ఆరోగ్య పాఠశాల అమలుపై సమీక్ష
కైలాస్‌నగర్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజర్షి షా ఈ నెల 14నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రారంభించి వారం రోజులైన సందర్భంగా దీని అమలుతీరుపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్ ఛాంపియన్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒక్కో మండలం నుంచి ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి ఆ పాఠశాల విద్యార్థి, హెచ్‌ఎం, ఎంఈవోలను సమావేశానికి ఆహ్వానించారు. వారం వ్యవధిలో నిర్వహించిన కార్యక్రమాలపై కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. వాటి నుంచి విద్యార్థులకు కలిగిన లాభాలు, పిల్లల్లో కలిగిన మార్పులను విద్యార్థులు, హెచ్‌ఎంలు, ఎంఈవోలు వివరించారు. విద్యార్థులు సొంతంగా పరిశుభ్రత అలవాట్లు అలవర్చుకుంటున్నారని, ఒత్తిడికి లోను కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పలువురు పిల్లలకు గతంలో తంబాకు తినే అలవాటు ఉండేదని, ఇప్పుడు చాలావరకు తగ్గిందని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా కల్పించిన అవగాహనతో క్రమశిక్షణ, సంతులిత ఆహారం, ఉన్నత విలువలతో కూడిన జీవనం తదితర విషయాలతో విద్యార్థుల్లో మార్పు వచ్చిందని, మెరుగైన జీవనం కోరుకుంటున్నారని తెలిపారు. ఒక పాఠశాలలో విద్యార్థులు గుట్కా తినే అలవాటును వారే స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఇక ముందు తినమని ప్రార్థన సమయంలో ప్రతిజ్ఞ చేసినట్లు వివరించారు. అనంతరం విద్యార్థులు వేసిన పెయింటింగ్‌లను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ అభిఘ్నాన్ మాల్వీయా, డీఈవో ప్రణీత, డీడబ్ల్యూవో సబితా, డీఎంవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment