Telugu cinema industry
-
కామాంధుల బెండు తీసే హీరోలు టాలీవుడ్ లో లేరా..?
-
తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో ఆయనే!
తొంభై మూడేళ్ల వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని అలరించిన ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో,నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. తెలుగు సినీరంగంలో అక్కినేని ‘ఎక్కని ఎత్తుల్లేవు. వెళ్లలేని దూరాల్లేవు.’ జనన మరణాల మధ్య రెప్పపాటు జీవితకాలంలో, మన చూపు తిప్పుకోకుండా మన నలరించిన ఎందరో మహానుభావుల్లో ప్రముఖులు... తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. నాటక రంగం నుంచి నటరాజు వరప్రసాదమైన ‘అభినయ’ కళ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించి, తొంభై మూడు సంవత్సరాల వయసు వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని అలరించి, తెలుగు హృదయాలలో చిరంజీవిగా కొలువై ఉన్న నటనావతంసుడీయన. పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వంటివి అక్కినేనిని అలంకరించి తమ గౌరవాలను ఇనుమడింప చేసుకున్నాయి. తన కళని తర్వాత తరాలకి కూడా వారసత్వంగా అందించి అక్కినేని నాగార్జున వంటి సూపర్ స్టార్‌ని, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వంటి స్టార్లని తయారు చేసి ‘అక్కినేని’ జయభేరి తరతరాలుగా నినదించేలా చేయడం సామాన్యమైన విషయం కాదు. 1950 నుంచి 60ల మధ్యలోనే ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కి వచ్చి తీయా’లని నిర్దేశించ గలిగిన ‘ఖలేజా’ ఉన్న ఏకైక తెలుగు సూపర్ స్టార్ అక్కినేని. 1970ల మధ్య గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో, నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. అదే ‘గుండె ధైర్యం’తో తన తొంభై ఏళ్ల వయసులో ప్రెస్ మీట్ పెట్టి తనకు క్యాన్సర్ సోకిందనీ, మరెంతో కాలం బతకననీ చెప్పగలగడం స్ఫూర్తి దాయకం. పై మూడు సంఘటనలూ, వయసు మారిందే గానీ, ఆయన వన్నె ఏ మాత్రం తగ్గ లేదని నిరూపించాయి. ‘ఆడపిల్లలకి చదువులెందుకు? పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టి పంపెయ్యక’ అనే పాత కాలపు భావజాలం సమాజంలో అధికంగా ఉన్న రోజుల్లో ‘చదువుకున్న అమ్మాయిలు’ అనే టైటిల్‌తో స్త్రీలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపేలా చిత్రం చేయడం ఆయన ప్రోగ్రెసిన్ థాట్ ప్రాసెస్‌కి తార్కాణం. ఈనాటి ‘వుమెన్ ఎంపవర్మెంట్’ ట్రెండ్‌కి బీజం వేసిన సాంఘిక కార్యకర్తల్లో అక్కినేని కూడా ఒకరు. విగ్గు, మేకప్పు లేకుండా ఇంట్లోంచి కాలు కూడా బైటికి కదపలేని కళాకారులకి ఆయన ‘సీతారామయ్య గారి మనవరాలు’ మారుతున్న సినిమా మేకింగ్ విలువలకి ఒక గొప్ప పాఠం. స్టార్ హీరోగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న రోజుల్లో ‘సుడిగుండాలు’ వంటి చిన్న పిల్లల మానసిక సమస్య మీద చిత్రాన్ని నిర్మించి, నటించడం ఆయన సామాజిక బాధ్యతకి, ప్రభావవంతమైన ఆలోచనా పరిణతికి నిదర్శనం. దసరా బుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ఆత్మగౌరవం, అగ్నిపుత్రుడు, సూత్ర ధారులు, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, దేవదాసు, మాంగల్యబలం, విప్రనారాయణ, సువర్ణ సుందరి, కీలుగుర్రం... ఇలా ఏ జోనర్లో చూసినా తెలుగు సినిమా కీర్తి కిరీటంలో అక్కినేని పాదుకొచ్చిన కలికి తురాళ్లు కనిపిస్తాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి మల్టీ స్టారర్లతో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని ఇతోధికంగా పెంచడం కూడా ఆయన చేసిన కృషిలో ఒక భాగం. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పడం, చలన చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించడం... కొన్ని లక్షలమంది కళాకారుల కలలని సాకారం చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. ‘‘అక్షరం నేర్చుకోలేదని బాధ ఉంది’’ అని చెప్తూనే, నిరంతర విద్యార్థిగా తెలుగు, తమిళ, హిందీ, ఉర్దూ్ద, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడడం, రాయడం, నేర్చుకుని, ‘అక్కినేని ఆలోచనలు (అ, ఆలు)’ వంటి వచన కవితా సంపుటిని ప్రచురించడం ఆయనలోని క్రమశిక్షణకి, విద్యారంగం పట్ల గౌరవానికి దర్పణం. ముళ్లపూడి వెంకటరమణ గారన్నట్లు–అక్కినేని నాగేశ్వరరావు / ఎక్కని ఎత్తుల్లేవు / వెళ్లలేని దూరాల్లేవు. ఆయన కీర్తి, ప్రభావం, ప్రతిభ ప్రయాణించే కాలంలో మన జీవిత కాలం ఒక చిన్న మజిలీ మాత్రమే. ఆయనే శాశ్వతం. శతమానం భవతి. అక్కినేని అభిమానులకి ఆయన శత సంవత్సర జయంతి శుభాకాంక్షలు. వి.ఎన్. ఆదిత్య వ్యాసకర్త ప్రముఖ సినీ దర్శకుడు (నేటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం) -
ఘనంగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడి పెళ్లి
-
తెలుగు సినిమాకు పూర్వ వైభవం
-
సినిమాకు మంచి రోజులు
సాక్షి, అమరావతి: తెలుగు సినిమాకు నిజంగా మంచి రోజులొచ్చాయి. ఇటు ప్రేక్షకులకు అందుబాటు ధరలో వినోదాన్ని దగ్గర చేయడంతో పాటు అటు సినీ రంగం అభివృద్ధికి సీఎం జగన్ కొత్త బాటలు వేసే దిశగా అడుగులు ముందుకు వేశారు. సినీ రంగం ఆందోళనకు తెరదించారు. సినిమాలన్నింటికీ ఒకే టికెట్ ధరను అమలు చేయడంతో పాటు చిన్న సినిమాలకు ప్రాణం పోసే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సినీ రంగం వేళ్లూనుకునేలా కీలక ఆఫర్‌ను సినీ ప్రముఖుల ముందు ఉంచారు. విశాఖను సినీ మణిహారంగా తీర్చిదిద్ది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే ఊత కర్రగా నిలిచారు. వెరసి తామంతా కష్టకాలం నుంచి బయట పడినట్లేనని సినీప్రముఖులు హాయిగా ఊపిరి పీల్చుకున్న ఆహ్లాదకర, అరుదైన సన్నివేశం గురువారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కనిపించింది. సినీ రంగానికి సంబంధించి కొద్ది రోజులుగా నలుగుతున్న సమస్యలపై గురువారం సినీ ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. తన ప్రతిపాదనలను సీఎం వారి ముందు ఉంచారు. చిన్న, పెద్ద సినిమాలనే వ్యత్యాసాలను, ఒకరి సినిమాకు ఎక్కువ రేటు.. ఇంకొకరి నినిమాకు తక్కువ రేటు అనే వివక్షకు తావు లేకుండా ఒకే టికెట్ ధర ఉండాలన్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలన్నారు. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేసే వెసులుబాటు ఉండాలని చెప్పారు. ఈ ప్రతిపాదనలను సినీ ప్రముఖులు ఆహ్వానించారు. భేటీకి ముందు.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరల ఖారారుపై సీఎం భారీ కసరత్తు చేశారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి అభిప్రాయాలను తీసుకుని పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నారు. సినీ ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్కడికక్కడే సీఎం కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. చిన్న సినిమాకైనా, పెద్ద సినిమాకైనా ఎవరి సినిమాకైనా ఒకే టికెట్ ధరకు ఐదో షోకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. సీనీప్రముఖుల అభిప్రాయం మేరకే ఏ సినిమాౖకైనా, ఎవ్వరి సినిమాకైనా ఒకే టికెట్ ధర ఉండాలన్నారు. పండుగలకు చిన్న సినిమాల విడుదలకు కూడా అవకాశాలు కల్పించాలని సినీ ప్రముఖులను సీఎం కోరారు. తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు రావాలని, స్డూడియోల ఏర్పాటుకు, ఇళ్ల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు. ఈ నిర్ణయాలపై సీఎంతో సమావేశం సందర్భంగా, విలేకరుల సమావేశంలో సినీ ప్రముఖులందరూ సంతోషం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ మొత్తాన్ని, సినీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. సినిమా టికెట్ ధరలతో పాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి ఈ నెలలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. -
పిల్లలూ దేవుడూ చల్లనివారే...
రోజారమణి ‘భక్త ప్రహ్లాద’ చేస్తే నేటికీ అదొక అద్భుత నటన. ‘లవకుశ’లో లవుడుగా కుశుడుగా ఆ చిన్నారులు చెదిరిపోతారా మస్తిష్కం నుంచి. ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అన్న పద్మినికి ఇన్నేళ్లు వచ్చినా ‘కుట్టి పద్మినే’. గతంలో బాలలు గొప్పగా నటించే పాత్రలు ఉండేవి. బాలల కోసమే తీసే సినిమాలు ఉండేవి. బాలలే నటించగా బాల భారతం వచ్చింది. బాల రామాయణమూ వచ్చింది. బాలల సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేవి. అవన్నీ ఇప్పుడు లేవు. పిల్లల భావోద్వేగాలను చెప్పే సినిమాలు దేవుడెరుగు. పిల్లలకు ఆరోగ్యకరమైన వినోదం అందించే సినిమాలు ఎక్కడ? ఆమిర్‌ఖాన్ తీసిన ‘లగాన్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో 11 మంది గ్రామీణులు బ్రిటిష్ వారి మీద క్రికెట్ ఆడి గెలుస్తారు. ఆ గ్రామీణుల్లో ఒక వయసు మళ్లిన వృద్ధ డాక్టర్ ఉంటాడు. ఒక దళిత వికలాంగుడు ఉంటాడు. చేతి వృత్తుల వారు ఉంటారు. ముస్లిం ఉంటాడు. వీరందరితోపాటు ఈ టీమ్‌కు సపోర్ట్‌గా ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. మేచ్ జరుగుతున్నప్పుడు కీలక ఆటగాడు గాయపడితే ఈ పిల్లవాడే బై రన్నర్‌గా రంగంలో దిగుతాడు. ఈ పాత్రల అల్లిక ఇలా ఎందుకు? దేశం అంటే సమాజం అంటే అందరూ అని. వారిలో పిల్లలూ ఉంటారని. ఇదే ఆమిర్ ఖాన్ డిస్లెక్సియాతో బాధపడే పిల్లల పక్షాన నిలబడి ‘తారే జమీన్ పర్’ తీస్తే ఆ సినిమా గొప్ప ప్రశంసలు పొందింది. అతనికి కలెక్షన్లు కూడా కురిపించింది. తెలుగు సినిమా కూడా ఇలా ఆలోచించగలదు. కాని ఆలోచించడం లేదు. ఘనమైన బాలల పాత్రలు గతంలో తెలుగు సినిమాల్లో బాలల పాత్రలు చాలా గట్టిగా ఉండేవి. వారి మీదే తీసిన సినిమాలూ వచ్చేవి. బాలల కేంద్రంగా ఉన్నా పెద్ద హీరోలు ఆ సినిమాలు చేసేవారు. ఎన్.టి.ఆర్ ‘రాము’, ‘లవకుశ’, ఏ.ఎన్.ఆర్ ‘సుడిగుండాలు’, శోభన్‌బాబు ‘సిసింద్రీ చిట్టిబాబు’, హరనాథ్ ‘లేత మనసులు’ వంటి సినిమాల్లో నటించారు. సావిత్రి పిల్లల కోసమే ‘చిన్నారి పాపలు’ సినిమాను నిర్మించారు. ‘పాపం పసివాడు’ సినిమా ఆ రోజుల్లో మాస్టర్ రాము నటించగా సూపర్‌హిట్ అయ్యింది. పిల్లలే పాత్రలుగా బాలలకు చెప్పాల్సిన కథలు బాలల ద్వారానే చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో తెలుగులో ‘బాల భారతం’ వచ్చింది. భారత కథలోని అన్ని పాత్రలను ఈ సినిమాలో బాలలే ధరించడం విశేషం. ‘మానవుడే మహనీయుడు’ వంటి హిట్ సాంగ్‌ను శ్రీశ్రీ రాశారు. ఆ తర్వాత పిల్లలే అన్ని పాత్రలు పోషించగా భానుమతి రామకృష్ణ ‘భక్తధృవ మార్కండేయ’ తీశారు. కె.ఎస్.ప్రకాశరావు స్వీయదర్శకత్వంలో ‘బాలానందం’, బి.ఆర్.పంతులు దర్శకత్వంలో ‘పిల్లలు తెచ్చిన చల్లనిరాజ్యం’ ఇవన్నీ పిల్లలకూ సినిమాల్లో చోటు ఉందనీ పిల్లలూ సినిమా కథను నడిపించగలవనీ నిరూపించాయి. ఇదే సమయంలో ‘భక్త ప్రహ్లాద’లో రోజారమణి విశేష ప్రతిభ కనపరిచి ప్రహ్లాదునిగా ఘనఖ్యాతి పొందారు. ఇది జరిగిన చాలా రోజులకు నిర్మాత ఎం.ఎస్.రెడ్డి పూనిక మీద గుణశేఖర్ దర్శకత్వంలో ‘బాల రామాయణం’ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రాముడిగా నటించారు. ఈ సమయాలకు అటు ఇటుగా బేబీ షాలినీ ‘బంధం’ వంటి సినిమాలతో వెలిగితే తరుణ్ ‘మనసు మమత’, ‘తేజ’ వంటి సినిమాలతో అలరించాడు. బేబి సుజిత ‘పసివాడి ప్రాణం’తో సినిమాకు ప్రాణం పోసింది. భద్రం కొడుకో కమర్షియల్ సినిమా ఒక ధోరణిలో బాలలకు చోటు కల్పిస్తే తెలుగులో 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ పార్లల్ సినిమాగా బాలల చిత్రాలకు దారి గట్టి పరిచింది. వీధి బాలల సమస్యలను చర్చించిన ఈ సినిమాకు ఓల్గా రచన చేయగా అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న సినిమా ఇది. ఆ తర్వాత అక్కినేని కుటుంబరావు మరికొన్ని బాలల సినిమాలు తీశారు. అయితే ఆ దారిలో ఎక్కువ సినిమాలు రాలేదు. మణిరత్నం తమిళంలో తీయగా తెలుగులో డబ్ అయిన ‘అంజలి’ ఒక రకమైన పిల్లలను లోకానికి చూపితే పిల్లలు తమకు జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నిలబడి ఎదగాలని చెప్పిన గుణ్ణం గంగరాజు ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల్ని పిల్లల్లా చూపుతూ ప్రశంసలు పొందింది. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు బాలల కోసం సినిమా తాను తీయకపోవడం వెలితిగా భావించి బి.నరసింగరావు దర్శకత్వంలో ‘హరివిల్లు’ నిర్మించారు. మారిన ధోరణి 2000 సంవత్సరం తర్వాత తెలుగు సినిమాల్లో పిల్లల పాత్రలు, చేష్టలు పూర్తిగా మారిపోయాయి. వారు పుట్టిన వెంటనే ప్రేమలో పడే స్థాయిలో ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోకడలు పోయాయి. పదేళ్ల లోపే గట్టిగా ప్రేమలో పడుతూ ‘తూనీగా తూనీగా’ అని పాడుకోవడం మొదలెట్టారు. హైస్కూల్ తరగతి గదుల్లో వారి ప్రేమలు కొనసాగాయి. మాస్టర్ భరత్ తమిళం నుంచి వచ్చి హాస్యం పేరుతో పంచ్‌లు వేయడం మొదలుపెట్టాడు. భారతీయ భాషల్లో మెరుగైన బాలల పాత్రలతో సినిమాలు వస్తుంటే అతి చిన్న మార్కెట్ కలిగిన ఇరాన్ సినిమా అద్భుతమైన బాలల చిత్రాలతో ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే మనం ఒక గొప్ప బాలల చిత్రం తీయలేకపోయాం. వారిని అలరించే టైం మిషన్ వంటి సబ్జెక్ట్స్ తీసుకుని ‘ఆదిత్య 369’ వంటి కమర్షియల్ చిత్రాలు కూడా తీయలేకపోతున్నాం. బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. బాలల థియేటర్ కొన్నాళ్లు యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు లేదు. బాలల సినిమాలు రాయితీల వల్ల అయినా తయారయ్యేవి. ఇప్పుడు అవీ లేవు. తెలుగు బాలలూ... మీరిప్పుడు అనుభవిస్తున్నది పసిడి కాలం కానేకాదు... ప్లాస్టిక్ స్క్రీన్ కాలం! ఏం విషాదం ఇది!! బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. వారికి కాసింత వినోదాన్ని పంచుదాం -
మండే మంచుకొండ నాన్న
తిట్టే నాన్న... దండించే నాన్న... కర్ర తీసుకొని వెంటబడే నాన్న... ఎప్పుడూ కోపంగా ఉండే నాన్న.. ఎన్నడూ దగ్గరకు పిలువని నాన్న... కాని ఆ మనసులో మంచుకొండ ఉంటుంది. ఆ గుండెల్లో ఎంతో ఆర్తి ఉంటుంది. ఆ హృదయంలో పిల్లల గురించి బెంగ ఉంటుంది. మధ్యతరగతి నాన్నను సినిమా అప్పుడప్పుడు సరిగ్గా చూపిస్తుంటుంది. ఇటీవలి సినిమా ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ చూసిన ప్రేక్షకులు తమ తండ్రుల కబుర్లలో మునుగుతున్నారు. తెలుగు సినిమాల్లో మధ్యతరగతి నాన్నల స్పెషల్ ఇది. గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలనుకుంటాడు కొడుకు. తండ్రికి ఇంత పొడుగున పొడుచుకొచ్చింది కోపం. ‘ఏం... ఇది హోటలు కాదా... ఇక్కడ సరిగ్గా అఘోరించవచ్చుగా’ అంటాడు పల్లెటూళ్లో తాను నడుపుతున్న హోటల్ని చూపిస్తూ కొడుకును పట్టుకొని. కొడుక్కు మీసాలు వచ్చాయి. కండలు పెరిగాయి. ఏదో నిరూపించాలని అనుకుంటున్నాడు. తండ్రికి జుత్తు నెరిసింది. అనుభవం వచ్చింది. కొడుకు ఎక్కడ నష్టపోతాడో అని సంశయిస్తున్నాడు. కాని ఆ ముక్క మెత్తగా చెప్పడు. ఆ ముక్కను నేరుగా చెప్పడు. తిట్టి కొట్టబోయి అదిలించబోయి చెబుతుంటాడు. కొడుక్కు తండ్రిని చూస్తే ఎంత భయమంటే ఒక్కోసారి ఎదిరించేసేంత భయం. లోకంలో చూసేవారందరికీ ఆ తండ్రికి ముక్కు మీద కోపం అని తెలుస్తూ ఉంటుంది. కాని లోకంలో అందరికీ ఆ తండ్రి మనసులో చాలా ప్రేమ ఉందని కూడా తెలుస్తూ ఉంటుంది. కొడుక్కూ తెలుసు. కాని పైకి జరిగేదంతా నాటకమే. ఇటీవల ‘ఓటిటి’ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో తండ్రి ‘కొండలరావు’ పాత్రను చూసి చాలామంది తమ తండ్రుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గత కాలపు తండ్రి 1980ల ముందు వరకూ మధ్యతరగతి తండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక ప్రశాంతత ఉండేది. కాని 1980ల తర్వాత తండ్రుల మీద ఒత్తిడి పెరిగింది. ఆడపిల్ల అయితే కట్నం టెన్షన్... మగపిల్లాడు అయితే ఉద్యోగం టెన్షన్. బొటాబొటి జీతంతో కుటుంబాన్ని లాగాలంటే ఎలాగో తెలియక తండ్రులు చిర్రుబుర్రుమంటూ ఉండేవారు. వారికి తమ మనసులోని ప్రేమను వ్యక్తం చేసే సమయం ఉండేది కాదు. అలాంటి మూడ్ రేర్‌గా ఉండేది. పిల్లలు ఏం చెప్పాలన్నా తల్లికే చెప్పుకునేవారు. ఈ తండ్రులు 2000 సంవత్సరం తర్వాత ముఖ్యంగా ఈ కాలంలో దాదాపుగా తగ్గిపోయారు గాని ఇవాళ ముప్పైల్లో నలభైల్లో ఉన్నవారంతా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లోని తండ్రులను చూసినవారే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మీసాలు వచ్చినా తండ్రి చేతి దెబ్బలు తిన్నవారే. ‘అమ్మో.. నాన్నొచ్చాడు’ అని ఆయన గుమ్మంలో చెప్పులు విడుస్తుంటే దొడ్డి గుమ్మం నుంచి పారిపోయే కొడుకులు ఉన్నారు. ఆ కాలంలో తండ్రులు ఎక్కువగా కూతుళ్లతో అంతో ఇంతో సంభాషించేవారు. కొడుకులతో నిత్యం ఘర్షణే. ఈ ఘర్షణను ‘ఆకలి రాజ్యం’ సినిమా చూపించింది. ఆ సినిమాలో తండ్రిగా రమణమూర్తి, కొడుకుగా కమల హాసన్ చివరి వరకూ ఘర్షణలోనే ఉంటారు. వారి మధ్య సయోధ్య రాదు. చివరకు ఆ తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కొడుకును తలుచుకుని ‘కూటి కోసం కూలి కోసం’ అని వేదనాభరితంగా పాడతాడు కాని దగ్గర పడితే గుండెలకు హత్తుకోడు. తండ్రుల కన్నీరు తెలుగు సినిమాలలో మిడిల్ క్లాస్ తండ్రులను సహజత్వానికి దగ్గరగా అతి తక్కువ సందర్భాలలో చూపిస్తుంటారు. చిరంజీవి నటించిన ‘మగ మహరాజు’లో ఉదయ భాస్కర్, ‘విజేత’లో సోమయాజులు అలాంటి తండ్రులుగా కనిపిస్తారు. రెండు సినిమాలలోనూ కొడుకుల ప్రయోజకత్వం మీద నమ్మకం లేక ఇంటి భారం తాము మోయాలనుకున్న తండ్రులే వారు. ఆ తర్వాత మధ్యతరగతిలో అతి స్నేహం ప్రదర్శించే త్రివిక్రమ్ మార్కు తండ్రులు (నువ్వే కావాలి), అతి చనువు చూపదగ్గ శ్రీను వైట్ల మార్కు తండ్రులు (ఆనందం), ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకునే పూరి జగన్నాథ్ మార్కు తండ్రులు (ఇడియట్) వచ్చారు. కాని ‘7/జి బృందావన్ కాలనీ’ వచ్చి మిడిల్ క్లాస్ తండ్రి అలాగే భగభగలాడుతున్నాడని చూపించింది. ఆ సినిమాలోని తండ్రి చంద్రమోహన్ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కొడుకు రవికృష్ణ బాధ్యత తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఆ కొడుక్కు ఎంతకూ బాధ్యత తెలియదు. తిట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రమోహన్ చివరకు రవికృష్ణ ఉద్యోగం తెచ్చుకున్నా సరే తిడతాడు. ‘ఇంతకాలం తిట్టాను. కొట్టాను. ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమ చూపిస్తే మా నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే...’ అని భార్య దగ్గర చెప్పి కళ్ల నీళ్లు పెట్టుకునే సన్నివేశం అందరికీ గుర్తుంటుంది. 7/జి బృందావన్ కాలనీ తండ్రి కోపానికి అర్థమే వేరులే ఇళ్లల్లో కూతుళ్లు గుండెల మీద కుంపటిలా కూచుని ఉన్నారు అని గతంలో అనేవారు గాని ఇంకా బాధ్యత తెలుసుకోని కొడుకు అసలైన కుంపటి అని మధ్యతరగతి తండ్రి భావిస్తాడు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో వెంకటేష్ బాధ్యత తెలుసుకోడు. భార్య చనిపోయి ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటున్న తండ్రి గురించి ఆలోచించడు. గాలివాటుకు పోతుంటాడు. ప్రేమగా ఒక్కమాట మాట్లాడింది లేదు. కాని ఆ తండ్రి చనిపోతేనే ఆయన విలువ తెలుసుకుని విలవిలలాడతాడు. ఇక చిన్న కొడుకు ప్రయోజకుడయ్యి పెద్ద కొడుకు వృథాగా ఉంటే ఆ తండ్రి అవస్థ ఎలా ఉంటుందో ‘రఘువరన్’లో చూశాం. నీదీ నాదీ ఒకే కథ తన మర్యాద పోకుండా కొడుకు మర్యాద చెడకుండా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం చాలా కష్టమైన పని అని ఆ తండ్రీ కొడుకులు తెలుసుకుని మాటల్లో చేతల్లో దాగుడుమూతలు ఆడుతూ ఉంటారు. కొడుకును చిన్న మాట అనకుండా ‘మనం కష్టపడ్డాం వాణ్ణన్నా సుఖపడనీ’ అనుకునే తండ్రిని ‘కొత్త బంగారు లోకం’లో, కొడుకులు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారులే అని హాయిగా నవ్వేస్తూ తిరిగే ‘సీతమ్మ వాకిట్లో’... తండ్రిని కూడా చూశాం. కాని మధ్యతరగతి తండ్రికి కొడుకు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, వాటిని అందుకోకపోతే ఆ తండ్రి హర్ట్ అవుతాడని కనీసం వాటి కోసం కొడుకు ప్రయత్నించాల్సిందేనని ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలోని తండ్రి మళ్లీ మనకు చెబుతాడు. అయితే ఆ సినిమాలోని కొడుకు ‘నా స్థాయి ఇంతే. నా బతుకు ఈ మాత్రమే. దానిని నువ్వు స్వీకరించు’ అని చివరి వరకూ డిమాండ్ పెడుతూనే ఉంటాడు. ఫుల్ బనియన్,.. భుజాన టవల్ కాలం ఎంత మారినా ఒంటి మీద ఫుల్ బనియన్, భుజాన టవల్ ఉండే మధ్యతరగతి తండ్రి మారడు. ఆ తండ్రి తన ఇంటిని మర్యాదతో గౌరవంతో నడపడానికి అవస్థ పడక మానడు. పిల్లలు ఎదిగొచ్చి ఆ మధ్యతరగతి మర్యాదలను కొనసాగించాలని, నలుగురిలో ఉన్నంతలో పరువూ మర్యాదతో బతికేలా స్థిరపడాలని తాపత్రయ పడే తండ్రికి కాలదోషం ఉండదు. ఆ తండ్రి నిత్యసజీవుడు. తండ్రులకు కొడుకులు అర్థం కావడం, కొడుకులు తండ్రిని అర్థం చేసుకునే స్థాయికి ఎదగడం కొనసాగుతూనే ఉంటుంది. ఆ నడిమధ్యన కొన్ని పాత్రలు స్క్రీన్ మీద వారిని రిప్రజెంట్ చేసి తళుక్కున మెరుస్తుంటాయి. ఆ క్షణంలో మనకు మన పెరటి చెట్టు కాయ వొకటి తెంపి కొరికినట్టుగా మనసు రుచితో నిండుతుంది. ఇటీవల సినిమా తండ్రులను చూస్తే కలుగుతున్న భావన అదే. – సాక్షి ఫ్యామిలీ -
సినీ పరిశ్రమకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోయి, థియేటర్లు మూసేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘‘రాష్ట్రానికి పరిశ్రమలు తరలిరావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబై, చెన్నైతోపాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ ద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినీ పెద్దలు కలసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వపరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ విడుదల చేసే మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంతో భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం చాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్‌దాస్ నారంగ్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి. కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌రెడ్డి, నిర్మాత నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై సినీ పరిశ్రమ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు. -
డైలాగ్ కింగ్ 45 ఏళ్ల సినీ ప్రయాణం
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు నటుడిగా నేటితో 45 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఇప్పటివరకు 565కి పైగా సినిమాల్లో నటించగా.. 75 సినిమాలను నిర్మించారు. 1974లో వచ్చిన కన్నవారి కలలు, అల్లూరి సీతారామరాజు చిత్రాలతో ఆయన వెండితెరకు పరిచయమ్యారు. విలక్షణమైన నటనతో, డైలాగ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి.. అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాతో కలెక్షన్ కింగ్‌గా రాణించారు. అనంతరం నిర్మాతగానూ మారారు. మోహన్‌బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 45 ఏళ్లుగా సేవలందిస్తున్న దిగ్గజ నటుడికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: హద్దులు చెరిపిన ఆకాశం) -
2019–20 నుంచి నంది అవార్డులు
‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల చిత్రీకరణకు సింగిల్ విండో విధానం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాం. టాలీవుడ్ ప్రముఖులంతా ఏడాదిగా జగన్‌గారిని కలవాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ రోజు కలిశాం’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఈ నెల 15నుంచి చిత్రీకరణలు జరుపుకునేందుకు సీఎం కేసీఆర్‌గారు వెసులుబాటు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రీకరణలకు అనుమతి ఇవ్వాలని జగన్‌గారిని కోరగానే అనుమతి ఇవ్వడం సంతోషం. షూటింగ్‌లకు సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో మినిమమ్ ఫిక్స్డ్ ఛార్జీలు భారంగా మారాయని, వాటిని ఎత్తేయాలని కోరగానే సానుకూలంగా స్పందించినందుకు జగన్‌గారికి కృతజ్ఞతలు. నంది అవార్డుల పంపిణీ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేం ప్రోత్సాహం కోరుకుంటున్నామనగానే 2019–20కి అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే ఆ వేడుక జరుగుతుందనుకుంటున్నాం. సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత రావాలని కోరాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని విన్నవించాం. చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఆయా సినిమాలను బట్టి టికెట్ల ధర పెరుగుతూ ఉంటుంది. దీని మూలంగా పెద్ద బడ్జెట్ పెట్టే నిర్మాతలకి లాభం ఉంటుంది. ఫ్లెక్సీ రేట్లపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. దానివల్ల చిత్ర పరిశ్రమకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. రానున్న రోజుల్లో అధికారులతో మాట్లాడి, మా సినీ పెద్దలతో మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుంది.. ఎక్కడా బ్లాక్ మార్కెట్ అనేది ఉండదు. మేం అడిగిన చాలా విషయాలకు ఆయన సానుకూలంగా స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ ముందుంటానని సీఎం చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారు వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 300 ఎకరాలు భూమి కేటాయించారు.. ఆ భూమి అలాగే ఉంది. దాన్ని మరోసారి పరిశీలిస్తామని జగన్‌గారు అన్నారు. వైజాగ్‌లో సినిమాల నిర్మాణం చేపట్టాలి, స్టూడియోలు నిర్మించాలి, ఔట్ డోర్ యూనిట్లు పెట్టాలనుకునేవారిని అన్ని రకాలుగా ప్రోత్సహించి ఉత్సాహపరిచే విధంగా జగన్‌గారు స్పందించిన తీరు చాలా అభినందనీయం. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం అందరిలోనూ ఉంది. మేం అడిగిన వాటన్నింటికీ సానుకూలంగా స్పందించిన ఆయనకు మా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అన్నారు. దామోదర్ ప్రసాద్, ‘దిల్’రాజు, డి.సురేష్‌బాబు, రాజమౌళి, నాగార్జున, చిరంజీవి, పేర్ని నాని, సి. కల్యాణ్ విశాఖలో స్టూడియోల నిర్మాణానికి అనుమతి – మంత్రి పేర్ని నాని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ– ‘‘సినిమాలకు సంబంధించి ఆన్లైన్లోనే టికెట్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారు ఆదేశించారు. ఆన్లైన్ బుకింగ్ వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు సినీ పరిశ్రమకూ మేలు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి. ఎఫ్డీసీ ద్వారా 2000 సంవత్సరం నుంచి చిన్న సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ పెండింగ్‌లో ఉందని, దాన్ని విడుదల చేయాలని చేసిన వినతికి జగన్‌గారు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్టణంలో సినిమా స్టూడియోలు నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. వైజాగ్‌లో స్టూడియోలు, నివాసాలకు సంబంధించి తామంతా మాట్లాడుకుని మరో మారు చెబుతామని సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జూలై 15 తర్వాత సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వనున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో విధి విధానాలు విడుదల చేయనున్నాం. సినిమాహాళ్ల పునఃప్రారంభం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచే ఉంటుంది. కరోనా లాక్డౌన్ సమయంలో సినిమా థియేటర్లు ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని, వాటిని రద్దు చేయాలని సినీ ప్రముఖులు కోరగా జగన్‌గారు అంగీకరించారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినందుకు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు’’ అన్నారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటీలో చిరంజీవితో పాటు హీరో నాగార్జున, నిర్మాతలు సురేశ్ బాబు, సి, కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ‘దిల్’ రాజు, డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
బాలయ్య వ్యాఖ్యల దుమారం.. కళ్యాణ్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు టాలీవుడ్‌లోనూ ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో సినీ పెద్దలు బాలయ్యను పట్టించుకోవడం లేదని, సినీ ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ తాజాగా స్పందించారు. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..) ‘ప్రస్తుతం నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయడం లేదు. అవసరమైనప్పుడు బాలయ్య మాతో చర్చల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు జరిగిన ప్రతీ విషయాన్ని బాలయ్యకు నేనే స్వయంగా చెప్పాను. ఇండస్ట్రీ అంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు. ఇండస్ట్రీలో ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంది’ అంటూ సి. కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశమైన విషయం తెలిసిందే. (సినిమా పరిశ్రమ బతకాలి: కేసీఆర్) -
బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెలుగు సినీ పెద్దల సమావేశంపై హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదన్నారు. పత్రికలు, మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోందన్నారు. షూటింగ్‌లు త్వరలో ప్రారంభమైతే మంచిదన్నారు. తక్కువ మంది సిబ్బందితో, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్‌లు జరుపుకోవాల్సి ఉంటుందన్నారు. (చదవండి : సినిమా పరిశ్రమ బతకాలి) కాగా, లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు పలువురు సినిమా రంగ ప్రముఖులు మే 22న కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. (చదవండి : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ) -
‘సినీ లైంగిక వేధింపుల’పై కమిటీ మాటేమిటి?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ లో మహిళా కళాకారుల పై లైంగిక వేధింపుల నివారణ, విచారణ, వారి సంక్షేమం తదితర అంశాలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశ పురోగతిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమకారిణి సంధ్యారాణి, మహిళా హక్కుల కోసం ఉద్యమించే ఇతరులు దాఖలు చేసిన పిల్ మంగళవారం మరోసారి హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ అంశంపై ఏప్రిల్ 21న మంత్రి సమావేశాన్ని నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సమావేశ పురోగతిని తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తెలుగు ఫిల్మ్ చాం బర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
‘సినీ లైంగిక వేధింపుల’ కేసులో సర్కార్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా కళాకారులపై లైంగిక వేధింపులు–దోపిడీలకు సంబంధించి చట్టంలో వచ్చిన మార్పుల గురించి, వాటి అమలు తీరు గురించి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపులు–దోపిడీల ఆరోపణలపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సామాజిక ఉద్యమకారిణి సంధ్యారాణి, మహిళా హక్కులపై పనిచేస్తున్న మరో ఆరుగురు ఉద్యమకారులు సంయుక్తంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళాశిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక శాఖ కమిషనర్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపించారు.‘తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఒక కళాకారిణి రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది. వీటిపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతివాదులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది’అని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు కమిటీ లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ లైంగిక వేధింపుల నివారణకు చట్టాలు ఏం చెబుతున్నాయో.. వాటి అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో న్యాయ సేవాధికార సంస్థ సేవల్ని వినియోగించుకోవాలని హోం శాఖను ఆదేశించింది. సుమోటోగా ఆ సంస్థ సభ్యకార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. తెలంగాణ మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నిం చింది. ఇలాంటి ఆరోపణలపై అంతర్గత కమిటీలు ఇతర చోట్లా లేవని కోర్టు అభిప్రాయపడింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసింది. -
సినీరంగంలోని పెద్దలను కాపాడేందుకు..
పంజగుట్ట: సినీరంగంలోని పెద్దలను కాపాడేందుకు మహిళలను పణంగా పెట్టడం దారుణమని మహిళా సంఘాల నేతలు అన్నారు. శ్రీరెడ్డి తనకు అన్యాయం చేసినవారి వివరాలు పూర్తి ఆధారాలతో బయటపెట్టిన నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు అంతర్గత కమిటీ వేయాలని, ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. సినీపరిశ్రమలో లైంగిక దాడులను అరికట్టాలని కోరుతూ బుధవారం రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహిళా సంఘాల నేతలు సంధ్య, జ్యోతి, దేవి, జాన్సీ, సజయ, రత్న, ఆశాలత, అపూర్వ, సత్యవతి, లక్ష్మి మాట్లాడుతూ ..సినిమారంగంలో విపరీతమైన లైంగిక దోపిడీ జరుగుతుందని, చిన్నచిన్న అవకాశాలు ఇచ్చేందుకు కూడా మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. శ్రీరెడ్డి ధైర్యం చేసి బయటకు వచ్చిందని, బాధితులు ఎంతోమంది ఉన్నారన్నారు. నిజంగా వారు కళామ్మతల్లి బిడ్డలే అయితే అదే కళామ్మతల్లికి చెందిన ఆడబిడ్డలను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ కాదని, తెలుగు ఫ్యూడల్, తెలుగు రేప్ ఇండస్ట్రీగా పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పెద్ద హీరోలు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లైంగిక వేధింపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిరోధించడానికి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, మహిళా సంఘాలతో కూడిన హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరెడ్డిపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, ఆమె ఆరోపించినట్లుగా హింసాపూరిత చర్యలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మహిళా సంఘాల ప్రతినిధులు -
పత్రికారంగంలో కొత్త ‘ఉదయం’
-
పత్రికారంగంలో కొత్త ‘ఉదయం’
1984లో సంచలన పత్రికకు శ్రీకారం చుట్టిన దాసరి ప్రజాతంత్ర శక్తుల చేతుల్లో కరదీపికగా వెలిగిన ఉదయం ఆర్థిక కష్టాలతో ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి చేతుల్లోకి.. ఆ తర్వాత మూత ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రతిపాదించింది కూడా దాసరే.. సాక్షి, అమరావతి: తెలుగు పత్రికారంగంలో ఒక సంచలనం ‘ఉదయం’ దినపత్రిక. సినీ దర్శకుడిగా ఉంటూనే రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల మక్కువ కలిగిన దాసరి 1984 డిసెంబర్ 29న ఈ సంచలన పత్రికకు శ్రీకారం చుట్టారు. అప్పటికే పత్రికారంగంలో లబ్ధ ప్రతిష్టుడిగా పేరుపొందిన ఏబీకే ప్రసాద్ ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. అన్ని వర్గాలు ప్రత్యేకించి బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు గొంతుకగా ఈ పత్రిక నిలిచింది. అవినీతిపై తిరుగు బావుటా ఎగరేసింది. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల చేతుల్లో కరదీపికగా నిలిచింది. అయితే పత్రికా నిర్వహణ భారం కావడంతో.. దాసరి చేతుల నుంచి నెల్లూరుకు చెందిన నాటి ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి చేతుల్లోకి వెళ్లి, తదనంతరం మూతపడింది. ఈ పత్రికను తిరిగి తీసుకొచ్చేందుకు దాసరి ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఉదయం మాదిరిగానే చిత్రపరిశ్రమ కోసం తీసుకొచ్చిన మరో సంచలనం శివరంజని, మేఘసందేశం కాగా, రాజకీయాల కోసం బొబ్బిలిపులి పేరుతో వారపత్రికను ఆయన నిర్వహించారు. ‘బాబుగారూ.. మా ప్రతిపాదన పట్టించుకోండి..’ అది 1999. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సినీ ప్రముఖలతో సమావేశం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాసరి నారాయణ రావు, ఆయన సతీమణి దాసరి పద్మ ఇద్దరూ వేదికపై ఉన్నారు. పద్మ మాట్లాడిన అనంతరం మైక్ తీసుకున్న దాసరి ‘‘చంద్రబాబునాయుడు గారూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే.. మా మిత్రుడైన ఎన్టీ రామారావుకు భారతరత్న ఇప్పించండి. కేంద్రంలో మీరు మద్దతు ఇస్తున్న పార్టీలు అధికారంలో ఉన్నాయి. మీకు చాలా బలముంది అని చెబుతున్నారు కనుక మా ఈ పత్రిపాదను సీరియస్‌గా పట్టించుకోండి..’’ అని సూచించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కంటే ముందే చెప్పిన వ్యక్తి దాసరి అంటూ పలువురి సినీ, రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. నెరవేరని దాసరి కల దాసరి తన చివరి కోరికగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై సినిమా తీయాలనుకున్నారు. కొన్నాళ్లుగా దాసరి ఈ చిత్రంపై పలువురితో చర్చించినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దానికి ‘అమ్మ’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కల్యాణ్‌తో కలిసి ఒక సినిమా తీయాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ దాసరి మరణంతో ఈ ప్రతిపాదనలను ఆగిపోయాయి. చిన్న చిత్రాలను ఆదుకునేవాడు చిన్న చిత్రాలను ప్రోత్సహించడంలో దాసరి ఎప్పుడూ ముందుండేవారు. సినిమాలు తీసి రిలీజ్ చేయలేక ఆగిపోయిన ఎన్నో చిత్రాలను సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విడుదల చేయించారు. అంతేకాదు చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలకు మద్దతుగా బహిరంగంగా పెద్ద నిర్మాతలను విమర్శించడానికి కూడా వెనుకాడలేదు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు పోటీగా విశ్వామిత్ర అనే సీరియల్‌ను తీసి జాతీయస్థాయిలో దాసరి నారాయణ రావు ప్రసారం చేయించారు. భోజనం పెట్టడమంటే అమితాసక్తి.. స్వతహాగా భోజన ప్రియుడైన దాసరి.. తనతో పాటు అనేకమందికి స్వయంగా భోజనాలు పెట్టేవారు. తన డైనింగ్ టేబుల్‌పై ఉన్న 12 సీట్లు నిండితే కాని ఆయన భోజనం తినడానికి ఇష్టపడేవారు కారు. అందులో కూడా కనీసం నాలుగైదు రకాల నాన్ వెజ్ వంటకాలు ఉండేలా చూసేవారు. అలాగే రాజకీయ, సినీ రంగంలో పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా సాయం కోసం వచ్చిన వారందరినీ ఆదుకునే లక్షణమే ఆయనకు ఇంతమంది అభిమానులను సమకూర్చింది. ఉద్యోగులతో కలిసే భోజనం.. దాసరి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఉద్యోగులు అది విజయవాడ బందరు రోడ్డులోని ఉదయం దినపత్రిక కార్యాలయం.. పత్రిక అధిపతి చెన్నై నుంచి వచ్చి ఉద్యోగులతో సమావేశమయ్యారు. తర్వాత అక్కడే భోజనానికి ఉపక్రమించారు. ఏసీ గదిలో ప్రత్యేకంగా భోజనం చేస్తారని అంతా భావించారు. కానీ తన ఛాంబర్ పక్కనున్న హాలులో భోజనానికి కూర్చున్నారు. తనతోపాటు ఉద్యోగులందరినీ భోజనానికి పిలిపించారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగులంతా ఆయనతో కలసి భోజనం చేశారు. అప్పట్లో రాష్ట్రమంతా సంచలనం సృష్టిస్తున్న పత్రికకు ఆయన అధిపతి. అంతేకాదు సినీ వినీలాకాశంలో అగ్రజుడు. ఆయన్ను ఒకసారి చూస్తే చాలనుకునేవారు ఎంతోమంది. అలాంటి వ్యక్తి తమతో కలసి భోజనం చేయడంతో ఉద్యోగులు ఆనందానికి అవధులు లేవు. ఆయన ఎవరో కాదు దర్శకరత్న దాసరి నారాయణరావు. అప్పుడే కాదు ఆయన ఎప్పుడు ఉదయం కార్యాలయానికి వచ్చినా ఉద్యోగులతో కలిసే భోజనం చేసేవారు. ఈ విషయాన్ని ఉదయంలో పనిచేసిన పలువురు ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు. దిగ్భ్రాంతి కలిగించింది సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి అకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదర్శప్రాయుడు దర్శకరత్న దాసరి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలో ఎంతోమందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడు. దాసరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలుగు సినిమా మూలస్తంభాన్ని కోల్పోయింది దాసరి మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు సినీ రంగం మూలస్తంభాన్ని కోల్పోయింది. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – ఏపీ సీఎం చంద్రబాబు తీరని లోటు దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. సినిమా రంగంలో ఆయన ఒక యుగకర్త. దశాబ్దాలపాటు సినీ రంగానికి పెద్ద దిక్కుగా నిలిచారు. రికార్డు స్థాయిలో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడు. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, పత్రికాధిపతిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినీ రంగంలో విప్లవం సృష్టించారు. కథే హీరోగా తిరుగులేని చిత్రాలు నిర్మించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఎందరో నటులను, నటీమణులను, కళాకారులను పెంచి పోషించి, తర్ఫీదునిచ్చి చిత్ర పరిశ్రమకు అందించిన దాసరి మృతి బాధాకరం. చిత్ర పరిశ్రమకు లోటు పూడ్చలేనిది. – కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొత్త తరాన్ని సృష్టించారు దాసరి మృతి చిత్ర రంగానికి తీరని లోటు. సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో విశేష కృషి చేసిన ఆయన వాటిలో కొత్త తరాన్ని సృష్టించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. – పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అజరామర కీర్తి దాసరి మృతి తెలుగు ప్రజలకు, సినీ రంగానికి తీరని లోటు. ఉదయం పత్రిక ద్వారా బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచి ఎందరికో ఆయన మార్గదర్శకులుగా నిలిచారు. ఆయన చిత్రాలు శాశ్వతంగా నిలుస్తాయి. – కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సినీ పరిశ్రమకు దాసరితోనే విలువ సినీ పరిశ్రమకు శిఖరం లాంటివారు దాసరి. గొప్ప సృజన ఉన్న డైరెక్టర్. విప్లవాత్మక సినిమాలు తీశారు. ప్రతి సినిమాలోనూ సమాజానికి సందేశం ఇచ్చేవారు. దాసరి రాకతోనే సినీ పరిశ్రమకు ఒక విలువ వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. – నందమూరి లక్ష్మీపార్వతి పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది ఎన్టీఆర్, అక్కినేని, దాసరి లేని సినీ పరిశ్రమను ఊహించుకోలేం. నిర్మాతల సంఘం పెద్ద దిక్కును కోల్పోయింది. సినీ రంగం వారంతా గురువు గారూ అని పిలుచుకొనే మహామనిషి ఇకలేరంటే నమ్మలేకపోతున్నాం. – తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ పి.రామకృష్ణ గౌడ్ ఆయనతో నాకు చిరకాల మైత్రి దాసరి సినీ దిగ్గజం. చిత్రసీమకు ఆయన లోటు తీర్చలేనిది. దాసరితో నాది చిరకాల మైత్రి. తాతమనుమడు చిత్రానికి ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం’ పాట దగ్గర ఉండి నాతో రాయించుకున్నాడు. ఆ పాటతో ఆ సినిమాకు, నాకు మంచి పేరొచ్చింది. తూర్పు పడమర, ఒసేయ్ రాములమ్మ సినిమాల్లో టైటిల్ సాంగ్స్... ఇలా ఒకటా దాసరి సినిమాలెన్నింటికో పాటలు రాశాను. దాసరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – డాక్టర్ సి.నారాయణ రెడ్డి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దాసరి మృతి పట్ల డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ డి.శ్రీనివాస్, వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి తదితరులు కూడా సంతాపం వెలిబుచ్చారు. నాటక రంగమంటే ఎంతో ఇష్టం మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న సాయిరాజు పొగాకు వ్యాపారం చేస్తూ మమ్మల్ని కష్టపడి చదివించారు. మా తమ్ముడు దాసరి నారాయణరావు చిన్నతనం నుంచే చదువుతోపాటు నాటక రంగాన్ని ప్రేమించేవాడు. మేం తిట్టినా వినిపించుకునే వాడు కాదు. ఎప్పుడూ.. ఏవో నాటకాలు రాస్తూనే ఉండేవాడు. మేం కలలో కూడా ఊహించని స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉండేది. వాడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నాం. – దాసరి రెండో అన్న సత్యనారాయణ ఆయనో ఎవరెస్ట్.. దాసరిది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అన్నట్టుగా దాసరికి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. ఆయనో ఎవరెస్ట్. ఆ మహానుభావుడి మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో నాలాంటి పేద, బడుగు బలహీన వర్గాలవారి సినీ ఆశయాలను కుల, మత, ప్రాంతాలు చూడకుండా నెరవేర్చిన మహనీయుడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి అంబేద్కర్ ఆయన. – ఆర్. నారాయణమూర్తి ఎవరూ భర్తీ చేయలేరు.. నేను కోడి రామకృష్ణ శిష్యుణ్ణి. దాసరేమో కోడి రామకృష్ణ గురువు. దాసరి వద్ద పని చేయని దర్శకులు కూడా ఆయన్ను ద్రోణాచార్యునిగా ఫీలవుతారు. పరిశ్రమలో దాసరి స్థానం భర్తీ చేయడానికి ఎవరూ లేరు. – దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ అల్లు రామలింగయ్య అవార్డు అందజేసేం దుకు మే 4న దాసరి పుట్టినరోజున ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. అదే ఆయన్ను చివరి సారిగా చూడటం. నా జీవితంలో ఆయన స్మృతులను ఎప్పటికీ మరవలేను. ప్రస్తుతం చైనాలో ఉన్నాను. దాసరి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరవలేనివి. – చిరంజీవి షూటింగ్ నిమిత్తం పోర్చుగల్‌లో ఉన్న నన్ను దాసరి మరణ వార్త షాక్‌కు గురి చేసింది. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. తెలుగు సినిమా గమనానికి కొత్త దారి చూపిన మహానుభావుడు దాసరి. మా కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు. – నందమూరి బాలకృష్ణ దాసరి నాకు అత్యంత ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, మంచి స్నేహితుడు. దేశంలోనే ప్రముఖ దర్శకుల్లోనే ఒకరైన ఆయన మృతి సినీ కళామతల్లికి తీరని లోటు. ఆయన కుటుంబా నికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. – రజనీకాంత్ దాసరి మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. కె.బాలచందరే దాసరిని చూసి స్ఫూర్తి పొందారు. అలాంటి దాసరి మృతికి నా ప్రగాఢ సంతాపం. – కమల్‌హాసన్ ప్రఖ్యాత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది – ఏఆర్ మురుగదాస్, సినీ దర్శకుడు మాటలు రావడం లేదు. మా అంకుల్ ఇక లేరంటే ఆ షాక్‌లో నుంచి కోలుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – విజయశాంతి -
బడా నిర్మాతలు...ఛోటా సినిమాలు!
గది నిండా కాసులే ! సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ‘రాజుగారి గది’ గుర్తుందా? తన తమ్ముడు అశ్విన్‌ని హీరోగా పెట్టి ఓంకార్ డెరైక్ట్ చేసిన సినిమా ఇది. సినిమా అయితే బాగానే తీశాడు కానీ, రిలీజ్ చేయడం ఎలా? నిర్మాత సాయి కొర్రపాటి సీన్లోకి రావడంతో సమస్య సాల్వ్ అయిపోయింది. ఈ సినిమా మీద నమ్మకంతో ఆయన రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్. ‘రాజుగారి గది’లో డబ్బులే డబ్బులు. మరి, సాయి కొర్రపాటి ఏమైనా చిన్న నిర్మాతా? కాదు.. టెక్నికల్ వండర్ ‘ఈగ’ తీశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా ‘లెజెండ్’ నిర్మాతల్లో ఆయనా ఒకరు. ఇలాంటి బడా చిత్రాల నిర్మాత అయినా ఛోటా సినిమాలంటే ఆయనకు మక్కువ. అందుకే తన వారాహి చలన చిత్రమ్ బేనర్లో స్మాల్, మీడియమ్ బడ్జెట్ సినిమాలు తీస్తుం టారు. ఇరవై, నలభై కోట్లతో సినిమాలు తీసే సాయి రెండు కోట్లలోపు స్మాల్ బడ్జెట్ సినిమాలూ తీస్తుండడం విశేషం. కొత్త ఊపిరి ఒక్క హిట్ చూశాక మనసు ఆగదు. ఆ హిట్‌ని కొనసాగించాలనుకుంటారు. అందుకే ‘రాజుగారి గది’కి సీక్వెల్ చేయాలనుకున్నారు ఓంకార్. మొదటి భాగానికి సాయి కొర్రపాటి అండగా నిలిస్తే... రెండో భాగానికి ఎవరి సపోర్ట్ దొరికిందో తెలుసా? పొట్లూరి వి. ప్రసాద్ (పీవీపీ). ఆయన తీసినవి మామూలు సినిమాలు కాదు. ‘బలుపు, వర్ణ, సైజ్ జీరో, ఊపిరి, బ్రహ్మోత్సవం’... ఇలా అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. ఇప్పుడేమో తెలుగు, హిందీ భాషల్లో ‘ఘాజి’ అనే సినిమా తీస్తున్నారు. భారతీయ భాషల్లో తొలి జలాంతర్గామి నేపథ్య సినిమా ఇది. మొత్తం నీటి లోపలే ఉంటుంది. చాలా పెద్ద బడ్జెట్. ఈ సినిమా తీస్తూనే కథ నచ్చి, చిన్న బడ్జెట్ ‘క్షణం’ చిత్రానికి అండగా నిలిచారు. తీసినవాళ్ళకీ, కొన్న పీవీపీకీ దిల్ ఖుష్ చేసిన సినిమా ఇది. అదే ఊపుతో ఇప్పుడు ‘రాజుగారి గది 2’కి పీవీపీ సపోర్ట్ చేస్తున్నారు. అలా చిన్న సినిమాలకు ఈ పెద్ద నిర్మాత ఊపిరి అవుతున్నారు. బిగ్ హెల్ప్ సరే.. సాయి కొర్రపాటి, పీవీపీ అంటే ఇప్పుడొచ్చినోళ్లు. ఎప్పట్నుంచో బడా నిర్మాతల్లో ఒకరిగా ఉంటున్న డి.సురేశ్‌బాబు కూడా చిన్న సినిమాపై మొగ్గు చూపడం విశేషం. ‘పెళ్లి చూపులు’ అనే చిన్ని సినిమాకి సురేశ్‌బాబు చేసిన సపోర్ట్ చాలా ఉపయోగపడింది. ఈ సినిమా విడుదలై దాదాపు మూడు నెలలవుతున్నా ఇంకా వార్తల్లోనే ఉంది. ‘పెళ్లి చూపులు’ స్ఫూర్తితో మరిన్ని చిన్న సినిమాలు మొదలయ్యాయి. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాకి సురేశ్ ప్రొడక్షన్స్ బేనర్ తోడవ్వడం పెద్ద హెల్ప్. ఈ బేనర్‌కి ఉన్న రేంజ్ అలాంటిది. ఈ బేనర్‌పై ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి పెద్ద పెద్ద హీరోలతో బిగ్ బడ్జెట్ మూవీస్ ప్రొడ్యూస్ చేశారు డి. రామానాయుడు. అలాగే చిన్న సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు సురేశ్‌బాబు కూడా ఒకవైపు పెద్ద సినిమాలు, మరోవైపు చిన్న సినిమాలు తీసి, తండ్రిని ఫాలో అవుతున్నారు. దిల్ ఉన్న రాజు ‘వెళ్లిపోమాకే’... ఈ సినిమా రెండేళ్లుగా నిర్మాణంలో ఉంది. కానీ, వెలుగులోకి రాలేదు. ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దానికి కారణం ‘మీ సినిమాని నేను రిలీజ్ చేస్తా’ అని ‘దిల్’ రాజు ముందుకు రావడమే. పంపిణీదారుడిగా పలు బిగ్, మీడియమ్, స్మాల్ మూవీస్‌ని విడుదల చేశారు ‘దిల్’ రాజు. నిర్మాతగా పెద్ద సినిమాలు తీశారు. ఇప్పుడు ‘వెళ్లిపోమాకే’ సినిమా మీద నమ్మకంతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రనిర్మాతలకు పెద్ద దిల్‌తో సహాయం చేస్తున్నారు. అలా ఇప్పుడు ఛోటా సినిమాలెన్నో బడా నిర్మాతల అండతో బాక్సాఫీస్ దగ్గర బడా సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా అంటే? చిన్న సినిమా అంటే ఏంటి? ఎంతలో తీస్తారు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఏమీ లేదండి.. కోటి రూపాయల నుంచి రెండు కోట్ల లోపు తీసేవాటిని చిన్న సినిమాలంటారు. ఈ బడ్జెట్ బడా నిర్మాతలకు చాలా ఛోటా. సునాయాసంగా తీసేస్తారు. అఫ్కోర్స్ డబ్బుంటే కొత్తవాళ్లైనా సులువుగానే తీసేస్తారు. కాకపోతే.. బడా నిర్మాత తీస్తే.. ప్రమోషన్ ఈజీ అవుతుంది. సినిమా విడుదలకు ముందే నలుగురికీ తెలుస్తుంది. అదే చిన్నవాళ్లు తీస్తే.. సినిమా రిలీజై, బాగుందనే టాక్ వస్తేనే.. అప్పుడు జనాలు థియేటర్‌కి వస్తారు. సో.. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీయడం మంచిదే. ముఖ్యంగా లాభాలొచ్చే సినిమాలు తీస్తే.. కొన్నవాళ్ల పంట పండినట్లే. ‘ఉయ్యాల జంపాల’... రాజ్ తరుణ్, అవికా గోర్‌కు హీరో హీరోయిన్లుగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టి, పెద్ద సినిమాగా నిలవడంతో.. ఆ తర్వాత చాలామంది చిన్న సినిమాలు నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా నిర్మించింది చిన్న బేనరేం కాదు. అక్కినేని కుటుంబపు అన్నపూర్ణ స్టూడియోస్. సురేశ్ ప్రొడక్షన్స్‌కి ఉన్నంత పేరు అన్నపూర్ణకి ఉంది. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాగార్జున చిన్న సినిమాలు కూడా తీస్తుంటారు. అలా పి. రామ్మోహన్‌తో కలసి ‘ఉయ్యాల జంపాల’ తీశారు. ‘అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్’ వంటి మంచి మంచి సినిమాలు తీసిన రామ్మోహన్ ఇప్పుడు ‘పిట్టగోడ’ తీస్తున్నారు. మరి.. ఈ సినిమా రిలీజ్‌కు కూడా ఏదో ఒక పెద్ద బేనర్ ముందుకొచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. - సినిమా డెస్క్ -
చిత్రనగరిగా భాగ్యనగరం
* ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉద్ఘాటన * హైదరాబాద్‌ను సినిమా రంగానికి ఆలవాలంగా మారుస్తాం * బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు ఏఎన్నార్ జాతీయ పురస్కారం ప్రదానం చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో సుస్థిరంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. భాగ్యనగరాన్ని తెలుగు చిత్ర రంగానికి ఆలవాలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అక్కినేని జాతీయ పురస్కారాన్ని బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌కు ప్రదానం చేశారు. శనివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఇంతకు వంద రెట్లు అభివృద్ధి చెందాల్సి ఉంది. ఇందుకు త్వరలోనే పరిశ్రమ ప్రముఖులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నం. చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం అనుసరించాల్సిన చర్య లు, అందించాల్సిన రాయితీలు తదితరాలపై అం దులో సమగ్రంగా చర్చిస్తం. వారి సూచనలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తాం’’ అని చెప్పా రు. చిత్ర పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్న నగర నేత తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఇదే ఉద్దేశంతో సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించామన్నా రు. ‘ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు జరిగిం ది. ఇక దర్జాగా పాలన సాగబోతోంది’ అన్నారు. వారు సాటిలేని మేటి నటులు భారతదేశ నటుల్లో అక్కినేని, అమితాబ్ సాటిలేని మేటి నటులని సీఎం కొనియాడారు. హైదరాబాద్‌కు తెలుగు సినీపరిశ్రమ తరలి రావడానికి అక్కినేనే ముఖ్య కారకులనేది చారిత్రక సత్యమన్నారు. తొలుత నగరంలోని చికోటి గార్డెన్స్‌కు వచ్చి సినీ పరిశ్రమ తరలేందుకు ఆయన పునాది వేశారని, ఆ తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కు నివాసాన్ని మార్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన వల్ల ఇప్పుడు ముంబై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సినిమాలు రూపొందే స్థితి వచ్చిందన్నారు. అలసటగా ఉంటే ‘అభిమాన్’ చూస్తా అద్భుత నటనా కౌశలాన్ని పుణికి పుచ్చుకున్న అమితాబ్ గురించి తాను కొత్తగా చెప్పేదేమీ లేదని, ఆయన సింగర్గాకనిపించే ‘అభిమాన్’ సినిమా అంటే తనకు అత్యంత ఇష్టమని కేసీఆర్ చెప్పారు. ‘‘పని ఒత్తిడితో నాకు అలసటగా అనిపిస్తే అభిమాన్ సినిమా చూస్తా. ఇప్పటికే యాభైసార్లు చూసి ఉంటాను’’ అని అన్నారు. ఏడు పదుల వయసులో కూడా అమితాబ్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ తగ్గలేదని, అది ఆయన గొప్పతనమని కొనియాడారు. ఒక పద్మభూషణుడి పేరుతో ఉన్న అవార్డును మరో పద్మభూషణుడికి తన చేతులతో అందించడం ఆనందంగా ఉందన్నారు. ‘ఏ’ ఆయనే.. ‘బీ’ ఆయనే: వెంకయ్య తెలుగు చిత్రరంగంలో బెంచ్‌మార్క్‌గా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అయితే... హిందీ చిత్రపరిశ్రమలో ఆ స్థానం అమితాబ్కే దక్కుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హీరో అంటే ముందుగా గుర్తుకువచ్చే వ్యక్తి అమితాబ్ అని, చిత్ర రంగంలో ‘ఏ’ ఆయనే, ‘బీ’ ఆయనే (అమితాబ్ బచ్చన్ పేరు సంక్షిప్త రూపం) అని అన్నారు. ఎవరైనా ఉంటే ‘సీ’గా ఉండాల్సిందేనని చమత్కరించారు. స్వరం సరిగాలేదంటూ ఆదిలో ఆలిండియా రేడియో తిరస్కరిస్తే ఆ స్వరాన్నే వరంగా మార్చుకుని సినిమారంగంలో అగ్రహీరోగా మారిన నటుడు అమితాబ్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు కొందరిని దూరం చేసుకుంటారని, కానీ ఆయన ఆ పనిచేయకుండా సినిమాల్లోకి వచ్చి అందరికీ దగ్గరయ్యారన్నారు. 91 ఏళ్ల జీవితంలో 75 ఏళ్లు నటుడిగా కొనసాగిన ఏకైన వ్యక్తిగా అక్కినేని చరిత్రలో నిలిచిపోతారని కీర్తించారు. అప్పట్లో సినిమా చూస్తుంటే మనసు ఉల్లాసంగా ఉండేదని, ఇప్పుడు సంగీతం, సాహిత్యం తక్కువ... వాయిద్యం వాయింపు ఎక్కువగా ఉందన్నారు. శృంగారాన్ని కళ్లు, నటన, మాటలు, ముఖ కవళికలతో అక్కినేని పలికించేవారని, కానీ ఇప్పుడు తాకి, తొ క్కి, తిరగేసి, కిందపడేసి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అసభ్యత తగ్గాలన్నారు. జలగం గుర్తొస్తున్నారు: సుబ్బరామిరెడ్డి రాచకొండను అద్భుత చిత్రనగరిగా రూపొందిం చేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే... తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు తరలేందుకు ఎంతో కృషి చేసిన అప్పటి సీఎం జలగం వెంగళరావు గుర్తుకొస్తున్నారని ఎంపీ సుబ్బరామిరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌తో బిగ్‌బీ భేటీ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బేగంపేటలోని సీఎం అధికార నివాసంలో బిగ్‌బీ.. సీఎంను కలుసుకున్నారు. అమితాబ్ వెంట సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉన్నారు. దాదాపు అర గంటపాటు వీరు పలు అంశాలపై చర్చించుకున్నట్లు తెలిసింది. మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు వచ్చిన అమితాబ్‌ను కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అమితాబ్‌తో జరిగిన భేటీలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కూతురు, ఎంపీ కవిత కూడా ఉన్నారు. లాఠీచార్జి తర్వాత చీపురుపుల్లతో కొట్టినట్టు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి మాట్లాడిన తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. స్వతహాగా ప్రాసలు, విరుపులతో వెంకయ్య మాట్లాడగా... సుబ్బరామిరెడ్డి తన ప్రసంగంలో శివుడి శ్లోకాలను పఠించారు. దీంతో కేసీఆర్ మైకువద్దకు వస్తూనే ‘‘సుబ్బరామిరెడ్డి శ్లోకాలు, వెంకయ్యనాయుడి ప్రాసలు విన్న తర్వాత నేను మాట్లాడితే పోలీసు లాఠీచార్జి తర్వాత చీపురుపుల్లతో కొట్టినట్టు ఉంటుంది వ్యవహారం’’ అని చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి. మరవలేను: అమితాబ్ దేశం గర్వించదగ్గ అక్కినేని పేరుతో ఉన్న పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని అమితాబ్ అన్నారు. చలనచిత్ర రంగానికి అక్కినేని హుందాతనాన్ని తెచ్చారని, నటుడిగా గొప్ప స్థానంలో ఉండి కూడా సాధారణ జీవితాన్ని గడిపి... ఒదిగి ఉండే లక్షణాన్ని మనకు నేర్పారని అన్నారు. ఆయన జీవితాన్ని ఓ పాఠంగా చదువుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉందన్నారు. ఆయనలాంటి వారి వల్ల తెలుగు చిత్రసీమ ఇప్పుడు దేశంలో గొప్పగా వర్ధిల్లుతోందన్నారు. సమాజానికి ఎంతో చేయాలని ఆయన తపించారన్నారు. ఆ తత్వం న టులకి అవసరమని, అందుకే పోలి యో నిర్మూలనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారకర్తగా పనిచేశానని చెప్పారు. అలాగే టీబీని కూడా దేశం నుంచి తరమాల్సిన అవసరం ఉందని, దాని బాధేంటో తాను స్వయంగా అనుభవించానని పేర్కొన్నారు. అక్కినేని వారసులు ఆయన ఆశయాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. తెలుగు చిత్రరంగ అభివృద్ధికి తన వంతు సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధమని ప్రకటించారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయని, అక్కినేని లాంటి లెజెండ్స్ తెలుగు పరిశ్రమ నుంచి రావాలని ఆకాంక్షించారు. -
'చాలా ఏళ్ల తర్వాత మనసారా నవ్వుకున్నా'
హైదరాబాద్: మేము సైతం కార్యక్రమం ద్వారా సేకరించిన ప్రతి పైసా హుద్ హుద్ తుపాను బాధితులకు వినియోగిస్తామని సినీ నటుడు చిరంజీవి చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయపడేందుకు తమ బాధ్యతగా ముందుకు వచ్చామని అన్నారు. ప్రజలకు ఇలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి 'మేము సైతం' ముగింపు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడారు. తెలుగు సినీపరిశ్రమ మరిచిపోలేని రోజు ఇదని పేర్కొన్నారు. 'మేము సైతం' యజ్ఞంలా నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెర వెనుక, తెర ముందు ఎంతో మంది అలుపెరగకుండా అహర్నిశలు కృషి చేశారని వెల్లడించారు. చిత్రపరిశ్రమకు చెందిన వారంతా ఒకచోటికి చేరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ఆషామాషీ విషయం కాదన్నారు. 'మేము సైతం' కార్యక్రమాన్ని ఎంతో ఆస్వాదించామన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మనసారా నవ్వుకున్న సందర్భమిది అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలోని ప్రతిఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారని ప్రశంసించారు. ఇందులో పాలుపంచుకున్న వారిని, తమకు మద్దతు తెలిపిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
దశల వారీగా తెలుగు చిత్ర పరిశ్రమ తరలింపు
* మంత్రి గంటా వెల్లడి * ప్రభుత్వం ప్రోత్సహిస్తే సంసిద్ధమన్న సినీ ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి దశల వారీగా వైజాగ్‌కు తరలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన సమావేశంలో చర్చించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. చిత్ర పరిశ్రమను విశాఖపట్నానికి తరలించాలనే ప్రభుత్వ యోచనను వారి ముందు ఉంచినప్పుడు తమకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. -
'కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి'
హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు వారు అభినందలు తెలిపారు. చిన్న సినిమాలను బతికించాలని కేసీఆర్ ను కోరినట్టు జీవిత రాజశేఖర్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. సినిమా పరిశ్రమను కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఓ స్టార్ హీరో కారణంగా తాను కాంగ్రెస్ పార్టీని వీడినట్టు అంతకుముందు రాజశేఖర్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లోనే సినీపరిశ్రమ: దాసరి
హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోయినప్పుటికీ తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలి వెళ్లదని, భారతదేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా ఉన్న టాలీవుడ్ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీదర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. వరంగల్‌లోని శ్రీభద్రకాళి అమ్మవారిని మంగళవారం కుటుంబసమేతంగా ఆయన దర్శించుకున్నారు. అమ్మ వారికి కానుకలు మొక్కుబడులు సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత గుర్తింపు పొందిందని అన్నారు. త్వరలోనే తాను జైభద్రకాళి సినిమా నిర్మించనున్నట్లు దాసరి చెప్పారు. -
ఫేస్బుక్ పంచ్: అందుకు ‘సేన’ అక్కర్లేదు!
మోడీకి మద్దతిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందన ‘డిసప్పాయింటెడ్.. కన్ఫ్యూజ్డ్. ఆ ఆవేశం ఎటు పోయింది. ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు. దీనికి సేనతో పనిలేదు. ఒక వ్యక్తిని గెలిపించండి అని చెప్పడానికి ఇంత ఆవేశం అక్కర్లేదు. ఈ ఆవేశం పోరాటాలకు దాచుకుందాం. కులం, మతం, ప్రాంతం పేరున విద్వేషాలు రేపి ఎలక్షన్లలో గెలవాలనుకునే ఏ వ్యక్తికి గానీ, పార్టీకి గానీ మనల్ని పరిపాలించే అర్హత లేదు’ తెలుగు సినీ పరిశ్రమలో సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ డెరైక్టర్‌గా పేరున్న శేఖర్ కమ్ముల సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత వైజాగ్‌లో చేసిన ప్రసంగంపై ఫేస్బుక్లో చేసిన కామెంట్ ఇది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతిస్తున్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్య తననెంత కుదిపేసిందో శేఖర్ కమ్ముల ఇందులో క్లుప్తంగా వివరించారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇంకెంతో ఆశించి, భంగపడ్డ అభిమానుల నిరుత్సాహాన్ని, నిరాశను శేఖర్ తన కామెంట్లో ప్రతిబింబించారు. ముఖ్యంగా ఒక వ్యక్తిని గెలిపించండి అని చెప్పడం కోసం జనసేన అక్కర్లేదని ఆయన నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు విద్వేషాల్ని రెచ్చగొట్టే వారికి మనల్ని పరిపాలించే అర్హత లేదంటూ పవనిజాన్ని తిరస్కరించారు. జనసేన ఏర్పాటును ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చేసిన మొదటి ప్రసంగాన్ని ప్రశంసించిన శేఖర్ కమ్ముల.. వైజాగ్ ప్రసంగంలో పవన్ తీసుకున్న నిర్ణయంపై తన వ్యతిరేకతను స్పష్టంగా చెప్పారు. సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో మొహమాటాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది అదే పరిశ్రమకు చెందిన శేఖర్ కమ్ముల పవన్‌కళ్యాణ్ ఉద్దేశాలపై స్పష్టంగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం సంచలనం రేకెత్తించింది. ఆ కామెంట్స్‌పై ఫేస్బుక్లో మంచి స్పందన లభించింది. -
విజయనగరంలో ‘భీమవరం బుల్లోడు’యూనిట్ సందడి
ఆశీర్వదించండి విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: ‘మీ ఆశీర్వాదాలుంటే సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తాను. యాక్షన్ నుంచి కామెడీ వరకూ ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటూ భీమవరం బుల్లోడు సునీల్ విజయనగరంలో సోమవారం సందడి చేశారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా పట్టణంలోని రంజనీ థియేటర్‌కి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు. సునీల్ రాకతో థియేటర్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు ముగ్ధుడైన సునీల్ మాట్లాడుతూ మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి రుజువు చేశారన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చిత్రం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. నటనే ప్రాణంగా ఉన్న తనకు ఇంతటి సక్సెస్నిచ్చిన అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. అభిమానుల ప్రోత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలు చేస్తానని చెప్పారు. పైరసీ రక్కసిని దరిచేరనీయకుండా అభిమానులే చూడాలన్నారు. సినిమా విజయోత్సవ వేడుకలను రాష్ట్రమంతా నిర్వహిస్తున్నామని, సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతి జిల్లాకు వెళ్లి వేడుకల్లో స్వయంగా పాల్గొంటున్నానన్నారు. హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ ‘సినిమా బాగుందా’ అంటూ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. హాస్యనటులు రాజేష్, పృథ్వీ, సంగీత దర్శకుడు అనూప్ తదితరులు వారి వెంట ఉన్నారు.