Mission Bhageeratha
-
సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా?
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే తప్ప గవర్నర్ నుంచి బిల్లులు పాస్ కాని పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. శాసనసభ ఓకే చేసిన బిల్లుల విషయంలో మంత్రులు, సీఎస్ వెళ్లి వివరాలు తెలిపినా, సందేహాలను తీర్చినా కూడా.. గవర్నర్ ఏడు నెలలు ఉద్దేశపూర్వకంగా ఆపారని ఆరోపించారు. సోమవారం హరీశ్‌రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు. హరీశ్‌రావు ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే.. ఆ బిల్లును ఏడునెలల పాటు ఆపి, ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపామని చెబుతున్నారు. మా పిల్లలకు ప్రొఫెసర్ చదువులు చెప్పొద్దా? పిల్లల భవిష్యత్ కంటే రాజకీయాలు ముఖ్యమా?’’అని ప్రశ్నించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను పాస్ చేయకుండా గవర్నర్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథకు నిధులేవి? ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు ప్రోత్సహకాలు ఇవ్వకుండా కేంద్రం పక్షపాతం చూపిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. మిషన్ భగీరథకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కనీసం 13 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. తెలంగాణ పథకాలు అద్భుతమని తీయటి మాటలు చెప్తారు, అవార్డులు కూడా ఇస్తారు. కానీ నయా పైసా నిధులు మాత్రం ఇవ్వరు’’అని విమర్శించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పథకం చేపట్టామని, మల్లన్నసాగర్ నుంచి ఆరు జిల్లాల్లో 10 నియోజకవర్గాల పరిధిలోని 1,922 గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును రూపొందించామన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిధులు ఇవ్వకుండా మోసం: ఎర్రబెల్లి కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు డబ్బులిస్తూ.. తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. -
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో చిక్కుకున్న పెయింటర్లు
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం అంబారిపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో ఐదుగురు పెయింటర్లు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామస్తుల సాయంతో ముందుగా ఇద్దరు పెయింటర్లను ట్యాంక్ నుంచి బయటకు తీశారు. మరో ముగ్గురు కూడా ఉండటంతో తీవ్రంగా శ్రమించి వారిని కూడా సురక్షితంగా పోలీసులు బయటకు తీశారు. ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన పెయిటర్లు స్పృహ కోల్పోవడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పెయిటర్లు శనివారం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో పెయింటింగ్ వేయడానికి అందులోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే వారు పెయింట్ వేస్తూ అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. చదవండి: అలిపిరి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం -
‘భగీరథ’కు ‘మల్లన్న’ నీరు
గజ్వేల్: త్వరలో పూర్తి కానున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ సాగునీటికే కాదు మిషన్ భగీరథ ద్వారా అందించే తాగు నీటికి కూడా ఆధారం కానుంది. ఇక్కడి నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోనున్నారు. సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో భగీరథ నీటి సరఫరాకు మల్లన్నసాగరే ప్రధాన వనరు కానుంది. ప్రస్తుతం ఆ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే లైన్ నుంచి వాడుకుంటున్నారు. ఈ లైన్‌పై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) సామర్థ్యం కలిగిన డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మిస్తున్నారు. రూ.674 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు సాగుతున్నాయి. జంట నగరాల్లోని పలు ప్రాంతాలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజల స్రవంతి పథకాన్ని ఎనిమిదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని ఘనపూర్ వద్ద నిర్మించిన డబ్ల్యూటీపీ ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రతినిత్యం ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతోంది. ఈ లైన్‌పై కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ఘనపూర్ డబ్ల్యూటీపీ వద్ద నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు పంపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరానికి వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి నీటి సరఫరా అంతరాయం ఏర్పడి తాగునీటికి అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్‌లో మిషన్ భగీరథ స్ఫూర్తికి అవరోధం ఏర్పడే అవకాశముంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని నిర్ణయించారు. పూర్తయితే స్వయం ప్రతిపత్తే.. ఇందుకోసం రూ.674 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి.. టెండర్ పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగునీటి కొరత తీర్చబోతున్నది. అంతేకాకుండా ఇందులో ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడుకుంటారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదిగా 540 ఎంఎల్డీ సామర్థ్యంతో డబ్ల్యూటీపీ పనులు ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి నీటిని ఇందులో శుద్ధిచేసి ఆయా జిల్లాలకు సరఫరా చేస్తారు. పనులు పూర్తి కాగానే గతంలో హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు. అందువల్ల హైదరాబాద్ లైన్‌పై ఎలాంటి అవరోధం లేకుండా నీరు పంపిణీ అవుతుంది. అలాగే సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి ఏర్పడనుంది. కొత్తగా చేపడుతున్న పనుల వల్ల ఆయా జిల్లాల్లోని సిద్దిపేట, జనగామ, పాలకుర్తి, ఘనపూర్, గజ్వేల్, దుబ్బాక, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ తదితర నియోజకవర్గాలకు ప్రయోజనం కలగనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న 16 మున్సిపాలిటీలకు కూడా మేలు జరగనుంది. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా.. సిద్దిపేటతో పాటు నాలుగ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందుకోసం మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడి నుంచి ఆయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. దీని ద్వారా హైదరాబాద్ లైన్‌పై ఎలాంటి భారం ఉండదు. అంతేకాకుండా ఈ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి రానుంది. ఇందుకోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
ఫ్లోరైడ్ విముక్త ప్రాంతమదిగో...
సూడుసూడు నల్లగొండ... గుండెమీద ఫ్లోరైడ్ బండ... బొక్కలు వొంకరబోయిన బతుకుల నల్లగొండ జిల్లా... దు:ఖం వెళ్లదీసేది ఎన్నాళ్లు నల్లగొండ జిల్లా..? – కేసీఆర్ (2005లో 25 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీల బృందంతో మర్రిగూడ, నాంపల్లి మండలాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి గుక్కెడు నీళ్లు కరువైన జీవితాలపై దుఃఖంతో కేసీఆర్ రాసిన పాట) ప్రతి మనిషికి మంచినీళ్లు ప్రాథమికహక్కు. గంగా, గోదావరి, కృష్ణా లాంటి జీవనదులు ప్రవహించే చోట నేటికీ మంచినీళ్లకోసం అల్లాడుతున్న ప్రజల జీవన ముఖచిత్రం నా దేశ చిత్రపటంగా కనిపిస్తుంది. ఈ దుస్థితికి గతకాలాన్నే నేరస్తునిగా నిలబెట్టాలా? ప్రజలకోసం పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణంచేసిన గతకాలపు పాలకులదే ఆ నేరం అందామా? ప్రజలకు మాత్రం దోసిళ్లలోకి శుద్ధ మంచినీళ్లు రావాలన్నదే కోరిక. మంచినీళ్లు పొందటం కోసం అల్లాడిన జనాన్ని గతకాలం చూసింది. మంచినీళ్లకోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెలతో మోసుకొచ్చిన మన తల్లుల బొప్పికట్టిన మాడలు చెబుతాయి. కన్నీళ్ల గోసను, మంచినీటి కోసం పడ్డ వెతలను చెబుతాయి. చెప్పుల్లేని కాళ్లతో కోసులకొద్ది దూరం నడిచిన ఆ తల్లుల పాదాలు కాయలు కాసిన కాళ్లు చారిత్రక సత్యాలను చెబుతాయి. ఈ దుస్థితికి నిలువెత్తు నిదర్శనం మా ఉమ్మడి నల్లగొండ జిల్లా. మంచినీళ్లు దొరకని కరుడుకట్టిన ఫ్లోరైడ్ జిల్లాగా దేశంలోనే పేరుపడ్డది. ఫ్లోరైడ్ అత్యధికంగావున్న జిల్లాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాతోపాటు మా నల్లగొండ జిల్లాకూడా ఉంది. నీళ్లందని భూములు, గొంతుతడవని నాలుకలు మొత్తంగా మంచినీళ్లకోసం అల్లాడిన గోసకు సజీవ తార్కాణం నా నల్లగొండ పోరునేల. ఈ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని గతకాలపు నాయకులంతా ప్రపంచ మానవహక్కుల కోర్టుల్లో నిలబడాల్సిందే. ఈ దుస్థితి మారాలని కన్నీళ్లను నీళ్లుగా తాగే ప్రజలు మంచినీళ్ల సాక్షిగా ఎన్ని ఉద్యమాలు చేసినా, దుశ్చర్ల సత్యనారాయణ లాంటి సంఘజీవులు ఎంతెంత దుఃఖించి ఉద్యమించినా, సాక్షాత్తు ఆనాటి ప్రధాని వాజ్‌పేయి ఫ్లోరోసిస్ బాధితుల్ని కళ్లారా చూసి కరిగిపోయిన నల్లగొండ జిల్లా నీటివెతలు తీరలేదు. ఒక్క నల్లగొండ జిల్లానే కాదు ఆనాటి తెలుగు సమాజంలో నీళ్లందని వూళ్లెన్నెన్నో ఉన్నాయి. ఇది తీరని గోసగా ఉంది. ఇది గుండెల్ని పిండిచేసిన దృశ్యాలు తెలంగాణలోని ఎన్నెన్నో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. పేర్లెందుకు, కాలపట్టికలెందుకు గానీ నల్లగొండ జిల్లాలో కొన్ని ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల పిల్లలకు పెళ్లి సంబంధాలు పెట్టుకోవాలంటే కూడా జంకిన స్థితి ఆనాటి కాలదుస్థితి. చెలిమల నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్న తరాన్ని నా తెలంగాణ చూసింది. నా తెలంగాణ నీళ్లందని దప్పిక తీరని కోట్లమంది కన్నీళ్లవానగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఏ దినపత్రిక చూసిన ఎక్కడో ఒకచోట కోసులకొద్ది నీళ్లకోసం నడిచిన తల్లుల పాదముద్రలే కనిపిస్తాయి. నల్లగొండ జిల్లాలో ఉద్యమకాలంలో కేసీఆర్ పల్లెయాత్రలు చేసుకుంటూ వూరూరా తిరుగుతున్నప్పుడు నీళ్లకోసం మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్, ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకుని కవితలల్లి పాటలురాసి పాడారు. అవును, నీళ్లందని వూళ్లు, మంచినీళ్లకోసం అరిచిఅరిచి ఉద్యమించి ఈ నేలపై నీళ్లధారల్ని ప్రవహింపజేసి ఇక్కడ గంగమ్మను పారించే భగీరథుని కోసం తెలంగాణ ఎదురుచూసింది నిజం. ఈ నేలపై నీళ్లను పారించే ఉద్యమ ఋష్యశృంగుని రాకకోసం నా తెలంగాణ కలవరించింది సత్యం. దీన్ని ఏ చరిత్రా కాదనలేనిది. కేసీఆర్ అటు ఉద్యమంలో గెలిచాడు. తెలం గాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలు కేసీఆర్‌నే గెలిపిం చారు. ఫ్లోరోసిస్ రక్కసి నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇపుడు తమ ఇంటిలోకి వచ్చిన స్వచ్ఛ జలాలను తమ దోసిళ్లలోకి తీసుకుని చూసుకున్నప్పుడు ఆ గంగమ్మలో కేసీఆర్ ముఖచిత్రం కనిపిస్తుంది. నీడనిచ్చిన చెట్టును, నీళ్లనిచ్చిన మనిషిని ఈ నేల మరువదు. ఇది ఒక కవి వర్ణనకాదు. ఇది ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల ప్రజల వర్ణించలేని పరమానంద పరవశమే. ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల్లో మంచి నీటి ఆశల జల పుట్టింది. ‘‘తెలంగాణ రాకముందు 967 గ్రామాల్లో ఫ్లోరోసిస్ విస్తరించి ఉంది. మిషన్ భగీర«థతో ఆ గ్రామాల్లో ఫ్లోరోసిస్ లేకుండా పోయిందని పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథ టీమ్‌కు అభినందనలు’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సందేశం చదివాక అమితానందం అనిపిం చింది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం. నల్లగొండ జిల్లాలో గత ఆరేండ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాకపోవటం తెలంగాణ ప్రభుత్వం కృషికి నిదర్శనం. కార్యసాధకుడైన కేసీఆర్ 2015 మార్చి 17న శాసనసభలో మాట్లాడుతూ ‘‘వాటర్ గ్రిడ్‌ను నాలుగు సంవత్సరాలలో పూర్తిచేస్తాము. ప్రతి గుడిసెకు, ఇంటికి ట్యాప్ ఇస్తాము. నాలుగున్నర సంవత్సరాల గడువు తరువాత తెలంగాణలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బజారులో కనిపించకూడదని మా ధ్యేయం. నాలుగున్నర సంవత్సరాల నాటికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వకుంటే, రాబోయే ఎన్నికలలో మా పార్టీ ఓట్లు అడగదు’’ అని ధైర్యంగా ప్రకటించడం జరిగింది అన్నట్లుగానే మిషన్ భగీరథను పూర్తిచేశారు. ఫ్లోరోసిస్ భూతం ఈ నేలను వదిలివెళ్లటంతో పాలబుగ్గల పసినవ్వుల పళ్లవరుసలు పారే తెల్లటి జలపాతంలాగా మెరిసిపోతున్నాయి. మనిషి శరీరానికి పట్టిన ఫ్లోరోసిస్ తొలగించగలిగారు. ఇంటిం టికీ వచ్చిన మంచినీళ్లు ఇపుడు వొంకర్లు కొంకర్లు తిరిగిన గ్రామాలకు ఆయురారోగ్యాలనిస్తున్నాయి. ఇది ఆరోగ్యవంతమైన సమాజానికి మంచి పునాది. ఈ నేలమీద ఎగిసిన ఫ్లోరోసిస్ వ్యతిరేక ఉద్యమాలన్నింటికి ఇంటింటికీ వచ్చిన నల్లా నీళ్లతో విముక్తి లభించినట్లయ్యింది. ఇపుడు మా నల్లగొండ దేశ పీఠం మీద ఆరోగ్యకొండగా నిలుస్తుంది. తెలం గాణ పునర్నిర్మాణంలో ఇది ఒక భగీర«థమైన అడుగు. ఇదొక మంచిముందడుగు. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
ఖమ్మంలో తాగునీటి పథకాన్ని మూసేశారు!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల తాగునీటి పథకాలు మూసివేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిధుల కొరత పేరుతో రూ.3 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. స్కామ్ ల కోసమే స్కీమ్ లు రూపొందిస్తున్నారని విమర్శించారు. ‘కేంద్ర మంత్రులు రావడం.. పొగడటం.. బీజేపీ లక్ష్మణ్ స్కామ్ అని తిట్టడం... మీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటని’ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయడం లేదని..పాలన దారి తప్పిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందన్నారు. కాళేశ్వరం, సీతారాముల ప్రాజెక్టులు పనులపై కూడా సీబీఐ విచారణ జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. -
‘ఓర్వలేకే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు’
సాక్షి, సిద్ధిపేట: ఆర్థికమాంద్యం, బడ్జెట్ లోటు ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా బెదరకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ ప్టటణంలో ఆడపడుచులకు హరీశ్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, జేసీ పద్మాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని 3,65,225 మంది ఆడపడుచులకు బతుకమ్మచీరల పంపిచేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి చీరలు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. గ్రామాలలో మంచినీళ్లకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథతో ఆడపడుచుల కనీళ్లు తుడిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికి కేసీఆర్ కిట్, కళ్యాల లక్ష్మి, ఆసరా పెన్షన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చేసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని.. అందుకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని హరీష్ రావు మండి పడ్డారు. -
రాష్ట్రానికి 3 జాతీయ జల మిషన్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరో జాతీయ పురస్కారం దక్కింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచినందుకు మిషన్ భగీరథకు జాతీయ జల మిషన్ అవార్డు ప్రకటించింది. దీంతోపాటే సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు (టీఎస్‌డబ్ల్యూఐఆర్‌ఎస్), భూగర్భజలాలు ప్రమాదకర స్థితికి చేరిన ప్రాంతాల పునరుజ్జీవానికి ప్రత్యేక దృష్టి పెట్టినందుకు రాష్ట్ర భూగర్భజల విభాగానికి అవార్డులు దక్కాయి. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. -
బంగారు తెలంగాణను నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళిసై.. బంగారు తెలంగాణకు సై అన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రయత్నాల్లో భాగస్వామినవుతానని అన్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చా రు. ఈ మేరకు ఆదివారం ఓ లేఖ విడుదల చేశా రు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమై న పునాదులు వేసుకున్న తెలంగాణ రాష్ట్రం దేశం ముంగిట ఒక మోడల్ రాష్ట్రంగా సగర్వంగా నిలబడిందన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న వివిధ కార్యక్రమాలు, అర్థిక పురోభివృద్ధి, ప్రాజెక్టులు తదితర అంశాలను తన సందేశంలో ప్రస్తావించారు. గవర్నర్ సందేశం ఆమె మాటల్లో.. ‘తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.. ప్రియమైన యువ తెలంగాణ ప్రజలారా..! గణేశ్ ఉత్సవాల తోపాటు త్వరలో జరిగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సమర్థ నాయకు డు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో నేను భాగస్వామిగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కో సం స్థిరమైన, ఆరోగ్యకరమైన, బలమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగు తున్న తీరు నన్ను ఆకట్టుకుంటోంది. అన్ని మతాల కు చెందిన అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతని స్తూ.. అందరి మనోభావాలను గౌరవిస్తోంది. గం గాజమునా తెహజీబ్‌ను చిత్తశుద్ధితో పరిరక్షిస్తోంది. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు, వ్యవసాయానికి గోదావరి జలాల తరలింపు సాధ్యమవుతుంది. సముద్రంలో వృథాగా కలిసే 575 టీఎంసీ ల నీటిని అదనంగా పొలాలకు మళ్లించడంతోపాటు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషం కలిగిస్తున్నది. పారిశ్రామిక, మౌలిక సౌకర్యాలు, పాలన రంగాల్లో ఐటీ, సాంకేతికతను వినియోగిస్తున్న తీరు బాగుంది. చేనేత, గీత కార్మికుల వంటి వృత్తి పనివారల సంక్షేమాన్ని గుర్తుంచుకోవడం హర్షణీయం. గతంలో రూ.52 వేల కోట్ల మేర ఉన్న ఐటీ ఎగుమతులను రూ.1.10 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోంది. ఇక్కడి శాంతిభద్రతలు దేశంలోని ఇతర నగరాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. బంగారు తెలంగాణ కోసం బలమైన పునాదులు పవిత్రమైన యజ్ఞ యాగాదులను నిర్వహించడంతోపాటు రాష్ట్ర పునర్మిర్మాణం, పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ ఈ రోజు దేశం ముంగిట ఒక నమూనా రాష్ట్రంగా సగర్వంగా తలెత్తి నిలబడింది. అన్ని రకాలైన రాజకీయ, సామాజిక విభేదాలను పక్కన పెట్టి.. దృఢమైన దేశాన్ని నిర్మించడంలో భాగంగా దృఢమైన రాష్ట్రంగా నా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.. జైహింద్.. జై తెలంగాణ’అంటూ గవర్నర్ తన సందేశాన్ని ముగించారు. సంస్కరణలో ప్రభుత్వ చొరవ భేష్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 14.84 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని సాధించడం ద్వారా రాష్ట్ర సంపదలో ఎంతో వృద్ధి కనిపించింది. 2014లో రూ.4 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సం పద ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకున్న ట్లు తెలిసింది. సుపరిపాలనలో భాగంగా అధికా ర వికేంద్రీకరణ కోసం అనేక పాలనాసంస్కర ణలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వపాలన, సంక్షేమ ఫలాలను గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజల ముంగిటకు చేరేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ విధమైన సంస్కరణలు దోహదం చే స్తాయి. గ్రామాల అభివృద్ధిలో 30 రోజుల ప్రణాళిక అమలే గీటురాయిగా నిలువబోతున్నది. పారిశుధ్యం, హరితహారం, విద్యుత్ ఉత్పత్తి, రైతుబం ధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీర థ వంటి విశిష్ట కార్యక్రమాలు అమలవుతున్నా యి. ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల ఆకాంక్షలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభు త్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి కార్యక్రమాల అమల్లో దేశం లోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. -
మిషన్ భగీరథలో సగం ఖర్చు కేంద్రం భరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మిషన్ భగీరథ’కు అయ్యే ఖర్చు లో 50 శాతం భరించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ఢిల్లీలో ‘జల్ జీవన్ మిషన్’పథకంపై అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. తెలంగాణ తరపున రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జల్‌జీవన్ మిషన్‌పై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. భగీరథలో 50 శాతం నిధులను కేంద్రం భరించాలని మరోసారి కోరాం’అని వివరించారు. అనంతరం షెకావత్‌కు ఎర్రబెల్లి, టీఆర్ఎస్ ఎంపీలు నామా, బండ ప్రకాష్ వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ ఆసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, దానిపై కసరత్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
డిసపాయింట్ చేస్తున్నందుకు సారీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిన్నటి కేంద్ర బడ్జెట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది తెలంగాణ ‘రైతుబంధు’ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్ యోజన’ ను తెచ్చింది.. ఇప్పుడేమో ‘మిషన్ భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకొని.. ‘హర్ ఘర్ జల్ యోజన’ను తీసుకొస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మిషన్ భగీరథను బీజేపీ కాపీ చేసిందని కేటీఆర్ అంటున్నారని, కానీ, కేటీఆర్ గుజరాత్ సందర్శించి.. అక్కడి వాటర్ గ్రిడ్ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. మిషన్ భగీరథను తీసుకొచ్చారని, కేసీఆర్ వీడియోలు యూట్యూబ్ డిలీట్ చేసినట్టు.. కేటీఆర్ గుజరాత్ పర్యటన ఫొటోలను గూగుల్ డిలీట్ చేసి ఉంటుందని ఆయన భావిస్తున్నారని, ఇది ఆయన అహంకారానికి చిహ్నమని సాగర్ అనే నెటిజన్ విమర్శలు చేశారు. ఈ విమర్శలను పట్టుకొని, బీజేపీ సూరత్ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ ట్విటర్ కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘వాటర్ గ్రిడ్ సిస్టమ్‌ను అధ్యయనం చేసేందుకు మీరు గుజరాత్ సందర్శించిన విషయం వాస్తవం కాదా? వాటర్ గ్రిడ్‌ను, సబర్మతి నదిలోకి నీళ్లు ఎత్తిపోసే నర్మదా కాలువను మీరు ప్రశంసించలేదు? దాని ఆధారంగానే మీరు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టలేదా? నిజాలను అంగీకరించండి’ అని పేర్కొన్నారు. పీవీఎస్ శర్మ ట్వీట్‌కు కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. ‘డియర్ శర్మ గారూ.. మిమ్మల్ని డిసపాయింట్ చేస్తున్నందుకు సారీ.. 1998లో (గుజరాత్‌కు 12 ఏళ్ల ముందు) సీఎం కేసీఆర్ సిద్దిపేటలో చేపట్టిన సమగ్ర తాగునీటి ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకొని మిషన్ భగీరథను రూపొందించాం. గుజరాత్ మోడల్‌ను అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని ప్రధాని లేఖలో కోరితేనే.. ఆ రాష్ట్రాన్ని నేను సందర్శించాను’ అని బదులిచ్చారు. Dear Sarma Ji, Sorry to disappoint you but Mission Bhagiratha was inspired by a comprehensive drinking water project executed by our CM sir in Siddipet constituency in 1998 (12 years before Gujarat) Had visited Gujarat also as Hon'ble PM wrote to all states to study the model https://t.co/2owQZ4UH4w — KTR (@KTRTRS) July 6, 2019 -
‘ఈ ప్రాజెక్టులో కేంద్రం సగం ఖర్చును భరించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : మిషన్ భగీరథ ద్వారా వేసవికాలంలో కూడా తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ.. మంగళవారం ‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా- స్వచ్ఛ భారత్’ సదస్సును నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రం తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల అధికారులు ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రికి చెప్పామని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంత పెద్ద ప్రాజెక్టుకు భారీగా ఖర్చుపెట్టిన కారణంగా అప్పు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఖర్చులో సగం ఖర్చును కేంద్రం భరించాలి లేదా పథకం నిర్వహణ ఖర్చునైనా భరించాలని కేంద్రానికి విన్నవించామని పేర్కొన్నారు. -
మిషన్ భగీరథకే శ్రీశైలం నిల్వలు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి మూడు టీఎంసీలు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ఇండెంట్‌పై తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణాబోర్డుకు శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణ వాటా పోనూ మిగిలిన 4.60 టీఎంసీల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు కావాలని ఆ రాష్ట్ర ఈఎన్సీ వెంకటేశ్వరరావు బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. మిషన్ భగీరథకు నీరందదు.. ఈ ఏడాది మార్చిలో బోర్డు నీటి విడుదల ఉత్తర్వులిస్తూ తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలు కేటాయించిందని మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఇందులో ఏపీ తన వాటాకు మించి నీటిని వాడుకోగా... తెలంగాణ ఇంకా 10.713 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని తెలిపారు. అయితే శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 805 అడుగుల నీటిమట్టం ఉందని, 1.582 టీఎంసీలు మాత్రమే ఉన్నందున ఈ నిల్వల్ని తెలంగాణ తాగునీటి అవసరాలకు నెలకు 0.50 టీఎంసీలు వాడుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి చుక్క నీటిని కూడా సాగర్‌కు విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పైగా శ్రీశైలంలో రోజుకు వంద క్యూసెక్కుల చొప్పున ఆవిరవుతోందని అంచనా వేశారు. సాగర్‌లోనూ అదే విషమ పరిస్థితి నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 510 అడుగుల నీటి మట్టం ఉండగా.. 505 అడుగుల ఎగువన 10.383 టీఎంసీల నిల్వలు ఉన్నాయన్నారు. అయితే, రోజుకు సాగర్ జలాశయంలో 700 క్యూసెక్కుల చొప్పున నీరు ఆవిరి అవుతోందని, మే నెలలోనే ఈ నష్టం 1.50 టీఎంసీలుగా ఉంటుందన్నారు. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి నీళ్లివ్వడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. -
నీళ్ల యంత్రం.. పొదుపు మంత్రం
కమలాపూర్ (హుజూరాబాద్): వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మిట్టపెల్లి సందీప్ స్నేహితులతో కలసి వాటర్ మీటర్‌ను రూపొందించాడు. సందీప్ అనంతసాగర్‌లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం పూర్తి చేశాడు. నీటి వృథాను అరికట్టడానికి స్నేహితులు శశిప్రీతమ్, శ్రీవిద్య, సాయితేజతో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్ మీటర్‌ను రూపొందించి ఒక యాప్‌కు అనుసంధానం చేశారు. ఒక రోజు ఎన్ని నీళ్లు కావాలనేది ఈ యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే అన్ని నీళ్లు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థుల బృందం గతేడాది సెప్టెంబర్‌లో నిట్ వరంగల్‌లో జరిగిన సెమీ ఫైనల్స్‌లో వాటర్ మీటర్‌ను ప్రదర్శించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. అక్టోబర్‌లో హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన ఫైనల్స్‌లోనూ నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే ఈ ఏడాది మార్చి హైదరాబాద్‌లో జరిగిన టైగ్రాడ్ గ్లోబల్ ఈవెంట్లో సైతం పాల్గొని ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో టీఎస్‌ఐసీతో విద్యార్థుల బృందానికి సంబంధాలు పెరగడంతో పాటు ఎలవేటర్ పిచ్ వీడియోను ట్విట్టర్లో పెట్టారు. వీటన్నింటిని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్రలో అప్లోడ్ చేసి వరంగల్ అర్బన్ కలెక్టర్‌తోపాటు కేటీఆర్, జేఎస్ రంజన్, జీహెచ్ఎంసీ అధికారులకు ట్యాగ్ చేశారు. స్టార్టప్ ఇండియా యాత్రను పూర్తిగా సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ వాటర్ మీటర్‌ను చూసి స్పందించి సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో రెండు, మూడు రోజుల పాటు డెమోకు రావాలని సందీప్ బృందాన్ని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆహ్వానించారు. కాగా ఈ వాటర్ మీటర్‌ను మిషన్ భగీరథకు పథకానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
అస్తవ్యస్తంగా పైప్‌లైన్..!
సాక్షి,నల్లగొండ : ఇంటింటికీ తాగునీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధి కారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో అ బాసుపాలవుతోంది. ఒకవైపు వేసవికాలం ప్రా రంభమై శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్న మిషన్ భగీరథ పైపులైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్న హామీ ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. అసంపూర్తి పైపులైన్లతో ఇబ్బందులు.. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు గ్రామాల్లో పైపులైన్ నిర్మాణాలు జరుగకపోవడంతో కృష్ణా జలాలలకు సంబంధించిన జీఎల్ఎస్ఆర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న పైపులైన్లతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మండలకేంద్రం నుంచి మండలంలోని శాలిలింగోటం, రామగిరి, అంబారిపేట, గురుజాల, తుడిమిడి, చిత్తలూరు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించేందుకు వేసిన మెయిన్ పైపులైన్‌ను మండలకేంద్రంలోని బస్టాప్ వద్ద సుమారు 200 మీటర్ల మేర భూమిలో నుంచి వేయకుండా వదిలివేసి రోడ్డుపైనుంచే వేశారు. సుమారు సంవత్సర కాలంగా తాగునీటి మెయిన్ పైపులైన్ రోడ్డుమీదనుంచే ఉండటంతో పైపులైన్ పూర్తిగా ధ్వంసమైంది. పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెయిన్ పైపులైన్లలో ఏర్పడిన రంద్రాలు, లీకేజీలను సరిచేసి తాగునీటిని అందించాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. -
గడువులోగా ‘భగీరథ’ గగనమే
‘రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం పనులను మార్చి 31 వరకు పూర్తి చేసి, ఏఫ్రిల్1 నుంచి ఇంటింటికీ తాగునీరు అందించాలి. 1 తర్వాత ఏ ఇంటి నుంచి కూడా మహిళ తాగునీటి కోసం గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాధికారులు శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందిచాలి.’ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక మిషన్ భగీరథ పథకం అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవీ. సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మిషన్ భగీరథ పథకం పనులు సీఎం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే మరో మూడు, నాలుగు నెలలు గడిస్తే కానీ భగీరథ పనులు పూర్తయ్యేలా లేవు. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ వేసవిలో కూడా పుర ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అడ ప్రాజె క్టు నుంచి అంతర్గత పైపులైన్ ద్వారా బెల్లంపల్లి పుర ప్రజలకు తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి పైపులైన్ పనులు ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు పూర్తి అ య్యాయి. కాని మున్సిపాలిటీ పరిధిలో యూఎల్ఎస్ఆర్, జీఎల్బీఆర్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటి పనులు మందకొడిగా సాగుతుండడంతో ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కారణంగా ఇన్నాళ్ల నుంచి భగీరథ పథకం పనులకు గ్రహణం పట్టగా ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులను ప్రారంభించారు. అసంపూర్తిగా పైపులైన్ పనులు.. మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మంచిర్యాల – బెల్లంపల్లి గోదావ రి నీటి పథకం పైపులైన్లు మాత్రమే వార్డులలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలు వార్డులలో మిషన్ భగీరథ పైపులను అనుసంధానం చేయాల్సి ఉండగా, మరికొన్ని వార్డులలో కొత్తగా పైపులను విస్తరించాలి. ప్రజారోగ్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 8 నుంచి 10 కిలో మీటర్ల దూరం వరకు పైపులైన్ వేయాల్సి ఉంది. ఆయా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో పుర ప్రజలకు తాగునీ టిని సరఫరా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పందించని అధికారులు.. మిషన్ భగీరథ పథకం పనుల నిర్వహణపై ప్రజారోగ్యశాఖ అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావట్లేదు. ఇటీవలే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వేసవిలో పుర ప్రజలకు తాగునీటి కష్టాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం చెప్పినట్లుగా మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేయడానికి ఇంకా కేవలం నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. -
జూన్ తర్వాత కార్యాచరణ
సాక్షి. హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జూన్ తర్వాత హామీలపై కార్యాచరణ ఉంటుందని ఆయన సోమవారం వెల్లడించారు. వరసగా వివిధ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. వివిధ చర్యలు చేపట్టే విషయంలో, అధికారిక ప్రకటనలు చేసే విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామన్నారు. పీఆర్సీ, టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు జూన్ తర్వాత పరిష్కారం ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు సంబంధించి ఒక కటాఫ్ డేట్ నిర్ణయించాక అమలుచేస్తామని స్పష్టం చేశారు. మొత్తం దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేనన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో 42, 43% జీతాలు పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చురుకైన పాత్ర పోషించారని.. సమ్మెలో పాల్గొన్న రోజులను ఆన్‌డ్యూటీగా పరిగణించడంతో పాటు తెలంగాణ ఇన్సెంటివ్ అని ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. (కేసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నా..) ఆచితూచి అప్పులు! ఎఫ్ఆర్బీఎం కింద 28% వరకు రుణాలు తీసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి, వెసులుబాటు ఉన్నా.. తాము 21.25% రుణాలు మాత్రమే తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలు కూడా 26.27% వరకు అప్పులు తీసుకున్నాయని.. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 29% అప్పులు తీసుకుందన్నారు. ఎఫ్ఆర్బీఎం కింద కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి రుణాలు తీసుకుంటే ఏదో తప్పు జరిగినట్టు, నిబంధనలు అతిక్రమించినట్టు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడం సరికాదని కేసీఆర్ మండిపడ్డారు. ‘అప్పులు ఎట్లా తెస్తే మీకెందుకు? కార్పొరేషన్ల ద్వారా ఎందుకు ప్రభుత్వమే రుణాలు తీసుకోవచ్చుకదా అని విపక్షసభ్యులు అడుగుతున్నారు. అది ప్రభుత్వ వ్యూహం. దీనికి తోడు ప్రభుత్వం కూడా 30, 35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్న విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు మరిచిపోతున్నారు. మేం ఎలాంటి కుట్రా చేయడం లేదు. భవిష్యత్ తరాలను బంగారం చేసేందుకే రుణాలు తీసుకుంటున్నాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికున్న రూ.1.25 లక్షల కోట్ల అప్పులు ఒక ఏడాది పండే పంట విలువకు సమానమని సీఎం చెప్పారు. సంప్రదాయ ఆలోచనస్థితి బద్ధలు కావాలని.. ఆ దిశలోనే మిషన్ భగీరథ, తదితర పథకాలతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. (మనసా, వాచా, కర్మేణా.. బంగారు తెలంగాణకు పునరంకితం) కందిళ్లు కనబడుతున్నాయా? కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు.. విపక్షాలు దీపం కందిళ్లు, ఎండిన వరి, మొక్కజొన్న కంకులు పట్టుకుని అసెంబ్లీలో ధర్నాలు చేయడం ఆనవాయితీగా ఉండేదని సీఎం అన్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు కనిపించలేదన్నారు. ఇప్పుడు పచ్చజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలంటూ పనిగట్టుకుని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఈ పంటల ధరలు అంత హీనంగా ఏమీ లేదన్నారు. మరో ఏడాది వరకు మాత్రమే గిట్టుబాటుధరలు అంటూ ధర్నాలు చేసేందుకు అవకాశముందని. ఆ తర్వాత అది కూడా ఉండదన్నారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటివి ప్రధాన పంటలుగా ఉన్నాయన్నారు. పంట కాలనీలు నిర్ణయించి, రైతు సమన్వయ సమితుల ద్వారా చైతన్యం కలిగించి డిమాండ్ ఉన్న పంటలే పండించేలా చర్యలు చేపట్టే ఆలోచన ఉందన్నారు. గిట్టుబాటుధరల కోసం రైతులు ఆందోళన చెందే పరిస్థితి రాకుండా చూస్తామని సీఎం అన్నారు. (చంద్రబాబు కూడా మోసం చేశారు: ఎర్రబెల్లి) తాత కడితే మనవడు తాగాలా? జాతీయస్థాయిలో అందుబాటులోని నీటివనరుల నిర్వహణలో కాంగ్రెస్. బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఎం విమర్శించారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులోఉన్నా వాటిని సరిగ్గా వినియోగించుకోకపోతే అర్థం లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా జలజగడాలు ఎదురైతే 2 దశాబ్దాలు గడిచినా ట్రిబ్యునళ్లు తీర్పునివ్వకపోవడం, సీడబ్ల్యూసీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఎప్పుడో తాత ప్రాజెక్టు కడితే మనవడు ఆ నీటిని తాగే పరిస్థితి ఎదురైతే ఎలాగని ›ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి మొత్తం 1.350 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ట్రెంచింగ్పై అటవీ భూముల విషయంలో అటవీ అధికారులు ట్రెంచింగ్ల తవ్వకం నిలిపివేయాలని కాంగ్రెస్ నుంచి మంచి సూచన వచ్చిందని సీఎం అన్నారు. ప్రస్తుతానికి పోడుభూముల సమస్యపై స్పష్టత వచ్చే వరకు కందకాలు తవ్వడం నిలిపేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పోడు భూములే కాకుండా గిరిజన పట్టా భూముల చుట్టూ కూడా అటవీ అధికారులు కందకాలు తవ్వడంతో సమస్యలు వస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి ప్రస్తావించగా సీఎం పైవిధంగా స్పందించారు. కాగితాలపైనే ఇళ్లు స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఒక గ్రామంలో 710 ఇళ్లు, వరికోలు అనే మరోగ్రామంలో 600 ఇళ్లు కట్టినట్టు కాగితాలపై ఉందని.. వాస్తవంగా వెళ్లి చూస్తే ఒక్క ఇంటిని కూడా కట్టలేదన్నారు. బలహీనవర్గాల గృహనిర్మాణాన్ని పకడ్బందీగా అమలుచేస్తామన్నారు. గతంలో ఎవరెవరికి ఇచ్చారు. ఇప్పటికే ఎవరికి ఇళ్లున్నాయి. తదితర చర్యలు చేపడతామన్నారు. గ్రామ స్వరాజ్య సాధన దిశలో సర్పంచ్‌లపై తీవ్రమైన శిక్షలున్నాయని, అదే విధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా తమ విధులు, బాధ్యతలను కచ్చితంగా నిర్వహించేలా కొత్త చట్టంలోమార్పులు తెచ్చామన్నారు. కఠిన నిబంధనలు లేకపోతే ఫలితాలు రావన్నారు. పల్లెల్లో భగీరథ భారం ఉండదు మంచినీటి ఎద్దడి సమస్య ఏర్పడడం ఇకపై గత చరిత్రగా మారిపోతుందన్నారు. ప్రతీ హాబిటేషన్‌కు శుద్ధిచేసిన తాగునీటిని సరఫరాచేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా బాటిల్ నీటికి బదులు.. శుద్ధిచేసిన నీటిని వినియోగించాలనే అవగాహన పెరుగుతోందన్నారు. వచ్చే ఏప్రిల్ చివరకల్లా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ.. తాగునీటిని సరఫరా చేసిన ఘనతను తమ ప్రభుత్వం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కలిపి మొత్తం 16వేల ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు (ఓహెచ్‌ఆర్) కడితే.. తమ ప్రభుత్వం మరో 22 వేల ఓహెచ్‌ఆర్‌లు పూర్తిచేసిందని సీఎం వెల్లడించారు. మిషన్ భగీరథ భారాన్ని గ్రామపంచాయతీలు. గ్రామాలపై వేయదలుచుకోలేదన్నారు. గ్రామాల్లోని ప్రతీ ఇంటిలో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున.. పట్టణాల్లో ఒక్కొక్కరికి రోజుకు 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తామన్నారు. గతంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌కు మిషన్ భగీరథకు పొంతన లేదన్నారు. భవిష్యత్‌లో 24 గంటల పాటు నీటి సరఫరాకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయిస్తున్నామన్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ రెండూ ఒకే శాఖలో ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా వివిధకార్యక్రమాలను సమగ్రంగా చేపట్టే చర్యలు చేపట్టనున్నట్టు సీఎం తెలియజేశారు. నిరక్షరాస్యత విషయంలో రాష్ట్రంపై ఒక నల్లని మచ్చ ఉందని. విద్యారంగంలోని అంశాలను సమగ్రంగా పరిశీలించి. ఈ సమస్యను అధిగమించే చర్యలు తీసుకుంటామన్నారు. -
పగిలిన మిషన్ భగీరధ పైప్‌లైన్
-
భగీరథా’.. ఏమిటీ వృథా
తాడూరు: గంగమ్మ నింగికెగిసింది.. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ సమీపంలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్–కల్వకుర్తి ప్రధాన రహదారి వెంబడి మేడిపూర్ సమీపంలోని ఆదివారం సాయంత్రం భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో నీరు పైకి ఎగజిమ్మింది. నీటి ఉధృతికి దాదాపు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆకాశానికి ఎగిసిపడుతున్న నీటిని చూసి కొంతమంది వాహనదారులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మేడిపూర్ వాసులు మిషన్ భగీరథ పర్యవేక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని ఎంగంపల్లి చౌరస్తాలోని గేట్‌వాల్వ్ వద్ద నీటిని నిలిపివేశారు. అయినా రెండు గంటల పాటు నీటి ప్రవాహం అలాగే కొనసాగింది. -
పొలాలను ముంచిన మిషన్ భగీరథ
సాక్షి,చిగురుమామిడి: మండలంలోని కొండాపూర్ గ్రామ ఊరచెరువు దగ్గర మిషన్‌భగీరథ మెయిన్ పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పైపుల నుంచి నీరు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో కోతకు వచ్చిన పంట నీటితో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో కోసే వరి నీటమునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్ర స్వామి, బింగి మల్లయ్య, బుర్ర శ్రీనివాస్‌లకు చెందిన పంటలు నీటమునిగాయని ఆందోళన చెందుతున్నారు. నీరు ఇంకిపోయే వరకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పగిలిన పైపులైన్‌ను మరమ్మతు చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
మహిళలకు నీటి కష్టాలు దూరం
కొడంగల్ (రంగారెడ్డి): మహిళల కన్నీటి కష్టాలను దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ శివారులోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో మిషన్ భగీరథ ట్రయల్ రన్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు. 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జలాలను కొడంగల్‌కు రప్పించి ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.2 వేల కోట్లు, కొడంగల్‌కు రూ.267 కోట్లు ఖర్చుచేసి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రత్యేకంగా ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలుచేయని విధంగా కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మహిళలు తాగునీటి కోసం పొలాల దగ్గరకు వెళ్లకుండా తమ ఇంట్లోనే ధీమాగా కుళాయి వద్ద నీళ్లను పట్టుకోవచ్చని చెప్పారు. ఈనెల 13న కొడంగల్ మురహరి ఫంక్షన్ హాల్లో రైతులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత రెండో విడత రైతు బంధు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పంద్రాగస్టు నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేస్తారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 229 టీమ్‌లు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మాజీ జెడ్పీటీసీలు ఏన్గుల భాస్కర్, కృష్ణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, మండల రైతు సమాఖ్య అధ్యక్షుడు వన్నె బస్వరాజ్, మధుయాదవ్, మోహన్‌రెడ్డి, ప్రహ్లాద్‌రావు, మహిపాల్ ఉన్నారు. -
పంద్రాగస్టుకు ఊళ్లకు.. దీపావళికి ఇళ్లకు..
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా దీపావళి(నవంబర్ 6) నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు భగీరథ నీటిని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంద్రాగస్టు నుంచే ఇంటింటికీ ‘భగీరథ’ద్వారా నీటి సరఫరా చేస్తామని గతంలో ప్రకటించినా.. పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని దీపావళికి మార్చారు. భగీరథ పనులపై మంగళవారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చాలావరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన కొద్ది పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఇప్పటి వరకు నిర్మించిన ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్ఎస్ఆర్, ఓహెచ్‌బీఆర్, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు అన్నింటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పనుల్లో అనుకున్నంత వేగం లేని ప్రాంతాల్లో భగీరథ వైస్ చైర్మన్, సెక్రటరీ, ఈఎన్సీ స్వయంగా పర్యటించాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతి, ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం నేరుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్క్ ఏజెన్సీలతో మాట్లాడారు. పది జిల్లాల్లో పనులు వందకు వంద శాతం పూర్తవుతున్న నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జె.సంతోశ్ కుమార్ అధికారులు శాంత కుమారి, స్మితా సభర్వాల్, కృపాకర్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మిషన్ భగీరథ సలహాదారులు జ్ఞానేశ్వర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ యత్నమే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంటింటికీ శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరథ. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ నల్లా నీరు ఇస్తేనే ఓట్లడుగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15న అన్ని ప్రాంతాలకూ బల్క్‌వాటర్ ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు నిధుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేల కోట్లు వెచ్చిస్తున్నా.. పనుల నిర్వహణలో జాప్యం, లోపాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతర్గత పైపులైన్ల నిర్మాణం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి అందరికీ రక్షిత మంచినీరు అందించడం గగనమేనన్న చర్చ సాగుతోంది. నీటి కేటాయింపులు ఇలా.. కృష్ణా బేసిన్లో 15, గోదావరి బేసిన్లో 21 రిజర్వాయర్ల నుంచి భగీరథ కోసం పలు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కనీస నీటి సేకరణ స్థాయిని కూడా ఖరారు చేశారు. 2018లో కృష్ణా బేసిన్‌లోని 15 రిజర్వాయర్ల నుంచి 23.44 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 21 రిజర్వాయర్ల నుంచి 32.58 టీఎంసీలు కేటాయించారు. 2048 నాటికి రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి 86.11 టీఎంసీల నీటి కేటాయింపులు ఖరారు చేశారు. ప్రాజెక్టు ప్రగతి ఇలా.. గజ్వేల్ సబ్‌సెగ్మెంట్ పనులను ప్రధాని నరేంద్రమోదీ 2016 ఆగస్టు 7న ప్రారంభించారు. ప్రస్తుతం 7,229 గ్రామీణ ఆవాసాలు, 12 పట్టణ ప్రాంతాలకు బల్క్ వాటర్ అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లందించిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ రికార్డు సష్టించింది. సూర్యాపేట సబ్‌సెగ్మెంట్‌లో 1,621 ఆవాసాలకు తాగునీటి సరఫరా మొదలైంది. ఆరు మండలాల పరిధిలోని 243 హ్యాబిటేషన్లు, 5 ఎస్సీ ఆవాసాలు, 10 ఎస్టీ ఆవాసాలు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలోని 78 వేల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతగా 1,595 ఆవాసాలకుగానూ 280లకు బల్క్‌వాటర్, 120లకు నల్లా నీరు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 3,411 ఆవాసాలకుగానూ 1,900లకు బల్క్‌వాటర్ సరఫరా చేసి 875లకు నల్లా నీరు అందిస్తున్నారు. ట్రయల్ రన్లో అపశ్రుతులు పైపులైన్ల నిర్మాణం పూర్తయి ట్రయల్ రన్ చేస్తున్న చోట్లా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పైపులైన్ల నిర్మాణంలో నిబంధనలు, నాణ్యతలను పాటించకపోవడంతో ‘ట్రయల్‌రన్’దశలోనే ఎక్కడికక్కడ అవి పగిలిపోతున్నాయి. లీకేజీలు, పగుళ్లతో పైపులైన్ల నీరంతా పంటపొలాలు, ఇండ్లలోకి చేరుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారి, నిజాంసాగర్, వర్నిబోధన్ ప్రాంతాల్లో ట్రయల్ రన్లో భాగంగా పైపులైన్ల జాయింట్ ఉడి నీరు లీక్ అవుతోంది. అంతర్గత పైపులైన్లే అసలు సమస్య.. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో ఇంటింటికీ నల్లా కల్పించేందుకు రూ.338.62 కోట్లు మంజూరు చేశారు. 591 ఓవర్‌హెడ్ ట్యాంకులకు 225 నిర్మించారు. అంతర్గత పైపులైన్ల పొడవు 2,215 కి.మీ.లకు 819 కి.మీ.లే నిర్మించారు. 2,72,795 ఇండ్లకు నల్లాలు బిగించాల్సి ఉండగా 63,215 ఇండ్లకే బిగించారు. నిజామాబాద్ జిల్లాలో రూ.1,350 కోట్లతో 801 గ్రామాలకు ఉద్దేశించిన ఈ పథకంలో 1,884 కి.మీ. అంతర్గత పైపులైన్‌కుగానూ 1,350 కి.మీ. పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 576 ఉపరితల ట్యాంకులకు 202 పూర్తి కాగా, 2,97,218 నల్లా కనెక్షన్లకు 49,753 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కామారెడ్డి జిల్లాకు రూ.1,300 కోట్లు కేటాయించారు. 1,537 కి.మీ. అంతర్గత పైపులైన్‌కుగానూ 1,530 కి.మీ. పూర్తయ్యింది. 615 ఉపరితల ట్యాంకులకు 299 పూర్తి కాగా, 2,42,827 కనెక్షన్లకు 58,833 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.4,433 కోట్లతో 2016లో ఐదు దశల్లో పనులు చేపట్టారు. అధికారులు 70 శాతం పనులు పూర్తయినట్లు చెప్తున్నా.. 6,067 కి.మీ.కుగానూ 5,100 కి.మీ. పూర్తయినట్లు రికార్డులు చెప్తున్నాయి నగరాలు, పట్టణాల్లో మరీ దారుణం.. రాష్ట్రవ్యాప్తంగా 63 కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులు ముందుకు సాగడం లేదు. వరంగల్ కార్పొరేషన్‌తోపాటు కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల పరిధిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నగర, పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 2033 నాటి జనాభాకు తగ్గట్లు రిజర్వాయర్లు, పైపులైన్లు వేసే పనులను 2017 మేలో ప్రారంభించారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 60 శాతం పనులు కూడా దాటలేదు. మిషన్ భగీరథ ముఖ్యాంశాలివీ.. సెగ్మెంట్లు 26 నియోజకవర్గాలు 99 మండలాలు 437 కార్పొరేషన్లు/మున్సిపాల్టీలు/నగరపంచాయతీలు 63 అవాస ప్రాంతాలు 24,224 మొత్తం కవరయ్యే గృహాలు 65,29,770 గ్రామీణ ప్రాంతాల గృహాలు 52,47,225 పట్టణ ప్రాంత గృహాలు 12,82,545 పథకం కింద లబ్ధిదారులు 2.72 కోట్లు పథకం అంచనా వ్యయం రూ.43,791 కోట్లు పైపులైన్లతో ప్రాణభయం భగీరథ నీళ్లిచ్చుడేందో.. పైపులైన్లతో ప్రాణభయం పట్టుకుంది. నీళ్ల కోసం వేసిన పైపులైన్లు పగిలి ఇళ్లల్లోకి నీళ్లచ్చి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుస్తలేదు. రాత్రి పూట పైపులైన్ పగిలితే జల సమాధి అయితుంటిమి. – హరిసింగ్, అన్నాసాగర్ తండా, కామారెడ్డి జిల్లా నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదు ఊర్ల నీళ్లు దిక్కు ల్లేవు. ఊరి బయట నీళ్లు ఇంటింటికీ వస్తాయన్న నమ్మకం లేదు. అడుగడుగునా పైపులైన్లు లీకవుతుండటంతో సింగూరు నుంచి శుద్ధజలాలు రావడం కష్టం. – సురేశ్, అన్నాసాగర్ తండా, కామారెడ్డి జిల్లా -
రెండేళ్లలో పుష్కలంగా సాగునీరు
మహబూబ్‌నగర్ రూరల్: పాలమూరు ఎత్తిపోతల పథకం అమలులో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్ ద్వారా రాబోయే రెండేళ్లలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రస్తుతం కర్వెన రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేసి రిజర్వాయర్ నీటితో గ్రామాలలోని చెరువులను నింపుతామన్నారు. బుధవారం మండలంలోని ధర్మాపూర్, కోటకదిర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి సుమారు రూ.1.68 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ధర్మాపూర్ గ్రామంలో అంగన్వాడీ భవనం, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, అదనపు తరగతి గదులు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. కోటకదిర గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు అంగన్వాడీ భవనం, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా నెల రోజుల్లో ఇంటింటికి శుద్ధ జలాలను అందిస్తామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలను ఇంటింటికి నల్లాల ద్వారా అందించేందుకు అవసరమైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పనులన్ని నిర్ణీత సమయంలో కొనసాగడం వల్ల అనుకున్న సమయానికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం సొమ్ము పెంపుతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరనప్పటికినీ తెలంగాణ ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి ఉరకలేస్తుందని అన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, రైతుబంధు పథకం, రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యురాలు వై.శ్రీదేవి, వైస్ ఎంపీపీ మల్లు సరస్వతమ్మ, సర్పంచ్‌లు పసుల వసంత, మల్లు ప్రియాంక, ఎంపీటీసీలు నాగమణి, మల్లు దేవేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ టి.కురుమూర్తి, ఎంపీడీఓ మొగులప్ప, పీఆర్ ఏఈ శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, నాయకులు వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, పసుల వెంకట్రాములు, యాదయ్య, గూడెం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సమస్యలపై చర్చ పాలమూరు: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రోడ్డుపై బుధవారం హైదరాబాద్‌లోని లాల్మంజిల్ ఆర్అండ్బీ ఈఎన్సీ కార్యాలయంలో జాతీయ రహదారుల సీఈ రవిప్రసాద్, ఎస్ఈ విజయ్‌కుమార్‌ను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు కలిశారు. అప్పన్నపల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు పట్టణంలో వెళ్తున్న ప్రధాన రోడ్డు ఒక్కటే ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం లేకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయంపై అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టెండర్లు పూర్తి చేసి ప్రధాన రోడ్డును వెంటనే పూర్తి చేయాలని కోరారు. -
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
పరిగి: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జాపర్‌పల్లిలో నిర్మించిన మెయిన్ గ్రిడ్ ట్రయల్ రన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అంతకుముందు గ్రామంలోని అంబేడ్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాపర్‌పల్లి నుంచి తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ,1,100 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. త్వరలోనే ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందని స్పష్టంచేశారు. మహిళల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా అనేక పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరుగులేదని తెలిపారు. ఆయనతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొప్పుల మహేశ్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. మానవ హక్కుల సంఘం కృషి అభినందనీయం... తాండూరు: హక్కుల పరిరక్షణకు.. మానవ హక్కుల సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో ఆదివారం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఫోరం ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల సంఘం ఏర్పాటుచేసి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. పౌర హక్కులకు భంగం కలిగితే మానవ హక్కుల సంఘాలు కాపాడతాయన్నారు. ప్రజలు సేవాభావాలను అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అంతర్జాతీయ పీస్ అంబాసిడర్ ఎం.ఎ.నజీబ్ మాట్లాడుతూ.. దేశంలో కులమతాలకతీతంగా మెలిగినప్పుడే శాంతి స్థాపన సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీత, అసోషియేషన్ చైర్మన్ ఎం.ఎ.ముజీబ్ పటేల్, హైకోర్టు న్యాయవాది కదర్‌ఉన్నీసా, వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు గులాం ముస్తఫా పటేల్, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ జుబేర్‌లాల, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ ముక్తర్ తదితరులు ఉన్నారు. -
మిషన్ భగీరథలో సాంకేతికత భేష్: ఆసిఫ్
సాక్షి, హైదరాబాద్: నూతన సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా మిషన్ భగీరథ పనులను సమర్థవంతంగా చేస్తున్నారని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ కార్యదర్శి ఆసిఫ్ కె.యూసుఫ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌డబ్ల్యూయస్ కార్యాలయంలో ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డితో గురువారం ఆయన సమావేశమయ్యారు. మిషన్ భగీరథ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా పనుల పర్యవేక్షణను ఆసిఫ్ పరిశీలించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో తాగునీటి çసరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న స్వజల్ స్కీం పథకానికి మిషన్ భగీరథ తరహా పర్యవేక్షణ విధానాన్ని కేంద్రం అనుసరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథలో ఉపయోగిస్తున్న సాంకేతికతను తెలుసుకునేందుకు ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పనుల పురోగతిని ఫొటోల రూపంలో అధి కారులు చూపించారు. డ్యాష్ బోర్డ్ సహాయంతో పనులను ఎలా పర్యవేక్షిస్తున్నది అధికారులను ఆసిఫ్ అడిగి తెలుసుకున్నారు. యాప్‌తో పైప్ లైన్ పనుల పురోగతిని తెలుసుకునే పద్ధతిని వివరించారు.