమల ట్రాఫిక్, నక్సల్స్ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. అనంతరం 2005 ఫిబ్రవరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన శ్రీనివాసులు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్గా, 2005 నుంచి 2008 వరకు కల్యాణదుర్గం సర్కిల్లో, 2009-10లో చిత్తూరు డీటీసీ, ఆ తర్వాత ధర్మవరం, హిందూపురం, ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు పనిచేశారు. 2014 జనవరిలో హిందూపురం టౌన్ నుంచి కడప అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సీఎం చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోనుండటంతో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
మహానంది ఈఓ పోస్టుకు పోటాపోటీ
మహానంది: మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వచ్చేం దుకు పలువురు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన మహానంది దేవస్థానానికి ప్రస్తుతం కేవీ సాగర్‌బాబు ఇన్చార్జ్ ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కొందరు ఇన్చార్జ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ స్థానాలలో రెగ్యులర్ ఈఓలను నియమించేందుకు దేవాదాయ శాఖ రంగం సిద్ధం చేస్తుంది. మరో నెలరోజుల్లో నూతన దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ బదిలీల ప్రక్రియ చేపట్టనుండటంతో ఇప్పటి నుంచే పలువురు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన, డీసీ హోదా కలిగిన మహానంది దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్‌గా వచ్చేందుకు పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మహానంది అవకతవకలపై ఫిర్యాదు: మహానంది దేవస్థానంలో కొన్నేళ్లుగా చోటు చేసుకున్న అవకతవకలపై స్థానికులు ఇటీవల నూతన కమిషనర్ అనురాధకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ప్రసాదాల విక్రయంలో నాణ్యతా లోపం, బరువు తక్కువగా ఉన్నట్లు వచ్చిన పత్రికా కథనాల ఆధారంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవల దేవస్థానంలో ఎలాంటి నియామక ప్రకటన లేకుండా ఐదుగురిని నియమించుకున్నారు. వీరి నియామకాల కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులకు డీఏ పెంపుపై అనధికారిక వ సూళ్లకు పాల్పడినట్లు ఇటీవల ఫిర్యాదులు వెళ్లినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పారిశుద్ధ్యం పనులకు నియమించిన 36 మంది ఉద్యోగులను ఎలాంటి టెండర్లు లేకుండా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పలువురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురికావడం, వారు చేసిన తప్పులు, ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు, తిరిగి వారిలో కొందరి నియామకం లాంటి చర్యలపై కమిషనర్ ఆరా తీసినట్లు సమాచారం. చలువపందిళ్ల ఏర్పాటు, బిల్లుల చెల్లింపులు, తాత్కాలిక దుకాణాల కేటాయింపులు, ఆలయ పరిధిలో తోపుడుబండ్ల ఏర్పాటులో ఉన్నత ఉద్యోగుల చేతివాటం, తదితర అంశాలపై ఫిర్యాదులు అందడంతో కొంత మంది కీలక ఉద్యోగులను కూడా బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దేవస్థానంలో రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో పాలనా వ్యవస్థ గాడితప్పిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ ఈఓను నియమించాలని భక్తులు కోరుతున్నారు.