Yo-Yo Test
-
అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో రోహిత్ ఒకడు: టీమిండియా కోచ్
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ చూడటానికి బొద్దుగా కనిపించినా.. కోహ్లి మాదిరిగానే అతడూ పూర్తి ఫిట్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. మైదానంలో హిట్‌మ్యాన్ కదలికలు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుందని అంకిత్ కలియార్ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. ఫిట్నెస్ విషయంలో కోహ్లి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాడన్న అంకిత్.. భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై ఇంతగా అవగాహన పెంచుకోవడానికి అతడే ప్రధాన కారణమని కొనియాడాడు. యువ ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ కోహ్లి మాదిరే సూపర్ ఫిట్‌గా ఉంటాడని.. విరాట్ భాయ్ తన రోల్ మోడల్‌గా భావిస్తాడని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు భారత ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటాడు. మిగతా వాళ్లతో పోలిస్తే చూడటానికి కాస్త భారీ కాయుడిలా అనిపించినా.. మైదానంలో పాదరసంలా కదలగలడు. అతడు ప్రతిసారీ యో- యో టెస్టు పాసయ్యాడు కూడా! అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో రోహిత్ శర్మ పేరు కూడా ఉంటుంది. కోహ్లి ఎంత ఫిట్‌గా ఉంటాడో రోహిత్ కూడా అంతే ఫిట్‌గా ఉంటాడు. అయితే, ఫిట్నెస్ విషయంలో కొలమానం అంటే విరాట్ కోహ్లి పేరునే చెప్పాల్సి ఉంటుంది. టీమిండియాలో దీనిని ఒక సంస్కృతిగా మార్చిన ఘనత కోహ్లికే దక్కుతుంది. అగ్రశ్రేణి ఆటగాడిని మిగతా ప్లేయర్లూ అనుసరించే అవకాశం ఉంటుంది. కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లి ప్రతి ఒక్కరిని ఫిట్నెస్ విషయంలో మోటివేట్ చేశాడు. విరాట్ భాయ్ మూలంగానే ఇప్పుడు చాలా మంది టీమిండియా ప్లేయర్లు ఫిట్‌గా కనిపిస్తున్నారు. శుబ్‌మన్ గిల్‌కు కోహ్లినే ఆదర్శం. కేవలం ఫిట్నెస్ విషయంలోనే కాకుండా ఆటలోనూ విరాట్ భాయ్‌ను తన రోల్‌మోడల్‌గా భావిస్తాడు. ప్రతి విషయంలోనూ కోహ్లినే ఫాలో అవుతూ ఉంటాడు. రానున్న కాలంలో గిల్ జట్టుకు విలువైన ఆస్తిగా మారతాడు’’ అని అంకిత్ కలియార్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ బీసీసీఐ యో- యో టెస్టును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో గిల్.. కోహ్లి యో-యో స్కోరును దాటేడయం విశేషం. ఇదిలా ఉంటే.. ఎల్లప్పుడూ కేవలం ఈ టెస్టు స్కోరు ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుందని చెప్పలేం. -
యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే..
Virat Kohli shares his Yo-Yo test result: ఫిట్‌నెస్‌కు మారుపేరు అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లినే గుర్తుకువస్తాడు చాలామందికి! జిమ్‌లో వివిధ రకాల కసరత్తులు చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటాడు ఈ సెంచరీల కింగ్! అందుకే తన పదిహేనేళ్ల కెరీర్లో ఫిట్‌నెస్‌లేమి, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక వెస్టిండీస్ పర్యటన తర్వాత విరాట్ కోహ్లి కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. విండీస్‌లో టెస్టు సందర్భంగా 76వ సెంచరీ సాధించిన ఈ రన్‌మెషీన్.. ఇప్పుడిక ఆసియా కప్-2023 మీద దృష్టి సారించాడు. ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఈ వన్డే టోర్నీకి సిద్ధమవుతున్నాడు. యో-యో టెస్టు క్లియర్ చేసిన కోహ్లి ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు కోహ్లి బెంగళూరుకు చేరుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజుల పాటు జరుగనున్న ట్రెయినింగ్ క్యాంపులో భాగం కానున్నాడు. ఈ సందర్భంగా ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు కోహ్లి తాజాగా వెల్లడించాడు. ఆలూరులో నిర్వహించిన యో- యో టెస్టును క్లియర్ చేసినట్లు తెలిపాడు. కోహ్లి ఫొటో వైరల్ ఈ మేరకు కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు. టెస్టులో 17.2 స్కోర్ చేసినట్లు తెలిపిన కోహ్లి సంతోషంగా ఉందంటూ నవ్వుతూ ఉన్న ఫొటో పంచుకున్నాడు. కాగా కోహ్లితో పాటు విండీస్ టూర్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా సహా మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తదితరులు కూడా ఫిట్నెస్ టెస్టుకు హాజరు కానున్నారు. ప్రత్యేక ఫిట్నెస్ కార్యక్రమాలు కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ చాలా కాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లకు ప్రధాన ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో బీసీసీఐ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లపై మరింత దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఎన్సీఏ ట్రైనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. కోహ్లి, రోహిత్‌లు సెలవుల్లోనూ.. ఆసియా కప్ టోర్నీకి ముందు 13 రోజుల పాటు నిర్వహించిన సెషన్లో ఆగష్టు 9-22 వరకు కోహ్లి, రోహిత్ వంటి కీలక ఆటగాళ్లతో ప్రత్యేకంగా ఎక్సర్సైజులు చేయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో పేర్కొంది. షోల్డర్ కేర్, మజిల్ కేర్ సహా యోగా, మసాజ్‌లతో పాటు వాకింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, మంచి నిద్ర ఇందులో భాగం. ఆహారం విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా తమ ఆసియా కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది. చదవండి: హార్దిక్, బుమ్రా కాదు.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే! -
యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
క్రికెటర్ల ఫిట్నెస్ ప్రమాణాలను పరీక్షించే యో-యో టెస్ట్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యో-యో ఫిట్నెస్ టెస్ట్‌తో పాటు బోన్ స్కాన్ టెస్ట్ 'డెక్సా'ను బీసీసీఐ ఈ ఏడాది జనవరి నుంచి తిరిగి అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వీరూ స్పందించాడు. టీమిండియాకు ఎంపిక కావాలంటే తప్పనిసరిగా యో-యో ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయాలన్న బీసీసీఐ షరతుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ అవలంభిస్తున్న ఫిట్నెస్ ప్రమాణాల వల్ల కెరీర్లు నాశనమవుతాయే కానీ ఫలితం శూన్యమని తెలిపాడు. యో-యో టెస్ట్‌ను బీసీసీఐ కనీస అర్హతగా పేర్కొనడాన్ని ఖండించిన ఆయన.. తమ జమానాలో యో-యో టెస్ట్‌ను తప్పనిసరి చేసుంటే చాలామంది దిగ్గజ ఆటగాళ్లు ఫెయిల్ అయ్యేవారని, వారికి జట్టులో స్థానం కూడా దక్కేది కాదని అన్నాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో బీసీసీఐ స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి సారించేదని, ఇప్పుడు పరిస్థితి ఇంకోలా మారిపోయిందని తెలిపాడు. క్రికెటర్లు మంచి రన్నర్లు కావాలనుకుంటే క్రికెట్ ఆడించాల్సిన పనిలేదని, వారితో మారథాన్లు ప్రాక్టీస్ చేయిస్తే సరిపోతుందని వ్యంగ్యంగా సూచించాడు. ఆటగాళ్లు ఏ విభాగంలో అయినా రాణించాలంటే స్కిల్ డెవలప్ చేసుకుంటే సరిపోతుందని.. వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, సిక్స్ ప్యాక్ బాడీలపై అధికంగా ఫోకస్ పెడితే గాయాల బారిన పడి కెరీర్లు అర్ధంతరంగా ముగుస్తాయే తప్ప సాధించేది ఏదీ ఉండదని అన్నాడు. జిమ్‌లో సాధన, అధిక బరువులు మోయడం వల్ల కెరీర్ స్పాన్ పెరుగుతుందని అనుకుంటే పొరబడ్డట్టేనని, ఇలా చేయడం వల్ల గాయాలు తీవ్రతరమైతాయే తప్ప ఎలాంటి ఫలితం ఉండదని చెప్పుకొచ్చాడు. -
ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు? కోహ్లి కంటే వీళ్లే ముందు!
BCCI- ODI World Cup 2023- Yo-Yo Test: కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహా కేఎల్ రాహుల్, దీపక్ చహర్ తదితర టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఫిట్నెస్ సమస్యల కారణంగా రోహిత్ అందుబాటులో లేకపోవడం సహా పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో గతేడాది దాదాపు ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో పేస్ దళ నాయకుడు బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. జడేజా సైతం గాయం కారణంగా ఐసీసీ ఈవెంట్‌కు దూరం కావడం ప్రభావం చూపింది. వెరసి కీలక ఈవెంట్లలో టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వరుస వైఫల్యాల కారణంగా విమర్శల పాలైంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఫిట్నెస్ చర్చనీయాంశమైంది. కాగా 2023లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో లోపాలు సవరించుకుని బరిలోకి దిగాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్లేయర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ యో- యో టెస్టును తిరిగి ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. దీంతో పాటు ఎముకల పరిపుష్టి(డెక్సా) పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇంతకీ యో- యో టెస్టు అంటే ఏమిటి? ఈ టెస్టులో టాప్- 5 స్కోరర్లు ఎవరో తెలుసుకుందాం! ఏమిటీ ‘యో–యో’ టెస్టు?! రెండు కోన్ల (ప్లాస్టిక్ స్థంభాలు) మధ్య బీప్ సౌండ్‌తో పరిగెత్తించే పరీక్షే యో–యో టెస్టు. రెండు కోన్ల మధ్య 20 మీటర్ల దూరం ఉంటుంది. మూడు బీప్ సౌండ్లు మోగేలోపు ఈ దూరాన్ని పూర్తి చేయాలి. అంటే మొదటి బీప్నకు ఇక్కడి కోన్ నుంచి పరుగు ప్రారంభించి... రెండో బీప్ సౌండ్లోపు అవతలి కోన్‌కు చేరాలి. మూడో బీప్ మోగే సరికి ఇవతలి కోన్ చేరాలి. దీనికి స్కోరు ఉంటుంది. అంటే నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తే మెరుగైన స్కోరు, ఆ తర్వాత సగటు స్కోరు ఇస్తారు. అసాధారణ ఫిట్నెస్తో ఉండే కోహ్లి యో–యో టెస్టు పాసైనప్పటికీ టాప్–5 స్కోరర్స్‌లో లేడు. అతను 19 స్కోరు చేసి 8వ స్థానంలో ఉన్నాడు. గతంలో షమీ, సంజూ సామ్సన్, రాయుడు, రైనా, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్ యో–యో టెస్టులో ఫెయిలయ్యారు. టాప్–5 యో–యో స్కోర్లు 1. షాన్ మసూద్ (పాక్) 22.1 2. బెయిర్‌స్టో (ఇంగ్లండ్) 21.8 3. మయాంక్ డాగర్ (భారత్) 19.3 4. బెత్ లాంగస్టన్ (ఇంగ్లండ్) 19.2 5. రిజ్వాన్ (పాక్) 19.2 చదవండి: WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం
ముంబై: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లకు కఠిన పరీక్ష పెట్టే యో–యో ఫిట్నెస్ టెస్టును తిరిగి ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది వరల్డ్‌కప్‌తో పాటు, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఉండటంతో భారత ప్రపంచకప్ సైన్యంపై అదనపు ఒత్తిడి, క్రికెట్ భారం లేకుండా పక్కా ప్రణాళికతో సిరీస్‌లకు ఎంపిక చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ► బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. బిన్నీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ► కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఇలా గత కొంతకాలంగా భారత కెప్టెన్లను మార్చినప్పటికీ పూర్తిస్థాయి సారథిగా రోహిత్ శర్మనే కొనసాగించాలని తీర్మానించారు. తద్వారా సారథ్య మార్పు ఉండదని స్పష్టం చేశారు. ► మెగా టోర్నీ, మేటి జట్లతో సిరీస్‌ల నేపథ్యంలో జట్టు సెలక్షన్ కోసం యో–యో టెస్టు, డెక్సా (ఎముకల పరిపుష్టి పరీక్ష) టెస్టుల్ని నిర్వహిస్తారు. ఎంపికవ్వాలంటే ఈ టెస్టులు పాసవ్వాలి. ► ఎమర్జింగ్ ప్లేయర్లు ఐపీఎల్‌తో పాటు ప్రాధాన్యత గల దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ► ప్రపంచకప్‌కు ఎంపికయ్యే క్రికెటర్లంతా పూర్తి ఫిట్నెస్తో మెగా ఈవెంట్‌కు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రాధాన్య అంశంగా భేటీ జరిగింది. ఆటగాళ్లపై బిజీ షెడ్యూల్ భారం, ఒత్తిడి, మెంటల్ కండిషనింగ్, ఫిట్నెస్ అంశాల్ని ఇందులో చర్చించారు. ► మంచి ఆల్‌రౌండర్ అవుతాడనుకున్న దీపక్ చహర్, భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల పాలవడంపై చర్చించిన మీదట ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ► అవసరమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలతో కూడా బోర్డు పెద్దలు మాట్లాడతారు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ టోర్నీ సమయంలో తమ స్టార్ ఆటగాళ్లపై పెనుభారం మోపకుండా చూస్తారు. ► గతంలో కోహ్లి కెప్టెన్సీ హయాంలో యో–యో టెస్టు వార్తల్లో నిలిచింది. అయితే ఇది స్టార్, ఎలైట్ ఆటగాళ్లను కష్టపెట్టడంతో తాత్కాలికంగా యో–యో టెస్టును పక్కన పెట్టారు. ► ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ వైఫల్యం దరిమిలా తొలగించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ కీలక మీటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. 20 మందితో ప్రపంచకప్ సైన్యం... సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. మెగా టోర్నీ జరిగేదాకా వీరందరూ కూడా ఒకే టోర్నీలో బరిలోకి దిగరు. రొటేషన్ పద్ధతిలో ఆడతారు. కొందరికి విశ్రాంతి... ఇంకొందరు బరిలోకి అన్నట్లుగా ఈ పద్ధతి సాగుతుంది. గాయాల పాలవకుండా, మితిమీరిన క్రికెట్ భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
టీమిండియా ఆటగాళ్లకు ఊరట.. యోయో టెస్ట్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
YO YO Test: టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ స్థాయికి కొలమానంగా నిలిచే యోయో టెస్ట్ నిబంధనల్లో సడలింపలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఇది దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లకు నిర్వహించే యోయో టెస్ట్‌ను కఠినతరం చేయకూడదని భావిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. యోయో టెస్ట్‌లో సడలింపులతో టీమిండియా ఆటగాళ్లకు ఊరట లభిస్తుందని, దీని వల్ల ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత లభిస్తుందని సదరు అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఏదైనా సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే ముందు ఆటగాళ్లందరూ యోయో టెస్ట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల చాలా మంది ఆటగాళ్లు యోయో టెస్ట్‌లో తరుచూ విఫలమవుతూ, జట్టుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే యోయో టెస్ట్‌లో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బీసీసీఐ నిర్వహించే యోయో టెస్ట్‌లో విఫలమైన భారత ఆటగాళ్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం ఉండదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంలో బీసీసీఐ నుంచి క్లారిటీ రావడంతో యోయో టెస్ట్‌లో విఫలమైన ఐపీఎల్ ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల ఎన్సీఏ క్యాంప్‌లో బీసీసీఐ నిర్వహించిన యోయో టెస్ట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు పృథ్వీ షా సహా పలువురు ఆటగాళ్లు విఫలమైన సంగతి తెలిసిందే. చదవండి: ఐపీఎల్లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
అది మీ కర్మ.. అనుకుంటే అనుకోండి: పృథ్వీ షా
ఢిల్లీ: ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ పృథ్వీషా యో-యో టెస్టులో ఫెయిల్ అయ్యాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో నిర్వహించిన యో-యో టెస్టులో విఫలం చెందినట్లు జాతీయ మీడియాలో వెలుగుచూసింది. దీనిపై నేరుగా స్పందించని పృథ్వీషా.. కర్మ సిద్ధాంతాన్ని జోడించి మరీ కౌంటర్ ఇచ్చాడు. ‘మీకు నా పరిస్థితి తెలియనప్పుడు నన్ను జడ్జ్ చేయకండి. అనుకుంటే అనుకోండి.. అది మీ కర్మ’ అంటూ సెటైరిక్‌గా ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించాడు. అసలు యో-యో టెస్టులో పాస్ అయ్యాడా.. లేదా అనే విషయాన్ని చెప్పకుండా ఇలా రాసుకు రావడం విఫలం చెందే ఉంటాడనే దానికి బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం యో-యో ఫిట్నెస్ టెస్టులో పాస్ కావడానికి 16.5 స్కోరు చేయాల్సి ఉంటుంది. కానీ పృథ్వీ షా 15 కంటే తక్కువ పాయింట్లే నమోదు చేశాడనేది రిపోర్ట్లు సారాంశం. ఇదిలా ఉంచితే, ఈనెల 26వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. 27వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా ఆడతాడా.. లేదా అనేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే. కేఎల్ రాహుల్ జట్టుకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
IPL 2022- Gujarat Titans: ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్! సుదీర్ఘ కాలంగా వరుస గాయాలతో బాధపడుతూ వచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్, టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రకటించింది. అంతేకాదు.. ఎక్కువ సమయం పాటు బౌలింగ్ కూడా చేసిన హార్దిక్ నిర్ణీత స్కోరు సాధించి యో–యో టెస్టులో కూడా ఉత్తీర్ణుడవడం విశేషం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఎన్సీఏలో అతడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ.. అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించి.. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలిగాడు. 17 ప్లస్ స్కోరు చేశాడు. నిజానికి నిర్ణీత స్కోరు కన్నా ఇది చాలా ఎక్కువ’’ అని పేర్కొన్నారు. దీంతో అతడు పూర్తిస్తాయిలో ఐపీఎల్-2022 సీజన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యాను రిటెన్షన్ సమయంలో వదిలేసిన సంగతి తెలిసిందే. గత సీజన్లో బౌలింగ్ చేయలేకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో విఫలం కావడం పాండ్యా కొంపముంచింది. వరుస గాయాలు అతడి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. ఈ క్రమంలో ఎన్సీఏలో సుదీర్ఘకాలం పాటు చికిత్స తీసుకున్నాడు. ఫలితంగా పూర్తి ఫిట్నెస్ సాధించి యో-యో టెస్టులో పాసయ్యాడు. ఇక హార్దిక్ ఆటతీరుపై నమ్మకం ఉంచిన గుజరాత్ యాజమన్యాం మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది కూడా. ఇక సీజన్ ఆరంభ సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. చదవండి: IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ! అయితే.. Nehraji, the OG! 🔥#SeasonOfFirsts #GujaratTitans pic.twitter.com/YuZSYeAZKF — Gujarat Titans (@gujarat_titans) March 16, 2022 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమైన కీలక ప్లేయర్
Prithvi Shaw Fails Yo Yo Test: నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) క్యాంపులో ఐపీఎల్ ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్ష వివరాలను ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరీక్షల్లో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య పాస్ కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు పృథ్వీ షా విఫలమయ్యాడు. యోయో టెస్ట్‌లో నిర్దేశించిన కనీస స్కోర్‌ను పొందడంలో హార్ధిక్ ఉత్తీర్ణత సాధించగా, ఢిల్లీ ఓపెనర్ చేతులెత్తేశాడు. అయితే, ఇది కేవలం ఫిట్నెస్ టెస్ట్ మాత్రమేనని, ఇందులో విఫలమైతే ఐపీఎల్లో ఆడకుండా ఆపలేమని బీసీసీఐ స్పష్టం చేయడంతో డీసీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. యోయో టెస్ట్‌లో బీసీసీఐ నిర్ధేశించిన కనీస స్కోర్ 16.5 కాగా, షా 15 కంటే తక్కువ స్కోర్ చేసినట్లు, హార్ధిక్ 17కి పైగా స్కోర్ సాధించినట్లు తెలుస్తుంది. కాగా, బీసీసీఐ కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ నేషనల్ లెవెల్ ప్లేయర్లకు బీసీసీఐ ఇటీవలే 10 రోజుల ఫిట్నెస్ క్యాంప్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: ఐపీఎల్ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్ -
ఈ రూల్స్ అప్పుడుంటే సచిన్, గంగూలీలకు అవకాశాలు వచ్చేవి కావు..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో చాలామంది భారత క్రికటర్లు యోయో టెస్ట్‌లో(ఫిట్నెస్ టెస్ట్) విఫలమైన కారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశాన్ని కోల్పోయారని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. క్రికటర్ల ఎంపిక అనేది నైపుణ్యం ఆధారంగా జరగాలని, ఫిట్నెస్ టెస్ట్ కొలమానంగా కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్ట్ తప్పనిసరి అన్న విధానంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది చాలదన్నట్టుగా బీసీసీఐ గత నెలలో యోయో టెస్ట్ నియమాలను మరింత కఠినతరం చేయడంపై ఆయన మండిపడ్డాడు. కనీస అర్హతను 16:1 నుండి 17:1 చేయడం, నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడం వంటి సరికొత్త నిబంధనలపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. నైపుణ్యంతో ఏమాత్రం సంబంధంలేని ఈ ఫిట్నెస్ టెస్ట్ వల్ల అంబటి రాయుడు, సంజు సాంసన్, మహ్మద్ షమీ, తాజాగా రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను తృటిలో చేజార్చుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆటగాళ్లకు మొదటగా అవకాశాలు కల్పించి ఆతరువాత వారి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆయన బీసీసీఐకి సూచించారు. ఇలాంటి టెస్ట్‌లు తమ జమానాలో జరిగి ఉంటే సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు అసలు అవకాశాలే వచ్చేవి కావని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి నైపుణ్యం లేకపోతే, అది జట్టుకు ఏమాత్రం ఉపయోగకరం కాదని ఆయన వాదించాడు. కాగా, ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే యోయో టెస్ట్ తప్పనిసరిగా క్లియర్ చేయాలన్న నియమాన్ని బీసీసీఐ 2018 నుంచి అమలులోకి తెచ్చింది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ నూతన సారధిగా రిషబ్ పంత్ -
భారత క్రికెటర్లు ఇక 2 కిలోమీటర్లు పరుగెత్తాల్సిందే!
ముంబై: భారత క్రికెటర్ల ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న యో–యో టెస్టుతో పాటు మరో కొత్త తరహా పరీక్షను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పరుగులో వేగాన్ని బట్టి ఆటగాళ్ల ఫిట్నెస్ను కొలవనున్నారు. పేస్ బౌలర్లయితే 2 కిలోమీటర్ల పరుగును 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్లు, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌కు మరో 15 సెకన్లు అదనపు అవకాశం కల్పిస్తూ 8 నిమిషాల 30 సెకన్ల గరిష్ట సమయాన్ని నిర్దేశించారు. కాంట్రాక్ట్ ప్లేయర్లతో పాటు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న అందరికీ ఇది వర్తిస్తుంది. ఏడాదిలో మూడుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనే ఆటగాళ్లు ముందుగా ఈ పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే అత్యున్నత స్థాయిలో ఆడే అథ్లెట్లు సాధారణంగా 6 నిమిషాల్లోనే 2 కిలోమీటర్లు పూర్తి చేస్తుంటారు కాబట్టి కొత్త పరీక్ష వల్ల క్రికెటర్లు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. (చదవండి: ‘ఫైండ్ ఆఫ్ ది టూర్’ అతడే: రవిశాస్త్రి) -
‘ఫిట్నెస్ అవసరం.. యోయో కాదు’
భువనేశ్వర్: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్లు ఎంపిక కావాలంటే యో యో టెస్టు అనేది ప్రామాణికంగా మారింది. క్రికెటర్లు పరుగులు చేస్తున్నా, వికెట్లు సాధిస్తున్నా యోయో టెస్టులో పాస్ కాకపోతే వారిని పక్కక పెట్టేయడం చూస్తునే ఉన్నాం. అయితే దీనిపై ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం యోయో టెస్టు గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘జట్టును ఎంపిక చేసేటప్పుడు సమతూకం అనేది ముఖ్యం. అదే సమయంలో ఆటగాళ్లకు ఫిట్నెస్ కూడా అవసరమే. కానీ యోయో అనేది ప్రామాణికంగా కాదు. ఒక ఆటగాడు ఎంపికను యోయో ఆధారంగా తీసుకోవడం సరైన నిర్ణయంకాదు. ఒక క్రికెటర్ పరుగులు సాధిస్తూ, వికెట్లు తీస్తున్న సమయంలో యోయో టెస్టులో పాస్ కాలేదనే కారణంగా జట్టులో ఎంపిక చేయకపోవడం దారుణం. ఈ తరహాలో మంచి ఆటగాడ్ని జట్టులో ఎంపిక చేయకపోతే సమతూకమనేది ఉండదు. నేను భారత్‌కు ఆడేటప్పుడు ఆటగాళ్ల ఫిట్నెస్ను తెలుసుకునేందుకు టెస్టు(బీప్ టెస్టు) ఉండేది. దీనివల్ల జట్టు నుంచి తప్పించడమనేది ఉండేది కాదు. ఒకవేళ ఫిట్నెస్ లెవల్ బాగోలేని పక్షంలో దాన్ని మెరుగుపరుచుకునేందుకు కొన్ని నెలల సమయం ఇచ్చేవారు. ప్రస్తుత భారత్ జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌నే చూడండి. అతను ఒక కీపర్. కానీ 50 ఓవర్ల క్రికెట్లో కీపర్ కాకుండా ఫీల్డర్‌గా బాధ్యతలు పంచుకున్నాడు. అది అతనికి సౌకర్యవంతం కాకపోవచ్చు. ఇక విరాట్ కోహ్లి అద్భుతమైన ఫిట్నెస్ ప్రమాణాలు ఉన్న ఆటగాడు. జట్టులోని ఆటగాళ్లు కూడా కోహ్లిని అనుసరిస్తూ ఫిట్నెస్ లెవల్స్‌ను పెంచుకుంటున్నారు. ఫిట్నెస్ అనేది అవసరం. కానీ యోయో టెస్టు పేరుతో ఆటగాడి కనీస ఉత్తీర్ణత మార్కులు 16.1గా ఉండటం కరెక్ట్ కాదు’ అని కైఫ్ పేర్కొన్నాడు. -
యో-యో టెస్టుపై అంబటి రాయుడు స్పందన
న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యే ప్రతి ఒక్క క్రికెటర్‌కు ఫిట్నెస్ పరీక్ష ఉండాల్సిందేనని అంటున్నాడు అంబటి రాయుడు. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన తాను యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించకపోవడంతో నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అంబటి మెరుపులు మెరిపించాడు. శతకం, అర్ధశతకాలతో పరుగుల వరద పారించాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. చివరికి ‘యోయో’ పరీక్షలో విఫలమైన రాయుడు.. చక్కటి అవకాశాన్ని కోల్పోయాడు. అంబటి రాయుడితో పాటు కేరళ కుర్రాడు సంజూ శాంసన్ సైతం యోయో ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు యోయోపై విమర్శలు గుప్పించారు. క్రికెట్‌కు ఫిట్నెస్ ఒక్కటే సరిపోదని, ప్రతిభ అవసరమని అన్నారు. కాగా, అంబటి రాయుడు యోయో టెస్టుపై స్పందిస్తూ.. ‘యోయోలో విఫలమైనందుకు నిరాశ కలిగింది. ఫిట్నెస్ పరీక్ష కచ్చితమన్న నిబంధనకు నేనేమీ వ్యతిరేకం కాదు. భారత జట్టులోని ప్రతి క్రికెటర్‌కు కచ్చితంగా ఒక ఫిట్నెస్ స్థాయి ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే నేను దాన్ని నమ్ముతున్నా. యోయోలో విజయవంతం కాలేదని బాధపడ్డా. ఆ తర్వాత కష్టపడి సాధించా. క్రికెట్‌కు ఫిట్నెస్ కచ్చితంగా అవసరమే. ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించాల్సిందే. ఒక కచ్చితమైన బెంచ్‌మార్క్ ఉన్నందుకు సంతోష పడుతున్నా’ అని అంబటి అన్నాడు. చదవండి: భారత్ ‘ఎ’ను గెలిపించిన రాయుడు -
మేము యో-యో టెస్టు పాసయ్యాం..
బెంగళూరు: టీమిండియా క్రికెటర్లకు యో-యో టెస్టు ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. మైదానంలో మెరుగైన ఆట ప్రదర్శించినా, యో యో టెస్టులో విఫలమైతే జట్టులో చోటు దక్కదు. ఇటీవల మహ్మద్ షమీ, అంబటి రాయుడు యో యో టెస్టులో విఫలం కావడంతో జట్టులో స్థానాన్ని కోల్పోయారు. తాజాగా భారత మహిళల జట్టు సభ్యులందరూ యో యో పాసయ్యారట. ఈ విషయాన్ని బౌలర్ జులన్ గోస్వామి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో యో టెస్టులో జట్టు సభ్యులందరం పాసయ్యాం అని గోస్వామి పేర్కొంది. ఈ క్రమంలోనే జట్టులోని తన సహచర క్రీడాకారిణులను ‘వెల్డన్ గర్ల్స్’ అంటూ అభినందించింది. ప్రస్తుతం కొందరు క్రీడాకారిణీలు ఇతర దేశాల్లో క్రికెట్ లీగ్‌లు ఆడుతున్నారు. ఈ కారణంగా వీరు యో యో టెస్టుకు హాజరుకాలేదు. త్వరలో వీరు కూడా హాజరవుతారని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. -
తండ్రి గంభీర్‌లాగే కూతురు..
న్యూఢిల్లీ : జట్టులో చోటు కోల్పోయిన క్రికెటర్లు టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్ట్ (ఫిట్నెస్ టెస్ట్)లో పాసవ్వడం తప్పనిసరి. ఈ నిబంధనను బీసీసీఐ తప్పనిసరి చేసిన తర్వాత నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్‌లో సంజూ శాంసన్, అంబటి రాయుడు, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు విఫలమైన విషయం తెలిసిందే. కేవలం యో-యో టెస్టునే పరిగణనలోకి తీసుకుని ఆటగాళ్లను పక్కన పెట్టేయడం సరికాదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తన పెద్ద కూతురు ఆజీన్ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తే తాను యో-యో టెస్ట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోందన్నట్లుగా గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. క్రికెటర్లు ఫిట్నెస్ ప్రాక్టీస్‌లో భాగంగా చేసే కసరత్తులను ఆజీన్ చేయడం వీడియోలో చూడవచ్చు. భవిష్యత్ అథ్లెట్ అని కొందరు కామెంట్ చేయగా, తండ్రికి తగ్గ తనయ అని ఆజీన్ కచ్చితంగా నిరూపించుకోనుందని మరికొందరు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. -
ఫిట్నెస్ టెస్టులో గంభీర్ కూతురు
-
ఆ కల ఇంకా తాజాగానే ఉంది: అంబటి రాయుడు
బెంగళూరు: ఐపీఎల్ 2018 సీజన్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేసిన అంబటి రాయుడు.. యో-యో టెస్టులో ఫెయిల్ కావడంతో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రాయుడు 16 మ్యాచ్‌లకు గాను మొత్తం 602 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. ఈ ప్రదర్శనని పరిగణలోకి తీసుకున్న భారత సెలక్టర్లు ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానంలో కల్పించారు. కానీ.. ఇంగ్లండ్ పర్యటన ఆరంభానికి ముందు బెంగళూరులో నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్టులో రాయుడు ఫెయిలయ్యాడు. దీంతో జట్టు నుంచి అతడ్ని తప్పించి సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు. యో-యో టెస్టు ఫెయిలైన తర్వాత మీడియాకి దూరంగా ఉన్న అంబటి రాయుడు తాజాగా మళ్లీ మీడియా ముందుకొచ్చాడు. ‘భారత జట్టుకు మళ్లీ ఆడాలనే ఆశని నేను వదులుకోలేదు. ఆ కల ఇంకా తాజాగానే ఉంది. ప్రస్తుతం నా ఆటకి మెరుగులు దిద్దుకుంటున్నా. త్వరలోనే మళ్లీ యో-యో ఫిట్నెస్ టెస్టుకి హాజరవుతా. కచ్చితంగా పాసవుతాననే నమ్మకం ఉంది. టీమిండియాకు ఆడాలనే నా లక్ష్యం కోసం కష్టపడుతూనే ఉన్నా. అదే నన్ను నడిపిస్తుంది’ అని రాయుడు పేర్కొన్నాడు. -
యోయో టెస్ట్ ఫెయిలైతే కోహ్లిని తప్పిస్తారా?
న్యూఢిల్లీ : ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) తీసుకొచ్చిన యోయో టెస్ట్‌ను భారత మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, ఆకాశ్ చోప్రా, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లు తప్పుబట్టారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అంబటి రాయుడు, సంజూ శాంసన్‌లతో పాటు టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీలు యోయో టెస్ట్‌లో విఫలమవడంతో భారత జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి యోయో టెస్ట్ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఇండియా టుడే చానెల్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ఈ మాజీ క్రికెటర్లు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘ఒకవేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ పరీక్ష ఫెయిలైతే.. అతడ్ని జట్టులో నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు?. ఈ పద్దతితో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులో నుంచి తీసేయడం సరికాదు. మీరు కోహ్లిని ఆడించాలనుకున్నారు కాబట్టి అతనికి రెండు వారాలు విశ్రాంతి ఇచ్చి యో యో టెస్టు నిర్వహించారు. మిగతా ఆటగాళ్ల పట్ల అలాగే వ్యవహరించాలి ’అని తెలిపాడు. యోయో అవసరం లేదు.. అసలు క్రికెటర్లకు యోయో అవసరం లేదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.. ‘యో యో టెస్టు ఓ కొత్త డ్రామా. అసలు ఈ పరీక్ష క్రికెటర్లకు అవసరమే లేదు. ఫుట్‌బాల్, హాకీ ఆటగాళ్లకు ఇది అవసరం. వారు మైదానం అంతా పరిగెడుతూ ఉండాలి. కాబట్టి పూర్తి ఫిట్నెస్గా ఉండాలి. క్రికెట్లో అలా కాదు. ఈ పద్దతితో ఫామ్‌లో ఉన్న రాయుడు జట్టులో స్థానం కోల్పోయాడు. జట్టును ఎంపిక చేసేందుకు యో యో టెస్టు ప్రామాణికంగా ఉండాల్సినవసరం లేదు. ఆటగాడి ఫామ్, ప్రతిభ.. ఈ రెండే ముఖ్యమైనవి’ అని భజ్జీ తెలిపాడు. దిగ్గజ ఆటగాళ్లే ఫెయిలయ్యారు.. ఒక వేళ కోచ్ ఎంపికకు కూడా ఇదే ప్రామాణికంగా తీసుకుంటే రవిశాస్త్రి ఈ పరీక్ష ఎప్పటికి నెగ్గలేడని అజారుద్దీన్ తెలిపాడు. ‘గతంలో ఈ పరీక్షలో ఎంతో మంది భారత దిగ్గజ ఆటగాళ్లు ఫెయిలయ్యారు. ఒక్కో ఆటగాడికి ఒక్కో విధంగా ఫిట్నెస్ లెవల్స్ ఉంటాయి. నేను ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాను. కానీ, నా పాదాలను అందుకోమంటే నేను అందుకోలేను. కానీ మైదానంలో నా వద్దకు బంతి వచ్చినప్పుడు నా శక్తినంతటినీ సమకూర్చుకుని ఆడుతాను. సునీల్ గావస్కర్ కూడా యోయో ఫెయిలైనవాడే. యో యో ఫెయిలైతే జట్టులో చోటు దక్కదన్న విషయాన్ని ఆటగాడికి ముందుగానే చెప్పాలి. జట్టు ఎంపిక చేసిన తర్వాత వారికి టెస్టు నిర్వహించి ఆ తర్వాత ఫెయిలయ్యాడని తప్పించడం పద్దతి కాదు. రవిశాస్త్రికి కూడా ఇదే పరీక్ష పెడితే.. ఆయన ఎప్పటికి ఈ టెస్ట్ నెగ్గలేడు’ అని అజార్ అభిప్రాయపడ్డాడు. -
యో-యో టెస్టు అవసరమా?
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ నిర్వహిస్తోన్న యో-యో టెస్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. కేవలం అరగంటపాటు చేసే పరీక్ష ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను ఎలా నిర్ధరిస్తారని మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యో యో పరీక్షనే ఎందుకు ప్రామాణికంగా తీసుకొంటున్నారని వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకుల కమిటీ(సీఓఏ) బీసీసీఐని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్లో రాణించిన అంబటి రాయుడు, సంజూ శాంసన్ ఇద్దరూ యో-యో టెస్టులో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో యో యో టెస్టు నిర్వహణ అనేది చర్చకు తెరలేపింది. ‘వినోద్ రాయ్‌తోపాటు ఇతర పాలక సభ్యులకు రాయుడు, సంజూ శాంసన్‌కు జరిగిన విషయంపై పూర్తి అవగాహన ఉంది. యో-యో టెస్ట్‌పై వస్తున్న ఆరోపణలను రాయ్ బృందం పరిగణనలోకి తీసుకొంటుంది. దీనిపై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిక్షకుల నుంచి సమాచారం అడిగే అవకాశం ఉంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘యో- యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశమని, అందువల్ల సీవోఏ చీఫ్ ఇప్పటివరకూ కలగజేసుకోలేదని, అయితే రాబోయే రోజుల్లో క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ సబా కరీమ్ నుంచి సంపూర్ణ సమాచారం తెలుసుకొంటారని’ బీసీసీఐ అధికారి వివరించారు. కాగా, ఇప్పటికే యో యో టెస్ట్‌ను ఎప్పుడు, ఎలా అమల్లోకి తీసుకొచ్చిందీ వంటి వివరాలను తెలియజేస్తూ బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి ఆరు పేజీల లేఖను సీవోఏకు పంపించారు. -
రోహిత్ శర్మే ఎందుకు స్పెషల్?
బెంగళూరు: భారత క్రికెటర్లు యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవ్వాలంటే వారి కనీస అర్హత ప్రమాణం 16.1 మార్కులు. గత ఏడాది నుంచి ఈ నిబంధన విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే యో-యో విషయంలో టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ ఒక్కో ఆటగాడి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు నిబంధనలు సడలించినట్టు సమాచారం. ఐపీఎల్లో ఏ మాత్రం రాణించకున్నా రోహిత్‌ను ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే ఆ తర్వాత అతనికి యో-యో టెస్టు నిర్వహించే క్రమంలో కూడా సడలింపు ఇచ్చారు. ఈ నెల 15న రోహిత్ యో-యో టెస్టుకు హాజరుకావాల్సి ఉన్నా వ్యక్తిగత పనుల కారణంగా రెండు రోజులు ఆలస్యంగా అతను 17న పరీక్షలో పాల్గొన్నాడు. అయితే, ఈ టెస్టులో అతను విఫలమమైనట్టు వార్తలు వచ్చాయి. కానీ, అతను ఫెయిలైన విషయాన్ని బోర్డు రహస్యంగా ఉంచిందట. అదే సమయంలో అజింక్యా రహానేను స్టాండ్‌బైగా ఉంచడం కూడా రోహిత్ యో-యోలో ఫెయిల్ అయ్యాడు అనే దానికి బలాన్ని చేకూర్చింది. కాగా, రోహిత్ విజ్ఞప్తి మేరకు బోర్డు 19వ తేదీన మళ్లీ పరీక్షలో పాల్గొనేందుకు అనుమతించినట్టు తెలుస్తోంది. అయితే, ఆ రోజు కాకుండా మరుసటి రోజున అతను యో-యో టెస్టులో పాల్గొని నెగ్గడం జరిగింది. మరి.. ఈ ముంబై ఆటగాడికి ఇచ్చినట్టుగా సంజూ శాంసన్, మహ్మద్ షమి, అంబటి రాయుడులకు వెంటనే మరో చాన్స్ ఎందుకు ఇవ్వలేదో తెలియడం లేదు. -
‘క్రికెటర్లను ఇలా తప్పించడం సరికాదు’
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌లో భాగంగా నిర్వహిస్తున్న యో యో టెస్టుపై మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మండిపడ్డాడు. స్వల్ప వ్యవధిలో యో యో టెస్టు నిర్వహించి ఒక క్రికెటర్‌గా ఫిట్‌గా లేడని జట్టు నుంచి తప్పించడం ఎంతమాత్రం సరికాదన్నాడు. యో యో విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అవలంభిస్తున్న ప్రస్తుత విధానం ఎంతమాత్రం బాలేదన్నాడు. యో యో టెస్టులో ఒకసారి విఫలమైన ఆటగాడికి మరొకసారి అవకాశం ఇచ్చే యోచనను బీసీసీఐ పరిశీలించాలన్నాడు. ‘టెస్టు మ్యాచ్‌లో ఎలాగైతే ఆటగాళ్లకు రెండు ఇన్నింగ్స్‌ల ద్వారా తామేంటో నిరూపించుకోవడానికి అవకాశం దక్కుతుందో... అలాగే బీసీసీఐ అధికారులు కూడా యో యో టెస్టు ఫెయిలైన వారికి మరో అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆటగాడు యో యో టెస్టు విఫలమైతే మరుసటి రోజు అతడికి మరొకసారి టెస్టు నిర్వహించాలి. ఏడాది పాటు దేశవాళీ క్రికెట్లో అంబటి రాయుడు అద్భుతంగా రాణించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అలాంటి ఆటగాడు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం, లేకపోవడంపై కేవలం అరగంటలోనే ఎలా నిర్ణయం తీసేసుకుంటారు. ఆటగాళ్లను జట్టు నుంచి ఇలా తప్పించడం సరికాదు. ఇది వారి కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది’ అని పాటిల్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం అంబటి రాయుడు, మహమ్మద్ షమి, సంజు శాంసన్‌లు యో యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. -
యోయో టెస్ట్ అంటే ఏంటి? ఎలా నిర్వహిస్తారు?
-
ఫిట్నెస్ పరీక్షలో షమీ ఫెయిల్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వివాదాలతో సతమతమవుతోన్న భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ యో యో ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో ఈనెల 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టులో పాల్గొనే భారత జట్టు నుంచి అతడిని తప్పించారు. షమీ స్థానంలో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనిని తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. 25 ఏళ్ల సైని ఇప్పటివరకు 31 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు. ‘బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో షమీ నెగ్గలేకపోయాడు. దాంతో అతని స్థానంలో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నవ్‌దీప్ సైనిని ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. షమీతోపాటు భారత ‘ఎ’ జట్టు సభ్యుడు సంజూ శామ్సన్ కూడా యో యో ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యాడని అతని స్థానంలో భారత అండర్–19 మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశామని తెలిపింది. -
యో-యో టెస్టులో సంజు శాంసన్ విఫలం
ముంబై: ఐపీఎల్-11 సీజన్లో మెరుగ్గా రాణించి.. భారత-ఎ జట్టులో చోటు సంపాదించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన నుంచి సంజు శాంసన్ తప్పుకోవాల్సి వచ్చింది. జూన్ 17 నుంచి ఇంగ్లండ్ వేదికగా మూడు జూనియర్ జాతీయ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. వెస్టిండీస్- ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ కోసం ఇటీవల భారత- ఎ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. కాగా, క్రికెటర్లందరికీ మూడు రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్టుని నిర్వహించారు. ఈ టెస్టులో సంజు శాంసన్ ఫెయిలవడంతో అతన్ని ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టు నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తప్పించింది. భారతత-ఎ జట్టుకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. జట్టులో పృథ్వీ షా, శుభమన్ గిల్, రిషబ్ పంత్ తదితర యువ క్రికెటర్లకి చోటు దక్కింది. తాజాగా సంజూ శాంసన్ జట్టు నుంచి పక్కకి వెళ్లడంతో.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. -
యోయో టెస్ట్‌కు హాజరు కావాల్సిందే
ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు ముందు భారత ఆటగాళ్లంతా యో-యో టెస్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సూచించింది. అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ బెంగళూరులో జూన్ 8న నిర్వహించే యో-యో టెస్టుకు హాజరుకావాలని తెలిపింది. ‘ఈ టెస్టు మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసినప్పటికీ, ప్రతి ఆటగాడు ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. వచ్చే కొన్ని వారాల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న ఆటగాళ్లు కూడా పరీక్షను ఎదుర్కోవాల్సి ఉందని’ బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతేకాదు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ఇండియా-ఏ జట్లు కూడా ఈ పరీక్షకు హాజరుకావాలని బీసీసీఐ ఆదేశించింది. రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న ఆటగాళ్లకు పదిరోజుల పాటు విశ్రాంతి లభించింది. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో త్వరలో నిర్వహించనున్న క్యాంపులో ఆటగాళ్లు పాల్గొని సాధన చేయనున్నారు. యో-యో టెస్టులో ఆటగాళ్లు నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. ఇందులో కచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. గతేడాదే బీసీసీఐ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఆటగాళ్ల ఫిట్నెస్ తెలుస్తోంది. ఈ విధానాన్ని ఐపీఎల్లో కొన్ని ఫ్రాంచైజీలు సైతం అనుసరించాయి.