రెండోరోజు కొనసాగిన సర్వే
కైలాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఆదివారం సెలవు రోజైనా కొనసాగింది. జిల్లాలో తొలిరోజు మందకొడిగా సాగిన సర్వే రెండో రోజు కొంత పుంజుకుంది. జిల్లావ్యాప్తంగా 11,785 ఇళ్లను ఎన్యుమరేటర్లు సర్వే చేశారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 6,357 ఇళ్లను సర్వే చేయగా మొత్తం ఈసంఖ్య 9,550కు చేరింది. ఉట్నూర్ డివిజన్ పరిధిలో 3,778 ఇళ్లను సర్వే చేయగా మొత్తం 5109కు చేరింది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొదటి రోజు కేవలం 402 ఇళ్లను మాత్రమే సర్వే చేయగా రెండో రోజు 1,650 ఇళ్ల సమాచారాన్ని ఎన్యుమరేటర్లు సేకరించారు. బోథ్ మండలం కౌట గ్రామం, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్‌సిటీలో జరిగిన సర్వేను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించి సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తప్పుల్లేకుండా వివరాలు నమోదు చేయాలి
ఇంటింటి సర్వేలో సేకరించే ప్రజల సమాచారాన్ని తప్పుల్లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలో 12వ వార్డు న్యూ హౌసింగ్ బోర్డ్ పరిధి గ్రీన్‌సిటీలో సర్వే తీరును ఆదివారం ఆయన పరిశీలించారు. ఓ ఇంటి యజమాని సమాచారాన్ని కలెక్టర్ స్వయంగా సేకరించగా.. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రా జుతో దరఖాస్తు ఫారంలో నమోదు చేయించా రు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూ చించారు. సర్వే సిబ్బంది కొట్టివేతలు లేకుండా దరఖాస్తులను పూరించాలని ఆదేశించారు.
బోథ్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ రాజార్షి షా అన్నారు. మండలంలోని బోథ్, కౌఠ(బి) గ్రామాల్లో చేపట్టిన సర్వే తీరును ఆదివారం ఆయన పరిశీలించారు. కౌఠ(బి)లో ఓ ఇంటి వద్ద సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు వివరాలు నమోదు చేస్తున్న తీరును పరిశీలించి వారి నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. బోథ్‌లోని 8వ వార్డులో సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓటరు నమోదు కేంద్రం పరిశీలన..
అలాగే కౌఠ(బి)లో ఓటరు నమోదు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. బీఎల్‌వోలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సబ్ సెంటర్‌లో వైద్యులు, సిబ్బంది కేవలం బుధవారం మాత్రమే అందుబాటులో ఉంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా వైద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడారు. సిబ్బంది నియామకంతో పా టు పల్లె దవాఖాన ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సుభాష్‌చందర్, మండల ప్రత్యేకాధికారి వాజీద్ అలీ, ఎంపీడీవో రమేశ్, సిబ్బంది తదితరులున్నారు.
సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
నేరడిగొండ: ఇంటింటి సర్వేను మండలంలోని కొర్టికల్ గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్వే సిబ్బందికి సహకరించకుండా ఆదివారం గ్రామంలో సమావేశమై మాట్లాడారు. పంచాయతీలో మథుర లబాన కులస్తులు అధికంగా ఉంటారని తెలిపారు. అయితే సర్వేకు సంబంధించిన ఫారాల్లో మాత్రం తమ కులం పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్‌ను కలవనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment