net losses
-
ఓలాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా బ్రాండ్ మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ నికర నష్టాలు (కన్సాలిడేటెడ్) రూ.772 కోట్లకు తగ్గాయి. అంతక్రితం 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 1,522 కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,680 కోట్ల నుంచి రూ. 2,481 కోట్లకు చేరింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన ఏఎన్ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 3,082 కోట్ల నుంచి రూ. 1,083 కోట్లకు దిగివచి్చంది. ఆదాయం 58 శాతం వృద్ధి చెంది రూ. 1,350 కోట్ల నుంచి రూ. 2,135 కోట్లకు చేరింది. ఓలా మొబిలిటీ వ్యాపార విభాగం రూ. 250 కోట్ల నిర్వహణ లాభం నమోదు చేసింది. మొత్తం మీద గ్రూప్ స్థాయిలో ఏఎన్ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 20,223 కోట్లకు చేరింది. -
సాగర్ సిమెంట్‌కు నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న సాగర్ సిమెంట్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10 కోట్ల నికర నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43 కోట్ల నష్టం నమోదైంది. ఎబిటా రూ.60 కోట్లు, ఎబిటా మార్జిన్ 10 శాతంగా ఉంది. టర్నోవర్ రూ.474 కోట్ల నుంచి రూ.587 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో సాగర్ సిమెంట్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 1.13 శాతం అధికమై రూ.250.55 వద్ద స్థిరపడింది. -
పతంజలికి భారీ షాక్, లాభాలు ఢమాల్!
న్యూఢిల్లీ: పతంజలి ఫుడ్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 64 శాతం క్షీణించి రూ.88 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.241 కోట్లుగా ఉంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఈ విభాగంలో కంపెనీ నికర నష్టాలు ఎదుర్కొన్నది. ఫుడ్ వ్యాపారం మెరుగైన పనితీరుతో ఆదుకుంది. మొత్తం ఆదాయం రూ.7,370 కోట్ల నుంచి రూ.7,810 కోట్లకు పెరిగింది. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) వంట నూనెల విభాగం ఆదాయం రూ.5,891 కోట్లుగా ఉంది. వంట నూనెల ఆదాయం తగ్గినప్పటికీ, అమ్మకాల పరిమాణం 1.4 టన్నుల మేర పెరిగినట్టు, ఇది వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 36 శాతం అధికమని పతంజలి ఫుడ్స్ తెలిపింది. ‘‘వంట నూనెల పరిశ్రమపై ధరలు క్షీణత ప్రభావం బలంగా పడింది. క్రితం త్రైమాసికం నుంచి చూస్తే ధరలు తగ్గిపోవడంతో, అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వ కారణంగా, రవాణాలో ఉన్న స్టాక్ కారణంగా నష్టపోవాల్సి వచ్చింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించింది. జూన్ త్రైమాసికంలో నమోదైనదంతా కూడా సైక్లికలే’’అని వివరించింది. తమ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం అనుకున్న విధంగా పనితీరు చూపించిందని.. నూతన ఉత్పత్తుల విడుదలతో ఇది మరింత వృద్ధిని చూస్తుందని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్థానా పేర్కొన్నారు. ఆదాయం, లాభాలకు ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ పెద్ద మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. -
నష్టాల్లోకి యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. జనవరి–మార్చి (క్యూ4)లో రూ. 5,728 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2021– 2022 ఇదే కాలంలో రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ.22,000 కోట్ల నుంచి రూ.28,865 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 17,776 కోట్ల నుంచి రూ.23,970 కోట్లకు బలపడింది. బ్యాంకు బోర్డు వాటాదారులకు షేరుకి రూ.1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 5,361 కోట్ల నికర నష్టం నమోదైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,417 కోట్ల నికర లాభం ఆర్జించింది. సిటీఇండియా రిటైల్ బిజినెస్ కొనుగోలు నేపథ్యంలో నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రభావాన్ని (రూ. 12,490 కోట్లు) మినహాయిస్తే నికర లాభం 61% వృద్ధి సాధించినట్లని బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు. ఎన్పీఏలు డౌన్ క్యూ4లో యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.82 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.73 శాతం నుంచి 0.39 శాతానికి దిగివచ్చాయి. మొండిరుణాలు తగ్గడంతో ప్రొవిజన్లు, కంటిజెన్సీలు రూ. 987 కోట్ల నుంచి తగ్గి రూ. 306 కోట్లకు పరిమితమయ్యాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.73 శాతం మెరుగై 4.22 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 0.8 శాతం క్షీణించి రూ. 881 వద్ద ముగిసింది. -
జొమాటోకు వ్యయాల సెగ
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కన్సాలిడెటెడ్ నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.346 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాడి ఇదే కాలానికి సంస్థ నష్టం కేవలం రూ.67 కోట్లుగానే ఉంది. అధిక వ్యయాలు, ఆన్లైన్ ఫుడ్ వ్యాపారం నిదానించడం, బ్లింకిట్ నుంచి పెరిగిపోయిన నష్టాలు ఈ పరిస్థితికి దారితీశాయి. కార్యకలాపాల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,112 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ.1,642 కోట్ల నుంచి రూ.2,485 కోట్లకు చేరాయి. ‘‘పరిశ్రమ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ వ్యాపారం గతేడాది అక్టోబర్ (దీపావళి తర్వాత) నుంచి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా టాప్ 8 పట్టణాల్లో మరింత అధికంగా ఉంది’’అని జొమాటో సీఎఫ్‌వో అక్షత్ గోయల్ తెలిపారు. ఫుడ్ డెలివరీ వ్యాపారం డిమాండ్ వాతావరణం సవాలుగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవలి వారాల్లో డిమాండ్ పరంగా తిరిగి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక గడ్డు పరిస్థితి ముగిసినట్టేనని భావిస్తున్నాం’’అని గోయల్ పేర్కొన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 225 చిన్న పట్టణాల్లో తాము కార్యకలాపాలు నిలిపివేసినట్టు చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ పట్టణాల నుంచి వచ్చిన ఆదాయం మొత్తం ఆదాయంలో 0.3 శాతమే ఉన్నట్టు తెలిపారు. దీర్ఘకాలంలో ఫుడ్ డెలివరీ వృద్ధి అవకాశాల పరంగా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో వృద్ధి తగ్గడం అన్నది మధ్యస్థాయి మార్కెట్ విభాగంలో మందగమనం, ప్రీమియం విభాగంలో బయటకు వెళ్లి ఆహారం తీసుకోవడం, ప్రీమియం పర్యాటక యాత్రలు తదితర పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఎబిట్డా స్థాయిలో లాభ, నష్టాలు లేని స్థాయికి 2023–24 రెండో త్రైమాసికంలో చేరుకునే విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సంస్థ రూ.265 కోట్ల నిర్వహణ నష్టాలు ప్రకటించగా, ఇందులో బ్లింకిట్‌ను మినహాయిస్తే నిర్వహణ నష్టం కేవలం రూ.38 కోట్లుగానే ఉంది. -
పెరిగిన ఇండిగో నష్టాలు
న్యూఢిల్లీ: అధిక వ్యయాల భారం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విమానయాన దిగ్గజం ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) నష్టాలు మరింత పెరిగాయి. రూ. 1,583 కోట్లకు చేరాయి. గత క్యూ2లో నష్టాలు రూ. 1,436 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 5,799 కోట్ల నుంచి రూ. 12,852 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ. 14,436 కోట్లకు పెరిగాయి. వరుసగా రెండో త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయికి మించి కార్యకలాపాలు నమోదు చేసినట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ‘సీజనల్‌గా రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి కానీ, డిమాండ్ బాగుండటంతో మెరుగైన పనితీరు సాధించగలిగాం. అయితే, ఇంధన ధరలు, కరెన్సీ మారకం రేట్లు మా ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి‘ అని ఆయన వివరించారు. దేశ, విదేశ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ రికవరీ బాటలో స్థిరంగా ముందుకు వెడుతున్నామని ఎల్బర్స్ పేర్కొన్నారు. -
రూ. 88 కోట్లకు పెరిగిన ఐనాక్స్ లీజర్ నష్టం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మల్టిప్లెక్స్ స్క్రీన్ల ఆపరేటింగ్ సంస్థ ఐనాక్స్ లీజర్ నికర నష్టం మరింత పెరిగి, రూ. 88 కోట్లకు చేరింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కట్టడిపరమైన ఆంక్షల కారణంగా సినిమా ప్రదర్శన వ్యాపారం దెబ్బతినడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నష్టం రూ. 68 కోట్లు. సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 95 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు పెరిగాయి. ఐనాక్స్ లీజర్‌కు దేశవ్యాప్తంగా 70 నగరాల్లో 156 మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్లు నిర్వహిస్తోంది. 2021 జూలై నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చే కొద్దీ క్రమంగా మల్టిప్లెక్స్‌లను తెరుస్తున్నట్లు తెలిపింది. క్యూ2లో కొత్తగా ఆరు స్క్రీన్లతో రెండు ప్రాపర్టీలు జతయినట్లు ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. అనిశ్చితితో కూడుకున్న పలు త్రైమాసికాల తర్వాత ఈ క్వార్టర్లో తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. సుమారు 10 శాతం ఆక్యుపెన్సీ రేటు, సగటు టికెట్ ధర రూ. 178, ఒక్కో వ్యక్తి చేసే వ్యయం (ఎస్‌పీహెచ్) రూ. 92గా నమోదైందని, ఇది కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపు సమానమని జైన్ చెప్పారు. -
స్పైస్‌జెట్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం పెరిగి రూ. 729 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 593 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 705 కోట్ల నుంచి రూ. 1,266 కోట్లకు జంప్‌చేసింది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 1,298 కోట్ల నుంచి రూ. 1,995 కోట్లకు ఎగశాయి. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో గత ఐదు క్వార్టర్లుగా పలు సవాళ్లమధ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
ఐకియా ఇండియా నష్టం రూ. 720 కోట్లు
న్యూఢిల్లీ, సాక్షి: ఫర్నీచర్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా ఇండియాకు గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 720 కోట్ల నష్టాలు వాటిల్లాయి. అంతక్రితం ఏడాది(2018-19) నమోదైన రూ. 685 కోట్లతో పోలిస్తే నష్టాలు స్వల్పంగా పెరిగాయి. ఇదేకాలంలో అమ్మకాలు 65 శాతం ఎగసి రూ. 566 కోట్లను తాకాయి. వెరసి మొత్తం ఆదాయం 63 శాతం వృద్ధితో రూ. 666 కోట్లకు చేరింది. 2019లో అమ్మకాలు రూ. 344 కోట్లుగా నమోదుకాగా.. రూ. 408 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. గతేడాది ఇతర ఆదాయం రూ. 64 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెరిగింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ టోఫ్లర్ అందించిన వివరాలివి. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) ప్రాధాన్య మార్కెట్ భారత్ తమకు ప్రాధాన్యత కలిగిన మార్కెట్ అని ఫలితాలపై స్పందిస్తూ ఐకియా ఇండియా సీఎఫ్‌వో ప్రీత్ ధుపర్ పేర్కొన్నారు. ఇక్కడ దీర్ఘకాలంపాటు కొనసాగే ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇక్కడి కార్యకలాపాలు తొలిదశలో ఉన్నట్లు తెలియజేశారు. అందుబాటు ధరలు, నాణ్యతతో కూడిన ఉత్పత్తుల ద్వారా దేశీ మార్కెట్లో మరింత విస్తరించాలని చూస్తున్నట్లు చెప్పారు. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) తొలి స్టోర్ .. స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా 2018 ఆగస్ట్‌లో హైదరాబాద్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ముంబై, హైదరాబాద్, పుణేలలో ఆన్లైన్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఇటీవలే ముంబైలోనూ రెండో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ బాటలో డిమాండుకు అనుగుణంగా మరో రెండు సిటీ స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రీత్ తెలియజేశారు. 2022కల్లా 10 కోట్ల మంది కస్టమర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆన్లైన్ వ్యవస్థపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్, ముంబై, పుణే, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ పట్టణాలలో అమ్మకాలపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. -
పేటీఎమ్: వరుసగా ఏడో ఏటా నష్టాలే
ముంబై, సాక్షి: దేశంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎమ్ వరుసగా ఏడో ఏడాదిలోనూ నష్టాలు నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 2,833 కోట్ల నష్టం నమోదైంది. వెరసి పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 వరుసగా ఏడో ఏడాదీ నష్టాలను సాధించినట్లయ్యింది. అయితే అంతక్రితం ఏడాదితో పోలిస్తే నష్టాలు 28 శాతం తగ్గాయి. అంతేకాకుండా వ్యయాలను సైతం 20 శాతం తగ్గించుకుంది. దీంతో ఇవి రూ. 5,861 కోట్లకు చేరాయి. టోఫ్లర్ వివరాల ప్రకారం గతేడాది పేటీఎమ్ రూ. 3,350 కోట్ల ఆదాయం సాధించింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 1 శాతం తక్కువ. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) 2022కల్లా వచ్చే ఏడాది(2021-22)కల్లా నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించాలని వన్97 లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాటలో పలు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్‌లలోకి అడుగుపెట్టింది. రుణాలు, బీమా, వెల్త్ మేనేజ్మెంట్, కామర్స్ తదితర విభాగాలలోకి కార్యకలాపాలు విస్తరించింది. కాగా.. యూనిఫైడ్ పేమెంట్ విభాగంలో ఈవ్యాలెట్ బిజినెస్‌కు పోటీ తీవ్రమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గూగుల్ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పే, మొబిక్విక్, భారత్ పే,అమెజాన్ పే తదితరాలు ఈవ్యాలెట్ సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. (స్టేట్ బ్యాంక్- రుపీక్ జత?) 1.7 కోట్ల మర్చంట్స్ పేటీఎమ్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్ల చిన్నతరహా బిజినెస్‌లు లిస్టయ్యాయి. ఈ కంపెనీలు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా సూక్ష్మ స్థాయి చెల్లింపులను సాధిస్తున్నాయి. తద్వారా చిన్సస్థాయి డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నట్లు టోఫ్లర్ పేర్కొంది. కంపెనీ ఇటీవల బిజినస్ యాప్, సౌండ్‌బాక్స్, బిజినెస్ కాటా తదితర మర్చంట్ మేనేజ్మెంట్ సర్వీసులను ప్రారంభించింది. -
ఐఆర్సీటీసీకి రూ.25 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రూ.25 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో రూ.72 కోట్ల నికర లాభం వచ్చిందని ఐఆర్సీటీసీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం, లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.459 కోట్ల నుంచి 71 శాతం పతనమై రూ.131 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. టూరిజం విభాగం ఆదాయం రూ.48 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గిందని తెలిపింది. కేటరింగ్ విభాగం ఆదాయం రూ.272 కోట్ల నుంచి రూ.90 కోట్లకు, రైల్‌నీర్ ఆదాయం రూ.58 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గాయని పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్ల డెడ్‌లైన్ 14 వరకూ పొడిగింపు ఐఆర్సీటీసీలో 15–2 శాతం వాటాను కేంద్రం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)మార్గంలో విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులను సమర్పించడానికి గడువు తేదీని ఈ నెల 10 నుంచి మరో నాలుగు రోజులు... .ఈ నెల 14 వరకూ పొడిగించింది. ఐఆర్సీటీసీలో కేంద్రానికి 87.40 శాతం వాటా ఉంది. సెబీ పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఐఆర్సీటీసీ వాటా విక్రయం ఒకింత తోడ్పడుతుందని అంచనా. కేంద్రం ఇటీవలనే హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీల్లో వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. మర్చంట్ బ్యాంకర్ల గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఆర్సీటీసీ షేర్ 0.2% లాభంతో రూ. 1,374 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం 864 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ. 864 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండిబాకీలు మొదలైనవాటికి అధిక కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. ‘ప్రామాణిక ఖాతాలకు రూ. 1,811 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం వల్ల స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1లో రూ. 864 కోట్లు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 679 కోట్ల నికర నష్టం నమోదైంది‘ అని బ్యాంక్ వెల్లడించింది. సమీక్షాకాలంలో వడ్డీ ఆదాయం రూ. 18,944 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ. 18,494 కోట్లకు తగ్గింది. అటు కేటాయింపులు 71 శాతం పెరిగి రూ. 3,285 కోట్ల నుంచి రూ. 5,628 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 10.28 శాతం నుంచి 9.39 శాతానికి తగ్గడంతో అసెట్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. నికర ఎన్పీఏ నిష్పత్తి 3.95 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గింది. సోమవారం బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు స్వల్పంగా పెరిగి రూ. 48.55 వద్ద క్లోజయ్యింది. -
అమ్మకాల వెల్లువ
ముంబై: భారీ వ్యాల్యుయేషన్లు, పెరిగిపోతున్న కరోనా కేసుల భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజూ నష్టాలు నమోదు చేశాయి. సోమవారం సెన్సెక్స్ 667 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 10,900 పాయింట్ల దిగువన క్లోజయ్యింది. రూపాయి క్షీణత, స్థూల ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన గణాంకాలు నిరాశావహంగా ఉండటంతో ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలపై మరింత ప్రతికూల ప్రభావం చూపాయని ట్రేడర్లు తెలిపారు. సోమవారం నెగెటివ్‌లోనే ప్రారంభమైన సెన్సెక్స్ ఆసాంతం నష్టాల్లోనే ట్రేడయ్యింది. చివరికి 1.77 శాతం క్షీణతతో 36,939.60 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 1.64 శాతం (సుమారు 182 పాయింట్లు) నష్టంతో 10,892 వద్ద క్లోజయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో సెన్సెక్స్ 1,553 పాయింట్లు, నిఫ్టీ 409 పాయింట్ల నష్టపోయాయి. బ్యాంకింగ్ స్టాక్స్ డౌన్ సెన్సెక్స్‌లోని కీలక స్టాక్స్‌లో కోటక్ బ్యాంక్ అత్యధికంగా 4.41 శాతం క్షీణించింది. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గణనీయంగా తగ్గాయి. కేవలం ఆరు స్టాక్స్ (టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్ మాత్రమే సుమారు 3.15 శాతం దాకా పెరిగి లాభాలు నమోదు చేశాయి. దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం (హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ) షేర్లలో భారీగా అమ్మకాలు జరగడంతో సూచీలు నష్టపోయాయని ట్రేడర్లు తెలిపారు. వీటితో పాటు విదేశీ పెట్టుబడులు తరలిపోయే భయాలు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు రిస్కులు తగ్గించుకుంటున్నారని వివరించారు. ‘వైరస్ కేసులు పెరుగుతుండటం, కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ చర్యలపై అనిశ్చితి మొదలైనవి మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక సంస్థల స్టాక్స్.. సూచీల పతనానికి కారణంగా ఉంటున్నాయి. వేగం మందగించినప్పటికీ ఆర్థిక ఫలితాలు, విశ్లేషణలను బట్టి ఆయా షేర్లలో కదలికలు ఉంటున్నాయి. మార్కెట్లు ప్రస్తుత శ్రేణిని నిలబెట్టుకోగలిగితే, ఈ పతనాలు స్వల్పకాలికమైనవిగానే ఉండగలవు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పోర్ట్‌ఫోలియోలో నాణ్యమైన షేర్లను మరికాస్త పెంచుకోవచ్చు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. బీఎస్ఈ బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, టెలికం తదితర సూచీలు 2.73 శాతం దాకా క్షీణించగా, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, మెటల్ తదితర సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.31 శాతం తగ్గగా, స్మాల్ క్యాప్ సూచీ 1.02 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా..: షాంఘై, టోక్యో, సియోల్ సూచీలు లాభాల్లో ముగియగా, హాంకాంగ్ సూచీ నష్టపోయింది. ఇక యూరప్ సూచీలు సానుకూలంగా ట్రేడయ్యాయి. -
61% పడిపోయిన బజాజ్ ఆటో లాభం
న్యూఢిల్లీ: లాక్డౌన్ ప్రభావం బజాజ్ ఆటో కంపెనీపై గట్టిగానే పడింది. జూన్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.395 కోట్లు.. ఆదాయం రూ.3,079 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే లాభం, ఆదాయం 61 శాతం మేర తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,012 కోట్ల లాభం, రూ.7,776 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. స్టాండలోన్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,126 కోట్ల నుంచి రూ.528 కోట్లకు తగ్గిపోయింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 4,43,103 వాహనాలను విక్రయించింది. ఇందులో 2,51,000 యూనిట్లు (విలువ పరంగా రూ.1,651 కోట్లు) ఎగుమతి చేసినవే. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,47,174 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మొదటి త్రైమాసికం పూర్తిగా సవాళ్లతో కొనసాగింది. లాక్డౌన్, వైరస్ నియంత్రణ చర్యలు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించడంతో మొత్తం మీద డిమాండ్ తగ్గింది’’ అని బజాజ్ ఆటో తెలిపింది. ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా కరోనా ప్రభావం ఉన్నట్టు కంపెనీ అంగీకరించింది. -
టాటా స్టీల్ నష్టాలు 1,096 కోట్లు
న్యూఢిల్లీ: ఉక్కు రంగ దిగ్గజ కంపెనీ, టాటా స్టీల్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,096 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.2,431 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా స్టీల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.42,914 కోట్ల నుంచి రూ.35,086 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ప్రకటించింది. ► అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.38,729 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు గత క్యూ4లో రూ.33,272 కోట్లకు తగ్గాయి. ►ఉక్కు ఉత్పత్తి(కన్సాలిడేటెడ్) సీక్వెన్షియల్‌గా 7 శాతం ఎగసి 7.37 మిలియన్ టన్నులకు చేరింది. భారత్‌లో ఉక్కు ఉత్పత్తి 6 శాతం వృద్ధితో 4.73 మిలియన్ టన్నులకు చేరింది. ►కరోనా వైరస్ కల్లోలం కారణంగా భారత్‌తో పాటు యూరప్, ఆగ్నేయాసియా, కెనడా ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలతో పాటు అమ్మకాలు కూడా ప్రభావితమయ్యాయి. ►గత క్యూ4లో యూరప్ విభాగం నిర్వహణ లాభం రూ.65 కోట్లుగా ఉంది. అంతక్రితం క్యూ4 లో రూ.956 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. ►పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 74 శాతం తగ్గి రూ.2,720 కోట్లకు, ఆదాయం 11 శాతం తగ్గి రూ.1,39,817 కోట్లకు చేరాయి. ►భారత విభాగం ఉక్కు ఉత్పత్తి 8% పెరిగింది. ►ఈ ఏడాది మార్చి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.17,745 కోట్ల మేర ఉన్నాయి. ►ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేర్ 1 శాతం నష్టంతో రూ.321 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్ నష్టం 6 రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్లో రూ.3,259 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, 6 రెట్లు పెరిగాయని కెనరా బ్యాంక్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.14,000 కోట్ల నుంచి రూ.14,222 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ► గత క్యూ4లో రూ.5,375 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.5,524 కోట్లు. ► 2018–19లో రూ.347 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,236 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► గత ఏడాది మార్చి నాటికి 8.83 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 8.21 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.37 శాతం నుంచి 4.22 శాతానికి తగ్గాయి. ► విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.39,224 కోట్ల నుంచి రూ.37,041 కోట్లకు, నికర మొండి బకాయిలు 22,955 కోట్ల నుంచి రూ.18,251 కోట్లకు తగ్గాయి. ► ప్రొవిజన్ కవరేజ్ రేషియో 68.13 శాతం నుంచి 70.97 శాతానికి పెరిగింది. ► ఈ ఏడాది ఏప్రిల్ 1న కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 4% నష్టంతో రూ.109 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్ నష్టాలు 9,864 కోట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.9,864 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) ఇదే క్వార్టర్లో రూ.1,109 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా మోటార్స్ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలంతో దేశీయ వ్యాపారమే కాకుండా లగ్జరీ కార్ల విభాగం, జేఎల్ఆర్ వ్యాపారం కూడా దెబ్బతినడంతో గత క్యూ4లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.86,422 కోట్ల నుంచి 28 శాతం క్షీణించి రూ.62,493 కోట్లకు తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆర్థిక మందగమనం, లిక్విడిటీ ఒత్తిడి, బీఎస్–సిక్స్ నిబంధనల అమలు కారణంగా నిల్వలకు సంబంధించి సమస్యలకు తోడు లాక్డౌన్ కారణంగా అమ్మకాలు భారీగా పడిపోయాయని వెల్లడించింది. చైనాలో సేల్స్ పుంజుకుంటున్నాయని జేఎల్ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ పేర్కొన్నారు. ► జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)కు గత క్యూ4లో 50 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 4,750 కోట్లు) నికర నష్టాలు, 540 కోట్ల పౌండ్ల (సుమారు రూ.51,300 కోట్లు) ఆదాయం వచ్చింది. ► స్డాండ్ అలోన్ పరంగా, 2018–19 క్యూ4లో రూ.106 కోట్ల నికర లాభం రాగా, గతేడాది క్యూ4లో రూ.4,871 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.28,724 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,975 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.2.61 లక్షల కోట్లకు తగ్గింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 4.5% నష్టంతో రూ.100 వద్ద ముగిసింది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్సే ్చంజ్‌లో లిస్టైన టాటా మోటార్స్ ఏడీఆర్ మాత్రం 7% ఎగసి ఏడు డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
అలహాబాద్ బ్యాంక్ నష్టం 2,103 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థికసంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,816 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.2,103 కోట్లకు పెరిగాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు ఈ రేంజ్లో పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.4,492 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,725 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్ మొండిబకాయిలు మరింత పెరిగాయి. గత క్యూ2లో రూ.27,236 కోట్లుగా ఉన్న స్థూల మొండి బాకీలు ఈ క్యూ2లో రూ.31,468 కోట్లకు పెరిగాయి. అయితే నికర మొండిబకాయిలు రూ.11,083 కోట్ల నుంచి రూ.8,502 కోట్లకు తగ్గాయి. -
తగ్గిన యూకో బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కొంచెం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయని యూకో బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నష్టాలు పెరిగాయి. ఈ బ్యాంక్‌కు ఈ క్యూ1లో రూ.601 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.3,749 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,534 కోట్లకు పెరిగింది. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.., గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.25,665 కోట్లకు తగ్గాయి. నికర మొండి బకాయిలు రూ.11,820 కోట్ల నుంచి రూ.7,238 కోట్లకు చేరాయి -
జేఎస్పీఎల్ నష్టాలు రూ.399 కోట్లు
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్) కంపెనీకి రెండో త్రైమాసిక కాలంలో రూ.399 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.279 కోట్ల నికర లాభం వచ్చిందని జేఎస్పీఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,983 కోట్ల నుంచి రూ.8,940 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ధరలు, లాభదాయకత బాగా తగ్గినా, రెయిల్స్, ప్లేట్స్ వంటి విభిన్నమైన విలువాధారిత ఉత్పత్తుల తోడ్పాటుతో ఒకింత ఊరట లభించిందని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రుణ భారం రూ.36,501 కోట్లుగా ఉందని పేర్కొంది. -
ఇండిగో నష్టం 1,062 కోట్లు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్ నష్టాలు, రూ.319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్ దత్తా చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో రూ.1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచి్చన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి రూ.9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికలపైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. -
ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.2,410 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.3,801 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, వాటికి కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు కూడా పెరిగాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,403 కోట్ల నుంచి రూ.5,924 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,639 కోట్ల నుంచి రూ.1,458 కోట్లకు తగ్గిందని తెలిపింది. తగ్గిన మొండి బకాయిలు.... మొండి బకాయిలు తగ్గాయని బ్యాంక్ వెల్లడించింది. గత క్యూ1లో 30.78%గా ఉన్న మొండి బకీలు ఈ క్యూ1లో 29.12%కి తగ్గాయి. విలువ పరంగా, స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్ల నుంచి రూ.51,658 కోట్లకు తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 18.76% నుంచి 8.02%కి చేరినట్లు పేర్కొంది. పెరిగిన కేటాయింపులు..... గత క్యూ1లో రూ.4,603 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ1లో రూ.7,009 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు, ఇతరాలకు కూడా కలుపుకొని మొత్తం కేటాయింపులు రూ.5,236 కోట్ల నుంచి రూ.6,332 కోట్లకు చేరాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఈ బ్యాంక్‌లో 51% వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆర్తిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 1.3 శాతం లాభంతో రూ. 27.15 వద్ద ముగిసింది. -
భెల్ నష్టాలు రూ.219 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భెల్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.219 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత క్యూ1లో రూ.40 కోట్ల నికర లాభం ఆర్జించామని భెల్ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,116 కోట్ల నుంచి రూ.4,673 కోట్లకు తగ్గిందని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆదాయం రూ.4,636 కోట్ల నుంచి రూ.3,492 కోట్లకు, ఇండస్ట్రీ సెగ్మెంట్ ఆదాయం రూ.1,161 కోట్ల నుంచి రూ.920 కోట్లకు తగ్గాయని భెల్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.57 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ నష్టాలు 2,856 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,866 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. రిలయన్స్ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్వర్క్ తరుగుదల వ్యయాలు, భారీగా పన్ను వంటి అసాధారణ అంశాలతో ఈ క్యూ1లో ఈ స్థాయి లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5% వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్‌లో ఆదాయం 3%, ఆఫ్రికాలో ఆదాయం 10% చొప్పున పెరిగాయని వివరించింది. 94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్.. మొబైల్ కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్పీయూ–యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్టెల్ పేర్కొంది. మొబైల్ డేటా ట్రాఫిక్ 94 శాతం పెరిగిందని తెలిపింది. రూ. 8,493 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, నిర్వహణ మార్జిన్ 6 శాతం పెరిగి 41 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ క్యూ1 ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ ఎమ్డీ, సీఈఓ(ఇండియా అండ్ సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. అన్ని వ్యాపారాల్లో సమ వృద్ధి సాధించామని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో ఎయిర్టెల్ షేర్ 4 శాతం నష్టంతో రూ.324 వద్ద ముగిసింది. -
14 ఏళ్లలో మొదటిసారి : ఎయిర్‌టెల్‌కు షాక్
సాక్షి, ముంబై : టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేసింది. గురువారం మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన క్యూ1 పలితాల్లో రూ.2,866 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదేకాలంలో రూ. 97 కోట్ల నికర లాభం నమోదు కావడం గమనార్హం. 14 సంవత్సరాలలో కంపెనీకి ఇది మొదటి త్రైమాసిక నష్టమని ఎనలిస్టులు తెలిపారు. జియో ఎంట్రీతో భారతి ఎయిర్టెల్ ఎదుర్కొంటున్న ఒత్తిడితోపాటు, వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు ఇతర టెలికాం కంపెనీల నిరంతర పోరాటాన్నిఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఏకీకృత ఆదాయం జూన్ త్రైమాసికంలో సంవత్సరానికి 4.7శాతం పెరిగి, రూ. 20,738 కోట్లకు చేరుకుంది. వైర్లెస్ వ్యాపార ఆదాయం సంవత్సరానికి 4.1శాతం పెరిగి రూ. 7 10,724 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ ఆదాయం రూ. 11,270 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ను అధిగమించిన జియో రూ. 11,679 ఆపరేటింగ్ రెవెన్యూను సాధించింది. ఎబిటా మార్జిన్లు ఈ త్రైమాసికంలో 6.4 శాతం పెరిగి 41 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 34.5 శాతంగా ఉంది. అన్ని వ్యాపారాల్లో ఆరోగ్యకరమైన వృద్ధితో ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ప్రారంభమైందని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. రివార్డ్ ప్లాట్‌ఫామ్, ఎయిర్టెల్ థాంక్స్ ద్వారా వినియోగదారులకు మరింత విలువను అందించడంపై దృష్టి పెట్టామన్నారు. దీంతో వినియోగదారునికి సగటు ఆదాయం (ఏఆర్పీయూ)లో వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా పుంజుకుందన్నారు. నాన్మొబైల్ బిజినెస్ వృద్ధి సాధించిందని ఫలితాల సందర్భంగా ఎయిర్టెల్ ప్రకటించింది. డిజిటల్ టివి ఆదాయం 15.7 శాతం వృద్ధిని సాధించిందనీ, ఎయిర్టెల్ బిజినెస్ 7.2 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎబిటా 24.2 శాతం పెరిగి, రూ .8,493 కోట్లతో కన్సాలిడేటెడ్ మార్జిన్ సాధించినట్టు చెప్పింది. కాగా గతవారం జియో మొదటిసారిగా దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్‌ను అధిగమించి టాప్ లోకి దూసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆదాయపరంగా, వినియోగదారులపరంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు గురువారం భారతి ఎయిర్టెల్ షేరు 4.1శాతం నష్టాలతో 323.95 వద్ద ముగిసింది.