పీఎం జన్‌మన్ పథకంలో రోడ్లు నిర్మిస్తాం
సాక్షి, పాడేరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జనమన్ పథకంలో వందకంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కె. పవన్ కల్యాణ్ తెలిపారు. శనివారం ఆయన అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీ బల్లగరువులో పర్యటించారు. ఈ సందర్భంగా 19 రోడ్ల పనులకు శంకుస్ధాపన చేశారు.అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నిర్మాణాలు పూర్తయితే 4,500 మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. గంజాయి వల్ల యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వందమంది కన్నా తక్కువ జనాభా గల గ్రామాల్లో కూడా రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జీవో నంబరు 3 విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా పండించే కాఫీ, సిరి ధాన్యాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ముందుగా గ్రామంలో పర్యటించిన ఆయన పలు సమస్యలు తెలుసుకున్నారు. వేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, ఆర్టీసీ డైరెక్టర్ నిమ్మ గంగుదొర పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బల్లగరువులో పర్యటన
రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment