బీజేపీలో లొల్లి
● నామినేటెడ్ పోస్టుల నియామకంలో విధేయులను విస్మరించారనే విమర్శ ● పార్టీ ముఖ్యులను ప్రశ్నిస్తున్న నేతలు ● ఇష్టారీతిన పంపకమేంటని ఆక్రోషం
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో లొల్లి మొదలైంది. కేంద్ర రైల్వే బోర్డు నామినేటెడ్ పదవుల నియామకంలో పార్టీ విధేయులను విస్మరించారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల ముఖ్య నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా పందేరం జరిగిందన్న ఆక్రోషం వ్యక్తమవుతోంది. పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉండే వారి విషయంలోఇలా ప్రవర్తిస్తే ఎలాగంటూ ఆగ్రహజ్వాల ఎగిసిపడుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్‌తోపాటు ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్ కాగజ్‌నగర్ అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ప్రాతినిధ్యం కలిగి ఉంది. కాగా, గతం నుంచి ఈ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య పట్టణాల్లో బీజేపీ పటిష్టంగా ఉంది. ఇటీవలి కాలంలో రైల్వే బోర్డుకు సంబంధించి రెండు ముఖ్యమైన పదవులు భర్తీ చేశారు. ఇందులో ఒక పదవి ఇతర పార్టీ నుంచి కొద్ది కాలం కింద బీజేపీలో చేరిన ఓ నాయకుడికి కట్టబెట్టారు. అంతే కాకుండా మరో పదవిని పార్టీలో ఓ యువనేతకు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అనేక మంది సీనియర్ నేతలున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా పార్టీలో కొద్దికాలం నుంచి ఉన్నవారికే ఈ పదవులు కేటాయించినందుకు కార్యకర్తలు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేను ప్రశ్నించిన కార్యకర్తలు!
ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిసిన పార్టీ కార్యకర్తలు ఈ విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో బీజేపీ పటిష్టత కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న వారిని పక్కనబెట్టి ఇటీవలి కాలంలో పార్టీలోకి వచ్చిన వారికి ఎలా పదవులు కట్టబెట్టారని అడిగినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో తన ప్రమేయం ఏమిలేదని ఎమ్మెల్యే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా బీజేపీలో నామినేటెడ్ పదవుల విషయంలో లొల్లి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment