Telangana Legislative Assembly
-
నాన్న ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నా..
పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్‌లో బీటెక్ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్‌గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.– మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి -
అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సభలో చర్చోపచర్చలు ఉంటాయని.. ప్రతిపక్షాలు హుందాగా వ్యహరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐకరాజ్యసమితి అభినందించిందని గుర్తచేశారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశారమని మండిపడ్డారు. అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని తాము లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కోత.. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసి కంది రైతులను ఆదుకుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 34 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఎన్నికల హామీ కాకపోయిన కళ్యాణలక్ష్మి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా వెళ్లాయని.. కానీ కేంద్రం నుంచి లక్షా 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారని విమర్శించారు. దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది అని అన్నారు. రెండేళ్లల్లో సగానికి సగం అప్పులు తీరిపోతాయి.. నీటిపారుదల శాఖపై లక్షల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగానికి సగం అప్పులు తీరిపోతాయని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకు పైగా సన్న బియ్యం పంట పండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నామని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటును పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంపు.. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్య నిషేధం చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయాంలో వీధివీధికి సారా తయారు ఉండేదన్నారు. మద్యపానాన్ని తగ్గించేందుకే రెట్లు పెంచామని.. అవసరమైతే మళ్లీ మద్యం ధరల పెంపు నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంపు అనేది ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడితే లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామని అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. -
4 సవరణ బిల్లులకు సభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్ పదవులను మినహాయిస్తూ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం నుంచి హెచ్ఎండీఏ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్, డైరెక్టర్లు, రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రాంతీయ బోర్డుల డైరెక్టర్లు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి, ఎంబీసీ, మూసీ రివర్ ఫ్రంట్, కార్మిక సంక్షేమ బోర్డు, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్లు, యాదగిరిగుట్ట, వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థలు తదితరాల చైర్మన్లను మినహాయిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆదివారం సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, 1953 (యాక్ట్ 2 ఆఫ్ 1954) సెక్షన్ 10లో పొందుపరిచిన మేరకు.. వివిధ సంస్థల చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే వారు లాభదాయక పదవులు కలిగి ఉన్నందుకు అనర్హత వేసే నిబంధన వర్తించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గతంలో 23 చైర్మన్ పదవులుండగా, తాజాగా ఆ జాబితాలో మరో 29 చైర్మన్ పదవులను అదనంగా కలుపుతూ సవరణ చట్టం చేశారు. ఇంకా జాబితాలోకి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, తెలంగాణ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అ«థారిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, స్పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ షీప్, గోట్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, తెలంగాణ అధికార భాషా సంఘం, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, స్టేట్ హజ్ కమిటీ, తెలంగాణ ఫుడ్ కమిషన్, సెట్విన్, తెలంగాణ సాహిత్య అకాడమీ, టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్స్, తెలంగాణ స్టేట్ యోగాధ్యయన పరిషత్ చైర్మన్ పదవులున్నాయి. ఈ మేరకు ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. మరో మూడు సవరణ బిల్లులకు ఆమోదం... వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ, అభయహస్తం పథకం, మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కో కాంట్రిబ్యూటరీ పింఛను చట్టం రద్దు, తెలంగాణ లోకాయుక్త–2020 సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కేంద్రం ఆదేశించిన మేరకు సీజీఎస్టీ చట్టానికి అవసరమైన సవరణలు చేసుకోవడంలో భాగంగా ఈ చట్ట సవరణ చేపడుతున్నట్టు సీఎం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో తెలిపారు. ఇందులో భాగంగా టీడీఎస్ సమయం పొడిగింపు అధికారం కమిషనర్‌కు ఇవ్వడం, రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపడం, తదితరాలను చేర్చారు. లోకాయుక్త చట్టంలో ఏపీ ఉన్న చోట తెలంగాణగా మార్పు చేస్తూ 2019లో తెలంగాణ చట్టం తీసుకురాగా, గతంలో లోకాయుక్త పదవికి మాజీ చీఫ్ జస్టిస్‌ను నియమించాలని ఉంటే ఆ స్థానంలో రిటైర్డ్ జడ్జిని నియమించుకునేలా చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణను హరీశ్‌రావు ప్రతిపాదించగా సభ ఆమోదించింది. అభయహస్తం కింద 60 ఏళ్లకు పైబడిన వారికి నెలకు రూ.500 చొప్పున పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం ఆసరా వృద్ధాప్య పించన్లను 57 ఏళ్ల వారికి కూడా రూ.2,016కు పెంచి ఇస్తున్నందున గతంలోని అభయహస్తం పథకం రద్దుకు ఈ చట్టసవరణ ప్రతిపాదించిన పీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అదేవిధంగా ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కో కాంట్రిబ్యూటరీ పింఛన్ చట్టం రద్దుకు చట్ట సవరణ ద్వారా ప్రతిపాదించినట్టు తెలియజేశారు. ఈ చట్ట సవరణలకు శాసనసభ ఆమోదం తెలిపింది. -
మన వ్యవసాయ కేటాయింపులు జాతీయసగటు కంటే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో పది శాతాన్ని దీనికే కేటాయించటం గొప్ప పరిణామమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం శాసనసభలో వెల్లడించారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ పద్దులో కేవలం 6.5% మాత్రమేనన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు గొప్పగా ఉన్నాయి. నాడు బోరుబావి వేసి బాగుపడినవాడు లేడు, నేడు చెరువుల కింద సాగు చేసి చెడిపోయిన వాడు లేడు. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు కనిపించవు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించాలంటే రైతుబంధు అమలు ఉత్తమ మార్గమని నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్‌చంద్ అన్నారు. పంటల బీమా విషయంలో కేంద్రం చొరవ చూపనందున రాష్ట్ర రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతుబంధులాంటిది వర్తింప చేయాలని కొందరు సభ్యులు చేసిన సూచనపై ఆయన స్పంచారు. రాష్ట్రంలో కౌలు రైతు విధానం స్థిరంగా లేదని, తరచూ కౌలుదారులను మార్చటం వల్ల ఎప్పుడు ఎవరు కౌలు చేస్తారో తెలియని స్థితి ఉంటోంది. మాంద్యాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సహకార రంగాలకు ఉంటుంది. కేరళలో అన్ని సహకార సంఘాలకు కలిపి రూ.60 వేల కోట్ల నిధులున్నాయి. తెలంగాణలో అలాంటి పటిష్ట విధానాలను రూపొం దించి అంతకు రెట్టింపు నిధులు సమకూరేలా చేసే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. -
బడ్జెట్ సమావేశాలు కుదింపు!
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్’పై అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనూ కుదించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 6న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 20న ముగియాల్సి ఉంది. కోవిడ్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో శనివారం మధ్యాహ్నం సీఎం.. ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం, రాత్రి ప్రగతి భవన్లో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించాలని శనివారం ఉదయమే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలను 16వ తేదీతో ముగించాలని నిర్ణయించారు. దీంతో సభ కార్యకలాపాల షెడ్యూలులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 8న రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020–21ను ప్రవేశ పెట్టారు. 2 రోజుల సాధారణ చర్చ అనంతరం, శుక్ర, శనివారాల్లో శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు 15 పద్దులపై చర్చించి శాసనసభ ఆమోదించింది. 16 నుంచి 19 వరకు మరో 25 పద్దులౖ పె చర్చించేలా బీఏసీలో తొలుత షెడ్యూలు సిద్ధం చేశారు. తాజాగా సమావేశాలను కుదించాలని నిర్ణయించడంతో 15, 16 తేదీ ల్లోనే సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ షెడ్యూలులో 15న, ఆదివారం విరామం ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో నేడు కూడా పద్దులపై చర్చిస్తారు. 25 పద్దులకు గాను నీటిపారుదల, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ వంటి కీలక పద్దులకే చర్చను పరిమితంచేసే అవకాశం ఉంది. చర్చకు నోచుకోని మిగతా పద్దులను గిలొటిన్ చేసే అవకాశముంది. 20న ప్రవేశ పెట్టాల్సిన ద్రవ్య వినిమయ బిల్లును 16న ప్రవేశపెట్టి ఆమోదించి, సభను నిరవధిక వాయిదా వేస్తారు. సోమవారం మండలి సమావేశం ఈ నెల 6 నుంచి 14 వరకు జరిగిన శాసన మండలి.. బీఏసీ నిర్ణయం మేరకు తిరిగి 20న సమావేశం కావాల్సి ఉంది. తాజాగా మండలి షెడ్యూల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 16న సమావేశమయ్యే శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఈ మేరకు శాసనమండలిని సోమవారానికి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. కాగా బీఏసీ సభ్యుల అభిప్రాయం తీసుకున్నాకే అసెంబ్లీ సమావేశాలను కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆది, సోమవారాల్లో ప్రశ్నోత్తరాలను శాసనసభ నిబంధన 38 కింద రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శనివారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. -
త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యుత్ చార్జీలు పెంచకుంటే ఆ సంస్థల మనుగడ ఎలా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 101 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని.. వాళ్లకు ఎలాంటి పెంపు ఉండదన్నారు. పేదలకు ఇబ్బంది కలిగించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠిన తరం చేశామని చెప్పారు. జవాబుదారీతనం లేని ఉద్యోగులను తీసేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు కూడా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చాలా మంది విరాళాలు ఇచ్చారని.. వారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. గ్రామ కార్యదర్శుల సంఖ్య పెంచామని గుర్తుచేశారు. పల్లెప్రగతి ద్వారా గ్రామీణ తెలంగాణ స్వరూపం మారుతోందన్నారు. 3 వేలకు పైగా గిరిజన ప్రాంతాలను పంచాయతీలుగా మార్చామని అన్నారు. గిరిజనుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నట్టు తెలిపారు. -
కేసీఆర్ ప్రకటన.. కరెంట్ చార్జీల పెంపు
-
‘కేసీఆర్ రైతుబంధు’గా పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పంట సీజన్ రాగానే రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మానేశారని, వ్యవసాయాన్ని వదిలేసిన వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో ఆలోచించి ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చిందన్నారు. ఇలా దేశానికి స్ఫూర్తిదాయకమైన ఈ పథకానికి ‘కేసీఆర్ రైతుబంధు’గా నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు కావడంతో తమ నియోజకవర్గమైన భూపాలపల్లికి 31 ఏళ్ల కిందట కాలువలు తవ్వినా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో 150 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయన్నారు. విమర్శలు చేసే వారంతా ఈ ప్రాజెక్టును చూస్తే వారి అభిప్రాయం మారిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఓసారి ప్రాజెక్టును చూసి రావాలని సూచించారు. ధాన్యం ఇతర పంటలను ఎక్స్‌పోర్టు చేసేందుకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిశాక కూడా కొత్త పథకాలు బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని, పట్టణాభివృద్ధికి చర్యలు వేగవంతం చేశారన్నారు. వరంగల్ లాంటి పట్టణాల్లో ఐటీ విస్తరణకు మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా ఎన్నికల ముం దు పథకాలు తీసుకురావడం సాధారణమని, కేసీఆర్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక కూడా కొత్తపథకాలు తెస్తున్నారన్నారు. సరిపడా విద్యుత్, నీరు అందుబాటులో ఉండటం వల్ల భూములు అమ్మకుండా వ్యవసాయం చేస్తు న్నారని పేర్కొన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూమి లభించట్లేదన్నారు. -
ఇది వాస్తవిక బడ్జెట్ : అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : దేశం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తోన్న దశలో సొంత ఆదాయ వనరులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఇది వాస్తవిక బడ్జెట్ అని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంత సహకారం అందడం లేదని, అందుకే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని ఆయన విమర్శించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 8న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చను బుధవారం అక్బరుద్దీన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలు ఆశించినంతగా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిరాశ కలిగించే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు స్పెషల్ గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇవ్వలేదని, కాళేశ్వరం నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర పన్నుల వాటా, గ్రాంటులు కలిపి రాష్ట్రానికి పెరిగింది రూ.513 కోట్లేనన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని, ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గృహ వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మోటారు వాహనాల రంగం సంక్షోభంలో ఉన్న దశలో మోటారు వాహనాల పన్ను పెంచుకుంటా మని ఎలా ప్రతిపాదించారో అర్థం కావట్లే దన్నారు. భూముల విక్రయాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. గత ఐదేళ్లలో దీనిపై రూ.3,987 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. వడ్డీలు రెండున్నర రెట్లు పెరిగాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.29 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ వడ్డీ చెల్లింపులు రెండున్నర రెట్లు పెరిగాయని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో రూ.2 వేల కోట్లు పాతబస్తీ అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. ఏటా ఇచ్చే రూ.10 వేల కోట్లను ఎలా ఖర్చు చేయాలనే దానిపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మున్సిపల్ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. గతంలో వైఎస్సార్ అధి కారంలో ఉన్నప్పుడు పాతబస్తీకి ప్రత్యేకంగా రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించారని, ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉర్దూ లేకుండా పోతోందని, ఖాళీలు భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐటీని ఓల్డ్ సిటీ వైపు విస్తరించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను మైనారిటీలకు కూడా కేటాయించాలని కోరారు. రేషన్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని, వక్ఫ్ బోర్డు బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
‘ఆ రూట్లో.. ట్రామ్ లేదా బీఆర్టీఎస్ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వరకు ఎలివేటెడ్ పద్ధతిలో బీఆర్టీఎస్ కారిడార్ గాని ట్రామ్ ట్రాన్స్‌పోర్టు విధానాన్ని కాని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన శాసనసభకు తెలిపారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో కారిడార్ నిర్మించాలని, తీవ్ర రద్దీ పెరిగిన సుచిత్ర కూడలి నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు అవసరమని, కానీ అక్కడ మెట్రో నిర్మాణానికి వీలుగా స్థలం లేనందున కనీసం ఎంఎంటీఎస్నైనా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద కోరారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వైపు రద్దీ తీవ్రంగా ఉన్నందున అక్కడ ప్రత్యేక వ్యవస్థ అవసరమని, అయితే ట్రామ్ మార్గాన్ని గాని ఎలివేటెడ్ కారిడార్ ద్వారా బీఆర్టీఎస్ విధానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో పాస్‌ను ప్రవేశపెట్టే అంశం కూడా పరిశీలనలో ఉందని, ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా రాత్రివేళ వాటి సమయాన్ని పొడిగించే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 20 వేల ద్విచక్రవాహనాలు, 400 కార్లు నిలిపేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని, త్వరలో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ టవర్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.14,500 కోట్లు కాగా, వయబిలిటీ గ్యాప్ ఫండ్‌గా 10 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం భరించిందని, అందులోనూ ఇంకా రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు వీలైనంత త్వరలో మెట్రో రైలు కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. -
రాష్ట్రానికి క్షేమం కాదు : భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్ ఏమాత్రం క్షేమకరం కాదని, బడ్జెట్లో సామాజిక స్పృహ లోపించిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అభూత కల్పనలతో సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టి ప్రభుత్వం సభను, ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం అప్పులు, మద్యం విషయంలోనే బడ్జెట్లో అభి వృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది రాష్ట్ర ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో జరిగిన సాధారణ చర్చలో ఆయన ప్రసంగిం చారు. ప్రభుత్వం చూపిన ద్రవ్యలోటు రూ. 33 వేల కోట్లను పూడ్చుకొని మరో రూ. 30 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని రాబడితే కానీ బడ్జెట్ వాస్తవ రూపంలోకి రాదన్నారు. రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్లో ద్రవ్యలోటు, పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 63 వేల కోట్ల రాబడి ప్రశ్నార్థకం కానుందన్నారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలి... గత బడ్జెట్లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఈసారి దానికి అదనంగా రూ. 16 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని భట్టి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలను తగ్గించాలని ప్రయత్నిస్తుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ‘తాగండి.. తాగండి.. తాగండి, అమ్మండి..అమ్మండి..అమ్మండి’ అనే రీతిలో వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే వెంటనే మద్యం అమ్మకాలను నియంత్రించాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని భట్టి డిమాండ్ చేశారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు అమ్మొద్దు... పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 30 వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని భట్టి ప్రశ్నించారు. భూములు అమ్ముతారా? రాజీవ్ స్వగృహ ఆస్తులు అమ్ముతారా? దిల్ భూములు అమ్ముతారా... ఏ మార్గంలో పన్నేతర ఆదాయం వస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మొద్దని, వాటిని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల కింద కేటాయించాలని కోరారు. 2007–08లో ప్రభుత్వం వేలం వేసిన భూములను కొన్ని సంస్థలు కొని నిరర్ధకంగా వదిలివేశాయని, ఆ భూములను మళ్లీ తీసుకొని వాటిని ప్రస్తుత ధరల్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని సూచించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో వివక్ష.. ప్రభుత్వం గత ఆరేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని భట్టి ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాల వల్ల ఐటీ రంగం అభివృద్ధి చెందిందే తప్ప ఇందులో టీఆర్ఎస్ సాధించిందేమీ లేదన్నారు. పరిశ్రమల స్థాపనలో సర్కారు వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వారికి, ప్రజాప్రతినిధులకు వాటాలున్న కంపెనీలకు ప్రత్యేక జీవోలిచ్చి ప్రోత్సాహకాలిస్తున్నారని, మిగిలిన మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పౌల్ట్రీ రంగంలో పెద్ద అవినీతి జరిగిందని, పౌల్ట్రీ రైతుకు సబ్సిడీపై ఇవ్వాల్సిన మొక్కజొన్నలను బడా కంపెనీలు గంపగుత్తగా టన్ను రూ. 18 వేలకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రూ. 26 వేలకు బయట అమ్ముకుంటున్నాయని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. విద్యకు కేటాయింపులు పెంచాలి... యూనివర్సిటీలకు కేటాయించిన మొత్తం జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోవని భట్టి అభిప్రాయపడ్డారు. పీహెచ్డీ విద్యార్థులు కేటరింగ్ పనులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 58.71 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేవలం 5.14 శాతం అంటే 3.02 లక్షల మంది మాత్రమే చదువుకోగలుగుతున్నారని చెప్పారు. 46.82 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎంత కాలం? బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు చూపినా వాటిని ఎలా ఖర్చు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలు కలపి రూ. 3.19 లక్షల కోట్లకు చేరాయని, బడ్జెట్లో రూ. 22 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలకే కట్టాల్సి వస్తోందని, భవిష్యత్‌లో అవి మోయలేని స్థితికి చేరుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తిరిగి చెల్లించే గడువు కూడా 40 ఏళ్లు పెట్టారని తెలుస్తోందని, దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. లక్షల కోట్లు చూపుతూ కేటాయింపులు మాత్రం ఈసారి రూ. 11 వేల కోట్లకే పరిమితం చేశారని, ఈ కేటాయింపులతో ప్రాజెక్టులు ఎన్నేళ్లు కడతారని భట్టి ప్రశ్నించారు. పదేపదే రుణాలు తీసుకునేందుకే ప్రభుత్వం ఇలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ స్థాయిలో అప్పులు చేయలేదన్నారు. మిషన్ భగీరథను పెద్ద ఫ్రాడ్‌గా అభివర్ణించిన భట్టి... గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు సంతకాలు చేయించుకొని వెళ్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో విభేదిస్తున్నానని, ప్రజలకిచ్చిన హామీలకు అనుగుణంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేలా బడ్జెట్ కేటాయింపులను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ పేరు చెప్పేటప్పుడు అనుమతి తీసుకున్నారా? పౌల్ట్రీ రంగంపై భట్టి మాట్లాడుతున్న సమయంలో మార్క్‌ఫెడ్ నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు, వాటి యజమానుల పేర్లు చెబుతూ రంజిత్‌రెడ్డికి చెందిన రాజరాజేశ్వరి హేచరీస్ పేరును ప్రస్తావించారు. దీంతో కలగజేసుకున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... సభలో లేని వ్యక్తి పేరు ప్రస్తావించే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని, ఒకవేళ తీసుకోకపోతే రికార్డుల నుంచి ఆ పేరును తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రంజిత్‌రెడ్డి ఎంపీ అని తనకు ఇంతవరకు తెలియదని, కానీ తాను ఎంపీ అని సంబోధించలేదన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన అంశంపై భట్టి మాట్లాడుతుండగా ప్రభుత్వ విప్ సునీత కలగజేసుకొని సభ నుంచి భట్టిని సస్పెండ్ చేయలేదని కామెంట్ చేసి నాలుక కరుచుకున్నారు. మద్యం, యూనివర్సిటీలు, మిషన్ భగీరథపై భట్టి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలంటూ అధికార టీఆర్ఎస్ సభ్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. -
ప్రాజెక్టుల నిర్వహణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రధాన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వహణలోకి వస్తున్నందున వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు వీలుగా ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులు చేసిం ది. తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రగతి పద్దుకు మించి నిర్వహణకు నిధుల కేటాయింపు భారీగా జరిగినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది నుంచి విద్యుత్ వినియోగం పెరగనుంది. దానికనుగుణంగా విద్యుత్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి. ఇప్పటివరకు 1,400 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉండగా ఈ ఏడాది జూన్ నుంచి 7 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని లెక్కగట్టారు. వాటికి రూ. 7,000–8,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక ఉంది. ఇందులో కాళేశ్వరం ద్వారానే 360 టీఎంసీలు ఎత్తిపోయనుండగా దానికి 6 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి నిర్వహణ పద్దు కింద ఏకంగా రూ. 5,219 కోట్లు కేటాయించారు. పాలమూరు–రంగారెడ్డి నిర్వహణకు రూ.18.40 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ. 21.04 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పథకాలకు మరో రూ. 62.93 కోట్లను నిర్వహణ పద్దు కింద కేటాయించారు. -
ఖాకీ బడ్జెట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో పోలీసు శాఖకు కోతపడినా.. ఈసారి కేటాయింపులు ఫర్వాలేదనిపించాయి. గతేడాది బడ్జెట్లో ప్రగతిపద్దు రూ.167 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 4,788 కోట్లు కేటాయించింది. కోతల బడ్జెట్ కారణంగా స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా జరగలేదు. గడిచిన 6 నెలల్లో పోలీసు స్టేషన్లలో పెన్నూ, పేపర్లకూ దిక్కులేకుండా పోయింది. ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దుకు రూ. 5,179.22, ప్రగతి కింద రూ. 672.74 కోట్లుగా మొత్తం రూ. 5,852 కోట్లు కేటాయించింది. ఈసారి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు కలిపి గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్ కంటే దాదాపుగా రూ.890 కోట్ల (ప్రగతి పద్దులో రూ.500 కోట్లు, నిర్వహణ పద్దులో రూ. 390 కోట్లు)కుపైగా పెరగడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తవని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది దసరా అనంతరం దాదాపు 11 మంది ఐపీఎస్‌లు, 15 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు, 12 వందల మంది ఎస్సైలు డిపార్ట్‌మెంటులోకి చేరుతున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహణ వ్యయాన్ని పెంచారు. మరోవైపు కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (డీపీవో) కార్యాలయాలు పూర్తికావొచ్చాయని బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది పలు డీపీవోలు ప్రారంభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్లో మహిళలు, పిల్లల భద్రత, కమిషనరేట్ భవనాల నిర్మాణం, సేఫ్‌సిటీ ప్రాజెక్టు, కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణాల కోసం మొత్తం రూ.125 కోట్లు కేటాయించింది. నగరంలో సీసీటీవీల ఏర్పాటు కోసం రూ.50 లక్షలు ఇవ్వనుంది. చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు భారీగా పెంపు గ్రామీణ, చిన్న పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయి. తాజా బడ్జెట్లో వీటికి రూ.1132.39 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కేవలం రూ.21.90 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి భారీగా పెంచింది. ప్రధానంగా రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయం పెరిగి కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీగా పెరగనున్న పంటల దిగుబడులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ పద్దు కింద తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు పెట్టుబడి రుణం కింద కేటాయింపులను రూ.87.90 కోట్ల నుంచి రూ.257 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామీణ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారీగా కేటాయింపులు జరిపింది. పరిశ్రమలకు రాయితీలను 38.98 కోట్ల నుంచి 16.71 కోట్లకు తగ్గించింది. గోదావరి తీరం సుందరీకరణకు రూ.250 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో రూపుదిద్దుకున్న పంప్‌హౌస్‌లను ఆసరా చేసుకుని గోదావరి నదీ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుందర ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని, కశ్మీర్ తరహాలో ఎత్తయిన చెట్లను పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. దానికోసం తాజా బడ్జెట్లో పర్యాటక శాఖకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్‌హౌస్ ప్రాంతానికి రూ.80 కోట్లు, మేడిగడ్డ వద్ద అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు, కన్నేపల్లి నుంచి అన్నారం బ్యారేజీ మధ్య పనులకు రూ.40 కోట్లు, అన్నారం బ్యారేజీ వద్ద పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. ఇక కళాకారుల వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.6.75 కోట్లు, సాంస్కృతిక సారధికి రూ.16 కోట్లు కేటాయించారు. -
పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధులు
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా వార్షిక బడ్జెట్ 2020–21లో రూ.11,917 కోట్లను కేటాయించింది. పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధుల్ని అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఈ ప్రాజెక్టు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకు ప్రత్యేక కాలనీలుగా నిర్ధారిత ప్రాంతంలో ఇళ్లను నిర్మించేవారు. యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఈ ప్రాజెక్టు పనులు పడకేశాయి. ప్రస్తుతం తాముంటున్న ఇల్లు ఒక చోట ఉండటం, కొత్తగా మంజూరై నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరోచోట ఉండటాన్ని లబ్ధిదారులు ఇష్టపడలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులనే సొంతంగా తమ స్థలంలో ఇళ్లను నిర్మించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోపాటుగా డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్లో ప్రభుత్వం రూ.11,917 కోట్లను ప్రతిపాదించింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది ఉంటారని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రగతి పద్దుకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.3,850 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తం గ్రామ ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
పరిశోధన, అభివృద్ధికి శూన్యం!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులను కేటాయించలేదు. ఇంటర్మీడియట్ విద్యను మినహాయిస్తే ఉన్న త, సాంకేతిక విద్యలో నిర్వహణ, ప్రగతి ప ద్దు కింద గతేడాది కంటే ఈసారి నిధులను ప్రభుత్వం తగ్గించింది. యూనివర్సిటీలకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి నిధులను పెంచింది. అయితే పెరిగిన నిధులు యూనివర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. సెంట్రల్ పీఆర్సీ సిఫారసు మేరకు యూజీసీ ప్రకటించిన వేతనాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు ఆ వేతనాల చెల్లింపులకు అయ్యే అదనపు నిధులను మాత్రమే నిర్వహణ పద్దులో కేటాయించింది. ఈసారి ఉన్నత, సాంకేతిక విద్యకు మొత్తంగా రూ.1,723.28 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,638.04 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.85.24 కోట్లు కేటాయించింది. అదే గతేడాది మొత్తంగా రూ.1,690.79 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,632.85 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.57.94 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, పరిశోధనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కావాలని అడిగినా రూ.1,723.27 కోట్లకే పరిమితం చేసింది. ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.30 కోట్ల వరకు కోత పెట్టగా, ప్రగతి పద్దులో రూ.28.53 కోట్లు అదనంగా ఇచ్చింది. సాంకేతిక విద్యలో భారీ కోత.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలు కోసం గతేడాది రూ.5.78 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.34.27 కోట్లు కేటాయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.3 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ బిల్డింగ్ నిర్మాణం కింద రూ.3 కోట్లు, వివిధ పథకాల కింద రూ.3.22 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా కింద గతేడాదిలాగే నిధులను కేటాయించింది. గతేడాది రూ.14.95 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.15.04 కోట్లు కేటాయించింది. మరోవైపు సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దులో భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.265.08 కోట్లకే పరిమితం చేసింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సుల్తాన్పూర్ కాలేజీకి రూ.5.10 కోట్లు, మంథని కాలేజీకి రూ.63 లక్షలు, కరీంనగర్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5.59 కోట్లు కేటాయించింది. అయితే జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. పాలిటెక్నిక్ కాలేజీలకు గతేడాదితో పోల్చితే భారీగా బడ్జెట్‌ను తగ్గించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.142.83 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.98.99 కోట్లు మాత్రమే కేటాయించింది. -
గ్రేటర్ ఎన్నికలకు వేళాయే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌కు నిధుల పంట పండింది. ‘హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్’అనే కొత్త పద్దు కింద ఏకంగా రూ.7,547 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన పుర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ 2020–21లో పురపాలక శాఖకు ప్రగతిపద్దు కింద రూ.11,020.37 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,261.98 కోట్లు కలిపి మొత్తం రూ.12,282.35 కోట్లు కేటాయించింది. 2018–19లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,262.21 కోట్లు కలిపి మొత్తం రూ.5,942.9 కోట్లు కేటాయించగా, తాజా కేటాయింపులు రెట్టింపు చేసింది. నిర్వహణ పద్దు కింద జల మండలికి నీటిసరఫరా, పారిశుధ్యం నిర్వహణ కోసం రుణాలను రూ.825 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచింది. కార్పొరేషన్లకు మళ్లీ కోత.. రాష్ట్ర ఆర్థిక సంఘానికి నిధుల కేటాయింపులను రూ.1,036.98 కోట్ల నుంచి రూ.889 కోట్లకు తగ్గించింది. రాష్ట్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద కేటాయింపులను రూ.521.73 కోట్ల నుంచి రూ.889 కోట్లకు పెంచింది. వడ్డీ లేని రుణాల పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయింపులను రూ.75.47 కోట్ల నుంచి రూ.226.41కోట్లకు పెంచింది. వరంగల్‌కు రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను 2017–18లో కేటాయించిన ప్రభుత్వం, వరుసగా రెండో ఏడాది వీటికి రిక్తహస్తం చూపించింది. అయితే తొలిసారిగా మిషన్ భగీరథ (అర్బన్) పథకానికి రూ.800 కోట్లను కేటాయించింది. ఆలయాలకు రూ.400 కోట్లు యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.350 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థకు కేటాయింపులను రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. -
విద్యాశాఖకు 12,127.55 కోట్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖకు 12,127.55 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెం బ్లీలో ప్రకటించిన బడ్జెట్లో విద్యాశాఖకు రూ.12,144 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, విభాగాల వారీగా చూస్తే రూ. 12,127.55 కోట్లుగా ఉంది. గతేడాది విద్యా శాఖకు రూ.9,899.12 కోట్లు మాత్రమే కేటా యించగా ఈసారి దానికి అదనంగా 2,238.43 కోట్లు ఇచ్చింది. విద్యాశాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.10,405.29 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,452.03 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.270.23 కోట్లను కేటాయించింది. ఇక ఈసారి అదనంగా ఇచ్చిన రూ.2,238.43 కోట్లలో పాఠశాల విద్యలోనే నిర్వహణ పద్దు కింద రూ.1,642.32 కోట్లను కేటాయించగా, ప్రగతి పద్దులో 598.82 కోట్లను కేటాయిం చింది. ప్రగతిపద్దులో ఈ మొత్తాన్ని సమగ్ర శిక్షా అభియాన్ కోసం కేటాయింపులు జరి పింది. వాస్తవానికి పాఠశాల విద్యకే రూ.14 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని ప్రతిపాదనలను పంపించినా రూ.10,405.29 కోట్లకు ప్రభుత్వం కేటాయింపులు పరిమితం చేసింది. మరోవైపు ఈచ్ వన్ టీచ్ వన్‌కు రూ.100 కోట్లు కేటాయించింది. విభాగాల వారీగా కేటాయింపులివీ.. నిర్వహణ పద్దులో పాఠశాల విద్యకు కేటా యించిన రూ.9,113.10 కోట్లలో సాధారణ విద్యకు రూ.8,864.25 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.9.59 కోట్లు, వయోజన విద్యకు రూ.7.40 కోట్లు, ప్రభుత్వ గ్రంథాల యాలకు రూ.54.11 కోట్లు, జవహర్ బాలభ వన్‌కు రూ.2.99 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.34.49 కోట్లు, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.135.99 కోట్లు కేటాయించిం ది. సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ.135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటా యించింది. అయితే ఈ నిధులన్నీ నిర్వహణ కు, వేతనాలకే సరిపోనున్నాయి. ఇక ప్రగతి పద్దులో రూ.1,292.19 కోట్లు ప్రభుత్వం కేటా యించింది. అయితే అవి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏమాత్రం సరిపోవని విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘా లు అభిప్రాయపడుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు ఈ నిధులతో సాధ్యం కావని అంటున్నాయి. రెండేళ్ల కిందటితో పోల్చితే తక్కువే.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రెండేళ్ల కిందటి తో పోల్చితే ఈసారి చేసిన కేటాయింపులు తక్కువే. ఈ పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లిం చాల్సిన మొత్తం కింద గతేడాది రూ.491.56 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.1,239.46 కోట్లను కేటాయించింది. గతే డాదితో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు పెరి గింది. అయితే అంతకుముందు సంవత్స రాల్లో చేసిన కేటాయింపుల కంటే ఈసారి తగ్గిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి పథకాలకు 40 శాతం రాష్ట్ర వాటా తప్పనిసరి. వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 1,876.42 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,546.39 కోట్లకు సవరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం లో ఈ పథకాల కోసం రూ. 491.56 కోట్లు మాత్రమే కేటాయించగా, 2020–21 కోసం రూ.1,239.46 కోట్లను కేటాయించింది. ఇక ఉన్నత విద్యలో కేంద్ర పథకాల కోసం రూ. 15.04 కోట్లను మాత్రమే కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్లో 6.62 శాతమే.. రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యం తగ్గు తోంది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను పెం చినా మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ కేటాయిం పుల వాటా తక్కువే. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.28 శాతం తగ్గిపోయాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇప్పుడు అది 6.62 శాతానికి పడిపోయింది. ఫీజులకు ఫుల్ బడ్జెట్ పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర బడ్జెట్ ఫుల్ జోష్ ఇచ్చింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయిస్తూ.. ఇకపై పాత బకాయిల ప్రస్తావన లేకుండా చేసింది. 2020–21 వార్షిక సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద రూ.2,650 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ప్రతి సంవత్సరం సగటున రూ.2 వేల కోట్ల డిమాండ్ ఉంటుంది. పాత బకాయిలు, కొత్త వాటి చెల్లింపులకు సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో గత కొన్నేళ్లుగా బకాయిలు పెండిం గ్లో ఉండేవి. ఈ క్రమంలో పాత బకాయిలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో అన్ని సంక్షేమ శాఖలు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టాయి. 2019–20 వార్షిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా రూ.3 వేల కోట్ల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిని పూర్తి స్థాయిలో చెల్లిస్తే 2019–20 వార్షిక సంవత్సరానికి సంబంధించి 75 శాతం చెల్లింపులు చేయవచ్చు. ఫీజులకు మిగులు నిధులు.. 2020–21 వార్షిక సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద మిగులు నిధులు ఉంటాయని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.2,650 కోట్లు కేటాయింపులు జరపడంతో.. అప్పటి డిమాండ్ రూ.2,050 కోట్లు ఉంటుందని, 2019–20 లో రూ.450 కోట్ల మేర ఉండే బకాయిలన్నీ చెల్లించినప్పటికీ కొంత మేర నిధులు సంక్షేమ శాఖల వద్ద ఉండే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
వడ్డీ చెల్లింపులకు 14,615 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయ పట్టికలో రూ. 14,615 కోట్లను వడ్డీ చెల్లింపుల కింద ప్రభుత్వం చూపింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో వడ్డీ చెల్లింపుల కింద రూ. 14,574 కోట్లు ఉండగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 14,385 కోట్లు చెల్లించారు. ఇప్పుడు కూడా కాస్త అటూ ఇటుగానే వడ్డీ చెల్లింపులు చూపెట్టారు. అయితే, వడ్డీలకు తోడు రుణాలు, అడ్వాన్సుల అసలు చెల్లింపుల కింద రూ. 15,662 కోట్లు ప్రతిపాదించారు. దీంతో అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులు రూ. 30 వేల కోట్లు దాటాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ. 10,835 కోట్లు ఉండగా మూడేళ్లలో అది రూ. 3,780 కోట్ల మేర పెరిగిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. తప్పని అప్పుల తిప్పలు.. ఇక, ఈ ఏడాదీ పెద్దఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్ అంచనా లెక్కలు చెబుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ. 35,500 కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే 2,600 కోట్ల రుణం ఎక్కువగా ప్రతిపాదించింది. ఇందులో ఓపెన్‌మార్కెట్ రుణాల కింద రూ.34 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఇతర రుణాలు రూ.1000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. అదే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.32,900 కోట్ల రుణాలు అంచనా వేయగా, రూ. 31,800 కోట్లు సమీకరించారు. కేంద్రం నుంచి రూ.800 కోట్లు వస్తాయని అంచనా వేస్తే కేవలం రూ.200 కోట్లే వచ్చాయి. ఇక, ఇతర రుణాల కింద రూ.1000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదన ఉన్నా రూ.500 కోట్లు మాత్రమే కార్యరూపంలోకి వచ్చాయి. మూలధన వ్యయం పెరిగింది.. కాగా, ఈ ఏడాదితో పోలిస్తే మూల ధన వ్యయాన్ని పెంచుతూ బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 17,274 కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,165 కోట్లు ఖర్చయింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తమాన ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.8 వేల కోట్లు అధికంగా రూ. 22,061 కోట్లు మూల ధన వ్యయంగా ప్రతిపాదించారు. అదే 2018–19 ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయం 33,369 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 22,640 కోట్లకు తగ్గింది. ఇక, ఈసారి అంచనాల్లో ప్రతిపాదించిన మొత్తంలో ఎంత వ్యయం సంపద సృష్టికి జరుగుతుందనేది ఆర్థిక సంవత్సరం ముగిశాక తేలనుంది. -
పీఆర్సీ, ఐఆర్ ఈసారి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కోసం ఇంకొన్నా ళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. బడ్జెట్లో పీఆర్సీ అమలు కోసం నిధులను కేటాయిం చకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలో పడ్డా రు. ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవ డంతో కొంత ఆందోళనకు గురయ్యారు. మధ్యం తర భృతి (ఐఆర్) ప్రస్తావన కూడా లేక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. రాష్ట్రంలోని 2.62 లక్షల మంది ఉద్యోగులు, 2.68 లక్షల మంది పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాల న్నా, ఐఆర్ ఇవ్వాలన్నా రూ.వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ మొత్తం వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ అంశానికి బడ్జెట్లో చోటు క ల్పించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థి క సంవత్సరం బడ్జెట్లోనే పీఆర్సీ అమలు అంశా న్ని చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యో గుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ల కు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్‌గానే ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడం ద్వా రా ఉద్యోగులను కొంత శాంతపరిచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
ఆరోగ్యమస్తు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యరంగానికి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,185.97 కోట్లు కేటాయించింది. 2019–20 ఆర్థిక సంవ త్సరంలో రూ. 5,694 కోట్లు కేటాయించగా, ఈసారి అదనంగా రూ. 491 కోట్లు కేటాయించడం విశేషం. మొత్తం వైద్య ఆరోగ్య బడ్జెట్లో రూ. 2,361.81 కోట్లు ప్రగతి బడ్జెట్ కాగా, 3,824.16 కోట్లు నిర్వహణ బడ్జెట్ కావడం గమనార్హం. ఈ ప్రగతి బడ్జెట్లో అత్యధికంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో అమలయ్యే పథకాలకు అధికంగా రూ.1185 కోట్లు కేటా యించారు. గత బడ్జెట్లో రూ.886.49 కోట్లు కేటా యించగా, ఈసారి మరింతగా పెంచడం గమనార్హం. ఆయుష్ విభాగానికి గత బడ్జెట్లో రూ. 6.86 కోట్లు ఇవ్వగా, ఈసారి 33.25 కోట్లు కేటాయించారు. అంటే గతం కంటే ఏకంగా రూ. 26.39 కోట్లు అదనం కావడం విశేషం. ఇక ఎంతో ప్రాధాన్యం కలిగిన కేసీఆర్ కిట్‌కు గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించగా, ఈసారి 443 కోట్లకు తగ్గింది. ఈజేహెచ్ఎస్ స్కీంకు గతంలో రూ. 417 కోట్లు కేటా యించగా, ఈసారి 410.35 కోట్లు దక్కాయి. ఆరోగ్యశ్రీకి గతంలో రూ. 720. 12 కోట్లు కేటాయిం చగా, ఈసారీ అదే స్థాయిలో ఉంది. ఇక ఔషధాల కోసం గత బడ్జెట్లో రూ.236.14 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.262.41 కోట్లు ఇచ్చారు.ఇక ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసు పత్రికి గతంలో రూ.20 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడూ అంతే ఇచ్చారు. ఆ వ్యాధుల నిర్ధారణకు కార్యాచరణ... కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబం«ధిత వ్యాధుల నిర్ధారణ కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. తెలంగాణ లోని ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి . వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వాటి సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇప్పుడు నడుస్తున్న వాటితో పాటు, మరో 232 ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించాలని బడ్జెట్లో ప్రకటించారు.ప్రతీ డివిజన్లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటుతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనంగా ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ప్రజల కంటి సంబంధ సమస్యలను పరిష్కరించడానికి కంటి వెలుగు పేరుతో ప్రపంచంలోనే అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగానే మందులు, అద్దాలు పంపిణీ చేశారు. కరోనాపై ప్రస్తావన... రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి ప్రస్తావించారు. వేసవిలో ఉండే ఎండ వేడికి వైరస్ మనుగడలో ఉండే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండాకాలం ప్రారంభమైనందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కరోనా వైరస్‌పై చెలరేగే వదంతులను నమ్మవద్దని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది. ఇదిలావుండగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
తలసరి అప్పు 65,480
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలసరి అప్పు పెరుగు తోందని బడ్జెట్ లెక్కలు చెపుతున్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.29 లక్షల కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే ఇది రూ.65,480గా తేలింది. అంటే రాష్ట్రం లోని ప్రతి వ్యక్తిపై ఉన్న తలసరి అప్పు రూ.65,480 అన్నమాట. గతేడాది బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ.58,202 కాగా, ఈ ఏడాది మరో రూ.7,278 పెరిగింది. కాగా, రాష్ట్ర అప్పు జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో పోలిస్తే 20.74 శాతానికి చేరడం గమనార్హం. రూ.1.87 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను పరిశీలిస్తే బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో రూ.1.87 లక్షల కోట్లకు పైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.8,682 కోట్లు, స్వయం ప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 13,961 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,954 కోట్లు సమీకరించినట్టు బడ్జెట్ ప్రతి పాదనల్లో ప్రభుత్వం వెల్లడిం చింది. గత ఐదేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభు త్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పుంటే 2020–21 నాటికి అది 2.29 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గత ఐదేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పు అక్షరాల లక్ష కోట్ల రూపాయలన్నమాట. -
పల్లెకు ప్రగతి
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దండిగా నిధులు కేటాయించింది. గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,005.35 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా రూ.7,880.46 కోట్లు అధికం. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,701.04 కోట్లు నిర్వహణ పద్దు కాగా, రూ.18,304.31 కోట్లు ప్రగతి పద్దు. వ్యవసాయం తర్వాత అత్యధిక నిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కడం విశేషం. ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు అసహాయులైన పేదలకు ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆసరా పథకం కింద రూ.11,758 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.9,402 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా మరో రూ.2,356 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించనుండటంతో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 39.41 లక్షల మందికి ఆసరా పింఛన్ అందుతుండగా.. అర్హత వయసు తగ్గింపుతో మరో ఏడెనిమిది లక్షల మంది అదనంగా పింఛన్‌కు అర్హత సాధించే అవకాశముంది. దండిగా ఆర్థిక సంఘం నిధులు.. గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్న సర్కారుకు ఈ నిధుల రాకతో వెసులుబాటు కలుగనుంది. ఈ నేపథ్యంలో 2020–21లో గ్రామ పంచాయతీలకు రూ.1,393.93 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అందించనుంది. గతేడాది కేవలం రూ.819.44 కోట్లు కేటాయించగా.. ఈ సారి అదనంగా రూ.574.49 కోట్లు పెంచింది. వడ్డీలేని రుణాల్లో కోత డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలకు స్వల్పంగా కోత పెట్టింది. గతేడాది రూ.680.49 కోట్లు కేటాయించగా.. ఈ సారి 679.23 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగే పనులకు రూ.54 కోట్లు కేటాయించింది. 2019–20తో పోలిస్తే రూ.13 కోట్లు అదనం. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద రూ.15.09 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే రూ.11 కోట్లు అధికం. -
మాంద్యంలోనూ ప్రగతిబాట
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాపై సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు. మేం ఎంచుకున్న బాట సరైందని, మేం అవలంభిస్తున్న వ్యూహాలు సఫలమవుతున్నాయని తేల్చిచెప్పారు. మా పంథా ఇకపైనా కొనసాగించే నిర్ణయంతో వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్తు పురోగతికి ప్రణాళిక రచన చేశాం. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహనతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రజల ముందుంచుతున్నాం. ఇది కేవలం వార్షిక బడ్జెట్ ధృక్పథంతో కాకుండా ప్రజలే కేంద్రంగా ప్రగతిశీల బడ్జెట్ రూపొందించాం’’అని 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు స్వాగ తిస్తున్నారని, అదే ఉత్సాహంతో వచ్చే నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో వచ్చే సంవత్సరానికి వాస్తవిక, ప్రగతిశీల బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో 62 నిమిషాలపాటు ఆయన బడ్జెట్ ప్రసంగం సాగింది. తన ప్రసంగం ప్రారంభానికి ముందు సీఎం చాంబర్లో, ప్రసంగం ముగించాక సభలో హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. హరీశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సంక్షేమంలో కోత లేదు.. ‘‘సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో ఎక్కడా కోత విధించలేదు. పైగా లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో పనిచేస్తోందో ఈ బడ్జెట్ అంకెలే చాటిచెబుతున్నాయి. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచటమే.ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్ర సొంత రాబడి సగటు వృద్ధి రేటు 21.5 శాతం ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి 6.3 శాతం తగ్గి 15.2 శాతం వద్ద నిలిచింది. ఇక 2014 మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. గత ఎన్నికల్లో కూడా ఆ హామీ ఇచ్చాం. ఆర్థిక మాంద్యం ముందరి కాళ్లకు బంధం వేస్తునప్పటికీ దాని అమలుకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రమే టాప్.. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. 2019–20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216గా ఉంటే దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050గా ఉంది. ఇది మన ప్రగతికి స్పష్టమైన సంకేతం. అంబేడ్కర్ మాటలు మననం చేసుకుంటూ... సమాజ వికాసానికి నిజమైన కొలమానం మహిళాభివృద్ధి స్థాయేనని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నారు. ఆయన మాటలను మననం చేసుకుంటూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి , కేసీఆర్ కిట్ పథకాలతో మహిళల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బడ్జెట్లో మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,200 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 57 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛన్.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధా ప్య పింఛన్లు అందించబోతున్నాం. దీనివల్ల 39,41,976 ఆసరా పెన్షన్ల సంఖ్య భారీ గా పెరగనుంది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ. 9,402 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో ఆ కేటాయింపులను రూ. 11,758 కోట్లకు పెంచాం. కాళేశ్వరం వెనుక కేసీఆర్ ఉక్కు సంకల్పం.. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రూపొంది రికార్డు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పమే కారణం. ఫలితంగా గోదావరి 150 కి.మీ. మేర జీవధారగా మారింది. ఇది తెలంగాణ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఉపయోగపడుతుంది. ఇదే స్ఫూర్తి తో పాలమూరు–రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కొద్ది కాలంలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుంది. వృద్ధిరేటుకు పన్నుల వాటా ఎసరు.. 2019–20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్లో వేసుకున్న అంచనాల కంటే రూ. 3,731 కోట్ల మేర తగ్గింది. రాష్ట్రానికి కేంద్రం నంంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారంలో నిధులు సకాలంలో అందడం లేదు. దీంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018–19లో 16.10 శాతం ఉంటే 2019–20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.43 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గింది. -
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 26,306 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా పెరిగాయి.2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్‌తో పోల్చితే 2020–21 సంవత్సరం కేటాయింపుల్లో ఏకంగా 6,721.17 కోట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.26,306.25 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,771.28 కోట్లు వంతున బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం... గతేడాది సెప్టెంబర్ 9న 2019–20 వార్షిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ భారీగా తగ్గడంతో ప్రత్యేక అభివృద్ధి నిధి యాక్టు కింద ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా తగ్గాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 వార్షిక సంవత్సరం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా పెరిగాయి. నిధుల కేటాయింపుల్లో జోరు పెరగడంతో సంక్షేమ పథకాల అమలులో వేగం పుంజుకోనుంది. పెండింగ్ పనులకు లైన్ క్లియర్... ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయింపులు భారీగా పెరగడంతో ఆయా శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. 2019–20 వార్షిక సంవత్సరంలో కేటాయింపులు భారీగా తగ్గడంతో ముందస్తుగా అనుకున్న పలు కార్యక్రమాలను ఆయా శాఖలు వాయిదా వేసుకున్నాయి. ముఖ్యంగా నిర్మాణ పనులు చాలావరకు నిలిపేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా మండల, డివిజన్ స్థాయిలో నిర్మించాలనుకున్న అంబేడ్కర్ భవనాలు, ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధి కాస్త నెమ్మదించింది. తాజాగా భారీగా నిధులు ప్రవేశపెట్టడంతో వాయిదా పడ్డ పనులన్నీ వేగంగా పూర్తికానున్నాయి. ఎస్డీఎఫ్ కింద కేటాయించిన బడ్జెట్‌ను దాదాపు 42శాఖలు సమన్వయంతో ఖర్చు చేస్తాయి.ఈ నేపథ్యంలో ఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వ శాఖలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని భావిస్తున్నాయి. -
బడ్జెట్లో భారీగా కేటాయింపులు
ఇది పూర్తి సమతుల్యత బడ్జెట్. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్. రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎవరి ఊహలు, అంచనాలకు అందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్లో భారీ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పన్ను వృద్ధి రేటు తగ్గుదల, ఆర్థిక మాంద్యం, కోవిడ్ ప్రభావం, కేంద్ర సాయం వంటి అంశాలను అస్సలు ఖాతరు చేయలేదు. రైతు, పల్లె, పట్టణం అభివృద్ధే లక్ష్యంగా.. సంక్షేమమే పరమావధిగా 2020–21 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రాష్ట్రంలోని ప్రతి రైతునూ రాజును చేసేవరకు నిద్రపోమంటూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్లో అన్నదాతకు అగ్రతాంబూలమిచ్చింది. విద్యకు చదివింపులు ఘనంగా జరిపింది. ఆరోగ్య‘మస్తు’అనిపిం చింది. సంక్షేమానికీ సై అంది. ఆదివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి హరీశ్‌రావు పింఛన్లకు పెద్ద మనసుతో నిధులిచ్చింది. పల్లె ప్రగతికి, పట్నం వృద్ధికి ప్రాధాన్యత కనబర్చింది. వెరసి.. పరిస్థితులు సహకరించకున్నా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. రైతు, పల్లె, పట్నం కేంద్రంగా అన్ని వర్గాలు, అన్ని శాఖలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు తొలిసారిగా శాసనసభలో ప్రవేశపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ సమర్పించారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలూ లేనప్పటికీ, ఎన్నికల బడ్జెట్ తరహాలోనే అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. 2019–20 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్ ఏకంగా 25 శాతం మేర పెరిగింది. ఓటాన్ అకౌంట్‌తో సమానంగా.. అన్ని రకాల అంచనాలు, ఖర్చులు, కేటాయింపులను పెంచుతూ 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 2019–20 ఓటాన్ అకౌంట్ అంచనాలకు సమానంగా రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గతేడాది 1.82 లక్షల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టగా.. గతేడాది సెప్టెంబర్ 9న ప్రవేశపెట్టిన 2019–20 సాధారణ బడ్జెట్ అంచనాలు 1.46 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.42 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి రూ.40వేల కోట్లను కలిపి రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరపతి మెరుగ్గానే ఉన్నట్టు చూపించింది. పెరిగిన పన్ను అంచనాలు 2020–21 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను చూస్తే అన్ని రకాల పన్ను అంచనాలు పెరిగాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా రాష్ట్ర పన్నుల రాబడితోపాటు కేంద్రం నుంచి వచ్చే వాటా తగ్గుతుందనే అంచనాలను తలకిందులు చేస్తూ పన్ను అంచనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా పన్నేతర ఆదాయాన్ని 150శాతం వరకు పెంచింది. 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12వేల కోట్లకు పైగా పన్నేతర ఆదాయం రాగా, ఈసారి దాన్ని ఏకంగా రూ.30,600 కోట్లకు పెంచింది. కేంద్ర పన్నుల్లో వాటా, జీఎస్టీతో కలిపి రాష్ట్ర పన్నులు, గ్రాంట్ ఇన్ఎయిడ్, అమ్మకపు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ఆదాయం, ఇతర పన్నులు.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ పెద్ద ఎత్తున రాబడులను ఆశిస్తూ ప్రతిపాదనలు చేసింది. పన్నుల ద్వారా మొత్తం రూ.85,300 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది. ఈసారి రెవెన్యూ రాబడి రూ.1.43 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో 1.38 లక్షల కోట్ల వ్యయం పోగా రూ.4,482 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని లెక్కగట్టింది. అయితే, ద్రవ్యలోటు మాత్రం భారీ పెరిగింది. 2019–20లో ద్రవ్యలోటు రూ.24వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.21,913 కోట్లకు తగ్గింది. అయితే, 2020–21 ఆర్థిక సంవత్సరానికి అది రూ.33,191.25 కోట్లకు పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే ఇది దాదాపు రూ.11వేల కోట్లు ఎక్కువ. ఆదాయమార్గాల కోసం అన్వేషణ... పరిస్థితులు సానుకూలంగా లేకున్నా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అప్పులు, భూములు, నిరర్థక ఆస్తులపైనే ఆశలు పెట్టుకుందని అర్థమవుతోంది. హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలోనూ, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని నర్మగర్భంగానే వెల్లడించారు. ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తున్నామని, ‘దిల్’సంస్థను తెరపైకి తెస్తున్నామని, భూముల అమ్మకాలకు సిద్ధంగా ఉన్నామని, రాజీవ్ గృహకల్ప వంటి నిరర్థక ఆస్తులను విక్రయిస్తామని, సొంత రాబడులను పెంచుకునే మార్గాలపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 2019–20లో రూ.12వేల కోట్లకు పైగా ఉన్న పన్నేతర ఆదాయాన్ని రూ.30,600 కోట్లకు పెంచినట్టు అర్థమవుతోంది. ఈ రెండేళ్ల ప్రతిపాదనల మధ్య ఉన్న దాదాపు రూ.18వేల కోట్ల వ్యత్యాసాన్ని భూములు, నిరర్థక ఆస్తుల అమ్మకం ద్వారానే సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైతన్నే రారాజు.. ఎన్నికల్లో కీలక హామీ అయిన రైతు రుణమాఫీ అమలుకు ఈ బడ్జెట్లో సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.6,200 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రైతుబంధు సాయాన్ని రూ.12వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పెంచింది. రైతుబీ మాను పెంచడంతో పాటు మార్కెట్ స్థిరీకరణ నిధిని కూడా పక్కాగా కేటాయించడం ద్వారా రైతన్నకు జైకొట్టింది. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు రూ.25వేల కోట్ల మేర కేటాయింపులు జరిపింది. ఇప్పటివరకు అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పింఛన్లకు దాదాపు రూ.12వేల కోట్లు ప్రతిపాదనలు చేసింది. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా రూ.10వేల కోట్లు కేటాయించడం ద్వారా విశ్వనగర అభివృద్ధికి బాటలు వేసింది. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.26వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ప్రభుత్వం.. డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణశాఖకు రూ.11వేల కోట్లకు పైగా నిధులు ప్రతిపాదించింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటివరకు ఉన్న బకాయిలను కూడా కలిపి రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించింది. మొత్తం బడ్జెట్ రూ. 1,82,914.42 కోట్లు ప్రగతి పద్దు రూ. 1,04,612.62 కోట్లు నిర్వహణ పద్దు రూ. 78,301.80 కోట్లు బడ్జెట్ అంచనాలివే.. (రూ.కోట్లలో) రెవెన్యూ రాబడి 1,43,151.94 రెవెన్యూ వ్యయం 1,38,669.82 పన్ను రాబడి 85,300.00 పన్నేతర రాబడి 30,600.00 కేంద్రం వాటా 16,726.58 గ్రాంట్లు 10,525.36 రుణాలు 35,500 మూలధన వ్యయం 22,061.18 రెవెన్యూ మిగులు 4,482 ద్రవ్యలోటు 33,191.25 రూ. 65,480 తలసరి అప్పు.. రాష్ట్ర ప్రజలపై పెరిగిన అప్పుల భారం