weightlifting
-
బరువైపోయిందా ?
రెండు దశాబ్దాల క్రితం ఆమదాలవలస పేరు చెబితే జాతీయ స్థాయిలో ఠక్కున గుర్తుకొచ్చేది వెయిట్ లిఫ్టింగ్. ఒకరా ఇద్దరా.. పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటేవారు. విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్‌లోనూ ఆమదాలవలస వైభవాన్ని చాటిచెప్పారు. కానీ నేడు ఆ వైభవమంతా గతకాలపు స్మృతిగా మిగిలిపోయింది. కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి దిగ్గజ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం నేడు ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకుంది. ప్రోత్సాహం కరువై క్రీడాకారులు ఇటువైపు చూడటమే మానుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో ఒలింపిక్ పతకంతో పాటు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షణా కేంద్రానికి నేడు నిర్లక్ష్యపు గ్రహణం కమ్మేసింది. పట్టించుకునే నాథుడు లేక దయనీయ స్థితికి చేరుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పేరు మారుమ్రోగింది. ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమదాలవలస ప్రాంతం నుంచి వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు ఎక్కువగా వస్తుండటంతో 1987లో ప్రభుత్వం ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసింది.మెరిసిన ఆణిముత్యాలు.. ఈ ప్రాంతం నుంచి తొలిసారిగా ఊసవానిపేటకు చెందిన నీలం శెట్టి గురువునాయుడు సీనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఆ తరువాత నీలంశెట్టి సూర్యనారాయణ, కరణం నరసమ్మలు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే సీతమ్మ అనే క్రీడాకారిణి స్టేట్ చాంపియన్‌గా నిలిచింది. అనంతరం కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించి నీలంశెట్టి లక్ష్మి సిక్కోలు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్ధాయిలో నిలిపింది. ఇక 2000 సంవత్సరంలో ఆ్రస్టేలియాలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకంతో కరణం మల్లీశ్వరి సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నిలిచిన పూజారి శైలజ ప్రతిభ చెప్పనవసరంలేదు. వీరితోపాటు యామిని, కరణం కల్యాణి, కరణం కృష్ణవేణి, గౌరి, నీలంశెట్టి ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి, చీర రాజేశ్వరి, ఎన్ని శ్రీదేవి ఇలా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆదరణ లేకే.. ఆమదాలవలసలో తొలుత కొత్తకోట అమ్మినాయుడు అనే వ్యక్తి మారుతి వ్యాయామ మండలిని ఏర్పాటు చేశారు. అనంతరం 1983లో అప్పటి ప్రభుత్వం చిన్న శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది శిధిలావస్థకు చేరడంతో అమ్మినాయుడు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించుకున్నారు. 1987లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. వాటితో నూతన భవనాన్ని నిర్మించారు. నీలంశెట్టి అప్పన్న అనే వ్యక్తి కోచ్‌గా ఉండేవారు. ఆయన రిటైరయ్యాక కోచ్‌ను నియమించలేదు. దీంతో సీనియర్ క్రీడాకారులే శిక్షకులుగా వ్యవహరిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, ఔత్సాహికులు కూడా ముందుకు రాకపోవడంతో శిక్షణా కేంద్రం దయనీయ స్థితికి చేరుకుంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. సామగ్రి లేకపోవడంతో క్రీడాకారులు వెళ్లడం మానేశారు. దీంతో పూర్తిగా మూతపడిపోయింది. ఇటీవల ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి చిగురుపల్లి రాజ్యలక్ష్మి తన సొంత డబ్బులతో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ సామగ్రి ఏర్పాటు చేశారు. అక్కడే తన కుమార్తె చిగురుపల్లి హారికరాజ్కు శిక్షణ ఇస్తున్నారు. ఆ బాలిక ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండటంతో మరో 8 మంది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఆ వైభవం గతమే.. ఆమదాలవలసలో వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జాతీయ ,అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సుమారు 60నుంచి 80మంది వరకు ఉండేవారు. ఇప్పుడు పది విభాగాల్లో పాల్గొనేందుకు క్రీడాకారులే కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం శిధిలావస్థకు చేరిపోవడం బాధగాఉంది. 2001లో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్నాను. ప్రస్తుతం సరైన ప్రోత్సాహం, వసతులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావడంలేదు. ఈ ప్రాంతంలో ఈ క్రీడ కనుమరుగైపోకుండా చూడాలనే ఉద్దేశ్యంతో నా సొంత డబ్బుతో సామగ్రి కొనుగోలు చేసి నాకున్న సామర్థ్యం మేరకు శిక్షణ ఇస్తున్నాను. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఇటీవల రూ.50వేలు ఇచ్చి ప్రోత్సహించారు. నా కుమార్తెకు కూడా ఆయనే స్పాన్సర్ చేసి పోటీలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా శిక్షణా కేంద్రంలో సామగ్రి ఏర్పాటు చేసి, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఆదుకోవాలి. కోచ్‌ను ఏర్పాటు చేయాలి. – చిగురుపల్లి రాజ్యలక్ష్మి, వెయిట్ లిప్టర్, ఆమదాలవలసక్రీడాకారులు కరువు వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ క్రీడాంశాన్ని ఎంచుకుంటుంటారు. ఆరి్థక పరిస్థితులు అంతగా సహకరించక రాణించలేకపోతున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించినవారికి కనీసం హోంగార్డు పోస్టులో అయినా ప్రాధాన్యత ఇస్తే ఉత్సాహంగా ముందుకువచ్చేవారు. పతకం తెచ్చిన క్రీడాకారుడిని నాయకులు ఆరోజు అభినందించడం తప్ప తరువాత పట్టించుకోవడంలేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం 30 నుంచి 40 మంది మాత్రమే పాల్గొంటున్నారు. – బలివాడ తిరుపతిరావు, వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా మాజీ కార్యదర్శి, వెయిట్‌లిఫ్టర్ -
ప్రగతి ఉడుంపట్టు.. ఈసారి సిల్వర్ మెడల్..
సీనియర్ నటి ప్రగతి ఎన్నో సినిమాల్లో నటించింది. హీరోయిన్గా జర్నీ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే స్థిరపడిపోయింది. తల్లి, వదిన, అత్త పాత్రల్లో కనిపించి కనువిందు చేసింది. అయితే ఈ మధ్య సినిమాల జోరు తగ్గించేసిన ఈమె ఫిట్‌నెస్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా జిమ్‌లో బరువులు ఎత్తుతూ ఆ వీడియోలు షేర్ చేసేది. ఇది చూసిన జనాలు.. ఎప్పుడు చూసినా ఆ జిమ్‌లో ఉంటుందేంటి? అనుకునేవారు. కట్ చేస్తే మొన్నామధ్య బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. కేవలం పార్టిసిపేట్ చేయడమే కాదు ఏకంగా మూడోస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా వెయిట్ లిఫ్టింగ్‌లో మరో అవార్డు సాధించింది ప్రగతి. సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో రెండో స్థానంలో నిలిచింది. వెండి పతకాన్ని అందుకున్నానోచ్ అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది నటి. అందులో బరువులు ఎత్తిన నటి తర్వాత సిల్వర్ మెడల్ అందుకుంది. ఇది చూసిన అభిమానులు ప్రగతికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెయిట్ లిఫ్టింగ్‌పై పట్టు సాధిస్తూ అవార్డులు కొల్లగొట్టడం అంత ఈజీ కాదని పొగుడుతున్నారు. చదవండి: ఫోన్ చేస్తే స్పందన లేదు.. సోహైల్ అనగానే కట్.. -
ఆసియా పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన సాధియా ఆల్మస్
కేరళలో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్ సాధియా ఆల్మస్ సత్తా చాటింది. మంగళగిరికి చెందిన సాధియా 57 కేజీల జూనియర్ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్‌తో పాటు ఒక కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని సాధియా కోచ్, తండ్రి ఎస్కే సందాని పేర్కోన్నాడు. కాగా పోటీల్లో ఆల్మస్ స్వ్కాట్లో 57 కేజీల విభాగంలో 190 కేజీల బరువు ఎత్తి వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా సాధియా ఆల్మస్ను రాష్ట్ర పవర్ లిఫ్గింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ సూర్యనారాయణ తదితరులు అభినందించారు. చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ
2000, సెప్టెంబర్ 19.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం.. ఒలింపిక్స్ బహమతి ప్రదానోత్సవ వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతు లేని ఆనందం! బయటకు వ్యక్తీకరించలేని భావోద్వేగంతో పాతికేళ్ల వయసున్న ఒక అచ్చ తెలుగు బిడ్డ సగర్వంగా ఆ వేదికపై నిలబడింది. ప్రపంచానికి మరో వైపు భారత్‌లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. మన అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించే అంతటా చర్చ. ఇంకా చెప్పాలంటే తామే ఆ ఘనతను సాధించినంతగా ఎంతో మంది సంబరపడిపోయారు. కొద్ది క్షణాల తర్వాత ‘భారత్ కీ బేటీ’ అంటూ దేశ ప్రధాని వాజ్‌పేయి నుంచి వచ్చిన ఏకవాక్య ప్రశంస ఆ చారిత్రక ఘట్టం విలువను మరింత పెంచింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పతకమది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అందుకున్న గొప్ప విజయమది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుంచి వచ్చి ఒలింపిక్స్ వేదికపై కాంస్యం అందుకున్న ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి. ఒలింపిక్స్‌లో మనోళ్లు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని, పతకం ఆశించని భారత క్రీడాభిమానులకు ఆ కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నింటికి మించి మలీశ్వరి గెలిచిన మెడల్ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడల్లో రాణించాలనుకున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది. సిడ్నీ ఒలింపిక్స్‌కు ముందు భారత్ ఖాతాలో రెండు వ్యక్తిగత పతకాలు మాత్రమే ఉన్నాయి. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కె.డి. జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో లియాండర్ పేస్ ఆ పతకాలు సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లోనే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లీశ్వరి అప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకుంది. అయినా సరే ఒలింపిక్స్ పతకంపై అంచనాలు లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మన ప్లేయర్లు తడబడటం అప్పటికే ఎన్నో సార్లు కనిపించగా.. మల్లీశ్వరి వెయిట్ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశా లేకుండింది. 1993, 1994, 1995, 1996లలో వరుసగా నాలుగేళ్ల పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మల్లీశ్వరి పతకాలు గెలుచుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించింది. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరీకి మారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనూ కాంస్యం సాధించింది. అయితే ఒలింపిక్స్‌కు వచ్చే సరికి 69 కేజీల కేటగిరీలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొనకపోగా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి కూడా నాలుగేళ్లయింది. దాంతో మల్లీశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. ఆ రోజు ఏం జరిగిందంటే... ఫైనల్లో మొత్తం 15 మంది లిఫ్టర్లు పోటీ పడ్డారు. 12 మంది పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిపోగా, ముగ్గురి మధ్యనే తుది పోటీ నెలకొంది. స్నాచ్ విభాగంలో 110 కిలోల బరువెత్తిన మల్లీశ్వరి మరో లిఫ్టర్‌తో కలసి సమానంగా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో అంకమైన క్లీన్ అండ్ జర్క్ వచ్చింది. ఆమె కంటే ముందుగా చైనా, హంగేరీ అమ్మాయిలు 132.5, 130 కిలోల చొప్పున బరువులెత్తి సవాల్ విసిరారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం పాయింట్లు చూస్తే మిగతా ఇద్దరికంటే మల్లీశ్వరి 2.5 కిలోలు తక్కువ బరువెత్తింది. ఆమెకు ఆఖరి ప్రయత్నం మిగిలి ఉంది. ఆమె శరీర బరువును కూడా లెక్కలోకి తీసుకుంటే 132.5 కిలోలు ఎత్తితే రజతం ఖాయం, ఆపై 135 కిలోలు ఎత్తితే స్వర్ణం లభించేది. అయితే ఈ సమయంలో కోచ్‌లు ఇచ్చిన సూచనలతో పెద్ద సాహసానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కోల్పోరాదని భావించి నేరుగా 137.5 కిలోలు ఎత్తేందుకు సిద్ధపడింది. ప్రాక్టీస్‌లో దీనిని సునాయాసంగా ఎత్తిన అనుభవం ఉండటం ఆమె నమ్మకానికి కారణం. అయితే అంతకు ముందు రెండో ప్రయత్నంలో 130 కిలోలే ఎత్తిన మల్లీశ్వరి మూడో ప్రయత్నంలో ఏకంగా 7.5 కిలోలు పెంచడం అసాధ్యంగా మారింది. దానిని పూర్తి చేయలేక ఈ ప్రయత్నం ‘ఫౌల్’గా మారింది. చివరకు ఓవరాల్‌గా 240 కిలోల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితేనేం.. భారత క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అది సరిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. అమ్మ అండగా.. మల్లీశ్వరి ఆటలో ఓనమాలు నేర్చుకున్న సమయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో పాతకాలపు పరికరాలతోనే వెయిట్ లిఫ్టింగ్ సాధన మొదలైంది. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లీశ్వరి ఆట వైపు ఆకర్షితురాలైంది. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్ నీలంశెట్టి అప్పన్న తిరస్కరించినా, ఆ తర్వాత ఆమెకు అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో అందరికంటే ఎక్కువగా తల్లి శ్యామల అండగా నిలిచి కూతురుని ప్రోత్సహించింది. 1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్‌లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లీశ్వరిలో ప్రతిభను కోచ్ లియోనిడ్ తారానెంకో గుర్తించి సరైన దిశ చూపించాడు. దాంతో బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో ఆమెకు అవకాశం దక్కింది. ఆపై జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్ నేషనల్స్‌లో రజతం సాధించడంతో మల్లీశ్వరి విజయ ప్రస్థానం మొదలైంది. ఆపై వరుస అవకాశాలు అందుకున్న ఆమె వరల్డ్ చాంపియన్ షిప్‌లలో సంచలన ప్రదర్శనతో పలు ఘనతలు తన పేరిట లిఖించుకుంది. 18 ఏళ్ల వయసులో తొలి వరల్డ్ చాంపియన్‌షిప్ పతకంతో మొదలు పెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్ మెడల్ వరకు సాగడం విశేషం. ఆమె స్ఫూర్తితోనే.. ‘80వ దశకం చివర్లో మన మహిళా ప్లేయర్లు మంచి ఫలితాలు సాధిస్తుండటం మొదలైంది. ఉష, షైనీ విల్సన్, కుంజరాణిలాంటి ప్లేయర్లు పెద్ద వేదికపై రాణించారు. కానీ మలీశ్వరి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 తర్వాతే అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో సైనా, సింధు, మేరీకోమ్వంటి విజేతలు వచ్చేందుకు మల్లీశ్వరి విజయమే కారణం’ అని అథ్లెట్ దిగ్గజం అంజూ జార్జ్ చెప్పడం ఆ పతకం విలువను చెప్పింది. సిడ్నీలో భారత్ సాధించిన ఏకైక పతకం కూడా అదే. రెజ్లింగ్‌లో స్టార్లను అందించిన మహావీర్ ఫొగాట్‌కు తన కూతుళ్లు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లీశ్వరి విజయం అందించిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్ గీతా ఫొగాట్ వెల్లడించడం విశేషం. ‘మల్లీశ్వరి గెలిచినప్పుడు విజయం స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు కానీ నాన్న మాత్రం అదే మేలిమలుపుగా చెప్పుకునేవారు. ఆమె గురించే మాకు ట్రైనింగ్‌లో మళ్లీ మళ్లీ చెప్పేవారు. నాన్నకు సంబంధించి మల్లీశ్వరి హరియాణా అమ్మాయే’ అని గీత గుర్తు చేసుకుంది. నిజంగానే ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా మల్లీశ్వరి సాధించిన విజయం చాలా గొప్పది. ఆమె సాధించిన ఘనత ఒక తరంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలను ఆటల వైపు మళ్లించిందనడంలో సందేహం లేదు. కొత్త బాధ్యతతో... సహచర వెయిట్‌లిఫ్టర్ రాజేశ్త్యాగిని వివాహం చేసుకున్న అనంతరం హరియాణాలోనే..యమునా నగర్లో మల్లీశ్వరి స్థిరపడిపోయింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని నిర్వహిస్తోన్న ఆమె ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పురస్కారాలు అందుకున్న మల్లీశ్వరి ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపడుతోంది. త్వరలో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్స్‌లర్‌గా ఆమెను నియమించారు. -
భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది. కాగా పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు అలాగే అతను ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు. హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు. HISTORIC GOLD FOR INDIA 🔥🔥🔥 Asian Para-Games Bronze medalist, #Sudhir wins 🇮🇳's 1st ever GOLD🥇 medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name 💪💪 Sudhir wins his maiden 🥇 in Men's Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India 1/1 pic.twitter.com/cBasuHichz — SAI Media (@Media_SAI) August 4, 2022 This is so special 😍 6 gold 🥇for Bharat 🇮🇳 thanks to Sudhir lifting 212 kg in para power lifting setting new Games record !! Many congrats to u bhai 👏👏 Billion Indian’s proud of you 👏 #ParaPowerlifting #Sudhir pic.twitter.com/TZ6VEnef4b — Soug (@sbg1936) August 4, 2022 చదవండి: CWG 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం -
వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో ‘సమోవా’ దేశానికి చెందిన డాన్ ఒపెలాజ్ మంగళవారం స్వర్ణ పతకం గెలుచుకున్నాడు... అయితే 24 గంటలు తిరగక మందే ఒపెలాజ్ కుటుంబంలో మరో పతకం వచ్చి చేరింది. బుధవారం 109 కేజీల కేటగిరీలో డాన్ సోదరుడు జాక్ ఒపెలాజ్ రజతం సాధించాడు. కామన్వెల్త్ క్రీడల పతకాలతో ఈ కుటుంబ అనుబంధం చాలా పాతదే. సరిగ్గా చెప్పా లంటే ఆ దేశంలో వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’. 12 మంది సభ్యుల కుటుంబంలో 10 మంది అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్లే కావడం విశేషం. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో డాన్ సోదరు డు న్యూసిలా ఒపెలాజ్ స్వర్ణం గెలుచుకోగా (105 కేజీలు), అదే రోజు అతని సోదరి ఎలె ఒపెలాజ్ కూడా 75 కేజీల కేటగిరీలో పసిడి సొంతం చేసుకుంది. న్యూసెలా 2002 మాంచెస్టర్ క్రీడల్లోనూ కాంస్యం సాధించగా, 2014లో ఎలె ఖాతాలో రజతం చేరింది. మరో సోదరి మేరీ ఒపెలాజ్ 2014 గ్లాస్గో క్రీడల్లో రజత పతకం అందుకుంది. గత గోల్డ్ కోస్ట్ క్రీడల్లోనూ డాన్ ఒపెలాజ్ రజతం సాధించగా... అందరికంటే చిన్నవాడు జాక్ పతకం సాధించడంతో ఈ కుటుంబం కామన్వెల్త్ క్రీడల్లో గెలుచుకున్న పతకాల సంఖ్య ‘8’కు చేరింది. పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు 2 లక్షల జనాభా ఉండే సమోవా ఒలింపిక్స్‌లో సాధించిన ఏకైక పతకం కూడా ఎ లె ఒపెలాజ్దే కావడం విశేషం. 2008 బీజింగ్ క్రీడల్లో 75+ కేజీల కేటగిరీలో ఎలె రజతం గెలుచుకుంది. -
Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీల్లో జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోకా తులిక మన్ తుది పోరులో తడబడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో తులిక ఓటమి పాలైంది. పురుషుల స్క్వాష్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్ జేమ్స్ విల్స్ట్రాప్ (ఇంగ్లండ్)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్స్ (కామెరూన్; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్ ఒపెలాజ్ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. వెయిట్‌లిఫ్టింగ్‌పై ‘లవ్’తో... లవ్‌ప్రీత్ సింగ్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని బల్ సచందర్ గ్రామం. 13 ఏళ్ల వయసులో కొందరి స్నేహితుల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న అతను ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఊర్లో చిన్న టైలర్ దుకాణం నడిపే తండ్రి కృపాల్ సింగ్‌కు కొడుకును క్రీడాకారుడిగా మార్చే శక్తి లేదు. ముఖ్యంగా అతని ‘డైట్’కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయలేని పరిస్థితి. చాలా మందిలాగే దీనిని లవ్‌ప్రీత్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తన ప్రయత్నం తండ్రికి భారం కారాదని భావించి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డాడు. అందుకే అమృత్‌సర్‌లోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో పని చేయడం ప్రారంభించాడు. పెద్ద వ్యాపారులకు అమ్మకాల్లో సహాయంగా ఉంటే రూ. 300 వచ్చేవి. వీటిని తన డైట్, ప్రొటీన్స్ కోసం లవ్‌ప్రీత్ వాడుకున్నాడు. అయితే అతని శ్రమ, పట్టుదల వృథా పోలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాత వరుస విజయాలు వచ్చాయి. ఈ ప్రదర్శన కారణంగా భారత నేవీలో ఉద్యోగం లభించింది. దాంతో ఆర్థికపరంగా కాస్త ఊరట దక్కడంతో అతను పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని జాతీయ క్యాంప్‌కు ఎంపిక కావడంతో అతని రాత పూర్తిగా మారిపోయింది. 2017లో ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కాంస్యంతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న అతను జూనియర్ కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన మొదటి పతకం 24 ఏళ్ల లవ్‌ప్రీత్ స్థాయిని పెంచింది. నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం బాక్సింగ్ క్రీడాంశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించగా... హుసాముద్దీన్ 4–1తో ట్రైఅగేన్ మార్నింగ్ ఎన్‌డెవెలో (నమీబియా)పై, నిఖత్ 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచారు. రజతంతో సరి కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్ ఫాంగ్ చియా–వుయ్ యిక్ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్ జె యోంగ్ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్–కూంగ్ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. -
కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం
బర్మింగహమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచి ఆరు పతకాలు కొల్లగొట్టిన భారత్.. తాజాగా ఆ విభాగంలో ఏడో పతకం సాధించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్ కేటగిరీలో 93 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 119 కేజీలు.. మొత్తం 212 కేజీలు ఎత్తి కాంస్యం ఒడిసి పట్టింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ స్వర్ణం దక్కించుకుంది. తాజా పతకంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో తొమ్మిదో పతకం చేరగా.. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు.. మరో మూడు కాంస్యాలు ఉన్నాయి. కాగా స్నాచ్ కేటగిరిలో మొదటి ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తడంలో హర్జీందర్ విఫలమైంది. తన రెండో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తిన ఆమె.. మూడో ప్రయత్నంలో 93 కేజీల బరువును ఎత్తి కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో 113 కేజీలు, రెండో ప్రయత్నంలో 116 కేజీలు విజయవంతగా ఎత్తిన హర్జీందర్ కౌర్.. మూడో ప్రయత్నంలో 119 కేజీల బరువును ఎత్తి ఓవరాల్‌గా 212 కేజీలతో కాంస్యం దక్కించుకుంది. 9️⃣th medal for 🇮🇳 at @birminghamcg22 🤩🤩 After high voltage 🤯 drama India's #HarjinderKaur bags 🥉 in Women's 71kg Final with a total lift of 212Kg 🏋♂️ at #B2022 Snatch- 93kg Clean & Jerk- 119kg With this #TeamIndia🇮🇳 wins its 7️⃣th Medal in 🏋♀️🏋♂️ 💪💪#Cheer4India🇮🇳 pic.twitter.com/D13FqCqKYs — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
Commonwealth Games 2022: అన్నయ్య అభయహస్తమై...స్ఫూర్తిదాయకం అచింత ప్రస్థానం
సాక్షి, క్రీడావిభాగం: పసిడి పతకం గెలవగానే అన్నింటికంటే ముందు అచింత నోటి నుంచి వచ్చిన మాట... ‘ఈ పతకం నా అన్నయ్యకు అంకితం’... అతడిని దగ్గరి నుంచి చూసిన వారికి ఇది ఆశ్యర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ రోజు అచింత కామన్వెల్త్ పతకధారిగా సగర్వంగా నిలబడ్డాడంటే దాని వెనక అలోక్ ఉన్నాడు. తమ్ముడి కోసం తన ఆటకు దూరమైన ఆ అన్నయ్య, అంతటితో ఆగకుండా అన్నీ తానై, అంతటా వెనకుండి నడిపించాడు. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కూడా ఆటలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చంటూ అన్ని రకాలుగా స్ఫూర్తినిచ్చేలా అచింత జీవితం కనిపిస్తుంది. కోల్‌కతాలోనే హౌరా నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది దియూల్పూర్ గ్రామం. అక్కడ ఎక్కువ మందికి ‘జరీ’ పనినే జీవనాధారం. రిక్షా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి 2014లో హఠాత్తుగా చనిపోయిన సమయంలో అచింత వయసు 12 ఏళ్లు! ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే తల్లి ‘జరీ’ పనిలో చేరిపోయింది. ఆమెకు అండగా తనకంటే ఏడేళ్లు పెద్ద అయిన అన్నయ్య కూడా వెళ్లక తప్పలేదు. వయసు చిన్నదే అయినా తన చిట్టి చేతులతో అచింత తానూ ఆ పనిలో సాయం చేయడం మొదలు పెట్టేశాడు. ఇలాంటి ఆర్థిక స్థితిలో ఆటలు అనేవి ఆలోచనకు కూడా అందవు. దాంతో అప్పటి వరకు తన ఆసక్తి కొద్దీ వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అన్న అలోక్ ఆ బరువును పక్కన పడేసి ఇంటి భారం తన మీద వేసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం ‘జరీ’ వర్క్‌తో పాటు ఉదయం వేళ హౌరా మిల్లుల్లో లేబర్‌గా పని చేసేందుకు సిద్ధమైన అలోక్... అదే సమయంలో తన తమ్ముడిలో తనకంటే మంచి ప్రతిభ ఉందని గుర్తించడం మర్చిపోలేదు. అందుకే ఏం చేసైనా అచింతను తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అన్న కష్టాన్ని అచింత వృథా పోనీయలేదు. ఒకవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆటకు పదును పెట్టుకుంటూనే మరోవైపు తనకు ఇచ్చే డబ్బుల్లో ఒక్కో పైసాను అతి పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు. 2014 జాతీయ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో వచ్చినా... కోచ్ దృష్టిని ఆకర్షించడంతో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం వచ్చి ంది. దాంతో అచింత రాత మారింది. తీవ్ర సాధన తో సత్తా చాటుతూ ఆసియా యూత్ చాంపియన్ షిప్లో రజతం, కామన్వెల్త్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత గత ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజతంతో అచింత సంచలనం సృష్టించి దూసుకుపోయాడు. ఆర్మీ ఉద్యోగం ఉండటంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు కావడంతో పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టిన ఈ బెంగాల్ కుర్రాడు ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ ఘనతను సగర్వంగా అందుకున్నాడు. అరంగేట్రంలోనే అదుర్స్... కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో అచింత భారత్‌కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్‌లో 143+క్లీన్ అండ్ జెర్క్‌లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు. అజయ్‌కు నిరాశ 81 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ అజయ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన ఈ ఈవెంట్లో అజయ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. అజయ్ స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 176 కేజీలు (మొత్తం 319 కేజీలు) బరువెత్తాడు. ఈ కేటగిరీలో క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు), కైల్ బ్రూస్ (ఆస్ట్రేలియా; 323 కేజీలు), నికోలస్ వాకన్ (కెనడా; 320 కేజీలు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి ఛానును బింద్యారాణి దేవి రోల్ మోడల్‌గా భావించింది. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని కడు పేదరికం నుంచి వచ్చిన బింద్యారాణ దేవి ఇవాళ అంతర్జాతీయ వేదికపై భారత పతకాన్ని రెపరెపలాడించింది. మీరాబాయి చానులాగే మణిపూర్ నుంచి వచ్చిన బింద్యారాణి దేవి, ఒకే అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఓ చిన్న గుడిసెలో జీవనం సాగించిన మీరాబాయి ఛాను లైఫ్ స్టైల్, ఒలింపిక్ మెడల్ తర్వాత పూర్తిగా మారిపోయింది. అయితే తనలాగే పేదరికాన్ని అనుభవిస్తూ కూడా భారత్‌కి పతకాలు సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న బింద్యారాణి దేవి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మీరాబాయి ఛాను... ఖరీదైన బూట్లను కానుకగా ఇచ్చింది. అవే బూట్లు వేసుకొని బరిలోకి దిగిన బింద్యారాణి దేవి తాజాగా కామన్వెల్త్ గేమ్స్ 2022లో 55 కేజీల విభాగంలో రజతం సాధించింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. ఇక మ్యాచ్ అనంతరం బింద్యారాణి దేవి మాట్లాడుతూ.. ‘నా సక్సెస్‌లో మీరా దీ పాత్ర చాలా ఉంది. నా టెక్నిక్, ట్రైయినింగ్‌లో మీరా ఎంతగానో సాయం చేసింది. క్యాంప్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఎంతో అప్యాయంగా పలకరించి, మాట్లాడింది. నా దగ్గర బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసి, తన షూస్ నాకు ఇ్చింది. ఆమె నాకు ఆదర్శం... నేను తనకి పెద్ద అభిమానిని అయిపోయా...’ అంటూ చెప్పుకొచ్చింది. -
భారత్ ఖాతాలో నాలుగో పతకం.. వెయిట్లిప్టింగ్లో బింద్యారాణికి రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలుపొందింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. అయితే బింద్యారాణి క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు. అయితే చివరి రౌండ్లో పుంజుకున్న బింద్యారాణి..116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. కాగా, బింద్యారాణి సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్యం లభించింది. SUPER SENSATIONAL SILVER FOR BINDYARANI 🔥🔥 Bindyarani Devi 🏋♀️wins 🥈in the Women's 55kg with a total lift of 202kg, after an amazing come back 💪💪 Snatch - 86 kg (PB & Equalling NR) Clean & Jerk - 116 kg (GR & NR) With this 🇮🇳 bags 4️⃣🏅 @birminghamcg22#Cheer4India pic.twitter.com/iFbPHpnBmK — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి -
మన 'బంగారు' మీరాబాయి
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం వచ్చి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చుకుంటూ వచ్చింది. అలసటను దరి చేరనీయలేదు.. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. వాస్తవానికి మీరాబాయి చానూ ఈసారి 55 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. ఈ సారి ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ఆమెను 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. దీంతో మీరాబాయి తన బరువును పెంచుకుంటూనే ఎంతోగానో శ్రమించింది. కానీ ఆఖరి క్షణంలో ఒక్క విభాగం నుంచి ఒక్కరే ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. అలా తనకు అచ్చొచ్చిన విభాగంలో పోటీ పడిన ఆమె స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఇక 2014 గ్లాస్కో గేమ్స్ రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం.. తాజాగా మరోసారి స్వర్ణంతో మెరిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. మరి వచ్చే పారిస్ ఒలింపిక్స్(2024)లో టోక్యోలో వచ్చిన రజతాన్ని స్వర్ణంగా మారుస్తుందేమో చూడాలి. Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
నాలుగేళ్ల కిందటి హామీ.. పతకధారిగా ‘పాన్వాలా’
నాలుగేళ్ల క్రితం... గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో గురురాజ పుజారి పోటీ పడుతున్నాడు. తన ‘పాన్ షాప్’లో కూర్చొని ఈ ఈవెంట్‌ను సంకేత్ టీవీలో చూస్తున్నాడు. గురురాజ 56 కేజీల విభాగంలో రజతం సాధించాడు. ఆ సమయంలో సంకేత్ ‘నాలుగేళ్ల తర్వాత ఎలాగైనా నేనూ అక్కడికి వెళతాను. కష్టపడి కచ్చితంగా పతకం సాధిస్తాను’ అని తనకు తాను చెప్పుకున్నాడు. నిజంగానే అతను తన కల నెరవేర్చుకున్నాడు. 2013 నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు 22 ఏళ్ల వయసులో కామన్వెల్త్ పతకంతో సత్తా చాటాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో సంకేత్ తండ్రికి పాన్‌షాప్‌తో పాటు చిన్నపాటి టిఫిన్ సెంటర్ కూడా ఉంది. మొదటినుంచి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే అతను ఆటపై దృష్టి పెట్టాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న తండ్రి ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్ వైపు నడిచాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా తండ్రి మహదేవ్ ఎప్పుడూ సంకేత్‌ను నిరుత్సాహపర్చలేదు. ఒక వైపు వెయిట్‌లిఫ్టర్‌గా గుర్తింపు వస్తున్న సమయంలో సంకేత్ కూడా ఏనాడూ పాన్‌షాప్‌లో కూర్చొని పని చేయడాన్ని తక్కువగా భావించలేదు. 2020లో కోల్‌కతాలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో సంకేత్ తొలిసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఏడాది సింగపూర్‌లో మొత్తం 256 కేజీల బరువు ఎత్తడంతో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అర్హత లభించింది. ఫిబ్రవరిలో పటియాలలోని నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం లభించిన తర్వాత హెడ్ కోచ్ విజయ్ శర్మ పర్యవేక్షణలో మరింతగా రాటుదేలిన సంకేత్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ‘ఇప్పటి వరకు అంతా సంకేత్ పాన్వాలా అని పిలిచేవారు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల పతక విజేత సంకేత్ పాన్వాలా అని పిలుస్తారేమో’ అని ఉద్వేగంగా చెప్పాడు. సోదరుడి బాటలో వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగు పెట్టిన అతను చెల్లెలు కాజల్ ఇటీవలే ఖేలో ఇండియా గేమ్స్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణం గెలవడం విశేషం. -
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్‌ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్‌తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Tokyo Olympics: వయసు 37.. ఎత్తినది 374 కేజీలు.. రికార్డుతో పాటు స్వర్ణం
శనివారం జరిగిన పురుషుల 81 కేజీల వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగిన 37 ఏళ్ల చైనా లిఫ్టర్ లియూ జియోజున్ 374 కేజీల (స్నాచ్‌లో 170+ క్లీన్ అండ్ జెర్క్‌లో 204) బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డుతో పాటు పసిడి పతకాన్ని సాధించాడు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్రకెక్కాడు. విశ్వక్రీడల్లో లియూకిది మూడో పతకం. 2012లో పసిడి... 2016 రియోలో రజతం సాధించాడు. -
Weightlifter Meso: తండ్రి వల్ల కానిది తనయుడు సాధించాడు
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ (96 కేజీల విభాగం)లో ఖతర్ దేశానికి చెందిన మెసో హసూనా స్వర్ణ పతకం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ కలిపి అతను మొత్తం 402 కిలోల బరువు ఎత్తాడు. ఒలింపిక్ చరిత్రలో గతంలో 1 రజతం, 4 స్వర్ణాలు గెలుచుకున్న ఖతర్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దేశానికి తొలి స్వర్ణమే కాదు, హసూనా గెలుపు వెనక ఆసక్తికర నేపథ్యం ఉంది. 37 సంవత్సరాలుగా అతని కుటుంబం ఒలింపిక్ పతకం కోసం ఎదురు చూస్తోంది. మెసో తండ్రి ఇబ్రహీం హసూనా కూడా వెయిట్‌లిఫ్టర్. ఈజిప్ట్ దేశం తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ (1984, 1988, 1992)లలో పాల్గొన్నాడు. కానీ ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన అతను ఆ తర్వాత ఖతర్‌కు వలస వచ్చాడు. పట్టుదలగా తానే శిక్షణ ఇచ్చి తన కొడుకు మెసో హసోనాను కూడా వెయిట్‌లిఫ్టర్‌గా తీర్చి దిద్దాడు. జూనియర్ స్థాయి నుంచే రాణిస్తూ సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో రజత, కాంస్యాలు గెలుచుకున్న 23 ఏళ్ల మెసో తొలి ఒలింపిక్స్‌లోనే సత్తా చాటాడు. తండ్రి సమక్షంలోనే ఏకంగా స్వర్ణం గెలుచుకొని తన కుటుంబం 37 సంవత్సరాల ఎదురు చూపులకు తెరదించాడు. -
రజతంతో స్వదేశంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించి భారత్ గర్వపడేలా చేసిన మీరాబాయి చాను సోమవారం సొంతగడ్డపై అడుగు పెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ఎయిర్పోర్ట్ అంతా హోరెత్తింది. మీరా రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా తదితరులు అక్కడ చేరడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. భారత ఆర్మీ జవాన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మీరాబాయి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్ ప్రమాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసింది. మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తమ ఉద్యోగి అయిన మీరాబాయికి రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. 2018 నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా పని చేస్తున్న మీరాబాయికి పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చైనా లిఫ్టర్ డోపింగ్ వార్తలతో అలజడి... మీరాతో పోటీ పడి స్వర్ణం సాధించిన జిహుయ్ హౌ ‘డోపింగ్’కు పాల్పడినట్లు, నిర్ధారణ అయితే మీరాకు స్వర్ణం లభిస్తుందంటూ సోమవారం ఉదయం నుంచి పలు పత్రికలు, వెబ్సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పోటీ ముగిసిన రెండు రోజుల తర్వాత జిహుయ్కు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తుందంటూ ఒక భారత మీడియా ప్రతినిధి రాసిన వార్త దీనికంతటికీ కారణమైంది. అయితే ఐఓసీ నుంచి గానీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత ఒలింపిక్ సంఘం కూడా తమకేమీ తెలీదని స్పష్టం చేసింది. నిజానికి కనీస సమాచారం, ఆధారం లేకుండా కేవలం జిహుయ్ రెండోసారి పరీక్షకు వెళుతోంది కాబట్టి ఏదో జరిగి ఉంటుందనే అంచనాలపై ఆధారపడి ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చినట్లు తర్వాత తేలింది. పోటీ ముగియగానే తీసుకున్న ‘శాంపిల్’పై అనుమానం ఉండటం వల్లే స్పష్టత కోసం రెండో ‘శాంపిల్’ తీసుకుంటున్నారని వినిపించినా... దానిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. రోజూ ఐఓసీ నిర్వహించే సుమారు 5000 డోపింగ్ పరీక్షల్లో ఇది కూడా ఒక రొటీన్ పరీక్ష కూడా కావచ్చు! -
తెలంగాణలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ క్రీడల్లో పతకం అందించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆమెతో టీ–స్పోర్ట్స్ చైర్మన్, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు వెబీనార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహకారమిస్తే హైదరాబాద్ కేంద్రంగా వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తానని, తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రతిభావంతులైన ఎంతోమంది యువ వెయిట్‌లిఫ్టర్లు ఉన్నారని... అయితే వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీ లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదని టీ–స్పోర్ట్స్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. మల్లేశ్వరి ఫౌండేషన్‌తో కలిసి తెలంగాణ లిఫ్టర్లకు చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మల్లేశ్వరి హైదరాబాద్‌కు రావాలని ఈ వెబీనార్‌లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాట్లపై చర్చిద్దామని ఆయన అన్నారు. -
అధిక బరువెత్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
-
అధిక బరువెత్తి ప్రాణం మీదకు..
మాస్కో : వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఓ రష్యన్ పవర్ లిఫ్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వందలు, మూడు వందలు కాదు.. ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో విఫలమై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో వేదికగా జరిగిన ఈ వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ సెడిఖ్ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు. ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు. అదృష్టవశాత్తు బారెల్ వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సెడిఖ్ రెండు మోకాళ్లతో పాటు తొడ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు దాదాపు 6 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన రెండు కాళ్ల ఎముకలను, కండరాలను ఆపరేషన్ చేసి అతికించారు. ఈ ప్రమాదంతో అలెగ్జాండర్ రెండు నెలలపాటు మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యాలో 2019లో వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల రడోస్కేవిచ్ మూడో ప్రయత్నంలో 250 కేజీల బరువెత్తబోయి గాయపడి కెరీర్‌కు స్వస్తిపలకాల్సి వచ్చింది. -
‘అర్జున’ రేసులో రాహుల్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ పేరును ఈ ఏడాది కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కోసం భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) నామినేట్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అంతకుముందు 2015, 2017లలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 2015 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రాహుల్... 2014 యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో రజతం... 2013 ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం... 2013 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మీరాబాయి, పూనమ్ పేర్లను కూడా... రాహుల్‌తోపాటు మీరాబాయి చాను (మణిపూర్), పూనమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) పేర్లను ఐడబ్ల్యూఎల్ఎఫ్ కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. అయితే మీరాబాయి ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకుంది. వాస్తవానికి ‘ఖేల్‌రత్న’ కోసం ఎవరినైనా నామినేట్ చేయాలంటే ముందుగానే వారికి ‘అర్జున’ వచ్చి ఉండాలి. కానీ 2017లో మీరాబాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా నిలువడంతో ఆమె ఘనతకు గుర్తింపుగా కేంద్ర క్రీడాశాఖ నేరుగా ‘ఖేల్‌రత్న’ను అందజేసింది. ఇప్పటికే తాను అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నా ‘అర్జున’ అవార్డు ప్రత్యేకత వేరుగా ఉంటుందని మీరాబాయి వ్యాఖ్యానించింది. పూనమ్ యాదవ్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2015లో సతీశ్ శివలింగం అర్జున అవార్డు పొందాక మరే వెయిట్‌లిఫ్టర్‌కు ‘అర్జున’ లభించలేదు. -
తెలంగాణకు రెండు పతకాలు
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్ –17 బాలుర వెయిట్‌లిఫ్టింగ్‌లో 73 కేజీల విభాగం లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ధనావత్ గణేశ్ రజత పతకం గెలిచాడు. అతను మొత్తం 245 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. అండర్–17 బాలుర ఖో–ఖోలో తెలంగాణ జట్టుకు కాంస్యం లభిం చింది. అండర్–17 బాలికల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ షేక్ మహబూబా చాంద్ కాంస్య పతకం గెలిచింది. డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ (కడప)కు చెందిన మహబూబా మొత్తం 144 కేజీలు బరువెత్తింది. -
జెరెమీకి రజతం
న్యూఢిల్లీ: ఈజీఏటీ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో పతకం లభించింది. థాయిలాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పురుషుల 67 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా రజత పతకం గెల్చుకున్నాడు. మిజోరం రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల లాల్రినుంగా మొత్తం 288 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. అతడు స్నాచ్‌లో 131 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 157 కేజీలు బరువెత్తాడు. ఇండోనేసియా వెయిట్‌లిఫ్టర్ డెనీ 303 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వెయిట్‌లిఫ్టర్ రాహుల్
విజయవాడ స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్ తన తండ్రి మధుతో పాటు కలిశాడు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. -
రజతం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన హవా కొనసాగిస్తోంది. సోమవారం (భారత కాలమానం ప్రకారం) ఉదయం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ రజతం సాధించారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న ప్రదీప్ 352 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చారు. స్నాచ్‌లో 152 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 200 కేజీలు ఎత్తారు. సమోవాకు చెందిన సనేలే మావో 360 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓయిన్ బాక్సాల్ 351 కేజీల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించింది.