నామినేటెడ్.. ఇంకెప్పుడో?
● ‘హస్తం’ పార్టీలో ఆశావహుల ఎదురుచూపు ● ఏడాదవుతున్నా పదవులు దక్కడం లేదని ఆవేదన
సాక్షి,ఆదిలాబాద్: ‘హస్తం’ పార్టీలో నామినేటెడ్ పదవులపై కార్యకర్తలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు.. అప్పుడు అంటూ అధిష్టానం జాప్యం చేస్తుండడంతో వారిలో నిరాశ కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదట్లో కనిపించిన సంబరం కొద్ది రోజులకే పరిమితమైంది. పదవుల భర్తీ విషయంలో కొనసాగుతున్న తాత్సారం వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఓ వైపు ఏడాది సమీపిస్తోంది. ఇకనైనా అధిష్టానం వీటి విషయంలో దృష్టి సారిస్తుందా.. లేదా అనే చర్చ శ్రేణుల్లో మొదలైంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఫోకస్ ఉంటుందని చెప్పినట్లుగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందా.. లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనే అంశం ఏదైనా ముందుకు వస్తుందా అనే మీమాంస వారిలో వ్యక్తమవుతుంది.
అందని ద్రాక్షలా..
జిల్లాలో ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. ఇప్పటివరకు బోథ్, జైనథ్ మినహా మిగతా ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మూడింటికి చైర్మన్‌లను నియమించడంలో అంతులేని జాప్యం కొనసాగుతుంది. పంటల కొనుగోలు సీజన్ కంటే ముందే వీటిని భర్తీ చేస్తారని ఊహించినప్పటికీ ఇప్పటికీ వాటి విషయంలో ముందడుగు పడటం లేదు. ప్రధానంగా జిల్లాలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ప్రాధాన్యత ఉంది. మొదట్లో కోరెడ్డి కిషన్ పేరు వినిపించినప్పటికీ తాజాగా మారిన సమీకరణాలతో జైనథ్ మండలానికి చెందిన మునిగెల విఠల్ పేరు ప్రస్తావనకు వస్తుంది. మరి ఇదే ఫైనల్ అవుతుందా.. మళ్లీ పార్టీ అధిష్టానం ఇంకా జాప్యం చేస్తుందా అనే విషయంలో కార్యకర్తల ఎదురుచూపు కొనసాగుతుంది. వీటితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్, ఐసీడీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పదవుల నియామకమై అసలు ప్రస్తావనే రాకపోవడంపై వీటిని ఆశిస్తున్న పలువురు నాయకులకు మింగుడుపడని వ్యవహారంలా కనిపిస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చేలా విశేషంగా కృషి చేసినప్పటికీ కార్యకర్తలుగా తమకు న్యాయం దక్కడం లేదన్న ఆవేదన వారిలో కనిపిస్తుంది. వీటితో పాటు ఆత్మ కమిటీల నియామకంలోనూ పలువురు ఆశావహులు పార్టీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఔడా)కు చైర్మన్‌ను నియమిస్తారని ప్రచారం జరిగినప్పటికి ఇంకా ఎలాంటి నిర్ణయం పార్టీలో కనిపించడం లేదు.
పార్టీ పదవుల్లోనూ..
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి నియామకంలోనూ పార్టీలో తీవ్ర జాప్యం కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఈ పోస్టు ఖాళీగా ఉండగా, ఇప్పుడు.. అప్పుడు భర్తీ అంటూ పార్టీలో చర్చ సాగుతున్నప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడటం లేదు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారని భావించినప్పటికీ ఆ తర్వాత ముందడుగు పడలేదు. ఈ పదవిని ముఖ్య నేతలు ఆశిస్తుండగా, పార్టీ నిర్ణయంపై కార్యకర్తల ఆసక్తి నెలకొంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో, ఖానాపూర్, ఆసిఫాబాద్‌కు చెందిన కొన్ని మండలాలు జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇదిలా ఉంటే పార్టీ పరంగా ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండగా, కేవలం ఖానాపూర్‌లో మాత్రమే అధికార పార్టీ ప్రాతినిథ్యం ఉంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడి నియామకంలో పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment