Nirbhaya act
-
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
హ్యాపీ బర్త్‌డే అన్నాడు.. నమ్మి వెళితే యువతికి నరకం చూపించాడు
సాక్షి,తూర్పుగోదావరి (కరప): కామంతో కన్నుమిన్ను కానని ఓ యువకుడు యువతిపై లైంగిక దాడికి యత్నం చేసి, విచక్షణారహితంగా గాయపరచిన ఘటన కరప మండలం వేళంగిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరప ఎస్సై డి.రమేష్‌బాబు, స్థానికుల కథనం ప్రకారం.. వేళంగికి చెందిన యువతి ఇంటర్మీడియెట్ చదివింది. తల్లిదండ్రులతో కలిసి ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. ఈ నెల 13 రాత్రి ఆమె ఇంటి పక్కనే ఉంటున్న విత్తనాల రమేష్ తన మొబైల్ ఫోన్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన ఆ యువతి.. కొద్దిసేపటికి రూ.2 వేలు అప్పుగా ఇస్తే, నాలుగు రోజుల్లో ఇచ్చేస్తానని అడిగింది. ఇదే అదునుగా నగదు ఇస్తానని నమ్మించిన రమేష్.. ఇంటి పక్కన ఉన్న సందులోకి ఆమెను రమ్మ న్నాడు. తెలిసిన వ్యక్తే కదా అని డబ్బుల కోసం అక్కడకు వెళ్లగా అతడు ఆ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆగ్రహించిన రమేష్.. ఆ యువతి గొంతు పట్టుకుని గోడకు గుద్దించాడు. విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చాడు. భయపడిన ఆ యువతి కేకలు వేయడంతో ఆమె గొంతు, ఎడమ చేతిని కొరికి గాయపరిచాడు. మెడ పట్టుకొని ముఖా న్ని గోడకు బలంగా కొట్టి పరారయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు బాధితురాలు తెలిపింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం, ఇతర సెక్షన్లతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్‌బాబు వివరించారు. -
దారుణం: మైనర్‌పై 38 మంది అత్యాచారం
తిరువనంతపురం: నిర్భయ చట్టం.. దాని కంటే కఠిన చట్టాలు.. ఆఖరికి ఎన్కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేకపోతున్నాయి. దేశంలో రోజురోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. కేరళలో ఓ మైనర్ బాలికపై గత కొద్ది నెలలుగా 38 మంది మృగాళ్లు రాక్షస క్రీడ కొనసాగించారు. నిర్భయ కేంద్రంలో కౌన్సెలింగ్ సందర్భంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాలిక 13వ ఏట ఉండగా.. ఈ అత్యాచారాల పర్వం మొదలయ్యింది. అలా ఓ ఏడాది పాటు నరకం అనుభవించిన బాలికను చైల్డ్ హోమ్‌కు తరలించారు అధికారులు. కొద్ది రోజుల తర్వాత బాలికను ఆమె తల్లి, అన్నతో ఇంటికి పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాలిక కనిపించకుండా పోయింది. ఇక ఆమెని వెతగ్గా గతేడాది డిసెంబర్లో పాలక్కడ్‌లో ఆచూకీ లభ్యం అయ్యింది. ఆమెని నిర్భయ సెంటర్‌కి తరలించి.. కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించగా.. బాలిక హృదయం ద్రవించే విషయాలు వెల్లడించింది. (చదవండి: అత్యాచారం చేయలేదు.. రిలేషన్లో ఉన్నాం: మంత్రి) దాదాపు 38 మంది మృగాళ్లు ఆమెపై రాక్షస క్రీడ కొనసాగించారని తెలిపింది. బాధితురాలు చెప్పే విషయాలు విని అధికారుల కళ్లు చెమర్చాయి. మరో దారుణం ఏంటంటే.. బాలికపై అత్యాచారం చేసిన వారంతా ఆమెకి తెలిసిన వారే కావడం గమనార్హం. ఇక బాధితురాలు వెల్లడించిన వివరాల మేరకు అధికారులు నిందితులందరి లైంగిక దోపిడితో సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మలప్పురం సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ప్రెసిడెంట్ షాజేశ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘బాధితురాలిని ఏడాది క్రితం చైల్డ్ హోం నుంచి బయటకు పంపినప్పుడు ఆమె భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే ఒక్కసారి బాధితులను వారి సంరక్షకులకు అప్పగించిన తర్వాత సమస్యలు తలెత్తుతున్నాయి. సంరక్షులు బాధితులను సరిగా పట్టించుకోవడం లేదు. అందువల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి’ అని తెలిపారు. -
మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్: సీఎం జగన్
-
ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించిట్లు స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదని అన్నారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం) అక్కాచెల్లెమ్మలకు అండగా తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చాం. దేశంలోనే తొలిసారిగా దిశా బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచాం. ప్రతి జిల్లాలో దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. దిశా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. దిశా యాప్ ద్వారా అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం. ప్రతి గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్‌ను కూడా నియమించాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయం యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఆటోలు, క్యాబ్‌ల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు యాప్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఆటో, క్యాబ్‌లో అభయం యాప్ డివైజ్ ఏర్పాటు చేస్తాం. తొలిసారిగా వెయ్యి వాహనాల్లో డివైజ్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాలకు డివైజ్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. ‘అభయం’ అమలు ఇలా.. ► రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. ► రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి. ► తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది. ► ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్లో ‘అభయం’ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ► స్కాన్ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. ► స్మార్ట్ ఫోన్ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. ► స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కితే సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటరుకు చేరుతుంది. క్యాబ్/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. ► ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. ► ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. -
పెరుగుతున్న రేప్‌లు, తగ్గుతున్న శిక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ అనంతరం దేశంలో ఎన్నో కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ అత్యాచార ఘటనలు తగ్గక పోవడం, పైగా అటువంటి కేసుల్లో శిక్షలు తగ్గి పోవడం శోచనీయం. మహిళల భద్రత కోసం ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలిగించక పోవడం బాధాకరం. ఇందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, దర్యాప్తు సంస్థలకు చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణం. 2019, డిసెంబర్ నెల నాటికి ‘నిర్భయ నిధి’లో కేవలం 9 శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. 2018 ఏడాదితో పోలిస్తే 2019 సంవత్సరానికి మహిళలపై అత్యాచారాలు ఏడు శాతం పెరగ్గా, రేప్ కేసుల్లో శిక్షలు 27.8 శాతానికి పడిపోయాయి. 2018లో నమోదైన అత్యాచార కేసుల్లో 15 శాతం కేసుల్లో నేరారోపణలే ఖరారు కాలేదు. దేశంలో అకృత్యాలు నియంత్రించడంలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన కఠిన చట్టాల ప్రకారం పోలీసులు, వైద్యులు, న్యాయస్థానం పాత్ర, బాధ్యతలు పెరిగాయి. ఈ మూడు వ్యవస్థలు చిత్తశుద్ధితో పని చేసినట్లయితేనే దేశంలో మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పడతాయి. కొత్త చట్టాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అయితే దేశంలో ఎక్కడా ప్రైవేటు ఆస్పత్రులు అత్యాచార బాధితులను చేర్చుకోవడం లేదు. -
కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!
(వెబ్ స్పెషల్): రేపిస్టుల పాలిట సింహ స్వప్నం, బ్రహ్మాస్త్రమంటూ ‘నిర్భయ’ చట్టాన్ని తెచ్చుకున్నాం.. ఖబడ్దార్... అత్యాచారం చేస్తే మరణ శిక్షే అన్నాం.. ఎన్కౌంటర్లూ చూశాం.. కానీ ఏం జరిగింది. చరిత్ర పునరావృతమైంది. ఘోరాతి ఘోరంగా.. మరింత హేయంగా...దిగ్భ్రాంతికరంగా.. పుణ్య భారతంలో మరో నిర్భయ బలైపోయింది. పసిగుడ్డునుంచి 90 ఏళ్ల వృద్దురాలి దాక, ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బాధితులను కూడా విడిచిపెట్టకుండా ప్రజాస్వామ్య దేశంలో హత్యాచార పర్వం కొనసాగుతూనే ఉంది. ఇపుడు ఏకంగా పోలీసులే సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేశారు. ఇదీ మన నవభారతం. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిన 2012 నిర్భయ ఘటనతో వచ్చిన ‘నిర్భయ’ చట్టం తరువాత హత్యాచారాలకు ఏమాత్రం అడ్డకట్ట పడటం లేదు. బాధితులకు ముప్పు పెరిగిందే తప్ప తగ్గలేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా అత్యాచారాలు ఆగలేదు సరికదా గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్ ఉన్నావ్, జమ్మూకశ్మీర్ కథువా, తెలంగాణాలో దిశ, మరో దళిత మహిళ.. ఇలా దేశంలో పలు హత్యాచార ఘటనలు మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మరో అమానుష ఘటన ఆందోళన పుట్టిస్తోంది. తల్లితో కలిసి పొలాలకు వెళ్లిన 19 ఏళ్ల దళిత బాలికను ఎత్తుకెళ్లి ఆధిపత్య కులానికి చెందిన నలుగురు నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారం, తీవ్ర చిత్రహింసల పాలు చేశారు. ఏకంగా నాలుక కోసేశారు. ఇక ఈ హింస తన వల్ల కాదంటూ ఈ లోకం నుంచి నిష్ర్రమించింది బాధితురాలు. బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వ్యవహారంలో యోగి సర్కార్ వైఖరి మరువక ముందే మరో అమానుష ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులే బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అతిదారుణమైన పరిస్థితుల్లో బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబానికి ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం చివరి చూపు దక్కుకుండా, ఈ తంతును ముగించడం వెనక అంతర్య మేమిటి? తొలుత ఫిర్యాదు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం, ఆ తరువాత రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా బాధితురాలి శవ దహనం చేయడం ఎవరిని రక్షించడానికి? కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి, బయటకు రాకుండా పోలీసులు ఎందుకు వ్యవహరించాలి? పోలీసుల రక్షణ వలయంగా ఏర్పడి మరీ ఈ దారుణానికి పాల్పడిన దృశ్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దోషులను కాపాడేందుకు, సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే ఇలా చేశారా? ఈ ప్రశ్నలకు అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 'నిర్భయ' నిందితుల ఉరికోసం ఆరాటపడిన బీజేపీ అధినాయకత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నాయి. మరీ ముఖ్యంగా మైనర్ బాలికలను, కూలి పనులకు వెళ్లిన దళిత బలహీన వర్గాల అమ్మాయిలే లక్ష్యంగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. బేటీ బచావో నినాదాన్ని అపహాస్యం చేస్తూ పైశాచికత్వంతో అన్నెంపున్నెం ఎరుగని పసివాళ్లను, అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. దీనికి తోడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, మరింత రాక్షసంగా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. చంపేస్తామనే బెదిరింపులు, హత్యలూ పెరుగుతున్నాయి. కఠిన శిక్షలు భయంతో మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అత్యాచార దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించి...విషయం బయటికి చెబితే బయటపెడతాం అంటూ.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తీరని అవమానంతో, సమాజానికి భయపడి చాలామంది బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడంలేదు. చాలా కేసుల్లో దర్యాప్తుల జాప్యంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. మరోవైపు నేరస్తులతో పోలీసు అధికారులు కుమ్మక్కవ్వడం, బేరసారాలు, ఒప్పందాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 2012లో రోజుకు 68 అత్యాచార సంఘటనలు రికార్డయ్యాయి. 2013లో ఈ సంఖ్య 92కు పెరిగింది. 2014లో 100, 2016లో రోజుకు 106 కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా అత్యాచార కేసులు నమోదు కావడం లేదు. తాజాగా హత్రాస్‌లో సామూహిక హత్యాచార ఘటన అమ్మాయిల భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తింది. హైదరాబాద్ దిశ కేసు మాదిరిగానే తక్షణ న్యాయం కావాలని, నేరస్థులను ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ‘చట్టం’ తన పని చేస్తోందా? అత్యాచారం, కిడ్నాప్ లాంటి ఘటనల్లో పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి అనేక నిదర్శనాలు వెక్కిరిస్తున్నాయి. ఆడపిల్ల కనిపించడం లేదు అనగానే వారినోటి నుంచి ముందు "లేచిపోయిందేమో.. రెండు రోజుల్లో వస్తుంది.. లేదంటే ఏదైనా శవం దొరికితే కబురు చేస్తాం'' అనే మాటలే వినిపిస్తాయి. చాలా కేసుల్లో ప్రాథమింగా ఎదురవుతున్న ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. వ్యవహారం కాస్తా తీవ్రంగా మారి మేలుకొనే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీనికితోడు నిర్భయ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్షలు పడే అవకాశముంది. కఠిన శిక్షలు పేరుతో కొందరు పోలీసు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారనీ, నిందితులతో లాలూచీ పడుతున్నారనీ పలువురు మానవహక్కుల నేతలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బలహీన సెక్షన్లతో కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారనీ, భారీ ముడుపులు అందుకొని కేసులను నీరు గారుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పలు కేసుల్లో నిందితులుగా ఉండటం గమనార్హం. సమాజంలో స్త్రీలను ఒక పౌరురాలిగా కాకుండా కేవలం సెక్స్ సింబల్ గా, విలాస వస్తువుగా చూసే దృక్పథం మారనంత వరకూ, చట్టాలు, పోలీసులు సక్రమంగా తమ విధి తాము నిర్వర్తించనంతవరకు, పాలకులు ప్రజలు, మహిళల భద్రత పట్ల చిత్తశుద్ధిగా ఉండనంతవరకూ ఈ అమానుష హింసాకాండ కొనసాగుతూనే ఉంటుంది. -
నిర్భయ కేసులో జేడీఏ హబీబ్‌బాషా అరెస్టు
అనంతపురం క్రైం: నిర్భయ కేసులో భాగంగా అగ్రికల్చరల్ జేడీఏ హబీబ్‌బాషాను దిశ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అనంతపురంలోని జేడీఏ ఇంటి వద్ద డీఎస్పీ ఈ.శ్రీనివాసులు నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేసి, దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 3న కళ్యాణదుర్గం అగ్రికల్చరల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగిని జేడీఏ హబీబ్ బాషా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎస్పీ బి.సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీసీఎస్ డీఎస్పీ, దిశ పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు ఆదేశాలతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ: దిశ పోలీసు స్టేషన్లో జేడీఏ హబీబ్‌బాషాను డీఎస్పీ శ్రీనివాసులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటలకు జేడీఏను ఆయన ఇంటి నుంచి స్టేషన్‌కు తరలించారు. లైంగింక వేధింపులకు సంబంధించి లోతుగా ఆరా తీశారు. ‘జూనియర్ అసిస్టెంట్ తన సొంత పనులపై వచ్చినప్పుడు మీ క్యాబిన్‌కు ఎందుకు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించారని? ఆమెకు ఎన్నిసార్లు కాల్ చేశారు తదితర విషయాలపై ప్రశ్నించారు. కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడితే అసభ్య పదజాలం ఉపయోగించారని బాధితురాలు ఆరోపించిందని, దీనిపై మీరేం సమాధానం చెబుతారంటూ హబీబ్‌బాషాను డీఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. హబీబ్‌బాషా కాల్ డేటాను పోలీసులు సేకరించి, జూనియర్ అసిస్టెంట్‌కు ఫోన్లు ఏమైనా చేశారా? అని ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలాఉంటే విచారణలో హబీబ్‌బాషా తనకేం తెలియదని చెప్పినట్లు తెలిసింది. -
తల్లిలాంటి వదినే బాలికను..
నిర్భయ, దిశ వంటి అనేక కఠినమైన చట్టాలు వస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. మైనర్లని కూడా చూడకుండా వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు బాలికలపై జరిగిన అఘాయిత్యాలు బయటపడటం కలవరపెడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కంటికి రెప్పలా కాపాడాల్సిన అయిన వారే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రక్షించాల్సిన వారే తమ జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. విషయం బయటపడితే తమతో పాటు కుటుంబ పరువు పోతుందనే భయంతో పంటి బిగువున బాధను భరిస్తూ నరకయాతన పడుతున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అంతకంటే భయంకరమైన కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై తమ కామ వాంఛను తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న అమానవీయ ఘటనలు వింటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురవ్వాల్సిన దుస్థితి దాపురించింది. తమ జీవితాలను బాగు చేయాల్సిన తల్లిదండ్రులు, అన్న వదినలు, అక్కాచెల్లెళ్లు ఇలా పేగుబంధాలనే నమ్మలేని దుర్భర పరిస్థితి నెలకొంది. జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస దుర్ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ♦ జిల్లాలో గత వారం రోజుల్లో మూడు దుర్ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక వారి వద్ద నుంచి వచ్చి అన్న, వదినల వద్ద ఉంటుంది. అయితే తల్లి తరువాత తల్లిలా భావించే వదినమ్మే ఆ బాలికను డబ్బు కోసం ఓ వ్యభిచార ముఠాకు రూ.27 వేలకు అమ్మివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను డబ్బిచ్చి కొన్న వ్యభిచార ముఠా కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ బాధ భరించలేక వారి నుంచి తనకు రక్షణ కల్పించమంటూ సదరు బాలిక డయల్ 100 కు ఫోన్ చేయడంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు బాలికను వ్యభికార కూపం నుంచి రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించే ముఠాతో పాటు ఆమె వదినపై కూడా దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన అయిన వారి అండ కోరుకునే బాలికలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ♦ ఒంగోలు నగరంలో జరిగిన మరో ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ఉంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. కొంతకాలం పాటు కుమార్తెలిద్దరూ తల్లి వద్దే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. అయితే తల్లి బలరాం కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం సాగిస్తోంది. అయితే ఆ కామాంధుడి కన్ను తన కూతురులాంటి మైనర్ బాలికపై పడింది. ఈ క్రమంలో మైనర్ బాలికను బెదిరించి రెండుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా కామాంధుడిని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ఆమె గోల చేయవద్దంటూ కూతురికి నచ్చజెప్పి ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే తల్లితో సహజీవనం చేసే వ్యక్తితో తనకు పెళ్లి ఏంటని భావించిన బాలిక బేస్తవారిపేటలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం తెలియజేసింది. దీంతో బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా కామాంధుడితో పాటు అతనితో సహజీవనం చేస్తున్న బాలిక తల్లిపై సైతం కేసు నమోదైంది. కంటికి రెప్పలా చూడాల్సిన తల్లి కన్న కూతురినే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన ఆమెను విషయం తెలిసిన వారంతా ఛీత్కరించుకుంటున్నారు. ♦ కొత్తపట్నంలో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయి, తండ్రికి చూపు సరిగా కనిపించక ఉన్న బాలికపై ఓ కామాంధుడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉంది. అయితే కామాంధుడు చేసిన పాపానికి శాపమై తన కడుపులో బిడ్డగా పెరుగుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను మథనపడుతూ మౌనంగా రోదిస్తున్న తరుణంలో దీనిని గమనించిన మేనత్త గట్టిగా ప్రశ్నించడంతో మృగాడి దాష్టీకాన్ని బయటపెట్టింది. దీంతో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ♦ ఇలా చెప్పుకుంటూ పోతే మైనర్ బాలికలపై వరుసగా లైంగిక దాడులు, అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వచ్చేవారు కాదు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరగదనే భయంతో పరువు పోతుందనే ఆందోళనతో రహస్యంగా ఉంచేవారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు మైనర్ బాలిక, మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుండటంతో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. -
‘దమ్ముంటే అయ్యన్నను తొలగించండి’
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్న పాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సవాల్ చేశారు. నిర్భయచట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘మహిళా అధికారిణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్నపాత్రుడు దొరికారు. అలాంటి వ్యక్తిపై కేసు పెడితే వెనుకేసుకొస్తారా? మహిళా ఉద్యోగులంటే టీడీపీకి చులకనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారో?మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు’అని ప్రశ్నించారు. కాగా, విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: కరోనా: ఆంధ్రప్రదేశ్‌లో 8 వేలు దాటిన కేసులు) -
అయ్యన్నపై మొదలైన విచారణ
నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసుపై విచారణ కొనసాగుతుందని ఏఎస్పీ తుహన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషించి, తన విధులకు భంగం కలిగించారని మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకున్యాయసలహా తీసుకుని ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. బుధవారం ప్రాథమిక విచారణ ప్రారంభించామన్నారు. కేసును పట్టణ సీఐ దర్యాప్తు చేస్తున్నారన్నారు. విచారణ అనంతరం తీసుకునే చర్యలు గురించి వివరిస్తామన్నారు. -
అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు తెలిపారు. బట్టలూడదీసే పరిస్థితి వస్తుందంటూ... మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. అయితే తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈనెల 15న మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతో ఫోటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేకు ఆమె తొత్తుగా మారారంటూ నోరు పారేసుకున్నారు. పోలీసులు, పెద్దల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం చిత్రపటాన్ని నెల రోజుల్లో యథా«స్థానంలో పెట్టకపోతే కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ‘కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయింది.. అదే మగవాడైతే వేరే విధంగా ట్రీట్మెంట్ ఉండేది...’ అంటూ బెదిరించారు. అయ్యన్నపాత్రుడి దుర్భాషలతో మనస్తాపం చెందిన కమిషనర్ పట్టణ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. -
ఇంటర్ విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
సాక్షి,హైదరాబాద్: ఇంటర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. కోట్‌పల్లి మండలం లింగంపల్లికి చెందిన ఓ బాలిక వికా రాబాద్లోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఆమె కాలేజీకి వెళ్లేందుకు కోట్‌పల్లి పెట్రోల్ పంపు వద్ద బస్సు కోసం చూస్తుండగా కోట్‌పల్లి నివాసి ఉప్పరి రమేశ్ బైక్‌పై అటుగా వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. రమేశ్‌పై పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ తెలిపారు. మరో ఘటనలో.. మాడ్గుల: మద్యం మత్తులో ఓ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. మండలంలోని చంద్రాయన్‌పల్లికి చెందిన ఓ బాలిక (9) తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బైకని వెంకటయ్య(45) ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి దుస్తులు విప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురై న బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బద్యానాయక్ తెలిపారు. -
నిర్భయ చట్టం తెచ్చినా..
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై వేధింపుల నిరోధానికి నూతన చట్టాలు తీసుకురావడం పరిష్కారం కాదని, రాజకీయ సంకల్పం, పాలనాపరమైన చర్యలు అవసరమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, నిర్భయ చట్టం తీసుకువచ్చినా మహిళలపై నేరాలు ఆగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉన్నావ్‌లో జరిగిన ఇటీవలి సంఘటలను ప్రస్తావిస్తూ కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు సిగ్గుచేటని, ఇలాంటి ఘటనలు తక్షణమే నిలిచిపోయేలా మనమంతా ప్రతినబూనాలని పిలుపు ఇచ్చారు. సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాల నియంత్రణకు నూతన చట్టాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం కాదని చెప్పారు. -
వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు
మౌంట్ అబూ: మహిళలపై జరుగుతున్న వరుస పైశాచిక దాడులు దేశాన్ని వణికిస్తున్నాయని, నైతికంగా దెబ్బ తీస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాజస్తాన్‌లోని అబూరోడ్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి తీసుకువచ్చిన ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే హక్కు లేకుండా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో దిశ హత్యాచారం, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి మహిళల భద్రత గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘అత్యాచార నేరాల్లో ఉరి శిక్ష పడిన వారందరూ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. వారికి రాజ్యాంగం ఆ హక్కుని కల్పించింది. అయితే పోక్సో చట్టం కింద శిక్ష పడిన వారికి ఆ హక్కు ఉండకూడదు. ఆ దిశగా కేంద్రం అడుగులు వెయ్యాలి. చట్టాలను పునఃసమీక్షించాలి’అని సూచించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దోషి క్షమాభిక్ష పెట్టుకున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడాన్ని అభినందిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం -
నిర్భయ నిధుల పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ.. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. తమ పిల్లలో, ఇంట్లోని మహిళలో కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలుసుకోవాలని ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనన్న నిర్లక్ష్యపూరిత జవాబే ఎక్కువగా పోలీసుల నుంచి వస్తోందని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించింది. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు రేప్‌చేసి, చంపేసి, మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో’ అని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. నిర్భయ నిధి సహా మహిళల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలను.. రాష్ట్రాలు, యూటీల్లో వాటి అమలును సమగ్ర నివేదిక రూపంలో తమకు అందించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు -
నిర్భయతో అభయం ఉందా?
‘ఒక హంతకుడు శరీరాన్ని మాత్రమే చంపుతాడు, కానీ ఒక రేపిస్టు ఆత్మను చంపేస్తాడు. బాధితురాలిపైనా, ఆ కుటుంబం పైనా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా పడే ప్రభావం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది’అని ఓ కేసు విచారణ సమయంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ అన్నారు. ఇవాళ, రేపు మహిళలపై జరిగే నేరాలు ఘోరాల్లో శరీరాన్ని, ఆత్మని రెండూ చంపేయడం ఎక్కువైపోయింది. దీనికి కారణం నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడమే. తర్వాత కాలంలో నిర్భయ చట్టానికి మరింత పదును పెట్టారు కానీ ఆ చట్టం కింద శిక్షలు వేయడంలో అలసత్వం కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంతో నేరాలకు అడ్డుకట్ట పడలేదన్న విమర్శలున్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడిన 4.5 లక్షల మంది వివరాలను డిజిటలైజ్ చేసింది. అయితే అత్యాచార కేసుల్లో శిక్షలు పూర్తిగా పడటం లేదు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అత్యాచార కేసుల్లో 1973లో 44శాతం మందికి శిక్షలు పడ్డాయి. అదే 2016 నాటికి శిక్షలు పడిన కేసులు 18.9 శాతానికి పడిపోయాయి. ప్రతీ 4 కేసుల్లో 1 కేసులో మాత్రమే శిక్ష పడుతోంది. ఇక కోర్టులు తగిన సంఖ్యలో లేకపోవడం, కోర్టుల్లో న్యాయమూర్తులు, సిబ్బంది కొరతతో పెండింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం అత్యాచార కేసులు విచారించడానికి వెయ్యికి పైగా ప్రత్యేక కోర్టులు ఏర్పరచాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 727 జిల్లాల్లో ఏకకాలంలో అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు విధిస్తేనే భారత్‌లో మహిళల భద్రత ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నీరుకారిపోతున్న నిర్భయ నిధులు నిర్భయ ఘటన తర్వాత అప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మహిళలకు అండ దండగా ఉండటానికి రూ.వెయ్యి కోట్ల నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అదిప్పుడు రూ.3,600 కోట్లకు చేరుకుంది. ఈ నిధుల విడుదల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంటే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిధుల వాడకాన్ని నీరు కారుస్తున్నాయి. 2013లో ఈ ని«ధుల్ని ఏర్పాటు చేసినప్పటికీ విడుదల మాత్రం 2015 నుంచే జరుగుతోంది. కేంద్రం విడుదల చేసిన నిధులే 42 శాతమైతే.. రాష్ట్రాలు వాటిని 20 శాతం కూడా వాడకపోవడంతో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మహిళల రక్షణకు నిధుల్ని విడుదల చేస్తున్న పథకాలివీ... ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ సెంట్రల్ విక్టిమ్ కాంపన్సేషన్ ఫండ్ సైబర్ క్రైమ్ అగైనెస్ట్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వన్ స్టాప్ స్కీమ్... మహిళా పోలీసు వాలంటీర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ వుమెన్ హెల్ప్‌లైన్ స్కీమ్ పైసా కూడా వినియోగించని రాష్ట్రాలు మణిపూర్ మహారాష్ట్ర లక్షద్వీప్ -
రాయచూరులో మరో నిర్భయ ఘటన?
సాక్షి, రాయచూరు: ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవితను అందుకుంటుందని ఆశించిన ముద్దుల కూతురు అనాథ శవమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ప్రేమపేరుతో వెంటాడి వేధించిన ఓ యువకుడే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మరో నిర్భయ ఘోరాన్ని తలపించే ఈ విషాదంపై సినీ, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తుండడం, తల్లిదండ్రులు తమ బిడ్డది ముమ్మాటికి హత్యేనని చెబుతుండడంతో చర్చనీయాంశమైంది. ఏం జరిగింది వివరాలు.. మధు పత్తార్ రాయచూరు నగరంలో ఐడీఎస్ఎంపీ లేఔట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తండ్రి నాగరాజు పత్తార్ స్వర్ణకారుడు, తల్లి రేణుక గృహిణి. నగరంలోని నవోదయ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. నిత్యం కాలేజీకి వచ్చి వెళ్లేది. ఈ నెల 13న ఇంటర్నల్ పరీక్షలకు వెళ్లిన అమ్మాయి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఎక్కడికీ పోదు, వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు తప్ప కేసు నమోదు చేసుకుని గాలించలేదు. మూడురోజులు గడిచిపోయాయి. 16వ తేదీన నగరంలోని మాణిక్ ప్రభు దేవాలయం వెనుకభాగంలో నిర్మానుష్యంగా వున్న గుట్టలపై యువతి శవం కనిపించింది. పోలీసులు ఆరా తీయగా అది మధు పత్తార్దేనని తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తించారు. పలు అనుమానాలు ‘నేను ఇంజనీరింగ్ కోర్సులో పలు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. నా మరణానికి నేనే బాధ్యురాలిని’ అని ఉత్తరం మృతదేహం దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎండిపోయిన చెట్టుకు ఉరి వేసుకోవడానికి ఆస్కారం లేదు. ఆమె కూర్చున్న స్థితిలో ఉరివేసుకుని ఉంది. ఇది ఎలా సాధ్యమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సూసైడ్ నోట్ కన్నడలో రాసి ఉంది. తమ కూతురికి కన్నడ రాయడం అంతగా రాదని, హంతకుడే ఆ లేఖను రాసి ఆమెతో సంతకం చేయించి ఉంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం చేయాలి: మధు తల్లి మొర అనుమానాస్పద రీతిలో మరణించిన తమ కూతురు, విద్యార్థిని మధు పత్తార్ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లి రేణుక కోరారు. శనివారం ఇక్కడ పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నెల 25వ తేదీన నగరంలో విద్యార్థులు, ప్రజలు, సంఘ సంస్థల సహకారంతో భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. మధు తండ్రి నాగరాజు, విశ్వకర్మ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అతనిపైనే సందేహాలు సుదర్శన్ యాదవ్ అనే యువకుడు ఐదు నెలల నుంచి ప్రేమపేరుతో మధు పత్తార్‌ను వెంబడిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని ఒత్తిడి చేసేవాడు. మధు అంగీకరించకపోవడంతో తనకు దక్కని ఆమె ఇంకొకరికి దక్కరాదని కక్ష పెంచుకున్నాడు. అర్జంటుగా మాట్లాడాలనే నెపంతో గుట్టలపైకి పిలుచుకెళ్లి చంపి చెట్టుకు వేలాడ దీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రలు, సంఘ సంస్థల నాయకులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక రావాలి 13వ తేదీనే మధు విగతజీవిగా మారింది. 16న మృతదేహం బయటపడింది. ఎండలకు మృతదేహం కమిలిపోయి గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. నేతాజి నగర్ పోలీసులు కేసు నమెదు చేసుకున్నారు. ఇది హత్యేనని, హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడు సుదర్శన్ యాదవ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడని, అతన్ని విచారిస్తున్నారని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే హత్య, ఆత్మహత్యనా? అనేది చెప్పగలమని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
డీఎస్ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
అజ్ఞాతంలోకి సంజయ్.. పోలీసుల గాలింపు
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. (శాంకరి కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాం) సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించిన విషయం విదితమే. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. 'అది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం' -
ఏళ్లు గడిచాయి.. ఇంకెన్నిసార్లు చెప్పాలి...?
న్యూఢిలీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనను అంత తేలికగా మర్చిపోలేం. నిర్భయ మరణ వాంగ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించి.. దోషులకు గతేడాది ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ కేసులో తీర్పు వచ్చింది కానీ ఇంకా న్యాయం మాత్రం జరగలేదంటూ ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము ఓటు వేయబోవడం లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా ఉన్న ప్రధాని మోదీ.. ‘మీరు ఓటు వేయడానికి వెళ్లేటపుడు నిర్భయను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని’ పిలుపునిచ్చిన విషయాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి గుర్తు చేస్తూ.. ‘వచ్చే ఎన్నికల్లో నేను ఎవరికీ ఓటు వేయను. నాకు ఇంకా ఎవరిపై నమ్మకం, ఆశలు లేవు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తీర్పు కాగితాలకే పరిమితం.. ‘నా కూతురి చావుకి కారకులైన మృగాళ్లకు సంబంధించిన తీర్పు కాగితాలకే పరిమితమైంది. అంతేకాదు గత ఆరేళ్లుగా నిర్భయ నిధులను సీసీటీవీల కొనుగోలు కోసం వెచ్చించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా ఉపయోగిస్తుందో కూడా మేము ప్రశ్నిస్తూనే’ ఉన్నామని ఆశాదేవి పేర్కొన్నారు. ‘ఎంతో మంది తల్లిదండ్రులు, అమ్మాయిలు చట్ట పరమైన సలహాల కోసం తనను ఆశ్రయిస్తున్నారని.. ఆ సమయంలో ఆరేళ్లుగా తన కూతురు కోసం తానెలా పోరాడానో వారికి చెప్పగలుగుతున్నానే తప్ప.. కానీ పూర్తి న్యాయం జరిగినట్లు నాకు అనిపించడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలెన్ని వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు.. ‘సరిగ్గా ఏడాది క్రితం అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును మేము స్వాగతించాం. కానీ శిక్ష మాత్రం అమలు కావడం లేదు. న్యాయం జరగడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో.. మా కూతురుని కోల్పోయి ఆరేళ్లు గడిచింది. ఇప్పటికీ ఆమె అత్యాచారానికి గురైందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తుంది’ అంటూ నిర్భయ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా కథువా, ఉన్నావ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని నిర్భయ తండ్రి బద్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2017లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా నిర్భయ కేసులో ఇద్దరు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా తరపు లాయర్లు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘ఒక వ్యక్తి మరణించాలా లేదా జీవించాలా అనే అంశం కోర్టు నిర్దారించలేదని.. శిక్ష వల్ల నేరస్థులను చంపగలమే కానీ నేరాన్ని కాదని’ వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను రిజర్వులో పెట్టింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు బస్సులో నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. -
కఠిన చట్టాలే పరిష్కారమా?
అత్యంత అమానుషమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమాజం మొత్తం కదిలిపోతుంది. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. వాటికి తగ్గట్టుగానే ప్రభు త్వాలు కూడా స్పందిస్తాయి. ఆరేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో దుండగులు ఒక యువతిని క్రూరంగా హింసించి సామూహిక అత్యాచారం చేసినప్పుడు ఏ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చెలరేగాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. పర్యవసానంగా నిండా రెండు నెలలు తిరగకుండా ఆనాటి యూపీఏ ప్రభుత్వం లైంగిక నేరాలపై తీవ్ర చర్యలకు వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అంతే వేగంగా ఆ తర్వాత దాని స్థానంలో నిర్భయ చట్టం కూడా వచ్చింది. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో దుండగులు ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, ఆరు రోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి ఆమె ఊపిరి తీసిన ఉదంతం వెల్లడయ్యాక మరోసారి దేశం అట్టుడికిపోయింది. అన్ని వర్గాల ప్రజలూ ఆ ఉదంతంపై స్పందించారు. దుండగులకు అనుకూలంగా ఆ రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు ప్రకటనలివ్వడం, ఆ పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాలతో ఊరేగి సంఘీభావం ప్రకటించడంలాంటి చర్యలపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నాకే తీరు మారింది. ఆ వెంబడే బాలికలపై అత్యాచారాలకు పాల్పడే నేరగాళ్లకు యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష విధించేందుకు వీలు కల్పిస్తూ, అందుకోసం భారత శిక్షాస్మృతికి, లైంగిక నేరగాళ్లనుంచి పిల్లలను పరిరక్షించడానికుద్దేశించిన పోక్సో చట్టానికి సవరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అంతకంతకు పెరుగుతున్న లైంగిక నేరాలపై అందరిలో ఆందోళన నెలకొంది. ఏం చేస్తే దీనికి అడ్డుకట్ట పడుతుందన్న అంశంలో ప్రభుత్వాలకు స్పష్టత లేకుండా పోయింది. విపక్షంలో ఉన్నవారు ప్రభుత్వంపై విరుచుకుపడటం, ‘మీ హయాంలో ఇలాంటివి జరగలేదా’ అంటూ అధికార పక్ష నేతలు జవాబివ్వడం రివాజైంది. పౌర సమాజ కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు ఈ అంశంలో ఎన్నోసార్లు ప్రభు త్వాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన వాటికవే ఏ అన్యాయాన్నయినా రూపుమాపలేవని చెబుతూనే ఉన్నారు. కానీ ఆ వైపుగా పాలకులు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. నిర్భయ చట్టం వచ్చినప్పుడు ఇకపై లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని అనేకులు విశ్వసించారు. కానీ అందుకు విరుద్ధంగా అవి పెరుగుతున్నాయి. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒదిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. నేరాలపై సత్వర దర్యాప్తు, నిందితుల అరెస్టు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ, న్యాయస్థానాల్లో చకచకా విచారణ, త్వరగా వెలువడే తీర్పు నేరగాళ్లను భయకంపితుల్ని చేస్తాయి. నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ నేతృ త్వంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ దేశవ్యాప్తంగా వచ్చిన 80,000 సూచనల్ని అధ్యయనం చేసి, వాటిపై చర్చించి విలువైన సిఫార్సులు చేసింది. అదే స్థాయిలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి ఉంటే నిర్భయ చట్టంతోపాటు లైంగిక నేరాల కట్టడి కోసం ప్రత్యేక చర్యలు అమలయ్యేవి. పసివాళ్లపై అత్యాచారాలు నిరోధించడానికై ఆ నేరాలకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ మొన్న జనవరిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు ‘అన్నిటికీ మరణశిక్షే జవాబు’ అనే ధోరణి సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ అభిప్రాయపడ్డారు. ఇంతలోనే వైఖరి మార్చుకోవడానికి కారణం కథువా ఉదం తంపై జనంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను గమనించడం వల్లనేనని సులభంగానే చెప్పవచ్చు. సమాజంలో నిస్సహాయులుగా ఉండేవారిపైనే అత్యధికంగా నేరాలు జరుగుతాయి. వీటిల్లో అణగారిన వర్గాలవారు, మహిళలు, పిల్లలే బాధితులు. వీరి రక్షణకు ఉద్దేశించిన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించాలని, అలసత్వాన్ని ప్రదర్శించేవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జస్టిస్ వర్మ కమిటీ సూచించింది. బాధితులపట్ల పోలీసులు, ఆసుపత్రులు ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పింది. అత్యవసర సమయాల్లో స్పందించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. నేరగాళ్లకు రాజకీయ రంగం అండదండ లందించడాన్ని ప్రస్తావించి దాన్ని సరిచేయాలని కోరింది. ఈ సూచనలన్నీ పట్టిం చుకుని ఉంటే... బూతు చిత్రాల పరివ్యాప్తిని అరికట్టకలిగి ఉంటే మహిళలపై, పసివాళ్లపై అత్యాచారాలు ఈ స్థాయిలో పెచ్చరిల్లేవి కాదు. అందుకు భిన్నంగా నేరగాళ్లకు పోలీసులు మొదలుకొని రాజకీయ నేతలవరకూ అందరి అండదండలూ లభిస్తున్నాయి. బాధితుల గోడు వినిపించుకునేవారే కరువవుతున్నారు. వీటిని చక్క దిద్దకుండా కఠిన శిక్షలు అమల్లోకి తీసుకురావడంవల్ల ఎంతవరకూ ప్రయోజం ఉంటుంది? అది మరో నిర్భయ చట్టంలా మారే అవకాశం లేదా? పైగా పసివాళ్లపై అత్యాచారానికి పాల్పడేవారిలో 95 శాతంమంది వారికి తెలిసినవారేనని గణాం కాలు చెబుతున్నాయి. ఆ నేరానికి గరిష్టంగా మరణశిక్ష విధించడం వల్ల బాధిత కుటుంబాలపై ఒత్తిళ్లు ఎక్కువై అసలు కేసే బయటికి రాకుండా చూసే ప్రమాదం లేదా? ఇప్పుడు ఆర్డినెన్స్ ఎటూ తీసుకొచ్చారు. దీని స్థానంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడైనా సమగ్ర చర్చ జరిగి ఇతరత్రా నివారణ చర్యలపై దృష్టి పెట్టడం ముఖ్యమన్న ఎరుక కలగాలి. సమాజంలో పతనమవుతున్న విలువల పరి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటో ఆలోచించాలి. -
అత్యాచార బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు ?
నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా రోజు రోజుకి ఈ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అత్యాచార బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోతోంది. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులతో దేశవ్యాప్తంగా మహిళలు దోషులకు కఠిన శిక్షలు విధించాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని గళమెత్తుతున్నా పట్టించుకునే వారే లేరు. 2012 నిర్భయ ఘటనతో యావత్ భారతదేశం చలించిపోయింది. యువతీ యువకులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరో ఆడపిల్లకి ఇంత దుర్భర స్థితి రాకూడదని, అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కిరాతకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. కేసుల విచారణను కూడా త్వరితగతిని పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎన్ని చట్టాలు వచ్చినా తమను ఏం చేయలేవన్న ధీమా రేపిస్టుల్లో పెరిగిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. 2012 నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచార కేసులు 60 శాతం పెరిగితే, చిన్నారులపై రేప్ కేసులు 40 శాతం పెరిగాయి. అయితే 25శాతం కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2016 చివరి నాటికి లక్షా 33 వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నాటికి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అప్పట్నుంచి పెండింగ్ కేసుల సంఖ్య ప్రతీ ఏడాది 85 శాతం పెరుగుతూ వస్తోంది. 2012, 16 మధ్య నమోదైన వాటిలో మూడో వంతు కేసులు పోలీసు స్టేషన్ పరిధిలోనే నీరు కారిపోతున్నాయి. ఉన్నావ్ వంటి కేసుల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదైంది తప్పితే ఎంత ఘాతుకం జరిగినా పోలీసుల్లో కాస్త కూడా చలనం కనిపించడం లేదు. అత్యాచార కేసులపై రాజకీయ ప్రభావం ఉండడంతో వాటి అతీ గతీ ఎవరికీ పట్టడం లేదు. కేవలం అత్యాచార కేసుల పరిశీలన కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోలీసు అధికారుల నియామకానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయినా ఆ పోస్టుల్లో నాలుగో వంతు ఖాళీగానే ఉండడంతో చాలా కేసులు కోర్టు వరకూ కూడా చేరడం లేదు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ కేసుల విచారణకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసుల విచారణ ఇంత నత్తనడకన సాగుతూ ఉంటే ఎన్ని రకాలు చట్టాలు తీసుకువచ్చి ప్రయోజనమేముందనే అభిప్రాయం వ్యక్తం సర్వత్రా అవుతోంది. -
పట్టపగలే మరో ప్రేమోన్మాదం!
హైదరాబాద్: రాజధానిలో పట్టపగలే మరో ప్రేమోన్మాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన యువకుడు ఆమె తిరస్కరించడంతో కక్షకట్టాడు. యువతి ఇంట్లోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. 60 శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్ గోల్నాక గంగానగర్‌లో నివసించే అర్షియాబేగం భర్త రియాజుద్దీన్ అన్సారీ కొంతకాలం క్రితం మృతిచెందారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్న అర్షియా.. తన కుమార్తె తబస్సుమ్ బేగం (17), ఇద్దరు కుమారుల్ని పోషిస్తోంది. పదో తరగతితో చదువు మానేసి, ఇంట్లోనే ఉంటున్న తబస్సుమ్‌ను గోల్నాక మార్కెట్లో కూరగాయల వ్యాపారైన సోహెల్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. తబస్సుమ్‌కు ఇటీవలే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇది తెలుసుకున్న సోహెల్ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోకి ప్రవేశించి ప్రేమించాలంటూ వేధించాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి, యువతి ఇంట్లోని కిరో సిన్ తీసుకొని ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు తాళలేకపోయి న ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కలవారు మంటలార్పి ‘108’ సాయంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు సోహెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. తబస్సుమ్‌కు నిప్పంటించే క్రమంలో అతనికీ గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడి, హత్యాయత్నం చేసిన నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, కాకినాడ : ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ఐఎస్టీ డైరెక్టర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. వైవా పరీక్షల సందర్భంగా ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సరం విద్యార్థినుల పట్ల బాబులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణాలు ఉన్నాయి. కాగా ఈ వ్యవహారంపై వర్శిటీ... ఇప్పటికే ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. ప్రొఫెసర్ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దీనిపై 254, 254ఎ, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయ్యాయి. ఇవాళ ప్రొఫెసర్ బాబులును అదుపులోకి తీసుకున్నారు.