రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
– డీసీహెచ్‌ఎస్ కృష్ణారావు
వై.రామవరం: అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులను అప్యాయంగా పలకరిస్తూ మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్) కె.కృష్ణారావు వైద్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. స్థానిక సీహెచ్‌సీని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు, మందుల నిల్వలను, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అందుతున్న వైద్యసేవలపై రోగులను ఆరాతీశారు. ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలపై సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఆస్పత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల ఏవో చంద్రశేఖర్, వైద్యాధికారులు చైతన్యకుమార్, మోహన్, మస్తాన్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment