భూగర్బజలాల పెంపునకు ప్రాధాన్యం
కై లాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు భరోసానిస్తోంది. ఈ పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణావృద్ధిశాఖ అధికారులు ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.
ప్రజల అభిప్రాయాల మేరకు..
గ్రామాల్లో చేపట్టాల్సిన ఉపాధి పనుల్లో ప్రజలు, రైతులను భాగస్వాములను చేసి వారు కోరిన పనులు కల్పించేలా ప్రభుత్వం ఏటా గ్రామ సభలు నిర్వహిస్తోంది. గాంధీ జయంతి నుంచి ప్రారంభించి ఈ నెలాఖరు వరకు జిల్లాలోని 473 గ్రామ పంచాయతీల్లో వీటిని నిర్వహించనున్నారు. ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు హాజరై వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో కల్పించాల్సిన పనులపై ప్రజలతో చర్చిస్తారు. ఆయా గ్రామాల్లో గుర్తించిన పనులను ఈ సభల్లోనే కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు చదివి వినిపించనున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు అంచనాలు తయారు చేస్తారు. ఎన్ని పనులు చేపట్టాలనేది జాబ్‌కార్డుల ఆధారంగా గ్రామసభల్లోనే నిర్ణయిస్తారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సిద్ధం చేసిన నివేదికను తొలుత మండల పరిషత్, తర్వాత జెడ్పీ ఆమోదం కోసం పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన పనులతో కూడిన నివేదికలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదిస్తారు. అక్కడి నుంచి అనుమతి లభించిన వెంటనే జిల్లాలో ఆయా పనులను చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తారు.
పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ...
ఉపాధి హామీ గ్రామసభల్లో ప్రజలను భాగస్వాములను చేసి, వారి గ్రామాల్లో ఎలాంటి పనులు చేపడితే ప్రయోజకరంగా ఉంటుందనే వివరాలను పక్కాగా సేకరించేలా డీఆర్డీవో చర్యలు చేపట్టారు. గ్రామసభల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు గాను ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లాలోని 17 మండలాలకు గాను నలుగురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి పనుల్లో భూగర్భజలాలు పెంపొందించడంతో పాటు రైతాంగానికి మేలు చేకూర్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నీటి నిల్వ కుంటలు, చిన్నపాటి చెరువులు, స్టోన్ బండింగ్, రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా మట్టి రోడ్లు వంటి పనులను చేపట్టనున్నారు. వీటితో పాటు అన్నదాతలు అదనపు ఆదా యం అర్జించేలా పండ్లతోటలు, ఈత వనాలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంజీర్, ఆఫిల్‌బేర్ వంటి పండ్లతోటలను 5వేల ఎకరాల్లో పెంచాలని నిర్ణయించారు. అలాగే గౌడ కులస్తులకు ఉపాధి కలిగేలా ప్రతి గ్రామంలోనూ ఈతవనాలు పెంచాలని సంకల్పించిన అధికారులు 9లక్షల మొక్కలు పెంచేలా ప్ర ణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు చేతివృత్తులపై ఆధారపడి జీవించే గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా బాంబు మొక్కలను సైతం పెంచేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అలాగే పాడి ఉత్పత్తి పెంచేలా పశువుల పాకల నిర్మాణాలకు సైతం ప్రాధాన్యతనివ్వనున్నారు.
ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామాల్లో ఎలాంటి ఉపాధి పనులు చేపట్టాలనే దానిపై చర్చించి ప్రణాళిక తయారు చేసేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఈనెల 2న అన్ని గ్రామాల్లో నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రతీ కూలీకి వంద రోజుల పాటు పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – సాయన్న, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment