Putta sudhakar yadav
-
మైదుకూరు టీడీపీలో ముసలం
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం జెండా మోసిన నియోజకవర్గ ఇన్చార్జిలకు అధిష్టానం మొండిచేయి చూపనుందా? సర్వేల పేరుతో పక్కన పెడుతున్నారా? అనూహ్యంగా ఆయా మాజీ నేతలను తెరపైకి తెస్తున్నారా.. అంటే..రాజకీయ విశ్లేషకులు ఔనని సమాధానమిస్తున్నారు. ఆ మేరకే జిల్లాలో మూడు నియోజకవర్గాలల్లో ప్రధానంగా మార్పులు చేర్పులు చేయాలనే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం ఒక్కటి. ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డిని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్ మైదుకూరు నుంచి తలపడి వైఎస్సార్సీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. వరుసగా ఓటమి మూటగట్టుకున్న సుధాకర్‌యాదవ్ మరోమారు 2024లో పోటీలో తలపడి అదృష్టం పరీక్షించుకోవాలని తలచారు. కాగా టీడీపీ అధిష్టానం చేయించుకున్న సర్వేలు పుట్టాకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. మైదుకూరులో టీడీపీ పట్ల అంతంత మాత్రమే ఆదరణ లభించగా, వ్యక్తిగత సర్వేల్లో పుట్టా సుధాకర్ బాగా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో పుట్టా స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్‌ను తీసుకొస్తే పోటీ ఇవ్వగలమనే అంచనాకు టీడీపీ అధినేత వచ్చినట్లు తెలుస్తోంది. ఆమేరకు సమాలోచనలో పడినట్లు సమాచారం. డీఎల్‌తో చర్చించేందుకు సన్నాహాలు.... టీడీపీ నిర్వహించిన సర్వేల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డితో చర్చించేందుకు ఆ పార్టీ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలను హైదరాబాద్ పార్టీ కార్యాలయం కేంద్రంగా ఇద్దరు నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఆ ఇద్దరు నేతలు మైదుకూరుపై కూలంకషంగా చర్చించిన తర్వాత అధినేత చంద్రబాబుతో మంతనాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు తొలిదశ చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. సంపూర్ణంగా మరోమారు వారంలోపు చర్చించిన పిదప అధినేతతో అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే డీఎల్‌తో ముఖాముఖీ నిర్వహించినున్నట్లు విశ్వసనీయ సమాచారం. పుట్టా సుధాకర్‌యాదవ్ కినుక... అధిష్టానం నుంచి సర్వే సంకేతాలు అందుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్ డైలామాలో పడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్ లాంటి ప్రధాన నాయకుల పర్యటనలో మినహా తర్వాత రోజులల్లో మైదుకూరులో కన్పించడం లేదు. పక్షం రోజులకు ఓమారు అలా వచ్చి వెళ్తున్నారు. నారాలోకేష్ యువగళం పర్యటన, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాలల్లో మాత్రమే నియోజకవర్గంలో పుట్టా కన్పించడం విశేషం. మైదుకూరు టీడీపీ టికెట్‌పై స్పష్టత లేకపోవడం, అధిష్టానం ప్రత్యామ్నాయ చూపులను పసిగట్టిన పుట్టా సన్నిహితుల వద్ద టీడీపీపై మండిపడుతోన్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కమలాపురంలలో సైతం.... టీడీపీ అధిష్టానం ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే, విజయం కోసం కృషి చేయాలని, తర్వాత మీ భవిష్యత్ నాదేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాతే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరులో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కమలాపురంలో టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిది సైతం అదే పరిస్థితి. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే దిశగా సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమారు కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరికలు పంపినట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ మాజీ నేత పట్ల టీడీపీ అధినేత ఆకర్షితులవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు. -
రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’
సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ టిక్కెట్ నాకంటే నాకంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌లు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. దీంతో పచ్చ పార్టీలో రచ్చ రోడ్డెక్కింది. పార్టీలో చేరకుండానే సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశారు. ఔట్‌డేటెడ్ డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గం తేల్చి చెబుతోంది. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. చదవండి: టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. జులై నెల నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. దశాబ్దకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న డీఎల్ ఇటీవలి కాలంలో అధికార పార్టీపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మధ్యే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను డీఎల్ హైదరాబాదులో కలిశారు. తర్వాత నియోజకవర్గానికి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తన అనుయాయులతోపాటు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పిన డీఎల్ అందుకోసం వేద పండితులను సంప్రదించి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని టీడీపీ అధిష్టానంపై డీఎల్ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తప్ప మిగిలిన వ్యక్తులు ఇప్పటివరకు గెలువలేదని చంద్రబాబు, లోకేష్‌లకు గణాంకాలతో డీఎల్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకే టిక్కెట్ ఇవ్వాలని, ఒకవేళ సుధాకర్ యాదవ్‌కు ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదని డీఎల్ తేల్చి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో వెనుదిరిగి వచ్చిన ఆయన తనకే టిక్కెట్టు అంటూ మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. డీఎల్‌ది మైండ్ గేమ్....టిక్కెట్ నాదే! రాబోయే ఎన్నికల్లోనూ మైదుకూరు టిక్కెట్ తనకేనని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ధీమాగా ఉన్నారు. డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన మూడు రోజుల కిందట పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం డీఎల్ మైండ్ గేమ్ మాటలు ఎవరూ నమ్మవద్దని నియోజకవర్గంలోని తన వర్గీయులకు తేల్చి చెప్పారు. సుధాకర్ యాదవ్ ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఆర్థికంగా నష్టపోయాడని, రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితోపాటు ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఆయనకు రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గం మొత్తం సుధాకర్ యాదవ్‌కు అండగా నిలవనుందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో సుధాకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గం ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు డీఎల్ చెప్పిన రెడ్డి సామాజిక వర్గ సెంటిమెంట్‌ను పదేపదే చంద్రబాబు, లోకేష్ చెవిలో వేస్తున్నట్లు తెలుస్తోంది. రచ్చకెక్కిన వర్గ విబేధాలు మైదుకూరు టీడీపీ టిక్కెట్ తనకేనంటూ డీఎల్ రవీంద్రారెడ్డి తెరపైకి రావడంతో పార్టీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. సుధాకర్‌యాదవ్‌ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు డీఎల్‌కు టిక్కెట్ అంటూ ప్రచారం చేస్తుండగా సుధాకర్‌యాదవ్‌కు టిక్కెట్ ఇ వ్వకపోతే పార్టీనే వీడుతామని ఆయన అనుచరవ ర్గం అంటున్నారు. ఒకవేళ డీఎల్‌కు టిక్కెట్టు ఇచ్చినా ఆయనను ఓడగొట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మైదుకూరు టీడీపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ప్రత్యర్థి వర్గం సహకరించే పరిస్థితి లేదు. -
‘నిరూపించకపోతే సెంటర్లో నిలబడి లెంపలేసుకో’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అటవీ భూముల ఆక్రమణపై టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపణలను మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆసైన్మెంట్ కమిటీ ద్వారా ఎంతో మంది పేదలకు పట్టాలు ఇచ్చినట్లు, బి.మఠంలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. తను అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు చేసిన ఆరోపణలను నెల రోజుల్లో నిరూపించాలని పుట్టా సుధాకర్ యాదవ్‌కు సవాల్ విసిరారు. (బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?) ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే హక్కు లేదన్నారు. తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. (ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా విజేతలు!) -
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
-
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ హిందూ దేవదాయ, ధర్మాదాయ చట్టం, 1987ను అనుసరించి ఈ నియామకం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డులో ఇతర సభ్యుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా తోడల్లుడు. వైఎస్ మరణం తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో స్థాపించిన వైఎస్సార్సీపీలో వైవీ దశాబ్ద కాలంగా క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో ఆయన ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలోనూ,వెలుపల పోరాడారు. హోదా కోసం సహచర ఎంపీలతోపాటు ఆయన తన పదవిని త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయక పోయినా పార్టీ గెలుపు కోసం గట్టి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. కాగా, తనను టీటీడీ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుమలకు బయలుదేరిన సుబ్బారెడ్డి మార్గ మధ్యలో తిరుపతి పద్మావతిపురంలో ఉంటున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అతంతరం వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారి మెట్ల మార్గం మీదుగా తిరుమల వెళ్లారు. పాత పాలక మండలి రద్దు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సహా పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ముగ్గురు సభ్యులతో మిగిలిన దేవస్థానం పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ పాలకమండలి సమావేశం కావాలంటే కనీసం ఐదుగురు సభ్యుల కోరం అవసరమని, పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి ముగ్గురు సభ్యులే మిగలడం వల్ల ఈ పాలకమండలి కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండదని టీటీడీ ఈవో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరడంతో పూర్తి స్థాయిలో కొత్త పాలక మండలి ఏర్పాటుకు వీలుగా పాత పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, జీవో జారీ
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అలాగే గత పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. త్వరలో కొత్త బోర్డు సభ్యుల నియామకం చేపట్టనుంది. కాగా నూతన చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు గరుడ ఆళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. -
టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు స్థానం నుంచి పోటీ చేయకుండా ఉండి పోయారు. కాగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా రాజీనామా
-
టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా
సాక్షి, తిరుమల: ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. కానీ, టీటీడీ పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. సాంకేతిక అంశం సాకుతో నిన్న మొన్నటి వరకూ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేది లేదని... తమని ప్రభుత్వం నియమిస్తేనే ప్రమాణ స్వీకారం చేశామని, వాళ్లు రద్దు చేస్తేనే పదవులు వదులుకుంటామని, స్వచ్చందంగా మాత్రం రాజీనామా చేయనంటూ పుట్టా సుధాకర్ యాదవ్ భీష్మించుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన చివరకు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌పై ఫిర్యాదు
సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఫిర్యాదు చేశారు. తాను సిఫారసు చేసిన వారిందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ స్విమ్స్ డైరెక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలని సుధాకర్ యాదవ్ కోరుతుండటంతో స్విమ్స్ డైరెక్టర్ ఈ విషయంపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ నిర్వహించిన టీటీడీ అధికారులు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా..ఆ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ ఇంకా అదే పదవిలో కొనసాగుతుండటం గమనార్హం. -
అర్ధాంతరంగా ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం
-
కొండపై రాజకీయం
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు. టీటీడీ అధికారుల తీరుకు నిరసనగా పాలకమండలి సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చైర్మన్ పుట్టా చెప్పారు. తిరుమల జేఈవోపై విమర్శలు గత ప్రభుత్వం హయాంలో నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల అన్నమయ్య భవన్లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభం కాగానే తిరుమల జేఈవోపై పలువురు బోర్డు సభ్యులు దర్శన టికెట్లకోసం విమర్శలు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి విషయాలు జేఈవో పరిధిలోనిది అని బోర్డు సభ్యులకు ఈవో ఎకె సింఘాల్ వివరించారు. అనంతరం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన రాజీనామా లేఖను ఈవోకు ఇచ్చి వెళ్లిపోయారు. మరో పది నిమిషాల తర్వాత బోర్డు చైర్మన్ పుట్టా కూడా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాలకమండలి కొనసాగుతుందని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. రాజీనామా చేసే యోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము నడుచుకుంటామని తెలిపారు. అంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీటీడీ సమావేశాన్ని బహిష్కరించిన ఈవో, జేఈవో
-
రసాభాసగా టీటీడీ పాలకమండలి సమావేశం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులు బయటకు వచ్చారు. పాలకమండలి సభ్యత్వానికి చల్లా రామచంద్రారెడ్డి (బాబు) రాజీనామా చేయడంతో కార్యదర్శి హోదాలో టీటీడీ ఈవో సమావేశం నిర్వహించాల్సింది. కానీ టీటీడీ అధికారులు సమావేశాన్ని బహిష్కరించడంతో బోర్డు తీర్మానాల అమలు కోసం నిర్వహించిన సమావేశం అర్థాంతరంగా ముగిసింది. అంతకు ముందు బోర్డు సభ్యుడుగా ఇచ్చిన లెటర్ పై ఎందుకు దర్శనాలు ఇవ్వటంలేదని సభ్యుడు చల్లాబాబు అధికారులను నిలదీశారు. అధికారులు ససేమిరా అనటంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు చల్లా బాబు. తీరు మారకపోవటంతో.. చల్లా రామచంద్రారెడ్డి పాలమండలికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. నెల రోజుల క్రితమే పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని.. అందులో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు చైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియాకు తెలిపారు. సమావేశంలో తాము వేచి చూసినా అధికారులు రాలేదన్నారు. తమని ప్రభుత్వం నియమిస్తేనే ప్రమాణ స్వీకారం చేశామని, వాళ్లు రద్దు చేస్తేనే పదవులు వదులుకుంటామన్నారు. స్వచ్చందంగా మాత్రం రాజీనామా చేయమన్నారు. ఇక టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి చల్లా బాబుతో పాటు పార్థసారథి, రాయపాటి, బోండా ఉమలు కూడా రాజీనామా చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి ప్రయత్నించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. -
‘ఆ బంగారం’ లెక్క తేల్చేందుకేనా
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించనుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. సాంకేతికంగా నిర్వహించుకోవచ్చన్న సాకు చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి రంగం సిద్ధంచేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పాలక మండలి సమావేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం వివాదానికి క్లీన్చిట్? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏప్రిల్ 17న తమిళనాడు నుంచి తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఎటువంటి భద్రతా ఏర్పాట్లులేకుండా సాధారణ వాహనంలో సుమారు రూ.450 కోట్లు విలువ చేసే బంగారాన్ని తరలించడం.. దానిని తమిళనాడులో ఎన్నికల అధికారులు పట్టుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. బంగారాన్ని పట్టుకున్న సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు అది టీటీడీదని అన్నారు. మరోవైపు.. ఆ బంగారం తమది కాదని టీటీడీ ఈఓ విస్పష్టంగా చెప్పారు. ఆ తరువాత కొంత సమయానికే ఆయన మాటమార్చి పట్టుబడ్డ బంగారం టీటీడీదేనని చెప్పుకొచ్చారు. దీంతో అక్రమ బంగారాన్ని సక్రమం చేశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ తరువాత కూడా టీటీడీ రకరకాల ప్రకటనలు చేసి ప్రజల్లో అనుమానాలకు ఆస్కారమిచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాల మేరకు ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ తిరుపతిలో విచారణ చేపట్టారు. ఆ నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. అయితే, అది ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఇలాగే.. టీటీడీకి సంబంధించిన బంగారం, నగదును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు టీటీడీ అధికారులు, మరికొందరు పాలక మండలి సభ్యులు కమీషన్లకు కక్కుర్తిపడి కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని ప్రచారంలో ఉంది. టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఈ రెండు ప్రధాన ఆరోపణల్లో వాస్తవంలేదని చెప్పుకునేందుకే ఈ టీటీడీ బోర్డు సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాజీనామా చేయకుండా.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న సందర్భంలో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. కానీ, టీటీడీ పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సాంకేతిక అంశం సాకుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాత్కాలిక నియామకాల కోసం.. ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో టీటీడీలో ఓ అధికారి.. ఇద్దరు బోర్డు సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఆ పది మంది నుంచి గతంలోనే భారీగానే మామూళ్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అదే విధంగా మరికొన్ని కాంట్రాక్టు పనులు ఖరారు చేసుకునేందుకు ఈ పాలక మండలి భేటీని కొందరు ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. టీటీడీ బోర్డును రద్దు చేయాలి చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలిని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ రద్దుచెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు? టీడీపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న కే రాఘవేంద్రరావు రాజీనామా చేయడం అభినందనీయం. ఆయనలాగే టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, పాలక మండలి సభ్యులు వెంటనే రాజీనామా చెయ్యాలి. అలా కాకుండా బోర్డు సమావేశం నిర్వహిస్తే అడ్డుకుంటాం. – నారాయణస్వామి, ఎమ్మెల్యే, గంగాధర నెల్లూరు గోవిందా.. ఇదేంటయ్యా..! గోవిందుని పాదాల చెంత నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్న బర్డ్ ఆస్పత్రి పరువును బజారు పాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పదవీ కాలం ఇంకా ముగియకమునుపే మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కొత్త బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సివుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నది నామినేటెడ్ బోర్డు అన్న విషయాన్ని సభ్యులు మరిచి డైరెక్టర్ పదవీ కాలం పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం రానుంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ బోర్డు అయితే పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డుకు సాధారణంగా అధికారం ఉండదు... బోర్డు రద్దు అవుతుంది. అయితే సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతి«థి గృహంలో బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశం హడావుడిగా జరిగింది. గంట పాటు వాడివేడిగా చర్చలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నారు. బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా గత 20 ఏళ్లుగా డాక్టర్ జగదీష్ కొనసాగుతున్నారు. గత టీటీడీ బోర్డు సమావేశంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని అజెండాలో చేర్చగా పలువురు తిరస్కరించారు. అత్యవసర సమావేశం ఎందుకు.? నామినేటెడ్ కిందకు వచ్చే బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. 450 పడకల అత్యంత ప్రతిష్టాత్మక బర్డ్ ఆస్పత్రికి డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత వుంది. అటువంటి నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త సభ్యుల సమక్షంలో తీసుకోవాలి. అయితే డాక్టర్ జగదీష్ పదవీ కాలం మరో నెల రోజుల పాటు ఉంది. ఈ దశలో పదవీ కాలం పొడిగింపు నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది. తొందర పాటు నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పడితే నామినేటెడ్ బోర్డులు రద్దు అవుతాయి. బోర్డు చైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేయడం సాధారణం. టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నియమించిన పలు బోర్డుల చైర్మన్లు, సభ్యులు రాజీనామాలు చేశారు. తిరుపతిలో తుడా చైర్మన్ నర్సింహయాదవ్ తన పదవీకి రాజీనామా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించి డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ తొందర పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల టీటీడీ అధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. మీడియాను పక్కదారి పట్టించిన వైనం శ్రీ పద్మావతి అతిధి గృహంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరుగుతుందని మీడియాకు లీకు కావడంతో సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా రు. సాయత్రం 4.50 గంటలకే బోర్డు సమావేశా న్ని ముగించారు. దీంతో సాయంత్రం 5 గంటల కు అతి«థి గృహం వద్దకు చేరుకున్న మీడియాకు సమావేశం ముగిసిందని అక్కడి వారు చెప్పడం తో అవాక్కయ్యారు.సమావేశంలో నిర్ణయాలను గోప్యంగా ఉంచారు. టీటీడీ పీఆర్వో విభాగం అధికారులు సమావేశానికి హాజరైనా కనీసం పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. టీటీడీ అధికారులు పత్రికా ప్రకటన విడుల చేయొద్దని పీఆర్వో సెక్షన్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. రహస్య సమావేశంలో బర్డ్ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు, బర్డ్ ఆస్పత్రిలో ఫైనాన్స్ సెక్షన్లో పోస్టు భర్తీతోపాటు ఆస్పత్రి నిర్వహణ ఇకపై బోర్డు అధీనంలో జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ బోర్డు సమావేశాన్ని నడిపించినట్లు సమాచారం. -
పోలింగ్ వేళ పుట్టాకు మరో షాక్
సాక్షి, దాపాడు: టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు తన కార్యకర్తలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మంగళవారం చియ్యపాడులో ముఖ్య టీడీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డిలు పార్టీని వీడగా.. బుధవారం కేతవరం గ్రామానికి చెందిన మండల తెలుగు యువత అధ్యక్షుడు నారపురెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారు. స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ కర్నాటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారు. నారపురెడ్డి మాట్లాడుతూ పదిహేనేళ్లుగా కార్యకర్తగా, ఐదేళ్లుగా తెలుగు యువత అ«ధ్యక్షుడిగా పని చేస్తున్నా తనను పుట్టా సామాజిక వర్గానికి చెందిన మండలంలోని ముఖ్య నాయకుడు వేధిస్తున్నాడని వాపోయారు. మంగళవారం రాత్రి గ్రామంలో కార్యకర్తలతో సమావేశం కాగా ముఖ్య నాయకుడు తనను కించపరిచేలా వ్యవహరించారన్నారు. దీంతో మనస్థాపం చెంది విలువలు లేని పార్టీలో ఉండలేక బయటకు వచ్చినట్లు తెలిపారు. పుట్టా ప్రయత్నాలు విఫలం.. కేతవరం గ్రామానికి చెందిన తెలుగు యువత మండల అధ్యక్షులు నారపురెడ్డికి మంగళవారం మండల ముఖ్య నాయకుడికి మద్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నారపురెడ్డి పార్టీని వీడుతున్న విషయం తెలుసుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్ తమ అనుచరులను సంధి కోసం పంపినా కుదరలేదు. దీంతో స్వయంగా పుట్టానే నారపురెడ్డి ఇంటికెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా.. టీడీపీలో ఉండలేనని, నేనే కాదని నాలా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని నారపురెడ్డి తెలుపగా చేసేదేమీ లేక పుట్టా వెళ్లిపోయారు. -
వామ్మో ఆ ఐటీ సోదాలు ఉత్తుత్తివేనా!?
సాక్షి ప్రతినిధి కడప : వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. వీటిపై ఇప్పుడు పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నిజంగా జరిగాయా.. లేక వారే కావాలని చేయించుకుని డ్రామా ఆడుతున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో బుధవారం సాయంత్రం ఐటీ అధికారులు తనిఖీలకు వెళ్లారు. ఇరువురు పోలీసులను మాత్రమే బందోబస్తుకు తీసుకెళ్లారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు సుధాకర్ తనయుడుతో కబుర్లలో మునిగిపోవడం, ఈలోపు సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితర టీడీపీ నేతలు అక్కడి చేరుకోవడం.. తనిఖీలు చేయాలని ఎవరు అదేశించారో చెప్పాలంటూ నానాయాగీ చేశారు. దీంతో ఐటీ అధికారులు వెనుతిరగడం అనుమానాలకు ఆస్కారమిచ్చింది. పైగా.. విధులకు ఆటంకం కల్గించినట్లు వారు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. సానుభూతే లక్ష్యంగా ఐటీ తనిఖీలు మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీమంత్రి రవీంద్రారెడి ్డకలిసికట్టుగా పనిచేస్తే అక్కడ మరే అభ్యర్థి అయినా నామమాత్రపు పోటీ ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల్లో పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలకు టీడీపీ పెద్దలు స్కెచ్ వేసినట్లు సమాచారం. సానుభూతి కోసమే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్ ఇంట్లోనూ ఇంతే.. సుధాకర్‌యాదవ్ ఇంట్లో జరిగిన సంఘటనకు రెండ్రోజుల అనంతరం శుక్రవారం ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోట్లదుర్తి గ్రామంలో యర్రగుంట్ల సీఐ వెంకటరమణ నేతృత్వంలో ఇవి జరిగాయి. వాస్తవానికి ఎంపీ స్థాయి ఇంట్లో తనిఖీలు చేయాలంటే కనీసం డీఎస్పీ స్థాయి అధికారి వెళ్లాలి. కానీ, యర్రగుంట్ల సీఐ తన పై అధికారులైన ఎస్పీ అభిషేక్ మహంతి, డీఎస్పీ మాసూం బాషాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా, కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. సీఎం రమేష్ సిఫార్సుల కారణంగానే ఆయన ఇక్కడకు వచ్చారని.. ఎంపీ వ్యూహంలో భాగంగానే వెంకటరమణ తనిఖీలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయినా, టీడీపీ నేతలు జిల్లా పోలీసు శాఖను, ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తుంటే.. టీడీపీ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు, పోలీసుల తనిఖీలు చోటుచేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మైదుకూరులో టీడీపీ నేతల బెదిరింపులు
-
మైదుకూరులో టీడీపీ నేతల బెదిరింపులు
సాక్షి, వైఎస్సార్: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో టీడీపీ నేతల బెదిరింపుల పర్వం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ మాట వినని వారిపై టీడీపీ నేతలు బెదిరించడమే కాకుండా నోటికి ఇష్టమెచ్చినట్టు దూషిస్తున్నారు. తాజాగా మైదుకూరులో టీటీడీ చైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేశ్ యాదవ్ రెచ్చిపోయారు. బ్రహ్మంగారి మఠం టీడీపీ అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే రత్నకుమార్ కుమారుడు బాలకృష్ణకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా బాలకృష్ణను బూతులు కూడా తిట్టారు. కాగా, మహేశ్ మంత్రి యనమల రామకృష్ణునికి అల్లుడు. -
ఐటీ పుట్టలో గుట్టు?
సాక్షి, కడప: టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఆదాయ పన్నుల శాఖ దాడులు వ్యూహాత్మకమేనా? నిజంగా చేపట్టారా.. అధికారుల, ఇటు టీడీపీ నాయకుల చర్యలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. ఐటీ అధికారుల తీరు, టీడీపీ నేతల రాద్ధాంతం పరి శీలిస్తే ఏదో మతలబు దాగి ఉందని స్పష్టమవుతోంది. పటిష్ట బందోబస్తు లేకుండా దాడులకు వెళ్లడం, విధులకు ఆటంకం కల్గించినా, అధి కారులు అక్కడి నుంచి జారుకోవడం...పైగా టీడీపీ నేతలు రాజకీయ ప్రసంగాలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రొద్దుటూరులో ఉంటున్న సుధాకర్ యాదవ్ ఇంటికి సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహాదేవ్, ప్రొద్దుటూరు ఐటీ అధికారులు లక్ష్మణరావు, రామలక్ష్మణ్ మరో అయిదుగురు కలిసి తనిఖీలకు వెళ్లారు. తనిఖీలకు సాధారణంగా పోలీసు ప్రొటెక్షన్ తీసుకుని వెళ్లడం సహజం. కానీ ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే వెంటబెట్టుకొని వెళ్లారు. సుధాకర్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో కుమారుడితో ఐటీ అధికారులు మాట్లాడారు. అరగంటలోపు టీడీపీ నేతలు రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డి లాంటి నాయకులంతా చేరుకున్నారు. మిమ్మల్ని ఎవరు పంపించారు. నరేంద్రమోదీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసికట్టుగా పథక రచన చేశారంటూ కేకలు వేయసాగారు. సుధాకర్ ఇంట్లో సోదా చేయమని ఎవరు చెప్పారో తేల్చాలని గట్టిగా నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తనిఖీకి వచ్చామని అధికారులు చెప్పుకొచ్చినా టీడీపీ నేతలు వినిపించుకోలేదు. అధికారుల బ్రీఫ్‌కేసులు తనిఖీలు చేస్తూ ఎంపీ రమేష్‌నాయుడు హంగామా చేశారు. దాంతో ఐటీ అధికారులు వెనుతిరిగారు. ఇదంతా ఓ నాటకాన్ని తలపించేలా ఉంది. ఇద్దరు పోలీసులను వెంటబెట్టుకొని సోదాలకు రావడం ఏమిటి? వచ్చిన వారు టీడీపీ నేతలు అడ్డగిస్తే వెనుక్కు వెళ్లడం ఏమిటీ? సెర్చి వారెంటు లేకుండా ఎందుకు వెళ్లారు. వారెంటు ఉంటే ఎందుకు తనిఖీలు పూర్తి చేయలేదు. పైగా విధులకు ఆటంకం కల్గించిన టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా అనుమానాలు రేకిత్తిస్తున్న అంశాలే. ముందే ఇంటివద్ద టీడీపీ నేతలు అందుకున్న పల్లవినే సుధాకర్ యాదవ్ కూడా వినిపించడం విశేషం. తన గెలుపును అడ్డుకునే చర్యల్లో భాగంగా సోదాలు చేయించారనడం మరింత అనుమానాలకు తావిస్తోంది. సానుభూతే అసలు లక్ష్యమా....? మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మంత్రి రవీంద్రారెడ్డి ఇద్దరు కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేస్తే అక్కడ మరే అభ్యర్థి అయినా నామమాత్రపు పోటీయేనని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ తరుణంలో ఐటీ సోదాలమైండ్‌గేమ్‌ను టీడీపీ పెద్దలు రచించారా? సానుభూతి కోసమే వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారా? ఈ గేమ్‌లో ఐటీ అధికారులు భాగస్వాములు అయ్యారా? లాంటి అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. విధులకు ఆటంకం కల్గిస్తే టీడీపీ నాయకులపై అధికారుులు ఎందుకు కేసులు పెట్టలేదు. ఇద్దరు పోలీసులను పంపడం వెనుక ఉన్న మతలబు ఏమిటీ? ఇదంతా కూడా స్థానికంగా ఉన్న అధికారులతో కలిసి టీడీపీ నేతలు పన్నిన ప్రణాలికగా పలువురు చర్చించుకోవడం విశేషం. -
బరితెగించిన సీఎం రమేష్
సాక్షి, ప్రొద్దుటూరు : సోదాలకు వచ్చిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. వారి విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా తమకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. టీటీడీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో చోటుచేసుకున్న ఈ బరితెగింపు వివరాలిలా ఉన్నాయి.. పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ఐటీ అధికారులు వచ్చారు. ఆ సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్ కుమారుడు మహేష్‌యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా మహేష్‌యాదవ్ కొన్ని పేపర్లను నలిపి బయట పడేయడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఇంతలో ఎంపీ సీఎం రమేష్, అతని వెంట కౌన్సిలర్ వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి పుట్టా ఇంట్లోకి కేకలు వేసుకుంటూ వెళ్లారు. సీఎం రమేష్ నేరుగా ఐటీ అధికారులందరిపై కేకలు వేశారు. ‘ఎవరు పంపారు, ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయడానికి మీకు ఎంత ధైర్యం’.. అంటూ మండిపడ్డారు. తనిఖీలు చేయకుండా అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను లోపలికి తీసుకెళ్లి వారి సాక్షిగా అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మిమ్మల్ని ఎవరు పంపారో మీడియాకు చెప్పాలంటూ కడప ఐటీ అసిస్టెంట్ కమిషనర్ మహాదేశ్పై తీవ్ర ఒత్తిడి చేశారు. ‘మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము తనిఖీలు చేస్తున్నాం.. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆయనన్నారు. దీంతో ఆయన చేతిలోని సూట్‌కేసును టీడీపీ నాయకులు లాక్కున్నారు. రమేష్ దానిని తెరిచారు. అందులోని పేపర్లను వీఎస్ ముక్తియార్ తీసి బయట వేయగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విసిరికొట్టారు. మీడియాలో భారీగా డబ్బు, బంగారం దొరికిందని వస్తోందని.. ఏమీ దొరకలేదని చెప్పాలంటూ అసిస్టెంట్ కమిషనర్‌ను ఎంపీ ఒత్తిడిచేశారు. మీరు ఏమీ దొరకలేదని చెప్పకపోతే మా వాళ్లు వందల మంది వస్తారని, లా అండ్ ఆర్డర్ తప్పుతుందని హెచ్చరించారు. చెప్పేంత వరకు బయటకు వెళ్లనివ్వబోమని చుట్టుముట్టారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వారి వాహనాల్లో వెళ్లిపోయారు. పక్కా సమాచారంతోనే సోదాలు మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి రెండు రోజుల కిందట భారీగా డబ్బు వచ్చిందన్న పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. తనిఖీల్లో ఆ డబ్బు ఎక్కడ బయట పడుతుందోనని రమేష్ వారి విధులకు ఆటంకం కలిగించినట్లు స్పష్టమవుతోంది. ఇంట్లో భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారని, దీంతో అధికారులపై దౌర్జన్యంచేసి వారు వెళ్లిపోయేలా చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, పుట్టా ఇంటికి చేరుకున్నారు. వారు మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులకు వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లో పథకం రూపొందించారని, కేంద్రంతో కలిసి దాడులు చేయించారని ఆరోపించారు. ఎస్కార్ట్‌గా ఇద్దరు కానిస్టేబుళ్లే.. జిల్లా ఐటీ అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు మరో ఏడుగురు అధికారులు అధికార పార్టీ నాయకుని ఇంట్లో సోదాలు చేసేందుకు వస్తే పోలీసు అధికారులు కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ నాయక్, డీఎస్పీ శ్రీనివాస్‌రావు వచ్చి ఘటనపై వాకబు చేసి వెళ్లిపోయారు. ఐటీ అధికారులపై ఎంపీ, టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి నిర్బంధించినంత పనిచేసినా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసీ అధికారి స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చిన అధికారులకు పోలీసులు ఎందుకు బందోబస్తు కల్పించలేకపోయారనే విషయం చర్చనీయాంశమైంది. ఐటీ సోదాలు జరిగే ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించరు. అక్కడ కానిస్టేబుళ్లు మాత్రమే ఉండడంతో టీడీపీ నేతలు బలవంతంగా లోపలికి వెళ్లి అధికారులపై దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉన్న ఓ ఐటీ ఉన్నతాధికారిపై భౌతిక దాడికి దిగినంత పనిచేసిన టీడీపీ నాయకులపై, తనిఖీలు చేయకుండా విధులకు అడ్డుకున్న సీఎం రమేష్‌పై కనీసం ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. చదవండి: టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు -
టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, ప్రొద్దుటూరు: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు బుధవారం దాడి చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ ఏ1 కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఐటీ దాడులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీఎం రమేశ్ వాగ్వాదం పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి దూసుకొచ్చారు. ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగారు. సీఎం రమేశ్ వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బద్ధలైన ‘పుట్టా’ కంచుకోట
సాక్షి, నెర్రవాడ(చాపాడు): టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు కంచుకోటగా మారిన మండలంలోని నెర్రవాడలో తమ సామాజిక వర్గీయులైనా యాదవులు ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వనున్నారు. పుట్టా తీరును వ్యతిరేకిస్తూ, వైఎస్ జగన్‌పై ఇష్టంతో 35 యాదవ కుటుంబీకులు గురువారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మేకల శేఖర్, లంకెల జయరాములు, చల్లా గంగన్న, చల్లా శ్రీనివాసులు, పెద్ద వీరయ్య, చల్లా గంగాధర్, పిట్టి నరసింహులు, శ్రీనివాసులు, బండారు సుబ్బయ్య, చింతల సుబ్బరాయుడు, కదిరేపల్లె శ్రీను, పిట్టి శ్రీనివాసులు, లంకెల రామచంద్రయ్య, కురాకు మాధవ, ఇరగబోయిన లక్షుమయ్య, గొగ్గి ఓబులేసు, గాలి బాబు, శివలింగమయ్య, పిట్టి అంజన ప్రసాద్, ప్రకాశ్, ఓబులేసు, గొగ్గి మల్లేషు, సాయి, చింతల బీరేష్, పిట్టి సాయికుమార్, పిట్టి కాశి, చల్లా పెద్ద గంగన్న, చల్లా వెంకటరమణ, మందాల నారాయణ, బండారు చిన్న సుబ్బయ్య, చల్లా చిన్నవీరయ్య, పిట్టి నరసింహులు పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు తనయుడు నాగిరెడ్డి ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ ఎస్సార్ బాలనరసింహారెడ్డి, మండల నాయకులు లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు శశిథర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు మడూరు ప్రతాప్‌రెడ్డి, గురివిరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీమన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారిన వారిని వదలను ..
సాక్షి, చాపాడు : అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు పార్టీ మారుతున్న వారిపై కక్ష సాధిస్తానని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. మీరు నమ్ముకుని వెళుతున్న నాయకులు ఈ ఎన్నికల్లో మాత్రమే ఉంటారని.. తానే మరో 20 ఏళ్ల వరకు పోటీలో ఉంటానని ఎవరినీ వదలిపెట్టనన్నారు. మండలకేంద్రమైన చాపాడులో ఆదివారం టీడీపీ కార్యాలయం ప్రారంభించిన పుట్టా మాట్లాడుతూ ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీలోకి మారడం తప్పని తనను నమ్మించి పార్టీలోకి చేరిన వారు ఇప్పుడు నాకు సినిమా చూపిస్తున్నారని, తాను కూడా పది సినిమాలు చూపిస్తానన్నారు. మొదట్లో తెలియక తప్పులు చేశానని, ఇప్పుడు రాజకీయాల గురించి తెలుసుకున్నానన్నారు. ఎన్నికల్లో దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్సీపీలోకి వెళుతున్నారని కారణాలు అడిగితే బంధువులు అని, కార్యకర్తలంటూ కథలు చెబుతున్నారని పార్టీలోకి వచ్చేటప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, గోసుల కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుట్టా సుధాకర్‌కు చేదు అనుభవం