Satavahana University
-
వాట్సాప్ గ్రూపులపై పోలీసుల నజర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన విశ్వవిద్యాలయం: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులపై పోలీసులు దృష్టిసారించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులను గుర్తించేందుకు సీజ్ చేసిన తొమ్మిది మొబైల్ ఫోన్లను సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో ఆయా కళాశాలలకు, వాట్సాప్ గ్రూపులకు చెందిన వారిలో కలవరం మొదలైంది.విచారణలో కొన్ని కొత్త వాట్సాప్ గ్రూపులు, మరింత అదనపు సమాచారం రావడంతో వారందరికీ నోటీసులు పంపిస్తూ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశ్నపత్రం లీక్‌పై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు ముమ్మరమైంది. నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వైస్ చాన్స్‌లర్ మల్లేశ్, రిజిస్ట్రార్ భరత్, పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగప్రసాద్తో మాట్లాడి ఆ వ్యవహారంపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్షల విభాగాన్ని పరిశీలించి అందులో పనిచేసే సిబ్బందితో మాట్లాడారు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! కరీంనగర్ నగరంలోని ఓ ప్రభు త్వ కళాశాలతోపాటు మరో ప్రైవేట్ కళాశాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపు ల్లో పేపర్లు లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించి ఇందులో 22 మందిని విచారించారు. 55 పరీక్షాకేంద్రాలకు పోలీసులు నోటీసులు పంపడంతో వివిధ కళాశాలల్లో వణుకు మొదలైంది. పశ్నపత్రాలు వచ్చిన గ్రూపుల్లో సదరు కళాశాలలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉండటాన్ని బట్టి చూస్తే వారికి తెలిసే ఈ లీక్ వ్యవహారం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచి అరగంట ముందే లోనికి ... సాధారణంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుండగా, తీరా పరీక్షల సమయందాకా విద్యార్థులను అనుమతించేవారు. ఇక నుంచి ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైతే అరగంట ముందుగానే అంటే 9.30గంటలకు, మధ్యాహ్నం పరీక్ష రెండు గంటలకు ప్రారంభమైతే 1.30 గంటలకే విద్యార్థులు పరీక్షాకేంద్రంలో ఉండాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీని వల్ల ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఈ సమయం తర్వాత విద్యార్థులు వస్తే అనుమతించబోరు. -
ప్రశ్నపత్రం లీకేజీలో ప్రశ్నలెన్నో..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహా రం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయం లో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాలతో వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వర్సిటీ అధికారులు అందజేసిన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పేపర్ లీకైన ఫొటోల్లోని ఓ ఫొటోను ‘సాక్షి’ సంపాదించింది. 17వ తేదీన ప్రశ్నపత్రం రాగానే ఇంకా డౌన్లోడ్ చేయకముందే.. ఓ కాలేజీ సిబ్బంది నేరుగా కంప్యూటర్ మానిటర్‌తో సహా ఫొటో తీసి పంపారు. కంప్యూటర్లో ప్రశ్నపత్రం ఫొటో తీసే క్రమంలో సిరిసిల్లలోని ఓ డిగ్రీ కాలేజీ కోడ్, పేరు ఉన్న డీఫామ్ (విద్యార్థుల హాల్‌టికెట్లు, వివరాలు తెలిపే పత్రం) కూడా ఈ ఫొటోకు చిక్కింది. దీంతో సిరిసిల్లలోని సదరు డిగ్రీ కాలేజీ నుంచే పేపర్ లీకైందని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఎవరెవరి పాత్ర ఎంతెంత... ఈ విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రం రూపొందించినప్పటి నుంచి ప్రిన్సిపాల్‌కు అక్కడ నుంచి విద్యార్థులకు చేరేవరకు ఎవరెవరి పాత్ర ఉందో తేల్చనున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ మొత్తం ఏడు జిల్లాల పరిధిలో 98 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 55 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా 55 మందిని ప్రశ్నించాలని పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాబితా కూడా సిద్ధం చేశారు. తొలిరోజు విచారణ కోసం 11 మందిని పిలిపించి వారి వివరాలు నమోదు చేసుకుని, నోటీసులు ఇచ్చి పంపారు. ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్న.. తొమ్మిది సెల్ఫోన్లకు సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ (సీడీఆర్)ను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా అనుమానితుల జాబితాను రూపొందిస్తున్నారు. ఈ తొమ్మిది సెల్ఫోన్లలో డేటా సేకరణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపారు. పరీక్షలు జరిగిన ప్రతి కాలేజీ నుంచి విద్యార్థుల హాల్‌టికెట్లు, అటెండెన్స్ వివరాలు, సీసీ ఫుటేజీ, డీఫామ్స్ తదితర వివరాలను తెప్పిస్తున్నారు. ఈ కేసుపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఏసీపీ తుల శ్రీనివాస్, టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ తోట మహేశ్‌తో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేశారు. తొలుత 55 మందికి నోటీసులు ఇచ్చి విచారించిన అనంతరం మిగిలిన పాత్రధారులను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. -
చాలా చోట్ల పేపర్ లీక్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలో ఒక్కొక్కటిగా బాగోతాలు బయటపడుతున్నాయి. పరీక్షకు దాదాపు పావు గంట ముందే పలు కాలేజీల సిబ్బంది పేపర్‌ను లీక్ చేయడంతో విద్యార్థులు సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. అలా పదుల సంఖ్యలో పేపర్‌ను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారంపై ‘సాక్షి’వరుస కథనాలతో కదిలిన వర్సిటీ అధికారులు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను శాతవాహన సిబ్బంది సోమవారం పోలీసులకు అప్పగించింది. తొమ్మిది సెల్ఫోన్ల నంబర్ల ఆధారంగా కాల్‌డేటా రికార్డులను తెప్పించే పనిలో పడ్డారు. లీకైన రోజు ముందు నిందితులు ఎవరెవరితో మాట్లాడారో గుర్తిస్తే కేసు సగం ఛేదించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమయ్యే ముందు, తర్వాత ఈ వ్యవహారంతో సంబంధమున్న వారు ఫోన్ మాట్లాడుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఫోన్లను స్వాధీనం చేసుకునే లోపే నంబర్లను డీయాక్టివ్ చేసుకుని, వాట్సాప్ సమాచారం డిలీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ డేటా డిలీట్ అయినా.. డేటాను రీట్రైవ్ చేసే సాంకేతికత తమ వద్ద ఉందని పోలీసులు ధీమాతో ఉన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపాలా లేక తమ వద్ద ఉన్న డేటా రీట్రైవ్ యంత్రం సరిపోతుందా అన్న విషయంపై పోలీసు అధికారులు ఇంకా నిర్ణయానికి రాలేదు. ప్రత్యేక బృందాల ఏర్పాటు అనివార్యం.. శాతవాహన వర్సిటీ లీకేజీ వ్యవహారం కరీంనగర్ కమిషరేట్ పరిధిలోనే వెలుగు చూసినా ఇతర జిల్లాల్లోని కాలేజీల నుంచి కూడా పేపర్లు బయటకు వచ్చాయని సమాచారం. వర్సిటీ పరిధి కరీంనగర్‌తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. గతంలో ఎంసెట్ (మెడికల్)–2 పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రాలు దాటిన వ్యవహారం కావడంతో సీఐడీ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనూ ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు అనివార్యమని పోలీసులు భావిస్తున్నారు. -
పరీక్షకు పావుగంట ముందే లీక్..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ శాతవాహన యూనిర్సిటీ: పరీక్షల నిర్వహణలో శాతవాహన యూనివర్సిటీ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా పరిగణించలేదు. దీనిపై ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కావడంతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. శనివారం మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. వాస్తవానికి ఈనెల 18న ఉదయం ఈ ఉదంతం వెలుగుచూడగానే.. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. కానీ నిబంధనల పేరు చెప్పి, కమిటీ వేసి దాని రిపోర్టు వచ్చేదాకా ఆగడంతో.. ఈ విషయాన్ని యూనివర్సిటీ చాలా తేలిగ్గా తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమానిత విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న తొమ్మిది మొబైల్స్‌ను శనివారం ఓపెన్ చేసిన కమిటీ సభ్యులు వాటిలో ఆధారాలు అప్పటికే డిలిట్ చేసి ఉండటంతో తెల్లమొహం వేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక.. తొలుత ఏసీపీ తుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాలేజీ సిబ్బంది పనే.. ఈ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత 18న నిర్వహించిన 6వ సెమిస్టర్ ఫిజిక్స్ పేపర్–2 లీకైందని అంతా అనుకున్నారు. ఈ వ్యవహారంలో ‘సాక్షి’పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా లీకైన పేపర్లను, వాటిని పోస్టు చేసిన విద్యార్థుల నంబర్లను మరిన్ని ‘సాక్షి’సంపాదించింది. అందులో 16న జరిగిన మ్యాథ్స్, 17న జరిగిన ఫిజిక్స్ పేపర్–1 కూడా లీకైనట్లు తేలింది. ఈ పేపర్లను కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేయకముందే.. నేరుగా ఫొటోలు తీసి పంపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా.. 9.38 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష పత్రాన్ని మ.1.47 నిమిషాలకు వాట్సాప్‌లో షేర్ చేశారు. అయితే ఇది యూనివర్సిటీలో జరిగిందా? లేదా ఇతర కాలేజీలో జరిగిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వర్సిటీ అధికారులు ప్రైవేటు కాలేజీ సిబ్బంది చేసిన పనిగా అనుమానిస్తున్నారు. మరోవైపు శాతవాహన పరిధిలోని ప్రభుత్వ కాలేజీలోని సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై జిల్లాకు చెందిన ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నత విద్యా మండలికి శనివారం మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. విద్యామండలి సూచనల మేరకు చర్యలు: వీసీ ప్రొ.మల్లేశ్ పేపర్ లీక్‌కు సంబంధించి వేసిన విచారణ కమిటీ సిఫార్సుల మేరకు పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యామండలికి ఫిర్యాదు చేస్తాం. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. -
‘వర్సిటీ’లో ఇష్టారాజ్యం..?
సాక్షి, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్) : శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్(వీసీ) లేక ఐదేళ్లు అవుతోంది. అప్పటి నుంచీ ఇన్చార్జిల పాలనే కొనసాగుతోంది. ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండడం, వర్సిటీకి చుట్టం చూపులాగే వచ్చిపోతుండడంతో పత్యక్ష పర్యవేక్షణ కొరవడింది. దీంతో కిందిస్థాయి అధికారులు వివిధ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఏళ్ల తరబడిగా వస్తున్నాయి. అయినా పట్టించుకోకుండా యూనివర్సిటీకి ఇన్చారి్జలనే కేటాయిస్తున్నారు. ఇన్చార్జిల పాలన కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ పనిచేసిన రిజిస్ట్రార్లు అధ్యాపక, అధ్యాపకేతర నియమాకాల్లో, అభివృద్ధి పనుల్లో, రిజిస్ట్రార్‌గా కొనసాగడం వంటివి నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు వివిధ అంశాలకు సంబందించి శాతవాహన అధ్యాపకుల సంఘం ప్రతినిధులు, లోక్‌సత్తా పార్టీతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా గవర్నర్, ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ కొనసాగుతోంది. యూనివర్సిటీలో ఏ పని జరిగినా వీసీకి తెలియకుండా జరగదని, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నింటిలో ఇన్చార్జి వీసీల పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలు ఇన్చార్జి వీసీలకు తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఆరోపణల అపవాదును మాత్రం మూటగట్టుకుంటన్నారని విద్యారంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్‌పై వివిధ ఆరోపణలు రావడంతో రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ టి.భరత్‌ను నియమించారు. ఆ తర్వాత ఉన్నతా విద్యామండలి ప్రత్యేక కమిటీతో ఉమేష్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ఇద్దరితో కూడిన కమిటీతో విచారణ జరిపిస్తోంది. కమిటీ నివేదిక రాగానే సంబంధిత చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. కమిటీ నివేదిక ఏం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. పట్టించుకోని ఇన్చార్జిలు... శాతవాహన యూనివర్సిటీ 2015 నుంచి ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతుండడంతో వివిధ వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇన్చార్జి వీసీలు మరో ముఖ్యమైన బాధ్యతల్లో ఉండడంతో దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదని, దీంతో ఇక్కడున్న రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యాపక, విద్యార్థి సంఘాలు బలంగా ఆరోపిస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీలో ఐదేళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతోంది. 19 ఏప్రిల్ 2012 నుంచి రెగ్యులర్ వీసీగా కె.వీరారెడ్డి బాధ్యతలు చేపట్టి 18 ఏప్రిల్ 2015 వరకు రెగ్యులర్ వీసీగా పనిచేశారు. ఆ తర్వాత ఆగస్టు 2015 వరకు ఇన్చార్జిగా విధులు నిర్వర్తించారు. 13 ఆగస్టు 2015న ప్రస్తుత విద్యాశాఖ కార్యదర్శి, అప్పుటి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డి ఇన్చారి్జగానే నియమించబడ్డారు. కానీ ఆయన మున్సిపల్ శాఖ బాధ్యతల్లోనే బిజీగా ఉండడం, యూనివర్సిటీకి తగిన సమయం కేటాయించలేదు. ఆయన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) కమిషనర్ టి.చిరంజీవులును 30 ఆగస్టు 2017న నియమించింది. ఎప్పుడో ఒకసారి వస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికి ప్రతీ పనికి వర్సిటీ అధికారులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్చార్జిలు.. శాతవాహనలో గత కొన్నేళ్లుగా ఇన్చార్జి పాలన కొనసాగడంతో యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని వివిధ వర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని యూనివర్సిటీ వ్యాప్తంగా చర్చ జరగడం, రాజకీయ పార్టీల నాయకులు స్వయంగా హైదరాబాద్‌లో దీనిపై సమావేశాలు ఏర్పాటు చేసి మరీ శాతవాహన అక్రమాల గురించి ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. ఆ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారులకు సైతం పాత్ర ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం టి.చిరంజీవులు ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. ఇన్ని రోజులు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఉమేష్‌కుమార్‌పై నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారని, పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తెరతీశాడని, ఇష్టారాజ్యంగా అంతర్గత బదిలీలు చేశారని శాతవాహన అధ్యాపకుల సంఘం, లోక్‌సత్తా పార్టీ, వివిధ విద్యార్థి సంఘాలు గవర్నర్, ఉన్నత విద్యామండలికి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఈ నెల 18న శాతవాహనలో కేయూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విశ్రాంత రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ జగన్నాథస్వామి, ప్రొఫెసర్ వెంకటయ్యలతో కూడిన కమిటీ ద్వారా విచారణ జరిపించారు. దీనికి సంబంధించిన నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందనున్నట్లు తెలిసింది. కానీ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులుకు తెలియకుండా ఒక్క పనికూడా చేయలేదని, పై అధికారి సూచనలతోనే శాతవాహనలో పనులు చేశానని ఉమేష్‌కుమార్ తెలిపారు. ఒకవేళ ఉమేష్‌కుమార్ అక్రమాలు చేశారని తేలితే దానిలో ఇన్చార్జి వీసీ చిరంజీవులుకు కూడా పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల వివిధ అక్రమాలకు తావివ్వడం సహజమేనని ఇన్చార్జి వీసీకి తెలిసి జరిగినా, తెలియకుండా జరిగినా సంబంధిత అపవాదులను మూటగట్టుకోవడం తప్పదని, రెగ్యులర్ వీసీ ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని విద్యారంగనిపుణులు విశ్లేషిస్తున్నారు. -
సెర్చ్ కమిటీ సైలెంట్.. !
సాక్షి, కరీంనగర్ : రెగ్యులర్ వీసీ నియామకానికి ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ సైలెంట్ అయిందా..? అనే ప్రశ్నకు శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా అవుననే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో గల వివిధ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగియడంతో అన్ని యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించారు. శాతవాహనకు మాత్రం గతంలోనే ఐఏఎస్ అధికారి ఇన్చార్జి వీసీగా ఉండడంతో తిరిగి ఆయననే కొనసాగించారు. శాతవాహన యూనివర్సిటీకి వీసీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గత నెలలో ముగ్గురితో కూడిన సెర్చ్ కమిటీని వేశారు. ఈ కమిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా నేటికి వీసీ నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని విద్యావేత్తల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇన్చార్జి పాలన నుంచి విముక్తి ఎన్నడో..? యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఐదుగురు వీసీలుగా పని చేయగా వీరిలో ఇద్దరు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ఆరేళ్ల పాటు వీరి పాలన కొనసాగింది. తర్వాత నాలుగేళ్లపాటు ముగ్గురు ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం వీసీగా ఉన్న హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులును 30 ఆగస్టు 30, 2017న ప్రభుత్వం నియమించింది. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్లినా, కీలక నిర్ణయాలు, సాధారణ పనులకు యూనివర్సిటీ అధికారులు హైద్రాబాద్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. అలాగే అక్కడ ఆయన సమయం కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో శాతవాహనకు కొత్త వీసీని నియమించాలనే నిర్ణయానికి వచ్చి దరఖాస్తులు ఆహ్వానించారు. కాని సెర్చ్ కమిటీ వేశాక కూడా ప్రక్రియ ఎందుకు ముందుకు సాగడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యం వీసీ నియామక ప్రక్రియలో సెర్చ్ కమిటీ నియామకం కీలకం. శాతవాహన యూనివర్సిటీకి గత నెల 20 తేదిన ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో శాతవాహన ఈసీ నామినీగా మాజీ జెఎన్టీయూ హైద్రాబాద్‌కు వీసీ ప్రొఫెసర్ రామేశ్వర్‌రావును, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నామినీగా యూజీసీ మెంబర్, భగత్‌పూల్‌సింగ్ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సుష్మయాదవ్, రాష్ట్ర ప్రభుత్వ నామినీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఐఏఎస్ అధికారి సోమేష్‌కుమార్‌ను నియమించారు. . ఇన్ని రోజులు గడిచినా ఈ ప్రక్రియలో జాప్యంపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. వీసీని నియమిస్తేనే ఖాళీగా ఉన్న పోస్టులు నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులు సైతం ఆశపడుతున్నారు. ప్రభుత్వం తొందరగా వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
పైసామే అడ్మిషన్..!
సాక్షి , శాతవాహనయూనివర్సిటీ(కరీంగనర్): ఇంజనీరింగ్ ప్రవేశాల తీరును చూస్తే ఇంజినీరింగ్ విద్య ఇంతకు దిగజారిందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఏ మాత్రం నాణ్యత ప్రమాణాలు చూడని కొందరు తల్లిదండ్రులు, విద్యార్థుల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశాల కోసం దిగజారుడుతనం ప్రదర్శించి ప్రవేశాలను ‘కొని’ తెచ్చుకుంటున్నాయని తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క అడ్మిషన్‌కు అభ్యర్థులకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తూ వీటితోపాటు రూ.10 వేలు నగదును కూడా నజరానాగా అందిస్తున్నట్లు దూమారం రేగుతోంది. కొన్ని కళాశాలలు ఎంసెట్ ఫలితాలు రాకముందు నుండే ఇంటర్ విద్యార్థుల కోసం గాలించి వివిధ రకాల ఆఫర్లను ఇచ్చి ప్రవేశాలు తీసుకొవాలని వ్యూహం పన్నాయి. గత సంవత్సరం ప్రవేశాల కంటే ఈ సంవత్సరం ఎలాగైనా మెరుగైన విధంగా సీట్లు నింపుకోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచే రంగం సిద్ధం చేసుకొని ప్రత్యేకంగా ప్రవేశాల కోసం పీఆర్వోలు, మధ్యవర్తులు, అధ్యాపకులను కేటాయించుకొని అక్రమాలకు ఒక వ్యవస్థ ఏర్పర్చుకున్నాయి. వీరందరికీ ముందుగానే ప్రవేశానికి కొంత మొత్తం చొప్పున ముందుగానే డీల్ కుదుర్చుకున్నాయి. ఇంకేముంది వారు సంపాదనే ధ్యేయంగా విద్యార్థుల వేటలోపడి కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన ఆఫర్లను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించి వారిని ప్రలోభపెట్టి అక్రమంగా ప్రవేశాలు సంపాదించుకుంటున్నాయని గత నాలుగు రోజులుగా సోషల్‌మీడియాల్లో, బయట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రవేశాల విషయంలో పలు ప్రైవేటు కళాశాలల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొనడంతో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రవేశాలు సంపాదించడం చూస్తుంటే ఇంజినీరింగ్ కోర్సు ఇంతటికి దిగజారిందా అని విద్యారంగ నిపుణులు వాపోతున్నారు. మొదటి విడతలో 46 శాతమే... మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల తీరును పరిశీలించినట్లయితే ఇంజినీరింగ్ కోర్సుకు డిమాండ్ తగ్గిందా అనే సందేహం కలుగక మానదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 46 శాతం సీట్ల భర్తీ జరగగా ఊహించని రీతిలో ప్రముఖ కళాశాలలకు కూడా షాక్ తగిలేలా సీట్ల కేటాయింపు జరిగింది. జిల్లా వ్యాప్తంగా 13 ఇంజినీరింగ్ కళాశాలలుండగా ఇందులో 2 ప్రభుత్వ కళాశాలలు, 11 ప్రవేట్ కళాశాలలున్నాయి. అన్ని కళాశాలల్లో కలుపుకొని 3,025 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. కాగా మొదటి దశలో కోర్సుల వారిగా చూసినట్లయితే సివిల్ 368 సీట్లకు 125, సీఎస్ఈలో 777 సీట్లకు 707, ఈసీఈలో 882 సీట్లకు 368, ఈఈఈలో 662 సీట్లకు 146, మెకానికల్‌లో 336 సీట్లకు 43 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 3,025 సీట్లకు 1,389 సీట్లు భర్తీ కాగా 46 భర్తీ శాతం నమోదైంది. ఇందులో రెండు ప్రభుత్వ కళాశాలల్లో నూటికి నూరు శాతం సీట్ల భర్తీ జరుగగా 90 శాతం ఒక కళాశాల, 60–70 శాతం ఒక కళాశాల, 40–60 శాతం 03 కళాశాలలు, 30–40 శాతం 05 కళాశాలలు, 0–5 శాతం వరకు ఒక కళాశాలల్లో సీట్ల భర్తీ శాతాలు నమోదయ్యాయి. పోటాపోటీగా ఆఫర్లు... ఇంజినీరింగ్ రెండవ దశ సర్టిఫికెట్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి 26న వెరిఫికేషన్ ముగిసింది. మొదటి దశలో జిల్లాలోని కళాశాలల్లో నిరాశనే మిగిల్చినా పలు ప్రవేట్ కళాశాలలు రెండవ దశలో సీట్ల భర్తీ శాతాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకొని ఇష్టారాజ్యంగా ఆఫర్లు కుమ్మరిస్తున్నాయని తెలుస్తోంది. వెబ్ఆప్షన్లకు నేటి వరకు ఉండడంతో విద్యార్థుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. పోటాపోటీగా విద్యార్థుల వద్దకు వారి కళాశాలలు ఇస్తున్న ఆఫర్లు చెబుతూనే ఒక కళాశాల మీద మరొక కళాశాల వారు ఆరోపణలు చేసుకోవడం జరుగుతోందని తెలిసింది. కొన్ని ప్రైవేట్ కళాశాలలు మొదటి దశలో కూడా ప్రలోభాలతోనే ప్రవేశాలు ‘కొని’ తెచ్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. రెండద దశలో సైతం ఇలాంటి పద్ధతిలోనే ప్రవేశాలు సంపాదించుకోవడానికి ప్రణాళికతో పనిచేసినట్లు ప్రచారం. విద్యార్థులకు చాలా మంది ఏ కళాశాలలో బాగుంటుందో ఏ కళాశాలలో చేరాలనే విషయంలో స్పష్టత ఉండదు కాబట్టి వారి తల్లిదండ్రులు కళాశాలల చరిత్ర క్షుణ్ణంగా, స్వయంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలు, క్యాంపస్ ఇంటర్వూలు, అన్ని విషయాలు ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను అడిగి తెలుసుకొని చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కానీ మొదటి దశలో మెరుగ్గా ఉన్న కళాశాలలు వారి ప్రవేశాలు పోకుండా జాగ్రత్తపడగా , తక్కువ సీట్లతో నిరాశకు చెందిన వారు సీట్లు నిండడానికి వివిధ మార్గాలను ఆశ్రయించినట్లు సమాచారం. రెండవ దశ సీట్లు కేటాయింపు ఈ నెల 29న ఉండడంతో అదే రోజు ఏయే కళాశాలల ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయో తెలుస్తుంది. కళాశాలలపై చర్యలు తీసుకోవాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు అడ్డదారిలో అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంటు దోచేయాలనే దురుద్దేశంతో విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తూ ఒక్కో అడ్మిషన్‌కు 10 వేల వరకు చెల్లిస్తున్నాయి. కళాశాలలోని వివిధ రకాల ఫీజులు, కన్వీనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజుకు అదనంగా కావాల్సిన ఫీజును కళాశాలల వారే భరించుకొని విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకొని ప్రవేశాలు చేపడుతున్నారు. బీటెక్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఫీజులు అడగబోమని బాండ్లు కూడా ఇస్తున్నారు. అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్న కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సిరిశెట్టి రాజేశ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు -
చదువుతో పాటు.. ఉద్యోగం
సాక్షి,కరీంనగర్ : తరగతి పాఠాలు మాత్రమే సరిపోదు.. కోర్సులు పూర్తికాగానే కొలువులు కొట్టాలంటే ఇంకా లోతైన పరిజ్ఞానం, ఉద్యోగ సాధనాంశాలైన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు వివిధ నైపుణ్యాలు తోడైతేనే సాధ్యపడుతుంది. కార్పొరేట్ కంపెనీలతోపాటు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే వారి అవసరాలకు తగ్గట్టుగా ఉండే విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా చదువుతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు పెద్దపీట వేయడంతో నైపుణ్య శిక్షణ తప్పనిసరవుతుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు అందిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని వాణినికేతన్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి 19వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉద్యోగాంశాలపై శిక్షణ, ఓరాకిల్, జావాలపై శిక్షణ అందిస్తున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్య సామర్థ్యాలను పెంచడానికి వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది. ఉద్యోగాలకు కావాల్సిన కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇంటర్వూ స్కిల్స్, వ్యక్తిగత నైపుణ్యాలు, మాట్లాడే భాష, గ్రూప్‌డిస్కషన్, రాతపరీక్ష, సాప్ట్స్కిల్స్తోపాటు వివిధ అంశాలలో శిక్షణ అందిస్తున్నారు. దీంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను పరిక్షించి, వారి కావాల్సిన విధంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. టాస్క్‌తోపాటు కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో బందచర్చలు, జామ్‌తోపాటు పలు అంశాలపై పట్టుకల్పించే విధంగా ప్రయోగాత్మకంగా శిక్షణ అందిస్తున్నారు. కోర్సులవగానే ఉద్యోగాలు విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, పాఠ్యాంశాలపై లోతైన అవగాహనతోపాటు వివిధ అంశాలపై పట్టుంటేనే భవిష్యత్‌లో ఉద్యోగాలు సులభంగా పొందవచ్చు. టాస్క్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓరాకిల్, జావాపై వారం రోజుల శిక్షణ జరుగుతుంది. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగాలు సాధించేలా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నాం. – లక్ష్మీదీపిక, వాణినికేతన్ డిగ్రీ,పీజీ కళాశాల కరస్పాండెంట్ కొత్త విషయాలు తెలిశాయి తరగతి గదుల్లో చదివే పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలుంటేనే తొందరగా జాబ్‌లు సాధించవచ్చు. టాస్క్ ఆధ్వర్యంలో మాకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. టెక్నికల్ స్కిల్స్, జావా, ఓరాకిల్‌లో లోతుగా విశ్లేషణ చేసి చెప్పడంతో వీటిపై పట్టు సాధించవచ్చు. ఇదే కాకుండా కొలువులకు కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నారు. – ఏ.శ్రీనిధి, డిగ్రీ విద్యార్థిని -
శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం కల నెరవేరనుంది. యూనివర్సిటీ ఏర్పడిన దశాబ్దం దాటినా స్నాతకోత్సవం జరగలేదు. చాలాసార్లు అధికారులు ప్రయత్నించినా వివిధ కారణాలతో కుదరలేదు. తాజాగా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2017 వరకు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈనెల 31 తేదీ వరకు కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేష్‌కుమార్ వెల్లడించారు. పలుమార్లు ప్రయత్నాలు..శాతవాహన యూనివర్సిటీలో స్నాతకోత్సవం నిర్వహించాలని చాలాసార్లు అధికారులు ప్రయత్నించారు. కానీ వివిధ కారణాలతో కుదరలేదు. వీరారెడ్డి వీసీగా పనిచేస్తున్నప్పడు 2014లో నిర్వహించేందుకు ప్రయత్నించినా ప్రత్యేక తెలం గాణ ఉద్యమం తీవ్రతరం కావడంతో అప్పుడు అటకెక్కింది. 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్‌రెడ్డి ఇన్చార్జీ వీసీగా ఉన్నప్పుడూ మరోసారి స్నాతకోత్సవం జరుపాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్చార్జి వీసీగా 2018 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు కొనసాగుతున్న క్రమంలో ఆదిలో స్నాతకోత్సవ ప్రయత్నాలు కొనసాగినా కార్యరూపం దాల్చలేదు. రిజిస్ట్రార్‌గా ఉమేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్నాతకోత్సవం నిర్వహణకు కసరత్తు తీవ్రంగా కృషిచేశారు. ఫలితంగా పలుమార్లు వాయిదా పడుతూ చివరకు ఆగస్టు మొదటి వారంలో నిర్వహిం చాలని శాతవాహన అధికారులు భావిస్తున్నారు. గవర్నర్ పచ్చజెండా.. రాష్ట్ర గవర్నర్ శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి పచ్చజెండా ఊపారు. దీనికి సంబందించిన లేఖ గవర్నర్ కార్యాలయం నుంచి శాతవాహన యూనివర్సిటీ వీసీకి అందించినట్లు సమాచారం. ఇంత వరకు స్నాతకోత్సవం నిర్వహించని శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం విషయంలో వివిధవర్గాల నుంచి అపవాదు ఎదుర్కొంది. ఈ విషయంపై వివిధ సామాజిక సంఘాలు, పార్జీలు, విద్యార్థిసంఘాలు, పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తుల ప్రక్నియ కొనసాగుతూ వచ్చింది. గవర్నర్ నుంచి లేఖ రావడంతో మార్గం సుగమమై ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జూలై 31 వరకు దరఖాస్తులు... శాతవాహన యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి 2017 వరకు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు స్నాతకోత్సవం పట్టా పొందడానికి దరఖాస్తులు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 తేదీ వరకు గడువు ఉందని, అర్హులందరూ శాతవాహన యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. స్నాతకోత్సవం నిర్వహించడంపై శాతవాహన యూనివర్సిటీ వర్గాల్లో చాలా రోజుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి వీసీ ఉండగా స్నాతకోత్సవం అవసరమా అని కొన్నివర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయగా... కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ వీసీని నియమించాలని దరఖాస్తులు కూడా ప్రభుత్వం కోరిందని, రెగ్యులర్ వీసీ వచ్చాక స్నాతకోత్సవం జరుపాలని మరికొన్నివర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవంపై సముఖత వ్యక్తం చేస్తూ లేఖ రావడంతో శాతవాహన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సన్నద్ధమవుతోంది. -
శాతవాహనకు మళ్లీ నిరాశే..!
సాక్షి, కరీంనగర్ : డిగ్రీ సీట్ల కేటాయింపు మూడో దశలోనూ నిరాశే మిగిల్చింది. జూన్ 30న మూడో దశ సీట్లు కేటాయింపు జరిగింది. ఇందులో 3,438 సీట్లు కేటాయించగా సీట్ల భర్తీ శాతం తగ్గుతూ వచ్చింది. ఇప్పటికే మొదటి, రెండో దశ సీట్ల కేటాయింపుల్లో ఆశించనంతంగా సీట్ల భర్తీ కాలేదు. మూడో దశపైనే ఆశలన్నీ పెట్టుకోగా.. ఆశించినంత సీట్ల భర్తీ కాక ప్రైవేటు యాజమాన్యాలు తల పట్టుకున్నారు. గత సంవత్సరం కంటే కూడా తక్కువగా భర్తీ అవుతుండడంతో ఆవేదన మొదలైంది. ప్రభుత్వం ఆది నుంచి డిగ్రీలో ప్రవేశాలు పెంచాలని వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాంప్రదాయ కోర్సులతోపాటు వివిధ నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. ఏంచేసినా సీట్ల భర్తీ శాతం పడిపోతూనే ఉంది. దీనికి కారణం ఏమిటో తెలియక తికమక పడుతున్నాయి. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువశాతం మంది సాంప్రదాయ డిగ్రీ కోర్సుపై ఆనాసక్తి కలిగి ఉండడంతో నూతన మార్గాలతోపాటు బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు వెళ్లడానికి మార్గాలు అన్వేషించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో సీట్ల నిండకుంటే దాదాపు 5 దశల్లో ప్రవేశాలు చేపట్టారు. ఇప్పటికి మూడు దశలు పూర్తయినా పెద్దగా సీట్ల భర్తీ కాలేదు. దీనివల్ల ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాల శాతం పెంచడానికి ప్రత్యేకంగా ఇంకా ఒకటి రెండు దశలు పెట్టే అవకాశాలు లేకపోలేదని విద్యారంగనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రవేశాలు చేపడితేనే సీట్ల భర్తీ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు దశల్లో అంతంతే... దోస్త్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ఇప్పటికి మూడు దశలు పూర్తయ్యాయి. మూడో దశ సీట్ల కేటాయింపు కూడా జూన్ 30 సాయంత్రం జరిగింది. మొదటి దశలో 12,354 సీట్లు కేటాయించగా.. 5,126 సీట్లు నిర్ధారించుకున్నారు. రెండో దశలో 4,881 సీట్లు కేటాయించగా ఇందులో బాలురు 1,872, బాలికలు 3,009 ఉన్నారు. మూడో దశలో 3,438 సీట్లు కేటాయింపు జరగడంతో శాతవాహన యూనివర్సిటీలో మొత్తం సీట్లలో సగం కూడా కాకపోవడం గమనార్హం. ఏటేటా కూడా ప్రవేశాలు కూడా నేలచూపే చూస్తున్నాయి. మూడో దశలో సీట్లు కేటాయించిన వారు జూలై 1 నుంచి 4 వరకు సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసుకొని కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి గడువుంది. మరో అవకాశమిస్తే వివిధ కారణాల వల్ల సీట్లు పొందని వారు, నమోదు చేసుకోని వారితో ఖాళీ సీట్లను భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది. సగం కూడా భర్తీకాలేదు.. శాతవాహన యూనివర్సిటీ 3 దశలు సీట్ల కేటాయింపు తర్వాత చూస్తే మొత్తం సీట్లలో సగం కూడా భర్తీ కాలేదు. యూనివర్సిటీ వ్యాప్తంగా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో మొత్తం 43,820 సీట్లున్నాయి. ఇందులో గిరిజన, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో కలుపుకొని 1,230 సీట్లున్నాయి. వీటికి దోస్త్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి పోగా మిగిలిన 42,040 సీట్లు దోస్త్ ద్వారా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 12,355 సీట్లు, 2వ దశలో 4,881 సీట్లు, 3వ దశలో 3,438 సీట్లు కేటాయించారు. మొత్తం 42,040 సీట్లకు మూడు దశల్లో కలుపుకొని 20,677 సీట్లు మాత్రమే కేటాయించారు. ఇంకా ఇందులో కేటాయించబడిన వారందరూ సీట్లు నిర్ధారించుకుంటారో లేదో తెలియదు. అంటే ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదముంది. తల పట్టుకుంటున్న యాజమాన్యాలు... యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమానులు సీట్లు నిండక తల పట్టుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన నాటి నుంచి పలు కళాశాలలు తీవ్రమైన ప్రచారాలు, ప్రలోభాలు చేస్తూ వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సీట్లు మాత్రం భర్తీ కాలేదు. దాదాపు రెండు మూడు నెలల నుంచే లక్షల్లో ఖర్చు చేస్తూ క్యాన్వేసింగ్ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. మరికొన్ని కళాశాలల పరిస్థితి కొనసాగించే బదులు మూసుకుంటేనే మంచిదనే ఆలోచనలో యాజమాన్యాలున్నట్లు తెలిసింది. కరీంనగర్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో ప్రముఖ కళాశాలల్లో మాత్రమే సీట్లు చెప్పుకునే స్థాయిలో నిండినట్లు సమాచారం. అది కూడా వేళ్లమీద లెక్కబెట్టే కళాశాలల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. చాలావరకు కళాశాలలు నిరాశతోనే ఉన్నాయని, సీట్ల భర్తీకి కొట్టుమిట్టాడుతూ కష్టాలతోనే నెట్టుకొస్తున్నాయని సమాచారం. ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం కళాశాలల సంఖ్య కూడా తగ్గుతుందని, స్వచ్ఛందంగా కళాశాలలు మూతబడే పరిస్థితులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆచార్యడొకరు తెలిపారు. ఏదేమైనా ప్రవేశాలకు గతంలో వలే మరో అవకాశమిస్తేనే ఇంకొన్ని సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగనిపుణుల విశ్లేషణ. -
‘చత్తీస్‌గఢ్ వెళ్లి మావోయిస్టులను కలుస్తున్నట్టు సమాచారం..’
సాక్షి, కరీంనగర్ : శాతవాహన యూనివర్శిటీలోని తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) పై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. పోలీసులే తమపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లుగా టీవీవీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. టీవీవీకి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు గతంలో చాలా సార్లు రుజువైందని చెప్పారు. టీవీవీలో పనిచేసే కొంతమంది నేతలు తరుచూ చత్తీస్‌గఢ్ వెళ్లి మావోయిస్టు నేతలను కలుస్తున్నట్లుగా మా దగ్గర సమాచారం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు పోలీసు స్టేషన్లలో మావోయిస్టులతో సంబంధాలున్నట్లు టీవీవీ నేతలపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అమాయక విద్యార్థులకు మాయమాటలు చెప్పి మావోయిస్టు అజ్ఞాత దళంలో చేర్పించేందుకు టీవీవీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!) టీవీవీ రాష్ట్రాధ్యక్షుడు మహేశ్ వద్ద గతంలో విప్లవ సాహిత్యం దొరికిందని గుర్తు చేశారు. అతనిపై నల్గొండ జిల్లాలో పోలీసు కేసు నమోదైందని చెప్పారు. శాతవాహన యూనివర్శిటీలోని టీవీవీ నేతలపై సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై నిజనిజాలు ఇంకా ధ్రువీకరణ కాలేదని ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. యూనివర్శిటీ ప్రొఫెసర్ పై వచ్చిన ఆరోపణలపై మాదగ్గర ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నక్సల్స్ బాధితుల సంక్షేమం సంఘం పేరుతో సర్క్యులేట్ అవుతోన్న పోస్టులను ఎవరు చేశారో గుర్తిస్తామని చెప్పారు. యూనివర్శిటీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మావోయిజం వల్ల గడిచిన మూడు దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది చనిపోయారని, ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల మావోయిజాన్ని ఇక్కడ లేకుండా చేయగలిగామని సీపీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
చదువులమ్మ ఒడిలో మావోల కలకలం..!
-
శాతవాహనలో స్నాతకోత్సవం ఎప్పుడూ..?!
యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు స్నాతకోత్సవం కీలక ఘట్టం. అలాంటి స్నాతకోత్సవాన్ని శాతవాహన యూనివర్సిటీ స్థాపించి దశాబ్దం దాటినా ఇంతవరకు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో విద్యార్థులు పట్టాపండుగ భాగ్యానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నప్పటికీ శాతవాహన అధికారులు మాత్రం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్నాతకోత్సవం నిర్వహించాలని విద్యార్థులు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా.. అధికారులు పెడచెవినపెడుతున్నారు. యూనివర్సిటీ అధికారులు, పరీక్షల విభాగం పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సాక్షి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. వందల సంఖ్యల్లో విద్యార్థులు పట్టభద్రులై వెళ్తున్నప్పటికీ వారు వర్సిటీ ఛాన్స్లర్ చేతులమీదుగా పట్టాలు అందుకునే భాగ్యం మాత్రం కోల్పోతున్నారు. గతంలో ఒకరిద్దరు వీసీల కాలంలో ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అంతా ఇన్చార్జి వీసీల పాలనే జరుగుతుండడంతో సాధ్యపడలేదని కనిపిస్తోంది. కానీ సంబంధిత విభాగం అధికారుల సోమరితనంతోనే.. స్నాతకోత్సవానికి బ్రేక్ పడుతున్నట్లు యూనివర్సిటీ వర్గాల ద్వారా సమాచారం. ఏదిఏమైనా యూనివర్సిటీ ఈ సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే పదేళ్లు గడిచినా పట్టా పండగ నిర్వహించలేదనే అపవాదును ఎదుర్కొవడం ఖాయమని విద్యారంగ నిపుణుల భావన. కార్యరూపం దాల్చని స్నాతకోత్సవం స్నాతకోత్సవం నిర్వహించాలని గతంలో వీరారెడ్డి వీసీగా ఉన్నప్పుడు 2014లో గవర్నర్ చేతులమీదుగా నిర్వహించాలని భావించినా రాష్ట్ర విభజన సమయం కావడంతో అప్పటి పరిస్థితుల్లో ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్‌రెడ్డి ఇన్చార్జి వీసీగా విధులు నిర్వహించిన సమయంలో మరోసారి స్నాతకోత్సవం అంశం తెరమీదికొచ్చినా.. ఆయన మున్సిపల్‌శాఖ కీలక బాధ్యతల్లో ఉండడంతో కుదరలేదు. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించాలనే ఆలోచనకు కూడా ఆయన సమయం కేటాయించే పరిస్థితులు లేకపోవడంతో అది కాస్తా అటకెక్కింది. ఆయన తర్వాత 2017 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నప్పటికీ ముఖ్య బాధ్యతల్లో భాగంగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటుండడంతో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వర్సిటీకి సమయం కేటాయించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ఈ తరుణంలో ఇన్చార్జి వీసీ స్నాతకోత్సవ నిర్వహణకు సముఖత చూపేలా లేరని తెలుస్తోంది. ఇలా దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్నాతకోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు దూరమవుతున్నారు. రాష్ట్రంలోనే నిర్వహించని ఏకైక వర్సిటీ రాష్ట్రంలో శాతవాహన యూనివర్సిటీతోపాటు మహాత్మగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలను ఒకేసారి ప్రారంభించారు. ఒక్క శాతవాహన తప్ప అన్ని వర్సిటీలు ఒక్కోసారి స్నాతకోత్సవాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా పరీక్షల విభాగం అధికారుల నుంచి ప్రయత్నాలు లేకపోవడమే దీనికి కారణమని విద్యార్థుల్లో చర్చ జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఉమేశ్‌కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తీవ్రంగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఈసారి ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏదిఏమైనా శాతవాహన యూనివర్సిటీ అధికారులు స్నాతకోత్సవంపై దృష్టిసారించి విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించాలని వివిధ కోర్సుల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే మే లోగా నిర్వహిస్తాం శాతవాహన యూనివర్సిటీ ఏర్పడిన నాటినుంచి స్నాతకోత్సవం నిర్వహించనిది వాస్తవమే. గతంలో కొన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలిసింది. బాధ్యతలు చేపట్టిన యూనివర్సిటీలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంతో పాటు స్నాతకోత్సవంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. మే 2019 లోపు స్నాతకోత్సవానికి ప్రణాళిక రూపొందించి కచ్చితంగా నిర్వహిస్తాం. – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
వద్దంటున్న ఫార్మసీ విద్యార్థులు
శాతవాహనయూనివర్సిటీ: ఎల్ఎండీ కాలనీలోని శాతవాహ న యూనివర్సిటీ ఫార్మసీ ప్రాంగణం వసతిగృహాలు సరైన సదుపాయాలు లేక అధ్వానంగా మారాయి. వీటిలో సరైన సౌకర్యాలు కల్పించాలని, హాస్టళ్లను ఇక్కడినుంచి తరలించా లని విద్యార్థులు గతంలో పలుమార్లు యూనివర్సిటీ అధికా రులను కోరారు. దీంతో యూనివర్సిటీ ఫార్మసీ హాస్టళ్లను వాటి స్థానంలో నూతనంగా నిర్మించడానికి రూ.18 కోట్లకు పైగా నిధులు సిద్ధం చేశారు. ఇప్పుడు అక్కడున్న బాలబాలికలను మెయిన్ క్యాంపస్‌కు తరలించాలనే ఆలోచనలో అధి కారులున్నారు. అయితే కొంతమంది ఫార్మసీ విద్యార్థులకు అక్కడి నుంచి మెయిన్ క్యాంపస్‌కు రావడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు మెయిన్ క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులు ఫార్మసీ విద్యార్థులు వస్తే ఇక్కడ వసతులు సరిపోవని అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆలోచనలో పడ్డారు. ఎన్నికలు ముగిసేవరకూ తరలింపు అంశంపై ఎలాంటి నిర్ణ యం తీసుకోబోమని, ఆలోపు వసతిగృహాల తరలింపుపై స్ప ష్టమైన వైఖరిని వెల్లడించాలని విద్యార్థులకు సూచించారు. దీంతో ఎన్నికలు ముగిసేవరకూ విద్యార్థులు తీసుకున్న నిర్ణయంపై తరలింపు పక్రియ ఆధారపడనుందని తెలుస్తోంది. రూ.18కోట్లతో నూతన హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీలో ఇన్ని రోజుల నుంచి రేకులషెడ్డుల్లో బాలబాలికల వసతిగృహాలు నిర్వహించబడుతున్నాయి. ఫార్మసీ హాస్టళ్లలో మొత్తం 111 మంది ఉండగా.. ఇందులో బాలురు 32 మంది, బాలికలు 79 మంది ఉన్నారు. గతంలో విద్యార్థులు వసతిగృహాలతోపాటు అంతర్గత రోడ్లు, భవనాలు వంటి వసతులను మెరుగుపర్చాలని గతంలో యూనివర్సిటీని ముట్టడించి అధి కారులను నిలదీశారు. పలు విద్యార్థిసంఘాలు సైతం సమస్యలపై పోరాటాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అధికారులు స్పందించి అక్కడ నూతనంగా బాలబాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు నిర్మించాలని నిర్ణయించి ప్రభుత్వానికి సూచించగా రూ.18కోట్ల నిధుల కూడా మంజూరయ్యాయి. కొద్దిరోజుల నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. ఎన్నికలు ముగియగానే నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని అధికా రులు సిద్ధమయ్యారు. దీనికోసం విద్యార్థులతో వసతిగృహా ల తరలింపుపై సంప్రదింపులు జరిపారు. కొంతమంది విద్యార్థులు తరలింపునకు సుముఖత చూపకపోవడంతో అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఎన్నికలు ముగిశాకే తుది నిర్ణయం ప్రస్తుతం హాస్టళ్లు నిర్మించడం సాధ్యపడదు కాబట్టి ఎన్నికలు ముగిశాక నిర్మాణాలు ప్రారంభించడానికి వీలవుతుందని యూనివర్సిటీ అ ధికారులు భావిస్తున్నారు. మెయిన్ క్యాంపస్‌లోని హాస్టళ్ల వి ద్యార్థులు కూడా ఫార్మసీ విద్యార్థుల రాకను వ్యతిరేకిస్తున్నా రు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవులు సోమవా రం ఫార్మసీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇందులో కొంతమంది ఫార్మసీ విద్యార్థులు తరలింపుపై పెదవి విరవడంతో తరలింపుపై తుది నిర్ణయం వి ద్యార్థులకే వదిలేసినట్లు సమాచారం. విద్యార్థి సంఘాల కన్నెర్ర ఫార్మసీ హాస్టళ్ల తరలింపుపై వివిధ విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే 40 ఎకరాలు ఉన్న ఎల్ఎండీలోని శాతవాహన ఫార్మసీ క్యాంపస్ లో ఐదెకరాలు ఉర్దూ యూనివర్సిటీకి, ఐదెకరాలు ఫిషరీస్ కళాశాలకు కేటాయించారని, ఇప్పుడు అక్కడ నుంచి తరలిస్తే మిగితా 30 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యూనివర్సి టీ అధికారులు తరలింపును నిలిపివేసి అక్కడే తాత్కాలిక వ సతిని ఏర్పాటు చేసి వసతిగృహాల భవనాలను పూర్తిచేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టళ్ల తరలింపు ఆపాలి:కరికె మహేష్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు యూనివర్సిటీ అధికారులు ఫార్మసీ వసతిగృహాల తరలింపు నిర్ణయాన్ని ఆపాలి. ఇప్పటికే 40 ఎకరాలున్న యూనివర్సిటీ భూమి 10 ఎకరాలు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. తరలిస్తే ప్రభుత్వం మిగితా 30 ఎకరాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. తరలింపు ప్రక్రియ ఎక్కువశాతం ఫార్మసీ విద్యార్థులకు ఇష్టం లేదు. మెయిన్ క్యాంపస్ హాస్టళ్ల విద్యార్థులకు కూడా వారు ఇక్కడికి వస్తే వసతులు సరిపోయేలా లేవు. అధికారులు తరలింపు ప్రక్రియను విరమించుకోవ్చాట. -
‘అకాడమిక్’ అయోమయం..!
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: ఓ సెమిస్టర్ చివరి దశకు వస్తున్నా.. నేటికీ పలు కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల సిలబస్ పూర్తి కాలేదంటే నమ్మాల్సిందే..!! నెల రోజుల్లో ప్రస్తుత సెమిస్టర్ కావాల్సి ఉంది. కానీ.. పలు కళాశాలల్లో ఆ పరిస్థితి లేదు. దీంతో అంతా అయోమయం నెలకొంది. అకాడమిక్ అల్మానాక్ అమలులో శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులకు తలనొప్పిగా మారింది. జూన్‌లో సెమిస్టర్ ప్రారంభమైనా సెప్టెంబర్ నెల వరకు సిలబస్ పూర్తిస్థాయిలో నిర్ణయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమిస్టర్ ప్రారంభానికి ముందే ప్రకటించాల్సి ఉన్నా.. వర్సిటీ తీరులో మార్పు రావడం లేదు. అకాడమిక్ అల్మానాక్ ప్రకారం షెడ్యూల్ జరగాల్సి ఉంది. దాని అమలుపై వర్సిటీ పట్టింపు లేకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరంభంలో ఊహాజనితంగా పలానా అంశాలు సిలబస్‌లో ఉంటాయని భావించి బోధన చేపట్టారు. తీరా చూస్తే సిలబస్ పరిశీలించాక బోధించిన అంశాలు కాకుం డా ఇంతరత్రా ఉండడంతో ఖంగుతిన్నారు. తిరిగి కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అకాడమిక్ అల్మానాక్ అమలుపై దృష్టి సారించి దాని ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిలబస్ నిర్ణయించడంపై నిర్లక్ష్యం.. శాతవాహన యూనివర్సిటీ సిలబస్ విషయంలో కొన్నేళ్లుగా నిర్లక్ష్య వైఖరే కనిపిస్తోంది. గతంలో రెండో సెమిస్టర్‌లోని జెండర్ సెన్సిటైజేషన్ అనే కామన్ సబ్జెక్టు పేపర్ సిలబస్ కూడా సెమిస్టర్ ముగిసే 20 రోజుల ముందే ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఆయా అంశాలు 20 రోజుల్లో బోధించడానికి నానా అవస్థలు పడ్డారు. చివరకు ఫలితాలపై ప్రభావం పడింది. వివిధ సబ్జెక్టుల విషయంలోనూ ప్రారంభంలో ఇవ్వకుండా జాప్యం చేయడంతో కష్టాలు తప్పడంలేదు. ఇప్పుడు కూడా సెమిస్టర్ ప్రారంభమైన నెల రోజులు దాకా కూడా స్పష్టమైన సిలబస్ అంశాలు ప్రకటించలేదు. ఒకటి రెండు సబ్జెక్టులకు సంబందించిన సబ్జెక్టుల విషయంలో వర్సిటీ అధికారులు సిలబస్ ప్రకటించినా కళాశాలల్లో నేటికీ స్పష్టత లేదు. సెమిస్టర్ పూర్తి కావస్తున్నా ఇంకా అధ్యాపకులు వాటిని ఎప్పుడు బోధిస్తారు.. విద్యార్థులు వాటిని ఎప్పుడు చదువుతారు.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో గందరగోళం.. యూనివర్సిటీ అధికారులు కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ప్రకటించిన తీరుపై అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. డిగ్రీ 5వ సెమిస్టర్ వారికి ‘పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్’ అనేది బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ అన్ని కోర్సుల వారికి సిలబస్ ప్రకటించారు. ‘వెర్బల్ రీజనింగ్ ఫర్ అప్టిట్యూడ్’ అనే సెలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వారికి అందరికీ ఉండాలని సెప్టెంబర్‌లో ఇచ్చారు. దీంతో బీఎస్సీ వారితోపాటు బీకాం, బీఏ విద్యార్థులకు దీనికి సంబంధించిన సిలబస్ బోధించడం ప్రారంభించారు. దాదాపు 15 రోజుల తర్వాత బీకాం విద్యార్థులకు మళ్లీ కొత్తగా ‘ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్’ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టడంతో అధ్యాపకులు తలలు పట్టుకున్నారు. ఇదే కాకుండా బీకాం వారికి మార్చినప్పుడు బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్లకూ ఇది చదవడం కఠినంగానే ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఏటా సిలబస్‌లో అస్పష్టత, సరైన సమయంలో నిర్ణయించకపోవడంతోపాటు పలు కారణాలతో అకాడమిక్ అల్మానాక్ అమలుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పరీక్షల తేదీని పొడగిస్తాం.. డిగ్రీ కోర్సుల్లో సిలబస్‌ను నిర్ణయించడంలో కొంత ఆలస్యమైంది. నేను ఇటీవలే శాతవాహన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం నవంబర్‌లో పరీక్షలు ఉండాల్సింది. కానీ.. ఎన్నికల దృష్ట్యా వాటిని ఇంకా పొడగించే అవకాశం ఉంది. పరీక్షల సమయం పొడగించడంతో సిలబస్ పూర్తి చేసుకోవడానికి సమయం కూడా ఉంటుంది. వచ్చే సెమిస్టర్ నుండి సిలబస్, అకాడమిక్ అల్మానాక్ అమలు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– యూ.ఉమేష్‌కుమార్, శాతవాహనయూనివర్సిటీ రిజిస్ట్రార్ -
కాసుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్) : పాలిటెక్నిక్ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో ఉండాల్సిన పారిశ్రామిక శిక్షణపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆరో సెమిస్టర్‌ను కొనసాగించడానికి స్టేట్‌బోర్టు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు సూచించిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని విద్యారంగ నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సాకుతో ఎస్బీటీఈటీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించేలా నియమనిబంధనలకు విరుద్ధంగా అనుసరించడానికి ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ డిప్లొమా కళాశాలలు వ్యూహాలు పన్నుతున్నాయి. చివరి సెమిస్టర్లో స్టేట్‌బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు చివరి సెమిస్టర్లో విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు అనే రెండుదారులు సూచించారు. ఇందులో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పారిశ్రామిక శిక్షణ వైపే మొగ్గుచూపుతున్నారు. అయినా వివిధ సాకులను చూపిస్తూ తమ కళాశాలల్లోనే మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు విద్యార్థులకు ఇష్టం లేకుండానే మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలలు విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు దండుకోవచ్చనే పన్నాగంతో వారి అభిప్రాయాలకు సంబంధం లేకుండానే ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపునకు బలవంతంగా మళ్లిస్తున్నారని సమాచారం. ఎస్బీటీఈటీ అధికారులు దీనిపై దృష్టి పెట్టి విద్యార్థులు కోరుకున్న విధంగా చివరి సెమిస్టర్ అమలు చేయాలని పలు ప్రైవేట్ కళాశాలల పాలిటెక్నిక్ విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచీ తర్జనభర్జనే.. పాలిటెక్నిక్ కోర్సుల్లో గతంలో దాదాపు చివరి సంవత్సరంలో ఏదైనా ఒక సెమిస్టర్లో ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ ఉండేది. తర్వాత దీనిని తొలగించి సబ్జెక్టులు జోడించి కేవలం వేసవి సెలవులు, ఇతర సెలవుల్లో నెలరోజుల శిక్షణ పెట్టారు. ఈ నిర్ణయంతో నిపుణులు, విద్యావంతులతోపాటు వివిధ వర్గాల నుంచి పాలిటెక్నిక్ కోర్సులో కచ్చితంగా ఆర్నెల్ల శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మళ్లీ ఆర్నెల్లకు మార్చారు. 2018–19 విద్యాసంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు ఉండాలనే రెండు ఆప్షన్లు ఇవ్వడం వారిని అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ విధంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటినుంచి పారిశ్రామిక శిక్షణపై సరైన స్పష్టత లేకుండానే గడుస్తూ వచ్చింది. తీరా చూసేసరికి అధికారులు రెండు ఆప్షన్లతో కూడిన నిర్ణయానికి వచ్చారు. ఇదే అదునుగా తీసుకుని విద్యార్థులను సంప్రదించకుండానే నేరుగా ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపునకే మళ్లిస్తున్నట్లు సమాచారం. కొన్ని కళాశాలలు పారిశ్రామిక శిక్షణ వైపునకు వెళ్లాలని భావిస్తుండగా, మరికొన్ని ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రాజెక్టు సాకుతో దండుకునే పన్నాగం..? ఎస్బీటీఈటీ అధికారులు రూపొందించిన పాలిటెక్నిక్ సెమిస్టర్లో పాటించాల్సిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణకు పంపితే విద్యార్థులు నేరుగా పరిశ్రమలకే సంబంధిత ఫీజు చెల్లించే అవకాశాలుంటాయని.. దీంతో కళాశాలలకు ఒరిగేదేమీ ఉండదని భావించి, సబ్జెక్టులతో కూడిన ప్రాజెక్టు వర్క్ ఆప్షన్ ఎంపిక చేస్తే విద్యార్థులు కళాశాలలోనే ఉండడంతోపాటు ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే పన్నాగం పన్నుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేర కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోకుండానే నేరుగా కళాశాల యాజ మాన్యాలే ప్రాజెక్టు వైపు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆరో సెమిస్టర్లో విద్యార్థులకు అన్యాయం జరగడంతోపాటు కళాశాలలకు కాసుల వర్షం కురవడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కళాశాలలు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ వైపునకు మొగ్గుచూపగా పలు కళాశాలలు ప్రాజెక్టు పేరుతో డబ్బులు దండుకోవాలనే ఊగిసలాటలో నిర్ణయాన్ని బయట పెట్టడంలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న ఒక పాలిటెక్నిక్ యాజమాన్యం మాత్రం విద్యార్థులను నామమాత్రంగా సంప్రదించి మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు మళ్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సొంత అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఆశలకు గండికొడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆరో సెమిస్టర్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు దారులు ఆప్షన్లు కా కుండా ఏదో ఒకటే అధికారులే నిర్ణయించి నిబంధనలు రూపొందిస్తే బాగుంటుందని, రెండు దారులుండడంతో అయోమయానికి గురవుతున్నామని పలువురు విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. ఎస్బీటీఈటీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ ఆరో సెమిస్టర్లో అవలంబించే తీరుపై ప్రత్యేక నిఘాపెట్టి అక్రమాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
శాతవాహన రిజిస్ట్రార్ ఎవరో..?
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీకి కొత్త రిజిస్ట్రార్ ఎవరు వస్తారనే చర్చ యూనివర్సిటీతోపాటు పరిధిలోని వివిధ కళాశాలల్లో ప్రారంభమైంది. ఈనెల 31తో ప్రస్తుతం పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఎం.కోమల్‌డ్డి ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత ఎవరు వస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. నాలుగేళ్లుగా ఇన్చార్జి పాలనలో కొనసాగుతున్న యూనివర్సిటీకి కీలకంగా రిజిస్ట్రార్ స్థానమే బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇన్చార్జి వీసీలు ఇక్కడ పెద్దగా సమయం కేటాయించకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం.. సమస్యలొస్తే పరిష్కరించడానికి రిజిస్ట్రార్ అందుబాటులో ఉండి పర్యవేక్షించారు. అలాంటి రిజిస్ట్రార్ పోస్టు ఇప్పుడు ఖాళీ అయితే ఎలా..? అనేది అందరి ఆలోచన. నాలుగేళ్లుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించకుండానే ప్రభుత్వం నెట్టుకొస్తున్న ఈ తరుణంలో రెగ్యులర్ రిజిస్ట్రార్ నియామకం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరోవైపు పోస్టు ఖాళీ అయిన వెంటనే రిజిస్ట్రార్ పోస్టును భర్తీ చేయాలని విద్యారంగనిపుణులు, విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు శాతవాహన యూనివర్సిటీకి కోమల్‌రెడ్డితోపాటు ఇప్పటివరకు నలుగరు బాధ్యతలు చేపట్టారు. వర్సిటీ ప్రారంభమయ్యాక మొద టి రిజిస్ట్రార్‌గా ఏ.వినాయక్‌రెడ్డి (28 ఆగస్టు 2008 నుంచి 27 ఆగస్టు 2009 వరకు), ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ (31 ఆగస్టు 2009 నుంచి 27మే 2012), ప్రొఫెసర్ బి.భద్రయ్య (28 మే 2012 నుంచి 27 మే 2014) తర్వాత 28 మే 2014 నుంచి ఎం.కోమల్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనుండడంతో పోస్టు ఖాళీ కానుంది. యూనివర్సిటీలో కీలకమైనస్థానం ఖాళీ అవుతుండడంతో తర్వాత ఎవరు వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. యూనివర్సిటీలో నుండే వస్తారా..? వర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్లున్నారు. వీరిలో ఒకరు కోమల్‌రెడ్డి, ఇంకొకరు గతంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా పనిచేసిన టి.భరత్. అనుభవం ప్రకారం చూస్తే వర్సిటీలో మొదటి అవకాశం ఇతనికే ఉంటుందన్న చర్చ వర్సిటీవర్గాల్లో జరుగుతోంది. వివిధ యూనివర్సిటీ ల రిజిస్ట్రార్ల నియామకాలు పరిశీలిస్తే ఎవరినైనా పోస్టు వరించవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. తుదకు రిజిస్ట్రార్ ఎవరనేది నిర్ణయించేది వీసీ చేతులో ఉంటుంది. ఇద్దరూ ఒకేసారి వచ్చే అవకాశం ప్రస్తుతం యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా టి.చిరంజీవులు కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమించాలనే ఆలోచనతో ఉంది. దీనికోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశం ఈనెల 10న ఉండగా.. అనుకోకుండా వాయిదాపడింది. త్వరలోనే వీసీ నియామకం కూడా చేపట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారవర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రార్‌ను నియమించాలంటే వీసీ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీసీతోపాటు రిజిస్ట్రార్‌ను కొత్తవారినే నియమించే అవకాశాలూ ఉన్నట్లు విద్యారంగ నిపుణుల్లో చర్చ సాగుతోంది. మొదట వీసీని నియమించి.. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ను నియమిస్తారా..? ప్రస్తుతం ఖాళీ అవనున్న రిజిస్ట్రార్ కుర్చీ భర్తీ చేసి ఆ తర్వాత వీసీని నియమిస్తారా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని విద్యారంగ నిపుణులు ఎదురుచూస్తున్నారు. -
ఈసారైనా పెరిగేనా..!
శాతవాహనయూనివర్సిటీ : అర్హులైన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో సీటు వచ్చేవిధంగా దోస్త్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో పలుమార్లు ప్రవేశాలకు అవకాశమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో భారీగా మిగులుతున్న సీట్లును భర్తీచేయాలనే ఉద్దేశంతో ఐదోసారి దోస్త్ ద్వారా కొత్తవారికి, గతంలో నమోదు చేసుకున్న వారికి కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశమిస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ పరిధిలో 45,471 సీట్లుండగా నాలుగు దశల్లో 20,350 సీట్లు భర్తీ అయ్యాయి. 25,121 మిగులు సీట్లతో డిగ్రీప్రవేశాలు నేలచూపు చూస్తున్నాయి. ఐదోదశలో ప్రవేశాలకు అవకాశమివ్వడంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలతో పాటు శాతవాహనలో కూడా ప్రవేశాలు పెరిగే అవకాశముండొచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు. 16 తేదీతో నమోదు, వెబ్ ఆప్షన్లు పూర్తవనుండడంతో ప్రవేట్ కళాశాలలు దీనినే చివరి అవకాశంగా భావించి పోటీపడుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు కళాశాలలో సదుపాయాలు పరిశీలించి మారడానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే దాదాపు మూడు వేల సీట్ల వరకు మార్పులు చేర్పులు జరుగుతాయనేది అంచనా. పెరగనున్న సీట్ల భర్తీ ... దోస్త్ అధికారులు డిగ్రీసీట్ల భర్తీని పెంచడానికి గతంలో ఎన్నడూ కనివిని ఎరగని అవకాశాలు అందిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 16వరకు డిగ్రీ ప్రవేశాలకు నమోదు, వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రవేశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. దీంతో ఆయా కోర్సుల్లో సీటు రాని వారు ఇటువైపుగా వచ్చే అవకాశముంది. ఇదీ పరిస్థితి.. వర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు తిరోగమనంలోనే ఉంటున్నాయి. కొన్నిసార్లు భర్తీ కన్నా ఖాళీగా మిగులుతున్న సీట్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశలో 13,177, రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో ‘దోస్త్’ అందరినీ నిరాశ పరిచింది. మూడో దశ కేటాయింపు తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించబడి 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన నాలుగోదశలో 20,350 సీట్ల భర్తీ జరిగింది. ఇప్పుడు ఐదోదశకు అవకాశం ఇవ్వడంతో దాదాపు 2వేల పైగానే సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కళాశాలల మధ్య పోటీ.. ‘దోస్త్’ అధికారులు ఐదోసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వడంతో ప్రయివేటు కళాశాలల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పలు కళాశాలల మధ్య ఆనారోగ్యకరమైన పోటీ నెలకొని ఒకరికి మించి ఒకరు ఆఫర్లు ప్రకటించి విద్యార్థులను ఆకర్షించారు. ఎన్ని తిప్పలు పడ్డా ఆనుకున్నస్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. మూడు, నాలుగు దశల సీట్ల కేటాయింపు పూర్తయినా కరీంనగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లోనే చెప్పకోదగ్గస్థాయిలో ప్రవేశాలు జరిగాయి. మిగిలినివి కొన్ని పర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం మూసివేసే దశకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రకటించిన 5వ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగపరుచుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రవేట్ కళాశాలలు తప్పుడు మార్గంలో ప్రలోభాలు ప్రకటించి డిగ్రీ ప్రవేశాలను చేపడుతున్నాయని సమాచారం. -
డిగ్రీ, ఇంజినీరింగ్ అనుసంధానం..!
శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఎంసెట్, దోస్త్ ప్రవేశాలకు సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరే విద్యార్థులు డిగ్రీలో కూడా చేరేందుకు సిద్ధపడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే చాలామంది విద్యార్థులకు రెండింటిలో సీట్లు రావడంతో ఇంజినీరింగ్‌తోపాటు ఇతర కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. డిగ్రీ ప్రవేశాలనురద్దు చేసుకునే అవకాశం లేకపోవడంతో డిగ్రీ కళాశాలల్లో సీట్ల మిగులుకు కారణమవుతోంది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల గందరగోళానికి తెరతీస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు వృథాగా పోకుండా ఉండడానికి ఎంసెట్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయాలని ప్రవేశాలకు సంబంధించిన అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఈ విషయమై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల(దోస్త్) కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం సమావేశమైనట్లు సమాచారం. డిగ్రీ కోర్సుల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాల గురించి సంబంధిత అధికార వర్గాలు చర్యలు చేపడుతున్నారు. ఇదే జరిగితే కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా పలు కళాశాలల్లో సీట్ల మిగులుకు అడ్డుకట్టవేసే అవకాశాలుంటాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో వస్తే డిగ్రీలో ఖాళీ.. శాతవాహనలో గతేడాది విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్‌కు వెళ్లడంతో దాదాపు 2 వేల వరకు సీట్లు డిగ్రీలో వృథాగా మిగిలిపోయాయని సమాచారం. విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాక కూడా డిగ్రీ కోర్సుల్లో వారి ప్రవేశాలు రద్దుచేసుకోకపోవడంతో సీట్ల విషయంలో గందరగోళం తలెత్తేది. కానీ ప్రభుత్వం అనుసంధానం నిర్ణయం వల్ల టాప్ కళాశాలల్లో సీట్ల వృథాను అరికట్టవచ్చని వివిధ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలనే ఆసక్తితో ఉంటే ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయడం ద్వారా వారు ఇంజినీరింగ్‌లో చేరగానే డిగ్రీలో అతడికి వచ్చిన సీటు ఖాళీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో టాప్ కళాశాలల్లో సీట్లు మిగలకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఇదేకాకుండా డిగ్రీలో సీటు వచ్చిన విద్యార్థులు వారి సీట్లను కన్ఫార్మ్ చేసుకునేటప్పుడు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే నిబంధన విధించనున్నారు. ఇది ఓసీలకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.500 ఉండనున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని విద్యార్థి కళాశాలలో చేరాక లేదా ఆ సీటును వదులుకున్నాక ఇచ్చేలా నిబంధన విధించనున్నట్లు తెలిసింది. గతేడాది శాతవాహన వ్యాప్తంగా దాదాపు 2 వేలకుపైగా విద్యార్థులు బీటెక్ వైపునకు వెళ్లడంతో డిగ్రీలో మిగిలిపోయాయి. 22,986 సీట్ల మిగులు... 2017–18 విద్యాసంవత్సరం శాతవాహన యూనివర్సిటీ ప్రవేశాలను పరిశీలిస్తే యూనివర్సిటీ వ్యాప్తంగా 46,310 సీట్లకు 22,986 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో బీఏలో 3,950 సీట్లకు 2,489 సీట్లు, బీబీఏలో 660 సీట్లకు 444, బీసీఏలో 60కి 60, బీకాంలో 20,280కి 9,244, బీఎస్సీలో 21,360 సీట్లకు10749 సీట్లు మిగిలిపోయాయి. 49.64 శాతం సీట్లు మిగులు శాతం నమోదైంది. దీనిలో దాదాపు రెండు వేలకు పైగా సీట్లు విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ రెండింటికీ దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్ వైపు వెళ్లిపోవడంతో డిగ్రీల్లో ప్రముఖ కళాశాలల్లో సీట్ల మిగులుకు దారితీసింది. ఈ సారి అనుసంధాన ప్రక్రియ అందుబాటులోకి వస్తే ఇలాంటి పరిస్థితులుండవని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుసంధానం మంచిదే... ప్రభుత్వం చేయనున్న ప్రవేశాల అనుసంధాన ప్రక్రియ వల్ల డిగ్రీచేసేవాళ్ళకు లాభం చేకూరుతొంది. గతంలో ఇంజినీరింగ్, డిగ్రీ రెండు ధరఖాస్తు చేసుకొన్న తర్వాత రెండింటిలో సీటు వస్తే ఆసక్తి గల అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో చేరినా డిగ్రీలో సీటు రద్దయ్యేదికాదు. దీనితో సీట్లు వృథా అయిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితిఉండదు. విద్యార్థులకు, యాజమాన్యాలకు అందరికీ మంచిదే. – పి.వేణు, తెలంగాణ ప్రవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు -
శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధులు ఆందోళన
-
పనికిరాని పట్టా
శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో అందరూ (అధ్యాపకులతోపాటు ప్రిన్సిపాల్ కూడా) కాంట్రాక్టు ఉద్యోగులే.. శాశ్వత అధ్యాపకులు లేనికారణంగా పీసీఐకి బ్రేక్ పడింది. గతంలో పీసీఐ కమిటీ యూనివర్సిటీ కళాశాలకు తనిఖీలకు వచ్చినప్పుడు ప్రయోగశాలలు, గ్రంథాలయం, భవనాలు, తరగతి గదులతోపాటు వివిధ అంశాలను పరిశీలించి పలులోపాలు గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. వారుచెప్పినట్లు అధ్యాపకుల నియామక ప్రక్రియ మినహా మిగతావన్నీ విషయాల్లో సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు ప్రభుత్వం నుంచి రూపొందించి యూనివర్సిటీకి పంపించగా.. త్వరలో వర్సిటీ వివిధ విభాగాల్లో కలిపి 40 పోస్టులకు ప్రకటన విడుదల చేయనుంది. ఇందులో ఫార్మసీ విభాగంలో 18 పోస్టులున్నాయి. ఈ పోస్టులు భర్తీ అయ్యేవరకూ పీసీఐ రావడం కష్టమేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల పీసీఐ గురించి ఢిల్లీ వెళ్లిన యూనివర్సిటీ అధికారులకు వర్సిటీ త్వరలో వెలువరించే నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీచేస్తున్నట్లు సూచించారు. ఇంతలో పీసీఐ అధికారులు మరోసారి శాతవాహనకు వచ్చి తనిఖీలు నిర్వహించి సంతృప్తి చెందితేనే గుర్తింపురానుంది. లేకుంటే పోస్టుల భర్తీ అయ్యాకే పీసీఐ సంగతి తేలనుంది. 238 ఫార్మసిస్ట్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 25 జనవరి 2018న నోటిఫికేషన్ నంబర్ 04/2018 ద్వారా 238 ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 125 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 58 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 55 పోస్టులున్నాయి. ప్రకటన విడుదల చేసిన సమయంలో కేవలం ఇంటర్మీడియెట్‌తోపాటు డిఫార్మసీ చేసి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలని తెలపగా.. రెండురోజుల క్రితం డీ ఫార్మసీతోపాటు అంతకంటే హైయ్యర్కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించింది. దీంతో శాతవాహన యూనివర్సిటీ ద్వారా బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుందామంటే పీసీఐ గుర్తింపు లేకపోవడంతో అనర్హులుగా మిగిలి నిరాశచెందుతున్నారు. 200పైగా విద్యార్థులకు అనర్హత శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో 2009లో బీ ఫార్మసీ కోర్సు ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 270 మంది కోర్సులో ఉన్నారు. ఇందులో 200పైగా విద్యార్థులు పాసై ఉద్యోగాల వేటలో ఉన్నారు. వీరికి వర్సిటీకి పీసీఐ గుర్తింపు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ఫార్మసిస్ట్ ఉద్యోగాలే ఉంటాయని, వాటికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం మెడికల్ షాపులు కూడా పెట్టుకునేందుకు అవకాశం లేక ఉపాధిని కోల్పోతున్నామని మదనపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టి యూనివర్సిటీకి త్వరగా పీసీఐ గుర్తింపు తీసుకురావాలని, ఈ నోటిఫికేషన్‌కైనా పీసీఐతో సంబందం లేకుండా వారిని దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. పీసీఐతో సంబంధం పెట్టొద్దు వర్సిటీలో కోర్సు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడిచింది. ఇప్పటివరకు పీసీఐ గుర్తింపు లేదు. సమస్యపై ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. మా గోడు వెల్లబోసుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందామంటే అవకాశం లేకుండాపోతోంది. అధికారులు సమస్యను గుర్తించి పీసీఐతో సంబంధం లేకుండా నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలి. – పి.శిరీష, బీఫార్మసీ త్వరలోనే పీసీఐ కమిటీ రాక పీసీఐ అధికారులు గతంలో తనిఖీలకు వచ్చినప్పుడు పలు లోపాలు గుర్తించి సవరించుకోవాలని సూచించారు. వారు అడిగిన సమాచారంతో ఢిల్లీ వెళ్లి వచ్చాం. దీంతోపాటు యూనివర్సిటీలో శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మళ్లీ కమిటీ యూనివర్సిటీకి పరిశీలనకు రానుంది. – ఎం.కోమల్‌రెడ్డి, శాతవాహన రిజిస్ట్రార్ -
శాతవాహనలో నిర్లక్ష్యపు ‘పరీక్ష’
శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో సోమవారం జరిగిన తెలుగు పరీక్షలో 50 శాతానికి పైగా మార్కులకు సంబంధించిన ప్రశ్నలు సిలబస్‌లో లేనివి వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం గ్రూపుల్లో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు సోమవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉండగా దాదాపు 46 మార్కులకు సిలబస్‌లో లేని ప్రశ్నలే ఉన్నాయి. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందికి సమాచారమివ్వగా వారు వర్సిటీ అధికారులకు వివరించారు. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. సిలబస్‌లో లేని ప్రశ్నలకు పూర్తి మార్కులు కలపాలని విద్యార్థులు కోరుతున్నారు. పదే పదే తప్పులు.. వర్సిటీ ప్రారంభం నుంచి పరీక్షల నిర్వహణలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. పరీక్షల విభాగం పటిష్టంగా లేకపోవడమే ప్రధాన కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తప్పులు దొర్లాయని అధికారులు చెబుతున్నారు. గతంలో డిగ్రీ ఫైనలియర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రం ముద్రణనే మరిచారు. సీబీసీఎస్(చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) పద్ధతిలో జరిగిన ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ పరీక్షలో 40 మార్కులకు ప్రశ్నపత్రంలో 2 గంటలకు బదులు 3 గంటలని ముద్రించారు. బీకాం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 80 మార్కులు, ప్రాక్టికల్ 20 మార్కులుంటాయని సిలబస్‌లో నిర్ణయించారు. కానీ, ప్రశ్నాపత్రం 60మార్కులకే ఇచ్చారు. మార్కులు, మోమోల విషయంలోనూ పలుమార్లు తప్పులు దొర్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు అనేకం. న్యాయం చేస్తాం.. డిగ్రీ మొదటి సెమిస్టర్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో కొన్ని సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రం తయారీలో పొరపాటుతో ఇలా జరిగింది. వీసీ అనుమతి తీసుకొని విద్యార్థులు నష్టపోకుండా న్యాయం చేస్తాం. – వి.రమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
నిఘా నీడలో శాతవాహన
శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్): కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసు బలగాలు వర్సిటీ పరిసరాల్లో నిఘా పెంచాయి. సోమవారం రాత్రి హాస్టళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం వర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను కొనసాగించారు. వర్సిటీలో భవనాలు, బాలుర, బాలికల వసతిగృహాలు, కళాశాలలను పోలీసులు తనిఖీచేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా అడుగడుగునా గాలించారు. వర్సిటీకి వచ్చిన వారిని పోలీసులు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని వివరాలు అడిగి లోపలికి అనుమతించారు. రిజిస్ట్రార్ కార్యాలయం, పరిపాలన విభాగం మంగళవారం సెలవు దినమైనప్పటికి ఒకరిద్దరు సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం నుంచే ఉస్మానియా, కాకతీయతో పాటు వివిధ వర్సిటీల నుంచి విద్యార్థి సంఘాల నాయ కులు వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారమే విద్యార్థులు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో వర్సిటీ నిర్మానుష్యంగా మారింది. మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి వర్సిటీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘాలతో సీపీ సమావేశం కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కమిషనరేట్‌లో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. విద్యార్థి సంఘాల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నా కక్ష పూరితంగా కాకుండా మంచి వాతావరణంలో తమ భావాలను వెల్లడించాలని కోరారు. వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లలో అనవసరమైన పోస్టింగ్‌లు చేస్తూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని సూచించారు. విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి చందాల వసూళ్ళకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. సోమవారం వర్సిటీ ఘటనలో పాల్గొన్న విద్యార్థి సంఘాలపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేసే అవకాశమున్నా.. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నోటీసులు మాత్రమే ఇచ్చామని, మున్ముందు వారి తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. బుధవారం నిర్వహించే బంద్‌ను విరమించుకో వాలని కోరారు. అందుకు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకే చేస్తున్నామని, శాంతియుతంగా జరుపుతామని వామపక్ష, బహుజన విద్యార్థిసంఘాల నేతలు సీపీకి వివరించారు. -
శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జనవరి 1వరకు వర్సిటీ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు. రేపు జరగాల్సిన ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. యూనివర్సిటీ ఎదుట మను స్మృతి ప్రతులను పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా హాస్టల్‌కు సెలవు ప్రకటించామని, వర్సిటీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా వర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి.