గంజాయి రవాణా కట్టడికి పటిష్ట చర్యలు
● విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ● పాయకరావుపేట, యలమంచిలి టౌన్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు
సాక్షి, అనకాపల్లి: గంజాయి రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. మత్తు పదార్థాలు వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా పాయకరావుపేట, యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను, వాటి ప్రస్తుత దర్యాప్తు స్థితిని అడిగి తెలుసుకున్నారు. గంజాయి కేసుల పురోగతి, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చీటింగ్ ఇతర కేసుల ఫైల్స్, స్టేషన్‌లో నిర్వహిస్తున్న జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, ప్రాపర్టీ రిజిస్టర్, కోర్ట్‌కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వీలైనంత తొందరగా చార్జిషీట్ ఫైల్ చేయాలని, కోర్టులలో విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, ముద్దాయిలకు శిక్ష పడేటట్లు పకడ్బందీగా వ్యవహరించాలని సూచనలు చేశారు. ప్రతి మహిళకు భద్రత కల్పించేందుకు అండగా పోలీస్ శాఖ ఉందని వారికి భరోసా కల్పించాలని తెలిపారు. సైబర్ నేరాలపై గ్రామస్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, పాయకరావుపేట సీఐ జి.అప్పన్న, యలమంచిలి రూరల్ సీఐ ఎస్.ధనుంజయరావు, ఎస్సైలు జె.పురుషోత్తం, సావిత్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment