Sumitra Mahajan
-
Aastha Arora: బిలియన్త్ బేబీ ఏం చేస్తోంది!?
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది. స్కూల్లో సెలబ్రిటీయే ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి. మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్‌కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీకు ఎందుకు అంత తొందర: సుమిత్ర మహాజన్
న్యూఢిల్లీ: తను చనిపోయినట్లు వస్తున్న తప్పుడు వార్తలపై లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ శుక్రవారం స్పందించారు. తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా మరణం గురించి ఇండోర్ అధికారుల నుంచి సమాచారం తీసుకోకుండా న్యూస్ ఛానల్స్ చనిపోయినట్లు ఎలా చెబుతాయి. నా మేనకోడలు థరూర్‌ను ట్విటర్లో ఖండించారు. కానీ ధృవీకరించకుండా ప్రకటించాల్సిన అవసరం ఏముంది’. అని ప్రశ్నించారు. కాగా సుమిత్ర మహాజన్ చనిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆమెకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. అయితే సుమిత్ర ఇంకా బతికే ఉందని, ఆరోగ్యంగా ఉందని ఆమె మేనకోడలు, బీజేపీ నేతలు చెప్పడంతో వెంటనే శశిథరూర్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనతోపాటు కొన్ని మీడియా ఛానళ్లు సైతం తప్పుగా ప్రసారం చేశాయి. అయితే నిజం తెలిశాక ఆమె చనిపోలేదని మళ్లీ పేర్కొన్నాయి. ఇక మహజన్ కుమారుడు మందర్ సైతం తన తల్లి ఆరోగ్యంపై ఓ వీడియో పెట్టారు., తన తల్లి బాగానే ఉందని, ఆమె గురించి వస్తున్న తప్పుడు వార్తలకు నమ్మవద్దని ప్రజలను కోరారు. చదవండి: రైల్లో లైంగికదాడి; సీఎం పళనికి మద్రాస్ కోర్టు నోటీసులు -
రాష్ట్రానికి త్వరలో కొత్త గవర్నర్?
సాక్షి, బెంగళూరు: రాష్ట్రానికి త్వరలో కొత్త రాజప్రతినిధి రాబోతున్నారా?, గవర్నర్ మార్పు తప్పదా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజుభాయి రుడాభాయి వాలాకు విశ్రాంతి నిస్తారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించే విషయమై కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హృదయ సంబంధిత వ్యాధితో గత మూడు రోజులుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని అక్కడి వైద్యులు సూచించారు. 2014, నవంబర్ 1న కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన వీఆర్ వాలా ఇటీవలే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్‌గా సజావుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అనేక రాజకీయ సంక్షోభాల మధ్య కూడా వివాదాలకు చోటియ్యకుండా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్ తదుపరి గవర్నర్‌గా రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధానికి, హోంమంత్రికి చెప్పారా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల్లో గవర్నర్ పదవిని నిర్వహించడం వాలాకు కష్టంగా మారిందని ఆయనే స్వయంగా కేంద్రానికి విన్నవించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రానికి కొత్త గవర్నర్ అనివార్యంగా మారింది. కొన్నిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలసిన ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకకు తగిన గవర్నర్ లభించే వరకు కొన్నిరోజుల పాటు ఆ బాధ్యతలు చేపట్టాలని వాలాకు వారిరువురు సూచించినట్లు సమాచారం. అప్పటి నుంచి అయిష్టంగానే గవర్నర్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఎప్పుడైనా కొత్త గవర్నర్ ప్రకటన వెలువడచ్చని రాజకీయ వర్గాల కథనం. రేసులో సుమిత్రా మహాజన్ వీఆర్ వాలా తరువాత భర్తీ చేసేదెవరనేదానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యంత సంపన్న రాజ్‌భవన్ ఒక్క కర్ణాటకకే సొంతం. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలిసింది. కాగా, చాలా మంది లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఉమాభారతి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎత్తివేసింది. ఉమాభారతిని గవర్నర్‌గా నియమిస్తే పలు వివాదాలు తలెత్తుతాయని కేంద్రం యోచన చేస్తున్నట్లు తెలిసింది. వివాదరహితులుగా పేరొందిన సుమిత్రా మహాజన్ అయితే ఎలా ఉంటుందనే విషయంపై కూడా కేంద్రం యోచన చేస్తున్నట్లు తెలిసింది. -
లోక్‌సభ స్పీకర్: ఎవరీ ఓం బిర్లా..
ఓం బిర్లా.. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశమైంది. కేవలం రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయిన బిర్లా బుధవారం 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పేరును బీజేపీ ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా సీనియర్ నేతలను స్పీకర్ పదవికి పరిగణలోకి తీసుకుంటారు. గత లోక్‌సభ స్పీకర్‌గా ఎనిమిది పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇకపై పార్టీలోనూ, చట్టసభల్లోనూ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలను బిర్లాను ఎంపిక చేయడం ద్వారా ప్రధాని మోదీ పంపారనే తెలుస్తోంది. ఎవరీ ఓం బిర్లా.. ఓం బిర్లా 1969 నవంబర్ 23న రాజస్తాన్‌లోని కోటాలో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిర్లా, తల్లి శకుంతల దేవి. బిర్లా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన వారు. ఓం బిర్లా తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా రాజస్తాన్‌లోనే పూర్తి చేశారు. 12వ తరగతి అనంతరం బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కోటాలోని కామర్స్ కాలేజీలో, అజ్మీర్‌లోని మహర్షి దయానంద సరస్వతి విశ్వవిద్యాలయంలో ఆయన చదివారు. 1991లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అమితా బిడాలీని వివాహం చేసుకున్నారు. కాలేజీలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బిర్లా భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరుకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1997 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. 2003లో కోటా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత శాంతి ధారీవాల్‌ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2008లో కోటా నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్ నేత రామ్ కిషన్ వర్మను 24 వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన మొత్తం మూడు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కోటా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సునాయాసంగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కోట నుంచి పోటీ చేసిన ఆయనను స్పీకర్ పదవి వరించింది. చురుకైన నేతగా, అప్పగించిన పనికంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద బిర్లాకు మంచి గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియయనిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న బిర్లా స్పీకర్ పదవికి అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపించడంతో ఆయనను సభాపతి పదవి వరించినట్టు తెలుస్తోంది. బిర్లాను స్పీకర్‌గా బీజేపీ ప్రతిపాదించగా ఎన్డీయే వర్గాలతోపాటు ఏఐఏడీఎంకే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్పీకర్‌గా బిర్లాకు మద్దతునిస్తున్నట్లు లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ చౌదరి తెలిపారు. స్పీకర్‌గా ఎన్నికయిన బిర్లాను ప్రధాని మోదీ సాదరంగా తీసుకువెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. మొదటిసారి లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భరాలు గతంలోనూ ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైన మురళీ మనోహర్ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తరువాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 16వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్ ఎనిమిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. -
‘నన్ను మందలించగల వ్యక్తి ఆమె మాత్రమే’
భోపాల్ : లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన రెండో మహిళ సుమిత్రా మహాజన్. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేకుండా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన మహాజన్.. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. పదవిలో ఉండగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఇండోర్ ప్రజల అభిమానాన్ని గెల్చుకున్నారు సుమిత్రా మహాజన్. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలు ఆమెను ‘తాయి’ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఈ క్రమంలో ఆదివారం ఇండోర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సుమిత్రా మహజన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సంభంధించి ఏ విషయంలోనైనా సరే మందలించగలిగిన ఏకైక వ్యక్తి తాయి అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ స్పీకర్‌గా తాయి తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. ప్రజల మనసులో ఆమె పట్ల చాలా మంచి అభిప్రాయం ఉంది. మీ అందరికి నేను ఈ దేశ ప్రధానిగానే తెలుసు. ఇప్పుడు నేను చెప్పేబోయే విషయం నా పార్టీలో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏ విషయంలోనైనా సరే నన్ను మందలించగలిగిన ఏకైక వ్యక్తి తాయి మాత్రమే’ అని చెప్పారు. అంతేకాక మేమిద్దరం బీజేపీ కోసం కలసి పని చేశాం. పని పట్ల ఆమెకు చాలా శ్రద్ధ. ఇండోర్ అభివృద్ధి విషయంలో తాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు అని ప్రశంసించారు. -
11 సార్లు ఎన్నికైన ఏకైక జననేత...
మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన వాళ్లు మళ్లీ ఆ పదవి పొందాలని ఆశించడం సహజమే. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. వాజపేయి, అడ్వాణీ, ఇంద్రజిత్ గుప్తా, సుమిత్రా మçహాజన్ వంటి వారు కొందరు అనేక సార్లు ఎంపీలుగా గెలిచినా మెజారిటీ ఎంపీలకు రెండో అవకాశం దక్కలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1951 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్ని పరిశీలిస్తే... 60 శాతం ఎంపీలు అంటే ప్రతి ఐదుగురిలో ముగ్గురు రెండోసారి ఎంపీ కాలేకపోయారు. ఇంత వరకు జరిగిన 16 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4,843 మంది ఎంపీలుగా (నామినేట్ ఎంపీలు 22 మంది కాకుండా) ఎన్నికయ్యారు. వీరిలో 2,840 మంది రెండోసారి ఎంపీలుగా ఎన్నిక కాలేదు. మిగిలిన 2003 మందిలో 50 శాతం మంది మూడోసారి ఎన్నికకాలేదు. అంటే వీరు రెండు సార్లు మాత్రమే గెలిచారు. మొత్తం ఎంపీల్లో 999 మంది రెండుసార్లు, 502 మంది మూడుసార్లు, 249 మంది నాలుగు సార్లు, 134 మంది ఐదు సార్లు గెలిచారు. ఒకసారికి మించి లోక్‌సభకు ఎన్నిక కాని వాళ్ల సంగతి ఇలా ఉంటే, కొందరు అనేకసార్లు పార్లమెంటుకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. ఇంద్రజిత్ గుప్తా 11 సార్లు ఎన్నికయి దేశంలో ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర నెలకొల్పారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి, సోమనాథ్ చటర్జీ, పీఎం సయీద్‌లు పదేసి సార్లు ఎంపీలయ్యారు. వీరు కాక తొమ్మిది మంది నాయకులు 9 సార్లు, పద్దెనిమిది మంది ఎనిమిది సార్లు, 34 మంది ఏడుసార్లు, 54 మంది 6 సార్లు,134 మంది ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక నామినేటెడ్ ఎంపీల విషయానికి వస్తే ఇంత వరకు మొత్తం 22 మంది లోక్‌సభకు నామినేట్ కాగా వారిలో చాలా మంది కేవలం ఒకసారే నామినేట్ అయ్యారు. అయితే, ఆంగ్లో ఇండియన్ ఫ్రాంక్ అంటోనీ ఏకంగా 8సార్లు నామినేట్ అయి రికార్డు సృష్టించారు. ఏఈటీ బారో ఏడు సార్లు ఆంగ్లో ఇండియన్ సభ్యునిగా పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. -
విజయానికి మారు పేర్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గుకురావడం అంత తేలికయిన విషయమేమీ కాదు. కానీ, కొందరు రాజకీయ నేతలు గెలుపునే అలవాటుగా మార్చుకున్నారు. పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇంత ఈజీయా అనుకునేలా దశాబ్దాలపాటు కొనసాగారు. కొందరు ఇంకా కొనసాగుతున్నారు. ఉదాహరణకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. బీజేపీకి చెందిన ఈమె ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, కాంగ్రెస్‌కు చెందిన కె.హెచ్.మునియప్ప కర్ణాటకలోని కోలార్ నియోజకవర్గం నుంచి ఏకంగా ఏడుసార్లు క్రమం తప్పకుండా ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా 8వసారీ బరిలో నిలిచారు. వీరందరినీ మించి ఇంద్రజిత్ గుప్తా 11 పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర భారతంలో లోక్‌సభ సభ్యులుగా అప్రతిహతంగా కొనసాగిన, కొనసాగుతున్న కొందరు హేమాహేమీల వివరాలివీ.. ఇంద్రజిత్ గుప్తా, మనేకా గాంధీ, కమల్ నాథ్ -
లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం!
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ఎనిమిది సార్లు వరుసగా గెలుపొందిన ఆమె ఈసారి పోటీ చేయడం లేదని శుక్రవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన బీజేపీ.. ఇండోర్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇక్కడ మహాజన్‌కు టికెట్ ఇస్తారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ తానే పోటీ చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా అధిష్టానం త్వరగా ఇండోర్ అభ్యర్థిని నిర్ణయించాలని ఆమె సూచించారు. ఇక్కడి నుంచి సీనియర్ నేత విజయ్వార్గియా పేరు బీజేపీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న సుమిత్ర మహాజన్ 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. రాజకీయాల్లో 75 సంవత్సరాల తర్వాత గెలుపు అవకాశాలు తగ్గుతాయన్న కారణంతోనే సుమిత్రను బీజేపీ పక్కన పెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా!
సాక్షి వెబ్ ప్రత్యేకం (భోపాల్): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను విమర్శించిన వారే ఇప్పుడు తమ పిల్లలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ విపక్ష బీజేపీ నేత గోపాల్ భార్గవ మాటల్ని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్ నాయకులు తమ వారసులకు లోక్‌సభ టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారట, నిజమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘రైతు కొడుకు మళ్లీ తండ్రిలాగే వ్యవసాయం, అధికారి కుమారుడు తిరిగి తన నాన్నలాగే సేవారంగం, వ్యాపారి తనయుడు వ్యాపారం చేయగా లేనిది.. 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న రాజకీయ నాయకుల వారసులు భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉపయోగించే గోపాల్ భార్గవ కుమారుడు అభిషేక్ ప్రస్తుత మధ్యప్రదేశ్ బీజేపీ యువజన మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారసులూ అర్హులే.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గౌరీశంకర్ కూడా తన కూతురు మౌసమ్ బీ సేన్‌కు బాలాఘాట్ నియోజకవర్గ లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 సంవత్సరాలు నిండి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే నేతల వారసులు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి పూర్తిగా అర్హులని.. వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని గౌరీ శంకర్ మీడియాతో అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కోసం మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్-3 నియోజకవర్గ సీటును వదులుకున్నానని , నాయకుల తనయులు టిక్కెట్లను ఆశించడంలో తప్పులేదని, కానీ సీట్ల కేటాయింపులో అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఒత్తిడి.. ఆగని విమర్శల తాకిడి మాజీ మంత్రి గౌరీ శంకర్ షెజ్వార్ తనయుడు ముదిత్ ఈసారి లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్, నరేంద్ర సింగ్ తోమర్ వారసుడు దేవేంద్రకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. సీనియర్ నాయకుడు రాఘవాజీ తన కుమార్తె జ్యోతి షాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నించినా బీజేపీ హైకమాండ్ తిరస్కరించింది. నిరుత్సాహపడిన రాఘవాజీ తన తనయకు లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాల్సిందేనని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీజేపీలో జరుగుతున్న వారసత్వ రగడను చూసి కాంగ్రెస్ సంబరపడుతోంది. ఇన్ని రోజుల నుంచి తమను విమర్శిస్తూ వచ్చిన కాషాయ నేతలపై ఇదే అదనుగా హస్తం నేతలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వారసత్వ కుంపట్లను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
‘సీఆర్ఐ పంప్స్’కు ఎన్ఈసీ అవార్డ్
విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్ఐ పంప్స్ తాజాగా మరో అవార్డును సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2018’ని అందుకుంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా అవార్డ్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సెల్వరాజ్ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం అవార్డును అందుకోవడం ఇది 4వసారి. వినూత్న రూపకల్పన, సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్లకు విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్‌ను అందిస్తున్నాం. అనుకున్న కార్యంలో విజయవంతమైనందుకు కస్టమర్లు, డీలర్లు, స్టేక్ హోలర్లకు దన్యవాదాలు.’ అని వ్యాఖ్యానించారు. -
మీ కంటే స్కూల్ పిల్లలు నయం..
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వ్యవహారాల శైలిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె విఫలయత్నం చేశారు. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ కంటే స్కూల్ పిల్లలు ఎంతో నయమని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై పాలక బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించినా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో ఎంపీల తీరుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ప్రవర్తిస్తున్న తీరుతో సభ వెలుపల మంచి సంకేతాలు వెళ్లడం లేదని, భారత పార్లమెంట్లో ఏం జరుగుతోందని విదేశాల్లో ప్రజలు అడగటం తాను గమనించానని వ్యాఖ్యానించారు. పార్లమెంటేరియన్ల కంటే స్కూల్ చిన్నారులే మెరుగ్గా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం కోర్టుకు అసత్యాలు వెల్లడించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టగా, కావేరి నదిపై ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించాలని ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక రఫేల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా, ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారిపట్టించిన రాహుల్ గాంధీయే క్షమాపణ చెప్పాలని పాలక బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. -
‘మీడియా చెప్పిందల్లా నిజం కాదు’
న్యూఢిల్లీ : భారత్‌లో మహిళల భద్రత గురించి మీడియా క్రియేట్ చేసిన ఒపినియన్ వల్లే మన దేశం మహిళలకు సురక్షితం కాదనే అభిప్రాయం ఏర్పడిందంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(ఐఐఎమ్‌సీ) 51వ స్నాతకోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. న్యూస్ పేపర్లు, టీవీ చానెళ్లు పార్లమెంట్లో జరిగే నిరసనలు కవర్ చేయడానికి ఉత్సాహం చూపిస్తాయి.. కానీ సమాజానికి ఉపయోగపడే అంశాల గురించి నడిచే డిబేట్లను ప్రసారం చేయవంటూ విమర్శించారు. ఇక్కడ మహిళలు రోడ్ల మీద తిరగరు.. అంత మాత్రం చేత భారత్‌లో ఉన్న మహిళలు సురక్షితంగా లేరని చెప్పలేం కదా అన్నారు. అంతేకాక నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది మేడం.. మీ దేశం ఇప్పటికి కూడా సురక్షితం కాదా అంటూ అక్కడి జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు అని తెలిపారు. అప్పుడు నేను గత 75 ఏళ్లుగా నేను ఇండియాలో ఉంటున్నాను.. నాకేం కాలేదు.. నా కూతురికి గాని.. కోడలికి గాని ఏం కాలేదు. మీరనుకుంటున్నట్లు ఏం లేదు. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి మా దేశంలోను.. మీ దేశంలోను.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. ప్రజలు నేరాలు చేస్తుంటారు. అంటే ఆ దేశంలో నేరాలు మాత్రమే జరుగుతాయా.. వేరే ఏం జరగవా అని వారిని అడుగుతాను అని తెలిపారు. అలానే రాజకీయాల్లో ఎప్పుడు అసభ్య పదజాలమే వాడము కదా.. కొన్ని మంచి విషయాల గురించి కూడా మాట్లాడతాము. కానీ వాటి గురించి మీడియా పట్టించుకోదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సమాజానికి ఏం అవసరముంది.. కానీ మనం ఎలాంటి వార్తలు ప్రచురిస్తున్నాం అనే విషయం గురించి మీడియా సంస్థలు ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్‌కు పరిస్థితిని విశ్లేషించే సామర్ధ్యం కలిగి ఉండటం చాలా ప్రధానం అని తెలిపారు. -
రిజర్వేషన్లపై సుమిత్రా మహాజన్ కీలక వ్యాఖ్యలు
-
‘రిజర్వేషన్లతో ప్రయోజనం ఏంటి?’
రాంచీ : రిజర్వేషన్ల వల్ల దేశానికి ఏమైనా మేలు జరిగిందా, వెనకబడిన వర్గాలు అభివృద్ది సాధించాయా.. అంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నించారు. జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘లోన్ మానథాన్’ కార్యక్రమానికి సుమిత్రా మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సామాజిక సామరస్యాన్ని సాధించడం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వాతంత్ర్యనంతరం పదేళ్ల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలవారికి తగు ప్రాధాన్యత కల్పించడం కోసం రిజర్వేషన్లు ఉద్దేశించబడినవి. కానీ అవే రిజర్వేషన్ల వల్ల నేడు ఆయా రంగాల్లో తీవ్ర శూన్యత ఏర్పడింది. కేవలం పదేళ్లు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను ప్రతి పదేళ్లకోసారి పొడిగిస్తూ పోవడం వల్ల దేశానికి ఏమైనా ప్రయోజనం సమకూరిందా? సామాజిక ప్రగతి సాధించాలంటే కావాల్సింది రిజర్వేషన్ల కాలపరిమితిని పొడగించడం కాదు. సామాజిక సామరస్యం సాధించే దిశగా మన ఆలోచనల్ని, చేతల్ని మార్చుకోవాలి. అప్పుడే అంబేద్కర్ కలలు కన్న సమాజం సిద్ధిస్తుంద’ని తెలిపారు. బీజేపీ పార్టీ రిజర్వేషన్లను ముగింపు పలకనున్నదని ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ కావాలనే తమ ప్రభుత్వం గురించి అసత్య ప్రచారం చేస్తోందని.. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రకటించారు. -
ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణం అనర్హత వేటు వేయాలని, తద్వారా ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వినతిపత్రాన్ని శుక్రవారం స్పీకర్‌కు సమర్పించారు. ‘‘వైఎస్సార్సీపీ టిక్కెట్లపై గెలుపొంది ఇతర పార్టీల్లోకి ఫిరాయించి రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పి.శ్రీనివాస్‌రెడ్డి, బుట్టా రేణుకలను అనర్హులుగా ప్రకటించాలని జనవరి 3, 2018న అప్పుడు చీఫ్‌విప్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి మీకు లేఖ రాశారు. నంద్యాల నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో మాపార్టీ టికెట్‌పై గెలుపొందిన ఎస్పీవై రెడ్డి వారం రోజులకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలోకి ఫిరాయించారు. అలాగే మా పార్టీ టికెట్‌పై గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా టీడీపీలోకి ఫిరాయించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని బలహీనపరచాలన్న ఉద్దేశంతో అధికారపార్టీ అనేక ఆశలు చూపి వీరికి వల విసిరింది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి మాపార్టీ టికెట్‌పై పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు.వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని మా పార్టీ డిసెంబర్ 14, 2016న మీ వద్ద పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై అనర్హత నిర్ణయం ప్రకటించలేదు. ఈ పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనందువల్ల.. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఎలాంటి చర్యలు ఉండవన్న సంకేతాన్నిస్తూ ఇతర ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించేందుకు విశ్వాసం కలిగించింది. అక్టోబర్ 17, 2017న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా మా పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. ఆమెపైనా పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని మీవద్ద పిటిషన్ దాఖలు చేశాం. ఈ నలుగురు సభ్యులు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఇచ్చే అధికారిక సమాచారానికి మాత్రం స్పందించట్లేదు..’’ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి.. ‘‘అధికారపార్టీలు పెట్టే ఆశలతో ప్రేరేపితమైన రాజకీయ ఫిరాయింపులు రాజ్యాంగ స్ఫూర్తి పునాదులకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరంగా దాపురించాయన్న ఉద్దేశంతో వీటిని అరికట్టేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని తెచ్చుకున్నాం. ఒకపార్టీ నుంచి చట్టసభల సభ్యుడిగా ఎన్నికై.. మరో పార్టీకి వెళితే వారిని అనర్హులుగా చేయాలని ఈ చట్టం తెచ్చుకున్నాం. రాజ్యాంగంలో ఇంతటి బలమైన నిబంధనలున్నప్పటికీ సభ్యులు స్వేచ్ఛగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. అనర్హత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సభాపతులపై ఉండగా వారు నిర్ణయం తీసుకోకపోగా ఇతరులు సైతం ఫిరాయించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ రకంగా ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఓడిపోవడమేగాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రమాదకరమైన ధోరణి ప్రబలేందుకు కారణమైంది. ఇటీవల ఈ ఫిరాయింపులు మరింత విశృంఖలంంగా బహిరంగంగా మీడియా సమక్షంలోనే జరుగుతుండడం మనం చూస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ ఇటీవల శరద్ యాదవ్, అన్వర్ అలీలపై పిటిషన్ వచ్చిన 90 రోజుల్లోపే నిర్ణయం తీసుకుని అనర్హులుగా ప్రకటించారు. అలాంటి వేగవంతమైన నిర్ణయాలు ఫిరాయింపులను అరికట్టడమేగాక ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉద్దేశాన్ని నెరవేర్చుతాయి. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలపై చర్య తీసుకుని మీరు మార్గదర్శిగా నిలవాలని కోరుతున్నా. ఆ నలుగురు సభ్యులపై అనర్హత వేటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభ్యర్థిస్తున్నా..’’ అని విజయసాయిరెడ్డి విన్నవించారు. -
‘అవిశ్వాసం’పై బీజేపీ పక్కా వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ తదితర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. సభ సవ్యంగా నడవడం లేదని, గందరగోళ పరిస్థితుల మధ్య అవిశ్వాసాన్ని అనుమతించలేనని అందుకు ఆమె సాకు కూడా చెప్పారు. మళ్లీ ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిందే తడవుగా లోక్‌సభ స్పీకర్ అందుకు అనుమతించారు. ఎందుకు? నాటికి నేటికి మారిన పరిస్థితులు ఏమిటీ? నాడైనా, నేడైనా అవిశ్వాస తీర్మానం కారణంగా మోదీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవు. నాడు తెలుగు దేశం పార్టీ అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇది కొంత పాలకపక్ష బీజేపీకి అసంతృప్తి కలిగించే అంశమే. ప్రతిపక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఎందుకంటే అవి తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే కేంద్రంపై అవిశ్వాసానికి ముందుకు వచ్చాయి. కావేరీ నుంచి తమిళనాడుకు ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేది లేదంటూ కర్ణాటక పాలక, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సమీపంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అవిశ్వాసాన్ని అనుమతిస్తే పరువు పోగొట్టుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ భయపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేక తడబడాల్సి వస్తుందన్న ఆందోళన. అప్పుడు అవిశ్వాసంపై చర్చకు ప్రాంతీయ పార్టీలే ముందున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. అవిశ్వాసంపై చర్చకు కాంగ్రెస్ పార్టీయే ముందుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి ప్రత్యామ్నాయంగా తన నాయకత్వాన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలన్న సంకల్పం నుంచి వచ్చింది కాంగ్రెస్‌కు ఈ చొరవ. అందుకని అవిశ్వాసంపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనగలిగితే ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని సగం దెబ్బతీసినట్లే అవుతుందన్నది బీజేపీ వ్యూహం. ఈ విషయాన్ని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పలువురు బీజేపీ నాయకులు ధ్రువీకరించారు. వారికి తమ నాయకుడు నరేంద్ర మోదీ ప్రసంగం లేదా వాగ్వాద నైపుణ్యంపై ఎంతో నమ్మకం ఉంది. కాంగ్రెస్ ముస్లిం పురుషులను మెప్పించే పార్టీ అనే ప్రచారం, తలాక్‌కు వ్యతిరేకమంటూ ధ్వజమెత్తడం ద్వారా ఆ పార్టీని సులభంగానే ఎదుర్కోవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన తలాక్ బిల్లు రాజ్యసభలో కాంగ్రెస్ వైఖరి కారణంగా ఆమోదం పొందని విషయం తెల్సిందే. కశ్మీర్లో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కఠిన వైఖరి కూడా తమకు ఎంతో ఉపయోగ పడుతుందని బీజేపీ భావిస్తోంది. టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతోనే ముఫ్తీ మెహబూబా ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్నామన్న ప్రచారం కూడా తమకు బాగానే ఉపయోగ పడుతుందన్న ఆలోచన. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అవిశ్వాసాన్ని తిరస్కరించి అభాసుపాలవడం కంటే ఆమోదించి ఎదుర్కోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చింది. అవిశ్వాసాన్ని నెగ్గడం ద్వారా ప్రతిపక్షాన్ని దూషించి ప్రజల మన్ననలను పొందవచ్చు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న పై మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమూ కావచ్చు అన్నది బీజేపీ వ్యూహంలో భాగం. అందుకనే అవిశ్వాసంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ ‘చర్చ నుంచి పారిపోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని చూస్తున్నాం. ప్రతిపక్షాల అబద్ధాలకు అడ్డుకట్ట వేయదల్చుకున్నాం. ఏ ప్రశ్ననైనా ఎదుర్కోవడానికి, దానికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, గోసంరక్షకుల దాడులు, పిల్లల కిడ్నాపర్ల పేరిట అల్లరి మూకల హత్యలు, మహిళలపై అత్యాచారాలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీయవచ్చు. అయితే అందులో ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్న. -
ఎట్టకేలకు అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ సభలో చదవి వినిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి 50కి పైగా సభ్యుల మద్దతు లభించడంతో పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపకపోవడం గమనార్హం. టీడీపీ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందస్తుగానే సంకేతమిచ్చారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా చర్చకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే త్వరలో తేదీ ప్రకటిస్తామని స్పీకర్ తెలిపారు. అయితే ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 పనిదినాల పాటే జరగనుండటంతో రెండు మూడు రోజుల్లో చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్ అవిశ్వాస తీర్మాన నోటిసులిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని విషయాలు వెల్లడిస్తామని, పార్లమెంట్ వ్యవహారాల శాక మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. -
అంతరాయం కలిగించకండి.. ప్లీజ్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇతర పార్టీల సభ్యులు చేశారంటూ తమ వాదనలను సమర్ధించుకోవాలనుకుంటే అంతరాయాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులకు ఆమె లేఖ రాశారు. ‘మన పార్లమెంట్, మన ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలనే దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి పార్లమెంట్ గౌరవం, పవిత్రతను కాపాడే లక్ష్యం మనందరిదీ’ అని పేర్కొన్నారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటమే కాదు, దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పటిష్టానికి మీరు కృషి చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు. సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయటం, ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఆమె ప్రస్తావిస్తూ..తమ అభిప్రాయాలను, డిమాండ్లను తెలిపేందుకు కొన్ని పరిమితులు, నిబంధనలు ఉంటాయన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో రాజకీయ పోరు సాగిస్తూనే సభ్యులు ప్రజాస్వామ్యయుత బాధ్యతలను కూడా సభలో నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. మరో 5 భాషలకు ఛాన్స్ రాజ్యసభలో సభ్యులు మరో ఐదు భాషలు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు రాజ్యసభ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషలకు గాను తెలుగు సహా 12 భాషల్లో మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఉంది. కొత్తగా డొంగ్రి, కశ్మీరీ, కొంకణి, సంథాలీ, సింధి భాషల్లో సభ్యులు మాట్లాడేందుకు వీలుగా శిక్షణ పూర్తి చేసుకుని అర్హత పొందిన అనువాదకులకు నియమించినట్లు తెలిపారు. -
‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడం హర్షణీయమన్నారు. సంవత్సరం పాటు పదవులను వదులుకోవడం మాములు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం ఎవరు పోరాటం చేసిన వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని చలసాని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని ఆయన అన్నారు. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, అధికార పార్టీ మాత్రం ప్రత్యేక హోదా విషయంలో తమ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా కాలం గడిపేస్తోంది. -
హోదా కోసం చేసిన వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం!
-
రాజీనామాలపై ఫలించిన వైఎస్సార్సీపీ ఎంపీల నిరీక్షణ
-
వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న ఇచ్చిన రాజీనామాలను ఆమోదించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఈ విషయాన్ని ఎంపీలు మీడియా సమావేశంలో తెలియజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై పార్లమెంట్ బులెటిన్ ద్వారా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని మే 29న స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలను కోరిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయంలో మార్పు లేదని వారు తేల్చిచెప్పారు. బుధవారం మరోసారి స్పీకర్‌ను కలిశారు. ఉదయం 11 గంటలకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినా ష్‌రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్పీకర్‌ను ఆమె చాంబర్లో కలిశారు. వీరివెంట రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం.. స్పీకర్‌తో వైఎస్సార్సీపీ ఎంపీలు అరగంటకు పైగా సమావేశమయ్యారు. రాజీనామాలపై మరోసారి పునరాలోచించుకోవాలని స్పీకర్ సూచించగా... తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ సభ్యులు కోరారు. దీనిపై రాతపూర్వకంగా మరోసారి నిర్ణయాన్ని(రీ కన్ఫర్మేషన్) తెలపాలని స్పీకర్ సూచించడంతో ఆ మేరకు ఎంపీలు లేఖలు సమర్పించారు. ‘‘16వ లోక్‌సభ సభ్యత్వానికి నేను 2018 ఏప్రిల్ 6న రాజీనామా చేశాను. ఈ రాజీనామాపై పునరాలోచించాలని మే 29న మీరు(స్పీకర్) సూచించారు. మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు. నేను ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. నా రాజీనామాను ఆమోదించాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను’’ అని రాసి ఉన్న లేఖలను లోక్‌సభ సభ్యులు విడివిడిగా సభాపతికి అందజేశారు. ‘హోదా’ కోసం పదవీ త్యాగం ప్రత్యేక హోదా సాధించడం కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తుదికంటా పోరాటం చేస్తారని, కేంద్రం స్పందించకపోతే వారంతా పదవులకు రాజీనామా చేస్తారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 1న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మార్చి 5న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తమ పార్టీ తరపున ఎన్డీయే ప్రభుత్వంపై మార్చి 22న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు కుదిస్తారనే వార్తలు రావడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు నిర్ధేశిత తేదీ కంటే ముందుగానే.. మార్చి 15న కేంద్రంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడంతో ఆ తర్వాత వైఎస్సార్సీపీ వరుసగా 13 అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. 12 నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభలో ప్రస్తావించారు. అయితే, సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నందువల్ల వాటిపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్ జగన్ మార్చి 31న స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6 వరకూ ప్రత్యేక హోదా కోసం సభలో నినదించిన వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి సమావేశాలు వాయిదా పడగానే నేరుగా స్పీకర్ చాంబర్‌కు వెళ్లి, స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖలను సమర్పించారు. అక్కడి నుంచి ఏపీ భవన్‌కు వచ్చి అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాజీనామాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో తేల్చిచెప్పారు. వారి రాజీనామాల ఆమోదానికి స్పీకర్ తాజాగా అంగీకారం తెలిపారు. -
‘టీడీపీ డ్రామాలను దేశమంతా చూసింది’
సాక్షి, న్యూఢిల్లీ : తమ రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌పై మరోసారి ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఐదుగురు వైఎఎస్సార్ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ చేసిన డ్రామాలను దేశమంతా చూసిందని, నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉండి ఏం సాధించారో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని, హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొదటినుంచీ హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉందని, ఇందుకోసం వైఎస్సార్ సీపీ ఎంపీలందరం ఆమరణ దీక్ష చేశామని గుర్తుచేశారు. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు హేళన చేశారని, తర్వాత యూటర్న్ తీసుకుని టీడీపీ కూడా అవిశ్వాసం పెట్టలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. -
రాజీనామాల ఆమోదం కోసం...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. వాటి ఆమోదం కోసం నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయి తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరనున్నారు. ప్రత్యేక హోదా కంటే ఏదీ ముఖ్యం కాదంటూ వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. బడ్జెట్ సెషన్స్ చివరిరోజు రాజీనామాలు చేసిన ఎంపీలు.. అనంతరం ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాజీనామాల విషయంలో పునరాలోచన చేయాలని స్పీకర్ ఇంతకు ముందు ఎంపీలను కోరారు. కానీ, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని ఎంపీలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
ఎల్లుండి స్పీకర్‌ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సమావేశాల్లో సుదీర్ఘ ఆందోళనలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ ఎంపీలు.. సమావేశాలు ముగిసిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దేశ రాజధాని హస్తిన వేదికగా ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. అన్నాపానాలు ముట్టక దీక్ష చేయడంతో ఎంపీల ఆరోగ్యం క్షీణించింది. దీంతో వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించి.. నిరాహార దీక్షలు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కంటే తమకు పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల స్పీకర్‌తో భేటీలోనూ వారు ఇదే విషయం స్పష్టం చేశారు. అయితే, రాజీనామాలపై పునరాలోచన చేయాలని స్పీకర్ ఎంపీలను సూచించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి స్పీకర్‌ను కలువబోతున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి కోరబోతున్నారు.