పెంచిన పనివేళలను ఉపసంహరించుకోవాలి
● పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపినాథ్ డిమాండ్
కాశీపురం హైస్కూల్లో మాట్లాడుతున్న పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్
దేవరాపల్లి: ఉన్నత పాఠశాలల్లో పెంచిన పనివేళలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపినాథ్ డిమాండ్ చేశారు. పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని కాశీపురం, ఎ.కొత్తపల్లి, ముషిడిపల్లి, ఎం.అలమండ, కలిగొట్ల, తెనుగుపూడి తదితర పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్రానికి ఇరువైపులా ఉన్న ఇతర రాష్ట్రాలలోని పాఠశాలల్లో 5 గంటల వరకు పనివేళలు ఎక్కడా లేవన్నారు. విద్యార్థులు పాఠశాలల్లో సుమారు 8 గంటలపాటు ఉండటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావాల్సి వస్తుందన్నారు. ఈ ఇబ్బందుల దృష్ట్యా ఉన్నత పాఠశాలల్లో పనివేళలను పెంచే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కొఠారి కమిషన్ సూచన మేరకు పాత పనివేళలను కొనసాగించాలన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి సత్యంనాయుడు, మండల అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి అప్పారావు తదితర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment