తెగుళ్ల బెడద
మిరపలో
● చలిగాలులతో పంటను ఆశిస్తున్న చీడలు ● జాగ్రత్తలు తీసుకుంటేనే దిగుబడులు
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4,700 ఎకరాల్లో మిరప పంట సాగవుతోంది. చలిగాలులు, మంచు కారణంగా కాపు దశలో ఉన్న మిరప పంటను పలు రకాల తెగుళ్లు ఆశిస్తున్నాయి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ క్రిముల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను సకాలంలో నివారిస్తేనే మేలైన దిగుబడులు వస్తాయని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శ్రీధర్‌చౌహాన్ వివరించారు.
ఆకుమచ్చ తెగులు
సర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు సోకితే ఆకులపై గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. వాటి మధ్య భాగం తెల్లగా, అంచులు ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆకులతో పాటు కాయలపై కూడా కనిపిస్తుంది. ఆకులపై ముదురు గోధుమ రంగులో గుండ్రని లేదా ఓ ఆకారమంటూ లేని పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. నల్లని శిలీంధ్ర బీజాలు కప్పేయడం వల్ల కాయలు రాలిపోతాయి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకితే ఆకులు, కాయల మీద మచ్చలు ఏర్పడుతాయి. ఇవి తొలుత చిన్నవిగా, నీటి మచ్చలుగా ఉండి ఆ తర్వాత గోధుమ రంగులో, పసుపుపచ్చని వలయాలతో కనిపించి క్రమేపీ పెద్దవి అవుతాయి. ఆ దశలో అవి నల్లని గ్రీజు మచ్చలుగా కనిపిస్తాయి. ఎకరాకు 200 లీటర్ల నీటిలో 600 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, 40 గ్రాముల ప్లాంటామైసిన్, పోషామైసిన్ కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
కాయకుళ్లు తెగులు..
చలి వాతావరణంలో కొమ్మ ఎండుకాయ కుళ్లు తెగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెగులు కారణంగా ముదురు కొమ్మల బెరుడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొమ్మలు పై నుంచి కిందివరకు ఎండుతాయి. పండు కాయల మీద నల్లని మచ్చలు ఏర్పడి సహజ రంగును కోల్పోయి వరిగడ్డి, తెలుపు రంగులో కన్పిస్తాయి. అందుకే దీనిని మజ్జిగ తెగులు అంటారు. దీని నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 200 మిల్లీలీటర్ల ప్రాపికొనజోల్, అజాక్సిస్ట్రోబిన్ లేదా 100 మిల్లీలీటర్ల డైఫెన్‌కొనజొల్ లేదా 600 గ్రాముల ఫైరాకొలస్ట్రోబిన్–మిటిరం లేదా 400 గ్రాముల ప్రొపినెబ్ కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు..
వాతావరణంలో మంచుతో కూడి చలి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు సోకిన మొక్కకు అడుగున తెల్లటి బూడిదరంగు మచ్చలు ఏర్పడుతాయి. క్రమేపి ఆకుల పైభాగానికి కూడా వ్యాప్తి చెంది ఆకులు పండు బారి రాలిపోతాయి. తెగులు సోకిన మొక్కలు పూత పట్టవు, పట్టిన పూతకూడా రాలిపోతుంది. వీటి నివారణకు నీటిలో కరిగే గందకం 3 గ్రాములు లేదా కెరాధేన్ 1 మి.లీ. లేదా బెనోమిల్ 2 మిల్లీలీటర్ల చొప్పన లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో పంట మీద రెండుసార్లు పిచికారీ చేయాలి.
నెన్నెలలో
ముడతకు వచ్చిన
మిరపచెట్లు
పంటను ఆశించే కీటకాలు
పూత ఈగ..
ఈ పూత ఈగ దోమ జాతికి చెందింది. పూత, పిందెలను ఆశిస్తే పిందెలు సరిగా పెరగక గిడసబారి లేదా ఎర్రబారి లేదా సైజు తగ్గడం జరుగుతుంది. కాయల సమయంలో సంక్రమిస్తే వంకరటింకరగా కాస్తాయి. వీటిలో గింజలు ఏర్పడవు. కాయను తెరిచి చూస్తే అందులో సుప్తాదవప్థలోని ప్యూపాలు, లార్వాలను గమనించవచ్చు. ఎకరాకు 250 మి.లీ ట్రైజోఫాస్‌ను పిచికారీ చేసి వారంరోజులకు 500 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 400 మి.లీ కార్భోసల్ఫాన్‌ను పిచికారీ చేసి నష్టాన్ని తగ్గించు కోవచ్చు.
పేనుబంక..
పేనుబంక పురుగు లేత కొమ్మల, ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా కాయ పెరుగుదల తగ్గుతుంది. తియ్యాటి పదార్థాన్ని విసర్జించటం వల్ల చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లటి మసిపూసి నట్లుగా మారిపోతాయి. దీని నివారణకు మిథైల్ డెమోటాన్ 2 మి.లీ లేదా ఎస్ఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాయతొలుచు పురుగు..
కాయతొలుచు పురుగుల్లో పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చపురుగు, పచ్చరబ్బరు పురుగులు ఉంటాయి. ఇవి మొదటిదశలో ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లో చేరి గింజలు తినేస్తాయి. దీంతో పంటకు విపరీతమైన నష్టం కలుగుతుంది. దీని నివారణకు థయోడికార్భ్ 1 గ్రా. లేదా ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా స్పైసోసాడ్ 0.25 మి.లీ లేదా క్వినాల్‌ఫాల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి అవసరం మేరకు పిచికారీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment