rims hospital
-
ఆస్పత్రికి వెళ్తూ.. కానరాని లోకాలకు
గుడిహత్నూర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, దివ్యాంగుడైన భర్తకు స్వల్పగాయాలయ్యాయి. ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ కథనం ప్రకారం.. ఇచ్చోడ మండలం కోకస్‌మన్నూర్‌కు చెందిన జాదవ్ మధుకర్–రమ్యక్రిష్ణ (30)భార్యాభర్తలు. భర్త మధుకర్ దివ్యాంగుడు, కోకస్‌మన్నూర్‌లో కిరాణషాపు నడిపిస్తున్నాడు. రమ్యక్రిష్ణ.. లేడిస్ ఎంపోరియం నడిపిస్తోంది. వీరికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలో ఇటీవల మీ సేవ కేంద్రం మంజూరైంది. రమ్యక్రిష్ణ శిక్షణ సైతం తీసుకుంది. గత కొంతకాలంగా ఈమె చర్మవ్యాధితో బాధపడుతోంది. రెండు రోజులుగా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం భర్తతో కలిసి బైక్‌పై రిమ్స్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో వీరి బైక్‌ను వెనుక నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టింది. జాతీయ రహదారి 44పై పక్కన రెయిలింగ్‌పై రమ్యక్రిష్ణ ఎగిరిపడింది. ఆమె రెండు చేతులు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. హెల్మెట్ ధరించి ఉండడంతో భర్తకు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు భర్తకు చికిత్స అందిస్తున్నారు. మధుకర్ తండ్రి తుకారాం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి 6, 7 ఏళ్లలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
"మా జీతాలు ఎక్కడ ?" రిమ్స్ ఉద్యోగుల నిరసన
-
రిమ్స్ లో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు..పేషెంట్లను చంపేస్తామంటూ బెదిరింపు
-
రిమ్స్ మళ్లీ తెరపైకి.. స్టాఫ్‌నర్సుల నుంచి డబ్బులు వసూలు!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగా.. మాకేమిటి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా అది చాలదనట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్ కదలనివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కొంతమంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్‌ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్, అవుట్‌సో ర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్‌లో చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌నర్సుల నుంచి వసూళ్లు.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్క డ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు. మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ.3వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్)లో ఏకంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 36 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్‌పై రాసుకొని గ్రూప్‌లో వేశారు. ఇంక్రిమెంట్ కాకపోతే పీఆర్సీ, ఐఆర్‌లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారు. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగి టేబుల్‌పై పెట్టిన ఫొటోలు, గ్రూప్ చాటింగ్ మెస్సేజ్‌లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం ఆ ఉద్యోగి స్టాఫ్ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం. అయితే విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. సర్వీసు బుక్‌లో వివరాలు నమోదుకు గాను 2021లో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ నర్సుల నుంచి రిమ్స్‌లో కొంతమంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. రిమ్స్‌లో స్టాఫ్ నర్సుల నుంచి ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. తన బర్త్‌డే సందర్భంగా కానుకలు తీసుకున్న విషయం విదితమే. తర్వాత అధికారులు సదరు అధికారిపై విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పిస్తానని రిమ్స్‌లో పనిచేసే ఓ ల్యాబ్ అసిస్టెంట్ నుంచి మరో ల్యాబ్ అసిస్టెంట్ రూ.లక్ష 50వేలు వసూలు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అందులో నుంచి కొంత డబ్బులు బాధితుడికి తిరిగివ్వడం జరిగింది. అయితే సదరు ఉద్యోగి నెలలు గడుస్తున్నా ఇంకా విధులకు హాజరుకాకపోవవడం గమనార్హం. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల కోసం ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. స్టాఫ్ నర్సులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటాను. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్‌డైరెక్టర్ -
పురిటి కష్టాలు.. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే..
ఆదిలాబాద్: గర్భిణులకు రిమ్స్‌లో పురిటి కష్టాలు తప్పడం లేదు. నవమాసాలు మోసి ప్రసవం కోసం ఇక్కడికి వస్తున్న వారిలో ఇటీవల పలువురు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వెద్యుల నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. రూ.కోట్లాది నిధులతో సర్కారు ఆసుపత్రి నిర్మించినా పేదల కష్టాలు మాత్రం దూరం కావడం లేదు. మెటర్నిటీ వార్డులో పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుకు రూ.వేలాది చెల్లించుకోలేని పేదలు రిమ్స్‌లో చేరితే వైద్యం అందక అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే ఇద్దరు బాలింతలు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తుంది. గైనిక్ వార్డులో పర్యవేక్షణ కరువవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వార్డును పర్యవేక్షించాల్సిన అధికారి చుట్టపు చూపుగా రావడం, వచ్చినా పట్టించుకోకపోవడం, బాలింతలకు సరైన వైద్య సేవలు అందించకపోవడమే కష్టాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి లేకపోతే రిమ్స్‌కు పీజీ సీట్లు రావనే ఆలోచనతో ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఆ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా గైనిక్‌వార్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే.. జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా, మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రిమ్స్‌లో పలు వార్డులు ఉండగా, అందులో మెటర్నిటీ, ఎమర్జెన్సీ వార్డులే కీలకం. ప్రసవం కోసం ఇన్పెషేంట్స్ దాదాపు 200కు పైగా ఉంటారు. అయితే ఈ కీలక వార్డుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. గైనిక్ వార్డులో హెచ్‌వోడీతో పాటు మరో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు రిమ్స్‌లో నలుగురు పీజీ చేస్తున్న గైనిక్ వైద్యులున్నారు. అలాగే షిఫ్టుల వారీగా ముగ్గురు చొప్పున హౌస్ సర్జన్లు ఈ వార్డులో ఉంటారు. ఓపీలో ఇద్దరు, ఆపరేషన్ థియేటర్లో మరో ఇద్దరు ఉన్నప్పటికీ మిగతా వైద్యులు గైనిక్ వార్డులో ఉండాలి. కానీ వారు చుట్టపుచూపులా కనిపిస్తుండడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం అయిన తర్వాత రక్తస్రావం, బీపీ, తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అవేమి పట్టించుకోకుండా మధ్యాహ్నానికే ఇంటి ముఖం పడతారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచినా వారు విసుక్కోవడం, వస్తాం.. వెళ్లండనే సమాధానాలు తప్పా వచ్చి చూసిన దాఖలాలు ఉండవని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రిమ్స్‌లో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్లు, పీజీ డక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల పాటు మెటర్నిటీ వార్డులో ఉండాల్సిన వైద్యులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తప్ప రాత్రి వేళల్లో రావడం లేదు. దీంతో గతంలో ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఓ గర్భిణి సకాలంలో వైద్యం అందక పురిటి నొప్పుల్లోనే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మారని రిమ్స్ తీరు.. ఎన్ని విమర్శలొస్తున్నా ఇక్కడి వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ పనిచేసే చాలా మంది వైద్యులకు ప్రైవేట్ క్లినిక్‌లు ఉండడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో రిమ్స్‌లో ఉన్న వారికి నాణ్యమైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. కాసులిస్తేనే.. సేవలు గైనిక్ వార్డులో కొంతమంది సిబ్బంది తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిజేరియన్, సాధారణ ప్రసవమైన తర్వాత సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేకుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడబిడ్డ పుడితే రూ.500.. ఇలా రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడకు చెందిన సొనాలి కాంబ్లే(22) రిమ్స్‌లో జూలై 25న మగబిడ్డకు జన్మనిచ్చిన ఐదారు గంటల్లోనే మృతి చెందింది. డెలివరీ కోసం రెండు రోజుల ముందుగానే ఆస్పత్రిలో చేరిన ఆమె సాధారణ ప్రసవం అయ్యింది. ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనివ్వగా, 10 గంటల సమయంలో చనిపోయింది. అయితే వైద్యులు మాత్రం ఉమ్మ నీరు ఊపిరితిత్తులో చేరి శ్వాస ఆడక చనిపోయిందని చెప్పడం గమనార్హం. గత నెలలో సిరికొండ మండలానికి చెందిన ఓ గర్భిణి రిమ్స్‌లో ప్రసవం కోసం చేరింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యం (కాలేయ సమస్య) కారణంగా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా, తీరా చనిపోయిన తర్వాత అనారోగ్య సమస్య అని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. గైనిక్ వార్డులో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెండు బైకులు గాల్లోకి లేచి..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అతివేగం కారణంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి వద్ద వేగంగా వస్తున్న ఓ బైక్.. మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో హై స్పీడ్‌లో బైక్ మీద వస్తున్న వ్యక్తితో సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంలో ఉన్న బైక్.. రెండు బైకులును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి లేచి రోడ్డుపై పడిపోయారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఇక, ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. -
లాలూను రాంచిలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు
-
ఆదిలాబాద్ రిమ్స్ కోవిడ్ సెంటర్ లో చోరీ
-
వైద్యం వద్దు.. దేవుడే రక్షిస్తాడు.. చికిత్సకు నిరాకరించిన గర్భిణి
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): ‘ఆస్పత్రికి రాను.. దేవుడికి మొక్కుకున్న.. అతడే రక్షిస్తాడు’ అంటూ వైద్యం చేయించుకునేందుకు గర్భిణీ నిరాకరించిన సంఘటన శనివారం మండలంలోని మహగావ్ శేకుగూడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శేకుగూడ గ్రామానికి చెందిన మేస్రం రేణుకబాయి 8 నెలల గర్భవతి. ఇది ఆమెకు మూడో కాన్పు. మొదటి రెండు కాన్పుల్లో హైబీపీ (అధిక రక్తపోటు) కారణంగా అబార్షన్ జరిగింది. ఈనెల 26న ఉట్నూర్ సామాజిక ఆస్పత్రిలో నెలవారి వైద్య పరీక్షలో భాగంగా ఆశ కార్యకర్త సదరు గర్భిణీని తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్ట్ మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేశారు. అయితే ఆస్పత్రికి వెళ్లేందుకు రేణుకబాయి నిరాకరించింది. సూపర్వైజర్లు రాజమ్మ, చరణ్‌దాస్‌లు కౌన్సెలింగ్ చేసినా వైద్యానికి ఒప్పుకోలేదు. దీంతో శనివారం తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. ఆయన గ్రామానికి చేరుకుని గోండ్ భాషలో నచ్చజెప్పారు. అయిన వినకుండా దేవుడికి మొక్కుకున్నానని, దేవుడే కాపాడుతాడని మొండికేసింది. హైబీపీ ప్రభావం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై పడుతుందని, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు. ఆస్పత్రికి వెళ్లేదే లేదంటూ అందరూ ఉండగానే రేణుకబాయి గ్రామంలోని వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది. ఆస్పత్రికి వెళ్లకుంటే వచ్చే అనార్థల గురించి అధికారులు, వైద్య సిబ్బంది రేణుకబాయి కుటుంబ సభ్యులకు వివరించారు. అయినా పూర్తిస్థాయి వైద్యానికి గర్భిణీ నిరాకరించింది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలకు మాత్రమే ఆమె అంగీకరించింది. డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ఆర్ఐ శకుంతల, సీడాం మల్కు పటేల్, మేస్రం జంగు, తొడసం బండు తదితరులు ఉన్నారు. చదవండి: Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి -
TS: రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌పై కలెక్టర్ సీరియస్
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌పై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో డెలివరీలు చేయకపోవడం సరికాదన్నారు. డెలివరీ నిలుపుదలపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. అనస్థీషియా డాక్టర్ కొరత ఉన్న మాట నిజమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనస్థీసియా డాక్టర్లు లేరని సర్క్యూలర్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. చదవండి: ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు కాల్.. మీటింగ్‌కు వెళ్లొద్దంటూ.. రిమ్స్ అస్పత్రిని సందర్శించి.. గర్బిణి మహిళలతో మాట్లాడి డెలివరీల నిలుపుదలపై వివరాలు సేకరించారు. ప్రసవం కోసం వచ్చిన మహిళలకు అనస్థీషియా డాక్టర్లు లేరని సర్జరీలు చేయకపోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని డెలివరీలు చేయాలని ఆదేశించారు. డెలివరీల చేయకుండా కరీంనగర్, హైదరాబాద్‌కు రెఫర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: KTR Office: మేము చూసుకుంటాం.. సాయం చేస్తాం -
కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స..
-
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
-
సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 16 టీచింగ్ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..: బోధన ఆస్పత్రులు–డయాగ్నస్టిక్ సేవలు ‘ఈరోజు రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులలో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రెడేషన్ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము’. ఆరోగ్యశ్రీ కింద సేవలు ‘టీచింగ్ ఆస్పత్రులలో ఆ సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో ఆ పరికరాలు, నిరంతరం బాగా పని చేసేలా చర్యలు చేపడుతున్నాము’. జాతీయస్థాయి ప్రమాణాలతో.. ‘నాడు–నేడులో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాము. ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము. ఇప్పుడు రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్ఐ పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రులలో అన్ని సదుపాయాల ఏర్పాటు చేస్తాం’. మిగిలిన ఏడింటిలో కూడా ‘రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులలో నాలుగు చోట్ల సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు లేవు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో ఏర్పాటు చేస్తున్నాము. మిగిలిన ఏడు చోట్ల ఆ సదుపాయాలు పిపిపి విధానంలో ఉన్నాయి. కాబట్టివాటిని ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేస్తుంది. ఇంకా కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్ ఆస్పత్రులలో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పిస్తాము’. వారి సేవలకు వందనం ‘ఈ కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు. వలంటీర్లు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ మా అభినందనలు’. ఆగ్రహం వద్దు ‘ఈ సందర్భంగా కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు కొన్ని సూచనలు. ఫీవర్ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని నా దృష్టికి వచ్చింది. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారని అందరూ గుర్తుంచుకోవాలి. అందుకే అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కోరుతున్నాను’. నా విజ్ఞప్తి ‘మీ అందరికీ నా తరపున ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిళ్లలో పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డుబాయ్స్, చివరకు శానిటేషన్ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కునే ఒత్తిడిలో ఉన్నారు’. అందుకే సాధ్యమైంది ‘ప్రతి రోజూ 20 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిజానికి అందరూ చాలా బాగా పని చేస్తున్నారు. అందుకే మన దగ్గర టయర్–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. మీరంతా ఆస్పత్రుల్లో బా«ధ్యతను తీసుకోవడమే కాకుండా, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే ఇది సా«ధ్యమైంది. అదే విధంగా కోవిడ్‌ను కూడా ఎదుర్కోగలుగుతున్నాము. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. అధికారులు మంచితనంతో పని చేయించుకోవాలని కోరుతున్నాను’డ అని విజ్ఞప్తి చేసిన సీఎం జగన్ ఈ మంచి కార్యక్రమంతో ప్రజలకు ఇంకా మేలు జరగాలని మనసారా కోరుకుంటున్నానంటూ ప్రసంగం ముగించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: 100కు పైగా ఆక్వా హబ్‌లు -
పేషెంట్ బెడ్ కింద పాము.. రోగుల పరుగులు
సాక్షి, ఆదిలాబాద్ : రిమ్స్‌లో నాగుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ మెటర్నటీ వార్డులోకి చొరబడిన నాగుపాము కాసేపు వార్డులో సంచరించింది. వార్డులో ఉన్న వారు బిగ్గరగా కేకలు వేయడంతో వారి శబ్ధానికి అక్కడి నుంచి మూత్రశాలలోకి వెళ్లింది. మూత్రశాలలో చెత్తాచెదారం ఉండడంతో ఎంత వెతికినా పాము దొరకలేదు. చివరకు వార్డు నుంచి రోగులను వేరే గదికి మార్చారు. కాగా రిమ్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే, తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. చదవండి: ఒక తల్లి పాము..70 పిల్ల పాములు.. -
వాహనం బోల్తా..16 మందికి తీవ్రగాయాలు
సాక్షి, వైఎస్సార్, కడప : రాజంపేట మండలం రోళ్ళమడుగు సమీపంలో మాడికాయల లోడుతో వెళుతున్న ఇశ్చర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటీ అమరనాథ్ రెడ్డి వాహనాలలో ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న నలుగురిని కడప రిమ్స్‌కు తరలించారు. -
రిమ్స్‌లో గొంతు కోసుకున్న కరోనా పేషెంట్
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ (38) సోమవారం తెల్లవారుజామున కత్తితో గొంతు కోసుకున్నాడు. కడప సాయిపేటకు చెందిన ఇతను మూడు రోజుల నుంచి రిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కత్తితో గొంతు కోసుకోవడంతో గమనించిన వైద్యులు సర్జికల్ ఐసీయూలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్బంగా రిమ్స్ వైద్యులు మాట్లాడుతూ ఇతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలి పారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రిమ్స్ పోలీసులు చెప్పారు. -
లాలూను వేధిస్తున్న కరోనా టెన్షన్
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహర్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కరోనా భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందించిన వైద్యుడే లాలూ ప్రసాద్‌కు కూడా చికిత్స చేయడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇదే హాస్పిటల్లో లాలూ కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత మూడు వారాలుగా లాలూకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్‌ప్రసాద్ కరోనా బాధితుడికి కూడా వైద్యం చేశారు. దీంతో కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఉమేష్‌ప్రసాద్‌తో పాటు, అతని బృందంలోని అందరినీ క్వారంటైన్‌కు పంపుతున్నట్లు రిమ్స్ ప్రకటించింది. అంతేకాకుండా వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్రసాద్‌కి కూడా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే లాలూను పెరోల్ పై విడుదల చేసే ప్రతిపాదనను జార్ఖండ్ అడ్వకేట్ జనరల్‌కు సీఎం హేమంత్ సోరెన్ పంపించారు. కాగా 7 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష ఉన్న ఖైదీలను మాత్రమే పెరోల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. (లాలూ ప్రసాద్‌కు అనారోగ్యం) -
శవాలు కదులుతుంటే తెలియని భయం..
శవాన్ని చూడగానే కొందరు భయపడతారు.. కొందరు పక్కకి జరిగిపోతారు. ఒకవేళ తెలిసిన వారు మృతిచెందినా ఆ దేహాన్ని తాకకుండానే నివాళులర్పించివెనుతిరుగుతారు.. సాధ్యమైనంత తొందరగా అంత్యక్రియలూ నిర్వహిస్తారు. ఇవీ సహజంగాఎక్కువ సందర్భాల్లో తారసపడే దృశ్యాలు.. కానీ వీరు మాత్రం శవాన్ని ముట్టుకోడానికి ఏమాత్రం సంకోచించరు.. ఆ శవంతో తమకు ఎలాంటి బంధం లేకున్నా దాని దగ్గరే నిలబడతారు. వైద్యుని సూచనల మేరకు శవం శరీర భాగాలను కోస్తారు.. వైద్యులు కాకున్నా కుట్లు వేయడానికీ వెనుకాడరు.. శవాల మధ్యే ఉంటున్నా భయమనేది ఏ కోశానా వారిలో కనిపించదు.. వారెవరో కాదు.. మార్చురీ వద్ద తోటీలుగా వృత్తి నిర్వహించే వారు.. మద్యం మత్తులో విధులు నిర్వర్తిస్తారని.. మనసు లేకుండా యాంత్రికంగా చేసుకుపోతారని అనుకుంటే పొరపాటే. సాక్షి పలకరించినప్పుడు కడప మార్చురీ వద్ద తోటీలు మనసును కదిలించే ఆసక్తికర అంశాలు వెల్లడించారు.. వీరి జీవన శైలిపై ప్రత్యేక కథనం.. సాక్షి కడప: శవాల గది (పోస్టుమార్టం రూం).. ఇక్కడ శవాలు తప్ప ఏమీ ఉండవు.. వివిధ కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలు ఇక్కడ చేరుస్తారు. అయినవారు ఎవరూ లేని డెడ్‌బాడీలను ప్రీజర్ బాక్సులో ఉంచుతారు. ఈ పోస్టుమార్టం రూం పేరు వింటేనే ఒకరకమైన బాధ.. ఆందోళన కలుగకమానవు. ఇక అక్కడ అడుగు పెట్టాలంటే భయంగా ఉంటుంది. అలాంటిది ఆ శవాల గది వద్ద ప్రతినిత్యం ఉంటూ.. అక్కడే తిరుగుతూ ఆ గదిలోనే పనులు చేసుకుంటూ.. విధులు నిర్వహించే తోటీల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. చెప్పలేని ఆవేదన అనుభవిస్తున్నా... వంశపారంపర్యంగా వచ్చిన వృత్తిని దైవంగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ సమక్షంలో శవాన్నికోసేటప్పుడు... శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీ, లివర్, పొట్ట.. ఇలా అవయవాలను బయటికి తీస్తున్నప్పుడు.. ఎంతో వేదన అనుభవిస్తుంటామని.. కన్నీటి పర్యంతం అవుతుంటామని... అయినా విధి నిర్వహణలో ఇవన్నీ తప్పవని కడప రిమ్స్ పోస్టుమార్టం గదిలో పనిచేస్తున్న తోటీలు వెంకటయ్య, టి.నర్సారావు అంటున్నారు. విధి నిర్వహణలో వారు అనుభవిస్తున్న బాధ.. కష్టం.. ఎదుర్కొన్న సంఘటనలు సాక్షికి వివరించారు. ఆ ఇద్దరూ అక్కడే.. కడప మాసాపేటకు చెందిన వెంకటయ్య, నర్సారావులు నెల్లూరు జిల్లాకు చెందినవారైనా.. వాళ్ల పెద్దల కాలంలోనే కడపలో స్థిరపడ్డారు. ఇరువురికి వారి తండ్రులు చనిపోవడంతో తోటి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నర్సారావు 12ఏళ్ల నుంచి పోస్టుమార్గం గదిలో పనిచేస్తుండగా.. వెంకటయ్య 30 ఏళ్లుగా శవాల మధ్యన తోటిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు నాలుగు వేలకు పైగా...మరొకరు 10 వేలకు పైగా... కడప రిమ్స్ మార్చురీలో తోటిగా పనిచేసే గోవింద్ 1991లో చనిపోయారు. దీంతో ఆయన కుమారుడైన వెంకటయ్యకు ఆ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 10 వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. వెంకటయ్యకు మేనల్లుడైన మహాదేవ్ కూడా ఈ పనిలో సహకరిస్తుంటాడు. 12 ఏళ్ల క్రితం నాన్న చనిపోవడంతో కుమారుడు నర్సారావుకు తోటి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇతను కూడా పోస్టుమార్టంలో భాగంగా వైద్యుల సమక్షంలో మృతదేహం కోతకు సంబంధించిన పనులు చేస్తున్నారు. దాదాపు నాలుగు వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహణలో పాలుపంచుకున్నారు. అయితే ఇటీవల నర్సారావు కుమారుడైన రాజా కూడా అక్కడే స్వీపర్‌గా పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మార్చురీ రికార్డు గదిలో భోజనం చేస్తున్న తోటీలు మొదట్లో తినేవాళ్లం కాదు... కడపలోని క్రిస్టియన్‌లేన్ సమీపంలో ఉన్న పాత రిమ్స్‌లో ఆస్పత్రి ఉన్నప్పుడు తోటిగా జాయిన్ అయిన మొదట్లో వృత్తి రీత్యా జీతం వస్తుందని సంతోషమనిపించినా... ఆరు నెలలపాటు చాలా అవస్థలు పడ్డాం. అది ఎంత అంటే ఒక పక్క భయం, జంకు.. మరోపక్క ఇంటికి వెళితే తిండి కూడా తినలేని పరిస్థితి. పోస్టుమార్టం గదిలో శవాలపై చేసిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఇంటిలో అన్నం తిందామని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొన్నా ఏదో తెలియని బాధ. అన్నం గిన్నెలో చేయి పెడితే చాలు.. పోస్టుమార్టం గదిలో చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి ఆరు నెలల వరకు తినడమే తగ్గించాం. భోజనం ప్లేటులో చేయి పెడితే ఏదో పేగులు, గుండె, రక్తం మీద పెట్టినట్లుగా గుర్తుకు వచ్చి తినలేకపోయేవాళ్లం. తర్వాత తట్టుకోలేక అంతో ఇంతో మద్యం సేవించి తింటూ వచ్చాం. అలా ఏడాది గడిచేంత వరకు ఇబ్బందులు పడుతూ వచ్చాం. శవాలు మీదపడేవి.. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన రిమ్స్ ఆవరణలో విశాలమైన పోస్టుమార్టం గదితోపాటు శవాలను నిల్వ చేయడానికి ఫ్రీజర్లు ఉన్నాయి. అదే 15 ఏళ్లు వెనక్కి వెళితే.. పాత రిమ్స్‌లో ఇరుకైన గది.. పోస్టుమార్టానికి ఒక టేబుల్ మాత్రమే ఉండేది. దీంతో చాలా సందర్భాలలో అనేక అగచాట్లు పడేవాళ్లం. రాయచోటి ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరిగి 10 మంది వరకు చనిపోయినప్పుడు శవాలను తీసుకొచ్చి పోస్టుమార్టం గదిలో పెట్టారు. అప్పట్లో స్థలంలేక ఒక బాడీ మీద ఒకటి వరుసగా పెట్టడం.. ఇతర ఏదైనా శవాలు వచ్చినా అన్ని వరుసగా పెట్టడంతో తిప్పలు చాలా ఎదుర్కొన్నాం. అంతేకాదు.. అనాథ శవాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బాడీ ఫ్రీజర్లు లేవు. ఒకదాని మీద ఒకటి శవాలను వరుసగా పేర్చి పెట్టేవాళ్లం. ఏదైనా చేయడానికి వెళ్లినపుడు ఒక్కసారిగా అవి వచ్చి మీద పడేవి. చిన్నగా మీద పడిన శవాలను ఒక్కొక్కటిగా పైకి చేర్చి మళ్లీ పనిచేసుకుంటూ ముందుకు పోయాం. అప్పుడు చాలా భయం అనిపించేది. కొన్ని సందర్భాల్లో శవం తెచ్చి మాకు అప్పగించడంతోపాటు ఐస్‌గడ్డ ఇచ్చేవారు. ఐస్‌గడ్డలపై పెట్టి దానిపై బాడీని పడుకోబెడుతుండగా ఐస్‌గడ్డ కరిగి బాడీ కిందికి జరిగే సందర్భం చూసినపుడు వణికిపోయేవాళ్లం. ఎందుకంటే మృతదేహాలు కదులుతుంటే తెలియని భయం. ఇలా ఒకటేమిటి? చాలా అనుభవించాం. శవాలు పట్టుకుంటే చేతిలోకి కండలు.. నాకు బాగా గుర్తు. 2001 సంవత్సరంలో బుగ్గవంక వరద నీరు కడప నగరంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. ఆ సమయంలో అనేకమంది ఈ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో వంక నీటిలో చనిపోయారు. ఆ శవాల తాలూకు ఒకటి చెట్టుకు కరుచుకుంటే.. ఒకటి బ్రిడ్జి సందున, ఇంకోటి బురదలో ఇరుక్కుపోయి బాడీలు కనిపించాయి. బుగ్గ వంక ఉధృతి తగ్గి శవాల పోస్టుమార్టం వద్దకు వెళ్లేటప్పటికి కాళ్లు, చేతులు నీలక్కపోయి, చవికిపోయి ఉన్నాయి. కనీసం బురద నుంచో.. చెట్టు నుంచో పట్టుకొని పక్కకు లాగుదామన్నా చవికిపోయిన శరీరానికి సంబంధించిన కండలు, ఎముకలు చేతిలోకి వచ్చాయి. దీంతో ఏమీ చేయలేక ఉబ్బిపోయిన శవాలను చిన్నగా పట్టుకుని బయటకు తీస్తుంటే.. వారి అవయవాలు, ఎముకలు చేతిలోకి ఊడి రావడం చూసి మాలో మాకే ఏడుపొచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో అలాగే చేశాం. అరిష్టమని.. ఊరిలోకి రానివ్వరు.. 1800 నుంచి 2 వేల మంది గర్భవతులు చనిపోయిన ఘటనలలో నేను వారికి పోస్టుమార్టం చేసిన సందర్భాలలో చాలా బాధ అనుభవించానని తోటి వెంకటయ్య అంటున్నాడు. ‘వారి బంధువులు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు గర్భవతిని అలాగే పూడ్చి పెట్టరు. సాంప్రదాయం ప్రకారం చేయాలని....కర్మకాండలు చేసే ప్రాంతానికి తమను తీసుకెళ్లి అక్కడ బిడ్డను బయటకు తీయమని కోరేవారు. వారి కోరిక మేరకు బిడ్డను వారి చేతిలో పెట్టేవాళ్లం. అప్పుడు ఆ శిశువును వాళ్లు పూడ్చిపెట్టేవాళ్లు. అయితే ముందు ఏవేవో మాటలు చెప్పి తీసుకెళ్లిన కుటుంబీకులు, బంధువులు శవం పూడ్చిన తర్వాత మమ్ములను వెళ్లమని చెప్పేవారు. అప్పుడు వచ్చిన దారిన వెళదామంటే ఊరిలో వారు ఒప్పుకోరు. కారణం ఏమిటంటే గ్రామంలోకి వస్తే అరిష్టమని అలాగే వెళ్లండంటూ అడ్డుగా నిలబడడంతోపాటు కట్టెలు పట్టుకుని ఉంటారు. ఊరి పొలిమేరల్లోకి కూడా రానివ్వరు. ఆ ఊరిలో దారులు ఎటుంటాయో కొత్తగా వచ్చిన మాకు తెలియదు. ఇతర ప్రాంతాల మీదుగా దారి చెబితే కిలోమీటర్ల మేర నడిచి వెళ్లినా వాహనాల్లో కూడా ఎవరూ ఎక్కించుకోరు. ఇలా ఒకసారి కాదు.. పదుల సార్లు కష్టాలు పడ్డాం’ అని ఆయన వివరించాడు. డాక్టర్‌కు వారధి తోటి.. దేవుడికి పూజారి ఎలా వారధిలా ఉంటాడో పోస్టుమార్టం గదిలో డాక్టర్‌కు తోటి వారధిగానే ఉంటాడు. నేను ఎప్పుడైనా ఇంటిలోని కుటుంబ సభ్యులపైన కొప్పడ్డా.. కానీ తోటీలను చిన్నమాట కూడా ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఎవరూ చేయలేనటువంటి పనులను సమాజంలో వారు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ డాక్టర్ ఏం చేయాలన్న తోటి ద్వారానే చేయిస్తారు. కొన్ని శవాలు కాలిపోయి వస్తాయి. మరికొన్ని కుళ్లిపోయి ఉంటాయి. అలాంటి శవాన్ని కూడా పోస్టుమార్టానికి ముందు, తర్వాత నీటితో కడిగి శుభ్రం చేసిది తోటీలే. – డాక్టర్ ఆనంద్‌కుమార్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు, రిమ్స్, కడప ఇప్పుడు భయం లేదు.. ఒకప్పుడు శవమంటేనే భయçపడే పరిస్థితి. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో వాటి మధ్యనే తిరుగుతూ.. ఎవరూ లేని అనాథ శవాలను రోజూ భద్రపర్చడం మొదలుకొని ఇతర పనులన్నీ అక్కడే చేస్తుంటాం. పోస్టుమార్టం గదిలో శవాల మధ్య తిరుగుతూ వైద్యుల సమక్షంలో కత్తిరింపుల కార్యక్రమంలో వేల శవాలను చూశా. ఇప్పుడు భయం అనే పరిస్థితి లేదు. ఫీలింగ్ కూడా ఉండదు. – వెంకటయ్య, మార్చురీ తోటి, కడప నాన్న హయాం నుంచి.. మా నాన్న హయాం నుంచి మార్చురీలో తోటి పని చేస్తున్నా. నాన్న మరణం తర్వాత నాకీ బాధ్యత వచ్చింది. నాన్న ఎప్పుడైనా ఒకసారి మార్చురీలోకి తీసుకెళ్లేవారు. తర్వాత అనారోగ్యం బారిన పడడంతో నేనే వెళ్లేవాడిని. అయితే మొదట్లో భయం, జంకుతో ఇబ్బంది పడినా తర్వాత అలవాటుగా మారింది. ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండానే అక్కడే తిరుగుతుంటాం. మా కుమారుడు రాజా కూడా నాకు మార్చురీలో సహకరిస్తున్నాడు. శవం మార్చురీలోకి తీసుకు రావడం దగ్గరి నుంచి పోస్టుమార్టం అనంతరం అప్పగించే వరకు అన్ని పనులు చేసి పంపిస్తాం. శవాల మధ్యనే తిరుగుతుంటాం. శవాలే మాకు ఆత్మ బంధువులు. – నర్సారావు, మార్చురీ తోటి, కడప -
ఎన్ఆర్సీకి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం
కడప అర్బన్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో కొందరు ముస్లిం మైనార్టీలు ఎన్ఆర్సీ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్.. కడప నగర మైనార్టీ నాయకుడు వలీవుల్లా హుస్సేన్‌ను వేదికపైకి రావాలని పిలిచారు. ఆయన వేదిక వద్దకు రాగానే.. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన డిప్యూటీ సీఎం, స్నేహితుడు, ముస్లిం మైనార్టీల విషయంలో అన్నీ తెలిసిన అంజాద్ బాషా నాతో ముందుగా మాట్లాడి ఎన్ఆర్సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ బలపరచదని ప్రకటించారు. ఆ ప్రకారం డిప్యూటీ సీఎం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో అనుమానాలకు తావు లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తున్నా’ అన్నారు. -
‘ప్రభుత్వాస్పత్రుల రూపు రేఖలు మారుస్తాం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. సోమవారం కడప రిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. (చదవండి : రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్) మానసిక వికలాంగుల ఆస్పత్రి కోసం రూ.40.82 కోట్లు, వైఎస్సార్ క్యాన్సర్ ఆస్పత్రి కొరకు రూ.107కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.125 కోట్లు, పోలీసుల భవన నిర్మాణానికి రూ.20.95 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రిమ్స్ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని వైద్యశాలలన్నింటిలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే దానిని అధిగమిస్తామని సీఎం తెలిపారు. -
వైద్యులపై కొరడా.. ఒకరు సస్పెన్షన్..
సాక్షి, ఆదిలాబాద్ : వైద్యో నారాయణో హరి.. కళ్ల ముందు కనిపించని దేవుని కంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడినే దేవునిగా భావిస్తారు.. అంతటి మహోన్నతమైన వృత్తికి కొంతమంది కలాంకం తీసుకొస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వేలాది రూపాయల వేతనాలు తీసుకుంటున్నా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారు. విధులు సక్రమంగా నిర్వహించక పోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా వారికి నచ్చినట్టే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విధులు సక్రమంగా నిర్వహించని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌పై వేటుపడింది. ఎట్టకేలకు కలెక్టర్ దివ్యదేవరాజన్ కొరడా ఝులిపించారు. ఈ చర్యలతో మిగితా డుమ్మా వైద్యుల్లో భయాందోళన మొదలైంది. ఇకనైనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా తీరు మారేనా.. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. గిరిజన మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. వందపడకల ఆస్పత్రిని నిర్మించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన జిల్లా ప్రజలకు చిన్నపాటి రోగాలకు తప్పా నాణ్యమైన వైద్యం అందని పరిస్థితి. గుండె నొప్పి, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్ తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. వైద్యుల తీరు... రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కొంతమంది వైద్యులు ఉదయం 10గంటల వరకు వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకే ఇంటి ముఖం పడుతున్నారు. అత్యవసర సమయంలో రిమ్స్‌కు వచ్చిన రోగులు వైద్యులు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం. కాల్ డ్యూటీ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. మధ్యాహ్నం నుంచి జిల్లా కేంద్రంలో క్లినిక్‌లు నిర్వహిస్తూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటుగా క్లీనిక్‌లు... రిమ్స్‌లో పనిచేసే కొంత మంది వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నిర్వహిస్తూ రెగ్యులర్ డ్యూటీని నిర్లక్ష్యం చేస్తున్నారు. రిమ్స్‌ను పర్యవేక్షించాలి్సన ఓ అధికారి సైతం క్లినిక్ నిర్వహించడం గమనార్హం. వీరితో పాటు గైనకాలజిస్ట్లు, సివిల్సర్జన్లు, అనస్తీషియా వైద్యులు, ఈఎన్టీ, కంటి వైద్యులు, ఆర్థోపెడిక్‌లు క్లినిక్‌లు నిర్వహిస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోంది. బయోమెట్రిక్ ఉన్నా.. వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో కలెక్టర్ దివ్యదేవరాజన్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా డుమ్మా వైద్యులు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఉదయం పూట బయోమెట్రిక్ వేలి ముద్రలు వేసి సాయంత్రం తమ క్లినిక్‌లు ముగించుకున్న తర్వాత వచ్చి థంబ్ పెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివ్యదేవరాజన్ బుధవారం రిమ్స్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన మరుసటి రోజే చర్యలను పూనుకున్నారు. ఒకరు సస్పెన్షన్.. మరొకరు సరెండర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సక్రమంగా హాజరు కాకపోవడం, బయోమెట్రిక్ హాజరులో థంబ్ పెట్టి ప్రైవేట్ క్లినిక్‌లో విధులు వ్యవహరించినందుకు అనస్తిషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు రిమ్స్ అధికారులు తెలిపారు. అదేవిధంగా బయోకెమిస్ట్రి అసోసియేట్ ప్రొఫెసర్ రమా శౌరి సక్రమంగా విధులకు హాజరుకాకపోవడం, గత కొన్ని రోజులుగా గైర్హాజరవుతున్న దృష్ట్యా ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. -
శిశువు ఐసీయూలో..తల్లి వరండాలో!
సాక్షి, ఒంగోలు: రిమ్స్‌లో బాలింతల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువు కోసం తల్లి ఎంత కష్టమైనా భరిస్తుంది. సిజేరియన్ చేయించుకున్నా తనకు ఏమైనా ఫర్వాలేదంటూ సమస్యలున్నా బిడ్డ పుట్టిన ఆనందంలో వాటిని మరిచిపోతోంది. ఇదీ.. రిమ్స్ నవజాత శిశు సంరక్షణ కేంద్రం బయట బాలింతల దుస్థితి. రిమ్స్‌లో అప్పుడే పుట్టిన పురిటి పిల్లల చికిత్స కేంద్రానికి అనుబంధంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పుట్టిన చిన్నారులతో పాటు రిమ్స్‌లో పుట్టిన పిల్లలు ఉంటారు. కామెర్లు, బరువు తక్కువతో పుట్టడం, గాలి పీల్చుకోలేని వారికి, ఫిట్స్‌తో ఉన్న వారికి, పుట్టగానే ఏడవని పిల్లలకు ఇక్కడ చికిత్స అందిస్తారు. దాదాపు వారం రోజుల నుంచి నెల రోజుల వరకు చిన్నారులకు చికిత్స అందిస్తారు. బాలింత బెడ్ వరండానే శిశువు ఐసీయూలో ఉంటే బాలింత ఎస్ఎన్సీయూ ఎదుట కారిడార్‌లో ఉండాల్సిందే. అక్కడ 10 బెడ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఐసీయూలో ఎప్పుడూ దాదాపు 30 మంది చిన్నారులు చికిత్స పొందుతూ ఉంటారు. దీంతో చిన్నారుల తల్లులు కూడా బయట ఉండాల్సిందే. దీంతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరిలో సిజేరియన్ శస్త్రచికిత్సలు చేసిన వారు కూడా ఉంటారు. వీరి బాధలు వర్ణనాతీతం. అప్పుడే వేసిన కుట్లతో నేలపై పడుకుని..తిరిగి లేచే సయమంలో పిగిలిపొయే ప్రమాదం ఉంది. అయినా తమ శిశువు కోసం బాలింతలు ఆ బాధలు భరిస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో మంచాలు కేటాయించాలని, నేలపై పడుకోలేక పోతున్నామని బాలింతలు వాపోతున్నారు. యూరినల్స్‌కు వెళ్లాలంటే నరకమే బాలింతలు యూరినల్స్‌కు, బాత్రూమ్కు వెళ్లాలంటే నరక యాతన అనుభవించాల్సి వస్తోంది. సిజేరియన్ చేసిన బాలింతలు 500 మీటర్లకుపైగా దూరంలో రిమ్స్ గేటు బయట వరకూ నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం రిమ్స్‌కు వస్తే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్‌లో యూరినల్స్‌కు వెళ్లాలంటే రూ.6లు చెల్లించాల్సి వస్తోంది. స్నానం చేసేందుకు రూ.20లు ఇవ్వాల్సిందే. ఎన్నిసార్లు యూరినల్స్‌కు వెళ్తే అన్ని సార్లు రూ.6లు చొప్పున చెల్లించాల్సి వస్తోంది. సిజేరియన్ చేయించుకున్న తాము అంత దూరం వెళ్లలేకపోతున్నామని బాలింతలు వాపోతున్నారు. సమీపంలోనే తమకు ఒక బాత్రూమ్ కేటాయించాలని కోరుతున్నారు. -
అటానమస్‌గా రిమ్స్
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ప్రస్తుతం సెమీ అటానమస్ పద్ధతిలో కొనసాగుతోందని..భవిష్యత్‌లో అటానమస్‌గా గుర్తించేందుకు చర్యలు చేపడుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం రిమ్స్ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో రిమ్స్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామన్నారు. ఒకే చోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వైద్యులకు బదిలీల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. రిమ్స్ ప్రస్తుతం సెమీ అటానమస్ పద్ధతిలో కొనసాగుతుందని, భవిష్యత్‌లో అటానమస్‌గా గుర్తించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రొఫెసర్లు, వైద్యులు పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని, అటానమస్ అయితే మరిన్ని నాణ్యమైన వైద్యసేవలు అందుతాయన్నారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గిరిజనులతోపాటు అన్నివర్గాల వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. చాలా మంది వైద్యులు వృత్తి నిబద్ధతతో పనిచేసేవారు ఉన్నారని, వైద్యులపై దాడులు జరగకుండా రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రతీ వైద్యునిలో నిబద్ధతతో పనిచేస్తామనే తపన ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పీహెచ్‌సీల్లో కనీస మౌలిక వసతులు ఉండేవి కావని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. మోడల్ పీహెచ్సీగా తీర్చిదిద్దామని, నాన్ టీచింగ్, టీచింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ రాజన్న, రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, ఆర్ఎంఓ రాము, సూపరింటెండెంట్ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ రాజీవ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల హల్చల్.. రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించేందుకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసేందుకు కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందుతున్న విషయాలను తెలుసుకునేందుకు వెళ్లిన మంత్రి వెంట టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లడంతో ఆస్పత్రిలో రద్దీగా మారింది. కేవలం ఎంఐసీయూలో ఒక రోగితో మాత్రమే మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో హాలు అంతా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. వైద్యులకు కూడా కనీసం కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకుండా కార్యకర్తలే కూర్చోవడంతో కొంతమంది వైద్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిని బయటకు పంపారు. -
మంత్రివర్యా.. మాకేయి సూడయ్యా
సాక్షి, ఆదిలాబాద్: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ఈ ప్రాంతంలో వైద్యసేవలు మృగ్యమయ్యాయి. పేరుకు పెద్దపెద్ద సర్కారు దవాఖానాలు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. చిన్నచిన్న రోగాలకు కూడా రిమ్స్ వైద్యులు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్ తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుసప్పు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్పత్రి ఉన్నా చిన్న చిన్న రోగాలు, జ్వరాలకు తప్ప మరే వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల ఖాళీలు, మౌలిక వసతుల కొరత, పరికరాలు లేక నాణ్యమైన వైద్యం అందడం లేదు. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లాలో పర్యటించనున్నారు. రోగులు, వారి బంధువులు జిల్లాలోని ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పీహెచ్పీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అమాత్యునికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. పీహెచ్‌సీల్లో అందని వైద్యం.. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 129 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఒక ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్ పట్టణంలో ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 24 గంటలు పని చేసే పీహెచ్‌సీలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాలి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 8నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్యసేవలు అందించాల్సి ఉండగా ఎక్కడా పూర్తి స్థాయిలో రోగులకు వైద్యసేవలు అందడం లేదు. పీహెచ్సీలో చాలా మంది వైద్యులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే విధుల్లో ఉంటున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో ప్రైవేటు క్లీనిక్‌లు నడుపుతున్నారు. బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేసినా మూలనపడ్డాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో మెడికల్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీల జాతర.. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీహెచ్‌సీల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులు తీవ్రంగా వేధిస్తున్నాయి. నాలుగు సివిల్ సర్జన్ పోస్టులకు గాను ఒక్కరే ఉన్నారు. అదే విధంగా జిల్లా మలేరియా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు 52 గాను 13 మంది కాంట్రాక్ట్, 33 మంది రెగ్యులర్ ఉన్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు డిప్యూటీ పారామెడికల్ పోస్టులకు గాను ఇద్దరు ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాస్ మీడియా అధికారి పోస్టు, గణాంక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. 34 స్టాఫ్ నర్సులకు గాను 6 గురు కాంట్రాక్ట్, 21 మంది రెగ్యులర్, 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫార్మాసిస్ట్ గ్రేడ్–2 పోస్టులు 29 ఉండగా 17 రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 19 మంది రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎం పోస్టులు 129 ఉండగా వీటిలో 117 కాంట్రాక్ట్, 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. రిమ్స్.. పేరుకే పెద్దాసుపత్రి జిల్లా కేంద్రంలో రిమ్స్ మెడికల్ కళాశాల ఉన్నా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ఏడాది క్రితం కన్జర్వేటర్ ఫారెస్ట్ గుండె నొప్పిరావడంతో వైద్యం కోసం రిమ్స్‌లో చేరారు. సరైన వైద్యం అందక ఆయన మృత్యువాత పడ్డ సంఘటన తెలిసిందే. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చిన్నచిన్న రోగాలు జ్వరాలు, మెటర్నటీ సేవలు అందుతున్నాయి. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో క్యాన్సర్, గుండెనొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇతరాత్ర చికిత్సల కోసం హైదరాబాద్, మహారాష్ట్రకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా రిమ్స్ కళాశాలకు రెగ్యులర్ డైరెక్టర్ లేరు. అదే విధంగా రిమ్స్ కళాశాలకు ప్రిన్సిపాల్ కూడా ఇన్చార్జే. ఆస్పత్రిని పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్, ఆర్ఎంవో పోస్టుల్లో సైతం ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పర్యవేక్షణ గాడి తప్పింది. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. చాలా మంది డాక్టర్లు ఉదయం 8 గంటల వరకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల వరకే రిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో కాల్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నారు. వారు వచ్చే వరకు రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లతోనే వైద్యసేవలు అందుతున్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి గాను 9 మంది పని చేస్తున్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 30కి గాను 15 మంది పని చేస్తున్నారు. 15 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 41కి గాను 34 మంది పని చేస్తుండగా 7 ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 59కి గాను 37 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిమ్స్ అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతోంది. జూనియర్ డాక్టర్లకు నాలుగు నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆందోళన బాటపట్టారు. అదే విధంగా పారిశుధ్య కార్మికులకు కూడా నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగం మారుతున్నాయి. జిల్లాలో ఆస్పత్రుల సమస్యలను పరిష్కరించాలని రోగులు ఆమాత్యున్ని వేడుకుంటున్నారు. నేడు రిమ్స్‌ను సందర్శించనున్న మంత్రి ఎదులాపురం(ఆదిలాబాద్): రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం జిల్లా కేంద్రానికి రానున్నారు. అందులో భాగంగా రిమ్స్ ఆస్పత్రిని సాయంత్రం 5 గంటలకు సందర్శించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరనున్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించిన బాలినేని