ప్రాణాలు తీస్తున్న క్వారీలు
మావల గ్రామ సమీపంలోని క్వారీ
తలమడుగు గ్రామ సమీపంలోని క్వారీ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో మొరం అక్రమ తవ్వకా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వెలిసిన క్వారీల కారణంగా ప్రజలు, మూగజీవాల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి లేకుండా మొరం తవ్వకాలు చేపడుతూ కొందరు అక్రమార్కులు రూ.లక్షల్లో దండుకుంటున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్, అటవీ ప్రాంతాల్లో మొరం, కాంక్రీట్ కోసం తవ్విన చోట ఏర్పడిన గుంతల చుట్టూ కాంట్రాక్టర్లు కనీసం కంచెలు కూడా ఏర్పాటు చేయడం లేదు. దీంతో అటువైపుగా వెళ్లే ప్రజలు, మూగజీవాలు అందులో పడి తనువు చాలిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.
గాలిలో కలుస్తున్న ప్రాణాలు..
అధికారుల అలసత్వం, వ్యాపారుల నిర్లక్ష్యంతో అమాయకులు బలవుతున్నారు. అక్రమ తవ్వకాల ను అరికట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ తతంగం సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది మై నింగ్, రెవెన్యూ అధికారులు వారి నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో టిప్పర్‌కు గాను రూ.2వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
యథేచ్ఛగా తవ్వకాలు..
జిల్లాలోని ఆదిలాబాద్‌రూరల్, తలమడుగు, తాంసి, నేరడిగొండ, బోథ్, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బేల, మావల తదితర మండలాల్లో అక్రమంగా క్వారీ తవ్వకాలు సాగుతున్నాయి. ఆదిలా బాద్‌రూరల్ మండలంలోని యాపల్‌గూడ, బంగారిగూడ, కొత్తగూడెం, పిప్పల్‌ధరి, అంకోలి, తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్, మావల, తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్, సావర్గాం, బేల మండలంలోని సోన్‌కాస్, సైద్‌పూర్, పలాయితాండ, నేరడిగొండ మండలంలోని కుప్టి, కొర్టికల్, బందంరేగడి, వడూర్, తర్నం, బోథ్, గుడిహత్నూ ర్ మండలాల్లోని ఆయా గ్రామాల శివారులోనూ మొరం తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నా యి. అక్రమ తవ్వకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అరికట్టాల్సిన అధికా రులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై జిల్లా మైనింగ్ శాఖ ఏడీ రవీందర్‌ను పలుమార్లు ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈ అక్రమాలకు సంబంధించి పలువురు కార్యాలయంలోకి వెళ్లి ఫిర్యా దు చేసేందుకు యత్నించినా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం.
బంగారుగూడ వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో క్వారీలో పడ్డ ఆటో
నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు
గుంతల్లో పడి ఇప్పటికే పలువురు మృత్యువాత
‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం..
అక్రమ మైనింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ శాఖపై ఉంటుంది. నిబంధనల ప్రకారం క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో పాటు ఆ మేరకు తవ్వకాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆ శాఖపైనే ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లుగా ఇటీవలే మా దృష్టికి వచ్చింది. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తాం.
– టి.వినోద్ కుమార్, ఆర్డీవో, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment