Vigilance attacks
-
విజిలెన్స్ తనిఖీలు.. రూ.2కోట్లు పక్కింట్లో పడేసిన అధికారి
ఒడిశా: నవరంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ రౌత్ నివాసంలో కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామునే 9వేర్వేరు ప్రాంతాల్లో ఆయనకు చెందిన ఆస్తులపై విజిలెన్స్ బృందాలు ఏకకాలంలో దాడులకు దిగారు. నవరంగ్‌పూర్ మెయిన్ రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉన్న ఏడీఎంను నిద్ర లేపి, తనిఖీలు ప్రారంభించారు. అక్కడ రూ.12 లక్షల నగదు పట్టుబడింది. రెండు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండటంతో డీఆర్డీఏ కార్యాలయం పక్కన ఉన్న మరో ప్రభుత్వ క్వార్టర్లో రూ.77 లక్షల నగదు లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఖంగు తిన్నారు. వెంటనే దూకుడు పెంచారు. అధికారులను చూసి.. భువనేశ్వర్‌లోని కన్న విహార్‌లో ప్రశాంత్‌కుమార్‌కు మరో ఇల్లు ఉందని తెలిసి మెరుపు దాడికి దిగారు. అధికారులు రావడం దూరం నుంచి గమనించిన కొందరు వ్యక్తులు భవనం పైనుంచి కొన్ని పెట్టెలు మరో భవనం పైకి విసరడాన్ని గమనించారు. దీంతో తలుపులు విరగ్గొట్టి, అధికారులు ప్రవేశించే సరికే దుండుగులు పరారయ్యారు. అక్కడి పెట్టెలను స్వా«దీనం చేసుకోగా, ఇందులో రూ.2 కోట్ల 25 లక్షల నగదు బయటపడింది. దీంతో పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అతని స్వస్థలం భద్రక్, నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలు చేపట్టారు. సాయంత్రం ఉమ్మర్‌కోట్ పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 24సెంట్ల వాణిజ్య స్థలాన్ని అతని సోదరుడి పేరుమీద, ఖరీదైన భవనాలు సైతం ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు బంగారం బిస్కెట్లు, లెక్కలేనన్ని డిపాజిట్లు, భూ పత్రాలు, వివిధ బ్యాంకుల్లో లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 8మంది ఇన్స్పెక్టర్లు పాల్గొన్నట్లు రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయం ప్రకటించింది. గతంలో కూడా.. ఏడీఎం ప్రశాంత్‌కుమార్ గతంలో సుందర్‌గడ్ జిల్లా బిశ్రా సమితి కేంద్రంలో సమితి అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న సమయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. ఆ కేసులో జైలుకు వెళ్లి, తిరిగి వచ్చి మళ్లీ విధుల్లో చేరారు. నవరంగ్‌పూర్ జిల్లాలో ఇసుక మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరంపై గతం లో ట్రాక్టర్ల యజమానులు ఆందోళనకు దిగడం గమనార్హం. ఏడీఎం నివాసంలో కోట్ల రూయాల నగదు లభ్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పేదరికంతో బాధపడే గిరిజన జిల్లా.. ఓ ఉన్నతాధికారి వద్ద భారీ స్థాయిలో నగదు పట్టుబడటం ఆందోళన కలిగించే అంశమని డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్ర నవరంగపూర్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి అధికారిని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
విజిలెన్స్ విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కులపై విజిలెన్స్ విభాగం కొరడా ఝళిపిస్తోంది. సామాన్యులు, అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అలాగే కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే 10,015 దాడులు నిర్వహించడంతోపాటు 2,891 కేసులను నమోదు చేసింది. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాల కట్టడికి కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పంటల సీజన్ పరిస్థితులను సావకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపించి.. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేయడం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించింది. రాష్ట్రంలో అందుకు అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. ఇక కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి విజిలెన్స్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి నిత్యావసర వస్తువుల చట్టం, తూనికలు–కొలతల చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుండటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. తిరుపతిలో వంటనూనెల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు.. విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 6 నుంచి మే 17 వరకు ఏకంగా 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన 2,891 దుకాణాలు, వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. వాటిలో తూనికలు–కొలతల చట్టం కింద 2,689 కేసులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద 71 కేసులు, ఆహార భద్రతా చట్టం కింద 113 కేసులతోపాటు 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణా మార్గాలపై దృష్టి గతంలో లేని విధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు వ్యవస్థీకృతమైనట్టు.. అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై విజిలెన్స్ అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసే వారిపై దృష్టిసారించారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లోనే 100 దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 12 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. వంట నూనెలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ.. ధరలను అమాంతంగా పెంచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించకుండా తనిఖీలు ముమ్మరం చేశాం. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – శంకబ్రత బాగ్చి, అదనపు డీజీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ తమ జిల్లా యూనిట్లను ఇంకా పునర్వ్యస్థీకరించలేదు. పాత 13 జిల్లాల యూనిట్ల వారీగా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలు.. -
రెండో రోజూ విజిలెన్స్ దాడులు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నెపంతో వంటనూనెలు, నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజూ కొరడా ఝుళిపించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 126 చోట్ల తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫో ర్స్మెంట్ సోమవారం మరో 142 చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పరిమితికి మించి నిల్వలు కలిగి ఉన్న నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెండు రోజుల్లో ఈ చట్టం కింద మొత్తం 20 కేసులు నమోదు చేసినట్లయ్యింది. అదే విధంగా తూనికలు కొలతల చట్టానికి విరుద్ధంగా గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై 73 కేసులు నమోదు చేశారు. ఈ చట్టం కింద రెండు రోజుల్లో 127 కేసులు నమోదు చేశారు. ఆహార భద్రతా చట్టం కింద నాణ్యత సరిగాలేకపోవడంతో 15 కేసులు నమోదు చేశారు. దీంతో రెండు రోజుల్లో ఈ కేసుల సఖ్య 27కి చేరింది. మొత్తం మీద రెండు రోజుల్లో వంట నూనెలు, పప్పుధాన్యాల నిల్వలపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 174 కేసులను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
మైనింగ్ మాఫియాపై విజి‘లెన్స్’
దొండపర్తి(విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు భూములు పంచుకుంటే.. వారి అనుచరులు, సానుభూతిపరులు కొండలు మింగేశారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రతి ఒక్కరూ రెచ్చిపోయారు. ల్యాండ్, మైనింగ్ మాఫియాగా చెలరేగిపోయారు. వారి అక్రమాలకు కొండలు సైతం కరిగిపోయాయి. అనుమతులు ఒక చోట తీసుకొని మరోచోట మైనింగ్ చేస్తూ సాగించిన అక్రమాలు జిల్లాలో ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గోరంత అనుమతులు తీసుకుని కొండలకు కొండలు తవ్వేస్తున్న వ్యవహారాలు గనుల శాఖ విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు ఆయా సంస్థలకు భారీ స్థాయిలో రూ.33,02,61,364 అపరాధ రుసుం విధించారు. జిల్లాలో అనకాపల్లి మండలం సీతానగరంలో సర్వే నంబర్ 251లో రెండు చోట్ల 7.05 హెక్టార్లు, 7.50 హెక్టార్లలో ఉన్న కొండలను పి.వెంకటేశ్వరరావు పేరు మీద మైనింగ్ కోసం లీజుకు ఇచ్చారు. అనుమతులకు మించి తవ్వకాలు జరపడంతో స్థానికుల ఫిర్యాదుల మేరకు మైనింగ్ అధికారులు దాడులు చేశారు. అనుమతులకు మించి తవ్వకాలు వాస్తవానికి సదరు వ్యక్తికి 3,41,708 క్యూబిక్ మీటర్లు మెటల్ తవ్వకాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెట్టింపు స్థాయిలో మైనింగ్ చేపట్టారు. గతంలో ఈ తవ్వకాలపై ఫిర్యాదులు అందినప్పటికీ.. అప్పటి మంత్రులు మైనింగ్ అధికారులపై ఒత్తిడి చేసిన నేపథ్యంలో వారు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఏకంగా అనధికారికంగా 2,97,245.28 క్యూబిక్ మీటర్లు అధికంగా తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సర్వే నంబర్ 193లో 0.838 హెక్టార్లలోను, సర్వే నంబర్ 303లో 2.08 హెక్టార్లలోనూ వీవీఆర్ క్రషర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మైనింగ్‌కు అనుమతులు తీసుకుంది. అయితే అనుమతులు పొందిన చోటే కాకుండా మరోచోట కూడా యథేచ్ఛగాగా తవ్వకాలు జరిపినట్లు అధికారులు దాడుల్లో గుర్తించారు. భారీ జరిమానా సీతానగరంలో జరిగిన ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్థానికులు మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గనుల శాఖ రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి బృందం దాడులు నిర్వహించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ సంస్థలకు ఏకంగా రూ.33,02,61,364 అపరాధ రుసుం చెల్లించాలని గురువారం నోటీసులు జారీ చేశారు. జిల్లాలో ఇంతటి భారీ స్థాయిలో పెనాల్టీ వేయడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మరికొన్ని అక్రమ మైనింగ్‌లపై దృష్టి వీటితో పాటు జిల్లాలో మరో 8 చోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే వాటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన మైనింగ్ మాఫియా ఆగడాలు ఇపుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. -
టికెట్ల బాధ్యత ప్రయాణికులదే
సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడో ఒక చోట విజిలెన్స్ సిబ్బంది మాటు వేసి ఉంటారు. ఆ మార్గంలో వెళ్లే బస్సును ఆకస్మాత్తుగా నిలిపేస్తారు. అంతే ఇక కండక్టర్‌కు ముచ్చెమటలు పట్టేస్తాయి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటారు. ఆ క్షణం లో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియ ని ఆందోళన, ఏ ఒక్క ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోకపోయినా అందుకు బాధ్యత వహించవలసిన దుస్థితి. ఇదంతా నిన్నటి సంగతి. ఇప్పుడు కండక్టర్లకు ఆ భయం లేదు. నిశ్చింత గా, నిర్భయంగా విధులు నిర్వహించవచ్చు. టిక్కెట్ తీసుకోవలసిన బాధ్యత ఇక పూర్తిగా ప్రయాణికుడిదే. ఈమేరకు ఆర్టీసీ సైతం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. ఇటీవల కార్మికులు చేపట్టిన సుదీర్ఘమైన సమ్మెలోనూ టిక్కెట్ తీసుకోవలసినబాధ్యత ప్రయాణికులదేనని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కండక్టర్లకు ఉద్యోగభద్రతను కల్పిస్తూ టిక్కెట్ల బాధ్యతను ప్రయాణికులపైనే మోపింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 178 ప్రకారం ప్రయాణికులు తప్పనిసరిగా టిక్కెట్తీసుకొని ప్రయాణం చేయాలని, టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంటూ ఆర్టీసీ ముమ్మర ప్రచారం చేపట్టింది. కొత్త ఏడాది నగరంలోని అన్ని అలైటింగ్ పాయింట్ వద్ద తనిఖీలను ఉధృతం చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితం... నిజానికి టిక్కెట్ల అంశం కండక్టర్లకు కత్తిమీద సాములా మారింది. వివిధ రూట్లలో అత్యధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందజేస్తూనే టిక్కెట్లపైన వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి తక్కువగా ఉన్నా కఠిన చర్యలు తీసుకోవడం వేలాది మంది కండక్టర్ల ఉద్యోగభద్రతకు ముప్పుగా పరిణమించింది. అలా ఎంతోమందిపైన సస్పెన్షన్ వేటు పడింది. ఉద్యోగాలకు దూరమై ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్లు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో సుమారు 8 వేల మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఒక బస్టాపులో ఎక్కి ఆ తరువాత బస్టాలోనే దిగే ప్రయాణికులు, ఒకటి,రెండు బస్టాపులకు టిక్కెట్ తీసుకొకుండా తప్పించుకొనేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఈ క్రమంలో విజిలెన్స్ తనిఖీల కారణంగా కండక్టర్లు మూల్యం చెల్లించవలసి వచ్చేది. నగరంలోని 29 డిపోల పరిధిలో ఎక్కడో ఒక చోట కండక్టర్లపైన వేటు పడడం పరిపాటిగా మారింది. మరోవైపు తాము టిక్కెట్ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కండక్టర్లు తమ వద్దకు రాకుండానే ఉండిపోయారని తరచుగా ప్రయాణికులు బుకాయించేవారు. గతంలో పావలా పైసల టిక్కెట్ తీసుకోకపోయినా కండక్టర్లే మూల్యం చెల్లించవలసి వచ్చేది. ఇలాంటి పరిణామాల బారి నుంచి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని టిక్కెట్ బాధ్యతను ప్రయాణికులపైన మోపడంతో ఆర్టీసీ కండక్టర్లకు ఊరట లభించినట్లయింది. బస్టాపుల్లోనే తనిఖీలు మరోవైపు ఇక నుంచి బస్టాపుల్లోనే తనిఖీలను నిర్వహిస్తారు. రోడ్లపైన బస్సులను నిలిపేసి మార్గమధ్యలో తనిఖీలు చేయడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. అప్పటికే బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాసిన వాళ్లు మరో గంట పాటు టిక్కెట్ల తనిఖీల కోసం నిరీక్షించవలసి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు బస్సు దిగే బస్టాపుల్లో మాత్రమే విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. లాస్ట్ బస్టాపుల్లో బస్సులు ఆగిన తరువాత రెండు వైపులా ఫుట్‌బోర్డుపైన నించొని తనిఖీలు చేస్తారు. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే ఈ పద్ధతి అమల్లో ఉంది, త్వరలో పూర్తిస్థాయిలో ఆన్‌రోడ్ తనిఖీలకు స్వస్తి చెప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. -
ప్రభుత్వ చర్యలతో దిగొస్తున్న ఉల్లి
సాక్షి, అమరావతి, కర్నూలు(అగ్రికల్చర్) : ఒకవైపున రాయితీపై రైతు బజార్లలో ఉల్లిని సరఫరా చేస్తూనే మరోవైపున బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇస్తున్నాయి. రెండు రోజులుగా మార్కెటింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రవాణా శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం వరకు పోటీపడి క్వింటా రూ.13 వేలకు కొనుగోలు చేసిన ట్రేడర్లు శనివారం కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్వింటా రూ.8,750కి మించి కొనుగోలు చేయలేదు. వచ్చిన ఉల్లిలో 30 నుంచి 40 శాతానికి మించి కొనలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ట్రేడర్లతో పోటీపడి ఉల్లిని కొనుగోలు చేస్తోంది. నాణ్యమైన ఉల్లి మార్కెట్లో కనిపిస్తే ఎంత రేటుకైనా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముందుకు వస్తుండటంతో ట్రేడర్లు వెనుకంజ వేస్తున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు శనివారం 1000 క్వింటాళ్ల ఉల్లి రాగా, క్వింటా రూ.8,500 చొప్పున మార్కెటింగ్ శాఖ 550 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్‌కు 6,500 క్వింటాళ్లు రాగా, మార్కెటింగ్ శాఖ క్వింటా రూ.8,750 – రూ.9,300 చొప్పున 4,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు 33,950 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తోంది. రైతుబజార్లకు సత్వరమే చేరవేత షోలాపూర్, ఆల్వార్ నుంచి ఉల్లి దిగుమతులు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. కొనుగోలు చేసిన ఉల్లిని వెంటనే రాయితీపై రైతుబజార్లలో విక్రయించేందుకు సత్వర రవాణాకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాయలసీమ జిల్లాలకు, తాడేపల్లిగూడెంలో కొనుగోలు చేసిన ఉల్లిని ఉభయగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలకు, షోలాపూర్ నుంచి వచ్చిన ఉల్లిని ఉత్తరాంధ్రకు రవాణా చేస్తున్నారు. రవాణాలో జాప్యాన్ని నివారించడంతోపాటు ఖర్చులు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు, ప్రధాన మార్కెట్ల వద్ద ఉల్లి రవాణా, కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా కొనసాగిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లిని ఎగుమతి చేస్తున్న లారీలను తనిఖీ చేస్తోంది. సరైన డాక్యుమెంట్లు లేకపోతే లారీలను నిలిపివేస్తోంది. వేలం పాటలు జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేస్తున్న ట్రేడర్ల వివరాలను విజిలెన్స్ విభాగం అధికారులు నమోదు చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు భయపడి పెద్ద మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసేందుకు ధైర్యం చేయడం లేదు. దీనికితోడు డైలీ ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం వేలంలో ఉల్లి ధర తగ్గింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లోనే ఉల్లి ధరలు తగ్గుతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
టీడీపీ నేత.. జీడిపిక్కల దందా
రణస్థలం: విజిలెన్స్ అధికారులకు గతంలో ఒకమారు పట్టుబడినా ఓ టీడీపీ నాయకుడి వక్ర బుద్ధి మారలేదు. దర్జాగా తన అక్రమ వ్యాపార దందా సాగిస్తున్న అతడిపై గట్టిగా నిఘా పెట్టి మరోమారు దాడుల అస్త్రం ప్రయోగించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1,876 జీడిపిక్కల బస్తాలు బయటపడ్డాయి. మొత్తం 93 టన్నులున్న వీటి విలువ మార్కెట్లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పిషిణి జగన్నాథం ఏడెనిమిది ఏళ్లుగా జీడిపిక్కల వ్యాపారం చేస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమంగా జీడిపిక్కల గొడౌన్ ఏర్పాటు చేశాడు. ఇందుకు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ దర్జాగా లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించలేదు. అప్పట్లో ఓ మంత్రి అండదండలు కూడా ఈయనకు పుష్కలంగా ఉండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో గత జూన్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, అదే నెలలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. దాదాపు లక్ష రూపాయల వరకు జరిమానా విధించారు. అయినా పద్ధతి మారకపోవడంతో ఇతని బాగోతంపై విజలెన్స్ అధికారులు మరోమారు పక్కా నిఘా పెట్టి శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సిబ్బంది, ఏఎంసీ సెక్రటరీ చిన్నికృష్ణ, గ్రామ రెవెన్యూ అధికారి ఎల్వీ అప్పలనాయుడు ఉన్నారు. ఏ ఒక్కటికీ అనుమతి లేదు.. దీనిపై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ అప్పలనాయుడు మాట్లాడుతూ మొత్తం స్వాధీనం చేసుకున్న సరుకుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. కనీసం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పన్నులు కూడా చెల్లించలేదన్నారు. జీడి పిక్కల నిల్వ ఉంచేందుకు గొడౌన్‌కు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు కూడా ప్రభుత్వం నుంచి పొందలేదని తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకును శనివారం లావేరు మండలం బెజ్జిపురం వ్యవసాయ మార్కెట్‌కు తరలించామన్నారు. -
వ్యాపారుల ఉల్లికిపాటు
ఏలూరు టౌన్: ఏలూరులోని ఉల్లి హోల్‌సేల్ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్.వరదరాజు ఆదేశాలతో విజిలెన్స్ డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఏలూరులోని శ్రీ సూర్యట్రేడర్స్, కేఆర్ ఆనియన్స్,శ్రీ భార్గవి ఆనియన్స్ హోల్‌సేల్ దుకాణల్లో అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. భారీ ఎత్తున ఉల్లిని దిగుమతి చేసి విక్రయాలు చేస్తూ లెక్కల్లో తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి రూ.లక్షల్లో మార్కెట్ సెస్ ఎగ్గొడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దుకాణాల గిడ్డంగుల్లో టన్నుల్లో ఉల్లిని నిల్వ చేసిన యజమానులు వాటికి సరైన రికార్డులు చూపించలేకపోయారు. అవకతవకలు ఇలా.. సూర్య ట్రేడర్స్ యజమాని రవికుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచీ ఇప్పటి వరకూ సుమారు 80 టన్నుల ఉల్లిని కొన్నారు. మొత్తం ఉల్లిని విక్రయించేసి రికార్డుల్లో మాత్రం 48 టన్నులు మాత్రమే నమోదు చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మార్కెట్ సెస్‌ను ఎగ్గొట్టారు. గత మూడేళ్ళుగా ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన అసెస్మెంట్ కూడా సమర్పించలేదని అధికారులు గుర్తించారు. అలాగే కేఆర్ ఆనియన్స్ దుకాణంలో ఏప్రిల్ 11,464 టన్నుల సరకు విక్రయించినట్టు తేలింది. కానీ మార్కెట్ సెస్‌ను చెల్లించలేదు. సుమారు రూ.4లక్షల మేర సెస్ చెల్లించాలని అధికారుల అంచనా. దుకాణంలో మరో 20 టన్నుల ఉల్లి సరుకు నిల్వ ఉంచారు. వీటికి సరైన పత్రాలు లేవు. ఈ షాపులో రెండు ఎలక్ట్రానిక్ కాటాల లైసెన్స్ రెన్యూవల్ చేయకపోవటంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. శ్రీ భార్గవి ఆనియన్స్ దుకాణాన్ని అసలు రికార్డులు లేకుండానే నిర్వహిస్తున్నారు. 21 టన్నుల ఉల్లిపాయలు ఉండడంతో విక్రయాలు నిలుపుదల చేసేలా ఏఎంసీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ మూడు దుకాణాల్లో సుమారు రూ.25 లక్షల విలువైన ఉల్లిపాయలు నిల్వ చేయటం, విక్రయించటం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఏవో ఎం.శ్రీనివాసకుమార్, తహసీల్థార్ పీ.రవికుమార్, ఎస్ఐ కే.ఏసుబాబు, ఏఎంసీ సూపర్వైజర్ ఉన్నారు. -
రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు గురువారం జిల్లాలోని సీఎంఆర్ అనుమతి ఉన్న రైస్‌మిల్లులను తనిఖీలు చేశారు. రావులపాలెం మండలం ఈతకోటలోని శ్రీ వెంకట పద్మ ట్రేడర్స్‌ను విజిలెన్స్ ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు. రికార్డులు, స్టాకు నిల్వలను పరిశీలించారు. ఎ –బీ రిజిష్టర్లలో స్టాకు వ్యత్యాసాలు ఉన్నట్టు ఆయన గుర్తించారు. మొత్తం 2,229 క్వింటాళ్ల ధాన్యం అధికంగా ఉన్నట్టు గుర్తించిన ఆయన .. తగిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఏఎస్‌ఓకు సూచించారు. ఈ మిల్లుకు ధాన్యం సరఫరా చేసిన ముమ్మిడివరప్పాడు, ఈతకోట, పలివెల, రావుల పాలెం పీపీసీ కేంద్రాలను అధికారులు తనిఖీలు చేసి రైతుల వివరాలు సేకరించారు. అనపర్తి మండలం పెడపర్తి, సోమేశ్వరం, పులగుర్త, పెనికేరు, పొలమూరు, చింతలూరు, మురమండ గ్రామాల్లోని మిల్లులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ పి.ముత్యాల నాయుడు, అధికారులు వై.సత్యకిషోర్, టి.రామ్మోహన్ రెడ్డి, బి.సాయి రమేష్, ఎస్.రామకృష్ణ, ఏఎస్ఓ జె.ఆనంద్‌బాబు, ఎంఎస్ఓలు పాల్గొన్నారు. -
చిరుతిళ్ల పరిశ్రమలపై విజిలెన్స్ దాడులు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): టేనర్‌పేటలో ఎటువంటి అనుమతులు లేకుండా చాక్లెట్లు, బిస్కెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై విజిలెన్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆయా కంపెనీలపై దాడులు చేసిన క్రమంలో అపరిశుభ్ర వాతావరణంలో, చాక్లెట్లు తయారీకి ఉపయోగించే ముడిసరుకులు చీమలు పట్టి, ఈగలు ముసురుతూ కనిపించాయి. చాక్లెట్లు, బిస్కట్ల శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు, రవాణాకు సిద్ధంగా ఉన్న సరుకుతో పాటు కంపెనీలను సీజ్ చేశారు. టేనర్‌పేట అడ్డరోడ్డు, మసీదు ప్రాంతాలలో రేలంగి జ్యోతిశ్వరరావు రాధా ప్రొడక్ట్ పేరిట నిమ్మతొనలు, పిప్పర్మెంట్ చాక్లెట్లు తయారు చేస్తుంటాడు. మహాలక్ష్మి ప్రొడక్ట్ పేరిట మరుపిళ్ల రామకృష్ణ, ఎం.దుర్గారావు ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కంపెనీలను నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్ సీఐ పి.వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు సిబ్బంది ఆయా కంపెనీలపై దాడులు నిర్వహించారు. చాక్లెట్లు, బిస్కట్ల తయారీకి ఎటువంటి అనుమతులు లేకపోవడమే కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారీ, ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీలను సీజ్ చేయడమే కాకుండా సరుకు స్వాధీనం చేసుకున్నారు. విద్యాధరపురంలో... భవానీపురం(విజయవాడ పశ్చిమం): విద్యాధరపురం కబేళా ప్రాంతంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా చిన్నపిల్లల తినుబండారాలు తయారుచేసే ఫ్యాక్టరీలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఫరీదా ఫుడ్ప్రొడక్టŠస్ పేరుతో షేక్ పర్వీన్ సుల్తానా అనే మహిళ తన భర్త రఫీతో కలిసి చిన్నపిల్లలు తినే తిమ్మిరి బిళ్లలు తయారు చేస్తున్నారు. అందుకు కావల్సిన లైసెన్స్‌లు తీసుకోకపోవడంతో సమాచారం అందుకున్న అధికారులు ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ సీఐ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ కంపెనీకి ఫుడ్ సేఫ్టీ, ప్యాకేజీ, లేబర్ లైసెన్సలు లేవని తమ తనిఖీలో బయటపడిందని చెప్పారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కొన్ని శ్యాంపిల్స్ సేకరించామని, వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపి, వచ్చిన రిపోర్ట్నుబట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీలలో విజిలెన్స్ ఎస్ఐ సత్యనారాయణ, ఇనస్పెక్టర్స్ రమేష్‌బాబు, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
తారు అక్రమ వ్యాపారంపై విజిలెన్స్ దాడులు
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా సాగుతున్న తారు, అయిల్ వ్యాపారాలపై శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు చేశారు. అక్రమ వ్యాపారం చేస్తున్న వారి నుంచి రూ.2.20 లక్షల విలువ గల తారు స్వాధీనం చేసుకుని యజమానులపై కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి అందిన సమాచారం మేరకు ఆ విభాగం అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి బొండపల్లి మండలం నెలివాడ వద్ద సేరం శ్రీనివాసరావుకు చెందిన వివేకానంద ఇండస్ట్రియల్ అయిల్స్పై దాడులు చేశారు. వారి వద్ద నుంచి 28 బారెల్స్ బిటుమన్ తారు (5600 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,12,000 ఉంటుందని గుర్తించారు. విజయనగరం రూరల్ మండలం కొండకరకాం పరిధిలో జేఎన్టీయూ రోడ్ వద్ద అనకాపల్లికి చెందిన మల్ల రవికుమార్ అక్రమంగా నిల్వ చేసిన రూ.66 వేల విలువ చేసే 23 బారెల్స్ బిటుమన్ తారు (4600 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. దత్తిరాజేరు మండలం తాడెందొరవలస వద్ద ఉన్న ఉల్లి వీరబాబు అక్రమంగా నిల్వ చేసిన రూ.40 వేల విలువ చేసే 2000 లీటర్ల తారును సీజ్ చేశారు. ముగ్గురు యజమానులు హైవేపై వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్లకు డబ్బులిచ్చి తారు సేకరిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ విషయమై అధికారులు వ్యాపారులను ప్రశ్నించగా.. తక్కువ డబ్బులకు డ్రైవర్ల వద్ద తారు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. బిటుమన్ తారు అన్నది పెట్రోలియం ఉత్పత్తి కావడంతో వాటిని నిల్వ చేయడం, లైసెన్స్ లేకుండా అమ్మడం నేరంగా పరిగణించి వారిపై సీఎస్డీటీలతో ఏపీ పెట్రోలియం ప్రొడక్టŠస్ ఆఫ్ సప్లై అర్డర్ 1980ను ఉల్లంఘంచినందుకు గాను సెక్షన్ 6ఏ కేసుతో పాటు 7 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. తనిఖీల్లో ప్రాంతీయ నిఘా అమలు అధికారి టి. హరికృష్ణ పర్యవేక్షణలో డీఎస్పీ కె. భార్గవరావునాయుడు, డీఎస్పీ శ్రీకృష్ణ, సీఐ తారకరామారావు, డీసీటీఓ సూర్యత్రినాథరావు, అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని లక్కవరం గ్రామంలోని మూడు రేషన్ దుకాణాలపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ సీఐ భాస్కర్, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేసి లోపాలను గుర్తించారు. షాపు నం.17లో 82 కేజీల బియ్యం తక్కువగా, షాపు నం.51లో 1,205 కేజీల బియ్యం తక్కువగా, షాపు నం.50లో 551 కేజీల బియ్యం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించినట్లు విజిలెన్స్ సీఐ భాస్కర్ తెలిపారు. ఆయా షాపులపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ సునీత, వీఆర్వోలు పాల్గొన్నారు. పొలమూరులో నిల్వల్లో వ్యత్యాసాలు పోడూరు: పెనుమంట్ర మండలం పొలమూరులో షాపు నం.20 రేషన్ డిపోపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. షాపులోని రికార్డులను, సరుకుల నిల్వలను తనిఖీ చేయగా 353 కేజీల బియ్యం, 5.5 కేజీల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత డీలర్ 32వ రేషన్ షాపునకు కూడా ఇన్చార్జిగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సరుకుల నిల్వలో వ్యత్యాసాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
నాణ్యత డొల్ల.. ఆరోగ్యం గుల్ల
కంపుకొట్టే శనగపిండి.. నాసిరకం బియ్యం, కారం, నూనెల్లో లోపించిన నాణ్యత.. డైట్ క్యాంటీన్ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం.. ఇవి విజయవాడ సర్వజనాస్పత్రిలో విజిలెన్స్, ఫుడ్‌కంట్రోల్ అధికారుల తనిఖీల్లో కనిపించిన దృశ్యాలు. రోగులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులతో అధికారులు మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలోని డైట్ క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పెట్టే ఆహారంలో నాణ్యత లోపించింది. సుద్దయిన అన్నం.. నీళ్ల చారు, మజ్జిక రోగులకు అందిస్తుండటంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విజిలెన్స్ ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలతో జిల్లా ఆహార నియంత్రణ అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు ఆహారం తయారు చేసే డైట్ క్యాంటీన్లోని పలు పదార్థాలను పరిశీలించడంతో పాటు, వాటిని తయారు చేసే వస్తువుల నాణ్యతపై సైతం పరిశీలించారు. శాంపిళ్లను సేకరించారు. అంతేకాక క్యాంటీన్లో 20 కేజీల రేషన్ బియ్యం ఉండటాన్ని సైతం విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వంటకు వాడే ఉప్పు, కారం.. నూనె, చింతపండులతో పాటు, బియ్యం శాంపిళ్లను సేకరించి, ఆస్పత్రి డైటీషియన్ నుంచి విజిలెన్స్ అధికారులు లేఖను తీసుకున్నారు. లోపాల పుట్ట.. జబ్బు చేసి చికిత్స కోసం వచ్చిన రోగులకు పెట్టే ఆహారంలో అనేక లోపాలు ఉన్నట్లు విజిలెన్స్, ఆహార నియంత్రణ అధికారులు గుర్తించారు. కంపుకొట్టే శసన పిండి, బూజు పట్టిన మినపగుళ్లతో పాటు, నాసిరకం కారం, నూనెలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డైట్ క్యాంటీన్లో రేషన్ బియ్యం సైతం 20 కేజీలు వాడటాన్ని గుర్తించారు. ఆహారం తయారు చేసేందుకు ఆర్ఓ వాటర్ వాడాల్సి ఉండగా, బోరు వాటర్ వాడటాన్ని గుర్తించారు. అంతేకాకుండా రోగులకు ఆహారం తయారు చేసే క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వాడే బియ్యం, ఉప్పు, కారం, నూనెల శాంపిళ్లను సేకరించారు. ఫుడ్ కంట్రోల్ సర్టిఫికెట్టే లేదు.. వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఆహారం పెట్టే కాంట్రాక్టర్‌కు ఫుడ్‌కంట్రోల్ సర్టిఫికెట్ సైతం లేదని విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. అసలు ఈ సర్టిఫికెట్ లేకుండా కాంట్రాక్టు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ పట్టించి సన్నబియ్యంగా వాడుతున్నారని నిర్థారణకు వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు క్యాంటీన్‌ను సైతం అధికారులు తనిఖీలు చేయగా, అక్కడ కూడా ఆహార పదార్థాలు నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఈ తనిఖీలో జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ఎడీఏ కళ్యాణ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్స్ అన్సారీ, నాగభూషణంలు పాల్గొన్నారు. కాంట్రాక్టరుకునోటీసులు ఇస్తాం.. ప్రభుత్వాస్పత్రిలో డైట్ కాంట్రాక్టరు నిర్వహించేందుకు ఫుడ్ కంట్రోల్‌శాఖ నుంచి సర్టిఫికెట్ లేదు. దీనిపై నోటీసులు జారీ చేస్తాం. మజ్జిగ, సాంబారు నాసిరకంగా ఉండటంతో పాటు, సుద్ద అన్నం పెడుతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. దీంతో తనిఖీలు నిర్వహించాం. బోరు నీటితో వంట చేయడంతో పాటు, అనేక లోపాలు గుర్తించి శ్యాంపిళ్లను సేకరించాం.– నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు(క్రైం): జిల్లాలోని మారుమూల ప్రాంతా ల్లో ఉన్న మెడికల్ షాపుల్లో జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు విజిలెన్స్ ఎస్పీ ఎస్. శ్రీకంఠనాథ్‌రెడ్డి, కార్మిక, డ్రగ్స్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకంఠనా«థ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గూడూరు డివిజన్లో 8 దుకాణాలు, నెల్లూరు డివిజన్లో 10 దుకాణాలు, కావలి డివిజన్లో 5 దుకాణాలు, ఆత్మకూరు డివిజన్లలో 6 దుకాణాలు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ప్రమాణాలతో తయారు చేయబడిన ఔషధాలు అందుబాటులో ఉండేందుకు, కాలం చెల్లిన ప్రమాణాలు పాటించని, మానవ జీవితాన్ని కుదేలు చేయగల హాని కారక డ్రగ్స్ పూర్తి నియంత్రణలో ఉండేలా చూసేందుకు తనిఖీలు నిర్వహించనట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నారా?, బ్రాండ్ డ్రగ్స్ విక్రయిస్తున్నారా లేదా, శీతోష్ణ స్థితిలో ఉంచాల్సిన ఔషధాలు ప్రిజ్‌లో ఉంచుతున్నారా లేదా, రిజిస్టర్లు మెయింటెనెన్స్ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామన్నారు. మెడికల్ షాప్‌పై విజిలెన్స్ దాడులు మర్రిపాడు: మండలంలోని డీసీపల్లిలో లక్ష్మి మెడికల్ షాపుపై బుధవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించా రు. విజిలెన్స్ సీఐ వెంకట నారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మెడికల్ షాపును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మెడికల్ షాపులో నిబంధనలు పాటించడం లేదన్నారు. ఫార్మాసిస్ట్ ద్వారా మందులు విక్రయించాల్సి ఉండగా, ఫార్మాసిస్ట్ లేరన్నారు. స్టాక్ రిజిస్టర్, లేబర్ లైసెన్స్, ఫుడ్‌లైసెన్స్, పర్చేస్ వివరాలతో ఉండాల్సిన రిజిస్టర్లు సక్రమంగా లేవన్నారు. జనరిక్ మెడిసిన్స్ వేరుగా విక్రయించాల్సి ఉన్నప్పటికి, అలా జరగడం లేదన్నారు. పలు రకాల మందులను గుర్తించామన్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి తద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తామన్నారు. దాడుల్లో సీఐతో పాటు డీసీటీఓ విష్ణురావు, ఏఎల్ఓ రాజశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ రహీం, కానిస్టేబుల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లులపై విజి‘లెన్స్’
విశాఖపట్నం, రాంబిల్లి(యలమంచిలి), యలమంచిలిరూరల్: తెరువుపల్లి పరిధిలో రాంబిల్లి మండలం ఎస్సీ కాలనీ వద్ద గల సత్యనారాయణ రైస్ అండ్ ఫ్లోర్ మిల్లుపై శనివారం అర్ధరాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. అప్పటికే మిల్లు బయట కోటా బియ్యం బస్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో ఆటోలో 18 బస్తాలు బియ్యం రాగానే అక్కడే మాటువేసిన విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు నేతృత్వంలో డీఎస్సీ పీఎం నాయుడు పర్యవేక్షణలో విజిలెన్స్ అధికారులు దిమిలికి చెందిన చక్కా సత్యనారాయణ అలియాస్ నానాజీకి చెందిన రెండు రైసుమిల్లులు, వాటికి ఆనుకొని ఉన్న గదిలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ స్థాయిలో రేషన్ బియ్యం నిల్వలు బయట పడ్డాయి. 130 టన్నుల బియ్యం బస్తాలు పట్టుబడినట్టు విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. ఈ బియ్యం విలువ రూ 40 లక్షలు ఉంటుందన్నారు. ఆటోను సీజ్ చేసి, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కోటా బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులో రీసైక్లింగ్(పాలిష్)చేసి నాణ్యత గల బియ్యంగా మార్కెట్లో అమ్మడంతో పాటు పౌర సరఫరాల శాఖకు పంపడం చేస్తున్నారని తెలిపారు. రైసుమిల్లు యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాగా గతంలో కూడా ఈ రైసుమిల్లులో రేషన్ బియ్యం పట్టుబడిన ఘటలున్నాయి. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, విజిలెన్స్ తహసీల్దార్ సుమబాల, సీఎస్‌డీటీ మురళి తదితరులు పాల్గొన్నారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతోంది. విజిలెన్స్ దాడులతో కలకలం దిమిలి వద్ద రైసుమిల్లులపై ఆదివారం అధికారులు దాడులు చేయడం కలకలం సృష్టించింది. పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. అయితే ఇలా పట్టుకున్న కేసులు కోర్టుల్లో వీగిపోవడం, అధికారుల ఉదాసీనత కారణంగా పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. ఇకనైనా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకొని పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
జాతీయ రహదారిపై విజిలెన్స్ తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుం డా, అధికలోడుతో వెళుతున్న లారీలు, టిప్పర్లకు జరిమానా విధించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీకంఠనా«థ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, పీవీ నారాయణ, డీసీటీఓ రవికుమార్, విష్ణు, ఎంవీఐలు శ్రీనివాసరావు, సుధాకర్‌రెడ్డి, పూర్ణచంద్రరావు, ఏజీ ఆనంద్, బాలరాజు, సిబ్బంది మూడుబృందాలుగా విడిపోయారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వెంకటాచలం టోల్‌ప్లాజా, నాయుడుపేట జంక్షన్, కావలి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుండా వెళుతున్న మూడు గ్రానైట్ లారీలు, ఏడు మెటల్ లారీలు, రెండు బొగ్గు లారీలు, అధికలోడుతో వెళుతున్న క్వార్ట్జ్, ఇటుక, లారీలను నిలిపివేశా రు. ఓవర్‌లోడ్ వాహనాల నుంచి రూ 8,48,020, మైనింగ్ బిల్లులేని వాటి నుంచి రూ.35,930, అగ్రి కల్చర్ మార్కెటింగ్ రుసుము కట్టని వాహనాల నుంచి రూ.3,14,425 జరిమానా వసూలు చేశా రు. తనిఖీలు నిత్యం జరుగుతూ ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలియజేశారు. -
ముందురోజు ఉడకబెట్టి మరుసటి రోజుకు ఆర్డర్ సప్లయి..
విజయనగరం టౌన్: ఆకలేస్తుందనుకుని ఆదరాబాదారాగా హోటల్స్‌కి వెళ్లి, నచ్చినది ఆర్డర్ ఇచ్చి తినేద్దామనుకుంటున్నారా! అసలు విషయం తెలిస్తే అటువైపు అడుగు కూడా వేయరేమో.. బూజుపట్టిన ఆహార పదార్ధాలను అమ్మకానికి ఉంచడం, ముందు రోజు ఉడకబెట్టి ఫ్రై చేసిన చికెన్, మటన్, రొయ్యలు వంటి మాంస పదార్ధాలను మరుసటి రోజుకు ఉంచి వాటినే వేడి చేసి ఆర్డర్ ఇచ్చిన వారికి ఆహారాన్ని అందించేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఆహారాన్ని అందించాల్సిన పలు హోటల్స్ యజమానులు హాటల్స్‌కి వచ్చి ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించి, తమకు ఇష్టమైన ఆహారాన్ని తినాలనుకునే భోజనప్రియులకు రోగాలబారిన పడే ఆహారాన్ని అందిస్తున్నారనేది మింగుడుపడని విషయం. విజిలెన్స్ తనిఖీల్లో దారుణమైన అంశాలు వెలుగులోకి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి టి.హరికృష్ణ పర్యవేక్షణలో పట్టణంలో గల పలు రెస్టారెంట్లపై తూనికలు, కొలతలు, ఫుడ్ సేఫ్టీ అ«ధికారులతో కలిసి పలు రెస్టారెంట్లపై మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న హ్యాపీ రెస్టారెంట్, ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్ ఎదురుగా ఉన్న హేలాపురి రెస్టారెంట్, దాసన్నపేట వద్ద ఉన్న రాజా, మహారాజా తదితర పలు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నిర్వహకులు నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను వాడేస్తున్నారన్నారు. బూజుపట్టిన పదార్ధాలను అమ్మకాలు చేపడుతున్నారని, ఒక హోటల్లో నిల్వ ఉంచిన మాంసం ఫ్రైడ్ చికెన్ మీద ఫంగస్‌ను కూడా గుర్తించామన్నారు. ఈ మేరకు పుడ్ సేప్టీ అధికారులు నమూనాలు సేకరించారని, వాటిని నాచారంలోని ఫుడ్ సేఫ్టీ లేబోరేటరీకి విశ్లేషణకు పంపిస్తున్నామన్నారు. మున్సిపల్ అధికారుల నుంచి తీసుకోవాల్సిన డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లేవని, పరిసరాలు అనారోగ్యకరంగా, అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. రెండు హోటల్స్ వ్యాపారులపై లీగల్ మెటలర్టీ అధికారులు సెక్షన్ 8/25 లీగల్ మెటలర్జి యాక్ట్ 2009 ప్రకారం, ప్రతీ ఏడాది ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్లను రెన్యువల్ చేసి సర్టిఫికెట్ పొందనందుకు కేసులు పెట్టామన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. తనిఖీల్లో శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి భార్గవరావునాయుడు, డీఎస్పీ వెంకటరత్నం, ఫుడ్ సేఫ్టీ అధికారి వరప్రసాద్, లీగల్ మెటలర్జీ అధికారి సూర్యత్రినాధరావు, డీసీటీవో తారకరామారావు, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇంత దారుణమా!
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను చూసి విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.మెనూ సక్రమంగా పాటించకపోవడం..నాసిరకం భోజనం.. దుస్థితిలో వంట గదులు.. అధ్వానంగా మరుగుదొడ్లు.. నీటి సమస్యతో విద్యార్థుల అవస్థలు.. హాజరు పట్టిలో మాయాజాలం.. బయోమెట్రిక్ మెషిన్లు మూలన పెట్టేసి విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించడంపై తనిఖీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించాల్సిన ఆర్వో మెషిన్లు మూలన పడ్డాయి. అద్దె భవనాలు.. ఇరుకు గదుల్లో చదువులపై గురువారం తెల్లవారు జాము నుంచి విజిలెన్స్ అధికారులు ఎనిమిది హాస్టళ్లను తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి నిర్వాహకులపైఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు సైతంలేవని తనిఖీ బృందం గుర్తించింది. నెల్లూరు రూరల్: జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో సౌకర్యాలపై గురువారం తెల్లవారుజాము నుంచే విజిలెన్స్ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి బాలాయపల్లి, వెంకటగిరి, చిట్టేడు, మర్రిపాడు, కంపసముద్రం, చిట్టమూరు, వింజమూరు, సిద్ధనకొండూరు ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లల్లో తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లో వసతులు, నిత్యావసర సరుకుల కొనుగోలు, వస్తువుల వినియోగం, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య ఇలా అన్నింటిని తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం నమోదు చేసుకున్న వివరాలు కూడా పరిశీలించారు. ప్రస్తుతం హాస్టళ్లల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టికలోని విద్యార్థుల సంఖ్యకు వ్యత్యాసం ఉన్నట్లుగుర్తించారు. బయోమెట్రిక్ మెషిన్లు వినియోగించకుండా ఎక్కువ మంది విద్యార్థులను చూపిస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తేల్చారు. హాస్టల్ వార్డెన్లు నాసిరకం వస్తువులు వినియోగించి విద్యార్థులకు భోజనం పెడుతూ నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. హాస్టల్లో నిల్వ చేసిన వేరుశనగ విత్తనాలు, పప్పు దినుసులు పుచ్చిపోయి పురుగులు కనిపిస్తున్నా.. వాటితో చట్నీ చేసి విద్యార్థులకు వడ్డించినట్లు తేల్చారు. కూరగాయలు వాడిపోయి ఉన్నవి. ఇక అన్ని వంటల్లో వినియోగించే ఉప్పు, నూనెలు కాలం తీరినవే ఉన్నాయి. అన్నం పూర్తిగా ముద్దగా మారడమే కాకుండా ఉంటలు కట్టి ఉంది. ఉదయం టిఫిన్‌గా గోధుమ రవ్వతో ఉప్మా చేయాల్సి ఉండగా పులి హోరాతో సరిపెట్టారు. కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వనే లేదు. అన్ని చోట్లా నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెలుగు చూసింది. తాగునీరు..పారిశుద్ధ్యం అధ్వానం హాస్టల్లో తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేస్తుండగా, మరుగుదొడ్లు, బాత్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయి. వాటిలో ఒకదానికి కూడా సరిగా తలుపులు సరిగా లేవు. వీటిని శుభ్రం చేసేవారు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హాస్టళ్ల పరిస్థితి, స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో మిషన్లు పనిచేయడం లేదని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. సౌకర్యాలు, అధికారుల పనితీరుపై ఓ నివేదికను ప్రభుత్వానికి పంపి, బాధ్యులపై చర్యలకు సిఫారస్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. జిల్లా అంతటా ఇంతే! పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదలలో జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦ సిద్ధనకొండూరులోని వసతిగృహానికి ప్రహరీ లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. వసతిగృహం భవనాలు ఉరుస్తున్నాయి. ♦ కోట బాలికల వసతి గృహంలో నీటి వసతి సరిగాలేదు. మరుగుదొడ్లకు తలుపుల్లేవు. వార్డెన్‌కు మందలింపు, సిబ్బందిపై ఆగ్రహం. ♦ వెంకటగిరిలో అధ్వానంగా వంట గది, పని చేయని ఆర్వో మెషిన్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదు. బాత్రూమ్లు సరిపడా లేవు. -
సంక్షేమంలో తనిఖీల కలవరం!
ఒంగోలు టూటౌన్: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీల కలవరం పట్టుకుంది. ఇటీవల విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేసి జిల్లా వ్యాప్తంగా కలవరం కలిగించగా.. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఊహించని విధంగా మార్కాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల ఒక న్యాయమూర్తి సైతం పశ్చిమ ప్రాంతంలోని బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఆగస్టు నెల ప్రారంభంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉమాదేవి ఒంగోలు నగరంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహన్ని తనిఖీ చేశారు. తాజాగా గురువారం విజిలెన్స్ డీఎస్పీ రజనీకుమారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇలా వరుస తనిఖీలతో అటు వసతి గృహాల సంక్షేమాధికారులతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 79 సంక్షేమ వసతి గృహాలు నడుస్తున్నాయి. మొత్తం 8,100 మంది మంజూరు సంఖ్యకుగాను 8,067 మందికి అవకాశం కల్పించారు. వీటిలో 62 వసతి గృహాల్లో బాలురు, 17 వసతి గృహాల్లో బాలికలు ఉండి విద్యనభ్యసిస్తున్నారు. బీసీ వసతి గృహాలు 77 ఉండగా వీటిలో 58 బాలురకు, 18 బాలికలకు కేటాయించారు. మొత్తం దాదాపు 6,749 మంది వరకు విద్యార్థులు ఈ వసతి గృహాలో ఉండి చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహాలు మరో 24 వరకు ఉన్నాయి. వీటిలో 12 బాలురకు, 12 బాలికల కోసం నడుపుతున్నారు. దాదాపు 18 63 మంది విద్యార్థులు ఉన్నారు. 77 వసతి గృహాల్లో 44 వసతి గృహాలు ప్రభుత్వ భవనాలు కలిగి ఉండగా, మిగిలిన వసతి గృహలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా 14 రెసిడెన్సియల్ పాఠశాలలు, 3 గిరిజన వసతి గృహాలు, 3 కళాశాల వసతి గృహాలు, 17 ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 4,778 మంది విద్యార్థులు ఉన్నారు. తనిఖీలతో వెలుగులోకి వస్తున్న సమస్యలు.. నిఘా సంస్థలు వసతి గృహాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో పేద పిల్లల పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క హాస్టలో విద్యార్థులు అనుభవిస్తున్న కష్టాలు విని చలించిపోతున్నారు. గత నెలలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలపై పలుచోట్ల ఏకకాలంలో దాడులు చేయడంతో అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఒంగోలులోని సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయంలో విద్యార్థిను బాధలు అన్నీ, ఇన్నీ కావు, ఇచ్చిన మెను సక్రమంగా అమలు కావడం లేదు. సరిపడా బాత్రూమ్లు లేవు, ఇరుకు గదుల్లో తీవ్ర అగచాట్లు పడుతుండటం చూసిన తనిఖీ అధికారులు గుండె చెరువైయింది. అదే విధంగా శింగరాయకొండ బాలుర వసతి గృహం, అద్దంకి ఇలా పలు హాస్లళ్లలో పిల్లలు పడుతున్న బాధలు, కష్టాలు కళ్లకు కట్టినట్లు అధికారులకు కనపడ్డాయి. చాలా వసతి గృహాల్లో ఇప్పటికి నీటి వసతి లేని పరిస్థితి నెలకొంది. పశ్చిమ ప్రాంతంలో ఇటీవల ఒక న్యాయమూర్తి ఆకస్మికంగా ప్రభుత్వ బాలికల వసతి గృహన్ని తనిఖీ చేయడం, విద్యార్థినులు పడుతున్న అవస్థలు చూడటం, సంక్షేమ అధికారిణి పిల్లలను అవమాన కరంగా మాట్లాడుతుందో పిల్లల నోట విని విస్తుపోవాల్సి వచ్చింది. సరుకు నిల్వల్లోనూ వ్యత్యాసం.. అదే విధంగా మంగళవారం జిల్లాలోని మార్కాపురంలోని సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేయడంతో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. రిజిస్టర్లో నమోదు చేసిన సంఖ్యకు వాస్తవంగా ఉన్న విద్యార్థుల సంఖ్యకు తేడా ఉన్నట్లు గుర్తించారు. నిత్యవసర వస్తువుల నిల్వలోనూ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఎక్కడ అమలు కాని పరిస్థితి నెలకొంది. అదే విధంగా వలేటివారిపాలెంలోని ఎస్సీ వసతి గృహంలోనూ తనిఖీలు జరిగాయి. మరుగుదొడ్లు, నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గత విజిలెన్స్ తనిఖీల సమయంలోనూ, ఇప్పుడు ఏసీబీ తనిఖీల సమయంలో చాలా భవనాలు మరమ్మతులకు గురై కనిపించాయి. స్థానికంగా నివాసం ఉండని వార్డెన్లు.. రెండు నెలల క్రితం వసతి గృహాల్లో మెను సక్రమంగా అమలు కావడం లేదని నివేదికలు అందుకున్న కలెక్టర్ ఒకరిద్దరు వార్డెన్లను సస్పెండ్ చేశారు. ప్రతిరోజు ఆయా సంక్షేమ శాఖల అధికారులు హాస్టళ్లను తనిఖీలు చేస్తున్నా.. ఎక్కడా మార్పు కనిపించడం లేదు. కొంతమంది వార్డెన్లు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వెళ్లొస్తున్నారు. పిల్లలను వంట, వాచ్మెన్, సిబ్బందికి వదిలేసి వస్తున్నారు. ఇటీవల సాక్షి బృందం కూడా జిల్లాలోని పలు సంక్షేమ వసతి గృహాలను విస్తృతంగా పరిశీలించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అయినా నేటికి విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతలో కొంతైనా నిఘా సంస్థలు తనిఖీలతో ఆయా సంక్షేమ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ వసతి గృహం తనిఖీ చేస్తారోనని భయం మాత్రం అందని వార్డెన్లలో నెలకొంది. పాలకుల నిర్లక్ష్యంలో హాస్టళ్లు.. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు దశాబ్దాలుగా విద్యార్థును వెంటాడుతూనే ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఏటా మరమ్మతుల పేరుతో తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకోవడం పాలకులకు పరిపాటయింది. చాలా చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాలలో ఏళ్ల తరబడి కొనసాగించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నా కారణం చూపి వసతి గృహాలను మూసివేశారు. ఆయా వసతి గృహాలు ఇప్పటికి చిల్లచెట్లలో నిరూపయోగంగా పడి ఉన్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించాలన్న లక్ష్యం ఏ కోశానా ప్రభుత్వంలో కనిపించని పరిస్థితి నెలకొంది. సంక్షేమ వసతి గృహలలో పేద పిల్లలకు కనీస మౌలిక చదుపాయాలు కల్పించాలని దళిత, గిరిజన, బీసీ నేతలు ఏ నాడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన పాపన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కులాల పేరుచెప్పి పదవులు అనుభవించడం తప్ప.. జాతి సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాడిన నాయకులు కనిపించడం లేదని మండి పడుతున్నారు. స్టాకులో తేడాలు.. గురువారం విజిలెన్స్ డీఎస్పీ రజనీకుమారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గుడ్లూరు, కొండపి, వెలిగండ్ల, దర్శి నియోజకవర్గంలోని కాకర్ల, కొత్తపట్నం మండలంలోని బాలుర, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. వీటిలో కొన్ని చోట్ల ఆహార పదార్థాల స్టాక్‌లో తేడాలు గుర్తించారు. కొత్తపట్నం మండంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నూనె నిల్వలో కొంత తేడా గుర్తించగా, మెనూ సక్రమంగా అమలవుతుందని గుర్తించారు. మంచినీటి సమస్య అలానే ఉండటంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. అదే విధంగా బాలికల వసతి గృహంలో మెనూతో పాటు రిజిస్టర్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, వసతి గృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు పెద్ద తేడా లేదని గుర్తించారు. గుడ్లూరు వసతి గృహంలో బియ్యం నిల్వలో తేడాను గమనించారు. -
వసతి గృహాలపై విజిలెన్స్ దాడులు
చిత్తూరు ఎడ్యుకేషన్ : జిల్లాలోని వసతి గృహాలపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 12 బృందాలుగా విడిపోయి ఉదయం ఆరు గంటల నుంచే ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని 12 ఎస్సీ వసతి గృహాల్లో ఒకేసారి విజిలెన్స్ దాడులు నిర్వహిం చారు. చిత్తూరులోని సంజయ్‌గాంధీనగరలో ఉన్న బాలుర వసతి గృహం, పచ్చికాపల్లం బాలు ర వసతి గృహం, వెదురుకుప్పం (బాలురు), కార్వేటినగరం(బాలురు, బాలికలు), మదనపల్లెలో (బాలురు), బైరెడ్డిపల్లిలో (బాలురు), పలమనేరు వద్ద కొలమాసనపల్లి (బాలురు), వరదయ్యపాళెం మండలంలోని సంతవేలూరు (బాలురు),వరదయ్యపాళెం గంగాధరనెల్లూరు(బాలికల) వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని సంజయ్‌గాంధీనగర్ లో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో విజిలెన్స్ డీఈ శ్రీనివాసరెడ్డి తనిఖీలు చేపట్టారు. అక్కడి రికార్డులు, మరుగుదొడ్లు, వంటగది, స్టాక్‌రూం, బయోమెట్రిక్, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు చిత్తూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉదయం 6 గంటలకు వార్డెన్ లేకపోవడాన్ని గుర్తించారు. హాస్టల్‌కు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల వివరాలను రోజువారి స్టాకు రిజిస్టర్లో నమోదు చేయడం లేదని తేలింది. స్టోర్ రూంలో ఎక్కువ బియ్యం బస్తాలు ఉన్నాయని, విద్యార్థులకు వైద్యులు మూడేళ్లుగా హాస్టల్‌కు వచ్చి చికిత్స చేయడం లేదని గుర్తించారు. అలాగే నాసిరకం కందిపప్పు వాడకం, ట్యూటర్లు లేకున్నా బిల్లులు పెట్టుకోవడం ఇలా పలు అక్రమాలు తనిఖీల్లో తేలాయి. ఇదే విధంగా జిల్లాలో మిగిలిన వసతి గృహాల్లో చాలా అక్రమాలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అవకతవకలు, సౌకర్యాల లేమి వంటి వాటిపై సంబంధిత హాస్టల్ వార్డెన్ల నుంచి లిఖిత పూర్వకంగా నివేదికలు తీసుకున్నారు. వీటిని విజిలెన్స్ డీజీకి పంపి, అక్కడ నుంచి ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ముందుగానే నిఘా పెట్టాం సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గురువారం జిల్లాలోని 12 ఎస్సీ వసతి గృహా ల్లో తనిఖీలు చేశాం. గత రెండు నెలల్లో చిత్తూరు జిల్లాలోని 10 వసతి గృహాలను తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. అదే విధంగా గురువారం జరిగిన తనిఖీల్లో డైట్‌చార్టు అమలుచేయకపోవడం, ఎక్కువ సరుకులు పొందుతుండడం, బయోమెట్రిక్ పనిచేయకపోవడం వంటి అక్రమాలు బయటపడ్డాయి.– రాధాకృష్ణ, విజిలెన్స్ ఎస్పీ -
సంక్షోభంలో సంక్షేమం
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పలుచోట్ల హాస్టళ్లు సమస్యల లోగిళ్లుగానే ఉన్నాయి. అస్తవ్యస్త మరుగుదొడ్లు, తాగునీటి కరువు, దోమల బాధ, ఉక్కపోతతో విద్యార్థులు అల్లాడుతున్నారు. గత నెల 25న జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సహా 20చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేపల్లె, తెనాలి, అమరావతి, చేబ్రోలు, గురజాల, గుంటూరు నగరం, నిజాంపట్నంలోని హాస్టళ్లను ఐదు బృందాలుగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక అక్రమాలు, సమస్యలు వెలుగు చూశాయి. 70 శాతానికి పైగా వసతి గృహాల్లో బోగస్ ఎన్రోల్మెంట్లు బయటపడ్డాయి. ఉన్న విద్యార్థుల కన్నా అధికంగా 20శాతం చూపించి వార్డెన్లు జేబులు నింపుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానం ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించగా.. సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు. భద్రత ప్రశ్నార్థకం బాలికల వసతి గృహాల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో చాలా వరకూ ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీ వాచ్మెన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు రాత్రయితే చాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరుగుదొడ్లకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కొన్నిచోట్ల విద్యార్థినులు అరుబయట కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేపల్లెలోని ఓ సంక్షేమ వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నప్పటికీ వాటికి కరెంటు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల వద్ద మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. పౌష్టికాహారం అందని ద్రాక్షే.. విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందని ద్రాక్షలానే మారింది. జిల్లాలోని చాలా వరకూ వసతి గృహాల్లో కొత్త డైట్ విధానం అమలు కావడం లేదు. వారానికి ఒక్కసారి కూడా కోడిగుడ్డు ఇవ్వడం లేదని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. పాలు కూడా విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. హాస్టళ్లలో ఎక్కడా ఆర్వో వాటర్ సిస్టమ్ అమలు కావడం లేదు. నేటికీ కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యి మీదనే వంటలు వండుతూ పొగ చూరిన ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. గురుకులాల్లో టీచర్ల కొరత విజిలెన్స్ అధికారుల తనఖీల్లో గురుకులాల్లో సిబ్బంది కొరత బయటపడింది. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు బోధించే సిబ్బందే ఎనిమిది, తొమ్మిది, పది విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రిన్సిపాళ్ల గైర్హాజరు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ అక్రమాలు జరుగుతున్నాయి. వంటలు చేసే సిబ్బంది నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. నిధుల దుర్వినియోగం తనిఖీల సమయంలో జిల్లాలోని చాలా హాస్టళ్లలో పలు సమస్యల్ని గుర్తించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను పరిశీలించాలి. అప్పుడే వార్డెన్లు అక్రమాలకు పాల్పడకుండా నిధులు వినియోగిస్తారు. – శోభామంజరి, విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ -
బాలికల దీనస్థితి.. చలించిపోయిన డీఎస్పీ!
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆమె మండిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్లో చిన్నారులు అనారోగ్యం పాలైనా పట్టించుకోకుండా.. వార్డెన్ షేక్ నాగర్ బీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. సెప్టిక్ ట్యాంక్ పగిలిపోయి హాస్టల్ మొత్తం దుర్వాసన వస్తున్నా వార్డెన్ ఏమాత్రం స్పందించకుండా పిల్లల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. తాగడానికి, కాలకృత్యాలకు కూడా నీళ్లు లేకపోవడంతో బాలికలే బయట నుంచి నీటిని మోసుకొని వస్తున్నారు. శుభ్రం చేయని నీటిని తాగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాలికలు విజిలెన్స్ అధికారులకు తెలిపారు. ఇటీవల ఇదే జిల్లాలోని దేవరపల్లి మండలంలోని చిన్నాయిగూడెం బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లోనూ.. బాలికల దీన పరిస్థితులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
తనిఖీలకొస్తే తలుపేశారు !
రికార్డుల తనిఖీలకు వచ్చిన విజిలెన్స్ అధికారులకు ఎవరైనా ఏం చేస్తారు.. రికార్డులు చూపించి సహకరిస్తారు. కానీ బందరు మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రికార్డులు చూపించడం సంగతి అటుంచితే.. కనీసం తలుపులు కూడా తీయలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ ఒక్క వ్యవహారం చాలు ఆశాఖలో ఏ మేరకు అవినీతి రాజ్యమేలుతోందో తెలిపేందుకు అని పరిశీలకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాక్షి, మచిలీపట్నం: 2016–17 ఆర్థిక సంవత్సరంలో బందరులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకంలో జోన్–2 పరిధిలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. రూ.5 కోట్లు వెచ్చించి చేపట్టిన పనుల్లో నిబంధనలు తోసిరాజని, ధనార్జనే ధ్యేయంగా ముందుకు కదిలారు. నాసిరకం నిర్మాణాలతో రూ.లక్షలు దిగమించారు. ఈ అక్రమ తంతుపై ఇటీవల ‘నిధులు గుల్ల.. పనులు డొల్ల.’ అనే శీర్షికతో ఈనెల 24 ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దోపిడీ పర్వంపై విశ్లేషణతో కూడిన కథనానికి విజిలెన్స్ అధికారులు స్పందించారు. ఈ అక్రమ బాగోతం గుట్టురట్టు చేసేందుకు రికార్డులు తనిఖీ నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగానే మంగళవారం బందరు మున్సిపల్ కార్యాయానికి వెళ్లారు. ముఖం మీదే తలుపేశారు.. ఇప్పటికే బాక్స్ టెండర్ల అంశంలో అవినీతిని మూటగట్టుకున్న విషయం తెలిసింది. తాజాగా ‘సాక్షి’ కథనం సైతం కలకలం రేపింది. ఇదే సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమ తంతుపై కథనం ప్రచురితం కావడంతో విజిలెన్స్ అధికారులు నిజాలు నిగ్గుతేల్చేందుకు మంగళవారం మచిలీపట్నంలోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పాలకవర్గం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రస్తుతం అధికారులకు సహకరించి రికార్డులు సమర్పిస్తే తమ బండారం బయట పడుతుందని భావించారు. ఎలాగైనా తప్పించుకునేందుకు ఎత్తుగడ వేశారు. అప్పుడే ఓ ఉపాయానికి తెర తీశారు. ఎలాగో వైఎస్సార్ సీపీ బంద్ కొనసాగుతోందని, బంద్ ముసుగులో మస్కా కొట్టాలని తలంచారు. అనుకున్నదే తడువుగా వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు. ఇందులోనే మున్సిపల్ అధికారులు రెవెన్యూ సెక్షన్‌కు చేరుకున్నారు. అక్కడే అసలు కథ ప్రారంభమైంది. అక్కడికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు తలుపు వద్దకు వెళ్లగా ఒక్కసారిగా మూసేశారు. అదేమని ప్రశ్నించగా.. ఈ రోజు రాష్ట్ర బంద్ కొనసాగుతోందని, ప్రస్తుతం కార్యాలయం తెరిస్తే.. ఆందోళన కారులు కార్యాలయంలోకి ప్రవేశిస్తే నష్టం జరుగుతుందని, అందుకే తలుపులు మూసేస్తున్నామని నమ్మబలికారు. బంద్ అనంతరం బుధవారం వస్తే మీకు సహకరిస్తామని చెప్పినట్లు సమచారం. తాము విజిలెన్స్ అధికారులమని చెప్పినా పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఉదయం వచ్చిన విజిలెన్స్ అధికారులు గంటలకొద్దీ అక్కడే కూర్చున్నా లాభం లేకుండా పోయింది. ఎంతకూ ఏ ఒక్క అధికారి సైతం సహకరించకపోవడంతో చేసేది లేక వెనుదిరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కనీసం అధికారులకు సహకరించలేదంటే మున్సిపాలిటీలో ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. విజిలెన్స్ అధికారులకు సహకరించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేనున్నప్పుడు వస్తామన్నారు బందరు మున్సిపల్ కార్యాలయానికి మంగళవారం విజిలెన్స్ అధికారులు వచ్చిన మాట వాస్తవమే. అయితే బంద్ కావడంతో ఆ రోజు నేనే విధులకు హాజరు కాలేదు. నేను కార్యాలయంలో ఉన్న రోజు వస్తామని మా సిబ్బందితో చెప్పి వారు వెళ్లిపోయారు. – సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
బల్లిపర్రు బాలికల హాస్టల్‌పై విజి‘లెన్స్’
పెడన మండలం బల్లిపర్రులోని బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖాలు చేశారు. అయితే, తనిఖీల సమయంలో సహకరించకపోతే వంట సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఎదురుతిరిగారు. ఏకవచనంతో సంభోదిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులతోపాటు టీచర్లు కూడా అవాక్కయ్యారు. పెడన : విజయవాడకు చెందిన విజిలెన్స్ సీఐ అపర్ణ, డీసీటీవో డి. చెన్నయ్య, హెడ్ కానిస్టేబుల్ అన్సారీ బుధవారం మధ్యాహ్నం బల్లిపర్రు గురుకుల పాఠశాల (హాస్టల్) తనిఖీకి వచ్చారు. భోజన సమయానికి వచ్చిన వీరు డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. తనిఖీల సమయంలో అక్కడ పని చేస్తున్న టీచర్లు, సిబ్బంది నుంచి ఫోన్లు తీసేసుకున్నారు. పెరుగు ఎంత ఉందనే దానిపై కాటా వేస్తుండగా వంట సిబ్బందిలో పని చేస్తున్న రూబెన్ అనే పెళ్లి కాని యువకుడు విజిలెన్స్ అధికారులకు ఎదురుతిరిగాడు. తన ఫోన్ ఇవ్వాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. కాంట్రాక్టరు తల్లి జయమ్మ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండటంతో అక్కడే ఉన్న టీచర్లు వారిస్తున్నా వినిపించుకోలేదు. గట్టిగట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. ‘మీకు ఎందుకు సమాధానం చెప్పాలి.. మా కాంట్రాక్టు రద్దయినా పని చేస్తున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి..’ అని సమాధానం చెప్పడంతో విజిలెన్స్ సీఐ అపర్ణ వెంటనే గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పి. యానాదికి ఫోన్లో పరిస్థితిని వివరించి తక్షణం రావాల్సిందిగా కోరారు. డార్మెటరీ అధ్వానం...బాత్రూమ్లు అపరిశుభ్రం విద్యార్థినులు పడుకునే గదులున్న డార్మెటరీ అధ్వానంగా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వాడకం నీరు లేకపోవడం, పై అంతస్తుల్లోని బాత్రూమ్ల వద్ద నీరు లీకై కారుతుండటం వంటి వాటిని ఫొటోలు తీసుకుని నివేదికలు రూపొందించారు. విద్యార్థినులకు సరిపడ గదులు లేవని నమోదు చేసుకున్నారు. బాత్రూమ్ల వద్ద అపరిశుభ్రత వాతావరణంపై సీఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులు, విద్యార్థినులుండే గదులు బూజుపట్టి ఉండటంపై టీచర్లను ప్రశ్నించారు. ఇష్టానుసారంగా రికార్డుల్లో నమోదు.. అధికారులు అటెండెన్స్ రిజిస్టర్లతో పాటు పలు రికార్డులను కూడా పరిశీలించారు. ఉన్నతాధికారులు రిలీవ్ చేయకుండా, ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఈ నెల 21న ప్రిన్సిపల్ ఎన్వీ రమణమ్మ రిలీవ్ అయిపోతున్నట్లు అటెండెన్స్ రిజిస్టరులో సంతకం చేసి వెళ్లిపోయారు. అనంతరం 22న మూమెంట్ రిజిస్టరులో టీచర్లకు సూచనలు, సలహాలు చేసినట్లు ప్రిన్సిపల్ రమణమ్మ నమోదు చేసి ఉండటాన్ని గుర్తించారు. 24వ తేదీన సర్క్యులర్ రిజిస్టరులో జి భ్రమరాంబకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించినట్లు నమోదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఈ విధంగా రికార్డుల్లో రాయడం వంటి విషయాలను నమోదు చేసుకున్నారు. కుకింగ్ ఏజెన్సీ రద్దు.. గురుకుల పాఠశాలల (డీసీ) జిల్లా సమన్వయకర్త పి. యానాది, బదిలీపై వెళ్లిన ప్రిన్సిపల్ రమణమ్మ బుధవారం సాయంత్రం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. వంట సిబ్బంది ఎదురుతిరిగిన సంఘటనలను సెల్‌ఫోన్ ద్వారా రికార్డు చేసి డీసీకి చూపించారు. ఆయన వంట ఏజెన్సీ కాంట్రాక్టరును పిలిచి చీవాట్లు పెట్టారు. విజిలెన్స్ సీఐ అపర్ణ మాట్లాడుతూ స్థానికంగా పని చేస్తున్న టీచర్ల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండటంపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. టీచర్లంటే కూడా భయం లేకుండా సిబ్బంది ప్రవర్తించడం వంటివి భవిష్యత్‌కు మంచి పరిణామం కాదని స్పష్టం చేశారు. డీసీ యానాది స్పందిస్తూ తక్షణం కుకింగ్ ఏజన్సీని రద్దు చేసి మరొకరికి అప్పగించాలని సిబ్బందిని ఆదేశించడమే కాకుండా ఉత్తర్వులను రెడీ చేయాలని సూచించారు. విద్యార్థినులుండే చోట పెళ్లికాని యువకుడు ఏడాది నుంచి పని చేస్తుంటే పట్టించుకోకపోవడంపై సీఐ వారిని ప్రశ్నించారు. అనంతరం పలు విషయాలను నమోదు చేసుకున్న అనంతరం విజిలెన్స్ అధికారులు వెనుదిరిగారు. సౌజన్యకు ఇన్చార్జి బాధ్యతలు.. గురుకుల పాఠశాలలో ఇటీవల బదిలీపై వచ్చిన బయాలజీ టీచరు ఎం. సౌజన్యకు ఇన్చార్జి బాధ్యతలను డీసీ యానాది అప్పగించారు. పది రోజులు ఇన్చార్జిగా వ్యవహరించాలని, అనంతరం జిల్లాలో సీనియర్‌ను తీసుకువచ్చి రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా నియమిస్తామని చెప్పారు. -
సంక్షేమం పుచ్చు!
హిందూపురం అర్బన్/అనంతపురం సెంట్రల్: జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో సౌకర్యాలపై బుధవారం రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి అనంతపురం, తాడిపత్రి, హిందూపురం తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయితే అన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెలుగుచూసింది. పిల్లలకు నాసిరకం భోజనం వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బయోమెట్రిక్ మిషన్లు వినియోగించకుండా ఎక్కువ మంది విద్యార్థుల చూపిస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తేల్చారు. ఈ విషయాలన్నింటినీ గుర్తించి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు లేఖను పంపుతామని రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు తెలిపారు. తెల్లవారుజామునుంచే.. విజిలెన్స్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం తెల్లవారుజామునే హిందూపురం, పరిగి ప్రాంతాల్లో ఎస్సీ వసతి గృహాల్లో తనిఖీలు చేశారు. వసతులు, నిత్యావసర సరుకుల కొనుగోలు, వస్తువుల వినియోగం, పారిశుద్ధ్యం, విద్యార్థుల సంఖ్య ఇలా అన్ని కోణాల్లో తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం నమోదు చేస్తున్న వివరాలు కూడా పరిశీలించారు. హిందూపురం హాస్టల్లో 42 మంది దాకా విద్యార్థులుండగా హాజరుపట్టికలో మాత్రం 108 మంది ఉన్నట్లు చూపారు. హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాసిరకం వస్తువులు వినియోగించి విద్యార్థులకు భోజనం పెడుతూ నిధులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్చించారు. హాస్టల్లో నిల్వ చేసిన వేరుశనగ విత్తనాలు, పప్పు దినుసులు పుచ్చిపోయి పురుగులు కనిపిస్తున్నా...వాటితో చెట్నీ చేసి విద్యార్థులకు వడ్డించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక అన్ని వంటల్లో వినియోగించే ఉప్పు, నూనెలు కాలం తీరినవే ఉన్నాయి. అన్నం పూర్తిగా ముద్దగా మారడమే కాకుండా ఉంటలుగా కట్టి ఉంది. ఉదయం వండిన పులిహోర రుచి చూడగా జిగటలాగా అతుక్కుపోతోంది. తాగునీరు..పారిశుద్ధ్యం అధ్వానం హాస్టల్లో తాగునీటిని బయటనుంచి కొనుగోలు చేస్తుండగా... మరుగుదొడ్ల, బాత్రూంలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటిలో ఒకదానికి కూడా తలుపులు సరిగాలేవు. వీటిని శుభ్రం చేసే వారు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటకు వెళాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం హిందూపురం హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు. నివేదికలు అందిస్తాం హాస్టళ్ల పరిస్థితి..సౌకర్యాలు..అధికారుల తీరుపై ఓ నివేదికను ఉన్నతాధికారులకు పంపి చర్యలకు సిఫారసు చేస్తామని రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు తెలిపారు. తనిఖీల్లో సీఐలు రెడ్డప్ప, విశ్వనాథ చౌదరి, శ్రీనివాసరెడ్డి, డీఈ రవీంద్రకుమార్, డీసీటీఓ సుబ్బారెడ్డి, ఎస్ఐ రామకృష్టయ్య పాల్గొన్నారు.