పరిశోధిస్తే ఫలితాలెన్నో..
కడెం: అరుదైన జీవజాతులకు నిలయం కవ్వాల్ టైగర్‌జోన్. గతంలో అరుదైన కప్పను చూపించిన ఈ ప్రాంతం తాజాగా షటిల్‌కాక్ మష్రూమ్‌లను పరిచయం చేసింది. కడెం నది పరీవాహకంలోని అటవీ ప్రాంతంలో ప్రకృతి వింతలతో పాటు ఇంకా ఈ అడవుల్లో పరిశోధిస్తే ఎన్నో కొత్త ఫలితాలు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. ఇలాంటి అరుదైన జీవజాతులు అటవీ ప్రాంతంలో మరింత జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఓయూ రీసెర్చ్ స్కాలర్ పరిశోధన..
హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజ సూరికూచి, సీసీఎఫ్ శరవణన్ సూచనలతో ఓయూ రీసెర్చ్ స్కాలర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికాస్) ఉత్తర తెలంగాణ రీజియన్ రీజనల్ కోఆర్డినేటర్ అనగంధుల వెంకట్ పరిశోధన ప్రారంభించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇటీవలే రిజర్వ్ యొక్క గొప్ప మైకోలాజికల్ బయోడైవర్సిటీని డాక్యుమెంట్ చేయడానికి ఉద్దేశించిన ‘శిలీంద్ర వైవిధ్యం’పై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. కడెం మండలంలోని గంగాపూర్ అటవీ ప్రాంతంలో పరిశోధనలో అరుదైన ఫంగస్ షటిల్ కాక్ మష్రూమ్ గుర్తించబడింది. పుట్టగొడుగు జాతికి చెందిన ఈ అరుదైన షటిల్‌కాక్ మష్రూమ్ భారతదేశంతో పాటుగా బర్మా, ఇండోనేషియా, తదితర కొద్ది దేశాల్లో మాత్రమే గుర్తించబడింది. ఇది వరకు ఈ శిలీంద్రం పశ్ఛిమ కనుమల్లో తప్ప దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదని, 1875లో బర్కిలీ, బ్రూమ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు. మనదేశంలో 1932లో నరసింహన్ మైసూర్‌లో గుర్తించారు. ఆతర్వాత 2000 సంవత్సరంలో ముంబైలోని సంజీవ్‌గాంధీ నేషనల్ పార్క్‌లో ఈ పుట్టగొడుగును గుర్తించారని తెలిపారు.
అరుదైన కప్ప
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్‌జోన్‌లో అరుదైన కప్ప ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ ఈ ఏడాది కనిపించింది. జూన్ 18న కడెం మండలం ఉడుంపూర్ అటవీరేంజ్ పరిధిలోని దోస్త్‌నగర్ అటవీప్రాంతంలో కల్లెడ డీఆర్వో ప్రకాశ్, ఎఫ్‌బీవో ప్రసాద్ దీనిని గుర్తించారు. ‘కలౌల పుల్చ్రా’ అనిపిలువబడే ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ మైక్రోహాలిడే కుటుంబంలో భాగమైన ఒక చిన్న ప్రత్యేకమైన ఉభయచర జీవి ఇది. గుండ్రని శరీరం విలక్షణమైన (గోధుమ, నారింజ, లేదా పసుపు) రంగు కలిగి ఉంటుంది. ఈ కప్పలు సాధారణంగా అడవుల నుంచి వ్యవసాయ భూములు, నీటి వనరులు ఉన్న చోట ఆవాసం ఏర్పర్చుకుంటాయి. ఈ కప్పల ప్రధాన ఆహారం కీటకాలని, ఇవి రాత్రి పూట సంచరిస్తూ జిగట నాలుకతో కీటకాలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయని, పగలు వీటిని గుర్తించడం కష్టమని పరిశోధకులు పేర్కొంటున్నారు.
పరిశోధిస్తే మరిన్ని..
తూర్పు కనుమలు, మధ్య భారతదేశంలో షటిల్‌కాక్ మష్రూమ్ ఇదే మొదటి గుర్తింపు. ఈ అరుదైన శిలీంద్రం కుళ్లుతున్న వృక్షాలు, మొక్కల కాండాలపై పెరుగుతుంది. ఈ అధ్యయనంలో వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలలో అభివృద్ధి చెందుతు న్న అనేక శిలీంద్ర జాతులు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో పరిశోధిస్తే మరిన్ని అరుదైన మొక్కలు, జీవజాతులను గుర్తించవచ్చు.
– వెంకట్,
ఓయూ రీసెర్చ్ స్కాలర్, హైటీకాస్ ప్రతినిధి
అరుదైన జీవజాతులకు నిలయం కవ్వాల్ టైగర్‌జోన్
గతంలో అరుదైన కప్ప, నేడు షటిల్‌కాక్ మష్రూమ్
Comments
Please login to add a commentAdd a comment