Mallanna Sagar
-
‘మల్లన్నసాగర్’పై ‘ఎన్జీటీ’ విచారణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ప్రధాన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏ అధ్యయనమూ చేయలేదు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరపలేదు. తొందరపాటుతో డ్రాయింగ్స్‌ను ఆమోదించి భూకంప జోన్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) నివేదిక సమర్పించింది’అంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఎన్జీటీ సుమోటోగా పరిగణించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ, జిల్లా డిప్యూటీ కలెక్టర్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) కార్యద ర్శిని ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. అనంతరం చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోన్ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. గత నెల 7న విచారణ నిర్వహించిన చెన్నై ఎన్జీటీ ధర్మాసనం.. ‘మల్లన్నసాగర్’ను సందర్శించి నివేదిక సమర్పించాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్, నీటిపారుదల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 11న నిర్వహించనుంది. ‘సిక్కిం’ డ్యామ్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతేడాది సిక్కింలోని లోహ్నాక్ వాగుకు గండి పడడంతో తీస్తా నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీంతో చుంగ్తాంగ్ వద్ద తీస్తాపై నిర్మించిన 1,200 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు కమ్ డ్యామ్ కొట్టుకుపోగా, పలు మరణాలతోపాటు భారీనష్టం వాటిల్లింది. దీనిపై గతంలో ఎన్జీటీ–ఢిల్లీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మల్లన్నసాగర్ సైతం ఇదే తరహా అంశమని భావిస్తూ దానిపై సైతం విచారణ నిర్వహిస్తామని ఎన్జీటీ–ఢిల్లీ స్పష్టం చేసింది. భూకంపాల సంభావ్యతకు సంబంధించిన అధ్యయనాల్లేకుండా మల్లన్నసాగర్ నిర్మాణంతో ఏదైనా విపత్తు జరిగితే అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణ ప్రణాళిక సైతం రూపొందించకపోవడం ద్వారా ప్రభుత్వం రిజర్వాయర్‌తోపాటు దిగువ ప్రాంతాల ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఎన్జీటీ గుర్తు చేసింది. మల్లన్నసాగర్ గర్భంలో 3 జతల పగుళ్లు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడానికి ముందే సైట్లో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై ఎన్జీఆర్ఐతో అధ్య యనం జరిపించాలని షరతు విధిస్తూ ప్రాజెక్టు ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. ఈ అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదలశాఖ 2016 డిసెంబర్, ఆగస్టు 2017, అక్టోబర్ 2017లో హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే, 2017లో నీటిపారుదలశాఖ మల్లన్నసాగర్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరోవైపు మల్లన్నసాగర్‌ను ప్రతిపాదించిన ప్రాంత భూగర్భంలో అత్యంత లోతు వరకు నిలువునా 3 జతల పగుళ్లు, వాటిలో కదలికలూ ఉన్నట్టు ఎన్జీఆర్ఐ 2017 మార్చిలో సమర్పించిన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పిందని కాగ్ బయటపెట్టింది. వీటి ద్వారా ఉండనున్న ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయా లని సిఫారసులు చేసింది. ఈ ప్రాంతానికి ఉన్న భూకంపాల చరిత్రను ఉటంకిస్తూ సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరింది. ఈ సిఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ విస్మరించిందని కాగ్ ఆక్షేపణలు తెలిపింది. -
హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ జలాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ‘నీటి’కబురు చెప్పింది. నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 345) జారీ చేశారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనుంది. హైబ్రిడ్ యాన్యుటీ (బీఓటీ + ఈపీసీ) మోడ్‌లో పనులు పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనే అంచనా ఉండగా, 2050 నాటికి ఇది 1,014 ఎంజీడీలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేసిన వాప్కోస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైప్‌లైన్ నిర్మించనున్నారు. ఘన్పూర్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3849.10 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.5,560 కోట్లు కేటాయించడంతో మొత్తంగా నగరానికి రూ.9410 కోట్లు కేటాయించినట్లయింది. మొత్తం 15 టీఎంసీల తరలింపుగోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్ల్యూఎస్) పథకం ఫేజ్–1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా రెండో దశ పథకం ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా ఐదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవింప చేసేందుకు ఉపయోగించనున్నారు. -
భూకంప జోన్లో మల్లన్నసాగర్
సాక్షి, హైదరాబాద్: తగిన అధ్యయనాలు, పరిశోధనలు చేయకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ డ్రాయింగ్లను ఆమోదించి, నిర్మాణం చేపట్టారని ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంత భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా చీలికలు, కదలికలు ఉన్నాయని.. భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తమ ప్రాథమిక నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ సిఫార్సులను పట్టించుకోకుండా.. తగిన సర్వేలు, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని తప్పుపట్టింది. ఒకవేళ భూకంపం వస్తే సమీప ప్రాంతాల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా సమగ్ర ఆడిట్ నిర్వహించిన కాగ్.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలివీ.. సగం ఆయకట్టు మల్లన్నసాగర్ కిందే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద 10.3లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టులో ఇది సగానికికన్నా ఎక్కువ. 2017 అక్టోబర్‌లో మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ప్రారంభించగా.. మార్చి 2022 నాటికి రూ.6,126 కోట్లు విలువైన పనులు చేశారు. గత సీఎం 2020 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అధ్యయనం జరపాలని కోరినా... మల్లన్నసాగర్ ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. అయితే నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై (సైట్ స్పెసిఫిక్ సీస్మిక్ స్టడీస్) నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సంస్థలతో అధ్యయనం జరిపించాలని సూచించారు. దీంతో సంబంధిత అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. కానీ ఆ అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే.. 2017లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించింది. తర్వాత ఎన్జీఆర్ఐ నివేదిక ఇచ్చింది. భూకంపాలకు అవకాశం ఉందంటూ.. దేశంలో భూకంపాల సంభావ్యత తక్కువగా ఉండే సీస్మిక్ జోన్–2లో తెలంగాణ ఉన్నా.. 1967లో కోయినాలో, 1993లో లాతూర్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో.. జోన్–2 ప్రాంతం కూడా భూకంపాలకు అతీతం కాదని తేలిందని ఎన్జీఆర్ఐ నివేదికలో పేర్కొంది. ఇటీవలికాలంలో ఒంగోలు, లాతూర్‌లో వచి్చన భూకంపాలతో తెలంగాణలోనూ ప్రకంపనలు వచ్చాయని, ఇక్కడి నిర్మాణాలకు స్వల్పంగా నష్టం జరిగిందని తెలిపింది. 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచి్చన భూకంపంతో దక్షిణ భారతదేశం అంతా ప్రకంపనలు కనిపించాయని పేర్కొంది. 1983 జూన్‌లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని.. దాని ప్రభావం 200 కిలోమీటర్ల వరకు కనిపించిందని గుర్తు చేసింది. నాటి భూకంప కేంద్రం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే తట్టుకునేలా కట్టని (నాన్ ఇంజనీర్డ్) నిర్మాణాలు దెబ్బతింటాయని పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంతంలోని భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా మూడు జతల చీలికలు (3 సెట్స్ ఆఫ్ డామినెంట్ లీనమెంట్) ఉన్నాయని.. కదలికలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలో తెలిపింది. వీటితో పడే ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పట్టించుకోకుండా, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్ దృఢత్వం, భూకంపం వస్తే జరిగే విపత్తు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలేనని కాగ్ పేర్కొంది. అత్యవసరంగా డ్రాయింగ్స్కు ఆమోదం మల్లన్నసాగర్ నిర్మిత ప్రాంతంలో భూకంపాల సంభావ్యతపై అధ్యయనాలు లేవని.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అత్యవసర పరిస్థితిలో రిజర్వాయర్ డ్రాయింగ్స్‌ను ఆమోదిస్తున్నామని సీడీఓ చీఫ్ ఇంజనీర్ పదేపదే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ డ్రాయింగ్స్ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఐఐటీ–రూర్కి’ల నుంచి ఈ డ్రాయింగ్స్కు తదుపరి ఆమోదం(వెట్టింగ్) తీసుకోవాలని కూడా సూచించారు. కానీ నీటిపారుదల శాఖ సదరు సంస్థలతో వెట్టింగ్ చేయించినట్టు ఎలాంటి రికార్డులు లేవని కాగ్ పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్మాణం 95శాతం పూర్తయ్యాక 2021 జనవరిలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలైన డిజైన్లు, స్థిరత్వ విశ్లేషణలు, డిజైన్లకు వెట్టింగ్ కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం విడ్డూరమని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరపలేదని, ఎలాంటి నివేదిక సైతం ఇవ్వలేదని పేర్కొంది. ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి మల్లన్నసాగర్ డ్యామ్ దెబ్బతింటే.. ప్రాణ, ఆస్తి నష్టం నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ ఓ నివేదిక సమర్పించింది. మల్లన్నసాగర్లో నీళ్లు నింపడానికి ముందే ఈ నివేదికలోని అంశాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని సూచించింది. మల్లన్నసాగర్లో 2021 ఆగస్టు నుంచి నీళ్లు నింపడం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఎమర్జెన్సీ ప్లాన్‌ను తయారు చేయలేదని కాగ్ ఆక్షేపించింది. ఒకవేళ్ల మల్లన్నసాగర్‌కు ప్రమాదం జరిగితే.. సమీప ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది. -
‘మల్లన్నసాగర్’ గెజిట్ ప్రింటింగ్‌కు రాసిన లేఖ సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌పల్లిలో భూసేకర ణకు సంబంధించి గెజిట్ జారీ కోసం ప్రింటింగ్‌కు రాసిన లేఖను సమర్పించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టును తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చేసిన పనులను సమర్థించుకునేందుకు తప్పులు చేస్తే సహించేది లేదని చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో అప్పీల్ వేసింది. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. గతంలో గెజిట్ జారీకి సంబంధించి రిజిస్టర్లో ఎంట్రీలు నమోదు చేసిన వారి వివరాలను ప్రభుత్వ న్యాయవాది సంజీవ్‌కుమార్ అందజేశారు. -
సిద్ధమవుతున్న ‘మల్లన్నసాగర్ భగీరథ’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోగా ఈ పథకం పనులను పూర్తి చేయడానికి సంబంధిత యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఇక ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరగనుంది. ప్రస్తుతం ఈ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పైప్‌లైన్ నుంచి నీటిని సరఫరా చేస్తుండగా, మార్చి తర్వాత దీనిని హైదరాబాద్‌కే పరిమితం చేసి.. ఈ పైప్‌లైన్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ భగీరథ కొత్త లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేపట్టనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ శనివారం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కొరత లేకుండా మల్లన్న సాగర్ నుంచి నీరు.. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ (మిలి యన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు భగీరథ పథకం అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని వాడుకుంటున్నారు. మిగతా నీరు హైదరాబాద్ అసరాలకు వెళ్తుంది. దీనివల్ల హైదరాబాద్‌కు వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఈ జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడు కోవాలని నిర్ణయించారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద 540 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీపీ పనులు పూర్తి కావొస్తున్నాయి. మార్చి నాటికి హైదరాబాద్ లైన్‌పై నీటిని తీసుకునే వాల్వులను మూసి వేయనున్నారు. సిద్దిపేట, జనగామ, యదాద్రి, సూర్యా పేట జిల్లాలకోసం మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మిస్తున్నారు. ఇబ్బంది లేకుండా నీటి సరఫరా.. మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం ద్వారా మొదటగా జనగామ జిల్లాకు నీటిని సరఫరా చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా జనగామ జిల్లాకు తాగునీరు వెళ్లనుంది. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వరకు 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. ప్రస్తుతం నీటిని తీసుకుంటున్న హైద రాబాద్ లైన్ వల్ల ఎప్పడైనా నీటి కొరత ఏర్పడితే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడేవి. మార్చి తర్వాత అలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ భగీరథ పథకానికి ప్రత్యేక వ్యవస్థను తీసు కురానున్నారు. స్మితా సబర్వాల్ పర్యటన సందర్భంగా మార్చి ఆఖరులోగా పనులు పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నెలాఖరులో పనులు పూర్తిచేయడమే లక్ష్యం నాలుగు జిల్లాల తాగునీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ఉద్దేశం. దీనికి సంబంధించి పనులు సాగుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
‘జీవో నంబర్ 35.. ఆ భూసేకరణకు వర్తించదు’
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్లో జీవో నంబర్ 35ను పేర్కొనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. మలన్నసాగర్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం 102.13 ఎకరాల భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మలన్నసాగర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే దీని నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 8 గ్రామాల ప్రజలకు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ల గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 102.13 ఎకరాలను సేకరించేందుకు 2021, జనవరి 30న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జీవో 35ను ఇందులో చేర్చింది. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ మండలం ముత్రాజ్‌పల్లికి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లో జీవో 35ను పేర్కొనడం చట్టవిరుద్ధమని చెప్పారు. నీటి ప్రాజెక్టులు, కాలువలు, స్పిల్‌వే.. లాంటి సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిపే భూసేకరణకు మాత్రమే ఈ జీవోను వినియోగించాలి వెల్లడించారు. కానీ, ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ సర్వే, గ్రామ సభల ఆమోదం నుంచి తప్పించుకునేందుకు ఇళ్ల నిర్మాణం కోసం చేసే భూసేకరణలో ఈ జీవోను ఇచి్చందన్నారు. ఇళ్ల నిర్మాణానికి సరిపడా ప్రభుత్వ భూమి ఉన్నా.. సేకరిస్తున్నారని నివేదించారు. జీవో నం.35 ఈ నోటిఫికేషన్‌కు వర్తించదన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు -
లంచమడుగుతున్రు.. ఏం జేయాలె సచ్చిపోతున్న: మల్లన్న సాగర్ నిర్వాసితుడు
గజ్వేల్/గజ్వేల్ రూరల్: ‘న్యాయంగా దక్కాల్సిన ఓపెన్ ప్లాట్ ఇవ్వాలని అడిగితే లంచమడుగుతున్నరు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన. ఇక సచ్చిపోతున్న’ అంటూ తల్లికి ఫోన్లో చెప్పి మల్లన్నసాగర్ ముంపు బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది. రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి తిరిగి.. తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొడుగు కిష్టయ్యకు ముగ్గురు కుమారులు రాజబాబు, దేవదాసు, రాజు ఉన్నారు. గ్రామంలో తండ్రితో పాటు ముగ్గురికి సంబంధించిన 1.18 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను మల్లన్నసాగర్ కింద కోల్పోయారు. పరిహారం కింద అందరికీ కలిపి రూ.48.74 లక్షలు అందాయి. గ్రామం ఖాళీ అయ్యాక తండ్రి కిష్టయ్యకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాగా ఆయన ఆర్అండ్ఆర్ కాలనీలో ఉంటున్నాడు. ముగ్గురిలో రాజబాబు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. రెండో కుమారుడు దేవదాసు.. ఇటీవల అప్పు చేసి పట్టణంలో సుమారు 60 గజాల స్థలంలో చిన్నపాటి ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి సిద్దిపేట ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. శుక్రవారమూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు దళారులు రూ.3 లక్షలు లంచమిస్తే పనవుతుందని.. లేదంటే ప్లాట్ రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో ప్లాట్ రాదేమోనని మనస్తాపం చెందాడు. ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి.. వెంటనే వస్తానని భార్య స్వప్నకు చెప్పి శుక్రవారం రాత్రి దేవదాసు బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో స్వప్న కుటుంబీకులకు చెప్పింది. ఆ సమయంలో దేవదాసు తన తల్లికి ఫోన్ చేసి ‘ప్లాట్ కోసం ఎంత తిరుగుతున్నా వస్తలేదు.. బ్రోకర్లు లంచమడుగుతున్రు. ఇగ నేను సచ్చిపోతా’నని ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున రాజిరెడ్డిపల్లి మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకొని శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేవదాసు ఆత్మహత్యకు దళారులే కారణమంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఆర్డీవో వచ్చే వరకు కదిలేది లేదని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డిని వివరణ కోరగా దేవదాసుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.7.5 లక్షలు, ఇల్లుకు సంబంధించిన రూ. 5. 04 లక్షలు అందించామని, ఓపెన్ ప్లాటు వ్యవహారం పెండింగ్‌లో ఉందని తెలిపారు. దేవదాసు చాలా కాలంగా స్థానికంగా ఉండకపోవడం వల్లే ప్లాటు పెండింగ్‌లో పడిందన్నారు. -
కాల్వలకు బదులు పైప్లైన్లు
గజ్వేల్: మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం తీరు మారింది. రూ. 674 కోట్లతో రూపొందించాలనుకున్న ఈ పథకం డిజైన్ మార్చి కొత్త అంశాలను జోడించడంతో నిర్మాణ వ్యయం రూ. 1,100 కోట్లకు పెరగనుంది. గతంలో అక్కారం పంపుహౌస్ కాల్వలు, బస్వాపూర్ రిజర్వాయర్, మల్లన్నసాగర్ల నుంచి పైప్లైన్లు నిర్మించాలని అను కోగా తాజా డిజైన్‌లో మల్లన్నసాగర్ రిజర్వాయర్ స్టోరేజీ నుంచే పైప్లైన్లను నిర్మించాలనుకుంటున్నారు. హైదరాబాద్ జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,375 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10 టీఎంసీలను 186 కి.మీ. పైప్‌లైన్ ద్వారా తరలిస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుండగా ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని ట్యాపింగ్ పద్ధతిలో వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల హైదరాబాద్‌కు నీటి తరలింపులో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో ఏటా 10 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతిపెద్దదిగా 540 ఎంఎల్డీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు పూర్తికాగానే గతంలో హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు. అంతేకాకుండా ఎల్లంపల్లి లైన్‌కు సమాంతరంగా మరో కొత్త లైన్‌ను నిర్మించాలనుకుంటున్నారు. సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాలకు మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మించే అవకాశం ఉండగా హైదరాబాద్ లైన్‌ను మాత్రం మల్లన్నసాగర్ నుంచి నిర్మిస్తారా లేక మల్లన్నసాగర్ ద్వారా నిండే కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తే శామీర్‌పేట సమీపంలోని కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా ఘనపూర్ డబ్ల్యూటీపీలో నీటిని శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తారు. శాశ్వత పరిష్కారమే లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ముందుగా అనుకున్న డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాం. మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మించి అక్కడి నుంచి అయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ ఈ వారంలో అధికారికంగా ‘మల్లన్న’ప్రారంభం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియను ఈ వారంలో అధికారికంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ పనులు ఆగస్టు మూడో వారానికే పూర్తవగా తుక్కాపూర్‌లోని 6 పంపులను ప్రారంభించడం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోత సైతం అప్పుడే ఉంటుందని ఇంజనీర్లు భావించారు. అయితే దళితబంధు సహా ఇతర ప్రాధాన్యతా కార్యక్రమాల వల్ల ప్రభుత్వం దాన్ని కేవలం ట్రయల్ రన్‌కే పరిమితం చేసింది. ట్రయల్ రన్లో భాగంగా మోటార్లను పరీక్షిస్తూ సుమారు 4 టీఎంసీలను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోశారు. స్థానిక ప్రవాహాల నుంచి మరో టీఎంసీ మేర నీరు చేరడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. రిజర్యాయర్‌లోకి మరో 5 టీఎంసీల నీటిని ఈ సీజన్లో నింపాలని ఇంజనీర్లు నిర్ణయించడంతో ఈ వారంలో సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు నెలలకు ఒకసారి ఐదేసీ టీఎంసీల చొప్పున నీటిని నింపుకుంటూ నిల్వలను పెంచనున్నారు. మల్లన్నసాగర్‌లోకి గోదా వరి జలాల ఎత్తిపోతలపై ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. -
మల్లన్నసాగర్ ముంపు ఇళ్ల కూల్చివేతలో విషాదం
కొండపాక(గజ్వేల్): మల్లన్నసాగర్ ముంపు గ్రామ మైన ఎర్రవల్లిలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టిన క్రమంలో విద్యుత్ స్తంభం కూలి మీద పడటంతో ఓ యువకుడు మృతి చెందారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక, తొగుట మండలాల సరిహద్దులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి ఆదివారం తెల్లవారుజామున గోదావరి నీటి తరలింపునకు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడుకాకుండా ఇళ్లు కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముట్రాజ్‌పల్లి శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటున్న బాధితులు విషయం తెలుసుకొని శనివారంరాత్రి ఎర్రవల్లికి వచ్చి తమ ఇళ్లల్లోని సామాన్లను సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆరె కనకరాజు(28) తన ఇంట్లోంచి సామాన్లను బయటకు తీస్తుండగా ఆ పక్కనే ఇంటిని కూల్చివేస్తున్న జేసీబీ సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా తగిలింది. దీంతో కరెంట్ తీగలు తెగిపోయి కనకరాజుపై స్తంభం పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే కనకరాజును అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యు లు ధ్రువీకరించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చి వేత పనులెలా చేపడతారంటూ ఉస్మా నియా ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కనకరాజు కుటుంబానికి రూ.20 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అధికారులు హామీనిచ్చే వరకు పోస్టుమార్టం చేయనివ్వబోమంటూ పట్టుబట్టారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధితకుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ హామీనివ్వడంతో శాంతించారు. మృతుడికి రెండు న్నరేళ్ల కూతురు ఉంది. భార్య శ్యామల 4నెలల గర్భవతి. ఎర్రవల్లిలో నేలమట్టమైన ఇళ్లు ఎర్రవల్లిలో విషాదం ఎర్రవల్లికి చెందిన ఆరె నర్సయ్య– లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నర్సయ్య చిన్న కుమారుడే కనకరాజు. వారికున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలే పండటంతో కనకరాజు బతుకుదెరువు కోసం హైదరబాద్‌కు వెళ్లాడు. ఊరు ముం పునకు గురవుతుందని తెలుసుకున్న ఇటీవల తిరిగి ఎర్రవల్లికి చేరుకొని కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
పానం బోయినా జాగ ఇయ్య !
సాక్షి, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో మల్లన్నసాగర్ నిర్వాసితుల గృహప్రవేశాలు చేస్తుండగా.. మరోవైపు ఈ కాలనీ నిర్మాణంతో భూమి కోల్పోతున్న బాధితులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా శుక్రవారం ముట్రాజ్‌పల్లికి చెందిన మర్కంటి అయోధ్యం కాలనీలో భూమిని చదును చేసే పనులను అడ్డుకున్నాడు. ‘పానం బోయిన సరే ఈ భూమి ఇయ్య’గతంలోనే నేను మూడెకరాల భూమి ఇచ్చిన. ఈ పట్టా భూమి కూడా గుంజుకుంటే నేనట్ల బతకాలే?’అంటూ ట్రాక్టర్‌కు అడ్డంగా పడుకొని పనులు ఆపేశాడు. రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తనను గోస పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈనెల 4న పోలీసు పహారా మధ్య కాలనీలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసమంటూ 332, 333 తదితర సర్వే నెంబర్లలో అధికారులు సుమారు 10 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో అయోధ్యంకు మూడు ఎకరాలు ఉంది. కాగా, మర్కంటి అయోధ్యం భూమిని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నామని, బాధితుడికి రావాల్సిన నష్ట పరిహారం ఇప్పటికే కోర్టులో డిపాజిట్ చేశామని గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి తెలిపారు. -
కరువు నేల.. మురిసే వేళ
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను రంగనాయక సాగర్‌లోకి వదిలేందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. గోదావరి నది నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న బీడు భూములు తడిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కానుంది. నేడు రంగనాయక సాగర్‌లోకి గోదావరి అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నుంచి పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను రంగనాయక సాగర్‌కు వదలనున్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఈ రిజర్వాయర్ నిర్మించారు. దీని సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్‌కు 8.6 కిలోమీటర్ల చుట్టూ భారీ కట్టను నిర్మించారు. కట్ట నిర్మాణం, దాని చుట్టూ రాతి కట్టడం, కట్టపై చమన్ ఏర్పాటుతో పాటు ఇంజనీరింగ్ అధికారుల కార్యాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనం నిర్మించారు. చదవండి: లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, దుబ్బాక, చేర్యాల, మద్దూరు కోహెడతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. ఇలా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 409 చెరువులను గోదావరి జలాలతో నింపనున్నారు. సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, సిరిసిల్ల జిల్లాలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు.. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లాకు అడుగిడిన గోదావరి జలాలను వెంటనే జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు తీసుకెళ్లేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. 24 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలకు భారీ ప్రయోజనం కలగనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణంలోని కొంత భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో అప్పటి వరకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు చేరిన నీటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి నింపడంతో పాటు, కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు 18 కిలో మీటర్ల మేరకు గ్రావిటీ కెనాల్ నిర్మించారు. దీంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్దకు చేరిన నీరు కొండపోచమ్మ సాగర్ వరకు చేరుతాయి. రంగనాయకసాగర్ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు ‘కొండపోచమ్మ’తో 2.85 లక్షల ఆయకట్టుకు నీరు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ‘కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. దీని సామర్ధ్యం 15 టీఎంసీలు. జగదేవ్‌పూర్, తుర్కపల్లి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, ఉప్పరపల్లి, శంకరంపేట, ఎం.తుర్కపల్లి మొత్తం ఎనిమిది ప్యాకేజీలతోపాటు సంగారెడ్డి కెనాల్ ద్వారా మొత్తం 2.85 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తారు. అలాగే.. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరాకు ఈ రిజర్వాయర్ ద్వారా నీరు అందిస్తారు. వీటితోపాటు బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్లతో అనుసంధానం చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట జిల్లాల వరకు సాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలం కరువు నేలకు గోదావరి జలాలు తరలించి పునీతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలితమే రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం. సాగు నీటి కోసం బోర్లు వేసి బోర్లా పడిన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఈ గడ్డకు ఉంది. స్వయానా రైతుగా కేసీఆర్ చూసిన కష్టాలను తీర్చే మార్గమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు గోదావరి జలాలు కరువు నేలను ముద్దాడాయి. ఈ ప్రాంతంలో కరువు అనేది గతం. సూర్యచంద్రులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ కీర్తి నిలుస్తుంది. ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యమైన నా జన్మ చరితార్థమైంది. – హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి -
'డిండి' దారెటు?
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షి త మంచి నీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి మార్గదర్శనం కరువైంది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ను ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఖరారు చేసినా, దీనికి ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం దక్కలేదు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కాకుం డా ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఇప్పటికే నీటి పారుదల శాఖ ఓకే చెప్పినా, ప్రభుత్వం ఇంకా నాన్చుతుండటంతో ఎటూ తేలడంలేదు. ఇక ఇప్పటికే మొదలైన రిజర్వాయర్ల పరిధిలోనూ భూసేకరణ, సహాయ పునరావాస పనుల్లో అనేక అవాంతరాలున్నా వాటిని పట్టించుకొని పరిష్కరించేవారే కరువయ్యారు. ఎట్టకేలకు కొలిక్కి వచ్చినా ముందుకు సాగలే... శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగిస్తూ, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు, 21 మండలాల పరిధిలోని 3.61 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేలా రూ.6,190 కోట్లతో డిండి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 11న సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అయి తే మొదట ఈ ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతల్లోని రెండో రిజర్వాయర్ ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ నీటిని 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. అనంతరం తిరిగి పాలమూరు ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ నుంచే తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ ప్రతిపాదనలతో భూసేకరణ అవసరాలు ఎక్కువగా ఉండటం, అటవీ భూముల ముంపు సైతం ఉండటంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నారు. ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, తర్వాత 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, అటునుంచి తిరిగి 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీరు ప్రవహిస్తుంది. తర్వాత మళ్లీ 3 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్లో ప్రవహించి, సహజ సిద్ధ వాగులో కలసి, కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. అటు నుంచి డిండికి నీటిని చేరుస్తారు. ఈ ప్రతిపాదనకు రూ.1,293.55 కోట్లు అవు తుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను జనవరిలోనే ప్రభుత్వ అనుమతికై పంపినా ఇంతవరకు అనుమతులివ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని సమీక్షించి ఓకే చెబితే కానీ దీనికి అనుమతులు వచ్చేలా కనిపించడం లేదు. అనుమతులు వస్తే కానీ టెండర్లు పిలిచి పనులు చేపట్టడం సాధ్యం కాదు. భూసేకరణ నిధులకూ తంటాలు.. ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్మెంట్ ఖరారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ), చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్ట రాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులను ప్రభుత్వం రూ.3,929 కోట్లతో చేపట్టింది. వీటిలో ప్రధాన పనులు ఇప్ప టికే ఆరంభమయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద 16,135 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8 వేల ఎకరాల మేర పూర్తి చేశారు. మరో 8 వేల ఎకరాలు ఎక్కడికక్కడే ఉంది. ఇక్కడ సేకరించిన భూములకు సం బంధించి రూ.181 కోట్ల మేర ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో కొత్తగా భూ ములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అదీగాక కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ రైతులకు ఇచ్చిన మాదిరే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్ పరిధిలోని ముంపు గ్రామాలు ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఎక్కువ పరిహారం కోరుతున్నా యి. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపితేనే ప్రాజెక్టులో కదలిక వస్తుంది. -
అనంతగిరికి ఆఖరి ఘడియలు
సిరిసిల్ల: అనంతగిరి గ్రామం జలసమాధి కాబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరికి ఆఖరి ఘడియలు సమీపించాయి. ఊరు ఖాళీ చేసేదిలేదని నిర్వాసితులు భీష్మించుకుని కూర్చున్నా.. ఎలాగైనా ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఎస్సీ కాలనీని ముందుగా ఖాళీ చేయించనున్నారు. నిర్వాసితులకు ‘అనంత’కష్టాలు: అనంతగిరిలో 837 కుటుంబాలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్యాకేజీలను 735 కుటుంబాలకు అందించారు. మిగతా కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. నిబంధనల మేరకు వీరికి 102 ఇళ్లను అధికారులు అనంతగిరి శివారుల్లో నిర్మించి ఉంచారు. కానీ, ఇప్పుడే నీరు వస్తుందని ఊహించని నిర్వాసితులు.. పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేదు. ఇం కా ఎక్కడ ఉండాలో తేల్చుకోలేదు. ఈ క్రమంలో నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారు. ఇవీ సమస్యలు: అనంతగిరిలో 2017 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను కుటుంబాలుగా గుర్తించారు. ఆ జాబితా 1,135కు చేరింది. తంగళ్లపల్లి శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో 70 ఎకరాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. కానీ మౌలిక వసతులు లేవు. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ఇంటి స్థలం ఇచ్చారు. నిర్వాసితులతో కలెక్టర్ కృష్ణభాస్కర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం చర్చించారు. తొలుత మంగళవారం 115 దళిత కుటుంబాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. మంగళ వారం ఊరు ఖాళీ చేయగానే, బుధవారం మధ్య మానేరు నుంచి నీళ్లు అనంతగిరిలోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ సమీక్ష మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు చేర్చేందుకు అనంతగిరి వద్ద ఎదురవుతున్న ప్రతిబంధకాలపై సీఎంకేసీఆర్ సమీక్షిస్తున్నట్లు సమాచారం. అనంతగిరికి గోదావరి నీళ్లు చేరితే.. మల్లన్నసాగర్ వరకు నీళ్లు వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి తో సీఎం మాట్లాడినట్లు సమాచారం. దీంతో అనంతగిరి నింపేందుకు పనులు సాగుతున్నాయి. -
‘ఆ గ్రామాల్లో మల్లన్నసాగర్ పనులు ఆపేయండి’
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని తోగుట, వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్ని వారం రోజుల పాటు నిలిపేయాలని, ఆ గ్రామాల్లో నిలిపేసిన విద్యుత్‌ను తిరిగి సరఫరా చేయాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచి్చంది. తోగుట గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారికి పునరావాస చర్యలపై నివేదిక ఇవ్వాలని గత విచారణ సమయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని రైతుల తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. రైతులు దాఖలు చేసిన రిట్లను శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. విచారణను 30కి వాయిదా వేసింది. -
మల్లన్న సాగర్ : హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, సిద్దిపేట : విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝళిపించింది. మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, తొగుట తహసీల్దార్ ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా, విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తీర్పు నిచ్చింది. మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంతో తమకు న్యాయం జరగలేదని బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. నిర్వాసితుల పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అధికారులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. -
అధికారులకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్ : మల్లన్న సాగర్ రైతుల పరిహారం కేసు విచారణ నేడు హైకోర్టులో జరిగింది. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల పరిహారం విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ గతంలో అధికారులకు సింగిల్ బెంచ్ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో శిక్ష పొందిన సిద్దిపేట ఆర్డీవో జై చంద్రారెడ్డి, తోగూట తహసీల్దార్ వీర్ సింగ్, గజ్వేల్ ఇంజనీరింగ్ సూపరింటెండ్ వేణు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన డివిజన్‌బెంచ్.. అధికారులకు విధించిన శిక్షను అమలు చేయరాదంటూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు బుధవారం పలు కేసులను విచారించింది. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ భూ వివాదం, మిర్యాలగూడ ఎన్నికలపై స్టే విధించగా సచివాలయం, ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా.. సచివాలయం, ఎర్రమంజిల్‌లో పురాతన భవనం కూల్చివేతల పిటిషన్‌పై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తమ వాదనలను వినిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం చట్టబద్దంగానే కూల్చివేతల నిర్ణయం తీసుకుంది. నిపుణుల సిఫారసు మేరకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదు’ అని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఏ ప్రాతిపదికత ఆధారంగా పురాతన భవనాలను తొలగించారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరపు న్యాయవాది వివరణనిస్తూ.. ఎర్రమంజిల్ పురాతన భవనం కాదని, హెరిటేజ్ జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని చెప్పుకొచ్చారు. అనంతరం చారిత్రక కట్టడాల కూల్చివేతపై కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణనుసోమవారానికి వాయిదా వేసింది. విచారణ వాయిదా మల్లన్నసాగర్ భూ వివాదంలో ముగ్గురు అధికారులకు జైలు శిక్ష అమలును తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో రైతులకు న్యాయం చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించారని సింగిల్ బెంచ్ ముగ్గురికి జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికలకు నో మిర్యాలగూడ, మహబూబ్‌నగర్ పురపాలక ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన సరిగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, బుధవారం కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. అనంతరం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. -
మిడ్‌మానేరు ఎగువన 3.. దిగువన 2 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నుంచి మూడో టీఎంసీ నీటిని తీసుకునేలా ఇప్పటికే బృహత్ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, నీటిని తరలించే వ్యవస్థలకు సమగ్ర ప్రణాళికల తయారీలో పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేలా సివిల్ పనులు జరుగుతుండగా, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా దిగువ మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించే ప్రణాళికలకు పదును పెడతోంది. ప్రాజెక్టు ద్వారా గరిష్ట నీటి వినియోగం, వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా అధ్యయనం చేసి పనులకు శ్రీకారం చుట్టాలని శనివారం నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎలాంటి నిర్మాణాలు అవసరమవుతాయా? ఎక్కడెక్కడ లిఫ్టులు, టన్నెళ్లు, పైప్‌లైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, వ్యయ అంచనాలపై అధ్యయనం ఆరంభించింది. పత్తిపాక ఉంచాలా?.. వద్దా?.. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటిని తరలించేలా ఇప్పటికే పనుల కొనసాగుతున్నాయి. అం దుకు తగ్గట్లే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. మిడ్ మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టడంతో, మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ మొదలుకుని గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు ఒక టీఎంసీ నీరు మాత్ర మే లభ్యతగా ఉంటుంది. ఈ నీటితో ఆయకట్టు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. దీన్ని దృ ష్టిలో పెట్టుకొని మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీలు, ఆ దిగువన 2 టీఎంసీల నీటిని తరలించాలన్నది సీఎం యోచన. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలో సుమారు 10 టీఎంసీలతో పత్తిపాక రిజర్వా యర్‌ను సైతం ప్రతిపాదించారు. దీని నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఉంచా లా? వద్దా? అన్న దానిపై అధ్యయనం చేయా లని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. దీన్ని కొనసాగించితే ప్రాజెక్టుకు రూ.13 వేల నుంచి రూ.14 వేల కోట్ల వ్యయం కానుంది. పత్తిపాక లేని పక్షంలో రూ.11 వేల కోట్లు కానుంది. ఇక మిడ్‌మానేరు దిగువన ప్రస్తుతం 12 వేల క్యూసెక్కులు (ఒక టీఎంసీ) మేర నీటిని తరలించేలా కాల్వలు, టన్నెళ్ల నిర్మాణాలు జరుగు తున్నాయి. ప్రస్తుతం 24వేల క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటిని తరలించాలంటే మళ్లీ కొత్తగా లిఫ్టులు, పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కాల్వలు, టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. టన్నెళ్ల నిర్మాణం చేస్తే సమయం ఎక్కువగా పట్టే నేపథ్యంలో పైప్‌లైన్ వ్యవస్థ వైపు సీఎం మొగ్గు చూపుతున్నారు. పైప్‌లైన్ వ్యవస్థ అయితే రూ.11 వేల కోట్లు, టన్నెల్ అయితే రూ.8 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఏ వ్యవస్థ సరైనదో నిర్ణయించి వారంలో నివేదించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వ్యవస్థలకు అవసరమయ్యే సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తూనే, ప్రస్తుతం జరుగుతున్న పనుల ద్వారా కనిష్టంగా 3 వేల చెరువులను నింపాలని కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట్ల తూముల నిర్మాణం వేగిరం చేయాలని సూచించారు. -
రేపు మల్లన్నసాగర్ పరిశీలనకు సీఎం?
దుబ్బాక టౌన్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 5వ తేదీన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిపింది. సీఎం పర్యటన నేపథ్యంలోనే దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్, సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ ప్రజలను కలెక్టర్ కృష్ణభాస్కర్ కలుస్తారని సమాచారం. దీంతోపాటు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకుగాను కలెక్టర్, అధికారులతో చర్చించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
కాళేశ్వరానికి ఇరుసు మల్లన్నసాగర్
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని, ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 12 పనులను సోమవారం అర్ధరాత్రి సుమారు 3 గంటల పాటు మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ నుంచి తొగుట మండలం తుక్కాపూర్ వరకు సొరంగంలోనే కలియ తిరిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మల్లన్నసాగర్ సొరంగం, పంప్‌హౌస్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ వైపు మల్లన్నసాగర్.. మరోవైపు కాళేశ్వరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అవసరమైతే లేబర్ సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా.. పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని, ఇప్పటికే 8 కిలోమీటర్లకు పైగా సిమెంట్ లైనింగ్ పూర్తయినట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మసాగర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, యాదాద్రి జిల్లాలోని గందమల్ల, బస్వాపూర్, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని శామీర్‌పేటకు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఫలాలు అందనున్నాయని మంత్రి తెలిపారు. వారం, పది రోజుల్లో పంప్‌హౌస్ పనులు, సర్జిఫుల్ గేట్లు పూర్తి కానున్నట్టు పేర్కొన్నారు. ఒకవైపు మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు జరుగుతుండగా.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సొరంగం, పంప్‌హౌస్‌ల ద్వారా కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన భారీ మోటార్లు విదేశాల నుంచి తీసుకొచ్చి.. పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం సొరంగంలో పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఇక్కడ పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. -
మల్లన్నసాగర్‌పై మరో కుట్ర
సందర్భం డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవంటున్నారు మల్లన్నసాగర్ విమర్శకులు. రాయలసీమలో నదిలేనిచోట వాగులపై ఎక్కువ నిల్వ సామర్థ్యంతో కట్టిన జలాశయాల మాటేంటి? టీజేఏసీ వారు కొన్ని నెలల క్రితం ‘‘ కాళేశ్వరం లిఫ్ట్ ఇరి గేషన్ ప్రాజెక్ట్ – విల్ ఇట్ బెనిఫిట్ తెలంగాణ?’’ పేరుతో విడుదల చేసిన నివేదికలో మల్లన్నసాగర్ జలాశయం ప్రాంతంలో పగుళ్ల గురించి ప్రస్తావించి ఉన్నారు. వాటిని తిరిగి ఇటీవల కోదండరాం చర్చకు తీసుకు వచ్చినారు. పగుళ్ళు ఉన్న ప్రాంతంలో 50 టీఎంసీ జలాశయాన్ని ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నిస్తు న్నారు. పగుళ్లపై సమగ్ర అధ్యయనం జరపాలని, అంత వరకు ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలవద్దని, భూసేక రణ చెయ్యవద్దని అంటున్నారు. ఆయన ప్రకటనలని జేఏసీ సభ్యులు కొందరు ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. పైన పేర్కొన్న నివేదికలో రచయితలు చేసిన వాదన ఏమిటంటే... సాధారణంగా డ్యాంలని నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కూడెల్లి వాగుకు సమాం తరంగా నిర్మిస్తున్నారు. దీని వలన మట్టి కట్ట నుంచి ఎక్కువ నీరు బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి బురద భూమిగా మారుతుంది. మల్లన్నసాగర్ డ్యాం నిర్మిస్తున్న ప్రాంతంలో భూగర్భంలో డ్యాంకు సమాంతరంగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. డ్యాంలో 40– 60 మీటర్ల ఎత్తులో నీరు నిలిచి ఉంటుంది కనుక ఈ నీటి బరువుకి భూగర్భంలో ఉన్న పగుళ్ళు మరింత వెడల్పు అయి ఎక్కువ నీరు బయటకు పోతుంది. దీంతో మట్టి కట్ట క్రమేణా కొట్టుకుపోయి లక్షలాదిమంది ప్రజలు ఆస్తి, ప్రాణ నష్టానికి గురి అవుతారు. అందుకని డ్యాం నిర్మాణ స్థలంపై మరింత పరిశోధన అవసరం. రచయితలు ఈ రకమైన నిర్ధారణకు ఏ భూ భౌతిక పరిశోధనల ఆధారంగా వచ్చినారో ఎక్కడా పేర్కొన లేదు. ఇది కూడా వారి ఊహాగానమే తప్ప శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడి చేసిన నిర్ధారణ కాదు. వారు చెప్పినట్లు కూడెల్లి వాగు మల్లన్నసాగర్ డ్యాంకు బయట నుంచి సాగిపోతున్నది. డ్యాంలైన్‌కి అతి దగ్గరగా ఉన్న ప్పుడు దూరం 300 మీటర్లు ఉంటుంది. అదికూడా 34 కి.మీ పొడవున ప్రవహించే కూడెల్లి వాగుకు ఈ స్థితి 5 కి.మీ మాత్రమే ఉంటుంది. దీనివలన మల్లన్నసాగర్ డ్యాంకు ఏ ప్రమాదమూ లేదు. డ్యాంని డిజైన్ చేసేట ప్పుడు నీటి ఒత్తిడితో పాటు భూకంపాల నుండి విడు దల అయ్యే శక్తిని కూడా పరిగణిస్తారు. డ్యాం నిర్మిం చేటప్పుడు పునాది తవ్వుతారు. సమగ్రమైన భూభౌతిక పరిశోధనల అనంతరం సీఓటీ ఎంత లోతుకు తవ్వాలో నిర్ధారిస్తారు. తవ్విన పునాదిలో నీటిని అతి తక్కువగా పీల్చుకునే గుణం కలిగిన మట్టినే నింపుతారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతం మధ్యలో ఉన్న వేములఘాట్ గ్రామంలో ఉన్న కోమటి చెరువు, దాని కింద ఉన్న నల్ల చెరువులో ఈ పగుళ్ళ కారణంగా పెద్ద ఎత్తున నీరు బయటకు పోయి చెరువుల్లో నీటి నిల్వ వేగంగా తగ్గిపోయిన అనుభవాలు గతంలో ఎప్పుడూ లేవు. కాబట్టి ఇది ఊహాగానమే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ చేత రికన్నాయిజన్స్ సర్వే, లైడార్ సర్వే నిర్వహించింది ప్రభుత్వం. వారి సర్వేలో ఎక్కడా జలా శయం ప్రాంతంలో గాని, కూడెల్లి వాగు పరీవాహక ప్రాంతంలో గానీ పగుళ్ళు ఉన్నట్టు తేలలేదు. ఇక దేశంలో భూకంపాల చరిత్రను పరిశీలిస్తే తెలం గాణలో భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు. భూకంపాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దేశాన్ని మొత్తం 5 జోన్లుగా వర్గీకరించినారు. దక్కన్ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు లేనందున ఈ ప్రాంతాన్ని భూకంప ప్రాంతాల వర్గీకరణ చేసిన ప్పుడు అతి తక్కువ అవకాశాలు ఉన్న జోన్ 1,2, 3లో చేర్చినారు.అందులో 80% తెలంగాణ జోన్ 1,2లో ఉంటే 20% జోన్ 3లో ఉన్నది. అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశాలు జోన్ 4, 5లోనే ఉన్నాయి. ఇక మల్లన్నసాగర్ నిర్మించబోతున్న మెదక్ జిల్లా జోన్ 2లో ఉన్నదన్న సంగతి ప్రజలు గమనించాలి. డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప ఈ రకంగా నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు అంటున్నారు మల్లన్నసాగర్ విమర్శకులు. ఎక్కడో ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నది లేని చోట, లేదా చిన్నవాగులపై అవి సమకూర్చే నీటి పరిమాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నిల్వ సామ ర్థ్యంతో నిర్మించిన జలాశయాలు రాయలసీమలో ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం జలాశయం ఆ కోవలో నిదే. వాటి వివరాలు చూడండి. కండలేరు–68 టీఎం సీలు, గోరకల్లు–10 టీఎంసీలు, వెలిగొండ–41 టీఎం సీలు, వెలుగోడు–17 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం– 17 టీఎంసీలు, అవుకు–7 టీఎంసీలు, అలుగునూరు–3 టీఎంసీలు. ఇవన్నీ నదులు లేని చోట నిర్మించినవి కావా? అవ సరమైతే కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలంటూ కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఎత్తిపోతల పథకాలలో పెద్ద జలాశ యాల నిర్మాణం అత్యంత అవసరం. సీడబ్ల్యూసీ సూచ నల మేరకే 50 టీఎంసీలతో రీ డిజైన్ చేయడం తప్ప నిసరైంది. నది లేని చోట డ్యాం నిర్మిస్తున్నారని విమర్శి స్తున్న వారు.. పైన పేర్కొన్న జలాశయాలు నిర్మిస్తున్న ప్పుడు కిక్కురుమనలేదెందుకు? ఇప్పుడు అటువంటిదే మల్లన్నసాగర్ జలాశయం నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభు త్వం ఏదో నేరం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తెలం గాణకు జీవధారగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టుని వరుస కుట్రలతో అడ్డుకునే ప్రయత్నాలను వమ్ము చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో తెలంగాణ ఇంజనీర్లు తమ మేధస్సును, చెమటను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు. - శ్రీధర్‌రావు దేశ్‌పాండే వ్యాసకర్త కో చైర్మన్, తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ -
పాతవి రద్దు.. కొత్త వాటికి ఆమోదం!
2న కేబినెట్ ముందుకు రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు మల్లన్నసాగర్ సహా నాలుగు రిజర్వాయర్లకు ఆమోదం తెలిపే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రీ ఇంజనీరింగ్ చేస్తున్న సాగునీట ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీ ఇంజనీరింగ్‌తో రద్దయిన పనులను తొల గించడం, కొత్త వాటికి అనుమతి, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నెల 2న జరిగే కేబినెట్ సమావేశంలో రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. కేబినెట్లో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరిం గ్‌తో సవరణల భారం అదనంగా రూ.34 వేల కోట్లకు వరకు ఉండనుండగా, దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. 4 రిజర్వాయర్లపై ప్రకటన?.. మల్లన్నసాగర్ సహా మరో 4 రిజర్వాయర్లపై కేబినెట్లో కీలక నిర్ణయం చేసే అవకాశం ఉంది. 50 టీఎంసీల మల్లన్న సాగర్‌కు రూ.7,308 కోట్లు, 3 టీఎంసీల రంగనాయక సాగర్‌ను రూ.550 కోట్లు, 7 టీఎంసీల కొండ పోచ మ్మకు రూ.521.50 కోట్లు, 9.86 టీఎంసీల గంధమలకు రూ.8 98.50 కోట్లు, 11.39 టీఎంసీల బస్వా పూర్‌కు రూ.1803 కోట్ల తో అంచనాలు సిద్ధమయ్యాయి. వీటికి మొత్తంగా రూ.11,081 కోట్ల అంచనా వేయగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనిపై కేబినెట్ లో ఆమోదం తెలిపి అనం తరం అధికారిక ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. -
బెదిరింపులతో భూములు లాక్కుంటారా..?
అంగీకారం లేకుండా ప్రాజెక్టులను నిర్మించడం దుర్మార్గం డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తారా? ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా? 2013 చట్టం ద్వారానే భూసేకరణ జరపాలి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో మల్లన్నసాగర్ ముంపు బాధితుల దీక్షలకు సంఘీభావం తొగుట: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపువాసులు చేపడుతున్న రిలే దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. గ్రామాల మధ్య 50 టీఎంసీల రిజర్వాయర్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిటెయిల్డ్ రిపోర్టు తయారు చేయకుండానే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముం దుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల అం గీకారం లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం దుర్మార్గమని మండిపడ్డారు. 123 జీఓతో భూసేకరణ చేయడమంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని ప్రజలు కోరినా ప్రభుత్వం ముందుకు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంతో ప్రజలకు ఏ విధంగా నష్టమో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం మాట వినని ప్రజలపై 144 సెక్షన్ విధించి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులతో బెదిరింపులకు గురి చేసి భూములు లక్కోవడం దుర్మార్గమన్నారు. భూములన్నీ గుంజుకుని బహుళజాతి సంస్థలకు కట్టబెడతారా? అని ప్రశ్నించారు. భూ సేకరణ చట్టంలో నిరుపేదలకు అన్ని విధాలా హక్కులున్నాయని చెప్పారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను రోడ్డుపాలు చేయడానికేనా? అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రా జెక్టులు, పరిశ్రమల పేరిట భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీ జేఏసీ కోకన్వీనర్ పిట్టల రవీందర్, నిజాం కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తం, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు రమేశ్, విద్యా సంస్థల ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అమరేందర్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ బాధితులూ ఆందోళన వద్దు
రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు గజ్వేల్ రూరల్: ‘మల్లన్న సాగర్’ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని, వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధమవుతుందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు, రైతులను ప్రతిపక్షాలు ఆయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం 2013చట్టం ప్రకారం మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. భూములు, ఇండ్లు, ఇతర వనరులు కోల్పోతున్న ప్రజలు, రైతులందరికి పరిహారంతో పాటు డబుల్ బెడ్రూం ఇంటి సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉందని, ‘మల్లన్న’ బాధితులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలన్నారు. సమావేశంలో సిద్దిపేట డివిజన్ ఇన్‌ఛార్జి మారెడ్డి రామలింగారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కన్వీనర్ పి. వెంకట్రాంరెడ్డి, నాయకులు నర్సింలుగౌడ్, రమేష్‌గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్న సాగర్’కు రూ. 9,200 కోట్లు
భారీగా పెరిగిన రిజర్వాయర్ వ్యయ అంచనా * గత ఒప్పంద విలువ రూ. 1,954 కోట్లే * నీటి నిల్వ సామర్థ్యం పెంపు వల్లే పెరిగిన అంచనా వ్యయం * బస్వాపూర్, పాములపర్తి, గంధమల రిజర్వాయర్ల వ్యయ అంచనాలూ రెడీ * త్వరలోనే టెండర్లు పిలవనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ (తడ్కపల్లి) రిజర్వాయర్ అంచనా వ్యయం సిద్ధమైంది. ఈ నిర్మాణానికి రూ. 9,200 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ తేల్చింది. అలాగే రూ. 600 కోట్లతో పాములపర్తి, రూ. 1,700 కోట్లతో బస్వాపూర్, రూ. 900 కోట్లతో గంధమల, రూ. 600 కోట్లతో ఇమామాబాద్ రిజర్వాయర్ల వ్యయ అంచనాలనూ సిద్ధం చేసింది. ఈ అంచనాలపై హైపవర్ కమిటీ చర్చించాక ప్రభుత్వం వాటికి ఆమోదం తెలుపనుంది. అనంతరం టెండర్లు పిలవనుంది. సామర్థ్యానికి తగ్గట్లే మల్లన్న సాగర్ వ్యయ పెరుగుదల... 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా సిద్దిపేటలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ (పాములపర్తి) సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇమామాబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచగా నల్లగొండ జిల్లాలో కొత్తగా గంధమల రిజర్వాయర్‌ను 10 టీఎంసీలతో, బస్వాపూర్ రిజర్వాయర్‌ను 11.39 టీఎంసీలతో చేపట్టాలని నిర్ణయించింది. మల్లన్న సాగర్ పాత వ్యయం అంచనా రూ. 1,864 కోట్లు ఉండగా దాన్ని 4.86 శాతం అధికంగా కోట్ చేయడంతో అంచనా వ్యయం రూ. 1,954.59 కోట్లకు చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్‌ను 50 టీఎంసీలకు పెంచి నిర్మాణం చేపట్టనుండటంతో అంచనా వ్యయం ఏకంగా రూ. 9,200 కోట్లకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. దీంతోపాటే ఇక్కడి నుంచి ఒకవైపున నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. మరోవైపున కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్ నుంచే నీటి తరలింపు ప్రణాళిక రూపొందించారు. మరోపక్క సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీటి సరఫరా చే యాలని నిర్ణయించారు. మొత్తంగా 13 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు మల్లన్న సాగర్ కీలకంగా మారనుంది. దీని కింద 14,367 ఎకరాల ముంపు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.