Revenue Act
-
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
సాక్షి, అమరావతి: కౌలు చట్టం–2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం తలపెట్టేందుకు సిద్ధమైంది. కౌలుదారుడికి సెంటు భూమి ఉన్నా కౌలు రైతుగా గుర్తించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కౌలు చట్టం–2024 పేరిట ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. తద్వారా భూ యజమాని అనుమతి లేకుండానే కౌలు కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ ముసుగులో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నచ్చినోళ్లకు పెట్టుబడి సాయం, రుణాలు, నష్టపరిహారం, సబ్సిడీల లబ్ధి చేకూర్చేలా తెరవెనుక ఏర్పాట్లు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కొత్త చట్టం విభేదాలకు ఆజ్యం పోస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.తెలిసిన వ్యక్తులకే తమ భూములను కౌలుకు ఇస్తుంటామని.. తమ అనుమతితో పనిలేకుండా ప్రభుత్వం ఎవరో ఒకరికి భూములను కౌలుకు ఇచ్చినట్టుగా రాసేసుకుని.. కౌలు కార్డులు జారీచేస్తే వాస్తవ హక్కుదారులమైన తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త చట్టం తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని, తమ భూములపై ప్రభుత్వం తనకు నచ్చినోళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వాస్తవ రైతులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు కౌలుదారులు సైతం ఈ నిబంధనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చేస్తున్న సాగుదారులకు కాకుండా కొత్త నిబంధన పేరిట వేరే వ్యక్తులకు కౌలు కార్డులు జారీచేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.కొత్త నిబంధనలతో అసలుకే మోసంపట్టాదార్ పాస్ బుక్ చట్టం–1971 లేదా ఇతర రెవెన్యూ చట్టాల ప్రకారం భూమిపై హక్కు కలిగి ఉండి, వెబ్‌ల్యాండ్ వంటి భూ రిజిస్టర్లలో నమోదైన కౌలు రైతులు కొత్త చట్టం ప్రకారం కౌలు కార్డులు పొందేందుకు అనర్హులు. అంటే సెంటు భూమి ఉన్నా సరే కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే విషయాన్ని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన యాప్‌లో నమోదు చేసుకున్న వారు మాత్రమే కౌలు కార్డులు పొందేందుకు అర్హులు. అంటే.. భూమిని వాస్తవ కౌలుదారు కాకుండా వేరే వ్యక్తులు కౌలుకు చేస్తున్నట్టుగా యాప్‌లో నమోదు చేసుకుంటే వారిని కౌలు రైతుగా గుర్తించే ప్రమాదం ఉంది.యాప్‌పై అవగాహన లేని కౌలు రైతులు, అమాయకులైన కౌలు రైతులకు ఇలాంటి నిబంధనల వల్ల కీడు జరుగుతుందని రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టం పేరిట తెస్తున్న నిబంధనల్లో మరో సమస్య కూడా ఉంది. అసలు రైతు కుటుంబ సభ్యులు, వారి సమీప బంధువులు భూమిని కౌలుకు చేస్తుంటే.. అలాంటి వారు కూడా కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే నిబంధన విధించారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే వారంతా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుగా అనర్హులవుతారు. కొత్త కౌలు చట్టాన్ని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.ముసాయిదా ఏం చెబుతోందంటే..కౌలు చట్టం–2024 ప్రకారం భూ యజమానుల అనుమతితో పనిలేకుండా చుట్టుపక్కల రైతుల అభిప్రాయాల మేరకు గ్రామసభల్లో కౌలుదారులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది. యజమాని మూడు రోజుల్లో సమ్మతి ఇవ్వకుంటే డీమ్డ్ సమ్మితి (భూ యజమాని సమ్మతి తెలిపినట్టు)గా పరిగణించి కౌలు కార్డు జారీ చేస్తారు. ఒకవేళ తాను ఎవరికీ తన భూమిని కౌలుకు ఇవ్వలేదని భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినా పరిగణనలోకి తీసుకోరు. చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలే ప్రామాణికంగా ఇచ్చే కౌలు కార్డుల ప్రామాణికంగానే పంట రుణాలిస్తారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంట రుణాలు ఇవ్వకూడదని, భూ యజమానులు గత సీజన్లో తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా, అదే సీజన్లో కొత్తగా తీసుకున్న పంట రుణాలను లాంగ్ టర్మ్ రుణాలుగా పరిగణించేలా బ్యాంకులను ఆదేశించేలా నిబంధన పెడుతున్నారు.కౌలు కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలివీఅధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులున్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలుదారులు. సెంటు భూమి కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న వారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. కౌలు కార్డులు పొందిన వారు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం పొందవచ్చు. సబ్సిడీపై. విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా సాగు చేసే పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.1.60 లక్షల వరకు పంట రుణాలు పొందవచ్చు. సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే నష్టపరిహారంతో పాటు పంటల బీమా పరిహారం పొందవచ్చు.కొత్త వివాదాలకు ఆజ్యంపరిసర రైతులు మౌఖికంగా ధ్రువీకరిస్తే కౌలు కార్డులు ఇవ్వొచ్చన్న నిబంధన గ్రామాల్లో భూ యజమానులు, కౌలు రైతుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న వాదన వినిపిస్తోంది. అన్నదాత సుఖీభవతో పాటు ఇతర సంక్షేమ ఫలాల కోసం ఎలాంటి భూమి లేనివారు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ నిబంధన సాకుతో స్థానిక అధికారులను ప్రలోభపెట్టి అడ్డగోలుగా కార్డులు పొందడం, వాటిద్వారా సంక్షేమ ఫలాలు స్వాహా చేయడం వంటి అవకతవకలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.కార్డులు జారీచేసే వరకు రుణాలివ్వకూడదన్న నిబంధనతో సకాలంలో పంట రుణాలు పొందే అవకాశం సాగుదారులైన భూ యజమానులకు లేకుండా పోతుందంటున్నారు. డబుల్ ఫైనాన్స్ ఇవ్వలేమని, గతంలో తీసుకున్న రుణాలు రెన్యువల్ చేసుకున్న తర్వాత వాటిని లాంగ్ టర్మ్ రుణాలుగా మార్చడానికి నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. కౌలుదారుడు రుణం తీసుకుని చెల్లించలేని పక్షంలో, వ్యక్తిగత అవసరాల కోసం భూమిని తనఖా లేదా, అమ్ముకునేటప్పుడు తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళనను భూ యజమానులు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం
త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారంజీవో 59 కింద అక్రమంగా భూములను క్రమ బద్ధీకరించుకున్నారు. నానక్‌రాంగూడలో రూ.3 వేల కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేం రాగానే వాటిని వెనక్కు తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జీవో 59 దరఖాస్తులను పరిష్కరిస్తాం.సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2020 స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే రూపొందించిన ముసా యిదా చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచ నలు వస్తున్నాయన్నారు. సూచనలు తీసుకునే గడువును ఈనెల 23నుంచి మరో వారం పొడిగి స్తామని చెప్పారు. గడువు ముగిసిన 45 రోజుల్లో గా కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు రెవె న్యూ సంబంధిత అంశాలపై ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చట్టం, ధరణి పోర్టల్‌లో తెస్తున్న మార్పులు, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, భూముల విలువల సవరణ, జీవో 59 దరఖా స్తులు వంటి అంశాలపై పొంగులేటి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..ధరణితో ప్రజలు కుదేలు: గత ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల భూమి డేటాను విదేశీ కంపెనీకి అప్పగించినందుకే మేం ధరణి పోర్టల్‌ను తప్పుపడుతున్నాం. ఇది రైతుల మెడలో పెద్ద గుదిబండ. ఈ పోర్టల్ కారణంగా ప్రజలు కుదేలయ్యారు.. తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని తెచ్చిన చట్టం ఇది. ప్రజలు తమ భూమి తమకు రావాలని దేవుళ్లకు దండం పెట్టారో లేదో తెలియదు కానీ, దొరకు, కలెక్టర్లకు మాత్రం పొర్లు దండాలు పెట్టాల్సి వచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. తినీతినక కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమ్ముకునే హక్కును కాలరాసింది. పుట్టలో పాముల్లా అక్రమాలుమేం అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే పుట్టలో పాముల్లాగా ధరణిలో వందలాది అక్రమాలు బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మూడు నిమిషాల్లో మ్యుటేషన్ అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు ఆస్కారం కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేసుకుని తాళాలు వేసుకున్నారు. వాళ్లేం చేశారో కలెక్టర్లకు కూడా తెలియదు. హెడ్ ఆఫీస్, విదేశీ కంపెనీకి మాత్రమే తెలుసు. మేం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అన్ని వివరాలు ప్రజా బాహుళ్యంలో పెట్టించాం లొసుగులు సవరించేందుకే చట్టం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామంటే.. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆత్రుతగా తప్పులు చేయడం కాదు. పేరు మార్చడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మన నిర్ణయాలతో తరతరాలు ముందుకెళ్లాలి. అందుకే భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్‌ను మాత్రమే కాదు. చట్టంలోని లొసుగులను సవరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. ఆర్వోఆర్ చట్టం–2020 కారణంగానే సమస్యలన్నీ వచ్చాయి.80–85 వేల దరఖాస్తులే పెండింగ్‌లో..మేం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించాం. అప్పటికే 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిరోజూ 3–5 వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టి 1.28 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం. అంతేకాదు రోజూ పరిష్కరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోర్టల్‌లో 80–85 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా నమోదు చేయిస్తున్నాం. అభిప్రాయ సేకరణకు జిల్లా స్థాయిలో సదస్సులుకొత్త చట్టం ముసాయిదాపై చెట్టుకింద కూర్చునే సామాన్య రైతు నుంచి దొర వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరుపుతాం. దేశంలోనే రోల్‌మోడల్ చట్టంగా రూపొందిస్తాం. దీని ద్వారా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందుతాయి. పోర్టల్‌లోని దరఖాస్తు పద్ధతిని మార్చేస్తాం. ఇప్పటివరకు ఉన్న 33 మాడ్యూళ్ల స్థానంలో ఒకటే మాడ్యూల్ తెస్తాం. రైతుల ఏ సమస్యపై అయినా ఈ మాడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పహాణీలో 35 కాలమ్‌లు ఉండేవి. 100 ఏళ్ల చరిత్ర ఉండేది. ఇప్పుడు ఒక్కటే కాలమ్ ఉంది. దీని స్థానంలో 14–16 కాలమ్‌లతో కొత్త పహాణీ అందుబాటులోకి తెస్తాం. సీసీఎల్ఏ స్థాయిలో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కటాఫ్ డేట్ నిర్ణయిస్తున్నాం. సీసీఎల్ఏకు వచ్చిన దరఖాస్తులు వారం రోజుల్లోగా పరిష్కారం కావాలని ఆదేశిస్తా. ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?దొరగారు చెపితే వినలేదని 23 వేల మందిని అర్ధరాత్రి వేరే శాఖకు బదిలీ చేశారు. వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూకు సాక్ష్యాలు లేకుండా చేశారు. మేం రాష్ట్రంలోని 10,945 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు కాపలాదారులను నియమించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా? పేదోళ్ల భూములు వారికే పంచుతాంపేదలకు ఇందిరమ్మ పంచిన భూములు లాగేసుకున్నారు. అలాంటి భూములు గుర్తించాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ తిరిగి పేదలకు పంచుతాం. పేదోడి భూమి ధనికుల చేతికి వెళ్లనివ్వం. ఆ కోణంలోనే అసైన్డ్ భూములపై అమ్మకపు హక్కు కల్పిస్తాం. కొత్త చట్టం ఏర్పాటు కాగానే మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 9 లక్షల దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చే వాటిని ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం భూముల విలువల సవరణలో శాస్త్రీయత పాటించలేదు. మేం అధికారులు, థర్డ్ పార్టీ నుంచి వివరాలు సేకరించాం. రెండింటినీ క్రోడీకరించి త్వరలోనే న్ణియం తీసుకుంటాం. పార్టీ ఆస్తులు ఏం చేయాలా అని దొర ఆలోచిస్తున్నాడు‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం 100 శాతం ఖాయం. అయితే బీఆర్ఎస్ పేరిట ఉన్న ఆస్తులు, డబ్బులు ఏం చేయాలనేదానిపై దొర ఆలోచిస్తున్నాడు. పార్టీని విలీనం చేయకుండా కవితకు బెయిల్ రాదు. మేం కేంద్రంలో అధికారంలో లేము కనుక ఆ కేసులు తప్పించడం మాతో కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ జోలికి రాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ మాత్రమే పడింది. ప్రతి దానికీ ఆషాఢాలు, శ్రావణాలు ఉంటాయి కదా! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. నెలాఖరులోనే జేఎన్జే సొసైటీకి భూమిని సీఎం చేతుల మీదుగా అప్పగిస్తాం. ఈ సొసైటీలో లేని మిగిలిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపైనా ఆలోచిస్తున్నాం. ఇతర సొసైటీల సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. -
సమగ్ర భూచట్టం..రెవెన్యూ కోడ్ తేవాలంటున్న నిపుణులు!
రాష్ట్రంలో భూముల వివాదాలు, సమస్యలను పరిష్కరించడం కోసం సమగ్ర చట్టాన్ని అమల్లోకి తెచ్చే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 124 భూ చట్టాలన్నింటినీ కలిపి.. రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం)గా రూపొందించాలని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఇది అమల్లోకి వస్తేనే రాష్ట్రంలోని భూముల పరిపాలన, హక్కుల కల్పన, వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చినా.. దాన్ని కేవలం ఒక్క భూహక్కుల రికార్డుల చట్టం–1971ని సవరించి తెచ్చుకున్నామని గుర్తు చేస్తున్నారు. దీనితోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని భూచట్టాలను కలిపి కొత్తగా సమగ్ర చట్టాన్ని తెస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ‘కోడ్’ ప్రయత్నాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2016లోనే రెవెన్యూ కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. అది దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిందని.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా దాదాపు ఒకే తరహా చట్టంతో రెవెన్యూ పాలన చేస్తున్నాయని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలోనూ కొత్త సమగ్ర చట్టం కోసం ఇటీవలే మంత్రులు, సీనియర్ అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశమంతా రెవెన్యూ కోడ్ వైపు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలోనూ ఆ దిశలో ప్రయత్నాలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్ఓఆర్, కౌలుచట్టం, ఇనామ్‌ల రద్దు, అసైన్డ్ భూముల చట్టం వంటివన్నీ రద్దు చేసి ఒకే చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక కూడా అందించారు. రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే.. వాస్తవానికి తెలంగాణలో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే మొదలైంది. నాటికి ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను నల్సార్ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో మేరకు రెవెన్యూ చట్టాలను పునఃసమీక్షించిన నల్సార్ వర్సిటీ 30 పేజీలతో కూడిన సమగ్ర భూచట్టాల ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఈ ముసాయిదా కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. భూ వి వాదాలు తగ్గేలా, పాలన సులభతరం చేసేలా, గందరగోళానికి తావులేకుండా ఉండే సమగ్ర భూచట్టాన్నిరూపొందించాలనే డిమాండ్ వినిపిస్తోంది. హక్కుల చిక్కులు తీర్చేదిశగా.. భూచట్టాల నిపుణులు చేస్తున్న సూచనలివీ.. భూసమస్యలు పరిష్కారం కావాలంటే సర్వే తప్పనిసరి. ఒకప్పుడు సర్వేకు ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాలా తక్కువ సమయంలోనే సర్వే చేయవచ్చు. ఇందుకోసం సర్వే, హద్దుల చట్టం–1923 స్థానంలో కొత్త చట్టం తేవాలి. ఈ సర్వే పూర్తయ్యేలోపు భూలావాదేవీ జరిగిన ప్రతిసారీ సంబంధిత భూమిలో సర్వే జరగాలి. సర్వేయర్ల కొరతను నివారించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి.. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. – భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తేవాలి. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం చేయాలి. – భూసంబంధిత అంశాల విషయంలో ఒకే చట్టం ఉండి.. ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. అమలు చేసే వారికీ సులభంగా ఉంటుంది. అన్ని భూచట్టాలను కలిపి రెవెన్యూ కోడ్‌గా రూపొందించాలి. – ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ రికార్డులన్నింటినీ కాగితాల్లోకి ఎక్కించాలి. ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలు గుర్తించి.. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు పెట్టి వాటిని పరిష్కరించాలి. – భూవివాదాల పరిష్కార చట్టాన్ని తెచ్చి జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్ జడ్జి లేదా రెవెన్యూ నిపుణుల నేతృత్వంలో అవి పనిచేయాలి. – కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కచి్చతంగా చట్టాల్లో మార్పు రావాలి. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి. – పేదలకు భూసమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవడంలో సాయం అందించేందుకు పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూములు ఇచ్చే మార్గాలు వెతకాలి. భూవిధానం, వినియోగం ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. ఇందుకోసం భూపరిపాలనను మెరుగుపర్చాలి. భూఅకాడమీ ఏర్పాటు చేసి భూపరిపాలనలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు జరపాలి. – ఈ అన్ని చర్యలు తీసుకునేందుకు వీలుగా భూకమిషన్ను ఏర్పాటు చేయాలి. రైతులు, సామాన్య ప్రజల డిమాండ్లు ఇవీ.. – భూములను రీసర్వే చేయాలి. భూరికార్డులను సవరించి అందరికీ అందుబాటులో ఉంచాలి. – పేదలకు భూములను పంపిణీ చేయాలి. కౌలు దారులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. – సాదాబైనామా భూములను క్రమబదీ్ధకరించాలి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి. – రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూవివాదాలను పరిష్కరించి సాగులో ఉన్న వారికి పట్టాలివ్వాలి. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. – అన్యాక్రాంతమైన గిరిజన, అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలి. మహిళలకు భూహక్కులు కలి్పంచాలి. పారాలీగల్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ధరణితోపాటు ఇతర సమస్యలూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే కేవలం ధరణి పోర్టల్‌ను సరిచేస్తే భూవివాదాలన్నీ సమసిపోతాయనే అభిప్రాయం కనిపిస్తోంది. కానీ ధరణి మాత్రమే సర్వరోగ నివారిణి కాదు. దాని చుట్టూనే చర్చ జరగడం సమంజసం కాదు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలోనే ‘ల్యాండ్ క్యారవాన్’ పేరుతో రాష్ట్రంలో దాదాపు మూడువేల కిలోమీటర్లు ప్రయాణించి పదివేల మందికిపైగా రైతులను, భూయజమానులను కలిసి నివేదిక రూపొందించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం (రెవెన్యూ కోడ్)గా రూపొందించడం, భూములను రీసర్వే చేయడం, జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడం ఈ నివేదికలో ప్రధానమైనవి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు -
పెరిగిపోతున్న భూసమస్యలు.. కొత్త రెవెన్యూ చట్టంలో లోపాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజి్రస్టేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012–13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్‌లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబదీ్ధకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయని తెలుస్తోంది. ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోని తీసుకోవాలి.. ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు -
Telangana: కొత్త రెవెన్యూ చట్టం.. రెండేళ్లయినా బాలారిష్టాలే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012– 13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దర ఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లా లోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్‌లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయని తెలుస్తోంది. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. -
సాదాబైనామా..50 ఏళ్ల హైరానా..! 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా.. తెల్ల కాగితాలపై రాసుకుని జరిపే భూముల క్రయ విక్రయ లావాదేవీలకు పెట్టిన పేరు ఇది. ఈ సాదాబైనామాలు సాధారణమైనవేమీ కాదు.. రామాయణమంత చరిత్ర ఉంది అంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సాదాబైనామాలు సమస్యల్లో చిక్కుకుని 50 ఏళ్లు గడిచినా ఇంతవరకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో 9.24 లక్షల దరఖాస్తులు సాదాబైనామా కింద పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం–1971 అమల్లో ఉన్నప్పుడు 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కొత్త రెవెన్యూ చట్టం (2020) అమల్లోకి వచ్చాక మరో 7 లక్షల దరఖాస్తులు పరిష్కారం కోసం వచ్చాయి. 12 రోజుల్లోనే 7 లక్షల మంది కేవలం తెల్లకాగితంపై రాసుకున్నవి కావడం, ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలూ లేకపోవడంతో ఏళ్లు గడిచే కొద్దీ వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాదాబైనామాల క్రమబద్ధీకరణ మొదలయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్ 2 లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 2.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించలేదు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం–1971కి సవరణలు చేసి ఆర్వోఆర్ చట్టం–2020ని అమల్లోకి తెచ్చింది. 2020, అక్టోబర్ 29న ఈ చట్టం అమల్లోకి రాగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు మరోమారు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ 12 రోజుల్లోనే 7 లక్షల మంది తమ సాదాబైనామా లావాదేవీలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా రెండోసారి దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా 2014, జూన్ 2నే కటాఫ్ డేట్‌గా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ఆ 9.4 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. 1971 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే.. సాదాబైనామా లావాదేవీలు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యేవి. 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్–1948 ప్రకారం సాదాబైనామా లావాదేవీలను తహశీల్దార్లు క్రమబద్ధీకరించే వారు. రిజిస్ట్రేషన్లు, నోటిమాట, తెల్ల కాగితాల ద్వారా జరిగిన భూముల క్రయవిక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని జమాబందీ ద్వారా తహశీల్దార్లు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేవారు. 1970 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1948 చట్టాన్ని సవరించి 1971 ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ సాదాబైనామాల విషయంలో నిబంధనలు మార్చారు. భూమి కొనుగోలు లావాదేవీలపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో తెల్లకాగితాలు, నోటిమాట లావాదేవీలు అధికారికంగా చెల్లకుండా పోయాయి. ఆ తర్వాత 1989లో ఓసారి 1971 చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం తహశీల్దార్లకు సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సవరణ చట్టం ద్వారానే సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తున్నారు. 1989, 2000, 2014, 2020లో నాలుగుసార్లు ఇలా సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త చట్టంలో అధికారాలేవీ..? అయితే 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో తహశీల్దార్లకు గానీ, ఇతర ఏ స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి గానీ సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించలేదు. అసలు సాదాబైనామాల ప్రస్తావనే లేదని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చి మరీ 7 లక్షల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. పరిష్కార వ్యవస్థను కొత్త చట్టంలో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు మొత్తం 9.4 లక్షల (20 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని అంచనా.) సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించాలంటే చట్ట సవరణే మార్గమని, ఆర్వోఆర్ చట్టం–2020కి సవరణ జరిగేంతవరకు ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల మాట అలా ఉంచితే... 2014 జూన్ 2 తర్వాత జరిగిన సాదాబైనామాల పరిస్థితి ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి, చట్ట సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, కటాఫ్ డేట్ మార్పు లాంటి అంశాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో..సాదాబైనామాల అంశాన్ని ఎప్పటికి శాశ్వతంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
మైనార్టీల భూములపైనా లింగమనేని పంజా
మంగళగిరి: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఐజేఎం సంస్థ పేరుతో ప్రాచుర్యం పొందిన లింగమనేని రమేష్ చివరకు మైనార్టీల భూములనూ వదల్లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ, చినకాకాని, నిడమర్రు గ్రామాల్లో ఐజేఎం లింగమనేని రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్లు, విల్లాలతో పాటు సుమారు 1,200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో వందలాది ఎకరాల ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా పీర్ల మాన్యం భూములను లింగమనేని రమేష్ సతీమణి సుమన పేరిట ఉండటాన్ని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. కాజ గ్రామంలో రైల్వే గేటుకు అవతల, ఇవతల పీర్ల మాన్యం పేరుతో ఇనాం భూములు 11.25 ఎకరాలు ఉన్నాయి. పూర్వం దాతలు పీర్ల మాన్యం కింద అందజేసిన భూములను కౌలుకు ఇచ్చి.. వాటిపై వచ్చే ఆదాయంతో ముస్లింలు పీర్ల పండుగలను జరుపుకుంటారు. గ్రామంలో సర్వే నంబర్ 287/5లోని 2.06 ఎకరాలు లింగమనేని సుమన పేరున ఉన్నాయి. 287/1ఏ2, 287/1ఏ2ఏ, 287/1ఏ2బీ, 287/1ఏ2సీ, 287/1ఏ2డీ, 287/1బీ సర్వే నంబర్లలో మరో 9.19 పీర్ల మాన్యం భూములు ఉన్నాయి. అవన్నీ శ్యామల మల్లికార్జునరెడ్డి, సింహాద్రి నాగేశ్వరమ్మ, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, మెట్టు వెంకట కాశీ విశ్వనాథం, శ్యామల విజయలక్ష్మి, శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, సింహాద్రి సామ్రాజ్యం, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, సింహాద్రి వెంకటరామారెడ్డి ఆ«దీనంలోకి మళ్లాయి. సదరు భూములను పీర్ల మాన్యం కౌలుకు మాత్రమే ఇచ్చి అనుభవించాల్సి ఉండగా భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు పుట్టించి విక్రయాలు జరిపారు. దానికి అప్పటి పీర్ల మేనేజర్ లావాదేవీలు నిర్వహించడం విశేషం. ఎకరం రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. 2013 రెవెన్యూ చట్టం ప్రకారం భూములకు పట్టాలు ఉన్నా, పాస్ పుస్తకాలు ఉన్నా చెల్లవని, తిరిగి వక్ఫ్ బోర్డు స్వాదీనం చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ జీవీ రాంప్రసాద్ వివరణ కోరగా.. ఆర్ఎస్ఆర్ ప్రకారం పీర్ల మాన్యం భూములు 11 ఎకరాలను గుర్తించి ఆ భూముల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని చెబుతున్నారన్నారు. కోర్టు తీర్పు ఉన్నా చట్ట ప్రకారం పీర్ల మాన్యం భూములు (ఇనాం భూములు) వక్ఫ్ బోర్డుకు చెందుతాయన్నారు. నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్ : భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించి పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, ఆ ట్రిబ్యునళ్లకు క్వాసీ జ్యుడీషియల్ అధికారాలివ్వాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ రెవెన్యూ కోర్టులకు వచ్చే కేసులు పెరగడం, ధరణి పోర్టల్ అమలు నేపథ్యంలో సమస్యలు వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ట్రిబ్యునళ్లను శాశ్వత ప్రాతిపదికన ఉంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటికే దాదాపు 20 వేల కేసులు రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటితోపాటు చిన్నచిన్న ఫిర్యాదులు, ధరణి అమలు ద్వారా వస్తున్న సమస్యలు, సంధికాలంలో వచ్చిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అసెంబ్లీలో చెప్పినట్లు ఈ ట్రిబ్యునళ్లకు నిర్ణీత కాలపరిమితి విధించకుండా భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగించాలన్న రెవెన్యూ ఉన్నతాధికారుల సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి భూ సమగ్ర సర్వేనే మార్గమని, వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. సమగ్ర భూ సర్వే ద్వారా గరిష్ట స్థాయిలో భూ వివాదాలు పరిష్కారం అయ్యాక మాత్రమే ట్రిబ్యునళ్లపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
సన్నాలపై తర్జనభర్జన..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యంపై క్వింటాల్‌కు రూ. 150 చొప్పున బోనస్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల అది సాధ్యమయ్యేలా లేదని రాష్ట్ర మంత్రివర్గం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలకాంశాలపై చర్చించిన కేబినెట్ అందులో భాగంగా సన్నాలకు బోనస్ చెల్లింపు సాధ్యాసాధ్యా లను పరిశీలించింది. అయితే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కుదుర్చుకున్న ఎంవో యూలో ఉన్న నిబంధనలు బోనస్ చెల్లింపునకు అడ్డంకిగా ఉన్నాయని కేబినెట్ అభిప్రాయపడింది. కనీస మద్దతు ధరకన్నా రాష్ట్రాలు ఒక్క రూపాయి అదనంగా చెల్లించినా రాష్ట్రాలు సేకరించిన ధాన్యాన్ని సెంట్రల్ పూల్ కింద స్వీకరించబోమని కేంద్రం ఎంవోయూలో పొందుపరిచిన నిబం ధనలు ప్రతికూలంగా మారాయని ఈ భేటీలో పాల్గొన్న మంత్రులు పేర్కొన్నట్లు తెలియవచ్చింది. ఆర్డినెన్స్‌తో సాదాబైనామాల పరిష్కారం... సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరపడం, మెరూన్ రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గం ఈ నిర్ణయాలు తీసుకుంది. రద్దైన పాత రెవెన్యూ చట్టం నిబంధనల మేరకు సాదాబైనామాలకు క్రమబద్ధీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై మంతివర్గం చర్చించింది. సాదాబైనామాలకు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో పాత ఆర్ఓఆర్ చట్టంలోని నిబంధనలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త చట్టం కింద సాదా బైనామాలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద పరిష్కరించేందుకు ఆర్డినెన్స్ తేవాలనే ప్రతిపాదనను కేబినెట్ చర్చించి ఆమోదించింది. కేబినెట్ ప్రతిపాదించిన ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అసెంబ్లీ ఆరో విడత సమావేశాలు ప్రొరోగ్ అయితేనే ఆర్డినెన్స్ ఆమోదం పొందే అవకాశం ఉండటంతో వెంటనే ప్రొరోగ్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త రెవెన్యూ చట్టం కింద సాదా బైనామాల క్రమబద్దీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పేదలకు సంబంధించిన నల్లా, విద్యుత్, ఆస్తి పన్ను బకాయిల మాఫీ అంశాన్ని కూడా కేబినెట్ చర్చించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించవద్దని మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. క్యాబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించలేదు. -
సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు మాత్రమే పరిశీలించవచ్చని తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వచ్చిందన్న ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. అక్టోబరు 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. అక్టోబరు 29 నుంచి మంగళవారం వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ఏజీ కోర్టు దృష్టి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టును కోరారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులను కూడా పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు సూచించింది. -
తెలంగాణలో రెవెన్యూ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అవినీతిరహిత, పారదర్శక రెవెన్యూ లావాదేవీల కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సర్కారు.. ఇప్పటి వరకు దాని అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయకపోవ డంతో అధికారుల ముందరి కాళ్లకు బంధం పడినట్టయింది. కొన్ని నిర్ణ యాల అమలుకు పాత చట్టాన్నే పరిగణ నలోకి తీసుకోవాలని చెబుతున్న ప్రభు త్వం.. మరికొన్నింటికి మాత్రం గత నెలలో ఆమోదముద్ర వేసిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020(ఆర్వోఆర్) ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేస్తోంది. విధానపర నిర్ణయాల అమల్లో భాగంగా ఏకకాలంలో వేర్వేరు చట్టాలను అమలు చేయాలని భూ పరిపాలన శాఖ స్పష్టం చేస్తుండటం క్షేత్రస్థాయి అధికా రులను ఇరకాటంలో పడేస్తోంది. ఆర్వోఆర్ చట్టం–1971 స్థానంలో కొత్త చట్టానికి గత నెల 9న శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త చట్టం మేరకు అధికారాలు, విధులు, బాధ్యతలపై ప్రభుత్వం ఇప్పటివరకు నియమావళి (రూల్స్)ని జారీ చేయలేదు. సాదాబైనామాలపై స్పష్టత ఏదీ? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు పాత చట్టం ప్రకారమే నడుచుకోవాలని ప్రభు త్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం అధికారులను.. దరఖాస్తు దారులను అయోమయంలో పడేసింది. ప్రస్తుతానికి పాత చట్టమే మనుగడలో ఉన్నా.. కొత్త చట్టం అమలుపై నేడో, రేపో విధివిధా నాలు ఖరారైతే ఏ చట్టం ప్రకారం ముందుకెళ్లాలనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణను తిరస్కరిస్తే ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు సెక్షన్–5 (బీ) మేరకు అప్పీల్ చేసుకొనే వెసు లుబాటు అర్జీదారులకు ఉంటుంది. అయితే కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్, ఆర్డీవో, ఏసీల అధికారాలకు ప్రభుత్వం కోత పెట్టింది. రెవెన్యూ కోర్టులనూ రద్దు చేసింది. దీంతో సాదాబై నామాల అప్పీళ్లను విచారించే అవకాశం లేదు. ఎలాం టి వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్ర యించాల్సి ఉంటుంది. కొత్త యాక్ట్‌పై రూల్స్ వెల్లడించే వరకు పాత చట్టమే అమల్లో ఉం టుంది కనుక అధికారులు అభ్యంతరాలను ఎలా పరిష్కారిస్తారనే విషయమై స్పష్టత కొర వడింది. పాత చట్టం ప్రకారం ఒకవేళ వారు ఉత్తర్వులిచ్చినా కొత్త చట్టానికి అనుగుణంగా సవరణలతో ఉత్తర్వులు ఇవ్వకుండా పాత చట్టం మేరకు నడుచుకోవాలని అనడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. విధివిధానాల ఖరారులో జాప్యంతో రెవెన్యూ యంత్రాంగం డైలమాలో పడింది. పాత చట్టం ప్రకారం ముందుకెళ్లాలా లేక కొత్త చట్టం రూల్స్ వచ్చే వరకు వేచి చూడాలా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాదా బైనామాలకు మాత్రం పాత చట్టాన్ని వర్తిం పజేస్తూ జీవో విడుదల చేసిన భూ పరిపాలన శాఖ.. కొత్త చట్టంపై నియమావళి విడుదల చేసే వరకు ఎలాంటి నిర్ణయాలు (ఆర్డర్లు) వెల్లడించవద్దని ఆదేశించడం ఉన్నతా« దికారుల ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోంది. ఆదాయ, కుల, నివాస ధ్రువ పత్రాల జారీ అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయిస్తున్నట్లు కొత్త చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటికీ వాటిని తహసీళ్లలోనే జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను సంక్రమింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వనందున జారీ తాము చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అదే ఇతరత్రా వ్యవహారాలకు వచ్చే సరికి కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ దాటవేస్తున్నారు. దరఖాస్తులకు మోక్షం ఎలా? కొత్త రెవెన్యూ చట్టం అంకురార్పణ జరిగిన మరుక్షణమే రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాలనకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ కూడదని ఆదేశాలివ్వడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రికార్డుల నిర్వహణ, కోర్టుల్లో వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల్లో సమస్యల పరిష్కారం, అర్జీల పరిశీల న, భూముల సర్వే సబ్‌డివిజన్ అర్జీలు పెం డింగ్‌లో పడ్డాయి. రెవెన్యూ కేసుల జోలికి వెళ్లకూడదని.. ఏ వివాదమైనా కోర్టుల్లోనే తేల్చుకోవాలని కొత్త చట్టంలో స్పష్టం చేయ డంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. 38 (ఈ), లావణి, ఓఆర్సీ హక్కులను ధరణిలో ఎక్కించడానికి మార్గమేమిటో చెప్పకపోవడం... సవరణలకు అవ కాశం ఇవ్వక పోవడం ద్వారా ధరణిలో నమోౖ దెన తప్పుడు రికార్డులకే చట్టబద్ధత కల్పించడం సరికాదని రెవెన్యూ వర్గాలు అంటు న్నాయి. పైగా రెవెన్యూ కోర్టుల రద్దుతో సివిల్ కోర్టులకు వెళ్లాలన్నా.. కరోనా కారణంగా ప్రధాన కేసులు మినహా ఇతర కేసుల విచారణను కోర్టులు చేపట్టడం లేదని, కొత్త చట్టంపై స్పష్టమైన మార్గదర్శకాలు త్వరగా జారీ చేస్తే తప్ప ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నూతన రెవెన్యూ చట్టంలో ఎన్నెన్నో చిక్కుముడులు
భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల చట్టం 2020 తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సమ్మతితో తెలంగాణ రాజపత్రం ద్వారా 19.9.2020 నుండి అమలులోకి వచ్చింది. సాధారణ పరిభాషలో అందరూ దీనిని నూతన రెవెన్యూ చట్టంగా పిలుస్తున్నారు. సెక్షన్ 15లోని నూతన చట్టం ద్వారా గత భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల చట్టం 1971 పూర్తిగా రద్దుపరచబడింది. గత చట్టాన్ని, ప్రస్తుత నూతన రెవెన్యూ చట్టాన్ని సమగ్రంగా పరిశీలిస్తే గత చట్టం లోని ప్రాముఖ్యత కలిగిన అంశాలైన సాదా చైనా మాల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమ బద్ధీకరణ, తప్పులను సవరించడం, సవరణలను చేయడం, వాస్తవంగా సాగు చేస్తున్న వారిని గుర్తిం చడం ద్వారా పాస్‌బుక్ ఇవ్వడం, రెవెన్యూ కోర్టుల ద్వారా పరిష్కారాన్ని చూపడం నూతన రెవెన్యూ చట్టంలో సంపూర్తిగా తొలగించారు. నూతన రెవెన్యూ చట్టంలో ఈ క్రింది అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. 1. ‘ధరణి’ పోర్టల్ ద్వారా భూమి యజమా నుల హక్కులను గుర్తించి పాస్‌బుక్–టైటిల్ డీడ్ జారీ చేయటం. 2. తహసీల్దార్కే రిజిస్ట్రార్ అధికా రాలను కల్పించి రిజిస్టర్ ఒప్పందం పూర్తయిన వెంటనే పట్టాదారు పాస్ జారీ చేయడం. 3. రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలు పూర్తిగా తొలగించారు. 4. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా ఇప్పుడు పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారం, అట్టి తీర్పు అంతిమం. నూతన రెవెన్యూ చట్టంలో అతి ప్రాధాన్యత కలిగిన న్యాయపరమైన అంశం ‘ధరణి’ పోర్టల్. నూతన చట్టంలో సెక్షన్ 3 ద్వారా, సెక్షన్ 2(3) ద్వారా ప్రభుత్వం ‘ధరణి’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తించి ప్రభుత్వం దాన్ని నిర్వ హిస్తుంది. కానీ హడావుడిగా తెచ్చిన నూతన చట్టంలో చాలా సమస్యలకు పరిష్కారం లభిం చదు. ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ విజయదశమి నాడు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. లోపాలు లేకుండా అన్ని సమస్యలకు సమాధానం చెబుతూ ముఖ్యంగా భూమి సంబంధించిన చట్టాల్ని తయా రుచేయడం అంత సులభం కాదు. ఈ చట్టంలో సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం సదు ద్దేశం అయినా నైపుణ్యం లేని శక్తుల ద్వారా సేకరిం చిన పలు అంశాలు క్రోడీకరించడంవల్ల జరిగే తప్పిదాలకు, లోపాలకు సామాన్య భూ యజమా నులు ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులు అవస్థలు అనుభవిస్తారు. ప్రతి చిన్న పొరపాటుకు సవరణకు సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. కోడ్ అండ్ సివిల్ ప్రొసీజర్, 1905లో సెక్షన్ 9 ప్రకారం ఎలాంటి సివిల్ తగాదాను పరిష్కరించే అవకాశం సివిల్ కోర్టుకు ఉంటుంది. కానీ, కోడ్ అండ్ సివిల్ ప్రొసీజర్‌లోని సెక్షన్ 152 నుండి అధికారాన్ని తహసీల్దార్ ఇవ్వకపోవడంవలన ప్రతి చిన్న పొరపాటుకు, తప్పుకు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అది పేదలైన రైతులపై ఆర్థిక భారం, సమయ భారం పడుతుంది. ఒక రైతుకు గ్రామంలో 16వ సర్వే నెంబర్లో ఎ2.30 గుంటల భూమి ఉంది. పొరపాటున అట్టి విస్తీర్ణాన్ని ఎ2.03 గుంటలు అని ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తే, ఆ రైతు రికార్డులో తక్కువగా నమోదు చేయబడిన 27 గుంటల భూమి కోసం సివిల్ దావా వేయాలి. అట్టి పొరపాటు సాంకేతిక లోపంవల్ల జరిగిందని వివరిస్తూ రైతు తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందుంచినప్పుడే కోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సంవత్సరాల వరకు తుది తీర్పు రావడం కష్టం. అట్టి పరిస్థితులలో పేద రైతులకు ప్రభుత్వం అందించే సహాయం కోల్పోవలసి వస్తుంది. ఒక చిన్న సమస్య అతి చిక్కుముడి సమస్యగా మారుతుంది. నూతన చట్టంలోని సెక్షన్ 5ను ఒక సారి పరిశీలిస్తే ఈ సెక్షన్ కౌలు ఒప్పందాల్ని గుర్తిం చడం లేదు. కౌలు ఒప్పందాన్ని రిజిస్టర్ చేసే అవకాశం ఉందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. నూతన చట్టం వాస్తవంగా సాగు చేస్తున్న వారిని గానీ కౌలుపత్రం ద్వారా సాగు చేస్తున్న వారిని గుర్తించడం లేదు. 1.4.1999 నుండి వీలునామా ద్వారా అనుభవిస్తే అట్టి పత్రాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. నూతన చట్టంలోని సెక్షన్ 6 ద్వారా తహ సీల్దారుకు కుటుంబసభ్యుల మధ్య భాగ పంపిణీకి వెసులుబాటు ఉంది. ఎప్పుడైతే కుటుంబ పెద్ద చనిపోతాడో అతని వారసులు భాగ పరిష్కారానికి తహసీల్దార్ ముందు నమోదు చేసుకొని పట్టాదారు పాస్ పుస్తకం పొందవచ్చు. ఒక కుటుంబ యజ మానికి వేర్వేరు మండలాల లోని భూములు ఉండే ప్రతి మండలం ఆ భూముల భాగ పరిష్కారం ప్రతి మండలంలో చేసుకోవాలి అన్నది ప్రశ్న. మరొక విషయం ఏమిటంటే ఆ యజమానికున్న ఇతర స్థిర ఆస్తులు ఉదాహరణకు ఇల్లు, చర ఆస్తుల భాగ పరిష్కారం ఎక్కడ నమోదు చేయించుకోవాలి అనేది ప్రధాన సమస్య. సమయాభావంవల్ల ఏ ఒక్క భాగస్వామి సహకరించకపోతే భాగ పరిష్కా రమయ్యే అవకాశం ఉండదు. అన్ని ఆస్తుల భాగ పంపిణీకి ఏదైనా ఒక రిజిస్ట్రార్ దగ్గరే నమోదు చేసే అధికారం కల్పించి పని భారం తగ్గించడం సమంజసం. ఈ చట్టం కేవలం వ్యవసాయ భూమికి సంబంధించే కాబట్టి మిగతా ఆస్తుల విషయంలో భాగ పంపిణీకి అవకాశం లేదు. ఒకే కుటుంబ సభ్యులను నాలుగు కార్యాలయాల చుట్టూ తిరగమనడం సమంజసమేనా? మరో ప్రముఖ సమస్య ఏమంటే ఇదివరకే భాగ పంపిణీ అయిన భూములను సర్దుబాటు చేసుకొనే అవకాశం లేకపోవడం. భూయజమాని చనిపోయిన తర్వాత ఇదివరలో ప్రతి సర్వే నెంబర్లో వారసులకు హక్కు కల్పింంచి పాస్‌బుక్ ఇచ్చారు. కానీ వాస్తవ సాగు విషయంలోకి వస్తే నమోదైన రికార్డుకు భిన్నంగా ఉంది. ఉదాహరణకు ఒక యజమానికి రెండు వేర్వేరు సర్వే నెంబర్లలో భూమి ఉంటే అతని వారసులు ఇద్దరు అనుకొంటే వారి పేర్లను రెండు సర్వే నెంబర్లలో సరిసమానంగా వాటా చూపించారు. వాస్తవానికి ఇద్దరు వారసులు చెరి ఒక సర్వే నంబర్లో సాగు చేసుకున్నారు. ఇట్టి సర్వే నెంబర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదు. పైగా చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక వారసుడు తన స్వాధీనంలో ఉన్న భూమి అమ్మాలంటే ఇతర వారసుడు తప్పక సహకరిం చాలి. సహకరించకపోతే అమ్మకం పూర్తి కాదు. అందుకని వారసులలో ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో వారికే ఆ సర్వే నంబర్ మీద హక్కు కల్పించి పాస్ బుక్ ఇవ్వాలి లేదా ఇద్దరి దగ్గరనుంచి అఫిడవిట్ తీసుకుని ఆ తహసిల్దారు ముందు హాజరై పాస్‌బుక్ తీసుకునే ఏర్పాటు చేయాలి. లేకుంటే ఇద్దరు వారసుల మధ్య తగాదా మొదలై సివిల్ తగాదాకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి చిక్కు ముడికి జవాబు ఇవ్వకపోవడం ప్రధాన లోపం. నూతన రెవెన్యూ చట్టంలోని 16వ అధికరణం ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దాదాపు 16 వేల కేసులను బద లాయిస్తారు. ప్రభుత్వం 16 ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఒక సంవత్సరంలో తీర్పులు చెప్పాల్సి ఉంటుంది. విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమించాలనుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో 16మంది విశ్రాంత న్యాయ మూర్తులు దొరికే అవకాశం లేదు. ఒక ట్రిబ్యునల్ ఒక సంవత్సరంలో వేయికేసులు పరిష్కరించడం దాదాపు అసాధ్యం. పైన ఉదహరించిన సమస్యల పరిష్కారానికి చిన్నరైతులు మధ్యదళారులను ఆశ్రయిస్తారు. అప్పుడు మధ్య దళారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించే యంత్రాంగం కొరవడటంతో ఈ చట్టం కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా రైతు బంధు వంటి ప్రభుత్వ పథ కాలను సకాలంలో అందుకోకపోవడం వలన రైతులు కష్టాలపాలు కావచ్చు. నూతన రెవెన్యూ చట్టంలో తహసిల్దారుకు కానీ, కలెక్టర్‌కు కానీ పొరపాటును సవరించడానికి అధికారం లేకపోయినప్పటికీ, పైగా చాలా సమ స్యలలకు తక్షణ పరిష్కారాలు లేనప్పటికీ, కావా లని తప్పు చేసిన తహసిల్దారును తొలగించే అధి కారం కలెక్టరుకు ఉండటం, క్రిమినల్ చర్యలు తీసు కునే అవకాశం ఉండటం వల్ల తహసిల్దారు జాగ్ర త్తగా పనిచేసి రైతులకు, భూ యజమానులకు మేలు జరుగుతుందనేది నిర్వివాదాంశం. కూతురు రవీందర్ రెడ్డి వ్యాసకర్త విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది మొబైల్ : 94406 80789 -
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. అయితే మరో నెల రోజులపాటు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో మీ–సేవా కేంద్రాలు మూతపడి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, బుధవారం రాత్రి నాటికి మొత్తం 16,28,844 దరఖాస్తులు వచ్చాయి. పురపాలికల్లో 6,67,693, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పొరేషన్లలో 2,91,066 దరఖాస్తులొచ్చాయి. -
12లోగా ఆస్తుల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 12లోగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఏ ఒక్క ఆస్తిని వదిలిపెట్టవద్దని, ఆస్తుల నమోదు 100 శాతం పూర్తి అయినట్లు సంబంధిత వార్డు అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవీకరించిన వ్యవసాయేతర ఆస్తుల ముసాయిదా జాబితాను వార్డు కమిటీ ముందు వుంచి 3 రోజుల పాటు అభ్యంతరాలు/ సలహాలు స్వీకరించా లని ప్రభుత్వం నిర్దేశించింది. అభ్యంతరాల ను పరిష్కరించిన అనంతరం తుది జాబితా ను ప్రకటించాలని ఆదేశించింది. ఆస్తుల న మోదుకు సంబంధించిన వివరాలను వార్డు అధికారుల నుంచి పురపాలికలు సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ఇంకా పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డులకు ఎక్కని ఆస్తుల నమోదును గడువులోగా పూర్తి చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్, వారసత్వ బదిలీ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. అక్రమాలకు పాల్పడితే వేటే... ఆస్తుల నమోదు ప్రక్రియలో ఏవైనా అక్రమాలకు పాల్పడితే తెలంగాణ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 95 కింద కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్లను పురపాలక డైరెక్టర్ హెచ్చరించారు. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే మున్సిపల్ ఉద్యోగు లు, అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ కల్పిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల కు మెరూన్‌రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆస్తుల నమోదు ప్రక్రియ అత్యం త కీలకంగా మారింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్‌ను దసరా రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ధరణిలో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్లైన్ ద్వారా పురపాలికలు/ గ్రామ పంచాయతీల్లోని ఆస్తి పన్నుల రికార్డుల్లో సైతం కొత్త యజమాని పేరును నమోదు చేసి తక్షణ మ్యుటేషన్ చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలకు ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. ఇందుకోసం ప్రతి ఆస్తికి సంబంధించిన యజమానికి వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా యజమాని పేరు, కులం, వయసు, లింగం, ఫోన్ నంబర్, గుర్తింపు రుజువు, ఫొటో, ఆస్తి వివరాలు, వినియోగం, విస్తీర్ణం, సర్వే నంబర్, ఆస్తి సంక్రమణ విధానం, విద్యుత్, కులాయి కనెక్షన్ నంబర్లు, కుటుంబీకుల వివరాలు, చిరునామా తదితర వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి యజమానులందరూ ఇకపై పన్ను చెల్లింపు పరిధిలోకి రానున్నారు. -
జోరందుకున్న ఎల్ఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల శివార్లలోని గ్రామాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజ మానులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుం టున్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిధిలో సైతం పట్టణాలకు దీటుగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడుతూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ, అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగత ప్లాట్ల యజమానులు భారీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుం టున్నారు. ప్లాట్ల యజమానుల నుంచే 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. ఆలోగా మరో 5 లక్షలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లకుపైనే ఆదాయం వచ్చే అవకాశముంది. -
ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు!
శంషాబాద్‌కు చెందిన దయానంద్‌రెడ్డికి మండల పరిధిలో నాలుగు ప్లాట్లు ఉన్నాయి. వాటికి ఎల్ఆర్ఎస్ చేయించేందుకు సమీపంలోని ఓ కంప్యూటర్ సెంటర్లో సంప్రదించగా ఒక్కో దరఖాస్తుకు రూ. 2 వేలు అవుతుందని చెప్పడంతో ఆ మేరకు రూ. 8 వేలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి గంట తర్వాత నాలుగు రిసిప్ట్‌లను దయానంద్‌రెడ్డి చేతిలో పెట్టాడు. తీరా రిసిప్ట్‌లను పరిశీలిస్తే నాలుగింటికి కలిపి రూ. 4,180 మాత్రమే దరఖాస్తు ఫీజు అయినట్లుంది. మిగతా మొత్తంపై ఆరా తీయగా దరఖాస్తు చేసినందుకు సర్వీసు చార్జీ తీసుకున్నట్లు కంప్యూటర్ ఆపరేటర్ చెప్పడంతో నోట మాటరాలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే రూ. వెయ్యి వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడాన్ని కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటూ దరఖాస్తుదారుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల ప్రకారం ఒక ప్లాట్ కోసం చేసుకొనే దరఖాస్తుపై రూ.వెయ్యితోపాటు అదనంగా రూ. 45 జీఎస్టీ రూపంలో చెల్లించాలి. అదేవిధంగా లేఅవుట్ దరఖాస్తుకు రూ. 10 వేలతోపాటు జీఎస్టీ చెల్లించాలి. కానీ ప్రస్తుతం వస్తున్న దరఖాస్తుల్లో లేఅవుట్ దరఖాస్తుల కంటే వ్యక్తిగత ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులే అధిక సంఖ్యలో ఉంటున్నాయి. సర్కారు ఆదాయాన్ని తలదన్నేలా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఈ విధానం, దరఖాస్తు తీరుపై సరైన ఆవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కువ మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులనే ప్రొత్సహిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాల్లో కూడా ఈ దరఖాస్తు ప్రక్రియకు తెరలేచింది. ఎక్కడికక్కడ దరఖాస్తు కేంద్రాలు తెరవడంతో అర్జీలు పెట్టుకొనే వారంతా ఇలాంటి కేంద్రాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ కేంద్రాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు మాత్రం చేతిచమురు వదిలిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై డబుల్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ. 1,545 నుంచి రూ. 2,045 వరకు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ కింద వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వానికి జమ అయ్యే ఫీజుల కంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసే మధ్యవర్తులే అధికంగా సంపాదిస్తుండడం గమనార్హం. అందరికీ అందుబాటులో... ఎల్ఆర్ఎస్ పథకం దరఖాస్తు విధానం అత్యంత సులభంగా ఉంది. కానీ ఈ దరఖాస్తు చేసుకొనే తీరుపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, ట్యాబ్‌లలో దేని ద్వారానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో దరఖాస్తు ఫారం నింపాక దరఖాస్తుదారు తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొదటి పేజీని, లేఅవుట్ నమూనాను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుదారు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లను ఎంట్రీ చేసి నిర్దేశించిన ఫీజును ఆన్లైన్ ఖాతా లేదా ఏటీఎం కార్డు, టీవ్యాలెట్ యాప్‌ల ద్వారా చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రసీదు వస్తుంది. -
‘పరిష్కారాల’ తర్వాతే ధరణి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలకు సంబంధించిన భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, విధానపరమైన పరిష్కా రాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని మిగతా అన్ని పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యల్లేకుండా చేయాలని, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇళ్లు, ఆస్తుల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు. ‘గుణాత్మక మార్పు, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినప్పుడు గరీబులకే అత్యధిక ప్రాధా న్యతనివ్వాలి. ధరణి వెబ్ పోర్టల్‌ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుంది. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుంది. వ్యవ సాయ భూములకు ఆకుపచ్చ, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్‌పుస్తకాలను అందజేయాలి. ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేయాలి’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడి ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఒక్క నిరుపేదకూ బాధ కలగవద్దు.. దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలుకు ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలుపరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు. వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని అన్నారు. భూములను క్రమబద్ధీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం స్పష్టం చేశారు. గూండాగిరి తగ్గింది... ‘తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన వల్ల భూతగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గూండాగిరీ తగ్గింది. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్ నగరానికి ఉండే గంగాజమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసింది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాకముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. పేదరికానికి కులం, మతం లేదు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది’అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఒకనాడు స్లమ్ ఏరియాల్లోని గుడిసెలు నేడు పక్కా ఇళ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. వారి గుండె తీసి మనచేతుల్లో పెట్టారు. చారిత్రక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించవలసిన బాధ్యత మనపై ఉన్నది. నోటరీ, జీవో 58, 59 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు, దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వనిర్ణయాలు ఉంటాయి. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులవారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి·తఆన్లైన్లో పొందుపరిచేలా చూడాలి. భూములకు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్డేట్ చేయాలి’అని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. సీఎంపై ప్రజాప్రతినిధుల ప్రశంసలు సమీక్ష సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం మాట్లాడించారు. వారివారి నియోజకవర్గాల పరిధుల్లోని ప్రజల నివాసస్థలాలు, ఇళ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి, ప్రతిసమస్యనూ అధికారులతో నోట్ చేయించారు. ఈ సమస్యల తక్షణ పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, తమ రాజకీయజీవితంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల నివాసస్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించిన ముఖ్యమంత్రిని తాము ఇంతవరకూ చూడలేదని సీనియర్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దార్శనికతతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని వారంతా ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, నరగ, పట్టణ ప్రాంతాల ఎమ్మెల్యేలు, మేయర్లు పాల్గొన్నారు. -
వ్యవసాయేతర ఆస్తులకు..మెరూన్ పాస్‌బుక్
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ ముదురు ఎరుపు (మెరూన్) రంగు పట్టాదార్ పాస్‌బుక్స్ జారీచేయను న్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం, ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు íసీఎం చెప్పారు. కొత్తగా అమల్లోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమ న్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ... పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాదాబైనామాలకు చివరి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్ల పరస్పర మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరిసారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని , భవిష్యత్తులో ఇక సాదాబైనామాలను అనుమతించే ప్రశ్నే లేదని సీఎం తెలిపారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇంకా వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని సీఎం వివరించారు. పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ.. నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా, ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు, ఇతర ఆస్తులకు ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంíపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎంపీఓలు పర్యవేక్షించాలని సూచించారు. మ్యుటేషన్ తప్పనిసరి.. ఉచితం ఆస్తుల మ్యుటేషన్ ఇప్పుడు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న, బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్లైన్లో ఎన్రోల్ (మ్యుటేషన్) చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని ప్రతీ ఇంటి వివరాలు ఆన్లైన్లో నమోదు కావాలి, ఇంటికి నెంబర్ కేటాయించాలి, పన్నులు వసూలు చేయాలి అని సీఎం ఆదేశించారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్టీఎల్, నాలా, యూఎల్సీ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు మ్యుటేషన్ వర్తించదని సీఎం స్పష్టం చేశారు. ఇకముందు ఒక ఇంచు భూమి బదిలీ కావాలంటే కూడా... ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఆస్తుల మ్యుటేషన్‌కు, ఎల్ఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సీఎం వివరించారు. భవిష్యత్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా కన్వర్షన్ చేయడం... ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోటరీ, జీ.వో 58, 59 స్థలాల ఉచిత క్రమబద్ధీకరణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు వివరించారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. -
స్లమ్స్‌లో రూ.5కే క్రమబద్దీకరణ
సాక్షి, హైదరాబాద్: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజులో స్లమ్ పేరు ఉండాలి జీహెచ్ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆస్తులన్నీ ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఆస్తి వివరాలు ఇక పక్కాగా ఆన్లైన్లో నమోదు కానున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయి ల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100% ఆన్లైన్ చేయాలని సూచించారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ హించారు. ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశిం చారు. ఇందు కోసం డీపీఓలు, ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నా మని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమీక్షలో సీఎం తెలిపారు. ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా హరితహారం అమలు, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
పల్లె స్పందించలే!
సాక్షి, హైదరాబాద్ : సర్కారు భారీగా ఆశలు పెట్టుకున్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దర ఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా గ్రామ పంచాయతీల్లో వీటి సంఖ్య లక్ష కూడా దాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయ తీల్లో ఎల్ఆర్ఎస్ అర్జీలు పది లక్షలు దాటుతా యని అంచనా వేసిన పంచాయతీరాజ్ శాఖ.. తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. అనధి కార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ అనివార్య మని ప్రచారం చేస్తూ... దరఖాస్తు చేసుకోక పోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పి స్తోంది. ఈ క్రమంలోనే స్థల యజమానులు దరఖాస్తులు చేసుకునేలా కింది స్థాయి సిబ్బం దిని పురమాయిస్తోంది. గ్రామాల వారీగా అక్రమ లేఅవుట్ల జాబితా, స్థలాల వివరాలను సేకరించిన పంచాయతీ కార్యదర్శులు.. స్థల యజమానులకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించడంలో తలమునకలయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్లు చేసి మరీ.. స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోమంటూ అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 15వ తేదీ వరకు గడువుంది. ఇప్పటివరకు 94,886 దరఖాస్తులు! స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేగాకుండా అదే రోజు నుంచి ఎల్ఆర్ఎస్ లేని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీఓ 131 జారీ చేసిన సర్కారు.. ఇకపై స్థలాల క్రయవిక్రయాలకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని, క్రమబద్ధీకరించుకోకపోతే భవన నిర్మాణ అనుమతులు కూడా రావని స్పష్టం చేసింది. ఈ మెలికతో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటివరకు నగర పాలక సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనే ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను వర్తింపజేసిన ప్రభుత్వం.. తొలిసారిగా గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ, అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాలకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేసినా.. ప్రస్తుతం దాఖలైన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటి వరకు గ్రామ పంచాయతీల్లో 94,886 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి జిల్లాలు, మండలాల పునర్విభజనతో గ్రామీణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పది లక్షలు దాటుతాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. కాగా, దరఖాస్తుల స్వీకరణతో ప్రభుత్వానికి రూ.10.03 కోట్ల ఆదాయం లభించింది. ప్లాట్ ఓనర్ అయితే రూ.1,000, లేఅవుట్ యజమానికైతే రూ.10 వేలను ప్రాసెసింగ్ ఫీజుగా నిర్దేశించడంతో ఈమేరకు రాబడి సమకూరింది. ఇందులో ప్లాట్లకు సంబంధించి రూ.9.74 కోట్లు, లేఅవుట్లకుగాను రూ.28.80 లక్షల ఆదాయం వచ్చింది. కాగా, ఈ రెండింటిలో 517 లక్షల చదరపు గజాల స్థలం క్రమబద్దీకరణకుగాను స్థల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి టాప్..ఆసిఫాబాద్ లాస్ట్ రాష్ట్ర రాజధాని పరిసర జిల్లాల్లో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు తాజాగా ఆయా జిల్లాల్లో నమోదైన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రాలు, నగర. పురపాలక సంస్థల శివార్లలోనే అనధికార లేఅవుట్లు అత్యధిక స్థాయిలు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డి 24,178 వచ్చాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో యాదాద్రి 15,467, సంగారెడ్డి 14,356 జిల్లాలున్నాయి. ఆ తర్వాత మేడ్చల్ 13,755 దరఖాస్తులు నమోదయ్యాయి. అతితక్కువగా దరఖాస్తులు వచ్చినవాటిలో ఆసిఫాబాద్ జిల్లా 145, మహబూబాబాద్ 157, జగిత్యాల 232, నారాయణపేట 272, ములుగు 286 ఉన్నాయి. -
రిజిస్ట్రేషన్లు ప్రారంభం అక్టోబర్‌లోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవ కాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసిన తర్వాతే పటిష్ట పద్ధ తిలో ఈ ప్రక్రియను ప్రారంభించాలనే ఆలో చనతో ఉందని, వచ్చే నెలలోనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా భూరికార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరా లను సమన్వయ పరుచుకోవడం, ధరణి వెబ్ సైట్‌ను అప్డేట్ చేయడం జరగాలి. రెవెన్యూ చట్టం అమలుపై నూతన మార్గదర్శకాలు వెలు వడాలి. దీంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లపై రాష్ట్రంలోని అన్ని మండలాల తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని, భూముల మార్కెట్ విలువల సవరణ కసరత్తు పూర్తి చేయాలని, అదే విధంగా కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తిస్థాయిలో అందు బాటులోకి రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం పడుతుందని సచి వాలయ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసి పది రోజులు దాటుతున్నందున... మరో పది, పదిహేను రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, అక్టోబర్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశముందని అంటున్నాయి. సవరణ... ఆధునీకరణ ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూముల మార్కెట్ విలువలను సవరించాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విలువల సవరణ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గతంలోనే సబ్రిజిస్ట్రార్లు, రెవెన్యూ వర్గాల నుంచి భూముల మార్కెట్‌విలువలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే ప్రస్తుత విలువలు, సవరించాల్సిన విలువల విషయంలో పారదర్శకత లోపించిందనే కారణంతోనే మార్కెట్ విలువల సవరణ కసరత్తును ప్రభుత్వం థర్డ్ పార్టీకి అప్పగించినట్టు రిజిస్ట్రేషన్ వర్గాలు చెపుతున్నాయి. సరళీకరణ, హేతుబద్ధీకరణ కోణంలో మార్కెట్ విలువలను సవరించాలని, అవసరమైన చోట్ల తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలను సవరించి ఆరేళ్లు దాటుతున్నందున కనీసం 100 నుంచి 300 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, హైవేల చుట్టుపక్కల ప్రాంతాలు, ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్సులు, పారిశ్రామిక ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను పెంచే దిశలో కసరత్తు జరుగుతోంది. అల్పాదాయ ఆఫీసుల ఎత్తివేత దీంతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో అతి తక్కువ లావాదేవీలు జరిగి, స్వల్ప ఆదాయం వచ్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేయాలని, అదే విధంగా అత్యధిక ఆదాయం వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను రెండు లేదా మూడుగా విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని 25వరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేసి అర్బన్ ప్రాంతాల్లో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పనిలోపనిగా సబ్రిజిస్ట్రార్ల బదిలీ ప్రక్రియను కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలోని ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగనుండగా, ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను కూడా ఆధునీకరించాలని, వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో జరిగే డాక్యుమెంట్ల రూపకల్పనలో తప్పులు జరిగితే వారినే బాధ్యులను చేయాలని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్న వారి విద్యార్హత, అనుభవానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. పని విభజన కోసం.. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లే చేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూములు, ఇతర భవనాలు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న ఇతర కార్యకలాపాలను సబ్రిజిస్ట్రార్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డుల సమన్వయం, వాటిని ధరణి వెబ్‌సైట్‌తో పాటు కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఇమిడ్చే పనిలో ప్రభుత్వ వర్గాలున్నాయి. దీనికి తోడు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తహసీల్దార్లకు శిక్షణ ప్రారంభం కానుంది. ఇది ముగిసేలోపు ధరణి వెబ్‌సైట్‌ను కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా అప్డేట్ చేయాల్సి ఉంది. -
‘ఎల్ఆర్ఎస్’ ఊరట
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చార్జీలు తగ్గనున్నాయి. లే–అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల(ఎల్ఆర్ఎస్)–2020 ఉత్తర్వుల(జీవో 131)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం కొత్త ఉత్తర్వులు(జీవో 135) జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ల మార్కెట్ విలువ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తామని బుధవారం శాసనసభలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే.. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని కొత్త జీవో ద్వారా కీలక సవరణ జరపడంతో దరఖాస్తుదారులకు భారీ ఊరట కలగనుంది. తగ్గనున్న భారం.. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ మొత్తం ధరలో 14శాతాన్ని చెల్లించాలని జీవో 131లో ఉండటంతో దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరణ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలతో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులకు మాత్రం ఈ సవరణతో ఎలాంటి లబ్ధి ఉండదు. వారు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారం గానే.. 14 శాతాన్ని చెల్లించాల్సి రానుంది. అయితే, పాత జీవోలో పేర్కొన్న ప్రకారం 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే క్రమబద్ధీకరణ చార్జీలు వర్తించనున్నాయి. అదే విధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించా ల్సిన నాలా చార్జీలను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవస రం లేదని ప్రభుత్వం పేర్కొనడం మరో ఊరట కలిగించే అంశం. శ్లాబులు 4 నుంచి 7కి పెంపు.. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ చార్జీలను ప్రకటిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131 జారీ చేసింది. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న ప్లాటు మార్కెట్ విలువ ఆధారంగా ‘కనీస క్రమబద్ధీకరణ చార్జీ’ల్లో నిర్ణీత శాతాన్ని కనీస క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాలని తొలి జీవోలో పేర్కొంది. అలాగే క్రమబద్ధీకరణ చార్జీలను నాలుగు శ్లాబులుగా విభజించింది. సవరణ ఉత్తర్వుల ప్రకారం.. శ్లాబుల సంఖ్యను 4 నుంచి 7కు పెంచింది. ఆ మేరకు క్రమబద్ధీకరణ చార్జీల శాతాన్ని సైతం తగ్గించింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్–2015 పథకంలో పేర్కొన్న శ్లాబులనే తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో క్రమబద్ధీకరణ చార్జీల భారం దరఖాస్తుదారులపై తగ్గనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
క్రమబద్ధీకరణలో ఊరట
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులకు భారీ ఊరట లభించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయానికి ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగానే క్రమబద్ధీకరణ రుసుములు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 ఆగస్టు 28 తేదీన అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో (131)లో పేర్కొంది. చాలా ఏళ్ల కింద, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగాభారీగా క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. గడిచిన దశాబ్దకాలంలో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. తాజా మార్కెట్ విలువ ప్రకారం చాలా చోట్ల 200 గజాల స్థలానికి సైతం రూ.లక్షల్లో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమబద్ధీకరణ రుసుములు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండటాన్ని శాసనసభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తెచ్చారు. దీంతో ఎల్ఆర్ఎస్ (జీవో 131) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉప్రకమించింది. బుధవారం శాసనసభలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆయా స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే ఫీజులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈమేరకు సవరించిన ఉత్తర్వును గురువారమే వెలువరించనున్నట్టు ప్రకటించారు. తాము తీసుకున్న చర్యల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునేందుకు వెనకాడబోమని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం కింద భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉపశమనం లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎంత పాతది అయితే అంత ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. ఆరేళ్లుగా అదే మార్కెట్ విలువ.. మరోవైపు గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. అంటే గత ఆరేళ్లలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు యధావిధిగా భారీ మొత్తంలో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరించుకోకపోతే అనధికార, అక్రమ ప్లాట్ల క్రయావిక్రయాల రిజిస్ట్రేషన్లను జరపమని, వీటిల్లో భవన నిర్మాణాలకు సైతం అనుమతులు జారీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్లాట్లు, లేఅవుట్ల యజమానులు నిర్బంధంగా క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తమ ప్లాట్లను బేరానికి పెడుతున్నారు. కొనుగోలుదారులు బయానాగా క్రమబద్ధీకరణ చార్జీలు భరించాలని, ఆ తర్వాత మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్‌లో సమయంలో తీసుకుంటామని ప్లాట్ల యజమానులు ఆఫర్ చేస్తున్నారు. మురికివాడల్లో మినహాయింపు ఇవ్వాలి... భవన నిర్మాణ నిబంధనల ప్రకారం నోటిఫైడ్ స్లమ్స్‌లో భవన నిర్మాణ అనుమతుల జారీకి భారీ రాయితీలు, సడలింపులున్నాయి. ఇతర చోట్లలో వసూలు చేసే భవన నిర్మాణ చార్జీలతో పోల్చితే మురికివాడల్లో నాలుగో వంతు చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే విధంగా లేఅవుట్ అనుమతులు లేకపోయినా /ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ చేసుకోకపోయినా మురికివాడల్లోని ప్రజల నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతుల జారీ సమయంలో ఎలాంటి జరిమానాలు, చార్జీలు వసూలు చేయడం లేదు. తాజాగా ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం కింద మురికివాడల్లోని స్థలాల క్రమబద్ధీకరణకు చదరపు మీటర్‌కు రూ.5 చొప్పున కనీస క్రమబద్ధీకరణ చార్జీలకు తోడుగా, స్థలం మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాల్సి రానుంది. మురికివాడల్లోని పేదలకు ఇది భారం కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. -
‘ఇంటి’కి గ్రీన్‌సిగ్నల్