missile tests
-
కిమ్‌కు తొలిసారి షాక్! ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తర కొరి యోలో కిమ్ ప్రభు త్వం మిలటరీ కార్యక లాపాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరస పెట్టి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్ రెండో దశ సమయంలో కనెక్షన్ తెగిపోయినట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరంవైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్‌లు వణికిపోయాయి. రాకెట్ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
రష్యా రాక్షసకాండను సహించబోం.. శిక్ష తప్పదు.. జీ7 దేశాల హెచ్చరిక
టోక్యో: తైవాన్‌పై చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జీ7 దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘తీరు మార్చుకుని అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు’’అని ఆ దేశాలను హెచ్చరించాయి. జీ7 దేశాలైన జపాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ విదేశాంగ మంత్రులు, అత్యున్నత ప్రతినిధుల మూడు రోజుల సదస్సు జపాన్‌లోని కరూయిజవాలో మంగళవారం ముగిసింది. చైనా, రష్యా, ఉత్తర కొరియాల కట్టడికి కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం మంత్రులు ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. రష్యాను దారికి తీసుకురావడమే లక్ష్యంగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాకు శిక్ష తప్పదన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా రాక్షసకాండను సహించబోమన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందన్నారు. చైనా, తైవాన్ మధ్య శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. జీ7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మే లో జపాన్‌లోని హిరోషిమాలో జరగనుంది. చైనాపై జీ7 కూటమి కుట్రలు పన్నుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. -
North Korea: మరింత ‘అణు’ దూకుడు
సియోల్: అణు పాటవాన్ని మరింతగా పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ అత్యున్నత సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను పెంచుకోవడంపై భేటీలో లోతుగా చర్చ జరిగినట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ఈ సందర్భంగా అధికారులను కిమ్ ఆదేశించారు. దక్షిణ కొరియాతో మిలిటరీ హాట్‌లైన్ చర్చలకు కూడా ఐదు రోజులుగా ఉత్తర కొరియా ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహుశా ప్రస్తుత ఉద్రిక్తతలను బూచిగా చూపుతూ దూకుడు చర్యలకు దిగేందుకు ఉత్తర కొరియా యోచిస్తుండవచ్చని దక్షిణ కొరియా అనుమానిస్తోంది. 2023లో ఉత్తర కొరియా ఇప్పటికే 30కి పైగా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. 2022లో కూడా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. తమను అణ్వాయుధ దేశంగా అంగీకరించేలా, ఆర్థిక ఆంక్షలను సడలించేలా అమెరికాపై ఒత్తిడి పెంచడమే వీటి ఉద్దేశమని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య అణు చర్చల్లో 2019 నుంచీ ప్రతిష్టంభన నెలకొంది. ఉత్తర కొరియా 2017లో తొలిసారి అణుపరీక్షలు నిర్వహించింది. -
భారీ సైనిక విన్యాసాలు.. అణుక్షిపణుల ప్రయోగం
సియోల్: కొరియా ద్వీపకల్పం వేడెక్కుతోంది. ఒకవైపు అమెరికా– దక్షిణకొరియా భారీ సైనిక విన్యాసాలు ప్రారంభం కాగా, వీటిని సవాల్ చేస్తూ జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యమున్న క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించింది. దక్షిణకొరియా, అమెరికా సైనిక బలగాలు సోమవారం నుంచి భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. 2018 తర్వాత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఉమ్మడి విన్యాసాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే, దక్షిణకొరియా, అమెరికాల చర్యలు తమ దేశ దురాక్రమణకు రిహార్సల్ వంటివని ఆరోపిస్తున్న ఉత్తరకొరియా దీనికి నిరసనగా ఆదివారం జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ రెండు క్షిపణులు వ్యూహాత్మక ఆయుధాలని అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ అభివర్ణించింది. దేశ అణు సామర్థ్యాన్ని ఇవి చాటుతున్నాయని తెలిపింది. ఇవి రెండు గంటలపాటు గాలిలోనే ఉన్నాయని, 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉందని తెలిపింది. అయితే, ఉత్తరకొరియా జలాంతర్గామి నుంచి అణు వార్హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల పరిజ్ఞానాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆకలి కేకలు.. దయనీయ స్థితిలో ఉత్తర కొరియా
పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది...! అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. కారణాలెన్నో... ► కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. ► ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ► ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే చైనా నుంచి భారీగా బియ్యం, గోధుమ పిండి తదితరాలను దిగుమతి చేసుకుంది కూడా. కానీ ‘ముందుజాగ్రత్త’ చర్యల్లో భాగంగా వాటిని కావాలనే దాచి ఉంచిందని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రజల్లో చాలామందికి కొనుగోలు శక్తి క్షీణించడంతో వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కిలో బియ్యం ధర ఏకంగా 220 రూపాయలకు ఎగబాకిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ► వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకుంటామంటూ తాజాగా జరిగిన 4 రోజుల వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. అది ఏ మేరకు వాస్తవ రూపు దాలుస్తుందన్న దానిపైనే కొరియన్ల భవితవ్యం ఆధారపడుతుంది. తీవ్ర అసమానతలు ► ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం కేవలం రూ.1.3 లక్షలు! ► దేశంలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. ► అత్యధికులకు, ముఖ్యంగా గ్రామీణులకు అన్నం, కాయగూరలే ప్రధానాహారం. ► మాంసాహారం, పండ్లు వారికి అందని ద్రాక్షే. ► పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు. రాజధాని ప్యాంగ్యాంగ్లో స్థోమత ఉంటే అన్నిరకాల ఆహారమూ దొరుకుతుంది. ► దేశంలో ప్రైవేట్‌లో ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకం నిషిద్ధం. కానీ కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దాంతో ప్రైవేట్ క్రయ విక్రయాలను ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతోంది. నిధులన్నీ సైన్యానికే! ► ఉత్తర కొరియా 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైన్యాన్ని పోషిస్తోంది. ► ఏటా జీడీపీలో ఏకంగా నాలుగో వంతు సైన్యంపైనే వెచ్చిస్తోంది. ► 2022లోనైతే దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 70 ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది! ► తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణులు తదితరాలతో నెల రోజుల క్రితమే అతి పెద్ద సైనిక పరేడ్‌ను నిర్వహించింది! ► ఇలా వనరులన్నీ రక్షణ రంగానికే మళ్లుతుండటంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ► కిమ్ అణు పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో పరిస్థితి మరింత విషమించింది. ► కేవలం గతేడాది క్షిపణి పరీక్షలకు వెచ్చించిన నిధులతో దేశ జనాభా మొత్తానికీ ఏడాది పాటు చాలినన్ని తిండి గింజలు అందించవచ్చని అంచనా. ఆ కరువుకు 20 లక్షల మంది బలి! 1990ల్లో ఉత్తర కొరియా చవిచూసిన భయానక కరువు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటారు. ‘ఆర్డియస్ మార్చ్’గా పిలిచే ఈ కరువుకు అస్తవ్యస్త పాలన, సోవియట్ నుంచి సాయం ఆగిపోవడంతో పాటు 1995లో వచ్చిన భారీ వరదలు తక్షణ కారణంగా మారాయి. వాటి దెబ్బకు దేశంలో వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వంతుకు పైగా పొలాలు రోజల తరబడి అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి! జనమంతా పనీపాటా వదిలేసి కేవలం తిండి గింజల కోసం రోజుల తరబడి పొలాల వెంబడి తిరుగుతూ అలమటించిన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. కనీవినీ ఎరగని ఆ కరువుకు రెండు కోట్ల జనాభాలో పదో వంతుకు పైగా, అంటే 20 లక్షల మందికి పైగా బలైనట్టు చెబుతారు. అంతేగాక ఏకంగా 62 శాతం మందికి పైగా చిన్నారులు పౌష్ఠికాహార లోపానికి గురై శాశ్వత ఆరోగ్య తదితర సమస్యల బారిన పడ్డారు. రెండు మూడేళ్ల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినా చిన్నారులు మాత్రం కోలుకోలేకపోయారు. నేటికీ ఉత్తర కొరియాలో 22 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అంచనా! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిమ్‌కు సమష్టిగా చెక్ అమెరికా, జపాన్, కొరియా నిర్ణయం
నాంఫెన్ (కంబోడియా): వరసగా క్షిపణి పరీక్షలతో కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి కలసికట్టుగా పని చేయాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి. కంబోడియాలో జరుగుతున్న తూర్పు ఆసియా సదస్సులో జపాన్ ప్రధాని కిషిడా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడిగా సమావేశమై ఈ మేరకు చర్చించారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండగా ఉండాలని తీర్మానించారు. ఫసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడంపైనా మూడు దేశాలు చర్చించాయి. -
వాళ్ల అండ చూసే కిమ్ రెచ్చిపోతున్నాడు
న్యూయార్క్: అణు ఆయుధాలు.. వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం జపాన్ వైపుగా మధ్యంతర శ్రేణి క్షిపణిని పరీక్షించి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజులు తిరగకముందే.. మరో పరీక్షను చేపట్టింది. గురువారం తూర్పు జలాల వైపుగా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది ఉత్తర కొరియా. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీ అధికారిక వార్తా సంస్థ యోన్హప్ ధృవీకరించింది. ప్యోంగ్యాంగ్ కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఆరు-ఆరున్నర గంటల మధ్యలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఇక ఉత్తర కొరియా ఇలా గ్యాప్ లేకుండా క్షిపణి పరీక్షలతో చెలరేగిపోవడంపై అగ్రరాజ్యం ఆగ్రహం వెల్లగక్కింది. చైనా, రష్యాల అండ చూసుకునే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెచ్చిపోతున్నాడంటూ ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్, భద్రతా మండలిలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చైనా, రష్యాల పేర్లను ప్రస్తావించకుండానే.. పరోక్షంగా ఆమె ఈ ఆరోపణలు గుప్పించారు. ‘‘ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్న రెండు దేశాలు.. ఉత్తర కొరియాకు రక్షక కవచంలా పని చేస్తున్నాయి. అణు ఆయుధాలు, క్షిపణి పరీక్షలను ఖండిస్తూ ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ కట్టడి ద్వారా ఐరాస ప్రయత్నిస్తుంటే.. ఆ రెండు దేశాలు మాత్రం ఉత్తర కొరియాను ఆంక్షల నుంచి రక్షించే యత్నం చేస్తున్నాయి. ఆ రెండు దేశాల సంరక్షణలోనే ఉత్తర కొరియా ఉంది. వాళ్లను చూసే కిమ్ జోంగ్ ఉన్ రెచ్చిపోతున్నాడు అంటూ ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు ఐదేళ్ల తర్వాత జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేపట్టి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది ఉత్తర కొరియా. ఈ నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా అక్కడి స్థానికులు ఖాళీ చేయించారు జపాన్ అధికారులు. అవసరమైతే త్రైపాక్షిక సంబంధాల ద్వారా అమెరికా-జపాన్-దక్షిణ కొరియాలు.. ఈ కవ్వింపు చర్యలను తిప్పి కొడతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిగా అమెరికా, దక్షిణ కొరియాలు నాలుగు మిస్సైల్స్‌ను తూర్పు తీర ప్రాంతం వైపు బుధవారం ఉదయం ప్రయోగించాయి. గత వారం.. అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన నావల్ డ్రిల్స్‌కు ప్రతిగా ఉత్తర కొరియా వరుసగా మిస్సైల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో క్షిపణి ప్రయోగాలను చేపడుతున్నాడు కిమ్ జోంగ్ ఉన్. ఇదీ చదవండి: నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!? -
చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర
తైపీ: చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (82) తైవాన్ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది. ‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది. తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు. ‘‘చైనాను నిలువరించేందుకు తైవాన్ అంశాన్ని వాడుకోవడాన్ని అమెరికా ఇకనైనా కట్టిపెట్టాలి. తైవాన్ స్వాతంత్య్ర డిమాండ్లకు మద్దతివ్వొద్దు’’ అని డిమాండ్ చేశారు. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్‌ను మంగళవారం రాత్రి పిలిపించి పెలోసీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాతో కయ్యానికి కాలు దువ్వొద్దని హెచ్చరించారు. తైవాన్‌పై ఆంక్షలకూ చైనా తెర తీసింది. పళ్లు, చేపల దిగుమతులు, ఇసుక ఎగుమతులపై నిషేధం విధించింది. నిబద్ధత చాటుకున్నాం: పెలోసీ దక్షిణ కొరియా బయల్దేరే ముందు తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ భేటీ అయ్యారు. తైవాన్లోనూ, ప్రపంచంలో ఇతర చోట్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న అమెరికా సంకల్పం మరింత బలపడిందంటూ సంఘీభావ ప్రకటన చేశారు. తమకు చిరకాలంగా మద్దతుగా నిలుస్తున్నందుకు పెలోసీకి వెన్ కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ(ఎడమ) తైవాన్ చుట్టూరా సైనిక విన్యాసాలు పెలోసీ పర్యటనకు సమాధానంగా తైవాన్ను లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాత్రి తెరతీసిన భారీ సైనిక విన్యాసాలను చైనా మరింత తీవ్రతరం చేసింది. తైవాన్ జలసంధిలోకి మరిన్ని యుద్ధ నౌకలను తరలించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు, విన్యాసాల జోరు పెంచి అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపింది. చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలం సమీపంలో విన్యాసాలకు దిగాయి. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తైవాన్ ద్వీపం చుట్టూ మరిన్ని సైనిక విన్యాసాలుంటాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది. ఇవి యుద్ధానికి దిగడంతో సమానమని పరిశీలకులంటున్నారు. బలప్రయోగంతోనైనా తైవాన్ను తనలో కలిపేసుకునే చర్యలకు చైనా దిగనుందనేందుకు ఇవి సంకేతాలేనంటున్నారు. చైనా చర్యలను తైవాన్ తీవ్రంగా నిరసించింది. ‘‘మేం జడిసేది లేదు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుని తీరతాం’’ అని తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్ అన్నారు. -
ప్రపంచానికి మరో హెచ్చరిక.. తగ్గేదేలే అంటున్న నార్త్ కొరియా కిమ్
ప్యాంగ్యాంగ్: అమెరికాపై ఆగ్రహంతో ఉన్న నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా ఉన్నారు. దానికి తగినట్టుగానే నార్త్ కొరియా బుధవారం మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా తూర్పు తీరం దిశగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు దక్షిణ కొరియా మిలటరీ తెలిపింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు సమీపంలో ఉన్న సనన్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగినట్టు వెల్లడించింది. దీంతో మరోసారి కిమ్ జోంగ్ ఉన్ దక్షిణకొరియా, అమెరికా, జపాన్‌లను ఆందోళనకు గురిచేశారు. కాగా, ఈ ఏడాదిలో ఇది 14వ క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన మిలిటరీ పరేడ్ తర్వాత జరిగిన తొలి క్షిపణి పరీక్ష ఇదే కావడం విశేషం. మరోవైపు.. అణ్వాయుధాలను మరింత వేగవంతంగా సేకరించనున్నట్లు ఆ పరేడ్ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన తర్వాత ఇలా క్షిపణి ప్రయోగం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక, దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అణ్వాయుధ పరీక్ష నిర్వహణకు కూడా ఉత్తర కొరియా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరేడ్‌లో హాసాంగ్-17 ఖండాంతర క్షిపణిని నార్త్ కొరియా ప్రదర్శించింది. దానితో పాటు ప్రదర్శనలో మల్టిపుల్ గెయింట్ రాకెట్ లాంచర్లు, సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైళ్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: ట్విటర్ ట్విస్ట్: ట్వీట్‌తోనే భారీ షాక్ ఇచ్చిన ఎలన్ మస్క్.. పైసా వసూల్! -
North korea: అణు దాడులు చేస్తాం: నార్త్ కొరియా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్
సియోల్: అమెరికా సహా అంతర్జాతీయ ఒత్తిడిని బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఘాటైన హెచ్చరికలు చేశారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అణు దాడికి సిద్ధమేనని తేల్చి చెప్పారు. అణ్వాయుధ సంపత్తిని మరింతగా పెంచుకుంటామని ప్రతినబూనారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆయుధాల పరేడ్ నిర్వహించారు. ఈ ఆయుధ ప్రదర్శనలో దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన, ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించారు. సైనిక దుస్తులైన తెలుపు రంగు కోటు వేసుకున్న కిమ్ భార్య రి సోల్ జూతో కలిసి పరేడ్‌ని తిలకించారు. ‘‘యుద్ధాన్ని అరికట్టడమే మా మొదటి లక్ష్యం అయినప్పటికీ, మా దేశ ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలగజేస్తే అణ్వాయుధాలతో ఎదురు దాడి చేయడం మా రెండో లక్ష్యమవుతుంది’’అని కిమ్ కుండబద్దలు కొట్టారు. ఈ ఆయుధ పరేడ్‌లో ఉత్తర కొరియాకి చెందిన అతి పెద్ద ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్–17 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్షిపణి పరిధిలో అమెరికా అంతా ఉందని వార్తలొచ్చాయి. ఇది కూడా చదవండి: అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.. రష్యా వార్నింగ్ -
అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం
బాలాసోర్: అగ్ని ప్రైమ్(అగ్ని– పి) క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న ఈ బలాస్టిక్ మిసైల్‌ను ఒడిషా తీరంలోని అబ్దుల్‌కలామ్ ద్వీపం నుంచి శనివారం దిగ్విజయంగా పయ్రోగించినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని తెలిపింది. 1000– 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు. పరీక్షలో క్షిపణి కచ్ఛితమైన లక్ష్యసాధన చేసిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ సందర్భంగా సైంటిస్టుల బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాధ్ ప్రశంసించారు. అగ్ని– పి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్డీఓ చైర్మన్ సతీశ్‌రెడ్డి హర్షం ప్రకటించారు. తొలిసారి ఈ క్షిపణిని జూన్ 28న పరీక్షించారు. నేడు జరిపిన రెండో పరీక్షతో క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందని, వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్డీఓ తెలిపింది. -
పోటాపోటీగా ఉభయ కొరియాలా క్షిపణి పరీక్షలు
సియోల్: ఉభయ కొరియాలు పోటా పోటీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకొని ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు తెరతీస్తున్నాయి. బుధవారం కొద్ది గంటల తేడాలో రెండు దేశాలు క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. ఉత్తర కొరియా మళ్లీ దిగువ శ్రేణి క్షిపణి ప్రయోగాలు రెండు చేయడంతో.. దక్షిణ కొరియా దానికి పోటీగా ఏకంగా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసి తన సత్తా చాటింది. జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించగలిగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఏడో దేశంగా నిలిచింది. కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్ అహ్ చంగ్ హో ద్వారా సముద్రగర్భంలో ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టుగా ద.కొరియా అధ్యక్ష భవనం వర్గాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 వేల టన్నుల బరువున్న సబ్‌మెరైన్ నుంచి నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి కచి్చతంగా ఛేదించింది. అంతకు ముందు ఉత్తర కొరియా రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కాగా, ఇదిలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని ఉత్తరకొరియా అధినేత కిమ్ సోదరి యో జాంగ్ హెచ్చరించారు. -
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు
సియోల్: సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించింది. శని, ఆదివారాల్లో వరుసగా రెండు రోజులు ఉత్తర కొరియా నిర్వహించిన ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్టుగా ఆ దేశ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సోమవారం వెల్లడించింది. అమెరికాతో అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా తమ ఆయుధ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలన్న ఉద్దేశంతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కొత్త క్షిపణి 1,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఉ.కొరియాపై శత్రువులు ఎవరైనా దాడి చేస్తే దానిని గుర్తించి సమర్థంగా తిప్పికొట్టి రక్షణని కలి్పంచే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. అణు వార్హెడ్లు మోసుకుపోగలదా? ఈ క్షిపణిని ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అభివర్ణించింది. ఇది అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్లలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని నిపుణులు చెబుతున్నారు. ‘వ్యూహాత్మక ఆయుధమని ఉత్తర కొరియా చెబుతోందంటే దీనికి అణు వార్హెడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. అయితే వాటిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందో లేదో చెప్పడం కష్టం’ అని అమెరికాకు చెందిన కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సభ్యుడు అంకిత్ పాండా చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని, అందుకే ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్టుగా ఇప్పటికే కిమ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఉత్తరకొరియాపై ఆంక్షలున్నాయి. కానీ క్రూయిజ్ క్షిపణులపై ఎలాంటి ఆంక్షలు లేవు. మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా నిరంతరం అణ్వాయుధాలపైనే దృష్టి సారించి ఇలా పరీక్షలు చేయడం అంతర్జాతీయ సమాజానికి కూడా ముప్పేనని యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్రూయిజ్ క్షిపణి ప్రయోగ దృశ్యాలు -
డీఆర్డీవో చేపట్టిన ఆకాష్ మిసైల్ ప్రయోగం విజయవంతం
భూ ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం ఆకాష్ మిసైల్‌ను బుధవారం రోజున డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఒడిషా తీరాన ఉన్నఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ప్రయోగించారు. మిసైల్‌కు సంబంధించిన ఫ్లైట్ డేటా ప్రకారం టెస్ట్ విజయవంతమైందని డీఆర్డీవో నిర్థారించింది.ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రాడార్, టెలిమెట్రీ వంటి అనేక పర్యవేక్షణ విధానాలను టెస్ట్‌రేంజ్‌లో ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 . 45 నిమిషాలకు ఆకాష్ మిసైల్‌ను పరిక్షించినట్లు పేర్కొంది. కొత్తగా అప్డేట్ చేసిన ఈ మిసైట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నలక్ష్యాలను మాక్ 2.5 వేగంతో ఛేదించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కొత్త క్షిపణి వ్యవస్థను హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీవో ల్యాబ్ అభివృద్ధి చేసింది. ఆకాష్-ఎన్జీ క్షిపణి ఆయుధ వ్యవస్థతో భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించినందుకుగాను డీఆర్డీవో, భారత వైమానిక దళం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలను తెలిపారు. -
భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా
సియోల్: ఉత్తర కొరియా అతి భారీ నూతన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ని ప్రదర్శించింది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద మిస్సైల్ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనిని మిలిటరీ పరేడ్‌లో ప్రదర్శించారు. ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్ నిర్వహించారు. వేలాది మంది సైనికులు, మాస్క్‌లు ధరించకుండా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ ఖండాంతర క్షిపణిని ప్రధాన వీధుల్లో భారీ వాహనంపై ప్రదర్శించగా కిమ్ జోంగ్ ఉన్ దీనిని వీక్షించినట్టు ఆ దేశ అధికారిక టీవీ చానల్ కేసీ టీవీలో చూపించారు. రోడ్లపై ప్రదర్శించిన ప్రపంచంలో అతిపెద్ద మిస్సైల్ ఇదని, ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్‌కి చెందిన అంకిత్ పాండా ట్వీట్ చేశారు. ఈ క్షిపణి అమెరికాలోని రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగల శక్తిసామర్థ్యాలు కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌ని, అమెరికా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టేటపుడు పరీక్షించాలని భావిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఆత్మరక్షణ కోసం మన సైన్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని భారీ జనసమీకరణను ఉద్దేశించి కిమ్ వ్యాఖ్యానించారు. -
విమాన విధ్వంస క్షిపణులను ప్రయోగించిన చైనా
బీజింగ్: చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైల్స్‌ని, దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించింది. అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని బీజింగ్ పేర్కొంటుండగా, వియత్నాం, మలేషియా, పిలిప్పైన్స్, బ్రూనే, తైవాన్లు విభేదిస్తున్నాయి. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు. -
మళ్లీ అణ్వాయుధ పోటీ!
అమెరికా, రష్యా మధ్య కుదిరిన ఐఎన్ఎఫ్ (ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్‌ట్రీటీ) ఒప్పందం రద్దయింది. న్యూ స్టార్ట్ (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం)కు కాలం చెల్లిపోయిందని ట్రంప్ సర్కార్ గర్జిస్తోంది. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి అమెరికాకు సవాల్ విసిరింది. చైనా, ఇరాన్‌లు అదే బాటలో నడుస్తున్నాయి. భారత్ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ దేనికి సంకేతం? ప్రపంచ దేశాల్లో మరోసారి అణ్వాయుధాల పోటీకి తెరలేస్తుందా? ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఆయుధ నియంత్రణ మంత్రాన్ని ప్రపంచ దేశాలు జపించాయి. అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి గట్టి కృషి చేశాయి. ఇప్పుడా పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ఉద్రిక్తతలు చూస్తుంటే మళ్లీ దేశాల మధ్య ఆయుధ పోటీకి తెరలేస్తుందనే భావన వ్యక్తమవుతోంది. అమెరికా –రష్యా, ఉత్తరకొరియా –అమెరికా, భారత్ –పాక్, ఇజ్రాయెల్ –ఇరాన్‌ల మధ్య జరుగుతున్న పరిణామాలు ఆయుధ పోటీని పెంచుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. కశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను మోదీ ప్రభుత్వం రద్దు చేయగానే పాక్ బుసలు కొట్టింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచివి కాదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. దౌత్యపరమైన మార్గాలు విఫలమైతే ఎంతకైనా తెగిస్తామంటూ పాక్ ఆర్మీ హెచ్చరించింది. పాక్ వద్ద 140–150 అణు వార్హెడ్లు ఉంటే, భారత్ దగ్గర అణు 130–140 వార్హెడ్లు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలతో రెండు దేశాలు రక్షణ బడ్జెట్‌ను మరింత పెంచుతాయని అంచనాలున్నాయి. సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా అణ్వాయుధ తయారీ సామర్థ్యం ఉందని చెబుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అగ్రరాజ్యం కేంద్రంగానే.. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో జరిగిన ఒక్కో ఒప్పందానికి ట్రంప్ సర్కార్ మంగళం పాడేస్తోంది. ఐఎన్‌ఎఫ్‌ను రద్దు చేసిన అగ్రరాజ్యం.. 2021లో ముగిసిపోనున్న న్యూ స్టార్ట్ ఒప్పందాన్నీ పొడిగించబోమంటోంది. మరోవైపు చైనా తనకు ప్రథమ శత్రువుగా మారుతోందని అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. చైనా అత్యంత ఆధునిక క్షిపణుల్ని సమకూర్చుకోవడం, వాణిజ్యపరంగా కూడా సవాల్ విసురుతూ ఉండడంతో అమెరికా మరింత ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది. ‘మాకు, రష్యాకు మధ్య ఆయుధ పోటీ రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుంది. ఈ పోటీని తగ్గించే ఒప్పందాన్ని ట్రంప్ సర్కార్ తుంగలో తొక్కేసింది. రెండు దేశాల్లోనూ ఆయుధాల తనిఖీ బృందాలు ఏమీ చేయడం లేదు. అమెరికా ఐసీబీఎంలు, జలాంతర్గాములు, బాంబుల తయారీకి ప్రయత్నిస్తోంది. ఈ ఖర్చు ట్రిలియన్ డాలర్లకు చేరుకొని తడిసిమోపెడు కానుంది’ అని ఒకప్పుడు అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వామి అయిన రిచర్డ్ బర్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలను తగ్గించుకునే చర్యలు చేపట్టినప్పటికీ ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాల్లో అమెరికా, రష్యా దగ్గరే 90 శాతం ఉన్నాయి. ఈ రెండు దేశాల సైన్యంలో ఉన్న 8వేలకు పైగా వార్హెడ్లతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయొచ్చు. ఇప్పుడు పెద్ద దేశాలే అణ్వాయుధాలు, ఆధునీకరణ అంటూ ఉంటే, చిన్న దేశాలు కూడా పోటీకి సై అంటున్నాయి. అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టలేకపోతే, కొత్త దేశాలూ ఆ«యుధాల తయారీ మొదలు పెడతాయి. పెద్ద దేశాలు మరిన్ని ఆయుధాల్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తే, చిన్నదేశాలు వాటినే అనుసరిస్తాయి –జోసెఫ్ సిరిన్కోయిన్, ప్లౌషేర్స్ ఫండ్, ప్రపంచ భద్రతా వ్యవహారాల సంస్థ విశ్లేషకుడు -
మరోసారి ఆయుధ పరీక్ష
ప్యాంగ్యాంగ్/ సియోల్ : ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాలను పరీక్షించింది. ఈ పరీక్షలను ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ పరీక్షలు శనివారం నిర్వహించినట్లు తెలిపింది. దీర్ఘ శ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాల సామర్థ్యాన్ని, లక్ష్యాలను ఛేదించే కచ్చితత్వాన్ని అంచనా వేసే ఉద్దేశంతో ఈ పరీక్షలు జరిపినట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. తూర్పుతీర ప్రాంతంలో ఈ పరీక్షలు జరపడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్షలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉంది. 45 నుంచి 150 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను ఉత్తరకొరియా పరీక్షించిందని దక్షిణ కొరియా ఆదివారం వెల్లడించింది. కాగా 2017, నవంబర్‌లో కొరియా చివరిసారిగా ఇటువంటి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. శక్తిమంతమైన బలంద్వారా మాత్రమే అసలైన శాంతి, భద్రత లభిస్తాయంటూ పరీక్షల అనంతరం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ సైన్యాన్ని ఉద్దేశించి పేర్కొనడం తెలిసిందే.ఇటువంటి సత్యాన్ని బలగాలు గుర్తెరిగి మసలాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికాపై ఒత్తిడి పెంచడమే ఉన్ ఉద్దేశమని అణ్వాయుధ విభాగం నిపుణులు అభిప్రాయపడ్డారు. నిరాయుధీకరణకు సంబంధించి అమెరికా అనుసరిస్తున్న తీరు ఇబ్బంది కలిగించిందని, ఎవరి ఒత్తిడికీ తలొగ్గే తత్వం ఆయనది కాదన్నారు. -
గంటకు 24,696 కి.మీ. దూసుకెళ్లే క్షిపణి
మాస్కో: రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థ అవన్గార్డ్ తుది పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘నా ఆదేశాల మేరకు రక్షణశాఖ అణ్వస్త్ర సామర్థ్యమున్న అవన్గార్డ్ క్షిపణికి సంబంధించిన తుది పరీక్షలను బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం రష్యా వద్ద సరికొత్త వ్యూహాత్మక ఆయుధముంది’ అని ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో వెల్లడించారు.ఈ క్షిపణిని 2019 నుంచి రష్యా సైన్యం వినియోగించే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచదేశాల వద్ద ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థలను ఏమార్చగల అవన్గార్డ్ క్షిపణి గంటకు 24,696 కి.మీ (20 మ్యాక్) వేగంతో దూసుకుపోగలదు. ఇందులో అమర్చిన గ్లైడర్ల కారణంగా క్షిపణి నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా ఈ రాకెట్ ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నయినా 30 నిమిషాల్లో తుత్తునియలు చేయగలదు. -
ప్రహార్ క్షిపణి పరీక్ష సక్సెస్
బాలసోర్: భారీ వర్షం మధ్యనే స్వల్ప శ్రేణి క్షిపణి ‘ప్రహార్’ను భారత్ గురువారం ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనేజేషన్) అభివృద్ధి చేసింది. వివిధ దిశల్లో ఉన్న బహళ లక్ష్యాలను ప్రహార్ ఛేదించగలదని అధికారులు చెప్పారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిపిన పరీక్షలో క్షిపణి అనుకున్న ప్రకారం పనిచేసిందనీ, 200 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిందని వారు వెల్లడించారు. ఈ క్షిపణిలో అత్యాధునిక దిక్సూచి వ్యవస్థ, అడ్వాన్స్డ్ కంప్యూటర్ సహా పలు విశేషాలు ఉన్నాయనీ, అన్ని రకాల వాతావరణాలు, ప్రాంతాల్లో ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని అధికారులు చెప్పారు. -
దివిసీమలో దూసుకుపోనున్న ‘క్షిపణి’!
అవనిగడ్డ/నాగాయలంక : కృష్ణా జిల్లా దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆమోదముద్ర లభించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటులో కీలకమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల సడలింపు నిర్ణయానికి శుక్రవారం పర్యావరణశాఖ అంగీకరించింది. పనులు ప్రారంభించుకోవచ్చని, ఈ మేరకు వారం రోజుల్లో లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడించనున్నట్టు కేంద్రానికి పర్యావరణ మంత్రిత్వశాఖ తెలియజేయడంతో అన్ని అవరోధాలు తొలగిపోయాయి. తొలిదశగా రూ. 800 కోట్లు, రెండో దశలో రూ. 1,000 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నట్టు డీఆర్డీవో(రక్షణ పరిశోధన సంస్థ) అధికారులు ప్రకటించారు. దేశంలోనే రెండో అతి పెద్ద క్షిపణి పరీక్ష కేంద్రం దివిసీమలో ఏర్పాటు చేయనుండటంతో కృష్ణా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది. నాలుగేళ్ల నుంచి నిరీక్షణ.. గుల్లలమోదలో డీఆర్డీవో ఆధ్వర్యంలో క్షిపణి పరీక్ష కేంద్రం(మిస్సైల్ లాంచింగ్ స్టేషన్) ఏర్పాటు కోసం నాలుగేళ్ల కిందట అంకురార్పరణ జరిగింది. ఇందుకోసం 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, రైతులకు నష్టపరిహారం సమస్య వంటి అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వచ్చింది. రక్షణ కేంద్రం ఏర్పాటుకు అటవీభూమిని కేటాయించడం పట్ల సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు చేసింది. ఈ అటవీ భూములకు ప్రతిఫలంగా అంతే విస్తీర్ణంలో సొర్లగొందిలోని ఆర్ఎస్ నెంబర్ 674లో ఉన్న ఉన్న రెవెన్యూ భూమిని అటవీశాఖకు ఈ ఏడాది జనవరిలో బదలాయించడంతో ప్రధాన అడ్డంకి తొలగింది. రైతులకు నష్టపరిహారం సమస్యను కూడా పరిష్కరించారు. పర్యావరణ నిబంధనలు కొన్ని అడ్డంకుగా ఉండగా.. సడలింపుకు పర్యావరణ శాఖ శుక్రవారం అంగీకరించింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దివిసీమ ముఖ్య అధికారి కీలకపాత్ర ఈ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడంలో దివిసీమలోని పెదకళ్లేపల్లికి చెందిన ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. న్యూఢిల్లో ఉండే ఆయన పర్యావరణ అనుమతుల కోసం 18 నెలలుగా శ్రమించారు. అటవీశాఖ అనుమతితో పాటు, అటవీశాఖకు రెవెన్యూభూమిని బదలాయించడం, పర్యావరణ అనుమతికోసం డీఆర్డీవో నిపుణులను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగ, ఉపాధి, రహదారుల అభివృద్ధి, చెట్ల పెంపకంతో పాటు దివిసీమ రూపు రేఖలు మారిపోనున్నాయి. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
-
ఉ.కొరియాను ధ్వంసం చేస్తాం
ఐక్యరాజ్యసమితి/మాస్కో: ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు ఒకవేళ యుద్ధానికి దారితీస్తే మాత్రం ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. అన్ని దేశాలు కలసి ఉత్తర కొరియాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని పిలుపునిచ్చింది. అప్పుడు ఆ దేశానికి శిక్ష విధించినట్లు అవుతుందని పేర్కొంది. ఉత్తర కొరియా తాజాగా జరిపిన క్షిపణి ప్రయోగంపై ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. అమెరికాను లక్ష్యంగా చేసుకుని తాజాగా జరిపిన క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా ప్రపంచాన్ని యుద్ధపు అంచుల్లోకి తెచ్చిందని మండిపడ్డారు. మంగళవారం ఉత్తర కొరియాలోని సేయిన్నీ అనే ప్రాంతం నుంచి ఓ క్షిపణిని ప్రయోగించగా, దాదాపు 1000 కి.మీ. ప్రయాణించి జపాన్‌కు చెందిన సముద్రంలో పడిపోయింది. ‘ఒకవేళ యుద్ధం సంభవించిందో.. దానికి ఉత్తర కొరియా దుందుడుకు చర్యలే కారణం. నిజంగా యుద్ధమే వస్తే రెండో మాట లేకుండా ఉత్తర కొరియా సామ్రాజ్యం నేలమట్టం అవడం తథ్యం’ అని హేలీ అన్నారు. తామెప్పుడు ఆ దేశంతోతో యుద్ధాన్ని కోరుకోలేదని ఆమె చెప్పారు. ఉత్తర కొరియాతో సంబంధాలు తెంచుకోవాలన్న అమెరికా పిలుపును రష్యా వ్యతిరేకించింది. ఇది సూపర్ పవర్! సియోల్: ఉత్తర కొరియా బుధవారం పరీక్షించిన హవాసాంగ్–15 క్షిపణి... గత జూలైలో పరీక్షించిన హవాసాంగ్–14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. హవా సాంగ్–15 ఫొటోలు, వీడియోలను ఉ.కొ రియా గురువారం విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగల సామర్థ్యాన్ని ఉ.కొరియా మరింత పెంపొందించుకున్నట్లయింది. -
మరింత రెచ్చిపోతాడా?
సాక్షి : ఉత్తర కొరియా అణు పరీక్షలను అంతర్జాతీయ సమాజం మొత్తం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా అధ్యక్షుడు కిమ్ జంగ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గటం లేదు. వరుసగా అణు క్షిపణులను ప్రయోగిస్తూ పొరుగు దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నాడు. పద్ధతి మార్చుకోకపోతే యుద్ధం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మున్ముందు కిమ్ కవ్వింపు చర్యలు పెరిగే ఆస్కారం ఉందన్న సంకేతాలను దక్షిణ కొరియా అందజేస్తోంది. అక్టోబర్ నెలలో డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వార్షికోత్సవ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా 10, 18 తేదీల్లో ప్యోంగ్యాంగ్లో నిర్వహించబోయే వేడుకల్లో క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ద.కొ. అంచనా వేస్తోంది. గురువారం అధ్యక్షుడు మూన్ జాయె ఇన్‌తో భేటీ అనంతరం జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ యూ యోంగ్ ఓ ప్రకటన చేశారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం పరిస్థితి యుద్ధానికి దారి తీయవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అయితే అమెరికా మాదిరి యుద్దానికి తామూ ఉవ్విళ్లూరటం లేదన్న విషయాన్ని ఇప్పటికే దక్షిణ కొరియా స్పష్టం చేసింది. అయినప్పటికీ యూఎస్ భద్రతా దళాలు మాత్రం సియోల్ ఉత్తర భాగంలో భారీగా మోహరింపులు చేస్తోంది. మరోవైపు ఉంటే ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతం ఖసన్లో ఇప్పటికే రష్యా తన సైన్యాన్ని దించటంతో మున్ముందు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
చైనా తీరుపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆందోళన రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ వైపు తమ దేశ అవతరణ వేడుకలు జరుపుకుంటుండగా ఉత్తర కొరియా అదేరోజు (జూలై 4న) ఖండాంతర క్షిపణిని ప్రయోగించడాన్ని నేటికీ ట్రంప్ జీర్ణించుకోలేక పోతున్నారు. అమెరికాలోని అలస్కాకు సులువుగా క్షిపణులు ప్రయోగించే దిశగా నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పావులు కదుపుతున్నారని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించిన అనంతరం ట్రంప్ రంగంలోకి దిగారు. ఈ విషయంలో తమకు చైనా పూర్తిస్థాయిలో సహాయం చేస్తుందని భావించారు. నార్త్ కొరియా వల్ల ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించినా చైనా వైఖరిలో మార్పు రాలేదని శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. తమ సూచనల మేరకు దక్షిణ కొరియా వ్యాపార పరమైన విషయాలలో ఉత్తర కొరియాకు ఎన్నో ఆంక్షలు విధిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే పటిష్టమైన ఆసియా దేశం చైనా మాత్రం తమ మాట పెడచెవిన పెట్టిందంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా గత పాలకులు మూర్ఖులని, అందుచేతనే ఏడాదికి వందల బిలియన్ల డాలర్ల వర్తకాలు చేశారని మండిపడ్డారు. నార్త్ కొరియా ఆట కట్టించేందుకు సైనిక చర్యనే తుది నిర్ణయంగా మారవచ్చునని దక్షిణకొరియా, అమెరికా ఆర్మీ భావిస్తున్నట్లు తెలిపారు. తమకు సహకరించేందుకు సిద్ధమైన సౌత్ కొరియా గత శుక్రవారం రక్షణశాఖమంత్రి సాంగ్ యంగ్ మూ ఆధ్వర్యంలో క్షిపణిని పరీక్షించినట్లు వెల్లడించారు. మరోవైపు చైనా పాలసీల కారణంగా అమెరికా 309 బిలియన్ డాలర్లు నష్టపోయిందన్నారు. కిమ్ జోంగ్ పై పోరాటం చేసేందుకు బదులుగా చైనా మాత్రం.. అమెరికా టెక్నాలజీ సర్వీసులను తప్పుబట్టడం సబబు కాదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా, చైనాల సాయంతో నార్త్ కొరియా నియంతను అడ్డుకోవాలని లేనిపక్షంలో ముందుగా అమెరికాకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పెంటగాన్ హెచ్చరించింది. ఎంతో నమ్మకం ఉంచి సాయం కోరినా చైనా ఆ దిశగా అడుగులు వేయడం లేదని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు.